వాలీబాల్ వాతలు

నా గత పోస్టులు చదివినట్లయితే వాలీబాల్ మొదలెడుతున్నామని అప్పట్లో వ్రాసిన పోస్ట్ మీకు గుర్తుండేవుంటుంది. వేసవి అంతా భేషుగ్గా వాలీబాల్ ఆడాము. మగవాళ్ళం (కొన్నిసార్లు ఆడాళ్ళు కూడానూ)  ఆట ఆడుతుంటే ఆడాళ్ళు రింగ్ బాలో, టెన్నిసో ఆడేవారు లేదా చెట్ల క్రింద కూర్చొని ముచ్చట్లు చెప్పుకునేవారు. పిల్లలేమో ఎంచక్కా ప్లే ఏరియాలో ఆడుకునేవారు. 

అయితే ప్రతిదానికి పక్క ఎఫెక్ట్స్ అనగా సైడ్ ఎఫెక్ట్స్ వుండేట్లు గానీ వాలీబాల్కి కూడా వుంటాయి కదా. అందరికీ అంతో ఇంతో ఎఫెక్ట్ పడింది. ఆటరాక ఏదో ఒక విధంగా  ఆడిన నాకూ, నా సమ వయస్కుడికీ ఓ భుజం నొప్పి (Rotator Cuff Tendinitis ?) వచ్చేసింది. ఆట బాగా ఆడిన వారికి మణికట్టు నొప్పులు, వేళ్ళ నొప్పులూ, మోకాలి కీళ్ళ నొప్పులూ మొదలయ్యాయి. మామూలుగా ఆడిన కొద్దిమందికి మాత్రం పెద్దగా ఏమీ కాలేదు. నొప్పులు వున్న వారం ఏదో ఒకవిధమయిన చికిత్స తీసుకుంటున్నాం. ఈలెక్కన ఈ నొప్పులు వచ్చే వేసవికి తగ్గుతాయో లేదో తెలియదు. అప్పుడు ఎంతమంది ఈ ఆట ఆడుతారో తెలియదు. 

ఎందుకొచ్చిన వాలీబాల్ అనుకొని కొందరం హాయిగా చెట్ల క్రింద కూర్చొని 'రాముడు - సీత' చిట్టీల ఆటో లేక 'దొంగ - పోలీసు' చిట్టీల ఆటో మొదలెట్టేస్తామేమో తెలియదు. చూడాలి. ప్రస్థుతం అయితే చలికాలం కాబట్టి వారాంతాలు ఏవయినా ఇండోర్ ఏక్టివిటీస్ మొదలెట్టాల్సివుంది.

'గ్రావిటీ' కి ఆకర్షితులం అయ్యాం కానీ..

సాండ్రా బుల్లాక్ ప్రధాన పాత్రలో నటించిన గ్రావిటీ సినిమా మీరు చూసారా? మీ అభిప్రాయం ఏంటి? ఓ ఆ సినిమా గురించి సమీక్షలూ, అభిప్రాయాలూ చాలా గొప్పగా వుండటంతో మనసాగక కొన్ని వారాల క్రితం సకుటుంబసపరివార సమేతంగా అనగా మా ఆవిడ్ని, పాపని వెంటేసుకొని ఆ సినిమాకి వెళ్ళాను. స్పేస్ ఫిక్షన్ అయినా స్పేస్ నాన్ ఫిక్షన్ అయినా నాకు బాగా ఇష్టం. కొంతమంది అయితే '2001: ఎ స్పేస్ ఒడెస్సీ' అంత గొప్ప చిత్రమని పోల్చారు. ఇంకా ఆగుతానా? బాహ్గానే వుంది కానీ అనుకున్నంత గొప్పగా ఆ సినిమా మాకు అనిపించలే. సైన్స్ ఫిక్షనుకి తక్కువ, వీడియో గేముకి ఎక్కువగా అనిపించాయి స్పెషల్ ఎఫెక్ట్సూ.  ఎందుకబ్బా అని రంధ్రాన్వేషణ చేస్తే అర్ధమయ్యింది. ఏంటో ఊహించండి చూద్దాం.

అంత గొప్ప చిత్రాన్ని డబ్బులు తక్కువ అవుతాయని డబ్బా టాకీసులో చూస్తే అలాగే వుంటుంది. ఆ సినిమాను 3-డి లో వీలయితే IMAX తో కలిపి చూడాలంట. ఆత్రగాడికి బుద్ధి మట్టు కదా. నేనేమో మా ఇంటికి దగ్గర్లో వున్న ఓ డొక్కు మల్టిప్లెక్స్ కి వెళ్లాను. ఆ తెర హోం థియేటరు కంటే కొద్దిగా పెద్దగా వుంటుందేమో. ఇంకా ఆ తెర మీద సాండ్రా బుల్లాక్ గ్రావిటీకి ఏం పడిపోతాం? అన్నట్లు అంత వయస్సులో కూడా ఆమె యొక్క ఓ సన్నివేశం బలే వుంటుంది.

మీరు ఎక్కడ చూసారు? మీకెలా అనిపించింది. కొంత మంది విమర్శకులు, ప్రేక్షకులూ ప్రవచిస్తున్నట్లుగా అంత గొప్ప సైన్స్ ఫిక్షన్ చిత్రరాజమా అది?

'విల్లా' గేటు దూకి 'మసాలా' మధ్యలోకి వచ్చి పడ్డాం - కి కి కీ

విల్లా (పిజ్జా 2 ) సినిమా సమీక్షలు చూస్తే బానే వున్నాయి. హరర్స్ కాదుగానీ థ్రిల్లర్స్ అంటే నాకు ఇష్టం. అయితే ఇది హరరో థ్రిల్లరో లేక రెండు కలిపినదో నాకర్ధం కాలేదు. రెంటికీ తేడా ఎంటని నన్నడక్కండేం. పిజ్జా చూట్టం కుదర్లేదు కాబట్టి ఇదయినా చూడాలని తీర్మానించేసుకున్నా. మా అమ్మలుకీ (చిన్నమ్మాయ్)  థ్రిల్లర్స్ అంటే ఇష్టం. విల్లాకి వెళదామా అంటే సై అంది. మా ఆవిడ్ని అడిగా - చక్కటి సినిమాలు తనకి నచ్చవు కాబట్టి రాను పొమ్మంది. టిక్కెట్టు డబ్బులు మిగుల్తున్నాయ్ కదా అని సంతోషించా.  తీరా చూస్తే మా నగరంలో తెలుగు వర్శను రిలీజు అయినట్టు లేదు. తమిళం వుంది. అయినను సరే విల్లాకు పోవలె అని మేమిద్దరం తీర్మానించుకున్నాం. సబ్ టైటిల్స్ వుంటయ్ కదా డేడీ అంది - వుండొచ్చు అన్నా. వున్నా లేకపోయినా విల్లాకి వెళ్ళి తీరాల్సిందే అని డిసైడ్ చేసినం.

ఆలస్యం అవడంతో ఉరుకులు పరుగులతో 6 గంటల షోకి వెళ్ళాం. లోపట ధూం 3 ట్రైలర్ నడుస్తోంది. ఆ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా థియేటరుకి వెళ్ళి చూస్తాం - ఎంతయినా మా షికాగోలో చిత్రీకరించేరు కదా! సినిమా హాల్లోకి వెళ్ళి చూసి "ఓ బోయ్" అనేసా. మా అమ్మలు ఖంగారు పడి ఏంటని అడిగేసింది. ఏం చెప్పనూ? థియేటర్లో ఒక్కరు లేరు! అసలే ఇది హరర్ సినిమా అని అనుమానంగా వుంది. వద్దులే ఈ సినిమా అంది. టికెట్లు కొని మరీ సినిమా చూడకుండా వెళ్ళడం బావోదేమో అని "ఇంకా జనాలు వస్తార్లే" అని సర్ది చెప్పా. ధూం ట్రైలర్ చూస్తూ ఎవరయినా జనాలు వస్తారేమో అని వేచి చూసాం. ఊహు - ఎవరూ రాలేదు. 

ఈ సినిమా వద్దు - పక్కనే వున్న మసాలాకి వెళ్దాం అంది. నాకు పౌరుషం వచ్చింది - తండ్రిగా నా బాధ్యత గుర్తుకు వచ్చింది. "ఏం పర్లేదు - ధైర్యంగా ఈ సినిమా చూడు - నేను వున్నాగా నీ పక్కన" అని మేకపోతు గాంభీర్యంతో ధైర్యం చెప్పా. సినిమా మొదలయ్యింది - మాకు వణుకు మొదలయ్యింది. హీరో తల్లి ఏక్సిడెంట్ సీన్. హ్మ్. అలా అలా సినిమా విల్లాలోకి వెళ్ళింది.  అయినా సరే ఒక్క ప్రేక్షకుడూ రాడే. చచ్చింది గొర్రె అనుకున్నా. విల్లాలో వింతవింత శబ్దాలు మొదలయ్యాయి. నా గుండెలో కూడా అంతే. మా అమ్మలు పరిస్థితీ అంతే. జీరబోయిన కంఠంతో "మసాలాకి వెల్దామా మరి" అని అడిగేసా. పద పద అంది. అంతే బయటకి వచ్చి పడ్డాం. 

బయటకి వచ్చి తికెట్లు తీసుకునే అతనితో "మా అమ్మాయి భయపడుతోంది. మసాలా సినిమాకి వెళతాం" అని చెప్పాను. మా అమ్మాయి నా ముఖమే చూస్తోంది! వెళ్లమని చెప్పాడు. అప్పటికి ఇంటర్వెల్ అయిపోయింది. 'బోల్ బచ్చన్' అప్పటికే చూసేసాం కాబట్టి కథ గురించి కంఫ్యూజన్ ఏమీ లేదు లెండి. షాజన్ పదంసీ ఆరెంజ్ సినిమా చూసినప్పుడు కొద్దిగా నచ్చింది కానీ ఈ సినిమాలో డొక్కుడొక్కు అనిపించింది. అంజలి కూడా అంతే. సీతమ్మ వాకిట్లో...సినిమాలో ఎంత నచ్చింది అనీ. పాపం సీతమ్మ వారికి ఎన్ని కష్టాలో! అందుకేనేమో ఈ సినిమాలో కళ తప్పింది. టోకుగా మసాలానే రుచి తప్పింది. చూసామంటే చూసామని ఆ సినిమా చూసి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి చూస్తే మా ఆవిడ టివిలో గౌరవం సినిమా చూస్తోంది! అదృష్టవశాత్తూ అది ముగింపుకి వచ్చేసింది.

ఇంతకీ విల్లా ఎవరయినా చూసేరా? ఎలా వుందేంటీ? బాగుందని చెప్పకండేం - నా మనస్సు మూల్గుతుంది మరి.

అన్నట్లు సినిమా నుండి కారులో తిరిగి వస్తున్నప్పుడు ఓ దృశ్యం గుర్తుకువచ్చింది. 'రాత్రి' సినిమాలో థియేటర్ దృశ్యం. ఇంకా నయ్యం హాల్లో వుండగా అది గుర్తుకురాలేదు!

గమనిక: దయ్యాలు అంటే నాకు నమ్మకం లేదు కానీ భయం వుంది. ఎందుకంటే దయ్యాలు లేవు అని నాకు తెలుసు కానీ వాటికి తెలీదు కదా!

కిరోప్రాక్టిక్ తో కొన్ని సమస్యలు దూరం

ఈమధ్య ఎడమ చెవి, కన్ను, పన్ను, మెడ నొప్పితో మా ఆవిడ కొన్ని వారాలు తీవ్రంగా అవస్థ పడింది. డాక్టర్ దగ్గరికి వెళితే ఇంఫెక్షన్ అని ఏంటీబయోటిక్స్  ఇచ్చాడు కానీ తగ్గలేదు. ENT స్పెషలిస్ట్ దగ్గరికి ఏవేవో పరీక్షలు చేసి CT Scan తీయించి అందులో ఏమీ తేలక TMJ కావచ్చు అన్నాడు. ఓరల్ సర్జెన్ దగ్గరికి వెళితే పరీక్షించి TMJ అని ధృవపడటం లేదు కాబట్టి పెయిన్ కిల్లర్స్ పదేపదే వేసుకోవడమే గతి అన్నట్లుగా మాట్లాడారు. 

అలా ఎన్ని చేసినా తల ఎడమభాగం అంతా నొప్పి తగ్గకపోవడంతో విరక్తి చెందడం ఆరంభించింది. నేను కిరోప్రాక్టర్ ని కలవమన్నా కానీ వారు చేయించే వ్యాయామాలు కొన్ని బోరింగుగా వుంటాయి కాబట్టి కొన్ని వారాలు తటపటాయించింది. ఇది తలకు సంబధించిన సమస్య కాబట్టి ఆ వ్యాయామాలు చేయించరులే అని సర్ది చెప్పి తీసుకువెళ్ళాను. Chiropractor డాక్టర్ ఫిలిప్ మంచి స్నేహశీలి. మా ఆవిడకి ఎక్సురేలు తీయించి C1 ఎముకలో కొంత సమస్య వుంది చెప్పారు. దానిని అడ్జస్ట్ చేస్తూ వస్తున్నారు. చిత్రం...నొప్పి మటుమాయం. 

కొన్నేళ్ళ క్రితం దాకా 7,8 ఏళ్ళు పలురకాల వంటి నొప్పులతో మా ఆవిడ బాధపడింది. ఎన్ని చికిత్సలు చేయించినా, ఎందరిని కలిసినా, సర్జెరీలు జరిగినా ఆ నొప్పులు తగ్గలేదు. చివరికి కిరోప్రాక్టిక్ చికిత్సతో అవన్నీ తగ్గాయి.

అలా అని అన్ని సమస్యలూ తగ్గుతాయని కాదు. నేనూ చికిత్స తీసుకున్నా కానీ నా సమస్యలు దూరం కాలేదు. అలాగే వేసవిలో వాలీబాల్ ఆట వల్ల కుడి భుజం నొప్పి వచ్చింది నాకు. దానికి ఈ చికిత్స తీసుకుంటున్నా కానీ తగ్గడం లేదు. అందులో నా పొరపాటూ వుంది లెండి. షవుల్డర్ మొబిలైజేషన్ వ్యాయామాలు కొన్ని సూచించారు కానీ రెండు సార్లు చేసి వదిలేసా. ఎక్కడ చేస్తామండీ - బోరింగ్. ఫిలిప్ అడిగితే భేషుగ్గా అవి చేస్తూ వస్తున్నా అని చెబుతున్నా కానీ ఇవాళ ఆ బండారం బయటపడుతుంది. ఇవాళ సమీక్ష వుంది. అప్పుడు నిజం ఒప్పుకోవడం మంచిది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలకి కిరోప్రాక్టిక్ చక్కగా కుదురుతుంది. ఎన్ని ఇతర ప్రయత్నాలు చేసినా తగ్గనివి ఈ విధానం వల్ల తగ్గొచ్చు. ప్రయత్నించి చూడటమే మన పని.

అయోడైన్ అద్భుతాలు!

"థైరాయిడ్ మందు పాపకి పడట్లేదు కదా, ఏం చేద్దాం?" అని ఆలోచించారు మా డాక్టర్. మా చిన్నమ్మాయికి ఊబకాయం. దానికి కారణం లో మెటబాలిజం దానికి కారణం థైరాయిడ్ తక్కువగా పనిచెయ్యడం అని తెలుసుకున్నాం కానీ థైరాయిడ్ మందులు తనకి పడకపోవడంతో వచ్చిందీ సమస్య. ఆ మందులు వాడితే బాగా దగ్గు వస్తోంది. అందుకే ఆపేసాం. "అయోడైన్ లోపం వుండొచ్చు, అది పరీక్షిద్దాం" అని మా హోలిస్టిక్ డాక్టర్ అన్నారు. అయోడోఫోబియా వున్న నేను ఉలిక్కిపడ్డాను. (అయోడైన్ అంటే బెదిరిపోయే గుణాన్ని అయోడోఫోబియా అనొచ్చని డాక్టర్ గుయ్ అబ్రహాం ప్రకటించారు.) అయోడైన్ ఎక్కువ వాడితే థైరాయిడ్ సమస్యలు కదా అని అనుకున్నా కానీ ఊరుకున్నా. 

అయోడైన్ లోడింగ్ టెస్ట్ జరిపించాం. పిల్లలకి 25 మిల్లీ గ్రాముల అయోడైన్, అయోడైడ్ కలిసిన టాబ్లెట్ ఇచ్చాక 24 గంటలు మూత్రాన్ని సేకరించి మెడికల్ ల్యాబుకి ఇవ్వాలి. పెద్దలకు అయితే 50 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్లు ఇవ్వాలి. అయోడైన్ చర్మ పరీక్ష, రక్త పరీక్ష, ఉమ్మి పరీక్షలు కూడా వుంటాయి కానీ అవి అంత నమ్మకమయినవి కావు. ఈ లోడీంగ్ టెస్టులో విడిచిన మూత్రంలో ఎంత అయోడైన్ విసర్జించారో చూస్తారు. ఎక్కువ విసర్జిస్తే మంచిది. అందువల్ల శరీరంలో మంచి మోతాదులో అయోడైన్ వుందన్నమాట. తక్కువ విసర్జిస్తే అర్ధం తగినంత అయోడైన్ లేక శరీరం అల్లల్లాడుతోందన్నమాట. మా అమ్మాయి చాలా తక్కువ విసర్జించింది. 

అయోడైన్ లోపం తీవ్రంగా వుందని చెప్పి 6.25 మిల్లీగ్రాముల అయోడోరాల్ (Iodoral) టాబ్లెట్ రోజూ వాడమన్నారు మా ఆస్టియోపాత్ (డాక్టర్).  మూడు వారాలు వాడాక మళ్ళీ సమస్య మొదలయ్యింది. దగ్గు. దాంతో డోసేజ్ ఎక్కువయ్యిందేమోనని రెండు రోజులకు ఒకసారి ట్యాబ్లెట్ వేసుకొమ్మని చెప్పాను. అయోడోరాల్ హాఫ్ లైఫ్ ఒకటి నుండి రెండు రోజులు. కొంత తగ్గింది కానీ పూర్తిగా దగ్గు తగ్గలేదు. నెట్టులో వెతికితే కొంతకాలం ఆపి మళ్ళీ మొదలెట్టొచ్చు అని సూచనలు కనిపించాయి. ఆపేసాం దగ్గు తగ్గింది. మళ్ళీ మొదలెట్టాం - మళ్ళీ వారానికి మొదలయ్యింది. వారానికి రెండు సార్లు మాత్రమే వేసుకొమ్మని చెప్పాను. ఈలోగా వేరొక సందర్భంలో మా డాక్టరుని కలిసినప్పుడు దగ్గు విషయం చెప్పాను. అతను అయోడిజం (అయోడైన్ టాక్సిసిటీ)  ఏమో అనుకొని ఖంగారు పడి మందు మానేసి మళ్ళీ టెస్ట్ చేయించమన్నారు. కానీ అది అయోడిజం కాదని నాకు తెలుసు. అయోడైన్ వాడుతున్నప్పుడు బ్రోమైడ్ తదితర విషపదార్ధాలు శరీరంలోంచి బయటకి వెళుతూ కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. 

మళ్ళీ పరీక్ష చేయిస్తే తన శరీరంలో కొద్ది మోతాదులో మాత్రమే అయోడైన్ పెరిగింది అని అర్ధం అయ్యింది. మొదటిసారి 25 mg లలో 12 mg లు విసర్జిస్తే ఈసారి 14 mg లు విసర్జించింది. అయోడైన్ లోపం ఇంకా తీవ్రంగా వుంది కాబట్టి మళ్ళీ మందు మొదలెట్టమన్నాడు. మూడు రోజుల క్రితమే మొదలెట్టాం. మళ్ళీ దగ్గు రావొచ్చు కానీ ఒకటి నుండి మూడువారాల్లో అది తగ్గే అవకాశం వుంది. అయితే అంతకు ముందు రెండు నెలలు అటూ ఇటూగా వాడినప్పుడు చక్కటి ఫలితాలు అందాయి.  రెండు కిలోల బరువు తగ్గింది. ఇంకో ఊహించని పరిణామం. తనకు మైల్డ్ అలెర్జీలు వుండేవి. అది ప్రస్థుతానికి అయితే దూరం అయ్యింది! అయోడైన్ లోపానికి అలెర్జీలకు సంబంధం వుందా అని చూస్తే... వుంది. అస్థ్మా తదితర ఊపిరితిత్తుల  వ్యాధులు రావడానికి ఈ లోపం కూడా కారణం కావచ్చు. 

ఆ రెండు ఫలితాలతో అచ్చెరువొందిన నేను అయోడైన్ గురించి బాగా తెలుసుకొని అయోడోఫోబియా దూరం చేసుకున్నాను. మన జనాల్లో పలు కారణాల వల్ల ఆ లోపం ఎంత వుందో అవగాహన వచ్చింది. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు వున్నాయో, అది ఎంత ముఖ్యమో అవగతం అయ్యింది. నేనూ ఆ పరీక్ష చేయించుకున్నాను. నాకూ ఆ లోపం తీవ్రంగా వుంది. మా అమ్మాయి కంటే నాలోనే ఎక్కువ లోపం వుంది. మా డాక్టరు దగ్గరికి వచ్చేవారిలో నాలోనే లోపం ఎక్కువగా వుందిట. 50 మిల్లీగ్రాములు వాడితే 24 మిల్లీగ్రాములు మాత్రమే విసర్జించాను. మా ఆవిడక్కూడా హైపోథైరాయిడిజం వుంది కనుక తనకి కూడా పరీక్ష చేయించాను కానీ ఫలితం ఇంకా తెలియలేదు. 97 శాతం మందిలో అంతో ఇంతో లోపం వుంటుందని డాక్టర్ డేవిడ్ బ్రవున్స్టీన్ అంటారు. 

కేవలం అయోడైజ్డ్ ఉప్పు వాడకం వల్ల గాయిటర్ తదితర కొన్ని సమస్యలు రాకపోవచ్చు కానీ ఆ మోతాదు శరీర అవసరాలకి ఏమాత్రం సరిపోదు అని అర్ధం అవుతోంది. హైదరాబాదులో అయోడైన్ లోడింగ్ టెస్టులు జరుపుతారా? ఈ పరీక్షలు ఏ ల్యాబుల్లో అందుబాటులో వున్నాయో దయచేసి తెలియజేయగలరు. అక్కడ కొంతమందికి ఈ పరీక్ష జరిపించాల్సివుంది. అలాగే మీరు అయోడైన్ మాత్రలు కానీ ద్రవం కానీ వాడుతున్నట్లయితే మీ అనుభవాలు, అభిప్రాయాలు తెలియజేయండి.

మీకు అయోడైన్ మీద ఆసక్తి వుంటే ఈ క్రింది లింకులోని వ్యాసాలు చదవండి మరి. మీ అనారోగ్యానికి కారణం అయోడైన్ అయివుండొచ్చేమో మరి.