జుంబా డ్యాన్స్ మొదలెట్టా

చార్లీ చాప్లిన్ సినిమా 'ది గ్రేట్ డిక్టేటర్' లో ఓ సన్నివేశం వుంటుంది. యుద్ధంలో ఒక సైనికుడిగా భీభత్సంగా పోరాటం చేస్తుంటాడు. కాస్త పొగ తగ్గిన తరువాత తీరిగ్గా చూసుకుంటే తాను శత్రు సైన్యంలో ఒకడిగా వుంటాడు. తమ సైన్యం మీదనే  కాల్పులు జరుపుతూ వున్నానని గుర్తించి నాలుక కరచుకుంటాడు. నిన్న అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఇది యుద్ధంలో కాదు నాట్యంలో. ఆలస్యం అయిపోతోందని ఆఫీసునుండి పరుగుపరుగున వచ్చి మా జిమ్ములో నేర్పుతున్న జుంబా డ్యాన్సులో చేరి అందరితో పాటూ నేనూ చెయ్యసాగాను. కొద్దిసేపయ్యాక ఎందుకో అనుమానం వచ్చి చుట్టూ చూస్తే నేను తప్ప ఆ నాట్యంలో ఒక్క మగ పురుగూ లేడూ. ఇది బొత్తిగా ఆడోళ్ళ నాట్యం ఏమో అని అనుమానం వచ్చి ఆ డ్యాన్స్ నుండి పక్కకు వచ్చి ఆ ఆఫీసు వాళ్ళని అడిగాను. అదేం లేదు - భేషుగ్గా ఎవరయినా చెయ్యొచ్చన్నారు. మళ్ళీ వచ్చి మిగతావారితో పాటుగా స్టెప్స్ వెయ్యడం మొదలెట్టాను. 20 -25 మంది ఆడాళ్ళు వున్నారు కానీ ఏంటో కానీ చిత్రంగా ఒక్కళ్ళూ బాగోలేరు.  టీచర్ కొద్దిగా నయ్యం - మెక్సికన్ సంతతి అనుకుంటా. 

మిగతావాళ్ళంతా ఎన్ని వారాలనుండి ప్రాక్టీసు చేస్తున్నారో ఏమో బాగానే కష్టపడుతున్నారు. నా వల్ల 20 నిమిషాలకు మించి కాలేదు. ఈ రోజుకి చేసింది చాల్లే అనుకొని హైడ్రో మసాజ్ యంత్రం మీద పడుకున్నా. అది నన్ను వెనుక నుండి నీటి మర్దన చేస్తుండగా చిన్న కునుకు పట్టింది - అలసిపోయాను కదా. ఇంటికి వచ్చాకా సమయం ప్రకారమే నిద్రకు వెళ్ళినా ఎక్కువసేపు పట్టలేదు. వ్యాయామం సాయంత్రం చేస్తే వచ్చే ఇబ్బందే ఇది. మనస్సు బాగా ఉత్తేజితం అయి సరిగా నిద్రపోదు. సరే అని లేచి బాస్ ఎపిసోడ్ మరొకటి చూసి పడుకున్నా. అప్పుడు మొదలయ్యింది ఆ సమస్య. స్లీప్ అప్నియా. అలసిపోయి వున్నా కదా గొంతు కండరాలు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ శ్వాసకి అడ్డం పడుతున్నాయి. శ్వాస ఎగపోస్తూ చాలాసార్లు లేచి కూర్చున్నా. ఆప్నియాకు గాను చర్యలు తీసుకున్నా కానీ ఫలించలేదు. ఉదయం 6 గంటలప్పుడు వాడిన ఒక చర్య ఫలించింది. హాయిగా నిద్ర పట్టింది. 9 గంటలకు మెలుకువ వచ్చింది. ఆఫీసుకి ఆలస్యం అని ఈమెయిల్ ఇచ్చాను. 

నేను వాడుతున్న ఒక మందు వల్ల నాకు స్లీప్ ఆప్నియా (Sleep Apnea) సమస్య వస్తోంది. ఆ మందుకి కొందరిలో అది సైడ్ ఎఫెక్ట్ అని నాకు తెలుసు కానీ డాక్టరుకి తెలియదు. నేను చెప్పలేదు - ఎందుకంటే ముందు ఈ మందు మానివెయ్యమనే ప్రమాదం వుంది. ఆ మెడిసిన్ నాకు చాలా అవసరం. ఆప్నియాను దూరం చెయ్యడానికి కొన్ని తాత్కాలిక పద్ధతులు ప్రయత్నిస్తున్నాను. అవి సఫలం కాకపోతే ఆ మెడిసిన్ మానివెయ్యడమో లేక నిద్రలో శ్వాస సరిగా ఆడేందుకై  అంతగా సౌకర్యంగా అనిపించని ఒక చిన్న యంత్రం వాడటమో చెయ్యాలి.  ఏంటో నాకు అన్నీ 'ఎగదీస్తే గోహత్యా - బిగదీస్తే బ్రహ్మహత్యా' లంటి సమస్యలే వస్తుంటాయి. ఆ మధ్యలో ఈ జీవి కొట్టుమిట్టాడుతూవుంటుంది.

(నా సిస్టంలో వున్న చిన్న సమస్య వల్ల ఈ మధ్య పోస్టులకి ఫోటోలు జత చెయ్యలేకపోతున్నాను)


ఏ రంగు డ్రస్సు ఇదీ?

నిన్న ట్యాబ్ లో  ఒక ఫోటో చూపించి ఏం కలర్ డ్రస్ ఇదీ అని మా అమ్మాయి అడిగింది. చెప్పా. గుడ్ - నీ కళ్ళు చక్కగానే వున్నాయంది. ఓవర్ సెన్సిటివ్ కళ్ళు వున్నవారికి ఆ డ్రస్సు రంగులు మరో విధంగా కనిపిస్తాయంది. ఇప్పుడు CNN site లో అదే వార్తాంశం చూసాను. మీరూ చూడండి. ఆ డ్రస్సు మీకు ఏ రంగుల్లో కనిపిస్తోందీ?


ఇప్పుడే ఇంకో విషయం గమనించాను. ఆ ఫోటోని సగానికి పైగా మీకు కనిపించకుండా స్క్రోల్ చేసి అప్పుడు ఈ డ్రస్ ఏ కలర్స్ లో వుందో గమనించండి. నాకు అయితే ముందు అనిపించిన రంగులకీ ఇలా అనిపిస్తున్న రంగులకీ తేడా వుంది. అయితే ఈ విషయం మా అమ్మాయికి చెప్పను - నా కళ్ళు సగం మేరకు మాత్ర్రమే చక్కగా పనిచేస్తున్నాయని అనేయగలదు!

శివుడూ మరియు శరత్తూ

మా ఇంట్లో వారందరికీ శరత్ సాహిత్యం అంటే బాగా ఇష్టం వుండేది. అందుకే నాకు మా నాన్నగారు శరత్ అని పేరు పెట్టారు. అప్పట్లో శివభక్తురాలు అయిన మా అమ్మగారు మొదటి అక్షరం శివుడి పేరుతో కలిసివస్తుంది కదా అని ఆ పేరుకు సంతోషించింది, ఆమోదించింది. ఇక మా ఇంట్లో మా అమ్మమ్మ, తాతయ్యేమో నన్ను శంకరయ్యా అని పిలిచేవారు. అది విన్న నా బాల్యమిత్రుల్లో కొందరు నన్ను తిక్క శంకరయ్యా అని ఏడిపించేవారు.

నా చిన్నప్పుడు మా ఇంట్లో పూజగది వుండేది. అందులో ముఖ్యంగా శివుని ఫోటోలే వుండేవి. మా అమ్మ చేసే శివపూజను శ్రద్ధగా గమనిస్తుండేవాడిని. మిగతా దేవుళ్ళ కన్నా కూడా నాకు శివుడే ఇష్టం. ఎందుకంటే తను నాలాగే భోళాశంకరుడూ, నిరాడంబరుడూనూ. మా అమ్మగారు సహజమార్గం పట్టిన తరువాత శివపూజని వదిలేసారు. ఆ మార్గంలో (ఇతర) దేవుళ్ళని పూజించవద్దని చెబుతారనుకుంటా. మా నాన్నగారేమో పచ్చి నాస్తికులు. అలా చిన్నప్పటి నుండీ వైరుధ్యమయిన  వాతావరణంలో పెరిగాను. దేవుళ్ళూ, గీవుళ్ళూ అన్నీ మూఢనమ్మకాలు అని చెబుతుండేవారు. ఏమయినప్పటికీ పూజ, ప్రసాదం, తీర్ధం బాగా నచ్చేవి నాకు. అందుకే నాన్నని లైట్ తీసుకొని అమ్మకి జై కొట్టేవాడిని.  మరి నాన్నగారు నాస్తిక ప్రసాదం గట్రా ఇచ్చేవారు కాదు మరి! ఇలా లాభం లేదని తనతో నన్ను వెంటేసుకొని విజయవాడ నాస్తికకేంద్రం మరియు ఇతర చోట్లా నాస్తిక సువార్త (?!) సభలకి తీసుకెళ్ళేవారు. అలా డాక్టర్ సమరం గారు గట్రా పరిచయం అయిపోయి అటుపై నాస్తికత్వం మీద ఆసక్తి ఏర్పడి కాస్త పెద్దయ్యాక అనగా 12 ఏళ్ళ వయస్సులో నాస్తిక మతం (?!) పుచ్చుకున్నాను.  

నేను ఎప్పుడన్నా ఆస్తికుడిగా మారితే శివభక్తుడినే అవుతాననుకుంటా.

మళ్ళీ మళ్ళీ రాని ఆ పాదాలూ, మళ్ళీ మళ్ళీ వచ్చే ఆ కన్నీళ్ళూ

అందమయిన యువతులందరికీ అందమయిన పాదాలు వుండాలని రూలేమీ లేదు కానీ వికారమయిన పాదాలు చూసినప్పుడు ప్చ్ అనిపిస్తుంది. అందమయిన హీరోయిన్లలో కొంతమంది పాదాలు మాత్రమే బావుంటాయి. అందులో నిత్యా మీనన్ వి కూడానూ. నిన్ననే మళ్ళీ మళ్ళీ రాని రోజు సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చాలా గొప్పగా వుంది అని చాలా రివ్యూలు వచ్చాయి కాబట్టి మళ్ళీ నేనో రివ్యూ లాంటిదేం వ్రాయబోవడం లేదు లెండి.ఈ సినిమాలో ఓ దృశ్యంలో నిత్య హీరో గారి ఇంట తొలిసారిగా అడుగుపెట్టబోతుంది. ముందు ఎడమకాలు పెట్టబోయి తటపటాయించి అది వెనక్కు తీసుకొని కుడికాలు పెట్టి ఇంట్లోకి ప్రవేశిస్తుంది - ఇటు నా పంట పండిస్తుంది.

అసలే అందమయిన అభిమాన హీరోయిన్ను. అటుపై అందమయిన ఆమె పాదాలు తెరంతా పరచుకొని కనిపిస్తుంటే వాహ్ విజిల్ వెయ్యాలనిపించింది కానీ నాకు వెయ్యడం రాదు. పైగా పక్కనే వున్న మా ఆవిడ మరొసారి నన్నో పిచ్చాడిలా చూడవచ్చు - అందుకే అదిమేసుకున్నా.  సరే ఇక ఆమె పాదాలు అక్కడ పెట్టేసి అసలు సిసలు సినిమా విషయానికి వద్దామేం. సినిమా సూపరుగా నచ్చింది. మొదటి నుండీ చివరి వరకూ ఆ ఎమోషనల్ దృశ్యాలకు స్పందిస్తూ నా కళ్ళు వర్షిస్తూనే వున్నయ్. నా ఖర్చీఫ్ పూర్తిగా తడిచిపోయింది. ఈమధ్య ప్రతి చిన్న మంచి విషయానికీ నేను ఎమోషనల్ అయిపోతున్నాను. కళ్ళూ, మనస్సూ ఆర్ద్రంగా అవుతున్నాయ్. కారణం... నాకు తెలుసు. సందర్భం వచ్చింది కాబట్టి అదేంటో మీకు వివరిస్తానేం.

సినిమా గురించి చెబుతూ ఈస్ట్రోజన్ గురించి సోదేస్తున్నాడని మీరు అనుకుంటే ఆగిపొండి. తోటి మగాళ్ళూ - మనకు ఇది ముఖ్యమయినది - చదివితే మంచిది. 

మొన్న మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.  రొటీన్ గా ప్రతి మూడు నెలల కొకసారి చేయించుకునే రక్త పరీక్షల గురించి కలిసాను. అన్నీ దాదాపుగా బావున్నాయని చెబుతూ ఆఖరున ఈస్ట్రోజన్ గురించి కాస్త కంగారుగా చెప్పాడు. అవసరమయిన స్టెప్స్ తీసుకుంటున్నా కూడా అది అంతగా (రెట్టింపు) ఎందుకు పెరిగిపోయిందో తెలియక జుట్టు పీక్కున్నాడు. నేను పళ్ళికలించి అరిమిడెక్స్ ఎక్కువగా వాడట్లేదు అని విన్నవించా. అంతను బోలెడంత ఆశ్చర్యపోయాడు. ఎందుకు అని అడిగాడు. నేను బ్బెబ్బెబ్బె అని నీళ్ళు నములుతూ 'మీరు చెప్పినట్లుగా కాకుండా నేను లక్షణాలను బట్టి ఆ మందు వాడుతున్నాను' అని సెలవిచ్చాను. ఈమధ్య వాడుతున్న మరో మందు వల్ల ఈస్ట్రోజన్ డామినన్స్ సింప్టంస్ తక్కువ అనిపించి ఏంటీ అరోమటేజ్ మందు తక్కువ చేసాను. వంట్లో ఈస్ట్రొజన్ మరీ తక్కువయితే జాయింట్ పెయిన్స్, లిబిడో పడకెయ్యడం, ఎముకల క్షీణత వగైరాలు ఉరికి వస్తాయి. ఆయన గారికేం భేషుగ్గా డోసేజ్ చెబుతాడు. అది ఎక్కువయితే ఇబ్బంది పడేది నేను కానీ ఈసారి మాత్రం నా శరీరంలోని ఈస్ట్రోజన్ కొండెక్కి కూర్చున్నది.

సాధారణంగా మగవాళ్ళకి 55 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి వారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ దాదాపుగా ఆడవారి కంటే ఎక్కువ అవుతుంది. టెస్టాస్టెరాన్ హార్మోన్ క్రమంగా తగ్గిపోతూ అది క్రమంగా అలా పెరుగుతూ వుంటుంది. అందువల్ల మేల్ బూబ్స్, లిబిడో సమస్యలూ, అలసట, చిరాకూ, వగైరా వగైరా వస్తుంటాయి. కొంతమంది మగవాళ్ళకు రొమ్ము క్యాన్సర్ కూడా రావచ్చు.  కొన్నేళ్ళ క్రితం చేసిన రక్త పరీక్షల్లో నాలో ఈస్ట్రోజన్ ఎక్కువగా వుంటోందని అనుకోకుండా బయటపడింది. అప్పటినుండీ తక్కువ మోతాదులో అది తగ్గించే మందు వాడుతూ వున్నాను. అలాగే నా శరీరంలో ప్రొజెస్టరాన్ బొత్తిగా వుండటం లేదని కూడా తెలుసుకున్నాం. బయో ఐడెంటికల్ ప్రోజెస్టరానూ వాడుతున్నాను. నాకున్న సవాలక్ష చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని. 

మగవారి శరీరంలో బాగా ఈస్ట్రోజన్ ఎక్కువయినప్పుడు మనస్సుకి ఆర్ద్రత కల్గించగలిన ఏ చిన్న విషయం చూసినా, చదివినా, తెలుసుకున్నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సినిమాలూ, సీరియళ్ళు చూసి గానీ లేదా చిన్న చిన్న విషయాలకే కళ్ళల్లో నీళ్ళు తిరిగే మగవాళ్ళుంటే ఒకసారి మీ డాక్టరుని కలుసుకొని మీలో ఈస్ట్రోజన్ ఎంత వుందో చెక్ చేసుకోవడం మంచిది. అందుకు గాను మేల్ ఈస్ట్రోజన్ ప్రోటోకాల్ మాత్రమే మెడికల్ ల్యాబులో వినియోగించాలి. ఆడవారికి చేసినట్టు మనకూ ఆ పరీక్ష చేస్తే ఆ ఫలితంతో లాభం వుండదు.  అయితే అందరు డాక్టర్లకి ఈ విషయం గురించి అవగాహన వుండకపోవచ్చు. వాళ్ళు దీన్ని తేలిగ్గా తీసుకొని కొట్టిపడెయ్యొచ్చు. మరి మీరు మీ డాక్టరుని లైటుగా తీసుకొని మరో మంచి వైద్యుడిని వెతుక్కుంటారో లేక నన్నూ, ఈ పోస్టునూ లైట్ తీసుకుంటారో మీ ఇష్టం. ఎండోక్రైనాలజిస్టులు ఇలాంటి హార్మోన్ విషయాల్లో నిష్ణాతులు.         

నిన్న ఈ సినిమా చూసి బాగా ఏడవడానికి కారణం ఆ సినిమా మంచిగా వుండబట్టా లేక నాలో ఈస్ట్రోజన్ ఎక్కువ కావడం వల్లా అనేది నా అయోమయం. అందువల్ల ఏంటీ అరోమటేజ్ మందు డోస్ కాస్త పెంచాను. కాస్త కీళ్ళ నొప్పులు కనిపించేదాకా పెంచేస్తే ఆ తరువాతా మళ్ళీ నార్మల్ డోస్ వాడొచ్చు.

నాగార్జున సాగర్ నీళ్ళ సమస్యకు ఓ సులభమయిన పరిష్కారం

ఆ ఆనకట్ట వల్ల ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు రావడానికి మూల కారణం ఏంటో తెలుసా? నాకు తెలుసు. వాస్తు. వాస్తు బావోలేదు. అంచేతా శుబ్బరంగా ఆ డ్యాం ను కూలగొట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సివిల్ ఇంజినీర్లకు బదులుగా తమ తమ ప్రభుత్వ వాస్తు సలహాదారులను ఉపయోగించి విడివిడిగా ఆనకట్టలు కట్టుకోవాలి. ఎందుకయినా మంచిది - మళ్ళీ మళ్ళీ వాస్తు సమస్యలు రాకుండా ఉత్తర దక్షిణ తెలంగాణా కు మధ్యగా గానీ, రాయలసీమకు ఆంధ్రాకు మధ్యగా గానీ ఆనకట్టలు కట్టరాదు. 

అదీ కాకపోతే ఇంకో సులభ పరిష్కారం వుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ వాస్తు సలహాదారుల సూచనల మేరకు ఆనకట్టకు మధ్యగా గోడ కట్టాలి. అప్పుడు ఎవరి నీళ్ళు, ఎవరి గేట్లు, ఎవరి కాలువలు వారివి అవుతాయి. సింపుల్. హేంటో ఈమాత్రం దానికి ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకుఛస్తున్నారంట. అవసరమా అదీ?

House Of Cards మొదలెట్టాను

BB అయిపోయిన తరువాత ఏ సిరీస్ మొదలెట్టాలా అని ఆలోచించి ఇది మొదలెట్టాను. ఒకసారి కొత్తపాళీ గారు ఈ సిరీస్ చాలా బాగుందని తమ బ్లాగులో వ్రాసారు. అప్పుడు దీనిగురించి తెలిసింది. అప్పటినుండీ ఇది చూద్దాం చూద్దాం అనుకుంటూనే ఇప్పటికి కుదిరింది. చాలా బావుంది. US ప్రెసిడెన్షియల్ పాలి'ట్రిక్స్' ఇష్టమయినవారికి ఇది బాగా నచ్చుతుంది. హీరో కెవెన్ స్పేసీ నటన ఎప్పుడయినా సరే సహజత్వానికి దగ్గరగా బావుంటుంది.

ఈ సిరీస్ లో ఇంకో విశేషం ఏంటంటే హీరో మనతో అనగా ప్రేక్షకులతో సరాసరి మాట్లాడుతూవుంటాడు!

House of Cards (2013– )

TV Series  -  Drama
IMDB rating 9.1/10. 
A Congressman works with his equally conniving wife to exact revenge on the people who betrayed him. 

ఆప్ విజయం - తెలుగు ముఖ్యమంత్రులకు గుణపాఠం

రోజుకో బ్రహ్మాండమయిన హామీని ఇవ్వడం, అరచేతిలో వైకుంఠం చూపడం తప్ప మన ముఖ్యమంత్రులు పెద్దగా సాధిస్తున్నదేమీ నాకయితే కనిపించడం లేదు. తమను ఎదిరించే మొనగాడు లేకపోవడం, దినపత్రికలు వారికి బాకాలుగా మారడం తదితర కారణాల వల్ల వారికి డాబుసరి పెరగడం, ఒంటెద్దు పోకడలకు పోవడం, సామాన్య ప్రజానీకానికి దూరం అవడం ప్రజలు గమనిస్తూనే వుంటారు.

మళ్ళీ ఎన్నికల నాటికి  తెలంగాణా భావోద్వేగాలు ఎలాగోలా మళ్ళీ రెచ్చగొట్టడం ద్వారా కేసీఆర్ ఎలాగోలా పబ్బం గడుపుకోవచ్చేమో గానీ చంద్రబాబు నాయుడికి అయితే ఇలాగే అలవిమీరిన శుష్క వాగ్ధానాలతో పరిపాలన సాగిస్తే మాత్రం సమస్యలు తప్పవు. మోడీ ఏం పొరపాట్లు చేస్తూ  అపజయం కొనితెచ్చుకున్నాడో ఆ పొరపాట్లకు దూరంగా మన తెలుగు ముఖ్యమంత్రులు పాలన సాగించాల్సివుంది.  ప్రజలకు కావాల్సింది వాస్తవ దూరం అయిన స్మార్ట్ సిటీలు లాంటివి కాదనీ సగటు ప్రమాణాలు అనీ వీరు గుర్తించాల్సివుంది.   

... BAD వ్యసనం BREAK చేసా!

అనుభవించనిదే అధిగమించలేమని జిడ్డు (క్రిష్ణమూర్తి) అంటాడు. ఈ ఎడిక్షన్ విషయంలోనూ అదే జరిగింది. ఇంతగా ఇలాంటి వ్యసనంలోకి ఎప్పుడూ లోను కాలేదు. మధ్యలోనే మానివేయాలనుకున్నా... కనీసం తగ్గించాలనుకున్నా... నా వల్ల కాలేదు. ఇక దాన్ని పూర్తి చెయ్యడమే మార్గం అని తెలుసుకున్నా. ఇప్పుడే ముగించాను. అదే... Breaking Bad TV series. 5 సిరీసులు. మొత్తం 40 గంటలకు పైనే వుంటుందనుకుంటా.

Breaking Bad (2008–2013)
TV Series  -   Crime | Drama | Thriller

మా మిత్రుడు చెప్పాడు బావుంటుందని. రేటింగ్ చూస్తే చాలా బాగా వుంది. మొదటి మూడు భాగాలు అంత బాగుండవు కానీ ఆ తరువాత మాత్రం వదల్లేమని ముందే హెచ్చరికలు వచ్చాయి... అవి నిజమయ్యాయి. ఇహ వదల్లేకపోయాను. ఇంట్లో పనులు సవ్యంగా జరగడం లేదు - నిద్ర సరిపోవడం లేదు. తగ్గించాలనుకున్నా - నావల్ల కాలేదు. ఇహ అది పూర్తి చేయందే మళ్ళీ మామూలు మనిషిని కాలేనని నాకు అర్ధం అయ్యింది. అందుకే ఏకబిగిన చూసేసా. ఇప్పుడే అయిపోయింది - నాకు విశ్రాంతి దొరికింది. ఇక జన జీవన స్రవంతిలో కలవాలి :)

మీరూ చూడండి - అది మీకు వ్యసనం అయితే కనుక నేరం నాది కాదు - ముందే చెబుతున్నా. 
http://en.wikipedia.org/wiki/Breaking_Bad

దీని ప్రీక్వెల్ Better call Saul ఈరోజు నుండే మొదలవుతోంది. BB చూసివుంటే లాయర్ Saul గుర్తున్నాడు కదా. అతని కథే ఇది. BB పాత్రలు కూడా కొన్ని ఇందులోకి వస్తాయిట.
http://www.amctv.com/shows/better-call-saul

మోడీ 'సూట్'కేసు!



పై చిత్రంలోని పెద్ద మనిషి ఎవరో గుర్తించగలరా?  గుర్తిస్తే అది ఏ సందర్భంలో తీసిన ఫోటోనో చెప్పగలరా? అతని బ్రతుకుని బస్‌స్టాండ్ చేసిన ముఖ్యమయిన సంఘటణల్లో అది ఒకటి.

అతను అమెరికా మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్. హరికేన్ కత్రినా చేసిన విధ్వంసాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనుండి చూస్తున్నప్పుడు తీసిన ఫోటో అదీ. తెల్లారాక ఆ ఫోటొ పత్రికల్లో చూసాక అతని మనస్సు కీడు శంకించింది. అనుకున్నట్టే అయ్యింది. అప్పటినుండీ అతని పతనం ప్రారంభం అయ్యింది. ఆ ఫోటోలో వున్న పొరపాటు ఏంటీ? చెప్పండి చూద్దాం. 

ఒకవైపు ఘోరమయిన కత్రినా హరికేన్ తో న్యూఆర్లియాన్స్ నగరం అతలాకుతలం అవుతుంటే అయ్యగారు ఎంచక్కా ఎయిర్ ఫోర్స్ వన్ లో టెక్సాస్ నుండి వాషింగ్టన్ వెళ్ళారు. పైగా న్యూఆర్లియాన్స్  విధ్వంసాన్ని పైనుండి చూసుకుంటూవెళ్ళారు. అక్కడన్నా లేదా అక్కడికి దగ్గర్లోని ఏదయినా సురక్షిత ప్రాంతంలో ఆగి ప్రజల యోగక్షేమాలు పట్టించుకున్నారా? లేదు. సామాన్య ప్రజానీకంతో ప్రెసిడెంట్ డిస్‌కనెక్ట్ అవడం దీనిమూలాన అందరికీ అర్ధమయ్యింది. అప్పటినుండీ అతనికి ప్రజామోదం తగ్గడం మొదలయ్యింది. 


బుషుకూ మోడీకి ఏంటి పోలిక అంటారా? అక్కడికే వస్తున్నా. పది లక్షలో లేదా ఒక కోటో పెట్టి బ్రిటన్ నుండి తెప్పించిన పైగా తన పేరు అల్లించిన కోటు ప్రెసిడెంట్ ఒబామా వచ్చినప్పుడు వేసుకున్నారు కదా. 'మేక్ ఇన్ భారత్' అంటూ 'మేడ్ ఇన్ బ్రిటన్' దుస్తులను పైగా అంత ఖర్చు పెట్టి, అంతకు పైగా తన పేరు అల్లించుకొని సూటు వేసుకోవడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రియతమ ప్రధాని గారు తమ సామాన్య ప్రజానీకానికి దూరంగా జరుగుతున్నట్టు అనిపించడం లేదా? ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడితేనే ప్రజాదరణ నిలబడుతుంది. పునరావృతం అయితే మాత్రం కష్టమే.

పాత్రలూ - 'పాత్ర'ధారులూ

నా తుదిశ్వాస నవలను వీడియో సినిమాగా తియ్యాలని నిశ్చయించాకా హీరో, హీరోయిన్ల కోసం వేట మొదలయ్యింది. అప్పట్లో ఈటివి లో ఏదో ప్రొగ్రాం ఏంకరింగ్ చేసే అమ్మాయి మా ప్రిన్సిపాలుకి కాస్త తెలుసు. ఫోటో చూస్తే ముద్దుగానే వుందికానీ నిజంగా అంత అందగత్తె కాదని చెప్పారు. ఆమె ఏదో ముగ్గుల పోటీనో ఏదో నిర్వహిస్తే చూసాను కానీ ఆమె నచ్చలేదు. ఒక ఔత్సాహిక యువకుడు హీరోగా దొరికాడు. అతనికి అనుభవం లేదు కానీ చూట్టానికి బానే వుంటాడు. అసలయితే హీరో కన్నా విలన్ గా బాగా సూట్ అవుతాడేమో. ఏమయితేనేం అతన్ని హీరోగా నిర్ణయించాం. హీరోలదేముంది లెండి బోలడెంతమంది దొరుకుతారు. మంచి హీరోయిన్ దొరకడం కష్టమే. 

కొన్ని కాంటాక్ట్స్ ద్వారా ఒక యువతి వచ్చింది. సుధీర్ అనే సినిమా (అదో దిక్కుమాలిన సినిమాలెండి - అలాంటివి విడుదలకు నోచుకోవు) లో నటించిందంట - స్టిల్స్ చూపించింది. నాకు ఆమె బాగానే సెక్సీగా అనిపించింది కానీ ఒక చిక్కొచ్చింది. మా హీరో గారికి ఆవిడ నచ్చలేదు - నాకేమో నచ్చింది. ఆవిడతో కెమిస్ట్రీ కుదరాల్సింది హీరో గారికి కానీ నాకు కాదు గదా అనుకొని ఆమెను వద్దు అనేసాము. ఆ తరువాత ఎంత వెతికినా మంచి హీరోయిన్ దొరకలేదు. రోజులేమో దొర్లిపోతున్నాయి. మాకు అందరికీ చిరాకు వేస్తోంది. అప్పుడు మళ్ళీ మాకు వున్న కాంటాక్ట్స్ ద్వారా ఒక అమ్మాయి వచ్చింది. ఏదో మామూలుగా వుంది - మా హీరో గారికి అయితే నచ్చింది. అతనూ చూసిచూసి విసిగిపోయి ఏదో ఒక అమ్మాయి అని ఆమెకు సరే చెప్పినట్లున్నాడు. నేను కూడా ఆమె అంతగా నచ్చకపోయినా తొందరగా సినిమా స్టార్ట్ చెయ్యాలని వొకే చెప్పేసాను. 

షూటింగ్ మా టవునులో ఒక మాజీ MLA ఇంట్లో నిర్ణయించాం.  వాళ్లింట్లో ఓ చిన్న తోట వుందిలెండి. అక్కడయితే సినిమాలో ప్రేమికులు కబుర్లు చెప్పుకోవడానికి బావుంటుందని అనుకున్నాం. లోకల్ ఫ్రెండ్ ఆ మాజీతో మాట్లాడి అనుమతి తెచ్చాడు. ఇహ హైదరాబాదు నుండి మా టవునుకి వెళ్ళాలి కదా. మనది లో బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి కార్లూ గట్రా ఏర్పాటు చేయించలేకపోయాను. సాయంత్రం బస్సుస్టాండుకి వెళితే ఎన్ని బస్సులు చూసినా ఖాళీ లేదు. దాంతో మా ఈరోయిన్ను గారికి చిరాకేసింది. కారు ఏర్పాటు చేయొచ్చుగా అని అన్నట్టు అంది. నేను ఆ మాటలు వినిపించుకోనట్టు నటించాను. మొత్తమ్మీద ఆ రాత్రి మా టవునులో దిగాము. షూటింగ్ సామాగ్రి మొయ్యడానికి మా ఈరో గారు ఏమాత్రం ఉత్సాహం చూపలేదు. అస్సలు సినిమా స్టార్టే కాలేదు - మా హీరో గారికి అప్పుడే కొమ్ములు పెరిగాయని అర్ధం అయ్యింది. నేనూ, మిగతా వాళ్ళం మోసుకుంటూ దగ్గర్లో వున్న స్నేహితుడి ఇంటికి వెళ్ళాం. హీరోయిన్ గారికి వాళ్ళ ఇంట్లో బస ఏర్పాటు చేసాం. హీరో గారికి లాడ్జిలో చేసాం. 

ఉదయం మా ఫ్రెండు ఇంటికి వెళ్ళాను.  హీరోయిన్ బావోలేదనీ, హీరో బాగానే వున్నాడని మా స్నేహితుని భార్య మా హీరోయిన్ లేనప్పుడు చూసి కామెంట్ చేసింది. ఆమెను ఎందుకు ఎన్నిక చేయాల్సివచ్చిందో వివరించాను. ఇక ఆరోజు షూటింగ్ మొదలెట్టాం. ఆ విశేషాలు మరోసారేం.

వాస్తువిద్వాంసులు!

ఈమధ్య అంతా వాస్తు గురించి చర్చలు జరుగుతున్నాయి కదా. మూఢనమ్మకాల మత్తులో మన  ముఖ్యమంత్రులు జోగడం  విచారకరంగా అనిపిస్తుంది. కొన్నేళ్ళ క్రితం ఓ దగ్గరి బంధువు  యుఎస్ వచ్చినప్పుడు డెట్రాయిటులో వున్న ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం. ఆ ఫ్రెండ్ చాలా నెలల నుండి బెంచ్ మీద వున్నాడు. మా బంధువుకి కొద్దో గొప్పో వాస్తు జ్ఞానం వుంది కాబట్టి (లేనిదెవరికి చెప్పండి. ఈమధ్య పతోడూ వాస్తు విద్వాంసుడే) ఆ పాండిత్యం అంతా అక్కడ ప్రదర్శించారు. అది కూలగొట్టి ఇక్కడ కట్టమంటారు, ఇది కూలగొట్టి అక్కడ కట్టమంటారు.  నేను  చూస్తూవుండిపోయాను. మా స్నేహితునికి వాస్తు మీద నమ్మకమే కాబట్టి బుద్ధిగా వింటూ వెళ్ళారు. తనకు లేని దురద నాకెందుకు అనుకొని నేను గమ్మున వున్నాను.ఆ తరువాత ఆ మార్పులూ చేర్పులూ ఆ ఫ్రెండ్ ఏమయినా చేయించాడో లేదో నాకు తెలియదు.

అలా మా మిత్రునికి ఇచ్చిన సలహాలు అయిన పిమ్మట 'మిమ్మల్ని వైట్‌హవుజ్ కు తీసుకెళతాను - ఒబామాకి ఈ సలహాలు ఇద్దురు గానీ' అన్నాను. 'అతను వినాలే కానీ ఎందుకు ఇవ్వనూ - భేషుగ్గా ఇస్తాను' అని నవ్వుతూ అన్నారు. ఇంకా నయ్యం - ఒబామా గారికి మన ముఖ్యమంత్రులకు వున్నత తెలివితేటలు లేకపోయాయి కాబట్టి అమెరికా ప్రజలు బ్రతికిపోయారు. లేకపోతే మన గొప్ప వాస్తు పండితులు వైట్‌హవుజ్ కూలగొట్టించి ఏ ఆఫ్రికా అడవుల మధ్యలోనో కట్టించేయగల్రు.

కాస్త వాస్తు విజ్ఞానం వుందంటే చాలు చాలామందికి అది ఒక దురద లాగా వుంటుందనుకుంటా. ఏ భవనం చూసినా, ఎంత మంచి ఇల్లు చూసినా వీరికి నచ్చదనుకుంటా. లక్షణంగా వున్న వాటిల్లో ఏదో ఒకటి పీకించి పందిరి వేయిస్తే గానీ వారి ఆత్మకు శాంతి కలగదు.  ఇలాంటి వాస్తు వేదాంతుల మాట వినే మా చిన్నప్పుడు మా తాత మా ఇంట్లోని పచ్చని జామ చెట్లని కొట్టివేయించాడు. నేను ఎంత రుసరుసలాడినా వినలేదు. ఆ తరువాత మా అమ్మగారు ఎంత వద్దని మొత్తుకున్నా ఇంకో ఇంటి మెట్లు కూలగొట్టించారు. ఎంచక్కా ఎప్పుడూ డాబా మీదికి వెళ్ళి రకరకాలుగా (?!) enjoy చేస్తుండేవాడిని. అందువల్ల అవన్నీ బంద్ అయిపోయాయప్పుడు.  అప్పటి నుండి ఎవరయినా వాస్తు ప్రవీణులు కనిపిస్తే పిచ్చి కుక్కని చూసినట్లు బెదిరిపోతుంటా.

అప్పుడప్పుడూ నా బుర్రకి వాస్తు బాగాలేదేమోనని బెంగపడుతుంటా కానీ వాస్తు విద్వాంసులని అడగడానికి భయపడుతుంటా. వాళ్ళని అడిగితే నా తలకాయకు వాస్తు బావోలేదని ముక్కు కోసి చెవి దగ్గర అతికించుకోమనీ, పెదవులు పీకి తల మీద అంటించుకోమనీ చెప్పేయగల్రు.  ఒక కన్ను పీకించి నన్ను ఒంటి కన్ను రాక్షసుడిగా చేసేయగల్రు. అంచేతా వాస్తు విద్వాంసులూ - మీకో నమస్కారం!