మా అమ్మాయితో 10% ముచ్చట

మా చిన్నమ్మాయికి పన్నెండేళ్ళు. డబ్బు విషయాల్లో మహా ఘటికురాలు. తను మూడో తరగతిలో వున్నప్పుడు వారానికి మూడు డాలర్లు పాకెట్ మనీగా తీసుకునేది. ఇప్పుడూ ఏడో తరగతి కాబట్టి వారానికి ఏడు డాలర్లు కానీ నేను ఈమధ్య ఇవ్వడం మానివేసాను. పాకెట్ మనీ అని తీసుకోవడం - మళ్ళీ అన్ని ఖర్చులు మాతోనే పెట్టించడం - తన డబ్బులు కూడబెట్టుకొని మళ్ళీ మాకే వడ్డీకి ఇవ్వడం. అలా ఓ నేను మా ఆవిడా కలిపి తనకి $500 బాకీ వున్నాం. పైగా వడ్డీకాసులవాడిని ఆయనెవరో పీడిస్తుంటాడు కదా (పేరు గుర్తుకులేదు. చెబుదురూ. నా బ్లాగేమో అంటరానిది కాబట్టి కొందరు తెలుగు మేధావులు ఇటు చూడరనుకుంటాను) అలా మమ్మల్ని పీడిస్తుంటుంది. దాంతో వళ్ళు మండి అసలుకే ఇవ్వడం మానివేసాను. ఎన్ని వారాలుగా తన వారం వారం డబ్బులు ఇవ్వడం లేదో తరచుగా నాకు గుర్తుకుచేస్తుంటుంది. 

నిన్న ఆఫీసునుండి ఇంటికి రాగానే నేను నా డ్రస్సు కూడా మార్చకుండా తనతో ఈ విషయం కదిపాను. తనకు మళ్ళీ వారం వారం డబ్బులు ఇస్తాననీ కానీ అందులో పది శాతం పొదుపు చెయ్యాల్సివుంటుందనీ చెప్పాను. ముందు మామూలుగానే మొరాయించింది. అందువల్ల వచ్చే లాభాలేంటో ఓపిగ్గా వివరించాక సరే అంది కానీ 5% కి మాత్రమే సిద్ధం అయ్యింది. నేను ఒప్పుకోలేదు. 10% తప్పదు అని చెప్పాను. అయితే పాత బాకీ కూడా పే చెయ్యాల్సిందే అంది. సరే అన్నాను. ఇకపై తనకు నేను ఇచ్చే డబ్బుల్లో 10% పక్కన పెట్టి మిగతా డబ్బును కూడబెట్టి తనకు ఇష్టం వచ్చినవి కొనుక్కుంటుంది. ఆ పది శాతం ఇప్పట్లో కదపవద్దని అవి రిటైర్మెంట్ రోజులకు మాత్రమే అని ముందే స్పష్టీకరించాను. అందువల్ల తనకి ఆర్ధిక భద్రత, స్వేఛ్ఛ ఎలా వుండగలదో వివరించాను. ఇకపై తనకు సమకూరే ప్రతి డాలరుకూ పది శాతం అలా పొదుపు చెయ్యాలని వివరించాను. 

పది శాతం అనగా రెండు వారాలకి $1.5  పొదుపు చెయ్యనుంది. కొద్దిమొత్తమే కానీ తాను అలవాటు చేసుకోబోయే ఈ పద్ధతి ఎంత గొప్పది! మా నాన్నే నాకు ఇది నేర్పి వున్నా లేదా నాకు ఈ విషయం తెలిసినప్పటి నుండి అయినా నేను ఆచరించి వున్నా ఎంత ఆర్ధిక భద్రత సమకూరేది!  ఆ డబ్బులు వెయ్యడానికి ఒక మనీబాక్స్ కొనుక్కురావాలని నిర్ణయించాం. అలా కొంతమొత్తం సమకూరాక ఇక దాన్ని ఎలా పెట్టుబడిగా పెట్టాలో నేర్పిస్తాను. తనకు ఇదివరకే తన డబ్బులు అట్టే పెట్టకుండా, ఖర్చు పెట్టకుండా వడ్డీకి ఇస్తే ఎంత లాభమో వివరించివున్నాను. అందుకే మాకు అర్జంటుగా అవసరం అయినప్పుడు తన డబ్బులు వడ్డీకి ఇచ్చింది.  

తనతో ఈ చర్చ ముగించాక నేను డ్రస్సు మార్చుకోవడానికని మా బెడ్రూం లోకి వెళ్ళాను. తనేమో లివింగ్ రూం కి వెళ్ళి తన మమ్మీతో టెన్ పర్సెంట్ అంటూ వివరించడం నాకు వినిపించసాగింది :) నేను లివింగ్ రూం కి వచ్చాకా మా ఆవిడ నన్ను "తన పది శాతం సంగతి సరే. నీ పది శాతం సంగతేంటి" అని అడిగింది. తల ఊపితే చాలు తన దగ్గరే డబ్బు దాచెయ్యమనే ప్రమాదం వుంది కనుక వ్యూహాత్మకంగా తలని అడ్డంగా నిలువుగా ఊపాను. తనతో కూడా తన టెన్ పరెసెంట్ సంగతి మాట్లాడాలి కానీ దానికి ఇంకా సమయం వుంది. ఇప్పుడే తన మనస్సులోకి ఆ విత్తనం పడింది కదా - కాస్త ఎదగనిద్దాం.

3 comments:

 1. వడ్డికాసులవాడికి అప్పు ఇచ్చినవాడు, కుబేరుడు.
  మీ అమ్మాయి తను దాచుకున్న డబ్బులోనుండి మీకే అప్పు ఇచ్చిందంటే, ఆమెకి మీరు పొదుపు నేర్పక్కరలేదు.

  ReplyDelete
 2. @ బోనగిరి
  మీరు అన్నది నిజమే కానీ తాను ఇంకా చిన్నపిల్ల కనుక అసలు + వచ్చే వడ్డీ అంతా కలిపి బూట్స్ మరియు కెమెరా లాంటివి కొనాలని చూస్తోంది. అందుకే తన డబ్బులు నేను ఇంకా తిరిగి ఇవ్వలేదు - మొత్తం వృధా చేస్తుందని. ఇప్పుడు ఇక చక్కని మార్గం దొరికింది మా ఇద్దరికీ.

  @ అజ్ఞాత*
  ధన్యవాదాలు.

  ReplyDelete