రెండు గంటలు జిమ్మా డాడీ?!

నాతో షాపింగ్ కి వెళ్ళడానికని ఇంట్లో మా అమ్మాయి ఎదురు చూస్తోంది నిన్న. నేను ఎంతకూ జిమ్ము వదిలి రానే. అందుకే ఇంటికి వచ్చాకా అలా అడిగింది. 45 నిమిషాలు ట్రెడ్‌మిల్ మీద పరుగు, ఆ తరువాత అరగంట బరువులు ఎత్తడం, ఆ తరువాత 20 నిమిషాలు హైడ్రో మాసాజ్. మిగతా సమయం రావడం, వెళ్ళడం వగైరా.  అలా చెప్పి ఊరుకున్నానా? ఊహు. మరింత వివరించాను. The West Wing  series చూస్తూ ఆ ఎపిసోడ్ అయిపోయేదాకా పరుగెత్తుతానని చెప్పాను. హైడ్రో మసాజ్ చేయించుకుంటూ హాయిగా చిన్న కునుకు తీస్తా అని కూడా చెప్పాను. తను ఏదో పంచ్ డైలాగ్ వేసింది కానీ గుర్తుకులేదు. 

షాపింగుకి వెళ్ళి అలాగే వాల్‌మార్ట్ కి వెళ్ళాం. అక్కడ కలబంద జ్యూసు (Aloe Vera juice) బాటిళ్ళు కనిపించాయి. ఇదివరకు తాగితే నచ్చింది. అప్పటినుండి వెతుకుతున్నాం దానికోసం. మూడు బాటిళ్ళు తెచ్చుకొని చెరో బాటిలూ తాగేసాం. మీరు ఎప్పుడన్నా తాగారా అదీ? మాకయితే బాగా నచ్చుతుంది ఆ రసం. చాలా ఫైబర్ వుంటుంది. ఆరోగ్యానికి కూడా ఆ జ్యూసు చాలా మంచిది. 


స్టాక్స్ మీద మంచి పుస్తకం సూచిస్తారా?

'రిచ్ డాడీ - పూర్ డాడీ' పుస్తకం మరో సారి తిరగేసాకా స్టాక్స్ మీదకు ఆసక్తి మళ్ళింది. అనగా ఆ దురద మొదలయ్యింది. స్టాక్స్ అనగా ఇప్పటిదాకా నాకు అది ఓ బ్రహ్మ పదార్ధం. ఏవీ అర్ధం కాదు. స్టాకులల్లో అందరూ మునిగిపోయామని చెప్పినవాళ్ళే కానీ సంపాదించామని చెప్పినవారు ఒక్కర్నీ చూడలేదు. అయినను నేనూ స్టాక్సులో పెట్టుబడి పెట్టితీరవలె! ఎంతున్నాయి డబ్బులు, ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అనే కొంటె ప్రశ్నలు మాత్రం అడక్కండేం. 

సో, నాలాంటి డమ్మీస్ కోసం ఓ మాంఛి పుస్తకం సూచించండి మరి.  

బ్లాగర్లూ...బ్లాగాభిమానులూ...

... మనం కలుసుకుందామా? US మరియు కెనడాలో వున్న బ్లాగర్ల వరకు మాత్రమే అడుగుతున్నాను. 

మా పూణే పిజి స్నేహితులం కలిసి రియూనియను కోసం ఈ ఏడాది చివర్లో మెక్సికోకి క్రూయిజ్ వెళ్దామనుకుంటున్నాం. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి కుటుంబాలతో సహా కలుస్తున్నాం. కొంతమందికి ఇలా కుటుంబాలతో కలిసి రావడం ఇష్టం లేదు కానీ ఇంతకుముందే అలా నిర్ణయించినందువల్ల అలా అని కొంతమందిమి మా ఇళ్ళళ్ళో పెళ్లాలకి చెప్పేసాం. ఇప్పుడు వాళ్ళని వద్దంటే వాళ్ళు మా తాట తీస్తారు! అందుకే ఈసారికయితే ఇలా కానిచ్చేద్దామని నిర్ణయించాం. మూడేళ్ళ క్రితం మా తొలి రియూనియన్ లాస్‌వెగాస్ లో జరిగింది. అప్పుడు పెళ్ళాలు లేరు కాబట్టి పండగ చేసుకున్నాం . ద్వందార్ధాలు తీయండి ఫర్వాలేదు కానీ విపరీతార్ధాలు తీయకండేం.

అలాగే మనం కూడా కలుసుకుంటే ఎలా వుంటుందని ఒక ఆలోచన మళ్ళీ వచ్చింది. కొంతకాలం క్రితం ఇలా ప్రస్థావించాను కానీ కొసకు వెళ్ళలేదు అది. ఆసక్తి వుంటే చెప్పండి. ఎక్కడన్నా అందరం కలుద్దాం. అందరం అంటే ఇది తొలిసారి కాబట్టి ఎక్కువమంది రారు లెండి. మహా అయితే నలుగురయిదుగురు. ఎక్కువ ఖర్చు లేకుండా ఎవరి ఇంట్లో అయినా ఏర్పాటు చేస్తే బావుంటుంది.  ఎవరికయినా అలా వీలయితే చెప్పండి. నేను దీనికోసం యుఎస్ లో ఎక్కడికయినా రావడానికి సిద్ధం. మా కుటుంబం ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా అప్పుడు వీలయితే మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను. లాస్‌వెగాస్ లాంటి ప్రాంతాల్లో కలుద్దాం అని అన్నా కూడా రెడీ కానీ అలాంటప్పుడు ఒక భవనం అద్దెకు తీసుకోవాల్సి వుంటుంది కాబట్టి ప్లానింగ్ అదీ కష్టం. ముందు దానికి నేను డబ్బులు చెల్లించి ఆ తరువాత మీరు రాలేకపోయారనుకోండి - నాకు బొక్క. ఇంకా ఎక్కడ కలుసుకుంటే బావుంటుందో చెప్పండి. మరీ ఎక్కువమంది ఆసక్తి చూపించకపోయినా ఇద్దరం ముగ్గురమయినా నేను రెడీ. 

మనం ఎంచక్కా ఒక రెండు మూడు రోజులు బ్లాగుల గురించీ, ఇతర విషయాల గురించి తింటూ తాగుతూ కబుర్లాడుకోవచ్చు. ఏమంటారు? కొద్దిమంది అయినా ఆసక్తి అంటూ చూపిస్తే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే వివరాలు తరువాత మాట్లాడుకోవచ్చు. ఆడలేడీ బ్లాగర్లూ, బ్లాగాభిమానులూ ఇలా కలిసేందుకు ఇప్పుడే సిద్ధపడతారని ఇప్పుడే ఆశించలేను కానీ ఎవరయినా ముందుకు వస్తే సంతోషమే. 

అప్రస్థుత ప్రసంగం: మేడసాని - అల్లసాని - సాని

ఓ బ్లాగాభిమాని నాకు బాగా మిత్రులయ్యారు. నిన్న రాత్రి మా ఇంటికి కుటుంబసహితంగా వచ్చారు. భోజనాల వేళ ఈ విషయం చెప్పారు. తన యుక్త వయస్సులో మొదటిసారి ఒక అష్టావధానం చూసారట. అది మేడసాని మోహన్ గారిది.  అప్పుడు అప్రస్థుత ప్రసంగం కోసం ఇది వ్రాసి పంపించారుట "మేడసాని వారూ, మీకు అల్లసాని వారు కానీ గానీ, సాని వారు కానీ బంధువులా (లేక పరిచుతులా)?". ఖచ్చితంగా గుర్తుకులేదు కానీ  మొత్తమ్మీద అలాంటి అర్ధం వచ్చే విధంగా అడిగారుట. అలా ఆ ప్రశ్నలో మేడసాని వారిని అల్లసాని వారంత గొప్ప వారిని చేసి మళ్ళీ సాని దగ్గర కుదేసారుట.  ఆయన ఏం సమాధానం ఇచ్చారో మా మిత్రుడికి గుర్తుకులేదట కానీ 'నూనూగు మీసాల నూత్న యవ్వనం లోనే నీకు సానిపై మనసాయనా!' అని మేడసాని వారు సరదాగా అన్నారుట. మిగతావాళ్ళంతా ఈ ప్రశ్న అడిగిందెవరబ్బా అని ఆసక్తిగా ఇతగాడి వైపు చూసి భళా అన్నారుట.

కొన్నేళ్ళ క్రిందట మోహన్ గారిని ఒక చికాగో తెలుగు సంఘం పికినిక్కులో చూసాను, వారి ప్రసంగం విన్నాను. ఎందుకో నాకు వారు అంతగా నచ్చలేదు. ఎందుకో గర్విష్టి అనిపించింది. నా అభిప్రాయం పొరపాటు కావచ్చు. 

ఇంతవరకూ నేను ఏ అవధానమూ చూడలేదు. చూడాలని వుంది. మీరు చూసారా? 

తింటే ఆయాసం - తినకపోతే నీరసం - మరి ఎప్పుడు వ్యయామం?

సాధారణంగా ఇంటికి వెళ్ళగానే భోజనం చేస్తాను (ఈమధ్య అలా కాదులెండి - తరువాత వివరిస్తాను ). ఏదో ఒక అల్పాహారం తినేసి కాస్సేపయ్యాకా వ్యాయామానికి వెళ్ళవచ్చు కదా అని నా దిక్కుమాలిన అంతరాత్మ ఘోషిస్తూనే వుంటుంది కానీ వింటే కదా మనం. ఉదయమే పెందరాళే మన ఎంటీవోడు లేచినట్లుగా మధ్యరాత్రి మూడింటికే బ్రహ్మ ముహూర్తాన్నే లేచి వ్యాయామానికి వెళ్ళొచ్చులే అని నా అంతరాత్మని బజ్జో పెడతాను. ఏవేవో కారణాల వల్ల సరిగ్గా రాత్రి నిద్ర పట్టకపోవడమో లేక ఎక్కువగా నిద్ర పట్టడమో జరిగేసి ఉదయం వ్యాయామం సంగతి మీ దేవుడు ఎరుగు కానీ నన్ను నేను తన్నుకొని ఆఫీసుకి వెళ్ళడమే గగనం అవుతుంది. నన్ను మా ఆవిడ గారు తన్ని లేపరు - అదో అదృష్టం - నన్ను నేనే తన్నుకొని లేవాలి. 

అయితే అది ఇదివరకు సంగతి. ఇప్పుడు అలా కాదు. ఇంటికి రాగానే మా ఆవిడ సిద్ధం చేసి ఉంచిన గ్రీన్ స్మూతీ తాగేసి కొన్ని పళ్ళు కానీ సెరియల్ కానీ తీసుకుంటాను. ఆ తరువాత వ్యాయామానికి వెళతాను. అయితే వ్యాయామానికి వెళ్ళాలని ఎందరో అనుకుంటారు కానీ కొందరే క్రమం తప్పకుండా వెళతారు. వ్యాయామానికి వెళ్ళాలని నిర్ణయించుకోవడమే, ఆ దుస్తులు, షూసూ వేసుకోవడమే కష్టం కానీ ఆ తరువాత చాలావరకు ఆటోమేటిగ్గా జరిగిపోతుంటుంది. జిమ్ముకి వెళ్ళడం, ఎంచక్కా అక్కడ కష్ట పడటం, ఎంతో మంచిగా ఫీల్ అవడమూ అలా అలా అవలీలగా జరిగిపోతుంటాయి. మరో సారి వక్కాణిస్తాను. వ్యాయామానికి అప్పుడు వెళ్ళాలని నిర్ణయించుకోవడం మాత్రమే కష్టం. రిచ్ డాడీ - పూర్ డాడీ పుస్తకంలో రాబర్ట్ కవసాకీ కూడా ఇదే విషయం చెబుతాడు.

ఇంకో విషయం ఏంటంటే గొప్ప సౌకర్యాల కోసం, కొంత అసౌకర్యం భరించకుండా ఏదీ కుదరదు. ఈ విషయం మనం గట్టిగా గుర్తిస్తే ఆ అసౌకర్యాన్ని అవలీలగా అహ్వానిస్తాం. జిమ్ముకి వెళ్ళాలనుకోవడం అసౌకర్యవంతమయిన విషయం - కానీ వెళ్ళి వచ్చాకా ఎంత బావుంటుందీ? అలాగే చెత్త ఆహారం బదులు మంచి ఆహారం తీసుకోవడం అంత సులభం కాదు కానీ కొద్దిగా అసౌకర్యం భరించాలి. ఈ విషయాన్ని కూడా ఆ పుస్తకంలో రాబర్ట్ కవసాకీ చెప్పాడు. ఈ విషయం మనకు ఇదివరకు తెలియదా? తెలుసు. కానీ అతను ఇంకా స్పష్టీకరించాడు. ఆ విషయం అర్ధమయ్యాకా, ఆ చిట్కా తెలిసాకా ఆ అసౌకర్యాన్ని ఎదుర్కొవడానికి మానసికంగా ముందే సిద్ధ పడుతూ అవలీలగా దాటేస్తున్నాను. ఉదాహరణకి ఆఫీసు నుండి ఇంటికి వచ్చే ముందే రా వెగాన్ ఫుడ్డు మాత్రమే ఈ రోజు కూడా తీసుకొవాలని, అటుపై వ్యాయామానికి వెళ్ళాలని పదేపదే అనుకుంటాను. కొద్దిరోజులు అలా చేస్తే మన మనస్సుకి అలవాటయిపోతుంది.

అయితే నిన్న జిమ్ముకి వెళ్ళలేదు - ఎందుకంటే మొన్న వెళ్ళాను కాబట్టి. వెయిట్స్ రోజూ చెయ్యకూడదు - మంచిది కాదు - రోజూ చేస్తే ఓవర్ ట్రైనింగ్ అవుతుంది.

అలాగే ఇదివరలో ఆసక్తి, ఓపిక, తీరికా వుంటే తప్ప వ్యాయామానికి వెళ్ళేవాడిని కాదు. అలా అన్ని ఎప్పుడు కుదుర్తాయండీ? ఎప్పుడో ఒకప్పుడు. అందువల్ల క్రమం తప్పేది. ఇప్పుడలా కాదు. అన్నీ చేసుకొని వెళుతున్నాను. చెప్పా కదా. జస్ట్ మనం వెళ్ళాలని నిర్ణయించుకోవాలంతే - మిగతావన్నీ మనని అనుసరిస్తాయి - అవేనండీ  ఆసక్తీ, ఓపికా, తీరికానూ.  

సగం ఓకే బంగారం

ఓకె బంగారం సినిమా సగం వరకు మాత్రం బాగా నచ్చింది. విశ్రాంతి తరువాత కునుకులు తీస్తూ మా వాళ్ళు లేపుతుండగా మధ్యమధ్యలో చూసాను. విశ్రాంతి తరువాత సినిమా కాస్త బోరింగుగా వుండటం, రాత్రి 10:30 గంటల సినిమాకి వెళ్ళడం వల్ల ఎంచక్కా కునుకులేసేశాను. 

విశ్రాంతి వరకూ నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. ఆ తరువాత మాత్రం నన్నడక్కండి - ఎందుకంటే ఆ తరువాత నేను సరిగ్గా చూడలేదు కదా.  

మీ వోటు ఎవరికీ?

హిల్లరీ క్లింటన్ 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుందంట. అమెరికా అధ్యక్ష పదవిలో ఒక మహిళను చూడాలని నేను ఉవ్విళ్ళూరుతున్నా ఎందుకోగానీ హిల్లరీ అంతగా నాకు నచ్చదు. ఆమె గొప్ప పదవులు చేపట్టివుండవచ్చును గానీ అంత గొప్ప పనులు ఏం చేసిందబ్బా? పోనీ అందగత్తెనా అదీ కాదూ. 

ఆమెకు బదులుగా మోనికా లెవెన్‌స్కీ కి నా వోటు. ఈమెను ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఇంతకీ ఈవిడెవరూ అని ఎవరయినా అడుగుతున్నారా?! హ్మ్. హెంత హమాయకులండీ మీరూ. నేను చెప్పలేను బాబూ. మీరే తెలుసుకోండి. చాలా గొప్పగొప్ప పనులు చేసింది తను. అందుకే నా వోటు ఆమెకే. నేనేదో ఎగతాళిగా అనట్లేదు - మనస్ఫూర్తిగానే అంటున్నాను. పైగా ఎంత అందగత్తె తనూ. 

మరి మీ వోటు ఎవరికి? అమెరికాలో మాకు వోటు లేదు కదా అని సందేహించకండి - నాకు మాత్రం వుందా ఏంటీ - సరదాగా చెప్పండంతే. 

లింక్: అందానికి అర్ధం ఇదీ

శాస్త్రీయంగా అందం అంటే ఇలా వుంటుందిటా..

http://www.cnn.com/videos/living/2015/04/02/orig-faces-of-beauty-study.cnn

పచ్చి పచ్చని ఆహారం అలా అలా నడిపిస్తున్నాం

కొన్నివారాల క్రిందట రా వెగన్ ( Raw vegan) ఫుడ్ లైఫ్ స్టైల్  ప్రయత్నిస్తున్నామని చెప్పా కదా.  ఉదయమే నానబెట్టిన శనగలు అల్పాహారంగా తీసుకుంటాను. మధ్యాహ్నం ఇంకా మామూలు భోజనమే నడిపిస్తున్నా. మరీ ఒకేసారి అన్నీ మారిస్తే నా శరీరం ఎదురుతిరగవచ్చునని నెమ్మదిగా అలవాటు చేస్తున్నా. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే గ్రీన్ స్మూతీ తాగేస్తాను. ఆ తరువాత లెక్క ప్రకారం మొలకలు తినాలి కానీ ఎక్కడా అంతవరకు నానబెట్టినవి నేను వుండనిస్తే కదా. రుచిగా వుంటున్నాయని మొలకలు రాకముందే నానబెట్టిన పెసళ్ళు లాగేస్తున్నాను. ఆ తరువాత పళ్ళు, ఆ తరువాత కీన్వా (Quinoa) తో కొద్దిగా భోజనం.  ఇంకా పచ్చి కూరగాయలు మొదలయినవి పెంచాల్సివుంది. 

కాస్త బొజ్జ తగ్గుతున్నట్టు అనిపిస్తోంది. నా శరీరం తగిన మోతాదులోనే వుంటుంది కానీ కాస్త బొజ్జ మాత్రం వుంటుంది. ఇలా అయినా సరే దాని పని పట్టాలి. రెండు వారాల క్రితం బెల్ట్ మూడో రంధ్రం దగ్గర పెట్టుకునేవాడిని. ఇప్పుడు మొదటి రంధ్రం దగ్గరే పెట్టేసుకుంటున్నా. అదీ అభివృద్ధి. పాలు, పెరుగు, గోధుమ ఆహారం తగ్గించాను. గోధుమ, బార్లీ లాంటి వాటిల్లో గ్లుటెన్ వుంటుంది. అది చాలామందికి పడవు కానీ వారికి ఆ విషయం తెలియదు. అందువల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మీకు ఆరోగ్యం మీద ఆసక్తి మెండుగా వుంటే గ్లుటెన్ ఇంటోలరెన్స్ గురించి తెలుసుకోండి. అందుకే అవి దూరం పెట్టమని కొందరు సలహా ఇస్తుంటారు - మా డాక్టరుతో సహా. 

మా ఆవిడకి ఇలాంటి మంచి విషయాలు తొందరగా ఎక్కవు. అందువల్ల వీటిల్లో కొన్ని మాత్రం పాటిస్తోంది.  

మా అమ్మాయికి స్కూల్ నుండి రాగానే గ్రీన్ స్మూతీ ఇస్తున్నాం. అందువల్ల తన యొక్క ఆకలి బాగానే తగ్గుతోంది. సాయంత్రం, రాత్రి చిరుతిళ్ళుతినడం తగ్గించింది. కిన్వా తినమంటే ఒక రెండు రోజులు వాయిదా వేసింది. తనకు ఊబకాయం వుంది - ఇలా అయినా అది తగ్గుతుందేమో అని మా ప్రయత్నం.  కిన్వాలో పీచు (ఫైబర్) బాగా వుంటుంది కాబట్టి కొద్దిగా తింటేనే కడుపునిండుతుంది. అది వండేటప్పుడు బాగా కడిగి వండాలి. లేకపోతే ఆ గింజల మీద వుండే saponin వల్ల చేదుగానూ, జిగురు గానూ అవుతుంది.

- Whole Foods market కు వెళ్ళి ఆర్గానిక్ ఆకుకూరలూ, దుంపలూ, తృణ ధాన్యములూ, కోల్డ్ ప్రెస్స్డ్ జ్యూసులూ, వగైరాలూ తెచ్చాను. వగైరాల రుచి ఎలా వుంటుందని మాత్రం అడక్కండేం. ఏదో ఫ్లోలో అలా వ్రాసా.
- రా చక్కెర కూడా తెచ్చా. ఏవో కొన్ని తప్ప మన ఆహార పదార్ధాలలో తెలుపు తగ్గించాలండోయ్. వివిధ కారణాల వల్ల అది మంచిది కాదు.
- జ్యూసులూ, నూనెలూ లాంటివి ప్రాసెస్డ్ వి కాకుండా కోల్డ్ ప్రెస్డ్ వి అయితే మంచిది. మామూలు జ్యూసులలో పీచు (ఫైబర్) వుండదు కాబట్టి పళ్ళు తినడం ఉత్తమం. అయితే కోల్డ్ ప్రెస్డ్ వాటిల్లోని పీచు ఎటూపోదు కాబట్టి అవి ఓకే.

S/o సత్యమూర్తి సినిమా - మా దంపతుల రేటింగ్ 2.5/5

త్రివిక్రమ్ కి తెలివి ఎక్కువయ్యి తీసిన సినిమా ఇది. ఆశించినంత గొప్పగా లేదు. కొత్త కథ అనుకున్నట్టున్నారు కానీ నస పెట్టే కథ. నిత్యా మీనన్ కోసమైనా చూడొచ్చనుకొని వెళ్ళాను కానీ లావయ్యింది - పాత్ర పరిమితం - అసలు ఆ పాత్ర ఆమెకు అనవసరం. ఆమె బదులుగా ఎవరు నటించినా నడుస్తుంది. 

పెళ్ళాలను తీసుకెళ్ళాలా వద్దా?!

మా PG విద్యార్దుల రియూనియన్ మూడేళ్ళ క్రితం లాస్ వెగాసులో జరిగింది. అదో sin city. అందువల్ల అక్కడేం జరిగింది, ఏం చేసాం అన్న విషయాలు మీరు అడగనూ వద్దు - నేను చెప్పనూ వద్దు. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడి విషయాలు అక్కడే మరచిపోవాలని ఓ అనధికార నియమం.  మూడేళ్ళ తరువాత మళ్ళీ కలవాలని అప్పుడు నిర్ణయించాం.

చూస్తూండగానే ఆ మూడేళ్ళూ అయిపోయాయి. మళ్ళీ అందరమూ ఎక్కడో ఒకచోట కలవాలి. బాగానే వుంది కానీ కొందరు సభ్యులు కుటుంబాలతో సహా కలుద్దాము అంటున్నారు. ఏలేశ్వరం వెళ్ళినా శనీశ్వరం ఎందుకన్నట్లు కొందరేమో పెళ్ళాలని పట్టుకు రావద్దంటున్నారు. కలిసేదే ఆనందంగా గడపడం కోసం మళ్ళీ వాళ్ళు వస్తే ఇంకేం ఆనందం అని కొందరు జల్సా రాయుళ్ళు వాపోతున్నారు. తమ భార్యలని తీసుకెళ్ళకపోతే ఇంట్లో వీపు విమానం మోత మోగే అవకాశాలున్న భర్తాగ్రేసరులేమో  పట్టుకువస్తాం బాబూ అని వాపోతున్నారు. నేనేమో ఒక కాలు అటూ ఒక కాలు ఇటూ వేసినట్టుగా మాట్లాడుతున్నాను. ఇలా మా కాన్‌ఫరెన్స్ కాల్స్ లో ఈ విషయం ఎటూ తెగడం లేదు.    
కుటుంబాలతో సహా రియూనియనుకి వెళ్ళాలనుకుంటున్నాం అని అంటే నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా నవ్వుతున్నారు :( మీ రియూనియనుకి వాళ్ళెందుకు - మీ ఎంజాయ్మెంట్ స్పాయిల్ చెయ్యడానికా అంటున్నారు. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే పరిస్థితేంటో మీకు తెలుసుగా అని హెచ్చరిస్తున్నారు! వచ్చే క్రిస్మస్ సెలవులు, న్యూ ఇయరూ క్రూయిజులో గడపాలని ఒక ఆలోచన. పాటలూ అవీ ఇవీ పెట్టి హోరిత్తిద్దామని ఒకరు అన్నారు. రికార్డింగు డ్యాన్సులూ గట్రా పెట్టాలని నేను సెలవిచ్చాను. మేజువాణీ (పదం కరెక్టేనా?) పెడితే ఎలా వుంటుందని ఇంకెవరో అన్నారు. మన ఆడాళ్లంతా వస్తే ఇవన్నీ జరిగే పనులేనా అని మరొకరు ఉసూరు మన్నారు.

మన ఆడలేడీస్ వుంటే ఇంకేం ఫ్రీ గా వుంటాం. పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా ప్రవర్తించాలి, పద్ధతిగా తాగాలి, పద్ధతిగా పోట్లాడాలి - ఆ మాత్రం దానికి అక్కడిదాకా ఎందుకు అని మరి కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. వాళ్ళకు కూడా మన అందరినీ కలవాలని వుంటుంది కదా అని భార్యావిధేయులు వాదిస్తున్నారు. అబ్బా వాళ్ళు వాళ్ళు వాళ్ళ రియూనియన్లకి వెళ్ళొచ్చుగా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఇలా మాలో మేము కొట్టుకుఛస్తున్నాం. నాకేమో ఓ సారి ఈ కుటుంబాలని రియూనియనుకి తెచ్చేస్తే పరిస్థితి అందరికీ అర్ధమయిపోయి తెనాలి రామలింగడి పిల్లి వ్యవహారం (కథ తెలుసునా లేక చెప్పాలా?లా అయిపోయి మరోసారి మరెవ్వరూ పెళ్ళాలని పట్టుకువస్తామని ఛస్తే అనరు కదా అని కుట్రపూరితంగా ఆలోచిస్తున్నాను.

మీరేమంటారేంటీ?

దీప్తి ఎక్కాడ?

వ్రాయడానికి ఏమీ తోచక ఇది వ్రాస్తున్నా...

ఈమధ్య ఇక్కడ మా ఫ్రెండ్సూ నేను కలిసి అప్పుడప్పుడు వాలీబాల్ ఆడుతూవుంటాం. ఒకరోజు వెళ్ళలేదు. ఆ రోజు నలుగురు తెల్లమ్మాయిలు వచ్చారనీ, తమతో భలే బాగా ఆడారనీ టెక్ష్ట్ ఇచ్చారు. ఇదీ దీప్తి లాంటి కథేనా అని వాళ్ళకు ఒక చిన్న స్టోరీ పంపించాను. 

కట్ చేస్తే ముప్ఫయ్ ఏళ్ళ క్రిందటి విషయం ఇది. నేనూ, మా బంధువుల అమ్మాయిలు ఇద్దరూ, ఇంకా ఇతర పిల్లలూ వగైరా కలిసి మా పెద్దక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాం. ఆ అమ్మాయిలకి వరుసకి నేను బాబాయిని అవుతాను కానీ చాలా ఫ్రెండ్లీగా వుంటాము. అక్కడ వాళ్లకు తెలిసిన వారి ఇంటికి వెళదామని ఆ సాయంత్రం అన్నారు. నేను ఎంతమాత్రమూ ఆసక్తి చూపించలేదు ఎందుకో గానీ. అప్పుడు నా సంగతి తెలిసిన వాళ్ళు ఓ చిన్న ఆశ పెట్టారు. ఆ ఇంట్లో ఇంటర్ చదువుతున్న ఓ అందమయిన అమ్మాయి వుంటుందని, ఆమె పేరు దీప్తి అని చెప్పి ఊరించారు. అప్పుడు నేనూ ఇంటర్ చదువుతున్నా. ఉత్సాహంగా ఆ ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఆ ఇంటికి బయలుదేరాను. 

వెళ్లగానే ఇంటిముందే దీప్తి దర్శనం ఇస్తుందేమోనని చూసాను కానీ అబ్బే లేదు. లోపలికి వెళ్ళి కూర్చున్నా కూడా కనిపించలేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు ముసలక్కలు వున్నారు. వాళ్ళతో వీళ్ళు కబుర్లాడుతుంటే గుసగుసగా అడిగాను 'దీప్తి ఏదీ' అని. వుంది, 'లోపల టీ చేస్తోందీ' అని వాళ్ళూ గుసగుసగా చెప్పారు. దీప్తి కోసం అలాగే ఎదురుచూస్తూ కూర్చున్నాను. ఇంకా రాలేదు.

దీప్తి ఎక్కాడ? 

ఈరోయిన్ను ఎక్కడా?

కన్సాసులో నెమ్మదిగా వీడియో చిత్రాలు నిర్మిద్దామని సులేఖాలో ఒక ప్రకటన ఇచ్చాను. ముగ్గురు స్పందించారు. వచ్చి కలిసారు. అందులో ఒకతను సినిమాటోగ్రఫీలో న్యూయార్కులో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇంకొకతను వాళ్ళన్నయ్య శ్రీను. అతను వ్యాపారస్థుడు. కన్సాసులో ఏవో కొన్ని దుకాణాలు వున్నయ్ - దాంతోపాటే కొన్ని డబ్బులూ వున్నయ్. సినిమా నిర్మాణం మీద అతనికి ఆసక్తి. (ఈమధ్యే వాళ్ళు 'వెల్‌కమ్ టు అమెరికా - ఇంటర్ జంప్ అయినా' అనే సినిమా నిర్మించారు కానీ ఇలాంటి సినిమాలు విడుదలకు నోచుకోవడం కష్టం లెండి. కథ, డైరెక్షను గట్రా అతనిదే. తన పేరు US శ్రీను అని పెట్టుకున్నట్టున్నారు). ఇంకొకతని పేరు రాజు. అతనికి సినిమాల్లో నటించాలని - వీలయితే హీరోగా రాణించాలని బాగా కోరిక. బాగానే వుంది కానీ ఆడాళ్ళు ఎవరూ స్పందించలేదు. మరి ఈరోయిన్ను ఎట్టా చెప్మా? 

అందుగ్గాను ఒక బ్రహ్మాండమయిన ఐడియా వచ్చింది నాకు. నా 'ఎవరు?' నవలలో ఒక జంట కేవలం ఫొనులో మాట్లాడుకుంటారు. వాళ్ళ కథ 15 నిమిషాలకు మించి రాదు. ట్రయల్ గా ఆ కథ వీడియో చిత్రంగా తీద్దామని నిర్ణయించుకున్నాం. ఫోనులోనే మాట్లాడుకుంటారు కాబట్టి హీరోయిన్ లేకపోయినా కథ నడుస్తుంది. కేవలం మా హీరోగారిని మాత్రమే ఫోను పట్టుకొని మాట్లాడుతున్నట్టు చూపిస్తాం. లేకపోతే ఏం చెయ్యమంటారు చెప్పండి - నేను ఆ ఆడవేషం వెయ్యలేను కదా! సరే, ఇదేదో బానే వుంది కానీ కనీసం హీరోయిన్ కంఠం అయినా కావాలి కదా. దానికి పరిష్కారం వీజీగానే దొరికింది. 

అది ఎలా అంటే ఇండియా నుండి వచ్చి మా క్లయింట్ దగ్గరే పనిచేస్తున్న వీరేశం నా గదిలోనే కొన్ని నెలలుగా వుంటున్నాడు. ఒక రోజు ఇద్దరం ఫుల్లుగా మందు పుచ్చుకున్నాకా హీరోయిన్ గురించీ, హీరోయిన్ కంఠం గురించీ నా అవస్థలు భోరుభోరున తనకి విన్నవించుకున్నాను. మనోడికి పెళ్ళి అయ్యింది కానీ పెళ్ళాం ఇండియాలోనే ఏదో గవర్నమెంట్ టీచరుగా పనిచేస్తోంది. 'నువ్వేం బెంగపడకు బ్రదర్ - వాయిస్సే కదా - మా ఆవిడని ఒప్పిస్తాగా' అని ముద్దుముద్దుగా ముద్దముద్దగా చెప్పాడు. అప్పటికి నాలుగో పెగ్గు మీద వున్నానేమో నాకు యమ సంతోషం వేసింది - సమస్యకి ఓ పరిష్కారం దొరికింది కదా అని. ఆనందంగా మరో రెండు పెగ్గులు లాగించి ఓ మూడు పెగ్గులు మనోడికి తాగించి తృప్తిగా బజ్జున్నాను. మర్నాడు మనోడు ఆ ఊసే ఎత్తడే! 'బ్రదర్ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతావా?' అంటే 'ఎందుకూ?' అంటాడేమిటండీ? 'రాత్రి ఏదో కమిటయ్యావు కదా బ్రదర్' అని నెమ్మదిగా గుర్తుకుచేసా. ఇప్పుడు మందు మత్తు దిగింది కదా 'అబ్బే, మా ఆవిడ అలాంటిది కాదు బ్రదర్ ' అన్నాడు తాపీగా. వార్నీ, వీడి దుంపతెగ అనుకున్నాను. మందు మీద ఓ మాట - మందు దిగాక మరో మాటనా అని నిశ్శబ్దంగా నా నోట్లో పళ్ళు నేను నూరుకున్నాను కానీ ఇంకేమీ చెయ్యలేకపోయాను. 

ఇదిలా నడుస్తుండగా ఈమధ్యలో మా హీరోగారికి ఒక జ్ఞానోదయం అయ్యింది. 'ఠాఠ్ - హీరోయిన్ను లేకుండా సిన్మా ఏంటీ - నేను వేషం వెయ్యను గాక వెయ్యను!' అని శ్రీనుతో  నాకు సందేశం పంపించాడు.  అలా అంటే నేను బెదిరిపోయి ఎక్కడినుండన్నా  కథానాయికని పట్టుకువస్తాని అని అతగాడి దింపుడుగల్లెం ఆశ. 'శరత్ అలా బెదిరిపోయేరకం కాదు - తనకి వళ్ళు మండిదంటే సిన్మా క్యాన్సిల్ చేస్తాడూ' అని శ్రీను హెచ్చరించారుట కూడా - అయినా అతను వినలేదు. నాకు నిజంగానే మండింది. అసలే వాళ్ళావిడ గురించి వీరేశం హ్యాండిచ్చినందుకు నాకు మండుతోంది - పైనుండి ఇతగాడొకడు. సినిమా స్టార్ట్ కాకముందే ఇతను ఇంత మొండిగా వుంటున్నాడు - ఇక తరువాత ఇంకెన్ని ఇబ్బందులు పెడతాడో అనిపించింది. సినిమా క్యాన్సిల్ అని అనౌన్స్ చేసాను. 'అబ్బెబ్బే, హీరోయిన్ లేకపోయినా ఫర్వాలేదు - సోలోగా నటనే బెటర్ బ్రదరూ' అని మళ్ళీ వచ్చాడు. ఠాఠ్ - కుదరనే కుదరదన్నాను. నా నిర్ణయం మార్చుకోను అని ఖరాఖండిగా చెప్పేసాను. అలా ఆ సినిమాకి శుభం కార్డ్ పడింది.

ఆ తరువాత అక్కడినుండే ఇండియాలో వీడియో చిత్రం తీయించాలని ప్రయత్నించాను కానీ ఇక్కడ వుండి అక్కడ తీయించడం చాలా ప్రయాస అని అర్ధమయ్యింది. అక్కడో డైరెక్టరుని పెట్టి రెండు మూడు రోజులు షూటింగ్ అయిందనిపించాము. ఈలోగా ఇక్కడ నా ప్రాజెక్ట్ అయిపోవడంతో డబ్బులు లేక అక్కడ ఆ ప్రాజెక్ట్ మూలకు పెట్టాల్సొచ్చింది. 

అటుపై షికాగోలో ప్రొజెక్ట్ రావడంతో కన్సాస్ నుండి వచ్చాను. అక్కడివాళ్ళు ఆ తరువాత కూడా సినిమా ప్రయత్నాలు చేసారు. రాజునే హీరోగా పెట్టి శ్రీను ఓ చిత్రం ప్రారంభించారు. హీరోయిన్ సమస్యని శ్రీను తెలివిగా తీర్చుకున్నాడు. రాజు వాళ్ళావిడతో మాట్లాడి మీరు హీరోయినుగా చెయ్యకపోతే మరో హీరోయినుని వెతకాల్సొస్తుంది - ఆ తరువాత ఇంకే పరిణామాలూ జరిగినా నా బాధ్యత లేదని తేల్చిచెప్పాడు. పాపం అమాయకురాలు - ఆమె బెదిరిపోయి వాళ్ళాయన పక్కన హీరోయినుగా నటించడానికి ఒప్పేసుకుంది. మరో హీరోయిన్ తన ముఖానికి దొరకడం కష్టం కనుక రాజు కూడా తన భార్యతో సంతోషంగా సర్దుకుపోయాడు. అయితే ఆ సినిమా ఎంతవరకు వచ్చిందీ - ఏమయ్యిందీ వివరాలు నాకు గుర్తుకులేవు.

ఆవలించిన మా ఈరో ఈరోయిన్లు

కొన్ని నెలల క్రితం నా సినిమా ప్రయత్నాల గురించి వ్రాసాను కదా. దాని తరువాయి భాగం ఇది. 

తుదిశ్వాస అనే బ్రెత్ కంట్రోల్ ప్లే (BCP) థీమ్ నవలని ఒక (వీడియో) సినిమాగా తీసే ప్రయత్నం ఇది. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో వారి అనుమతి తీసుకొని వారి ఇంటి తోటలో ఒక బుల్లి వీడియో కెమెరాతో షూట్ చేస్తున్నాం కానీ మరో పక్క ఆ ఎమ్మెల్యే గారి భార్యామణి మాదో దరిద్రపు సంత అన్న తరహాలో గులుగుతూ వుంది. పాపం మా సంగతే ఇలా వుంటే ఆ మాజీ సంగతి ఏంటో అనుకొని జాలి పడ్డాం. అప్పుడు ఆయన గారు అక్కడ లేరు లెండి.

ఆ నవల చాలా చక్కగా రొమాంటిక్ గా వచ్చింది కానీ ఎక్కువ పాత్రలు వుండవు. హీరో హీరోయిన్లే చాలా సేపు మాట్లాడేసుకుంటారు. ఆ డైలాగులు చిత్రీకరిస్తుంటే మా హీరో హీరోయిన్లు ఆవలించడం మొదలెట్టారు. అప్పుడు అర్ధమయ్యింది ఈ సినిమా భవిశ్యత్తు ఏంటో. నటిస్తున్న వాళ్ళకే ఆవలింతలు వస్తే ఇక ప్రేక్షకుల పరిస్థితి ఎలా వుంటుంది? ఆయా సంభాషణలు నవలగా బాగా పనికివస్తాయి కానీ సినిమాగా ఉపయోగపడవు అని అర్ధం అయ్యింది. అయినా సరే కష్టపడి తీస్తే ఎవరూ చూడని ఆర్ట్ సినిమా అవ్వచ్చు. ఆ రోజు షూటింగ్ అంతా అయిపోయాకా రాత్రి అంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మరుసటిరోజు ఉదయం మా టీం కు చెప్పాను - సినిమా క్యాన్సిల్ అని. సహజంగానే అందరూ విస్మయం చెందారు. వారికి పరిస్థితి వివరించాను. అందరికీ ముందుగా అనుకున్న ప్రకారం పూర్తిగా డబ్బులు చెల్లించాను. 

అన్నట్టు షూటింగ్ జరిగిన రోజు రాత్రి మా హీరోయిన్ గారు ఎటో వెళ్ళిపోయారు. ఎటెళ్ళిందబ్బా అని అనుకుంటుండగానే మా హీరో గారు కూడా మిస్సింగ్ అని తెలిసివచ్చింది. విషయం అర్ధం అయ్యింది. వార్నీ మా వాళ్ళు యమ ఫాస్టుగా వున్నారే అని మేము నవ్వుకున్నాం.

ఇక చతుర మాస పత్రికలో ప్రచురింపబడ్డ నా 'ఎవరు?' (Meta Fiction) నవల వీడియో ఫిల్మ్ గా తీస్తే ఎలా వుంటుందో ఆలోచించాను. అందులో ఎంతో మంది జంటలు, పాత్రలూనూ. అలా అది కష్టం. అలా కాకుండా ప్రాక్టీసు కోసం అందులోని ఒక జంట కథను మాత్రమే తీసుకొని ఫిల్మ్ గా తీస్తే ఎలా వుంటుందని కొద్ది రోజులు ఆ కథ మీద కసరత్తు చేసాను. వేరే కారణాల వల్లనూ మరియు నా దగ్గర పెద్దగా డబ్బులు లేనప్పుడు ఈ ప్రయాస అంతా ఎందుకని కూడానూ అప్పటికి ఈ సినిమా వ్యవహారాలు కట్టిపెట్టి కొద్ది వారాల్లో మళ్ళీ యుఎస్ కి వచ్చాను. 

యుఎస్ కి వచ్చాకా కొన్ని నెలలు బెంచ్ మీద వున్నాకా కన్సాస్ సిటీలో ప్రాజెక్ట్ వచ్చింది. అప్పటికి మా కుటుంబం ఇంకా ఇండియాలోనే వుంది. కాస్త తీరిగ్గానే వున్నా కదా అని మళ్ళీ సినిమా ఆలోచన చేసాను. నాకు తగ్గట్టుగానే నాకో మహా గొప్ప హీరో దొరికాడు. మా హీరో ఎంత గొప్పవాడంటే... ఇప్పుడెందుకు లెండి. అతగాడి విషయం మరో భాగంలో మరెప్పుడయినా చెబుతా. హీరోయిన్? అని అడుగుతున్నారా? సర్లెండి. మా హీరో కూడా అదే అడిగాడు లెండి!

అమరావతి బావుంది

ఏ NTR నగరో, తారకరామ నగరో, మరోటో కాకుండా ఆంధ్ర రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం బావుంది. నాకు బౌద్ధం అన్నా, బౌద్ధ క్షేత్రాలు అన్నా కూడా బహుళ ఆసక్తి. దాదాపుగా 25 ఏళ్ళ క్రితం విజయవాడ VK కంప్యూటర్సులో ఒకవైపు విద్యార్ధిగానూ, మరో వైపు ఉపాధ్యాయుడిగానూ పనిచేస్తున్న రోజుల్లో మా సహాధ్యాయులతో కలిసి అమరావతి దర్శించడం నాకు గుర్తుకువస్తోంది. ఆంధ్ర రాజధాని పేరు ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఈ పేరు పెడితే బావుండును అనుకున్నాను. అది నిజమయ్యింది.  సంతోషం. రాజధానికి చక్కని పేరు ఎన్నికచేసుకున్నందుకు గాను ఆంధ్రులకు నా అభినందనలు. 

దీపికా - అందుకో అభినందనలు

దీపికా పడుకొనే నా అభిమాన నటీమణుల్లో ఒకరు. తనకు వున్న మానసిక మాంద్యం గురించి బయటకి వెల్లడించడంలో గానీ, స్త్రీ స్వేఛ్ఛ మరియు స్త్రీ సెక్స్ కు సంబంధించి తన భావాలను వెల్లడించడంలో గానీ తన ధైర్యానికి నేను పులకించిపోయాను. అప్పట్లో ఖుష్బూ పెళ్ళికి ముందు శారీరక సంబంధాలలో తప్పేమీ లేదన్నప్పుడు ఎలాగయితే హర్షించానో ఇప్పుడు పెళ్ళయిన తరువాత కూడా వివాహేతర సంబంధాలతో పొరపాటు ఏమీ లేదన్న దీపికా పడుకోనే అభిప్రాయాలతో ఏకీభవిస్తూ అంత ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించినందుకు గాను మనసారా అభినందిస్తున్నాను. శృంగారంలో కూడా స్త్రీ తన స్వేఛ్ఛను వినియోగించుకున్నప్పుడే దానికి పరిపూర్ణత చేకూరుతుందని నేనూ విశ్వసిస్తాను.

నాతో పాటు ఆమె కోసం ఇంకెవరయినా చెయ్యి (?!) ఎత్తాలనుకునేవారు ఎత్తండి మరి. 

ఒయాసిస్

నాకు ఒయాసిస్సులు అంటే ఇష్టం. ఎడారి కథలు చదువుతున్నప్పుడూ, ఆ సినిమాలు చూస్తున్నప్పుడూ ఒయాసిస్సులు కనిపిస్తే సంబరం వేస్తుంటుంది. అంత పెద్ద ఎడారుల మధ్య ఒయాసిస్సులు వుండటం అనేది ప్రకృతి గొప్పదనం కదా. మనుషుల, జంతువుల దాహం తీరుస్తూ, తమ పచ్చికదనంతో అలసిసొలసిన శరీరాలను సేద తీరుస్తూవుంటాయవీ. అందుకే ఎడారి దారులు వాటి గుండా వెళుతుంటాయి. అయితే కొన్నిసార్లు మనుషులూ, జంతువులూ సూర్య కిరణాల వెలుగుని (mirage) చూసి ఒయాసిస్ అని భ్రమపడి నిరాశ చెందుతూవుంటారు.

ఈసారి వెకేషనులో ఒయాసిస్ చూస్తాననిఏమాత్రం ఊహించలేదు. మా మిత్రుడు సరాసరి దాని దగ్గరికి తీసుకువెళ్ళి ఇది ఒయాసిస్సు అని చెప్పేదాకా గుర్తించలేదు. నిజమే చుట్టూ మొజావే ఎడారి. రాళ్ళూ, పర్వతాలూ, పొదలూ, బీడు భూముల మధ్య ఓ చక్కటి వృక్షజాలం వున్న ప్రదేశం అదీ. అదే 'బిగ్ మొరాంగో కాన్యన్ ప్రిజర్వ్'! దానిలోపలి దాకా బోర్డ్ వాక్ వుంది. దానిమీద నడుచుకుంటూ చెట్ల పైరగాలిని ఆస్వాదిస్తూ, పక్షుల కిలకిలరావాలని ఆలకిస్తూ, ఫోటోలు తీసుకుంటూ వెళ్ళాము. ఈ నేచర్ వండర్ లో తిరుగాడుతూ ప్రకృతి యొక్క గొప్పదనాన్ని మనసారా మెచ్చుకోకుండా వుండలేకపోయాను. సమయం లేదుగానీ వుంటే అక్కడే ఏకాంతంగా కూర్చొని గడిపెయ్యాలని వుండింది. 

అయితే ఇది మా అమ్మాయికీ, మా ఆవిడకీ పెద్దగా నచ్చలేదు. ఇదో మామూలు చెట్లు, నీరు వున్న ప్రదేశం లాగానే భావించారు కానీ ఒయాసిస్సు యొక్క ప్రధాన్యతను గుర్తించలేకపోయారు. వివరించడానికి కొద్దిగా ప్రయత్నించాను కానీ వారి తలలకు అంతగా ఎక్కలేదు.  ఇహ వెళదామని తొందరపెట్టారు కాబట్టి అందులో నా పాదయాత్రను త్వరగానే ముగించక తప్పలేదు. మరుసటి రోజు లాస్ ఏంజిల్స్ లోని డిస్నీల్యాండుకి వెళితే మావాళ్ళు బాగానే సంతోషించారు. అటుపై లాస్ వెగాస్ వెళ్ళాం. ఆ ట్రిప్ ఎంత ఘనంగా జరిగిందో మున్ముందు మీకు వివరిస్తాను!

ఈ ఒయసిస్ చూసినవాళ్ళు మీ అనుభూతులను మాతో పంచుకోండి. మీరు ఎప్పుడయినా లాస్ ఏంజిల్స్ వెళితే మీరు గనుక నేచర్ లవర్స్ అయినట్లయితే ఈ ప్రిజెర్వ్ చూడటం బావుండగలదు. 

జాషువా ట్రీ నేషనల్ పార్క్ లో మా ఫోటోలు

పార్కులో జాషువా చెట్ల క్రింద నేను

లాస్ ఏంజిల్స్ వెళ్ళిన మరుసటి రోజు మధ్యాహ్నమే మొజవే డిజర్ట్ డ్రైవ్ కి మమ్మల్ని తీసుకువెళ్ళాడు మా సీతారామ్. నాకు ఎడారి అంటే ఎంతో ఇష్టం. అందులో ప్రయాణం చేయాలని ఎన్నాళ్ళుగానో నా అభిలాష. ఆ ప్రయాణం అంటే మా చిన్నమ్మాయి కూడా ఎంతో ముచ్చట పడింది. కొండలు, గుట్టలు. ఎడారి చెట్ల మధ్యగా ప్రయాణం ఎంతో బాగా జరిగింది కానీ మా అమ్మాయీ, నేనూ కాస్తంత నిరుత్సాహపడ్డాం. ఎడారి అంటే మా దృష్టిలో ఎంతో ఎత్తయిన ఇసుక తిన్నెలు. హ్మ్. ఈ ఎడారులు ఏంటో గానీ ఇసుక ఏమాత్రం కనిపించలేదు. ఇలాంటి భూముల్ని కూడా ఎడారులు అంటారని మాకు అప్పుడే తెలిసింది.  ఇసుక తిన్నెలు లేకున్నా సరే కొండలు, గుట్టలు, రాళ్ళు, ఎడారి చెట్లతో ఎడారి నాకు బాగానే అనిపించింది కానీ మా అమ్మాయి మాత్రం నాలుక చప్పరించింది. దారిలో ఒక ఒయాసిస్సుకి కూడా మా మిత్రుడు తీసుకువెళ్ళాడు కానీ ఆ కథ తరువాత. 


పార్కులో స్నేహితుడు సీతారామ్ మరియు నేను

ప్రయాణంలో జాషువా చెట్టు గురించి మా ఫ్రెండ్ వివరించాడు. యుఎస్ లోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆ చెట్టు వుంటుందని చెప్పి చూపించాడు. ఆ చెట్లు వివిధ ఆకారాలతో భలేగా వుండి బాగా నచ్చాయి. ఈ చెట్ల కోసం ప్రత్యేకంగా ఓ జాతీయ ఉద్యానవనం కూడా వుందనీ మనం అక్కడికే వెళుతున్నామనీ చెప్పాడు. అబ్బో చాలా పెద్ద పార్క్. వివరాల కోసం పై లింక్ నొక్కండి. జాషువా చెట్టు వివరాల కోసం క్రింది లింక్ నొక్కండి. అక్కడ ఆ గుట్టలమధ్య, చెట్ల మధ్య సూర్యాస్తమయం చూసాం. అక్కడ చాలామంది గుట్టలు ఎక్కడం (రాక్ క్లైబింగ్ హాబీ) చూసాను. నా యుక్తవయస్సులో మా టవును చుట్టు పక్కల మా మిత్రులతో కలిసి గుట్టలు ఎక్కడం - మమ్మల్ని దొంగలుగా అనుమానించి సమీప గ్రామం వారు తన్నడానికి సిద్ధపడటం - మా ఇల్లు ఎక్కడ వుందో చెబితే ఎవరో ఒకరు మమ్మల్ని గుర్తుపట్టడంతో బ్రతుకు జీవుడా అని బయటపడటం గుర్తుకువచ్చాయి. 


మా ఆవిడా నేనూనూ
ఎడారిలో ప్రయాణమూ, ఒయాసిస్సూ, జాషువా ట్రీ నేషనల్ పార్కు నాకు భలేగా నచ్చాయి కానీ మా అమ్మాయీ, మా ఆవిడా గులగసాగారు. ఏం చేస్తాం - వారికి ప్రకృతి అంటే వికృతి. వెకేషన్ అంటే చెట్లూ చేమలు చూడ్డమా అని వారి విమర్శ. హ్మ్. ఇంకా ఆ పార్కులో చాలాసేపు వుందామని నా మిత్రుడూ, నేనూ అనుకున్నాం కానీ అందువల్ల ఇహ కొనసాగించలేక తిరుగుప్రాయాణం పట్టాము. 

మీలో ఎవరయినా ఈ పార్కును చూసివుంటే మీ అనుభూతులు ఇక్కడ పంచుకోండేం. మీరు లాస్ ఏంజిల్స్ వెళితే కనుక, మీరు ప్రకృతి సౌందర్యారాధకులు అయితే గనుక ఆ పార్క్ తప్పకుండా చూసిరండి. మీ ఫ్యామిలీకి గనుక ప్రకృతి అంటే విరక్తి వుంటే గనుక వెంట తీసుకెళ్ళకండి :)

ఇదే పోస్టుని మిగతా చాలామంది బ్లాగర్లు అయితే దాదాపుగా ఈ క్రింది విధంగా వ్రాస్తారు!

"మా కుటుంబంతో పాటుగా ఆ పార్కుకి వెళ్ళాం. అందరం చక్కగా అనందించాం. మా ఆవిడ అయితే అంత మంచి పార్కు చూపించినందుకు గాను ఆనందం పట్టలేక అక్కడికక్కడ ఓ ముద్దు ఇచ్చేసింది. ఇహ మా అమ్మాయి అయితే ప్రకృతిలో పరవశించి పోయి కేరింతలు కొట్టింది. మా వాళ్ళ ఆనందం చూసాకా మా మిత్రుడు మరికొన్ని ప్రదేశాలు చూపించగా తనివితీరా దర్శించాము. తిరిగివస్తుంటే అక్కడ నుండి కదలబుద్ధి కాలేదు. మళ్ళీమళ్ళీ ఈ పార్కుని మా కుటుంబంతో కలిసి చాలాసార్లు చూడాలనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీని అంతా వెంటబెట్టుకొని వెళ్ళండి. వారంతా తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు" :)