అర్ధరాత్రి అర్జంట్ కాల్

గతరాత్రి పన్నెండుగంటల తరువాత మా ఫోన్ మ్రోగసాగింది. ఎత్తాను. మా అమ్మాయితో మాట్లాడవచ్చా అని అటువైపునుండి ఓ మహిళ కంఠం. ఆదివారం రాత్రి అంత అర్జంటుగా ఏం మాట్లాడాలబ్బా అనుకుంటూ మీరు ఎవరు అని అడిగాను. "...పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం. మీ అమ్మాయితో మాట్లాడాలి" అంది. ఇదేమన్నా ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నాను. గతంలో ఒకసారి కెనడాలో వున్నప్పుడు ఇలాగే అర్ధరాత్రి ఒక ప్రాంక్ కాల్ వచ్చిన విషయం గుర్తుకువచ్చింది. మా పాప పడుకుంది అని చెప్పాను. మీరు తన తండ్రా అని అడిగింది ఆమె. అవును అని చెప్పాను. "మీ పాప స్నేహితురాలు ... గతకొన్ని గంటల నుండి తప్పిపోయింది. వెతుకుతున్నాం. ఆ అమ్మాయి తరచుగా మీ పాపకి ఫోన్ చేస్తుంటుంది కాబట్టి మీ పాపకి ఏమయినా తెలుసేమో అని ఫోన్ చేస్తున్నాం" అని ఆ పోలీస్ ఆఫీసర్ అంది. మీ ఇంటికి ఈరోజు ఏమయినా వచ్చిందా అంటే రాలేదు అని చెప్పాను. ఏమయినా సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషనుకి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి పెట్టేసింది. 

ఆ అమ్మాయి ఆఫ్రికన్ అమెరికన్. వయస్సు పదకొండు లేదా పన్నెండు. మా పాపకి వున్న మంచి స్నేహితురాళ్లలో ఆమె ఒకరు. నన్ను చక్కగా మిస్టర్ అంటూ మా ఇంటి పేరుతో పిలుస్తుంటుంది. మా పాప పొద్దున లేచాక నిన్న ఏమయినా అమ్మాయి తనను కాంటాక్ట్ చేసిందేమో కనుక్కున్నా. లేదని చెప్పింది. విషయం క్లుప్తంగా చెప్పి స్కూల్ కి వెళ్ళాక ఆ అమ్మాయి వివరాలు ఏమయినా తెలుస్తాయేమో కనుక్కొమ్మని చెప్పాను. ఆ అమ్మాయి దొరికిందా లేదా అని కనుక్కోవడానికి ఆమె తల్లి ఫోన్ నంబర్ మా దగ్గర లేదు. తండ్రి విడాకులు తీసుకున్నాడు. ఎక్కడవుంటాడో మాకు తెలియదు.  

ఆ అమ్మాయి క్షేమమేనని, దొరికేసివుంటుందని ఆశిద్దాం.

సిక్కయ్యానోచ్!


Medical Flat Boot

పాశ్చాత్య జీవనంలో ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే సులభంగా అనారోగ్యం రాకపోవడం. సాధారణ అనారోగ్యం వచ్చినా ఒక పూటో, ఒక రోజో వుంటుంది అంతే. కాస్త నలతగా అనిపించి సిక్ లీవ్ తీసుకున్నా కూడా ఒక రోజుకన్నా ఎక్కువ అలా తీసుకోవడానికి మొహమాటంగా వుంటుంది. నిజంగా అనారోగ్యానికి గురి అయ్యి సిక్ లీవ్ ఒక్క రోజు తీసుకున్నా అది బోగస్ అనే సాధారణంగా ఆఫీస్ ప్రజలు అనుకుంటారని అంటారు.  అదే ఇండియాలో వున్నప్పుడు అయితే తరచుగా జ్వరాలు వచ్చేవి - ఓ వారం అయినా వుండేవి. అన్నిరోజులు మనం దర్జాగా గడుపుతూవుంటే ఇంట్లో వారు సపర్యలు చేసేవారు. జరుగుబాటు వుండే జ్వరం వచ్చినంత సుఖం లేదని సామెత కూడా వుంది కదా.
 
ఈ దేశాలకు వచ్చిన తరువాత 1999 డిసెంబరులో కెనడాలో ఓ సారి ఫ్లూ వచ్చి ఓ పది రోజులు ఆఫీసుకి వెళ్ళలేకపోయాను కానీ జరుగుబాటు జరగలేదు :( కారణం మా పాప స్కూల్లో ఫ్లూ తగిలించుకొని వచ్చి నాకూ, మా ఆవిడకీ, మా ఇంట్లోనే అప్పుడు వున్న మా మేనల్లుడికీ అంటించింది.  అప్పుడు నాకు ఫ్లూ వాక్సిన్ల గురించి అవగాహన లేదు. ముందుగా మూడురోజుల్లో కోలుకుంది నేనే. కిందామీదా పడి ఎలాగోలా ఓపిక తెచ్చుకొని ఇంట్లోవారికందరికీ నేనే సపర్యలు చేసి వారిచేత సెబ్బాస్ అనిపించుకున్నా :(  అలా నేను బాగా సిక్కయ్యానన్న ఆనందం ఆవిరి అయ్యింది. ఆ తరువాత కొన్ని నెలల క్రితం ఓ చిన్న సర్జెరీ అయి కొద్దిరోజులు ఇంట్లోనే వున్నాను.
 
మళ్ళీ ఇన్నాళ్లకి కాస్తంత కాలం అనారోగ్యం కలిగింది. గతవారం ఒకరోజు రాత్రి కాలు నొప్పిగా అనిపించి ఆశ్చర్యం వేసింది. ఏం జరిగిందబ్బా అని బుర్ర గోక్కుని జ్ఞాపకాలు రివైండ్  చేసుకొని చూసుకుంటే ఓ రెండు రోజుల క్రితం నా కుడి పాదానికి బాత్రూం తలుపు తగిలి స్వల్పంగా నొప్పి అనిపించడం గుర్తుకువచ్చింది. హోం రెమెడీస్ నడిపిస్తూ స్వల్పంగా కుంటుకుంటూ ఆఫీసుకి రెండు రోజులు అలాగే వెళ్ళాను. మూడో రోజు రాత్రికి వాచిపోయింది! నన్ను నడవనియ్యలేదు. ఆఫీసు ఎగ్గొట్టి గాభరాగా డాక్టరు దగ్గరికి వెళ్ళాను. అతను మరింత గాభరాగా బొటనవేలి ఎముక ఫ్రాక్చర్ అయ్యిందేమో అన్నాడు. ఎక్స్-రేలకు వ్రాసాడు. మరీ బాత్ రూం తలుపు తగిలినంతనే పాదం ఫ్రాక్చర్ అవుతుందా అనుకున్నా.  పాదం వంగకుండా మెడికల్  ఫ్లాట్ బూట్ ఓ వారం వాడమన్నాడు! ఫ్రాక్చర్ అయితే నెలన్నర వాడాలి అన్నాడు. అదే అయితే కనుక క్రచెస్ కూడా వాడాల్సివుంటుంది అన్నాడు. అవన్నీ వేసుకొని ఆఫీసుకి వెళ్ళాల్సి వుంటుంది. ప్రస్థుతానికి ఓ వారం ఆఫీసుకి వెళ్ళకుండా పాదానికి విశ్రాంతి ఇవ్వమన్నాడు. 
 
అదేరోజు ఎక్స్-రే ఫలితాలు వచ్చాయి. ఫ్రాక్చర్ ఏమీ లేదు. సంతోషం. మా డాక్టర్ పెయిన్ కిల్లర్స్ వాడొద్దని చెప్పి నొప్పి తగ్గటానికి కొన్ని హెర్బల్ మందులు సూచించాడు. పాదానికి పసుపు పట్టించమన్నాడు. పసుపు రోజూ ఓ మూడు చెంచాలు పాలల్లో వేసుకొని తాగమన్నాడు. మా వైద్యుడు డాక్టర్ ఆఫ్ ఆస్టియోపతీ లెండి.  వాటికి తోడుగా హీట్ ప్యాడ్, కూల్ ప్యాడ్ లు వాడుతున్నాను. నొప్పి, వాపు రోజురోజుకీ స్వల్పంగా తగ్గుతున్నాయి. వచ్చేవారం కల్లా పూర్తిగా నయం అవచ్చు. ఈ వారం అంతా మెడికల్ లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ క్రింద ఇంట్లోనే వుంటున్నా. అదండీ సంగతి.

మా మామగారి ఆశ్రమం!


ఇది అచలాశ్రమం ఫోటో కాదు
 
 
పెళ్ళికి ముందు: అప్పట్లో డిస్టర్బుడ్ గా వున్న రోజుల్లో ఏ ఆశ్రమంలో నయినా కొన్ని నెలలు తలదాచుకుంటే బావుంటుందనుకునేవాడిని. ఒకరోజు మా మిత్రుడి పనిమీద అతనితో కలిసి మా టవునుకి కొంత దూరంలో వున్న ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో అచలాశ్రమం పేరిట చక్కటి ప్రదేశం కనిపించింది. అందులో చేరితే బావుండును అనుకున్నా కానీ తీరికలేకనో ఎందుకో లోపటికి వెళ్ళి వివరాలూ కనుక్కోలేదూ - అందులో చేరనూ లేదు - ఎందులోనూ చేరలేదు.
 
పెళ్ళి అయిన తరువాత: మా అత్తగారిది అదే ఊరు. చిత్రంగా ఆ ఆశ్రమం మా మామగారిదే. వారే అచల మార్గ బోధకులు. నాకు నవ్వొచ్చింది. పెళ్ళికి ముందు ఆ ఆశ్రమంలో చేరివుంటే నా కాబోయే భార్యకి సైటు కొట్టి వుండేవాడినేమో. మా అత్తగారి ఇల్లు ఆ ఆశ్రమానికి చాలా దగ్గర్లో వుంటుంది మరీ!
మామగారు దేశమంతా తిరుగుతూ అచల బొధ చేస్తుంటారు. నా పెళ్ళయిన కొత్తలో నాకు చాలా బోధించాలని చూసారు కానీ నాకు ఎక్కక తిక్కగా అనిపించేది. నాకీ బోధలు వద్దు మహాప్రభో అని ఒకసారి స్పష్టంగా చెబితే ఇహ అప్పటినుండీ వదిలేసారు. కొద్దిసేపంటే భరించవచ్చు కానీ గంటలకు గంటలు ఆ బోధ ఎవరు భరిస్తారు చెప్పండి? అసలే కొత్తగా పెళ్ళయిన రోజులాయే - మనస్సు మరెక్కడో వుంటుంది కాదా?  
 
ఒకరోజు అందరం కలిసి ఆ ఆశ్రమానికి వెళ్ళాం. చిన్న ఆశ్రమం - అసలు దానికి ఆశ్రమం అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు - చిన్న మందిరం అది కానీ చక్కగా చిన్న చిన్న చెట్లు మొక్కలతో ప్రశాంతంగా వుంది. అందులో అచల గురువుల విగ్రహాలు వున్నాయి. ఒక భక్తురాలు అందులో వుంటూ ఆ ఆశ్రమానికి సేవలు చేస్తుంటుంది. ఆమె వుండటానికి ఓ రెండు గదుల నివాస ప్రదేశం మందిరం పక్కనే వుంది. ఇంకా ఎవరయినా వచ్చి ఆ ఆశ్రమంలో గడుపుతామంటే వీలవుతుందో లేదో. అంతకూ ఎవరయినా వస్తే మరెక్కడన్నా బస కల్పిస్తారేమో.  
 
మా మామగారు మా దగ్గరికి (యుఎస్ కి) వచ్చినప్పుడు నన్ను అచల మార్గ అమెరికా శాఖాధిపతిగా నియమిద్దామనుకున్నారు కానీ ఎక్కడా వారి బోధనలకు నేను దొరికితే కదా. నాగురించి వారికి అంతా తెలియదు పాపం. వారిది అచలమార్గం అయితే నాది చలమార్గం (రచయిత చలం)  అని క్లుప్తంగా చెప్పి తప్పించుకున్నాను. అయితే మా మామగారూ, తన మామగారూ కలిసి మా పొరుగింటాయనకు గంటల కొద్దీ బోధించేవారు. వాళ్ళ మామగారిది సహజమార్గం. మా నైబర్ కాస్త మొహమాటస్థుడు అని మీకు అర్ధమయ్యే వుంటుంది. 

శాంతి ఆశ్రమం నుండి ఉత్తరాలు


ఇరవై ఏళ్ళ క్రితం దివ్యా వీడ్ అనే అమెరికన్ తన తల్లితండ్రులకు శాంతి ఆశ్రమం నుండి వ్రాసిన ఉత్తరాలు ఇంటర్నెట్ లో పెట్టింది. నిన్ననే ఆ ఉత్తరాల సంకలనం పూర్తి చేసాను. చక్కగా అనిపించాయి ఆమె వ్రాతలు. ఒక అమెరికన్ దృష్టికోణంలో ఇక్కడి ఆశ్రమ అనుభవాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. ఈ ఆశ్రమం కాకినాడకి రెండుగంటల దూరంలో (పీఠాపురానికి గంట దూరం అనుకుంటా) తొటపల్లి హిల్స్ గ్రామలో వుంటుంది.

http://www.wattpad.com/user/DivyaWeed

నాకు దేవుడు, మోక్షం వగైరాల మీద ఇంకా విశ్వాసం లేదు కానీ సెక్యులర్ స్పిరిచువాలిటీ (లౌకిక ఆధ్యాత్మికత అనొచ్చా?) మీద ఆసక్తి బహుమెండు. భక్తి లేదు కానీ ప్రార్ధనలు, భజనలు, ధ్యానం అంటే ఇష్టం.   ఎంటో ఈ ద్వైదీ భావాలు. నేనెప్పుడు నాకు అర్ధం అవుతానో ఏంటో. శాంతి ఆశ్రమం గురించి చదివా కాబట్టి దాని గురించి వివరాలు సేకరిస్తున్నాను. ఇవాళే ఆ ఆశ్రమ నిర్వాహకులు అంజనేయులు గారికి ఫోన్ చేసాను. ఒక రెండు వారాలు వుంటాను అని అన్నాను. జూన్, జులైలో అక్కడ కాస్త వేడిగా వుంటుంది కాబట్టి కోటగిరి ఆశ్రమం నాకు బావుండగలదని తెలిపారు. దివ్య రచనలు చదవడం వల్ల నాకు కోటగిరి ఆశ్రమం గురించి తెలుసు. ఊటీకి దగ్గర్లోని పర్వత ప్రాంతం అది. శాంతి ఆశ్రమం శాఖ అక్కడ వుంది. నాకు ఆశ్రమాలే నచ్చుతాయనుకుంతే పర్వత ఆశ్రమాలు ఇంకా బాగా నచ్చేస్తాయి. కానీ అక్కడికి ఆశ్రమ వాసం పేరిట వచ్చే ధనవంతులయిన యాత్రీకులే ఎక్కువని దివ్య తన ఉత్తరాల్లో వివరించింది.

http://www.wattpad.com/story/1275774-letters-from-shanti-ashram-india


ఇహపోతే ఆశ్రమ వాసం అంతా ఈసారి ఒక్క ఆశ్రమంలో చెయ్యాలా లేక వారానికో ఆశ్రమం తిరగాలా, ఒక్కడినే వెళ్ళాలా లేక కుటుంబంతో వెళ్ళాలా లేక ఆసక్తి చూపించే బంధుమిత్రులు ఎవరయినా వుంటే వారితో కలిసి వెళ్ళాలా అనేవి నా ధర్మ సందేహాలు. 

శాంతి ఆశ్రమానికే తప్పనిసరిగా వెళతా అని కాదు. ఇంకా మిగతా ఆశ్రమాల వివరాలు కూడా సేకరిస్తాను. ఇలా ఆశ్రమవాసం మీద ఆసక్తి చూపిస్తున్నా అని పూర్తిగా సన్నాసి అయిపోయా అనుకోకండి. దేనిదారి దానిదే సుమీ. ఒక్కోక్కప్పుడు ఒక్కోదానిమీద ఆసక్తి మెండుగా వుంటుందంతే.

మంచి ఆశ్రమాలు సూచించండి


రెండు మూడు నెలల తరువాత ఓ నెల కోసం నేను ఇండియా వచ్చే అవకాశాలు వున్నాయ్. ఆ సమయంలో వీలయినంత వరకు చక్కని ఆశ్రమాలలో ప్రకృతికి, ప్రశాంతతకు దగ్గర్లో నివసించాలని వుంది. అలా అని డబ్బులు బాగా వసూలు చేసే సంస్థలు వద్దు.   నిరాడంబరంగా వుండే, వ్యాపార ధోరణి లేని ఆశ్రమాలు సూచిద్దురూ. నెట్టులో వెతికితే కొన్ని కనపడ్డాయి కానీ మీకు తెలిసినవి మరి కొన్ని వుండొచ్చు కదా అని ఈ విధంగా కోరుతున్నాను.

ఈ సారికి మాత్రం తెలుగు ప్రాంతం ఆశ్రమాలే దర్శించదలుచుకున్నాను. 

శాంతి ఆశ్రమం గురించి దివ్యా వీడ్ వ్రాసిన ఉత్తరాలు ప్రస్థుతం చదువుతున్నాను:
http://www.wattpad.com/story/1275774-letters-from-shanti-ashram-india