ఒక దయ్యం ఆత్మకథ

పతంజలి గారి 'ఒక దయ్యం ఆత్మకథ' పుస్తకం ఎక్కడ దొరుకుతుంది? నేను ఎప్పుడో చదివాను కానీ కథ పెద్దగా గుర్తుకులేదు. ఎవరయినా కాస్త ఆ కథ సంగ్రహంగా చెబుతారా? చిన్న అవసరం వుంది.

గమనిక: ఇంటాబయటా తీరిక తగ్గినందువల్ల నా పోస్టులకు వస్తున్న వ్యాఖ్యలకు కూడా జవాబు ఇవ్వలేకపోతున్నా. కొంచెం తీరిక చేసుకొని కొద్దిరోజుల్లో ఇస్తాను. దయచేసి అన్యధా భావించకండీ.  

అతనెళ్ళిపోతాడేమో!

ఛస్తా అంటుంటాడు. అందరం కట్టకట్టుకొని ఛస్తాం అని ఏడుస్తాడు. అప్పుళోళ్ళు ఇంటిమీదికి వచ్చి యమ సతాయిస్తున్నారంటాడు. నేను మాత్రం ఏం చేయగలను? అప్పటికీ కిందా మీదా పడి, అష్టకష్టాలు పడి అతనితో బర్రెల వ్యాపారం అన్నా చేస్తే అతనికీ, ఆ కుటుంబానికీ ఆసరాగా కూడా వుంటుందని కొంత డబ్బు ఏర్పాటు చేస్తే హాయిగా వాటిని హారతి కర్పూరం లాగా వాడేసేడు. (నా బర్రెల బ్యుజినెస్సు యవ్వారం పోస్ట్ మీకు గుర్తుండే వుంటుంది) కొంతలో కొంత నయ్యం ఏంటంటే అతనికి డబ్బులు ఇచ్చి తగలబేట్టిన వైనం మా ఆవిడ త్వరగానే మర్చిపొయిందుస్మీ. మొదట చెప్పినప్పుడు కాస్త నన్ను దులిపింది కానీ ఆ తరువాత మరచేపోయింది. నా బ్లాగు చదివేంత కలాపోసన తనకు లేదు కాబట్టి ఇప్పుడు ఇది వ్రాసి కూడా ఇంట్లో బ్రతికిపోగల్ను లెండి. కంగారేమీ లేదు!  

దగ్గరి స్నేహితుడే. దగ్గరితనం అంటే ఏంటో తొలి పరిచయం చేసింది అతగాడే. అయినా సరే, నేనున్న పరిస్థితుల్లో పెద్దగా ఏం చేయలేకున్నాను.  ఇండియా నుండి మిస్డ్ కాల్స్ ఇస్తున్నాడు, మెయిల్స్ వ్రాస్తున్నాడు. ఏమని మాట్లాడను, ఏమని వ్రాయను? మిన్నకుంటున్నాను. ఏం చెయ్యను మరి - నా పరిస్థితికి మించి సహాయం చేసాను - నిలబెట్టుకోలేకపోయాడు.  నా సమస్యలు నాకూ వున్నాయి - బోలెడన్ని! ఇంకేం చెయ్యలేను. 

భేషుగ్గా ధైర్యం చెప్పొచ్చు అతనికి. అంతా విని 'డబ్బులో శరశ్చంద్రా!' అంటాడు.

వాళ్ళ పెద్దమ్మాయితోనూ మాట్లాడా  - వాళ్ళ సమస్యలు విన్నా. నేను డబ్బులు ఇచ్చింది చెప్పాడా అని అడిగాను. 'చెప్పాడు - అంతా బూడిద చేసేకా' అందా అమ్మాయి. అతనికి అన్ని వ్యసనాలు వున్నాయని దూరంగా వున్న నాకు తెలియదు.

ఎప్పుడు ఏ వార్త వినాల్సివస్తుందో అని కాస్త కంగారు వుంది. అన్నట్లే అతనెళ్ళిపోతాడేమో అన్న ఆందోళనా వుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయతా నాకు వుంది. 

జూన్ 7, 2020 న విలేజికి వెళ్ళీ, విషం తాగీ ... - నా ఒకప్పటి సహజీవని

చాలా రోజుల తరువాత మాట్లాడాను. అవీ ఇవీ మాట్లాడుతూ ఇంకో నాలుగేళ్ళ తరువాత జూన్ 7 న ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పింది. సహజంగానే నేను విస్మయం చెందేను. ఎందుకు అని అడిగాను. "అలసిపోయాను, ఈ జీవితంతో బాగా అలసిపోయాను, ఇక చాలురా ఈ జీవితం" అని చెప్పింది. నిజమే, ఆమె జీవిత చరిత్ర నాకు తెలుసు. పాపం చాలా కష్టాలు పడింది, జీవితంలో. ఈ నాలుగేళ్ళలో తనకు వున్న ఒక్కగానొక్క కూతురిని బాగా చదివించి, ఒక మంచి ఉద్యోగం చూసి, ఆమెకు ఓ ఇల్లు కొనిపెట్టి, పెళ్ళి చేసి ఆ తరువాత ప్రశాంతంగా ఆ రోజు పోవాలని గట్టిగా నిర్ణయించుకుంది.

జూన్ 7 నీ పుట్టిన రోజా అని అడిగాను. నవ్వింది. "ఎన్ని కష్టాలు వున్నా నవ్వుతూనే వున్నా, నవ్వుతూనే భరిస్తున్నా, ఎందుకంటే నా చుట్టూవున్న వాళ్ళు నానుండి చక్కని చిరునవ్వునే ఎక్స్పెక్ట్ చేస్తారూ" అంది. అవును. ఆమె మంచి అందగత్తె. గలగలా మాట్లాడుతుంది. చిలిపిగా నవ్వుతుంది. అప్పట్లో హైదరాబాదుకి వచ్చి ఒక టీ, బ్రెడ్డు ముక్కలతో బ్రతుకు లాగదీసిన రోజులు వున్నాయీ అని చెప్పింది. ఆ తరువాత అతగాడిని ఎందుకు పెళ్ళి చేసుకుందో నాకు ఇంకా అర్ధం కాదు. అదే అడగాలని ఎన్ని సార్లో అనుకున్నా కానీ ఎప్పుడూ మరచిపోతున్నాను. అతను ఏమాత్రం బావుండడు. ఈమెకు ఏ మాత్రమూ సరిపోలడు. మనస్సూ మంచిది కాదుట. మెంటలోడు అని సింపుల్ గా చెప్పేస్తుంది. తను హైదరాబాదులో వుంటూ కష్టపడి సంపాదిస్తూ ఇంటినీ, జీవితాన్నీ లాక్కువస్తోంది. కనీసం తన కుమార్తె అయినా తనలాంటి కష్టాలు పడకూడదని బాగా కృషి చేస్తోంది. 

దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళ క్రిందట విజయవాడలో సహజీవనం చేసాం. నన్ను ఎంత శ్రద్ధగా చూసుకునేదనీ, ఎంత చక్కగా వండిపెట్టేదనీ. అప్పట్లో మా ఇద్దరి దగ్గరా పెద్దగా డబ్బులు వుండేవి కావు. అప్పటికి నేనింకా కంప్యూటర్ కోర్సులు చేస్తూ జీవితంలో స్థిర పడాలని కిందామీదా పడుతున్న రోజులవి. అయినా సరే, గిల్లి కజ్జాలు పెట్టుకున్నా సరే ఎంత బాగా జీవించేమూ! సన్నని వర్షంలో తడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ రోజా సినిమాకి నడుచుకుంటూ వెళ్ళి చూసొచ్చిన లాంటి క్షణాలు ఎంత బావుండేవో. తరువాత నేను మా టవునుకి వెళ్ళిపోయాను, తను అక్కడే కొంత కాలం వుండి అటుపై హైదరాబాద్ వెళ్ళిపోయింది. విజయవాడకూ హైదరాబాదుకూ ప్రయాణిస్తున్నప్పుడల్లా మధ్యలో సూర్యాపేటలో ఆగి బస్సుస్టాండుకి దగ్గర్లో వున్న మా ఇంటికి ధైర్యంగా వచ్చి నన్ను అడిగి మరీ కలిసి, కుదిరితే గడిపీ వెళ్ళేది.

ఈమెకు సంబధించిన రెండు సరదా విషయాలు మీతో ఇదివరలో పంచుకున్నా కానీ మీకు అవి గుర్తున్నాయో లేదో. అందులో ఒకటి తను అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నా గురించి అడిగి డాబా పైన పడుకున్న నన్ను లేపితే నాకు ఠారెత్తిపోయిన సంఘటణ. మరొకటి నన్నూ, మా మిత్రుడినీ ఒక రోజు రాత్రి గదిలో పెట్టి గొళ్ళెం పెట్టి వెళితే ప్రకృతి పిలుపుకై అవస్థ పడ్డ వైనం :)) 

"అప్పట్లో నిన్ను అనవసరంగా వదులుకున్నాను. ఇప్పడు వున్న తెలివి అప్పుడు వుంటేనా, నిన్ను కట్టేసయినా నాకు కట్టేసుకుని వుందును" అంటూ మొదటిసారి నన్ను ఎలా ఇష్టపడిందీ, నన్ను కలవాలని ఎలా తహతహలాడేదీ మరోసారి చెప్పుకువచ్చింది. నాదీ అదే భావన. అదే చెప్పాను. అదేంటో కానీ మాది అప్పట్లో స్నేహమూ, సహజీవనమే కానీ మేము ఇద్దరమూ దాన్ని ప్రేమగా భ్రమించలేదు. అందుకేనేమో మా స్నేహం నిస్వార్ధంగా, పొజెసివ్నెస్ లేకుండా, హాయిగా జరిగింది. ఇష్టం వున్న నాళ్ళు కలిసివున్నాం. కుదిరినప్పుడు కలిసివున్నాం - కుదరనప్పుడు మానుకున్నాం.   

ఇకపై నీ జీవితం బాగుపడితేనో, కష్టాల బదులు అన్నీ సుఖాలు సమకూరితేనో అని ఆమెకు జీవితంపై ఆశ కలిగించాలని చూసాను. "లేదురా శరత్, నాకు నా జీవితంపై ఎలాంటి భ్రమలూ, ఆశలూ లేవు. మా అమ్మాయి జీవితం స్థిరపడితే చాలు" అంది ప్రశాంతంగా, నిశ్చయంగా. అంత పట్టుదలగా వున్నందున ఇప్పటికిప్పుడు నేను ఏం హితబోధ చేసినా ప్రయోజనం లేదని మౌనం వహించాను. ఇంకా చాలా సమయం వుంది కదా - ఈలోగా ఆమె పరిస్థితుల్లో మార్పు రావచ్చు. జీవితాల్లో అనుకోని అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి. అలాంటిదేదయినా ఆమె మరణాన్ని ఆపవచ్చు. అందుకు గాను ఆమెకు సుదూరంగా వున్న ఈ చక్కటి మిత్రుడు కూడా తన వంతు ప్రయత్నం తాను చేయ్యకుండా ఎలా వుండగలడు? ఆమెని కాపాడుకోకుండా ఎలా వుండగలడు?