10%

పది శాతానికి వున్న విలువెంతో చాలాసార్లు విన్నా కానీ ఏం లాభం పాటిస్తే కదా. మన ఆదాయంలో కనీసం పది శాతం పక్కన పెడెయ్యమంటారు. హళ్ళికి హళ్ళి, సున్నకు సున్న లాగా నడుస్తున్న నెలవారీ బడ్జెటులల్లో ఇంకా పది శాతం ఎక్కడ పక్కన పడేసేదీ? కొన్నేళ్ళ క్రితం చదివిన ఆ పుస్తకం పేరు గుర్తుకులేదు కానీ ఇందుకు గాను అందులో ఓ మార్గం చెప్పారు. ఖర్చులన్నీ అయ్యాక ఆ పదీ మిగల్చాలంటే కష్టం. అందుకే ముందే కనీసం పది తీసి పక్కన పెట్టి మిగతా 90 ఖర్చు పెట్టుకొమ్మన్నారు. భేశ్. బావుంది. అలా కొన్నాళ్ళు ఏదో చేసినట్టున్నాను కానీ తరువాత ఏమయ్యిందో నాకు గుర్తుకే లేదు. 

హార్వ్ ఎకర్ వ్రాసిన పుస్తకం చదువుతుంటే మళ్ళీ దీని ప్రాధాన్యత గుర్తుకువచ్చింది. అతనూ అదే అంటాడు. పది శాతం పక్కన పెట్టి దాన్ని పెట్టుబడికి తప్ప ముట్టుకోవద్దంటాడు. రిటైర్మెంట్ పొందాక ఆ డబ్బు యొక్క అసలు ముట్టుకోకుండా దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే వినియోగించుకొమ్మంటాడు. ఎంత చిన్న ఆదాయం వచ్చినా అందులో పది శాతం అలా పక్కన పెడెయ్యమంటాడు. "మీరు చెప్పింది బావుంది గానీ అసలే అప్పులు తెచ్చి బండి లాగిస్తున్నా" అని ఎవరో అంటే ఆ అప్పులోనే పది శాతం తీసి పక్కన పెట్టమన్నాడు! బావుంది కదూ?

హార్వ్ ఎకర్ ఇంకా ఏమంటాడంటే ఎప్పుడయితే ఓ పది మనం పక్కన వేస్తున్నామో అప్పుడు మనం ఓ పది విలాసాలకు ఖర్చుపెట్టడానికి అర్హత లభిస్తుందంటాడు. అలా ఆ మాత్రం విలాసంగా బ్రతక్క పిసినారిగా బ్రతికితే పెద్దగా సంపాదించాలన్న ఉత్సాహం రాదంటాడు. నెలవారీ ఆదాయంలో ఓ పదిశాతం విలాసాలకు వదిలెయ్యమంటాడు. హ్మ్. చూడాలి. 

ఈ పది శాతం సంగతి బాగా నా తలకు ఎక్కడం కోసమే ఇది వ్రాస్తూంట. మీ తలకు ఇది ఎక్కుతుందా లేదా అన్నది మీరు చూసుకోవాలి. మీరు చేసే ఇతర పెట్టుబడులూ, పొదుపులూ ఈ ఎకవుంట్ క్రిందికి రాకపోవచ్చు. ఇది పూర్తిగా మీ విశ్రాంతి రోజులలో వాడుకోవడం కోసం మాత్రమే. అది కూడా అసలు మొత్తం కాదు - దాని ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే. సో, మీలో ఎందరు ఈ విధంగా చేస్తున్నారు? ఎంత శాతం చేస్తున్నారు?

ఈ పదిశాతం పక్కన పెట్టగానే సరిపోదు కదా - అది చిన్నమొత్తం అయినా సరే దాన్ని పెట్టుబడిగా పెట్టినప్పుడే అది గుడ్లు పెడుతుంది కదా. అది ఎలా అని ఆలోచిస్తున్నాను. కొన్ని ఆలోచనలు వున్నాయి. చూడాలి. ఈ పదహారున ఈ పక్షం జీతం వస్తుంది. ఈలోగా ఆలోచించి అది రాగానే అటు మళ్ళించాలి. మిగతా 90% డబ్బుతో సర్దుకోవడం ముందు కష్టం అవచ్చు కానీ తరువాత అలవాటు అవుతుంది - ఆ కష్టం - కాదూ? ఈ డబ్బుని ఏం చెయ్యబోతున్నా అనేది మీకు తెలియజేస్తాను. వీలయితే ఈ ఎకవుంటులో నెలనెలకీ ఎంత పెరుగుతోందీ మీకు తెలియజేస్తుంటాను. ఎందుకు మీకు తెలియజెయ్యడం అంటారా? అది నాలో పట్టుదలనూ, కమిట్మెంటునూ, ఉత్సాహాన్నీ కలగజేస్తుంది. ఈ బ్లాగు చదివేవాళ్ళలో నాలాంటి దరిద్ర నారాయణులు ఎవరయినా వుంటే వారికి కాస్తో కూస్తో ఆదర్శంగానూ వుంటాను. 

ఎంతవరకు వింటారో, ఇది వారికి అలవాటు చెయ్యడానికి ఎంత కష్టపడాలో తెలియదు కానీ మా ఆవిడకీ, పిల్లలకీ నేను ఇచ్చే లేదా నేను పంపించే వాటిల్లో పది శాతం అట్టేపెట్టమని ప్రోత్సహిస్తాను. ఫైనన్షియల్ ఫ్రీడం తెచ్చుకోవడం ఎలాగో తెలియజేస్తాను. వాళ్ళు విన్నారో లేదో, ఆ డబ్బుతో ఏం చేస్తున్నారో మీకు తెలియజేస్తుంటాను. మరి మీరో?

11 comments:

  1. మీరు 401K & IRA plans గురించి ప్రస్తావించలేదు కాబట్టి, ఈ రిటైర్మెంట్ ప్లాన్స్ లో మీరు save చేయడంలేదని assume చేసుకుంటున్నాను. అదే నిజమైతే, మీరు మొట్టమొదటిగా చెయ్యవలసిన పని, వీటి గురించి కొంచెం research చెయ్యడం. సంవత్సరానికి $18,000 (age 49 and under) or $24,000 (age 50 and older) వరకు pre-tax గా save చెయ్యొచ్చు. అంతే కాకుండా, చాలా companies, employee benefit గా కొంత contribute చేస్తాయి... 4 to 5% of annual compensation is typical and generally require employee to contribute a minimum of 3 to 4%. 401K advantage ఏమిటంటే, ఇది pre-tax deduction అవడంవలన మీ take home pay లో పెద్ద difference కనపడదు.

    Already 401K plan లో participate చేస్తుంటే, కొన్ని పరిధులకి లోబడి $5000 వరకు అదనంగా IRA & Roth IRA plans లో పెట్టుబడి పెట్టవచ్చు.

    కొద్దిగా research చేస్తే మీకు త్వరగానే అర్ధమౌతుంది. మీకేమైనా guidance కావాలంటే నేనివ్వగలను.

    ReplyDelete
  2. నిజమే. మీరు అన్నట్లు అందుట్లో పొదుపు చెయ్యడం లేదు. ముఖ్యకారణం - మా కంపెనీ ఏమీ కాంట్రిబ్యూట్ చెయ్యదు. కాకపోతే ప్రాఫిట్ షేరింగ్ అందులో పడేస్తుంటుంది. వివరంగా ఈ విషయం వివరించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. నేను ఎప్పుడో చదివాను. మన సనాతన ఆర్థిక సూత్రాల ప్రకారం, సంపాదనలో మూడో వంతు ఖర్చు పెట్టుకోవాలి, మూడో వంతు దాచుకోవాలి. మిగతా మూడో వంతు దానం చెయ్యాలట. (ఈ దానంలో ఆదాయపు పన్ను కూడా కలపవచ్చా?)

    ReplyDelete
  4. @ బోనగిరి
    ఇప్పుడు జనాలని మూడోవంతు దానం చెయ్యమంటే కొట్టడానికి రావచ్చు :)) అందువల్ల మీరు అన్నట్లే దాన్ని ఆదాయపు పన్ను క్రింద లెక్క వేద్దాం. ఎలాగూ ట్యాక్స్ డబ్బులన్నీ పనికిమాలిక పథకాలకేగా.

    ReplyDelete
  5. ఇవాళే ఇండియాలో వున్న మా చిన్నక్కతో దీనిగురించి మాట్లాడాను. నెలనెల పంపించిన డబ్బు ఒక లక్ష అయిన తరువాత ఒకరికి 2% వడ్డీకి ఇవ్వవచ్చు. మాకు బాగా తెలిసిన, విశ్వసనీయమయిన బంధువు ఒకరు అలా వడ్డీకి తీసుకుంటారు. సో, నేను అలా చెయ్యబోతున్నాను.

    ReplyDelete
  6. I am really surprised why you are not involved in 401K plan being the head of your family of four. Even if your employer do not contribute, you should have started it much earlier. I agree with Edge about the pre-tax deduction. You may not see much difference in your pay check. In addition to 401K, what I do is, splitting the salary into two accounts. You can choose some % of salary or a round figure like $1000 from each pay check going into another account which you do not use to pay your rent and bills. This procedure is very convenient and helpful for me and I never use that money. But what I need to learn is how to utilize that saved money in proper way. If you have any ideas, please share here.
    Been a while since we spoke, inthaki ela vunnaru ?

    $iddharth

    ReplyDelete
  7. An equally (possibly more) important matter is to have adequate life insurance. If you don't, I suggest you consider it seriously. If you do have life insurance, make sure you have adequate coverage. If your wife is a wage earner, she should have it too. I would get quotes from 3 or 4 reputed insurance companies like MetLife, Prudential etc. Or, talk to an insurance agent near you. There are basically 2 types of life insurance coverage: Term life & Whole life. I suggest you get Term life coverage.

    Just as with financial planning, do some research online.

    DO NOT put it off!

    ReplyDelete
  8. @ $iddhardh

    వేరే ఎకవుంట్ లోకి జీతం లోని కొంత శాతం సరాసరి వెళ్ళడం మంచి విషయం. అయితే పొదుపు చెయ్యడమే కాకుండా దాన్ని మీరు ఆలోచిస్తున్నట్లుగానే పెట్టుబడి పెట్టకపోతే పెద్దగా ప్రయోజనం వుండదు. నాకు షేర్లూ, బాండ్లూ తదితర విషయాలపైన అవగాహన లేదు. మీరు ఇండియాలో వడ్డీకి ఇవ్వాలనుకున్నా లేక రియల్ ఎస్టేట్ లో పెట్టాలనుకున్నా కూడా నాకు తెలిసిన నమ్మకమయిన వారు వున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మా చిన్నక్క వాళ్ళు, మేనల్లుడులు వున్నారు. ఆ వ్యాపారంలో వారు బాగా గడించారు. ఏదయినా కొనాలనుకునే ఆసక్తి వుంటే చెప్పండి.

    ReplyDelete
  9. @ Edge

    Thank you.

    అవును. భీమా యొక్క ప్రయోజనం నాకు బాగా తెలుసు. నేను పనిచేస్తున్న కంపెనీ బెనెఫిట్స్ ద్వారా మ్యాగ్జిమం భీమా తీసుకున్నానండీ. దీనితో పాటే ఇంకా చెప్పాలంటే విల్లు వ్రాసి వుంచడం కూడా చాలా ప్రధానమని మా స్నేహితుడు ఒకరు గట్టిగా చెప్పారు కానీ దాన్ని ఇంకా పాటించలేదు. విల్లులలో ఏవో రకాలు వుంటాయని చెప్పి అవి అన్నీ తీసుకొమ్మన్నాడు. ఏదయినా తీవ్రమయిన అనారోగ్యం కలిగితే భర్తకు బదులు భార్య అలాగే భార్యకు బదులు భర్త ఆరోగ్య నిర్ణయాలు తీసుకొనే విల్లు (పేరు గుర్తుకులేదు) కూడా చాలా ముఖ్యం అని మా స్నేహితుని సలహా.

    ReplyDelete
  10. నిజమే… retirement & insurance planning అంత కాక పోయినా విల్లు తయారు చేసుకొని ఉంచుకోవడం ఉపయోగకరమే. నేను కూడా చాన్నాళ్ళ నుండీ అశ్రద్ధ చేస్తున్నాను. త్వరలో చెయ్యాలి.

    ReplyDelete
  11. @ $iddhaarth
    హ్మ్. 401K ప్రి ట్యాక్స్ అన్న విషయం అసలు నాకు గుర్తేలేదు. ఎడ్జ్ కామెంటు చూసినా కూడా అది నా బుర్రకి ఎక్కలేదు. ఇదివరలో గుర్తుండేదనుకుంటా. అయితే ఈ విధంగా పొదుపు చెయ్యమని మిగతా మిత్రులు కూడా ఇదివరలో చెప్పారు కానీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. పలు కారణాల వల్ల జీవితం టైట్ బడ్జెటులో నడుస్తున్నప్పుడు ఇంకా ఏం సేవ్ చేస్తాం? వున్న ప్రతి ఒక్క డాలరూ వాడెయ్యడమే జరుగుతోంది. గుడ్డిలో మెల్ల ఏంటంటే క్రెడిట్ కార్డుల్లోనూ, మరో విధంగానూ బ్యాలన్సులూ, అప్పులూ లేవు. అలాగే ఇతరత్రా గొప్పగా పెట్టుబడులు పెట్టకపోయినా చిన్నచిన్న పెట్టుబడులు పెట్టాం. వాటిమీదా కొంత ఆదాయం వస్తోంది.

    నాకు, మాకు పెద్దగా ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. అది పెంచుకోవడం కోసం కూడా ఇలా బయటపడుతున్నాను. మీలాంటి శ్రేయోభిలాషుల సలహాలు ఉపయోగపడతాయి కదా. ఎలాగూ వున్న ఉద్యోగం కొన్ని నెలలే కాబట్టి కొత్త జాబ్ రాగానే 401K లో చేరతాను. మా పెద్దమ్మాయికి కాలీజీకి కొన్ని కారణాల వల్ల లోన్ రాకపోవడంతో ఆ ఫీజులు బాగా భారం అవుతున్నాయి. అందువల్ల ఇహ పొదుపు గురించి ఆలోచించలేదు.

    ఇక నా గురించి చూస్తున్నారుగా బాగా బెటర్ అవుతున్నా. మీ సంగతులేంటీ?

    ReplyDelete