నేనూ దర్శకత్వం వెలగబెట్టానోచ్!?

అది 2007 జనవరి. కొన్ని కారణాల వల్ల కొన్ని నెలలు ఇండియాలో గడపాల్సి వచ్చింది. ఎలాగూ దర్శకత్వం మీద ఆసక్తి వుంది కదా అని దిల్‌షుక్‌నగర్ లోని ఓ దిక్కుమాలిన ఫిల్మ్ ఇన్స్టిట్యూటులో చేరాను. పేరు గుర్తుకులేదు - అది ఇంకా అక్కడే వుందో లేదో తెలియదు. అందులో దర్శకత్వం కోర్సు తీసుకున్నది నేను ఒక్కడినే. నటన మీద ఆసక్తి వున్న పిల్లకాయలు కొంతమంది అమాయకంగా (నాలాగే?!) అందులో చేరారు. ఆ ప్రిన్సిపాల్ వాళ్ళకు అరచేతిలో వైకుంఠం చూపించి వీలయిననన్ని డబ్బులు నొక్కేసేవాడు. అలా అమాయకంగా పల్లెటూర్ల నుండి, టవున్ల నుండి వచ్చిన అబ్బాయిలు వృధాగా డబ్బులు ధారపోస్తుంటే జాలి అనిపించేది కానీ ఏమీ చెయ్యలేక ఆ ప్రిన్సిపాల్ కూడా బ్రతకాలి కదా అని నిట్టూర్చేవాడిని. 

ఆ అబ్బాయిలవి కృష్ణానగర్  కథల్లాగా దిల్‌షుక్‌నగర్ కథలు అన్నమాట. ఒక్కో అబ్బాయిది ఒక్కో దిక్కుమాలిన  కథ. ఎన్నో సమస్యలు వున్నా చిత్రరంగపై ఆసక్తితో, నటన మీది మక్కువతో ఆ ఫిల్మ్ స్కూలులో చేరేవారు. అందులోనే నివసించేవారు. వారు తమ తమ జీవితాలు నా దగ్గర వెళ్ళబోసుకుంటుంటే మహా జాలి కలిగేది.  అప్పట్లో నా పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదనుకోండి. నామీద నేను కూడా జాలి కురిపిస్తున్న రోజులవి కానీ నా కహానీ వారికి చెప్పేవాడిని కాదు.

ఓ RMP డాక్టర్ మాకు అధ్యాపకుడు. ఆయనకేదో చిత్రరంగంలోనో నాటకాల్లోనో ఏదో కొద్దిగా అనుభవం వున్నట్లుంది. దర్శకత్వం విద్యార్ధిని నేను ఒక్కడినే కాబట్టి నన్నూ నటన తరగతిలో పెట్టి చెప్పేవారు. నట విద్యార్ధులు చేసే ప్రాక్టీసు తమాషాగా అనిపించేది. క్లాసులు మంచి కాలక్షేపంగా జరిగిపోయేవి. ఏవో కొన్ని డైరెక్షన్ మెళుకువలు  నేర్చేసుకున్నాలెండి.   మొత్తం మీద కోర్సు పూర్తి అయ్యిందనిపించాం. ఇక దర్శకత్వం వహించాలనే దురద ఆగుతుందా? నాదో చిన్న వీడియో కెమెరా వుండేది. దాంతో ప్రయొగాత్మకంగా ఓ వీడియో సినిమా తియ్యాలని నా వుద్దేశ్యం. డబ్బులు ఏమో ఎక్కువ లేవు. అయినా సరే సిద్ధపడ్డాను.

అప్పట్లో యాహూ గ్రూప్స్ తెలుగు సరసమయిన కథల సైట్లలో విరివిగా రచనలు చేసేవాడిని. చాలా స్పందన వచ్చేది - అలాగే విమర్శలూనూ! నావి మామూలు కథాంశాలా మరి? ఎత్తడం ఎత్తడమే నెక్రోఫీలియా సబ్జెక్ట్ ఎన్నుకొని ఓ నవల వ్రాసేసాను. పాఠకులు దడుచుకున్నారు!  ఏమాటకామాటే  చెప్పలి - సబ్జెక్ట్ అది కానీ నవల మాత్రం ఓ యండమూరి సస్పెన్స్, క్రైం థ్రిల్లర్ లాగా ఎంతో బాగా వచ్చింది. నేననుకోవడమే కాదు - కొంతమంది పాఠకులూ అదే అన్నారు. అయితే పాఠకులు ఇవేం సబ్జెక్టులు మహాప్రభో అని అరచి గావుకేకలు పెట్టడంతో పాపం వాళ్ళ మీద జాలిపడి ఆ సైటులోనుండి ఆ నవల తొలగించాను. ఆ తరువాత దాని సాఫ్ట్ కాపీ పోయింది -  ఎంత వెదికినా దొరకలేదు. 

ఆ తరువాత 'బ్రెత్ కంట్రోల్ ప్లే' మీద మాంఛి రోమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ వ్రాసాను. అదీ ఎంతో బాగా వచ్చింది. అయితే కొంతమంది చదువరులు మళ్ళీ నన్ను తిట్టేసారు :( నువ్వు మనిషివా లేక మోహన్‌బాబువా అన్నారు! ఏమాటకామాటే చెప్పాలి - నాకూ నామీద డవుట్ వచ్చింది.  పాఠకుల విజ్ఞప్తి పై ( నిజానికి డిమాండ్ చేసారు లెద్దురూ) అదీ ఆ సైటులోనుండి తీసేసాను. దాని సాఫ్ట్ కాపీ కూడా పోయింది కానీ హార్డ్ కాపీ అప్పట్లో వుండేది. నా నవలల్లో ముగింపు చాలా బాగా వుండేది. ఈ నవల్లో కూడా ముగింపు చదివి గుండె కొన్ని క్షణాలు కొట్టుకోవడం ఆగినట్లు అనిపించిందని కొంతమంది అభిమాన పాఠకులు చెప్పారు. నాక్కూడా ఈ నవల్లోని ముగింపు కూడా బాగా నచ్చింది. నిర్ఘాంతపోయేలా, నిద్రపోతున్న ముఖం మీద చన్నీళ్ళు  చల్లినట్లుగా వుంటుంది అది.  

మామూలు వీడియో సినిమా తీస్తే గుర్తింపు దక్కదని ప్రేక్షకులు హడలిపోయే సినిమా తియ్యాలనుకున్నా. నెక్రోఫీలియా నవల ఆధారంగా సినిమా తీస్తే ప్రేక్షకులు నన్ను పిచ్చికుక్కను తరిమినట్టు తరిమి తరిమి కొడతారనే దృశ్యం అర్ధమయ్యి ఆ ఆలోచన శుబ్బరంగా ముగించా. అన్నట్టు ఆ నవల పేరు "ఓ నేస్తమా, ఇంక సెలవు". ఎంతో చక్కని పేరు పెట్టి ఎంతో ఛండాలమయిన సబ్జెక్ట్ వ్రాసావు అని తిట్టారనుకోండి కానీ అది వ్రాసినందుకు అనుకున్న, ఆశించిన ఫలితం దక్కింది. పాఠకుల్లో యమ గుర్తింపు వచ్చింది. ఓ సంచలన రచయిత అయిపోయాను.  ఇహ బ్రెత్ కంట్రోల్ ప్లే (BCP) మీద వ్రాసిన తుదిశ్వాస నవల మీద దృష్టి సారించాను. అది సినిమాగా తియ్యాలని నిశ్చయించాను. రచయితా, దర్శకుడూ, నిర్మాతా వున్నాడు - ఎవరూ - నేనే. సినిమాటొగ్రఫీ  కోసం ఓ చక్కని స్టుడెంట్ వున్నాడు. వీడియో కెమెరా నాదేలెండి. ఆ నవల్లో ఎక్కువ పాత్రలు వుండవు. ముఖ్యంగా ఇద్దరే - హీరో హీరోయిన్లు. వాళ్ళు కావాలి కదా. నేనే హీరో గా నటిస్తా అంటే చూసిన ప్రేక్షకులు తిరగబడతారేమో అని తోకముడుచుకున్నాను. డబ్బులు ఆదా చెయ్యడానికి హీరోయిన్ వేషం నేనే వేస్తే పోలా అని బ్రహ్మానందం 'అత్తారింటికి దారేది ' సినిమాలో అనుకుంటా చేసినట్లుగా చేద్దామనుకున్నా కానీ మళ్ళీ ప్రేక్షకులు గుర్తుకువచ్చి దడుచుకున్నాను. సినిమా తీసాక చూసేది నేనొక్కడినే కాదు కదా! 

ఇక హీరో హీరోయిన్ల కోసం వేట మొదలయ్యింది. ఎంత గొప్ప నటులు ఆ పాత్రల కోసం దొరికారో "పాత్రలూ - 'పాత్ర'ధారులూ" అనే తరువాయి ఎపిసోడులో చదువుదురు గానీ ఇప్పటిక సశేషం.  

6 comments:


  1. హమ్మయ్య ! టపా మొత్తం లో సినిమా గురించి రాయకుండా అట్లా నవల ల తో నే ముగించే స్తా రను కున్నా !

    జిలేబి అని ఒకావిడ అరవై ఆరు సంవత్సరాలు పై పడ్డది ఒకావిడ బ్లాగు లోకం లో టైం పాస్ జేస్తుంది ! ఆవిడ ఈ మధ్య ఎదో బ్లాగు నో అట్లీస్ట్ ఐటం సాంగ్ కోసమైనా వేసుకోండి అని మొర పెట్టుకున్నట్టు గా గ్రేప్ వైన్ వార్త ! మీ సినిమాలో హీరొయిన్ కి పనికొస్తుందనుకుంటా ! ఎట్లాగు 'లాస్ట్' బ్రేడ్త్ గురించి కథ కాబట్టి (తుది శ్వాస) తీస్తో తీస్తో టా అంటే సచ్ ఏ నేచురల్ మూవీ అంటూ టాగ్ లైన్ పెట్టి మార్కెట్టు లో విడుదల చేయించ వచ్చు ! ఏమంటారు ?

    జిలేబి

    ReplyDelete
  2. Oh..thats cool bro.. I tried to read your earlier (normal) novels like Vuri..but after reading few pages,i lost that as my hdd crashed.. but to be frank another novel.. based on some biological virus fiction was boring... :) ..

    ReplyDelete
  3. Hey bro.. is that you.. who wrote the things under kama shastry pen name ? rofl .. lol ...

    ReplyDelete
  4. @ జిలేబీ
    తుదిశ్వాస నవల ఇప్పుడు బాగా గుర్తుకులేదు గానీ ముగింపు మీరన్నట్లుగానే దాదాపుగా వుంటుంది కాబట్టి జిలేబీ గారు బాగా ఆ పాత్రకి సరిపోతారు! అందులో ప్రేమికులు ఎందుకో విడిపోతారు. ఆ తరువాత ఆమె వృద్ధురాలు అయిన తరువాత టొరొంటో సబ్‌వేలో మాజీ ప్రియుడు కనిపిస్తాడు. అతనితో గడిపిన క్షణాలూ, బ్రెత్ కంట్రోల్ ప్లేలూ ఆమెకు గుర్తుకువస్తాయి కానీ పక్కన ఆమె ఫామిలీ వుండటం వల్ల అతనిని కలుసుకోలేకపోతుంది - కేవలం చూపులు మాత్రమే కలుస్తాయి. అటువైపు అతనికీ యమ సంతోషంగా, ఉద్విగ్నంగా వుంటుంది కానీ ఆమెను కలుసుకోలేడు. అయితే అప్పట్లో వాళ్ళు వాడిన సంకేతపదం మాత్రం ఆమెకు వినిపించేలా అంటాడు. ఆ పదం ఆమె విన్న మరుక్షణం ఆమె అతని పట్ల ఎంతో అనురక్తితో, భక్తితో తన శ్వాస బిగపడుతుంది. ఆ సంకేతపదం ఎప్పుడు అతను అన్నా ఆమె అలా ఊపిరి బిగపట్టాలన్నమాట. అలా ఎందుకు అనేది నవల పూర్తిగా చదివి తెలుసుకుంటేనే బావుంటుంది కానీ సాఫ్ట్ కాపీ లేదు, హార్డ్ కాపీ కూడా ఎక్కడన్నా వుందో లేదో తెలియదు. కొన్ని క్షణాల తరువాత అతను ఇంకో సంకేతపదం అనాలి. అప్పుడు ఆమె శ్వాస తీసుకుంటుంది. అయితే తన స్టేషన్ వచ్చిన హడావిడిలో అతను ఇంకో సంకేతపదం చెప్పకుండానే దిగిపోతాడు. ఆమె ఆ సంకేతపదం కోసం ఎదురుచూస్తూ...నే వుంటుంది. ఆ తరువాత ఏమవుతుంది అనేది పాఠకుల ఊహకే వదిలేసాను. నవల్లో చక్కగా వ్రాసాను ఈ ఘట్టం కానీ ఇక్కడ ఏదో క్లుప్తంగా వివరించాను.

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    ఈ క్రింది సైటులో నా నవలలు కొన్ని పెట్టాను. అందులో కొన్ని అడల్ట్ నవలు. ఇందులోనుండి ఉరి నవల తీసివేసా కానీ మళ్ళీ ఎప్పుడు అయినా పెడతాను. అప్పుడు తెలియపరుస్తా. వైరస్ ల మీద ఎప్పుడు ఏం నవల వ్రాసానో నాకు గుర్తుకులేదు. అప్పట్లో నా బ్లాగులో ఒక నవలిక సీరియల్ గా వ్రాసా - బహుశా అది అయ్యుంటుంది. అవును, అది ఫెయిల్ అయ్యింది. అది ఎందుకు విఫలం అయ్యిందో ఆ సీరియల్ అయిన తరువాత నా బ్లాగులో విశ్లేషించాను కూడా. అది సరిగా రాలేదు కాబట్టే మళ్ళీ బ్లాగులో సీరియల్ నవల వ్రాయాలన్న ఆసక్తి కలగలేదు.

    https://sites.google.com/site/sarathkaalam/home

    ReplyDelete
  6. @ అజ్ఞాత
    హహ. ఆ కామశాస్రిని నేను కాదులెండి. మీలాగే ఇంకా కొందరు కూడా పొరబడ్డారు! మొదట్లో నాకు మంచి నెట్ స్నేహితుడిగా వుండేవాడు. అతని అసిస్టెంట్ నీహారిక నా నవలల ప్రూఫ్ రీడింగులో సహాయ పడుతుండేది. అలా కాస్త క్లోజ్ ఫ్రెండ్స్ మి అయ్యాం (నెట్టు లోనే లెండి). ఆ విషయం అతనికి తెలిసి మా ఇద్దరినీ కట్ చేసాడు, తనూ కట్ అయ్యాడు :))

    ఇకపోతే అతని కథలు నాకు ఏమాత్రం నచ్చేవి కావు.

    ReplyDelete