బొజ్జ భారతం

నేను చిన్నప్పుడు చాలా సన్నగా పీలగా వుండేవాడిని. యవ్వనం వచ్చాక కూడా ఆ ఆకారం మారలేదు. ఇలా అయితే నాకు ఏ ఆడలేడీస్ లైన్ వేస్తారనే అనుమానం వచ్చింది. మా క్లోజ్ ఫ్రెండుకి ఒకతని మా పట్టణంలో బార్ అండ్ రెస్టారెంట్ వుండేది. అందులో తిని తాగి అతను బాగా లావయ్యాడు. అతని సమస్యకీ, నా సమస్యకీ ఓ పరిష్కారం సూచించాను. అతని బార్ నుండి రోజుకో బీర్ నాకు ఉచితంగా తాగించమని చెప్పాను. అలా ఊరకే వచ్చిందన్న ఆనందం మరియు బీర్ కలిపి నేను లావు అవుతానని నా భావన. అలాగే తేరగా రోజూ బీర్ ఒకరికి ధారపోస్తున్నా అన్న బెంగతో మా వాడు బక్కచిక్కిపోతాడని నా నమ్మకం. ఏ కళన వున్నాడో కానీ మా వాడు నా అమూల్యమయిన సలహాను తూచ్ అన్నాడు. నా సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.  

ఇహ అలక్కాదని బాగా నెయ్యి తింటే బాగా లావవుతారని ఎవరో చెప్పగా విని అన్నంలో బాగా అది కలుపుకుంటే కూరలు చాలా చప్పగా తయారయ్యేవి. ఇహ అలాక్కాదని పెరుగులో ఫుల్లుఫుల్లుగా నెయ్యోసుకొని జుర్రేసుకునేవాడిని. అలా కొన్ని నెలలు తపస్సు చెయ్యగా చెయ్యగా లావయ్యింది నా శరీరం కాదు - నా బొజ్జ. అప్పుడు తాపీగా నాలుక్కరచుకొని నెయ్యి మానేసా కానీ నా బొజ్జ మాత్రం ఇన్నేళ్ళుగా ఇంకా నాలుక్కరచుకోలేదు. అప్పుడు పెంచిన స్టాకు ఇంకా అలాగే నిలబడిపోయింది. అప్పటి నుండి ఎన్ని అపసోపాలు పడ్డా నా బాడీ అయినా తగ్గుతుందేమో కానీ నా బొజ్జ మాత్రం తగ్గనని భీష్మించుకు కూర్చోంటోంది. 

పోనీ తిండి తగ్గిస్తే బొజ్జ కరుగుతుంది కదా అని ఆకులూ అలములూ, కందమూలాలూ అడవిలో సన్నాసిలాగా తింటూ వుంటే బాడీ ఎక్కువ తగ్గేది అది తక్కువ తగ్గేది. నా ఎత్తు ప్రకారం 52 కిలోల కంటే తక్కువకి దిగకూడదు. అంతకి నా బరువు దింపినా కూడా అది మాత్రం మాయమయ్యేది కాదు.    

ఇహ అలాక్కాదని కండ పెంచితే అది తగ్గుతుందని చెప్పి జిమ్ముకి వెళ్ళేవాడిని. ఎలాగూ జిమ్ముకి వెళుతున్నాం కాబట్టీ అది ఎలాగూ తగ్గుతుందని చెప్పి ప్రొటీన్ గట్రా ఈ సమయంలో బాగా అవసరం అని చెప్పి చికెనూ గట్రా ఫుల్లు ఫుల్లుగా లాగించేవాడిని. సో అది తగ్గకపోగా పెరిగిపోయేది. ఇంత శ్రమ పడుతున్నా అది తగ్గట్లేదేమిటా అని నీరసం వచ్చి జిమ్ము మీద ఆసక్తి తగ్గిపోయేది. 

వ్యాయామం ద్వారా కరిగే కాలరీలు చాలా తక్కువ అని తెలుసు కానీ ఎందుకో అది మరచిపోయి జిమ్ము చేస్తే బొర్ర కరిగిపోతుందనే భ్రమలో వుండేవాడిని.  అందుకే ఆ విషయం సరిగ్గా నాకు గుర్తుకువుండాలనే ఇది వ్రాస్తున్నా. వ్యాయామం వల్ల బరువు తగ్గడం చాలా తక్కువ. అందుకని ఆహారం (కేలరీలు) తగ్గించాలి. అలా అని నేను బరువు వుండను. బరువు తగ్గడం కాదు నా సమస్య - జస్ట్ బెల్లీ తగ్గడం. ఇది కొంచెం చాకచక్యంగా చెయ్యాలి. ఒక వైపు ఆహారం తగ్గిస్తూ లేదా కనీసం ఆహారం పెంచకుండా వ్యాయామం చెయ్యాలి. అప్పుడు ఆహారం తగ్గించినందువల్ల వచ్చే కండరాల క్షీణత ఆగిపోయి బాడీ పెరిగిపోయి, వంట్లో కొవ్వు తగ్గిపోయి బెల్లీ తగ్గిపోతుంది. వీలయినంతవరకు పచ్చి ఆహారం తింటూ కేలరీలు, కొవ్వు తగ్గిస్తున్నాను. మరో వైపు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను. అందువల్ల నా బరువు 58 నుండి 55 కిలోలకి వచ్చింది. బెల్ట్ రెండు రంధ్రాలు టైట్ చేసాను. ముందు ముందు ఇంకా మెరుగుదల వుంటుంది.   

అయితే ఎనరోబిక్ వ్యాయామాలు ఎక్కువ చేస్తే నాకు ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు వున్నాయి. ఇదివరకు చాలా సార్లు వచ్చి చాలా దెబ్బ తిన్నాను. ఇప్పుడు జాగ్రత్తగా నన్ను నేను గమనించుకుంటూ వ్యాయామం చేస్తున్నాను. అది రాకుండా ఇప్పుడు నాకు కొన్ని జాగ్రత్తలు తెలుసు. అవి పాటిస్తూ అలెర్ట్ గా వుంటున్నాను. ఏమాత్రం ఆ లక్షణాలు కనిపించినా వ్యాయామం తగ్గిస్తాను.

No comments:

Post a Comment