ఫ్రూట్ వాటర్!

ఇప్పుడే చూసాను. ఇదేదో బావుందే - అందంగా! ఇంట్లో ప్రయత్నిస్తాను.






RTC చార్జీలు తెలంగాణాలో 44%, ఆంధ్రాలో 43% పెంచాలి!

RTC ఉద్యోగులకు జీతాలు పెంచినప్పుడు తమ టికెట్టు చార్జీలు పెంచకపోతే ప్రజలు చిన్నబుచ్చుకోరూ? ఉద్యోగులకు అంత పెంచి ప్రజలకు 20% మాత్రమే పెంచితే బావోదు. అసలు 43, 44 ఏంటీ ఛండాలంగా ఏకంగా 50%, 75% లేదా 100% జీతాలు పెంచొచ్చు కదా. నష్టం ఏముందీ? మళ్ళీ అంత మొత్తం టికెట్ రేట్లు పెంచితే సరి. అటు ఉద్యోగులూ, ఇటు ప్రజలూ సుఖపడుతారు కదా.

అమెరికన్ బ్యూటీని చూసాను

సినిమాలెండి. బావుందే. ఎప్పటినుండో చూద్దామనుకుంటున్నా - మొన్న రాత్రి చూసేసా. చూసేకా తెలిసింది  5 అస్కార్లు వచ్చేయనీ. కెవిన్ స్పేసీ ఎలాగూ బానే చేస్తాడు - హీరోయిన్ (మెనా సువారీ)  నాకు బాగా నచ్చేసింది. కథా, కథనం అంతా ఏంటో గమ్మత్తుగా వుంటుంది. 




స్పాయిలర్ అలర్ట్


మొగుడితో పెళ్ళాం పడుకోదు. మనోడి విసిగి విసిగి వేసారి ఇక లాభం లేక తన కూతురి స్నేహితురాలికి లైన్ వేస్తాడు. నిజానికి ఆమే ఇతనికి లైన్ వేస్తుంది - ఇతను పడతాడు. తరువాత ఏమవుతుందో సినిమాలో చూడండి.



'స్వఛ్ఛ' శరత్!?

అవును - నేను రోజూ స్నానం చేస్తాను. వళ్ళు మండితే అప్పుడప్పుడు రోజుకి రెండు సార్లు కూడా చేస్తాను - స్నానం.

ఏంటో రోటీన్ గా చెయ్యాల్సిన పనులని కూడా స్వఛ్ఛంగా ప్రకటించుకోవాల్సి వస్తోంది.

మోడీ గారికి బహుళ ధన్యవాదాలు. 

నా వల్ల బ్లాగింగ్ మానేసిన ఓ మహిళా బ్లాగర్!

కొన్నేళ్ళ క్రితం. ఆ బ్లాగరుతో పరిచయం ఎలా మొదలయ్యిందో గుర్తుకులేదు కానీ ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడాను. మా ఇద్దరికీ మధ్య ఎంతో పరస్పర గౌరవం, అభిమానం వుంటుండేవి. 

అప్పట్లో నేను బ్లాగుల్లో కలహ భోజనుడిగా ప్రసిద్ధి. బ్లాగుల్లో సరదాగా కయ్యాలు పెట్టడం, ఆట పట్టించడం, కెలకడం, గొడవల్లో అగ్నికి ఆజ్యం పొయ్యడం  లాంటివి చేస్తూ తమాషా చూస్తుండేవాడిని. నాకు తోడుగా ఇంకొంతమంది తయారయ్యారు.  కలిసి సరదాగా కెలుకుడు బ్లాగర్ల సంఘం (కెబ్లాస) అని పెట్టుకున్నాం. ఆ రోజుల్లో తమాషాగా ఆమె ఒక బ్లాగు పోస్టుని కూడా ముందే సరదాగా కెలికేస్తున్నాను అని నా పోస్టులో చెప్పి మరీ ఆటపట్టించాను. ఆమె పోస్ట్ ఏదో సినిమా పాట గురించి అనుకుంటా. అది బావోలేదని తన పోస్టులో విమర్శ చేసారు. నేను దానిని సరదాగా ప్రతి విమర్శ చేసాను. దానికి ఆమె నొచ్చుకొని ఆమె బ్లాగులోనో, నా బ్లాగులోనో కామెంట్ చేసింది. ఇకపై బ్లాగు వ్రాయడం మానేస్తా అని ప్రకటించింది.   సరదాగా చేసినదానికి ఆమెను నొప్పించానే అని నేను బాధపడి ఆమెకు ఫోన్ చేసి వివరించాను. సరదాగా అయినా, సీరియస్సుగా అయినా విమర్శ విమర్శే అన్నది. ఏదో ఆట పట్టించడానికి వ్రాసా అని చెప్పినా, ఆ విషయం నా పోస్టులో ముందే సూచించా అని చెప్పినా ఆమె నొచ్చుకోవడం మానలేదు. 

సరే అని చెప్పి క్షమాపణలు వ్యక్తం చేసాను. తను ఎవరినుండీ క్షమాపణలకు కానీ, ధన్యవాదాలకు గానీ అర్హురాలను కాను అంది. నాకు బుర్రలో ఫ్యూజులు ఎగిరిపోయాయి.  నేను ఎంత కోరినా నా క్షమాపణలు స్వీకరించలేదు. తన పాలసీ మళ్ళీ వివరించింది. తను ఎవరిదగ్గరి నుండి అయినా, ఎప్పుడు అయినా సారీలకు గానీ, థేంక్స్ లకు గానీ అర్హురాలు    కాదుట. అదేం పాలసీనో నాకర్ధం కాలేదు. జనాలు ఇలాక్కూడా వుంటారా అనిపించింది. మరీ ఇంత సున్నితమయిన మనస్కురాలితో దూరంగా వుండటమే  నాకు శ్రేయస్కరం అని తోచింది. అంతటితో మా స్నేహం ముగిసింది - అలాగే ఆమె బ్లాగూ ముగిసింది. 

చేసిన పాపం చెబితే పోతుందంటారు. అందుకే ఇది వ్రాస్తున్నా. ఆమె బ్లాగు వ్రాయడం మానివెయ్యడానికి కారణం నా సరదాతత్వం వల్లనా లేక ఆమె సున్నితత్వం వల్లనా అన్నది నాకిప్పటికీ అర్ధం కాదు. ఏమయినప్పటికీ నా వల్ల ఒక బ్లాగరు అందునా మహిళా బ్లాగరు బ్లాగు మూసుకోవడం నన్ను కించిత్ నొచ్చుకునేలా చేస్తుంటుంది. అంత సున్నితమయిన మనస్కురాలు పాపం ఈ కఠిన సమాజంలో ఎలా నిలద్రొక్కుకుంటోందో అనిపిస్తుంటుంది. 

ఆ తరువాత మా కెబ్లాస సరదాగా కెలుకుడు మానేసి సీరియస్సుగా కెలకడం మొదలెట్టడంతో దాంట్లో నుండి బయటకి వచ్చాను. నెమ్మదిగా ఇతరులను ఆటపట్టించడం తగ్గించాను - మానివేసాను - అందుకు కొంత కారణం పై సంఘటణ కూడానూ. అలా అని ముందు ముందు మళ్ళీ సరదాగా కెలుకుడు మొదలెట్టనని కాదు కానీ ప్రస్థుతం అయితే అలా వ్రాయట్లేదు. ఈ మధ్య వ్రాసిన 'నాకో బిరుదివ్వండి బాబయ్యా' అనే టపా కూడా కూడా కాస్త కెలుకుడు టపానే :)   

బొజ్జ భారతం

నేను చిన్నప్పుడు చాలా సన్నగా పీలగా వుండేవాడిని. యవ్వనం వచ్చాక కూడా ఆ ఆకారం మారలేదు. ఇలా అయితే నాకు ఏ ఆడలేడీస్ లైన్ వేస్తారనే అనుమానం వచ్చింది. మా క్లోజ్ ఫ్రెండుకి ఒకతని మా పట్టణంలో బార్ అండ్ రెస్టారెంట్ వుండేది. అందులో తిని తాగి అతను బాగా లావయ్యాడు. అతని సమస్యకీ, నా సమస్యకీ ఓ పరిష్కారం సూచించాను. అతని బార్ నుండి రోజుకో బీర్ నాకు ఉచితంగా తాగించమని చెప్పాను. అలా ఊరకే వచ్చిందన్న ఆనందం మరియు బీర్ కలిపి నేను లావు అవుతానని నా భావన. అలాగే తేరగా రోజూ బీర్ ఒకరికి ధారపోస్తున్నా అన్న బెంగతో మా వాడు బక్కచిక్కిపోతాడని నా నమ్మకం. ఏ కళన వున్నాడో కానీ మా వాడు నా అమూల్యమయిన సలహాను తూచ్ అన్నాడు. నా సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది.  

ఇహ అలక్కాదని బాగా నెయ్యి తింటే బాగా లావవుతారని ఎవరో చెప్పగా విని అన్నంలో బాగా అది కలుపుకుంటే కూరలు చాలా చప్పగా తయారయ్యేవి. ఇహ అలాక్కాదని పెరుగులో ఫుల్లుఫుల్లుగా నెయ్యోసుకొని జుర్రేసుకునేవాడిని. అలా కొన్ని నెలలు తపస్సు చెయ్యగా చెయ్యగా లావయ్యింది నా శరీరం కాదు - నా బొజ్జ. అప్పుడు తాపీగా నాలుక్కరచుకొని నెయ్యి మానేసా కానీ నా బొజ్జ మాత్రం ఇన్నేళ్ళుగా ఇంకా నాలుక్కరచుకోలేదు. అప్పుడు పెంచిన స్టాకు ఇంకా అలాగే నిలబడిపోయింది. అప్పటి నుండి ఎన్ని అపసోపాలు పడ్డా నా బాడీ అయినా తగ్గుతుందేమో కానీ నా బొజ్జ మాత్రం తగ్గనని భీష్మించుకు కూర్చోంటోంది. 

పోనీ తిండి తగ్గిస్తే బొజ్జ కరుగుతుంది కదా అని ఆకులూ అలములూ, కందమూలాలూ అడవిలో సన్నాసిలాగా తింటూ వుంటే బాడీ ఎక్కువ తగ్గేది అది తక్కువ తగ్గేది. నా ఎత్తు ప్రకారం 52 కిలోల కంటే తక్కువకి దిగకూడదు. అంతకి నా బరువు దింపినా కూడా అది మాత్రం మాయమయ్యేది కాదు.    

ఇహ అలాక్కాదని కండ పెంచితే అది తగ్గుతుందని చెప్పి జిమ్ముకి వెళ్ళేవాడిని. ఎలాగూ జిమ్ముకి వెళుతున్నాం కాబట్టీ అది ఎలాగూ తగ్గుతుందని చెప్పి ప్రొటీన్ గట్రా ఈ సమయంలో బాగా అవసరం అని చెప్పి చికెనూ గట్రా ఫుల్లు ఫుల్లుగా లాగించేవాడిని. సో అది తగ్గకపోగా పెరిగిపోయేది. ఇంత శ్రమ పడుతున్నా అది తగ్గట్లేదేమిటా అని నీరసం వచ్చి జిమ్ము మీద ఆసక్తి తగ్గిపోయేది. 

వ్యాయామం ద్వారా కరిగే కాలరీలు చాలా తక్కువ అని తెలుసు కానీ ఎందుకో అది మరచిపోయి జిమ్ము చేస్తే బొర్ర కరిగిపోతుందనే భ్రమలో వుండేవాడిని.  అందుకే ఆ విషయం సరిగ్గా నాకు గుర్తుకువుండాలనే ఇది వ్రాస్తున్నా. వ్యాయామం వల్ల బరువు తగ్గడం చాలా తక్కువ. అందుకని ఆహారం (కేలరీలు) తగ్గించాలి. అలా అని నేను బరువు వుండను. బరువు తగ్గడం కాదు నా సమస్య - జస్ట్ బెల్లీ తగ్గడం. ఇది కొంచెం చాకచక్యంగా చెయ్యాలి. ఒక వైపు ఆహారం తగ్గిస్తూ లేదా కనీసం ఆహారం పెంచకుండా వ్యాయామం చెయ్యాలి. అప్పుడు ఆహారం తగ్గించినందువల్ల వచ్చే కండరాల క్షీణత ఆగిపోయి బాడీ పెరిగిపోయి, వంట్లో కొవ్వు తగ్గిపోయి బెల్లీ తగ్గిపోతుంది. వీలయినంతవరకు పచ్చి ఆహారం తింటూ కేలరీలు, కొవ్వు తగ్గిస్తున్నాను. మరో వైపు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాను. అందువల్ల నా బరువు 58 నుండి 55 కిలోలకి వచ్చింది. బెల్ట్ రెండు రంధ్రాలు టైట్ చేసాను. ముందు ముందు ఇంకా మెరుగుదల వుంటుంది.   

అయితే ఎనరోబిక్ వ్యాయామాలు ఎక్కువ చేస్తే నాకు ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు వున్నాయి. ఇదివరకు చాలా సార్లు వచ్చి చాలా దెబ్బ తిన్నాను. ఇప్పుడు జాగ్రత్తగా నన్ను నేను గమనించుకుంటూ వ్యాయామం చేస్తున్నాను. అది రాకుండా ఇప్పుడు నాకు కొన్ని జాగ్రత్తలు తెలుసు. అవి పాటిస్తూ అలెర్ట్ గా వుంటున్నాను. ఏమాత్రం ఆ లక్షణాలు కనిపించినా వ్యాయామం తగ్గిస్తాను.

ఆమెని 35 ఏళ్ళ తరువాత చూసాకా...

...ఎందుకు చూసానా అనుకున్నాను. కొన్ని కొన్ని మధురస్మృతులు అలాగే ఆగిపోతే బావుంటుందేమో, కొనసాగిస్తే పేలవంగా మిగిలిపోవచ్చు.

"శరత్! నువ్వేనా?! అప్పటికీ ఇప్పటికీ నేవ్వేమీ మారిపోలేదు సుమీ!అందుకే అంతదూరం నుండే నిన్ను గుర్తుపట్టగలిగాను" అంది ఆమె చాలా ఉత్సాహంగా. ఆమె మాత్రం బాగా మారింది. బాగా లావయ్యింది. ఇంకా చాలా మార్పులు వచ్చాయి. అప్పటిదాకా నామదిలో వున్న ఆమె అందమయిన రూపం చెదిరిపోయింది. ఈమెను ఇలా చూడకుండా వుండాల్సింది అనుకున్నాను. మా హైస్కూల్ రోజుల్లో ఆమె మా స్కూల్ బ్యూటీ క్వీన్. నాతో పాటు ఎంతో మంది హృదయాలను అప్పట్లో కొల్లగొట్టింది. అందం, అహం, తెలివి కలగలిసిన ఆమెను చూస్తుంటే ఎంతో మధురంగా అనిపించేది. ఇన్నాళ్ళ వరకూ, ఇన్నేళ్లవరకూ ఆమె మధురమయిన రూపాన్ని అప్పుడప్పుడూ గుర్తుకుతెచ్చుకొని పులకించిపోయేవాడిని. ఇప్పుడు ఆ స్వప్నం చెరిగిపోయింది - వాస్తవం కళ్ళముందు అవిష్కరింపబడింది. ఏం చేస్తాం - మనస్సులో నిట్టూర్చాను. 

గత ఏడాది వేసవిలో ఇండియాలో మా చిన్నమ్మాయి శారీ ఫంక్షన్ జరిపాము.  ఆ సందర్భంగా వీలయినంత మంది మిత్రులనూ, బాల్య మిత్రులనూ పిలుచుకున్నాను. 8,9 తరగతులు భోనగిరిలో చదివాను నేను. ఏదోలా వాళ్ళ ఫోన్ నంబర్లు సంపాదించి వాళ్లనూ పిలిచాను. కొంతమంది వచ్చారు. ఆడవారిలో ఈమె మాత్రమే రాగలిగింది. అప్పుడు చూసాను ఆమెను.

ఆమె పేరు కూడా చాలా బావుంటుంది. అందంగా, హుందాగా. ఈమె పేరుతో సహా ఈమెను నేను కలవక ముందు జస్ట్ ఫోనులో మాట్లాడాక అందాజాగా రెండేళ్ళ క్రితం ఒక పోస్ట్ వేసాను. ఆ పోస్ట్ ఇంకా వుంచానో తీసేసానో గుర్తుకులేదు.

సలాడ్ సాంబార్?!

"రైస్ పెట్టనా లంచ్ కి?" అని ఉదయం అడిగింది నా భార్య
"వద్దు"
"కీన్వా?"
"వద్దు"
"మరి?"
"సాంబార్ పెట్టు"
"సాంబార్?"
"అవును. సాంబార్ పెట్టు. సలాడ్ కొనుక్కొని తింటాను" అన్నాను.

మధ్యాహ్నం భోజన సమయంలో కాస్సేపు చికాగో నగరంలో పాదయాత్ర చేసి మా ఆఫీసుకి దగ్గర్లో వున్న వాల్‌మార్టులో ఇటాలియన్ స్టైల్ సలాడ్ కొనుక్కుని మళ్ళీ ఆఫీసుకు వచ్చాను. ఆ సలాడుని సాంబారులో ముంచుకొని తింటుంటే భలేగా అనిపించింది. మొత్తం సలాడ్ ప్యాకెట్ (285 గ్రాములు) తింటే పొందేవి 50 క్యాలరీలే. ఈ రోజుకి 25% ఫైబర్ దాని ద్వారా లభించింది. 

అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇలా ఆ సలాడ్ కానీ మరే గ్రీన్ సలాడ్ కానీ ముంచుకొని తినకుండా సాంబారులో ఇడ్లీల లాగా నానవేస్తే ఇంకా రుచికరంగా వుంటుందేమో అనిపించింది. ఇంటికి వెళ్ళాకా ఆ ప్రయోగం చేసి చూడాలి. ఆ రుచి ఎలా వుండొచ్చంటారూ?

నిజానికి ఇలా సలాడ్ కొనుక్కోకుండా ఇంటిదగ్గర నుండే సిద్ధం చేసుకొని రావచ్చు కానీ దానికి ఇంకా సమయం పడుతుంది. 

నా పెళ్ళికి రెండు రోజుల ముందు...

అతను నా ముఖ్య స్నేహితుడు. ఆ రాత్రి అతడిని తీసుకొని ఒక చక్కని బార్ అండ్ రెస్టారెంటుకి వెళ్ళాను. టెర్రస్ మీద కూర్చొని బిర్యానీ, బీరూ ఆర్డర్ చేసాను. అతను తాగడు - నేను తాగుతాను.  క్వార్టర్ బీరు ఖాళీ చేసాకా విషయానికి వచ్చాను. ఇప్పటివరకూ, ఇన్నాళ్ళుగా మా ఇంట్లో తలలో నాలుకగా మెలిగినందుకు, మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడికి వలే సహాయ సహకారాలు అందించినందుకు బహుళ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.  అతను సహజంగానే సంతోషించాడు. మరో గ్లాసు చల్లని బీరు లాగించి, మరో చికెన్ లెగ్గు తినేసి ఓ సారి త్రేన్చి అప్పుడు అసలు విషయానికి వచ్చాను. మా ఇంట్లో ఇహ అలాంటి పద్ధతి చాలించమన్నాను. అతను ఖంగుతిన్నాడు. అతను నానుండి ఇలాంటి మాటలు ఊహించలేదు. ఎందుకంటే మేము క్లోజ్ ఫ్రెండ్స్.

అతను మా ఇంట్లో ఎందుకు మారాలో అతనికి వివరించాను. "ఇప్పటిదాకా నేను సింగిల్ ని. ఏదో ఎలాగో నడిచిపోయింది - ఇబ్బంది లేదు. రేపు పొద్దున పెళ్ళయ్యాక నాకు ఓ పెళ్ళమంటూ వస్తుంది. ఆమె దగ్గర కానీ, మా ఇంట్లో గానీ, వాళ్ళింట్లో గానీ నాకు ప్రాధాన్యం వుండాలి గానీ నీకు కాదు. ఎంతయినా కొత్త పెళ్ళాం మరియు తొలి పెళ్ళాం. జెలసీ వస్తుంది. మన మధ్య తేడాలు వస్తాయి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది".  అతగాడు అర్ధం చేసుకున్నాడు. 

కట్ చేస్తే పెళ్ళి రోజు. పెళ్ళి పనుల్లో, మా ఇంట్లో అతని హడావిడి తగ్గలేదు. మా ఇంట్లో ముఖ్యమయిన వ్యక్తివలె పెళ్ళి పనులు చక్కబెట్టడం చక్కని విషయమే కదా. మిగతావాళ్ళు ఎందరు వున్నా అతను వేరు. అన్ని పనులూ స్వయంగా పూనుకొని భుజాన వేసుకొని చేస్తాడు. అందువల్ల అతని హడావిడి సబబే కాబట్టి నేను నొచ్చుకోలేదు. మర్నాటి నుండి తను ఎక్కడ వుండాలో, ఎలా వుండాలో అక్కడే వున్నాడు, అలాగే వున్నాడు. అటుపై మా మధ్య కొన్ని వేరే సమస్యలు వచ్చాయి - సామరస్యంగా పరిష్కరించుకున్నాం కానీ ఇలాంటి సమస్యలు ఏమీ రాలేదు.

అంతకుముందు మా ఇంట్లో మా అమ్మా నానలు ఒక్కరే వుండేవారు. నేనేమో చదువుల నిమిత్తం వేరే చోట్ల వుండేవాడిని. ఇతను మా ఇంటికి తరచుగా వచ్చి మా అమ్మా నానలతో మాట్లాడుతూ వారి అవసరాలు కనిపెడుతూ, వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాడు. పరిస్థితి ఎలా తయారయ్యిందంటే నేను ఊరి నుండి వచ్చినా కూడా నాకంటే అతనికే మా ఇంట్లో ప్రాధాన్యత ఎక్కువయ్యింది. మంచి స్నేహితుడు కాబట్టి నేను నొచ్చుకోలేదు - పైగా గర్వించాను - అంత బాగా మంచి స్నేహితుడు నాకు దొరికినందుకు. కానీ... అంత మంచి పేరు, నమ్మకం ఎలా మా ఇంట్లో ఎలా సంపాదించాడో నాకు అర్ధం కాక తల కాస్సేపు మాత్రం గోక్కునేవాడిని. అలా మా ఇంటికి  అంత తరచుగా వెళ్ళేంత ఓపికా, తీరికా ఎలా దొరికేవో నాకు అర్ధం అవకపోయేది.

ఆ తరువాత ఎప్పుడో అసలు విషయం చెప్పాడు. ఒక ఉదాహరణ చెబుతాను. ఒకసారి వచ్చినప్పుడు మా పేరేంట్స్ దగ్గర్లో లేనిది చూసి ఫ్యాన్ ప్లగ్గు వైర్ కనపడకుండా ఊడగొట్టేవాడుట. మళ్ళీ రెండు రోజుల తరువాత ఇంటికి వస్తే ఫ్యాన్ సరిగా పని చెయ్యట్లేదని మా పేరెంట్స్ అతనికి చెప్పేవారు. అతను క్షణాల్లో అది బాగుచేసేవాడు! అలా అలా మా ఇంట్లో అతను సమర్ధుడు అనిపించుకున్నాడు. అంత సమర్ధత నాకెక్కడ ఏడ్చిందీ?

అంత ఓపిగ్గా, తీరిగ్గా పదేపదే మా ఇంటికి ఎందుకు వచ్చేవాడో కూడా తరువాత ఎప్పుడో, ఎలాగో తెలిసింది ;) మా పేరెంట్స్ కి తోడుగా ఇంట్లోనే పని అమ్మాయి వుంటుండేది. పలు కారణాల వల్ల తరచుగా ఆ పనిఅమ్మాయిలు మారుతుండేవారు. ఉదాహరణకు మా పేరెంట్స్ ఇంట్లో ఎక్కడో వసారాలో కూర్చునేవారు. ఇతను పడక గదిలోకి వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తుడిచే నెపంతో పని అమ్మాయిని నీళ్ళూ, పాత గుడ్డా తెమ్మని చెప్పేవాడు. ఒక్కోసారి వాళ్ళింట్లో కాస్త పనులు వున్నాయని చెప్పి మా ఇంటి పనిమనిషిని వాళ్లింటికి తీసుకెళ్ళేవాడు. మా వాళ్ళు వద్దు అనలేకపోయేవారు. 

పైన పేర్కొన్న విషయాలు వాస్తవం అయినప్పటికీ కేవలం వాటి వల్లే మా పేరెంట్స్ ఆదరాభిమానాలు పొందాడని కాదు.  నిజంగానే మంచి మిత్రుడు. మా పేరెంట్స్ అంటే అతనికి మంచి గౌరవమూ, శ్రద్ధానూ. 

మేము Mardi Gras 2016 కి సిద్ధం

కొంతకాలం క్రితం మా PG స్నేహితులం మళ్ళీ రియూనియన్ కావాలనుకుంటున్నాం అని వ్రాసాను కదా. కొద్దిమంది కుటుంబాలని కూడా తీసుకురావడానికి ఉత్సాహపడటంతో అన్యమస్కంగా నేనూ ఓకే అనేసాను. ఆ తరువాత 'అందరం వెళుతున్నామహో' అని ఇంట్లో చెప్పాను. అందుకుగాను ఇంటిలోని వారు అందరూ చక్కగా సంతసించితిరి. మళ్ళీ కొందరు గడుగ్గాయిలు ఏలేశ్వరం వెళుతూ శనీశ్వరాలను వెంటపెట్టడం ఎందుకూ అని సన్నసన్నగా రణగొణధ్వనులు చేసారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని వద్దంటే మా మొగుళ్ళ తాట తీస్తారని భయపడి కష్టమో నిష్టూరమో కుటుంబాలతోనే కలిసి వెళ్దామని గుండె చిక్కబట్టుకొని, బాధ దిగమింగుకొని సిద్ధం అయ్యాము.

అది కూడా జనవరి 1స్ట్ కి క్రూయిజ్ మెక్సికోకి అని అనుకున్నాం. తీరా చూస్తే అది హై సీజన్ కాబట్టి ఖర్చులు పేలిపోయేట్టుగా వున్నాయి. ఇదంతా ఇహ తప్పనిసరి తద్దినంలా తయారవుతున్నట్లుందే అని అనుకున్నాను. ప్లానింగ్ గురించి మా మిత్రుడు ఒకరు కాన్‌ఫరెన్స్ కాల్ పెడితే అతనూ, నేనూ తప్ప ఎవరూ రారే! అలా రెండు మూడు సార్లు పెట్టి విసిగిపోయి ఆత్మావలోకనం, ఆత్మవిమర్శా చేసుకున్నాం. అప్పుడర్ధమయ్యింది. మా వాళ్లకి కావాల్సింది కుటుంబాలూ కాదు, క్రూయిజూ కాదు. ఇంకేదో వుంది. అదే కుటుంబాలనుండి ఆట విడుపూ, స్వేఛ్ఛానూ. ఆలోచించి అందుకు తగ్గ గేలం వేసాం. పోలోమంటూ అందరూ సిద్ధం అయ్యారు. అద్దీ కత.   

Mardi Gras కోసం New Orleans  కి సింగిల్స్ గా వెళ్దామని చెప్పాం. అందరూ తయార్ ;) దాని యొక్క గొప్పదనం కోసం నన్నడక్కండేం - నెట్టులో చూడండి ఎంచక్కా. సో 2106 Mardi Gras కి వెళ్లాలనుకుంటున్నాం. మీరూ ఎవరయినా రావాలనుకుంటున్నారా ఆ ఈవెంటుకి? ఆ ఉత్సవాలు దాదాపు ఒక నెల మొత్తం వుంటాయి. ముఖ్యమయిన కార్యక్రమం ఫిబ్రవరి 9న. దానికి వెళ్ళాలా లేక ఇతర రోజులలో వెళ్ళాలా అనేది ఇంకా నిర్ణయించలేదు. వివరాలు సేకరిస్తున్నాం. Feb 9 న వెళితే చాలా ఎక్కువ జనాభా వుంటుందనీ, ఆనందించలేమనీ, మిగతా రోజుల్లో వెళ్ళడం మంచిదనీ కొందరు అన్నారు. మీరు ఎవరయినా ఈ ఈవెంటుకి వెళ్ళినట్లయితే, లేదా దీని గురించి తెలిసినవారయితే సలహా ఇవ్వండి మాకు.

అదంతా సరే కానీ ఒక ముఖ్యమయిన సమస్య వచ్చింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి 'ఠాఠ్ - వీల్లేదు - మీరు రావద్దు' అని చెప్పాలి. ఎలా? బ్బెబ్బెబ్బే అని నీళ్ళు నమిలి ఏదో చెప్పుకున్నాను లెండి.  రియూనియనుకి మీరు రాకపోతేనేం - ఎంచక్కా ఈ వేసవిలో ఎక్కడో చోట ఆయా కుటుంబాలతో సహా కలుద్దామని ఓ మాట పడేసాను లెండి. 

ఇంకో సమస్య కూడా వచ్చింది. మా గ్రూపులో ఒక ఆడలేడీ కూడా వుంది. ఆమెను తీసుకొని అక్కడికి ఎలా వెళ్ళేదీ? కొంపదీసి ఆమె అక్కడికి వస్తా అంటే ఇంకా మాకు కిక్కు ఏముంటుందీ. అందుకే దీని గురించి ఆమెకు చెప్పబోవడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా వెళ్ళివస్తాం. మీరూ చెప్పకండేం. ష్!

ఇవాల్టి నా రాత్రి భోజనం ఇదీ

వ్యాయామానికి వెళ్ళిరావడంతోటే ఇంట్లో ఘుమఘుమలాడుతున్న పప్పు కూర కనిపించింది. ఇంకేం స్ప్రింగ్ మిక్స్ గ్రీన్స్ ను పప్పులో నంచుకొని తినేసా. దాంతోపాటూ ఆవకాయా పెట్టేసుకున్నా. ఇంకేం ఓహ్ సూపర్. నాకున్న దుర్గుణాల్లో పచ్చళ్ళు ఎక్కువగా తినడం ఒహటి. తగ్గించాలి. ఆ తరువాతా పెసర మొలకలు లాగించా.

నెమ్మది నెమ్మదిగా Raw Vegan life style పెంచుతున్నా అని చెప్పాగా. అందులో భాగంగానే ఇదీనూ. 

ఇవాల్టి నా మధ్యాహ్న భోజనం ఇదీ!


నాకో బ్లాగు బిరుదు పడెయ్యండి బాబయ్యా

ఇన్నాళ్ళూ బ్లాగులు వ్రాసాను. ఒక్కళ్ళన్నా నా గురించి పట్టించుకున్నారా? పాపం ఓ బిరుదు ఇచ్చేస్తే ఈ అల్పజీవికి కి ఆత్మశాంతి కలుగుతుంది కదా అని ఎవరయినా ఆలోచించారా లేదు. ఖర్చుపెట్టి సన్మానాలేమీ అఖ్ఖరలేదండీ  - పైసా ఖర్చు లేకుండా ఓ బిరుదు నా ముఖాన పడెయ్యొచ్చు కదా. ఇన్నాళ్ళ నుండీ వ్రాస్తున్నాను. ఇప్పటికి కనీసం మూడో నాలుగో బిరుదులయినా వుండాలి కానీ నాకు ఒక్క బిరుదు కూడా లేకపోవడం ఎంత పాపం?

నిన్నా మొన్న వచ్చిన కొందరు బ్లాగర్లకి కూడా  బిరుదులున్నాయి. ఒక్క సినిమా రిలీజ్ కాకుండా నే కొందరు హీరోలు బిరుదులు తగిలించుకుంటున్నట్లు ఇకముందు ఒక్క పోస్టు వ్రాయకుండానే 'బ్లాగు రత్న' గట్రా ప్రకటిస్తారేమో.

నాకు గుర్తుకు వున్న కొన్ని బిరుదులు:
ఆది బ్లాగరి - ఆదిమ మానవుడి తరహాలో.
బ్లాగక్క - వీరెవరో మీకు తెలిసే వుంటుంది.
బ్లాగు నాయకి లేదా అలాంటిది - ఈ బిరుదు నాకు సరిగా గుర్తుకులేదు.  ఓ మూడు నాలుగు పోస్టులు ఆవేశంగా వ్రాసినట్లున్నారు. బిరుదు వచ్చేసింది.
బ్లాగు గాంధీ - వీరేమయినా సత్యాగ్రహాలు చేసారేమో నాకు తెలియదు. నేను మాత్రం బ్లాగుల్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని సంకలినిల నియంతృత్వానికి వ్యతిరేకంగా - అభిప్రాయ ప్రకటనకి మద్దతుగా 'కూడలిలో యుద్ధం ' అని నేను బ్లాగుల్లో చేరిన కొన్ని నెలలకే యుద్ధం చేసాను. ఓ అప్పట్లో అది ఓ పెద్ద సంచలనం. కొంతమందికయినా గుర్తుండే వుంటుంది. నేను శృంగార పరమయిన విషయాలు వ్రాస్తున్నా అని బ్యాన్ చేసేరు లెండి. బ్లాగుల్లో భావ స్వేఛ్ఛకి అడ్డు వుండకూడదని పోరాటం చేసాను - అది విజయవంతం అయ్యింది.
బ్లాగు భీష్ముడు - ఇది నేను సరదాగా ఒకే ఒక్కసారి ఒకరికి ఇచ్చిన బిరుదు.

ఇంకా మీకేమయినా బిరుదులు గుర్తుంటే చెప్పండి.

సరే, ఇదే మీకందరికీ ఫైనల్ వార్నింగ్. మర్యాదగా నాకు మీరంతా కలిసి బిరుదు ఇచ్చారా సరేసరి - లేదా...లేదా..లేదా నాకు నేనే ప్రకటించేసుకుంటాను. తస్మాత్ జాగ్రత్త.