మళ్ళీ మొదలెట్టా!

నాకున్న చక్కని వ్యసనం - వ్యాయామం. అయితే ఎరోబిక్ వ్యాయామాల కన్నా నాకు ఎనరోబిక్ వ్యాయామాలు నాకు బాగా ఇష్టం. అయితే అవి కాస్త చేసినప్పుడల్లా ఓవర్ ట్రైనింగ్ సిండ్రోం వచ్చేసి చాలా నెలలు విశ్రాంతి తీసుకోవాల్సివచ్చేది. ఆ పరిస్థితి ఎందుకు వస్తోందా అని నాకు పరిశోధించగా కొన్ని కొన్ని వివరాలు తెలియసాగాయి. ప్రొటీన్ లోపం కారణం కావచ్చునని ఈమధ్య అనుకుంటున్నాను. గత కొన్ని వారాలుగా ప్రొటీన్ బాగా తీసుకోవడం మొదలెట్టాను. ఇవాల్టి నుండి లైట్ గా మళ్ళీ వెయిట్స్ మొదలెట్టాను. ఇప్పుడెలా వుంటుందో చూడాలి. ప్రస్తుతానికి వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చేస్తూ పరిస్థితిని బట్టి నెమ్మదిగా పెంచేస్తాను. పరిస్థితి బాగా లేకపొతే విరమిస్తాను. ప్రొటీన్ పెంచినా కూడా ఇంకా ప్రొటీన్ సరిపోకపోతే నాలో వచ్చే లక్షణాలు తెలుసు కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనిస్తూ వున్నాను.  బరువు తగ్గుదల, నిద్రలేమి, చిరాకు, అలసట, కండరాల నొప్పులు వగైరా ఆ లక్షణాల్లో కొన్ని. ఏం జరుగుతోందీ మీకు తెలియజేస్తూవుంటాను.

US దేశవ్యాప్తంగా స్వలింగ వివాహం చట్టబద్దం!అమెరికా ప్రజలకు నా అభినందనలు. యుఎస్ సుప్రీం కోర్టుకి నా ధన్యవాదాలు. ఇండియా సుప్రీం కోర్ట్ యుఎస్ సుప్రీం కోర్ట్ తీర్పు నుండి ముందుముందు అయినా స్ఫూర్తి పొందుతుందని ఆశిస్తాను.

సెక్షన్ 8 - నా పరిష్కారం

సెక్షన్ 8 అమలు చెయ్యొద్దనీ కేసీఆరూ, చెయ్యాలనీ చెంద్రబాబూ ఒకేసారి, ఒకే సమయాన నిరవధిక నిరాహారదీక్షల పోటీ పబ్లిక్కుగా మొదలెట్టాలి. అందుకోసం ట్యాంక్‌బండ్  అయితే బావుంటుంది. రోడ్డుకి చెరో పక్కన కూర్చోవచ్చు. వీళ్ళ మధ్య తెలుగు రాష్ట్రాల గవర్నర్ రోడ్డు మధ్యలో కూర్చొని శాంతిని పరిరక్షిస్తుండాలి. శాంతి అనగా ఓ మహిళ పేరు అనుకొని మీరు పొరపడవద్దు. ఇద్దరికీ దొంగ దీక్షల అనుభవం బాగా వుంది కాబట్టి మళ్ళీ అలాంటి గొప్ప పనులు చెయ్యకుండా సుప్రీం కోర్టు జడ్జిల ఆధ్వర్యంలో వీరి దీక్షలు సాగాలి. అన్నివేళలా ఈ ఇద్దరి దీక్షలని కనిపెట్టుకొనివుండటం కోసం ఆ జడ్జులు మూడు షిఫ్టుల్లో పనిచెయ్యాలి. వారి దీక్షల్లో మరే మతలబులు లేకుండా 24 గంటలూ లైవ్ టెలికాస్ట్ చెయ్యాలి. టాయిలెట్ గదుల్లో దొంగ తిండి పెట్టుకొని తినకుండా వీరు ఆ గదులను ఉపయోగించడానికి ముందూ వెనుకా(?!) ఆ గదులని లైవ్ టెలికాస్ట్ చెయ్యాలి. ఎలాగూ ఇది రంజాన్ మాసమే కాబట్టి ముస్లిం సోదరుల్లాగా వీరు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిరవధిక నిరాహార దీక్ష చెయ్యాలి. 

పోటీలో ఎవరు గెలిస్తే (?!) వారి అభిమతం ప్రకారం సెక్షన్ 8 చెయ్యాలి. అలా గెలిచిన వారికి ట్యాంక్‌బండ్ మీద శిలా విగ్రహం కూడా కట్టించాలి.   

నాలో మాంసకృత్తుల లోపమా?

కొన్ని నెలల క్రితం చాలావరకు రా వీగన్ ఫుడ్డు (Raw Vegan Diet) తినడం ప్రారంభించాను. కొన్ని వారాల్లో ఉత్సాహంగా అనిపించి జిమ్ములో కొద్దిగా బరువులు కూడా ఎత్తడం మొదలెట్టాను. అంతే. కొద్ది వారాల్లో నా శరీరంలోని హార్మోన్లలో విపరీతమయిన మార్పులు జరుగుతుండటం గమనించాను. మంచి ఆహారం, మంచి వ్యాయామం చేస్తున్నా  నాలో ఆ మార్పులు ఎందుకు వస్తున్నాయో నాకర్ధం కాలేదు. మరి కొన్ని వారాల్లో నాకు పలు రకాల ఇన్ఫెక్షన్లు ఒకటి నయం కాకముందే మరొకటి రావడం మొదలెట్టాయి. గత నెలరోజులుగా అలా పలు ఇన్ఫెక్షన్లతో సతమతం అవుతూవున్నాను. ఇప్పుడిప్పుడే కాస్తంత తేరుకుంటున్నా. మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్ ఇప్పటివరకయితే రాలేదు.  

రక్త పరీక్షలు చేయిస్తే లివర్ ఎంజైమ్స్ కొన్ని స్వల్పంగా పెరిగాయి. పచ్చి ఆహారం మరియు వెయిట్ లిఫ్టింగ్ నా అనారోగ్యానికి కారణమేమో అని మా డాక్టరుతో  సందేహం వెలిబుచ్చితే నవ్వేసి తేలిగ్గా తీసుకున్నాడు కానీ పలు విషయాలు బాగా పరిశీలించిన పిమ్మట నాలో ఏర్పడ్డ ప్రోటీన్ డిప్లెషన్ మరియు డిఫీసియన్సీ నా అనారోగ్యాలకి కారణం అవుతుండవచ్చు అని భావించాను. పచ్చి శాఖాహారం తీసుకోవడం వల్ల నాకు ప్రొటీన్ అంతగా అందలేదు. పైగా నేను కాస్త వెయిట్ లిఫ్టింగ్ చెయ్యడం వల్ల నా కండరాల్లొ వున్న కాస్తా ప్రోటీన్ హరించుకుపోయింది. అలా నాలో మాంసకృత్తుల లోపం ఏర్పడింది కావచ్చు.  పచ్చి ఆహారంతో తగినంత ప్రొటీన్ సమకూర్చుకోవడం అసాధ్యం కాదు కానీ అందుకోసం కాస్త కష్టపడాలి.  మాంసాహారంతో సులభంగా సాధించవచ్చు. అయితే ఎనిమల్ ప్రొటీన్ ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని వర్గాల వాదన. 

ఇప్పటివరకూ తగినంత ప్రొటీన్ తింటున్నానులే అనే భ్రమతో వున్నా. ఈమధ్య ప్రోటీన్ గురించి బాగా పరిశీలిస్తున్నా. దాదాపుగా మనకు మనం ఎన్ని కిలోల బరువు వున్నామో అన్ని గ్రాముల ప్రొటీన్ రోజూ అవసరం. బాగా వ్యాయామం చేసేవారికి అంతకు రెట్టింపు ప్రోటీన్ అవసరం అంటారు. ప్రస్తుతానికి రోజూ 50 గ్రాముల (25 gms 2 times)  ప్రోటీన్ పౌడర్ నీళ్ళలో కలిపి తీసుకుంటున్నా. అలాగే కోడి మాంసం, గుడ్లు, పాలు, పెరుగు తిరిగి తీసుకోవడం మొదలెట్టాను. నెమ్మదినెమ్మదిగా మెరుగు అవుతున్నాను. ఇన్నేళ్ళుగా నాకు వున్న పలు చిన్నచిన్న ఆరోగ్యసమస్యలకు కారణం ఈ లోపమే కావచ్చునేమో. కొన్ని నెలలు ఇలా ప్రోటీన్ పెంచి చూస్తాను. 

ఈ నెల ఒకటవ తేదీన ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం డెల్హీ పౌరుల్లో 99% ఈ లోపం వుందిట. భారతీయుల్లో 88% ఈ లోపం వుందిట. 


'భూ' తో వచ్చే అమ్మాయిల పేర్లు సూచిద్దురూ


మాకు తెలిసిన వారి అమ్మాయికి పేరు పెట్టడానికి 'భూ' తో మొదలయ్యే పేర్లు కావాలిట. భూమిక, భూమి, భూజాత పేర్లు మాకూ తెలుసులెండి. అలా అని భూతం లాంటి పేర్లు చెప్పకండేం.

చంద్రబాబు ఏంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడం ఎందుకయినా మంచిది

ఇహపై తెలంగాణాలో అడుగుపెట్టేముందు బాబు గారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిదేమో. తెరవెనుక కేసీఆర్ కాళ్ళో లేక గడ్డమో పట్టుకుంటున్నట్లయితే అంత అవసరం వుండదనుకోండీ.

కరెంట్ కంగ్రాట్స్ కేసీఆర్!

దాదాపు ఏడాది క్రితం నేను ఇండియాకు వచ్చినప్పుడు మా పట్టణంలోని ఒక బాగా దగ్గరి మిత్రుడితో అప్పటి రాజకీయాల గురించి చర్చించాను. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆ మిత్రుడు పక్కా తెలంగాణా వాసి అయివుండి కూడా బాబును బాగా మెచ్చుకుంటూ, కేసీఆర్ ను బాగా చులకన చేసేడు. అతను ప్రస్థావించిన విషయాల్లో వాస్తవం కాస్త పక్కకు పెడితే తన కులాభిమానం మాత్రం బాగా ప్రదర్శించుకున్నాడు. బాబు గారి మీద, ఆ కులం గారి మీద అంత భక్తి వున్నప్పుడు అటే ఆంధ్రాకే తను తరలిపోవచ్చు కదా అని అనిపించింది కానీ అనలేదు. 

కట్ చేస్తే దాదాపు ఏడాది తరువాత నేను ఫోన్ చేసినప్పుడు తను కేసీఆర్ ను కాస్త మెచ్చుకోవడం చూసి విస్మయం చెందాను. ఇంత మండే ఎండల్లో కూడా కరెంటు కష్టాలు లేకుండా నెట్టుకొస్తున్నాడని, అందువల్ల అందరూ అతడిని అభిమానిస్తున్నారనీ చెప్పేడు. మిగతా విషయాలు ఎలా వున్నా కరెంట్ విషయంలో మాత్రం లోటు వున్నా కూడా సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడని అన్నాడు. ఆ సమయంలో చంద్రబాబు ప్రస్థావన మా మధ్య రాలేదు కాబట్టి బాబు గారిపై మనవాడి అభిప్రాయం ఎలా వుందో నాకు తెలియదు.

ఇహపోతే కెసీఆర్ మీద ఈమధ్య భండారు శ్రీనివాసరావు గారు వ్రాసిన బ్లాగు పోస్టు వల్లనూ, ఇతర వర్గాల వల్లనూ మా ఫ్రెండ్ చెప్పింది నిజమేనని నాకు అర్ధమయ్యింది. అందువల్ల తెలంగాణా అవిర్భవించి ఒక ఏడాది పూర్తి అయిన సందర్భంగా మిగతా విషయాలు ఎలా వున్నా కనీసం కరెంటు విషయంలో మాత్రం కంగ్రాట్స్ చెప్పలేకుండా నేనుండలేకపోతున్నా.

మళ్లీ అనారోగ్యం

ఇన్ఫెక్షన్లు నన్ను ఎడపెడా వాయిస్తున్నాయి. కొన్ని వారాల క్రితం కంటి ఇన్ఫెక్షన్, ఓ వారం నుండీ సైనస్, ఓ మూడు రోజుల నుండీ కళ్ళ కలక. అనుకుంటూనే వున్నా. ఇలాంటి పరిస్థితి రావచ్చనీ - వచ్చేసిందీ. కారణం నాలోని సప్రెస్డ్ ఇమ్యూనిటీ, దానికి కారణం సిస్టమేటిక్ ఇన్ఫ్లమ్మేషన్, దానికి కారణం ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్, దానికి కారణం నా వెయిట్ లిఫ్టింగూ. హ్మ్!  

జిమ్ములో బరువులెత్తడం అనగానే నేనేదో భీభత్సంగా బరువులెత్తేస్తానని అనుకోకండేం. ఎత్తాలనే  వుంటుంది కానీ నా శరీరం సహకరించదు అని తెలుసు కాబట్టి ఈమధ్య మళ్ళీ కొద్దిగానే ఎత్తాను, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే వున్నాను. అయినా సరే ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ వచ్చేస్తోందని  అర్ధమయ్యి త్వరలోనే విరమించా. లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా వుండేది. 

ఆ తరువాత నుండీ ఇహ అలవాటయిన రొటీనే కనుక ఇన్ఫెక్షన్లు రావొచ్చని ఎదురుచూస్తూ కూర్చున్నాను. వచ్చేసాయి. నా పరిస్థితి గురించి ఇంకా పరిశోధన చేసాను, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాను.  ఈమధ్య జరిగిన రక్త పరీక్షల్లో నా శరీరంలో ఇన్ఫ్లమ్మేషన్  ధృవపడింది. నాలోని ఇమ్యూనిటీ సిస్టం పెరగడానికి ప్రయత్నిస్తున్నాను.  ఇహ కుదుటపడ్డాకా వారానికి ఒక్క రోజు మాత్రమే వెయిట్ లిఫ్టింగ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను.  ఏరోబిక్ వ్యాయామాల వల్ల నాకు సమస్య వుంటుండకపోవచ్చు. అవి వారానికి రెండు, మూడు సార్లు చెయ్యాలనుకుంటున్నా.  

ఇలాంటప్పుడు బరువులెత్తడం ఎందుకూ, ఇవన్నీ కొని తెచ్చుకోవడం ఎందుకూ అంటున్నారా? వెయిట్ లిఫ్టింగ్ వల్ల చాలా ప్రయోజనాలు వున్నాయి లెండి. అందుకే నా శరీరం ఎంత వరకు భరించగలదు అనేది ట్రయల్ అండ్ ఎరర్ విధానం ద్వారా తేల్చుకుంటున్నాను.