జాషువా ట్రీ నేషనల్ పార్క్ లో మా ఫోటోలు

పార్కులో జాషువా చెట్ల క్రింద నేను

లాస్ ఏంజిల్స్ వెళ్ళిన మరుసటి రోజు మధ్యాహ్నమే మొజవే డిజర్ట్ డ్రైవ్ కి మమ్మల్ని తీసుకువెళ్ళాడు మా సీతారామ్. నాకు ఎడారి అంటే ఎంతో ఇష్టం. అందులో ప్రయాణం చేయాలని ఎన్నాళ్ళుగానో నా అభిలాష. ఆ ప్రయాణం అంటే మా చిన్నమ్మాయి కూడా ఎంతో ముచ్చట పడింది. కొండలు, గుట్టలు. ఎడారి చెట్ల మధ్యగా ప్రయాణం ఎంతో బాగా జరిగింది కానీ మా అమ్మాయీ, నేనూ కాస్తంత నిరుత్సాహపడ్డాం. ఎడారి అంటే మా దృష్టిలో ఎంతో ఎత్తయిన ఇసుక తిన్నెలు. హ్మ్. ఈ ఎడారులు ఏంటో గానీ ఇసుక ఏమాత్రం కనిపించలేదు. ఇలాంటి భూముల్ని కూడా ఎడారులు అంటారని మాకు అప్పుడే తెలిసింది.  ఇసుక తిన్నెలు లేకున్నా సరే కొండలు, గుట్టలు, రాళ్ళు, ఎడారి చెట్లతో ఎడారి నాకు బాగానే అనిపించింది కానీ మా అమ్మాయి మాత్రం నాలుక చప్పరించింది. దారిలో ఒక ఒయాసిస్సుకి కూడా మా మిత్రుడు తీసుకువెళ్ళాడు కానీ ఆ కథ తరువాత. 


పార్కులో స్నేహితుడు సీతారామ్ మరియు నేను

ప్రయాణంలో జాషువా చెట్టు గురించి మా ఫ్రెండ్ వివరించాడు. యుఎస్ లోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆ చెట్టు వుంటుందని చెప్పి చూపించాడు. ఆ చెట్లు వివిధ ఆకారాలతో భలేగా వుండి బాగా నచ్చాయి. ఈ చెట్ల కోసం ప్రత్యేకంగా ఓ జాతీయ ఉద్యానవనం కూడా వుందనీ మనం అక్కడికే వెళుతున్నామనీ చెప్పాడు. అబ్బో చాలా పెద్ద పార్క్. వివరాల కోసం పై లింక్ నొక్కండి. జాషువా చెట్టు వివరాల కోసం క్రింది లింక్ నొక్కండి. అక్కడ ఆ గుట్టలమధ్య, చెట్ల మధ్య సూర్యాస్తమయం చూసాం. అక్కడ చాలామంది గుట్టలు ఎక్కడం (రాక్ క్లైబింగ్ హాబీ) చూసాను. నా యుక్తవయస్సులో మా టవును చుట్టు పక్కల మా మిత్రులతో కలిసి గుట్టలు ఎక్కడం - మమ్మల్ని దొంగలుగా అనుమానించి సమీప గ్రామం వారు తన్నడానికి సిద్ధపడటం - మా ఇల్లు ఎక్కడ వుందో చెబితే ఎవరో ఒకరు మమ్మల్ని గుర్తుపట్టడంతో బ్రతుకు జీవుడా అని బయటపడటం గుర్తుకువచ్చాయి. 


మా ఆవిడా నేనూనూ
ఎడారిలో ప్రయాణమూ, ఒయాసిస్సూ, జాషువా ట్రీ నేషనల్ పార్కు నాకు భలేగా నచ్చాయి కానీ మా అమ్మాయీ, మా ఆవిడా గులగసాగారు. ఏం చేస్తాం - వారికి ప్రకృతి అంటే వికృతి. వెకేషన్ అంటే చెట్లూ చేమలు చూడ్డమా అని వారి విమర్శ. హ్మ్. ఇంకా ఆ పార్కులో చాలాసేపు వుందామని నా మిత్రుడూ, నేనూ అనుకున్నాం కానీ అందువల్ల ఇహ కొనసాగించలేక తిరుగుప్రాయాణం పట్టాము. 

మీలో ఎవరయినా ఈ పార్కును చూసివుంటే మీ అనుభూతులు ఇక్కడ పంచుకోండేం. మీరు లాస్ ఏంజిల్స్ వెళితే కనుక, మీరు ప్రకృతి సౌందర్యారాధకులు అయితే గనుక ఆ పార్క్ తప్పకుండా చూసిరండి. మీ ఫ్యామిలీకి గనుక ప్రకృతి అంటే విరక్తి వుంటే గనుక వెంట తీసుకెళ్ళకండి :)

ఇదే పోస్టుని మిగతా చాలామంది బ్లాగర్లు అయితే దాదాపుగా ఈ క్రింది విధంగా వ్రాస్తారు!

"మా కుటుంబంతో పాటుగా ఆ పార్కుకి వెళ్ళాం. అందరం చక్కగా అనందించాం. మా ఆవిడ అయితే అంత మంచి పార్కు చూపించినందుకు గాను ఆనందం పట్టలేక అక్కడికక్కడ ఓ ముద్దు ఇచ్చేసింది. ఇహ మా అమ్మాయి అయితే ప్రకృతిలో పరవశించి పోయి కేరింతలు కొట్టింది. మా వాళ్ళ ఆనందం చూసాకా మా మిత్రుడు మరికొన్ని ప్రదేశాలు చూపించగా తనివితీరా దర్శించాము. తిరిగివస్తుంటే అక్కడ నుండి కదలబుద్ధి కాలేదు. మళ్ళీమళ్ళీ ఈ పార్కుని మా కుటుంబంతో కలిసి చాలాసార్లు చూడాలనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీని అంతా వెంటబెట్టుకొని వెళ్ళండి. వారంతా తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు" :)

9 comments:

 1. పోస్ట్ సంగతేమో కానీ, కొసమెరుపు మాత్రం అదిరింది. Once again you proved that you and your blog are different. Keep writing.

  $iddharth

  ReplyDelete
 2. :):):) double smiles చివరి పేరాగ్రాఫ్‌కి..
  నేనెప్పుడైనా ఎటైనా వెళ్లిన విషయాలు వ్రాయాలంటే ఇవే డైలాగ్స్ గుర్తొస్తాయేమో..:(

  ReplyDelete
 3. @ అనామిక
  :))

  ఇంకొచెం మంచి ఫొటో మీ ప్రొఫయిల్ కి పెడితే బావుంటుంది. ఇప్పుడున్న పిక్ ఓ ఇండియన్ ని కాకుండా కొరియన్ ని చూస్తున్నట్లుగా వుంది.

  ReplyDelete
 4. చూడు శరతప్ప, అయినా లాస్ట్ పంచ్ మీది అయితే ఆ కిక్కే వేరప్పా!

  ReplyDelete
 5. @ పానీపూరీ
  :)

  మీరింకా వున్నారా! ఐ మీన్ మీరు ఇంకా బ్లాగులు చదువుతున్నారా అని. ఎందుకంటే ఈమధ్య మీరు కనపడటంలేదు - అందుకే అడుగుతున్నా.

  కొన్నేళ్ళక్రితం నేను డల్లాస్ వచ్చినప్పుడు మిమ్మల్ని, ఇంకొకర్నీ కలుసుకోవడం ఈమధ్య గుర్తుచేసుకున్నాను. అప్పటి బ్లాగు రోజులే వేరండీ, ఓ పండగలా, సందడిగా దేనికయినా ఉత్సాహంగా వుండేది. కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజిల్స్ వస్తున్నా ఎవరయినా కలుస్తారా అంటే ఒక్క స్పందనా లేదు. ప్చ్.

  ReplyDelete
 6. ఎన్ని నెలలు గురువుగారు...!!!

  అంటే.. ఎన్ని నెలలు కష్టపడితే అలా పొట్ట పెంచగలిగారని.. ఆరోగ్యం, ఎక్సర్ సైజులు , మందులూ-మాకులూ, టై గ్లిసరాయిడ్స్ అని మీరు మాటలు చెప్తుంటే అబ్బా ఆరొగ్యం పైన ఇంతలా శ్రద్ధ ఉండొచ్చా అనుకున్న..

  మీ అమ్ములు పంచెస్ కరెక్టే అయితే..

  ReplyDelete
 7. @ కాయ
  హహ. ఎవరన్నా నా బొజ్జ మీద కామెంట్ వేస్తారేమో చూసా. సివరాఖరుకి మీరు వేసారు. సంతోషం.

  ఏదయినా సరే దేశకాలమాన పరిస్థితులపైన ఆధారపడి వుంటుంది. మీరు అవన్నీ ప్రస్థావించారు నిజమే కానీ నా నెగటివ్ విషయాలు వదిలేసారు. నా బుల్లి (?!) బొజ్జకి కారణం అవే. గత కొంత కాలంగా నేను మానసిక కృంగుబాటు (క్లినికల్) లో వున్నానని మీకు తెలిసేవుంటుంది. ఇన్నాళ్ళకి సరి అయిన మందు దొరకడం వల్ల కొన్ని నెలలుగా క్రమంగా నా అరోగ్యం మెరుగుపడుతోంది. డిప్రెషనులో వున్నప్పుడు ఎక్కువ కానీ తక్కువ కానీ తినడం జరుగుతుంది. ఆరోగ్యం మీద, శరీరం మీద శ్రద్ధ వుండదు. అందువల్ల ఆ మధ్య పొట్ట బాగా పెరిగింది. ఈమధ్య మెరుగు అవుతున్నా కాబట్టి పొట్ట కూడా తగ్గిస్తున్నాను.

  నేను ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత బుల్లి బొజ్జ నాకు వుంటూనే వుంటుంది. అలా అని ఎక్కువ ఎక్సరసైజ్ చేసి అది తగ్గిద్దామంటే నాకు ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ వస్తుంటుంది.

  ReplyDelete
 8. గురువు గారు..

  కాయ వస్తాడు..మీ పొట్ట పై కామెంటు చేస్తాడు అని మీ బ్లాగ్ వెయిట్ చేస్తున్నట్లుంది..

  చేయకపోతే ఒక బాధ.. ఎక్కువ చేస్తే మరో బాధ.. నాకు తెలిసి మీరు రసాలు పక్కన పెడుతున్నారని నాకు అనిపిస్తున్న విషయం..(నాలో అనుభవం ప్రకారం గమనించిన విషయం..) అంటే.. జీవ కళ ఉట్టిపడేలా ఉన్నప్పుడు నా శరీరం తనంతట తానే (అంటే కొన్ని నెలల్లో) అద్భుతమైన ఫాం్ లో ఉంటున్నది ..

  ఎక్సర్సైజులు కావు కని.. మా ఆఫీస్ లో యోగా సెషన్ చాలా ప్రశాంతత, ఎలైవ్ నెస్ ఇచ్చింది.. మీరు కూడా యూ ట్యూబ్ లో అలి కామెనోవ అనే ఆమె యోగా చూడండి ..చాలా బాగా చేపిస్తుంది..

  ఇంకా ఆడుతు పాడుతు ఈజీ గా ఉండగలగటం కూడా మరో ముఖ్య మైన విషయం (నా అనుభవం) .. కొందరు ప్రక్కవారు హుందా గా ఉండకుండా మనలో అలజడి కి కారణం అవుతుంటారు.. అది కూడా సింపుల్ గా ప్రశాంతంగా గమనిస్తూ వ్యవహరించ గలిగితే మనం నిశ్చలంగా అలజడికి లోను కాకుండా ఉండొచ్చు..

  ఇక రసాలు అవే ఊరుతయ్.. పొట్ట అదే పోతుంది.. మన ఓషో విధానాల వల్ల నాకు కుదిరిన విషయాలు ఇవి..

  ReplyDelete