జ్ఞాపకాలు: అతన్ని తన్నడానికి మా వ్యూహం

అప్పట్లో కోదాడ డిగ్రీ కాలేజీలో  డిగ్రీ చేస్తుండేవాడిని. అక్కడ నా మిత్రులు, రూమ్‌మేట్స్ చాలావరకు   మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ సానుభూతిపరులుగానూ దాని అనుబంధ విద్యార్ధి శాఖ PDSU మెంబర్లు గానూ వుండేవారు. గుంపులో గోవిందాలాగా నేనూ PDSU మెంబరుగా కాకపోయినా సానుభూతిపరుడిగా వుండేవాడిని. ముఖ్యమయిన మెంబర్లు మా రూమ్‌మేట్స్ కావడంతో ప్రధానమయిన చర్చలన్నీ మా గదిలోనే జరిగేవి. ABVPకి చెందిన ఒక విద్యార్ధి బాగా అతి చేస్తున్నాడనీ అతన్ని తన్నాలనీ కూడా మా గదిలోనే ప్లాన్ పన్నారు. ఎవరెవరు పరిసరాలు గమనిచాలి, ఎవరు తన్నాలి, ఎవరు బ్యాకప్ గా వుండాలి, తన్నాక ఏం చేయాలి  తదితర విషయాలు నిర్ణయించారు.  నాకేమో ఇలాంటి కొట్లాటలు, తన్నులు అలవాటు లేవు. తన్నినోళ్ళు, తన్నబడ్డవాళ్ళు బాగానే వుంటారు కానీ మధ్యలో బక్కప్రాణం నాకు చిక్కువస్తుందేమో అని నా ఖంగారు. 

ఒకరిని తన్నేంత గొప్ప శరీరం నాకు లేదు కాబట్టి నన్నేమీ అతగాడిని తన్ని రమ్మని చెప్పలేదు కానీ ఆ ఘనకార్యం జరిగేముందు పరిసరాలు కనిపెడుతూ తగిన హెచ్చరికలు అందజేయాలనే  గూఢచర్యం పని అప్పగించారు. హమ్మయ్య, కొంతలో కొంత నయం అనుకున్నాను. వాళ్ళు వాళ్ళు తన్నుకుంటారు కానీ నేను బయటపడను కదా. కానీ వాళ్ళని తంతే వాళ్ళు ఊరుకుంటారా? మమ్మల్నీ మళ్ళీ తంతారు కదా. సహవాస దోషం వల్ల ABVP వాళ్ళు PDSU వాళ్ళని తంతే ఆ నలుగురితో పాటూ నాకూ తన్నులు తగిలే ప్రమాదం బాగా వుంది. ఏదో సుబ్బరంగా సదువుకుందామని వస్తే ఈ పీడ ఎక్కడిదిరా బాబూ అనుకున్నాను. త్వరలో తన్నులు తినడానికి మానసికంగా సిద్ధం అయ్యాను. 

అయితే అతగాడిని కొట్టాలనుకున్న రోజుకి రెండు రోజుల ముందు  కారణాలు గుర్తుకులేవు కానీ ఎందుకో ఆ ప్లాన్ విరమించారు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. 

మిగతావాళ్లతో పాటు ఆ ఏడాది ఆ యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాను కానీ కాలేజీ స్టుడెంట్ యూనియన్ ఎన్నికలప్పుడు అసలు మనస్థత్వాలు బయటపడి ఏవగింపు కలిగింది. ఏ హోదాకి ఎవరు పోటీ చేయాలనే విషయంలో హీనంగా పోటీ పడ్డారు. అందరూ దాదాపు కలియబడినంత హీనంగా వాదులాడుకున్నారు. పార్టీ చర్చలకు బదులుగా ఒక చేపల బజారులా అనిపించింది. ఎవెరెవరు దేనికి పోటీ చెయ్యాలో తేలడానికి చాలాసేపు పట్టింది. నేను నిస్పృహతో ఆ చర్చలు గమనిస్తూ వెళ్ళాను. ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం అనిపించింది. పేదల కోసం, సంఘం కోసం అంటూ పోరాడే ఈ యూనియన్ ఎన్నికలప్పుడు మాత్రం తమలోతాము పోరాడుకోవడం నిర్లిప్తతను కలగజేసింది. అటుపై ఆసక్తి తగ్గింది. ఏదో నామమాత్రంగా తదుపరి కార్యక్రమాల్లో పాల్గొన్నాను.       

2 comments:

  1. It would be interesting for readers to know if u were sympathizer to PDSU because members happened to be your roommates or you liked their ideology

    ReplyDelete
  2. నేను మా నాన్నగారి దయవల్ల నాస్తిక భావజాలంలో పెరిగాను. అందువల్ల అభ్యుదయ పక్షాల పట్ల సానుభూతి వుండేది. అలా PDSU కి సానుభూతిపరుడినే కానీ మెంబరును కాను. అందువల్లనే వారి రూమ్మేటుగా వుండగలిగాను.

    ReplyDelete