ఆరేళ్ళ పాప చిత్రమయిన సమస్య - మీరెటు వైపు?

కొలరాడోలోని కాయ్ మాథిస్ అనే పాపకి ఓ చిత్రమయిన సమస్య ఎదురయ్యింది. ఆ పాఠశాల వారు అమ్మాయిల టాయిలెట్ గదిని ఉపయోగించుకోనివ్వట్లేదంట. ఎందుకంటే ఆ అమ్మాయి ట్రాన్స్ జెండర్. పుట్టడం అబ్బాయి లక్షణాలతోనే పుట్టింది కానీ తాను ఐడెంటిఫై చేసుకున్నది మాత్రం అమ్మాయిగానే. అంత చిన్న అమ్మాయికి అప్పటికే ఐడెంటిఫై చేసుకోవడం వస్తుందేంటీ - తల్లితండ్రుల అతి కాకపోతేనూ అని కొందరు విమర్శకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ క్రింది వార్తాంశం చదివి మీరు ఆ అమ్మాయి వైపో, పాఠశాల వైపో చెప్పండి.  ఐడెంటిఫై చేసుకోవడానికి వయస్సుతో పనేముంది అని నాకు అనిపిస్తోందీ - మరీ నెలల పాప ఏమీ కాదు కదా! మనస్తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం కొంతమంది పిల్లలకు మూడేళ్ళ వయస్సుకే వారి లైంగిక అస్థిత్వం తెలుస్తుంటుందిట. వారు ఆడుకొనే ఆటలను బట్టి, ఆసక్తి చూపించే వేషధారణ, దుస్తులు వగైరాలను బట్టి కూడా ఆ విషయం గుర్తించొచ్చు అనుకుంటా. శారీరక అవయవాలను బట్టి మాత్రమే జెండర్ ఐడెంటీని నిర్ధారించకూడదంట.



జ్ఞాపకాలు: మాకు నయాగరా ఫాల్స్ పైనుండి చూపించిన పైలట్

మేము నయాగరా ఫాల్స్ సిటీ (దగ్గర) లో నాలుగేళ్ళు వున్నాం కాబట్టి రోజూ చెంబట్టుకు వెళ్ళినట్లుగా వుండేది లెండి. ఓ ఎనిమిది నెలలు అయితే  నయాగరా నదికి పక్కనే ఇల్లు కిరాయికి తీసుకొని వున్నాం. అప్పుడు ఆ నది ఒడ్డున చెట్ల క్రింద విశ్రమిస్తూ మా యాహూ గ్రూప్స్ కోసం అని కొన్ని నవల్లు వ్రాసేవాడిని. నాకు కొంతమంది వీరాభిమానులు వుండేవారు. వారు నన్ను యాహూ మెసెంజర్ ద్వారా సంప్రదిస్తుండేవారు. మరీ కొందరయితే నేను వ్రాసే నవలల్లో తమ పేరుతో పాత్ర పెట్టమని కోరేవారు. కొందరు నన్ను చూడాలనేవారు. వెబ్ కేం లో నది పక్కనే నిలబడి నన్ను చూపించేవాడిని.

ఒకసారి వాషింగ్టన్ నుండి బఫలో కి విమానంలో వస్తున్నాను. "మీకు పైనుండి నయాగరా ఫాల్స్ చూపించాలని ATC ని సంప్రదించి నయాగరా ఫాల్స్ పై నుండి వెళుతున్నాను. అద్దాల నుండి ఫాల్స్ వీక్షించండి" అని పైలట్ మాకు అందరికీ ప్రకటించాడు. వీలయినంత కిందికి విమానం నడుపుతూ చూపించాడు. సంతోషంగా అందరమూ ఎగబడి అద్దాలనుండి ఫాల్స్ చూసాం. అద్భుతం! ఆ తరువాత విమానం దిగుతూ అందరం ఆ పైలట్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసాం.

నేను నిన్ను నిన్న చూస్తాను!

I'll See You Yesterday!

ఆమె వెళ్ళింది - సందేశం మిగిలింది (ఈ వీడియో ఇంకా నేను చూడలేదు). కంట్రీ సింగర్ మిండీ మెక్రెడీ మొన్న మరణించింది కానీ ఇతరులను ఆత్మచేసుకోవద్దంటూ  సూచించిందిట. ఆమె మాత్రం ఆత్మహత్యే చేసుకుంది. ఈ వీడియో టైటిల్ విభిన్నంగా వుందని మీతో పంచుకుంటున్నాను.ఈమె మరణించిన దాకా ఈమె గురించి నాకు తెలియదు. పాశ్చాత్య సంగీతం మీద ఆసక్తి వున్నవారికి తెలిసే వుంటుంది. మిండీ - నేను ఇవాళ నిన్ను చూసేసరికి నువ్వు నిన్న లోకి వెళ్ళావే!

వివరాలకు, వీడియోకూ :

దయ్యాలంటే భయం ఎందుకు డాడీ!

మా చిన్నదానికి దయ్యాల భూతాల సినిమాలంటే చాలా ఇష్టం. పోనీ అది ఒక్కతే చూస్తుందా, అబ్బే గజగజ  ఒణుకుతూ నన్ను పక్కనే కూర్చోబెట్టుకొని కావలించుకుంటుంది. మరె దయ్యాలంటే నాక్కూడా భయం కదా. నేనూ గజగజా వణుకుతూ వుంటాను. ఇద్దరం అలా వణికేస్తూ ఆ సినిమాలు చూసేస్తుంటాం. సినిమా అంతా చూసేకా 'నిజ్జంగా దయ్యాలున్నాయా డాడీ' అని అడుగుతూ వుంటుంది. లేవు అని చెబుతుంటాను. 'మరి అవి లేనప్పుడు మరి అవంటే నీకు ఎందుకంత భయం' అని అడుగుతుంది. "దయ్యాలు లేవని నాకు తెలుసు కానీ వాటికి తెలియదు కదా" అని సమాధానం ఇస్తుంటాను.

పైన నేను కూడా వణుకుతూ చూస్తున్నట్లు వ్రాసా కదా. సరదాగా అలా వణికినట్లు నటిస్తూవుంటా అంతే. నిజం అనుకునేరు. ఏం నమ్మట్లేదా? 

అప్పట్లో ఇండియాలో 'ఓ స్త్రీ రేపు రా' అని కొంతమంది తమ గోడల మీద వ్రాస్తున్నారని విని మా గోడ మీద 'ఓ స్త్రీ ఇవాళే రా!' అని వ్రాసేవాడిని. వచ్చేదేదో కామినీ పిశాచం అయివుండాలని ఆశించేవాడిని కానీ ఎవరూ రాలా. ప్చ్. 

నా చిన్నప్పుడు మా ఇంట్లో కిరాయికి వుండే మాస్టారు మాకందరికీ నిజంగా జరిగిన సంఘటణలు అంటూ చాలా చాలా దయ్యాల కథలు చెప్పేవాడు.  మా నాన్నేమో ఆ కథలన్నీ నమ్మవద్దని నాకు చెప్పేవాడు. ఎవరి మాటలు నమ్మేదీ? చివరికి ఎందుకయినా మంచిదని ఇద్దర్నీ కాదని దయ్యాల్నే నమ్మడం మొదలెట్టా. అర్ధరాత్రి రెంటికి వస్తే చచ్చే చావొచ్చేది.

సి బి రావు గారు వ్రాసిన ఆమె ఎవరు? పోస్టు చూసాక ఇవన్నీ గుర్తుకు వచ్చాయి. 

అవునూ ఈ పోస్ట్ మీరు ఒక్కరే చదువుతున్నారా లేక పైన ఫోటోలోలాగా అదృశ్యంగా ఇంకెవరయినా మీ పక్కనే వుండి ఈ టపా చదుతున్నారా? కామెంటెయ్యమని తనకి చెప్పండి మరి.