హెలెన్ - ఓ వ్యధా గాధ - సినిమా

ఈ సినిమా 2009 లొ వచ్చింది. క్లినికల్ డెప్రెషన్ గురించి ఇదో చక్కటి సినిమా అయినప్పటికీ కొన్ని లోపాలు వున్నాయి. హెలెన్ గా ఆష్లీ జూడ్ నటించింది. ఆమె అంటే నాకు ఇష్టం. ఈ సినిమా చూడటానికి కాస్తంత ధైర్యం, ఓపికా కావాలి. వ్యధను చాలా సహజంగా చూపించారు కాబట్టి దాన్ని భరించే శక్తి చాలామందికి వుండకపొవచ్చు. బోర్ కొట్టి ఆపేస్తుండొచ్చు కానీ చివరంటా చూడగలిగితే చక్కటి ఎమోషనల్ సినిమా ఇది. మానసిక కృంగుబాటులో వుండేవారి మానసిక, శారీరక స్థితి ఎలా వుంటుందో చాలా అవగాహన కలిగిస్తుంది. మీ ఇంట్లో ఎవరయినా డిప్రెషన్ తో గానీ, ఏంగ్జయిటీ తో కానీ అతలాకుతలం అవుతున్నా మీకు ఆ విషయం అర్ధం కాకపోవచ్చు. మీ బంధువో, మిత్రుడో సఫర్ అవుతున్నా కూడా ఆ వ్యక్తి చెయ్యి దాటిపోయేంతవరకూ మీకు అనుమానం కూడా రాకపోవచ్చు. అందువల్ల ఇలాంటి సినిమాలయినా చూడటం వల్ల ఆయా సమస్యలపై అవగాహన వస్తుంది. 

హెలెన్ యొక్క జీవితం చక్కగా నడుస్తుంటుంది కానీ ఎన్నో ఏళ్ళుగా తనలో వున్న విచారాన్ని నిభాయించుకోలేక క్రమంగా బయటపడుతూ వుంటుంది.  ఎందుకు ఈమెకు ఇంత విచారం, ఎక్కడ లోపం జరిగింది అని భర్త విస్మయపడుతూ వుంటాడు కానీ వ్యధ చెందడానికి బయటి కారణాలు వుండక్కరలేదని  అతగాడు అర్ధం చేసుకోలేకపోతుంటాడు. ఆమెకు తానేం లోపం చేసేడో అర్ధం కాక సతమతం అవుతుంటాడు.  అపరిమితమయిన వ్యధను భరించలేక, జీవితం పట్ల ఏమాత్రం ఉత్సాహం, శక్తి, ఆశ లేక ఆమె ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకుంటూ వుండటంతో  మానసిక వైద్యశాలలో చేరుస్తారు.  మళ్ళీ ఇంటికి తీసుకువస్తారు. మొదటి భర్తతో కలిగిన టీనేజి కూతురు గానీ, భర్త గానీ ఆమె పట్ల ఎంతో ప్రేమ, ఆదరణ చూపిస్తున్నా కూడా ఆమెని సవ్యంగా అర్ధం చేసుకోలేక ఆమె ప్రవర్తనతో విసిగిపోయి దూరం అవుతుంటారు.

మందులు వాడుతూ వున్నా కూడా హెలెన్ లో మార్పు రాదు.   ఆమె డిప్రెషన్ మందులకి లొంగదు. ఆమె పరిస్థితిని ఆమె స్టుడెంట్ అయిన మెటిల్డా మాత్రమే సవ్యంగా అర్ధం చేసుకొని ఆసరా ఇస్తుంది. ఆమె బై పోలార్ (డిప్రెషన్ + మానియా) డిజార్దర్ తో అవస్థ పడుతూ వుంటుంది కాబట్టి హెలెన్ సమస్యను తేలిగ్గా అర్ధం చేసుకుంటుంది.  వీళ్లిద్దరి స్నేహం భర్తకు నచ్చదు. భర్తతొ విసిగిపోయి మెటిల్డా దగ్గరికి హెలెన్ వచ్చేస్తుంది. ఇద్దరూ చాలా దగ్గర అవుతారు. ఆ తరువాత ఆ ఇద్దరి జీవితాలు ఏమవుతాయి అనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది. 

మానసిక కృంగుబాటు వున్న మహిళగా ఆష్లీ చాలా సహజంగా నటించింది. ముగింపు వాస్తవానికి చాలా దగ్గరగా వుంటుంది.  శుభం కానీ అశుభం కానీ లేకుండా అసలయిన పరిస్థితిని తెలియజేస్తూ చిత్రం ముగుస్తుంది. వాస్తవానికి, సహజత్వానికి వీలయినంత దగ్గరగా ఈ సినిమా తీసినందుకు ఆ దర్శకురాలిని మెచ్చుకోవాలి.  ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్  లో ఆన్లయినులో లభిస్తోంది. ఈ  సినిమా చూడలేని వారు ఈ క్రింది లింకులో కథ, రివ్యూలు చూస్తే ఈ సినిమా గురించి కొంతయినా తెలుస్తుంది.  

గర్ల్ ఇంటరుప్టెడ్ - సినిమా

ఈ మధ్య కొన్ని సైకలాజికల్ సమస్యల ఇతివృత్తాలున్న సినిమాలు చూసాను. అందులో ఈ Girl, Interrupted (1999) సినిమా ఒకటి. సుసానా కేసెన్ అనే ఆమె 18 నెలలు మానసిక వైద్యశాలలో గడిపింది. ఆమె అనుభవాలను ఒక పుస్తకంగా వెలువరించింది. దానిని ఈ సినిమాగా తీసారు. హీరోయినుగా అందగత్తె వియోనా రైడర్ చాలా చక్కగా నటించింది. అయితే అస్కార్ అవార్డ్ మాత్రం ఇంకో నటి అంజెలీనా జోలీకి వచ్చింది. చాలామందికి ఓ సోషియో పాత్ గా అంజెలీనా జోలీ నటన నచ్చేస్తుంది.నర్సుగా వూపీ గోల్డ్‌బెర్గ్ నటన కూడా చాలా బావుంటుంది.

ఇది 1960 లోని కథ. ఒకసారి సుసానా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడంతో తల్లితండ్రులు ఆమెని మానసిక వైద్యశాలలో చేరుస్తారు. అక్కడ మిగతావారికి ఎలాంటి సమస్యలు వుంటాయి అనేది ఆసక్తికరం. మన తెలుగు సినిమాల్లో చూపించేలా మాత్రం అది వుండదు. సుసానాకి బార్డర్లైన్ పర్సనాలిటీ  డిజార్డరుగా భావించి చికిత్స చేస్తుంటారు.   బ్రిటనీ మర్ఫీ అనే ఇంకో అందమయిన  అమ్మాయి డైజీగా నటించింది. ఆమెకు బలూమియా అనే ఈటింగ్ డిజార్డర్ వుంటుంది. అయితే అది ఆమెకు ఎందుకు వచ్చివుండవచ్చు అనే విషయాన్ని చాలా అంతర్లీనంగా అందులో సూచిస్తారు. అదేంటో ఇక్కడ చెప్పడం బావోదు. సినిమాలో ఆమెకు సంబంధించిన ఒక సన్నివేశం నన్ను నిర్ఘాంతపరచింది. అంత స్పష్టంగా అలాంటి సన్నివేశాలు అలా చూపించేస్తారని అనుకోలేదు. అది ప్రణయ సన్నివేశం అనుకునేరు. కాదు. ఈ సినిమాలో చూపించినట్లుగానే ఆమె నిజ జీవితంలోనూ జరగడం గమనించదగ్గ విషయం.

అక్కడ వున్న ఒక అమ్మాయికి బాగా అబద్ధాలు ఆడే రుగ్మత వుంటుంది. ఆమె సుసానాకి రూమ్మేట్. ఇలా పలు మానసిక రుగ్మతలు వున్న ఆ అమ్మాయిల మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఈ సినిమా చూస్తే కొన్ని రుగ్మతల మీద అయినా కాస్త అయినా అవగాహన కలుగుతుంది.  సుసానా మొదట్లో ఆ వైద్యశాలలో కొంతకాలమే వుంటా అనుకుంటుంది కానీ 18 నెలలు వుండాల్సివస్తుంది. సైకియాట్రిస్టులు ఆమెకు కౌన్సిలింగ్ చేస్తుంటారు కానీ నర్స్ వెలరీ (వూపీ) తెలియజెప్పిన పద్ధతిలో నడుస్తూ తన భావాలను, ఆలోచనలను  వ్రాతల్లో, పెయింటిగుల్లో వ్యక్తపరుస్తూ స్థిమితపడుతూ వుంటుంది. ఆ తరువాత ఆమె మనో రుగ్మత తొలగిపోయిందని చెప్పి ఇంటికి పంపించేస్తారు. నిజంగా తనకి ఆ మెంటల్ డిజార్డర్ వుండిందా అని విస్మయ పడుతూ కారులో ఇంటికి వెళుతూవుంటుంది. 

మానసిక సమస్యలు, సంఘర్షణల ఇతివృత్తాలు నచ్చేవారికి, ఎమోషనల్, డార్క్ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చాలామంది అందమయిన అమ్మాయిలు సినిమా అంతా వుంటారు కాబట్టి ఈ సినిమా ఆకర్షణీయంగా కూడా వుంటుంది.  ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను ఈ క్రింది లింకులో చూడవచ్చు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో కూడా ఆన్లైనులో అందుబాటులో వుంది.