దీనిపైన ఓ ఉద్యమమే నడుస్తోందబ్బా

మనం పలు ఉద్యమాల గురించి వింటూ వుంటాం కానీ ఈ పేషెంట్ల ఉద్యమం నాకు కొత్తగా అనిపించింది. అదీ థైరాయిడ్ పేషెంట్ల ఉద్యమం. నేనూ ఆ పేషెంటునే కాబట్టి ఈ ఉద్యమంలో చేరిపోయి ఆ పిటిషన్ నేనూ సైన్ చేసాను. ఒక అంచనా ప్రకారం 40% ప్రజలలో ముఖ్యంగా స్త్రీలలో థైరాయిడ్ హార్మోన్ అపసవ్యతలు ఎంతో కొంతయినా వుంటాయి కానీ చాలామంది వైద్యులకి ఈ విషయాల మీద క్షుణ్ణమయిన అవగాహన లేకపోవడం వలన పది శాతం పేషెంట్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు.

అందువల్ల మిగతా వారందరూ చికిత్సకు లోను కాకుండా పలు లక్షణాలతో బాధపడుతున్నారు. డాక్టర్లలో, వైద్యసంస్థలలో ఈ విషయంలో మార్పు కోరుతూ రోగులు ఉద్యమిస్తున్నారు. మీకు కూడా థైరాయిడ్ సమస్య లక్షణాలున్నా కూడా మీ వైద్యుడు సరిగా నిర్ధారించడం లేదు అనుకుంటే ఈ పిటిషన్ చదివి సంతకం చెయ్యండి. మీ వైద్యుడితో మీరు తెలుసుకున్న విషయాలు చర్చించండి. అయినా సరే మీ మాట పట్టించుకోక పాత పద్ధతుల్లోనే మిమ్మల్ని  విశ్లేషిస్తుంటే కనుక మీరు మరో వైద్యుడిని చూసుకోవడం మంచిదేమో మరి. 

http://www.thyroidchange.org/  

Your Voice is Needed

The patient petition, "Patients with Thyroid Dysfunction Demand Better Care," is an initiative to increase awareness and improve the overall care of thyroid dysfunction. Our voices can effect change worldwide!
 

ఇహపోతే థైరాయిడ్ మరియు ఎడ్రినల్ హార్మోన్లు ఓ రెండు వారాలుగా నేను తీసుకుంటున్నాను. గత మూడు రోజులుగా నాలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది కానీ అది భ్రాంతో (ప్లేసిబో ఎఫెక్ట్?) నిజమో తెలియదు. తాత్కాలికమో, శాశ్వతమో తెలియదు. చూద్దాం. పూర్తిగా గుణం కనిపించడానికి నెలన్నర అయినా పడుతుంది.

ఈ శనివారం మా (మగ జెంట్స్) వంటకాలోచ్!

ఇదండీ ఇవాళ మా పట్టణంలోని దగ్గరి బంధుమిత్రులకు పంపిన ఈలేఖ:
"ఈ శనివారం - ఎన్నాళ్ళుగానో వేచిన ఉదయం - కాదు కాదు మధ్యాహ్నం. మగవారి కలల పంటలు కాదు కాదు వంటలు పండే రోజు.  మగజెంట్స్ అందరూ మా ఇంట్లో ఈ శనివారం సాయంత్రం వంటొండాలని ఆడలేడీస్ అందరూ (కాకపోతే కొందరు లెద్దురూ) డిసైడ్ చేసిండ్రు. అంచేత ఆ రోజు మధ్యాహ్నం లంచ్ గించు ముగించుకొని మా ఇంటికి వచ్చి మీ పాకశాస్త్ర ప్రావీణ్యతను వెలుగులోకి తేండి. మన ప్రావీణ్యతలను మహిళాలోకం పరీక్షించి బహుశా బహుమతులు ఇస్తే ఇస్తారు. లేదా అభినందన పత్రాలు  ఇవ్వొచ్చు. వాటిని  గెలిచిన వారు మెడలో తగిలించుకొని తిరగవచ్చు లేదా మీ ఇంట్లో (మా ఇంట్లో కాదు) గోడకి అతికించుకోవచ్చు. నాకు ప్రధమ బహుమతి రాకపోతే అలుగుతానని ఆల్టిమేటం ఇచ్చేస్తా.  అందరం వరుసగా వంటలొండేసరికి రాత్రి అవుతుంది. ఆ తరువాత మన వంటలు ఆడాళ్ళు తిన్నాక వాళ్లంతా క్షేమంగా వుంటే(నే) పిల్లలూ, మనమూ  తినేద్దాం.

నేను చేమగడ్ద పులుసు మరియు/లేదా కోడిగుడ్డు పులుసు వండుతాను. ఇలాగే మిగతా అందరూ చెప్పిన వంట చెప్పకుండా తలో వంటా తాము బాగా ప్రావీణ్యం వున్నది తెలియపరిస్తే బావుంటుంది. (హింట్: నాన్ వెజ్ కూరలకి ఎక్కువగా మార్కులు పడే అవకాశం వుంది. ఈ సదవకాశాన్ని మీరందరూ ఎంచక్కా ఉపయోగించుకోండి). ఇంటిదగ్గర వండి తెస్తామంటే ససేమిరా కుదర్దని మహిళా లోకం ఖండితంగా చెప్పింది. బోగస్ మగ వంటకాలు వుండొచ్చని వారి అనుమాన పెనుభూతం. అంచేతా అలాంటి ఆలోచనలు మానేసి శుబ్బరంగా మా ఇంటికి వచ్చి వండేసెయ్యండి. వంటలు ఏమాత్రం రాని మగ మహారాజులు ఏ 'కుకింగ్ ఫర్ డమ్మీస్' పుస్తకమో చదివి ప్రయోగాలు  చెయ్యొచ్చు లేదా  సింపుల్గా ఏ పచ్చి పులుసో, రసమో, టమాటో రసమో చేసిపడెయ్యొచ్చు. వారికి కన్సోలేషన్ ప్రైజ్ వస్తే రావచ్చు.  అంచేతా అందరూ వచ్చేసెయ్యండి - వండేసెయ్యండి - వండేసెయ్యండంతే!

మిగతా వివరాలు నెమ్మదిగా మీకు అందరికీ ఫోన్లు చేసి తెలియజేస్తుంటాను.  ఈలోగా మీకేమయినా సందేహాలూ, ఫందేహాలూ వుంటే కడిగేసెయ్యండి కాదు కాదు అడిగేసెయ్యండి."

నాకు వంటలు బాగానే వండటం వచ్చని నాకు నామీద వున్న సదభిప్రాయం (మిగతావారి సదభిప్రాయాలు అడక్కండేం)  అయితే ఇంట్లో అరుదుగా మాత్రమే ప్రయత్నిస్తాను. ప్రయత్నించినా చెడగొడతాను. హమ్మో నా వంట మా ఆవిడకి నచ్చేసిందంటే ఇంకేమన్నా వుందా - రోజూ నన్నే వండెసెయ్మనే ప్రమాదం లేదూ - హందుకే. మా ఆవిడ ఇండియా ట్రిప్పుకి గట్రా వెళ్ళినప్పుడు మాత్రం ఎంచక్కా చక్కగా వండుకొని తినేస్తాను.

ఇహపోతే ఈ శనివారం నేను వండే కూరలేంటో చూసారు కదా. చేమగడ్ద పులుసు లేదా కోడిగ్రుడ్ల పులుసు. నాకు పులుసు కూరలు అందునా ఆ కూరలు అంటే మహా ఇష్టం లెండి. ఈ వారం వంటల్లో మన కూరలు అద్దిరిపోవాలి. మన బ్లాగర్ల పరువు నిలబడాలి. అందుకే ఆ కూరలు ఎలా ఘుమఘుమ లాడేట్టు వండాలో చెప్పి కాస్తంత పుణ్యం కట్టుకుందురూ లేదా వంటల సైట్లు అయినా సూచించండి.  మొత్తమ్మీద మనకు ప్రధమ బహుమతి రావాలి. రాకపోతే నేరం నాది కాదు మీదే!

ఆ రోజు మా పాకశాస్త్ర ప్రావీణ్యం ఎలా వెలిగిపోతుందో, జడ్జిలు ఏమంటున్నారో, తిన్నవాళ్ళ పరిస్థితి ఏంటో లైవ్ బ్లాగింగ్ చేద్దునా ?

ముఖ్యమంత్రిగా శర్మిళ (అయితే బావుండును)

అవినీతి గురించి కాస్సేపు పక్కన పెట్టేసి మాట్లాడేసుకుందాం.  మన రాష్ట్రానికి ఇంతవరకూ మహిళా ముఖ్యమంత్రిగా ఎవరూ రాలేదు. అందువల్ల అలా శర్మిళ వస్తే కొత్తగా, ఓ చరిత్రగా వుంటుంది. వచ్చే అసంబ్లీ ఎన్నికలు దాటిపోయేంతవరకు కూడా జగన్ జైల్లో వుండి వైకాపా ఘనంగా గెలిస్తే శర్మిళ కు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ చాలా వుంటుంది. శర్మిళ ఉత్సాహవంతురాలు, ప్రతిభావంతురాలు. ఓపికా, శక్తీ మరియు సామర్ధ్యం ఆమెకు వున్నాయి. పరిపాలన దక్షత వుందో లేదో కానీ ఆ కుర్చీలో కూర్చుంటే అదే వస్తుంది లెండి.  యువ నాయకురాలు. ప్రజలని ఉత్తేజ పరచగలదు. ఆమె ఛీఫ్ మినిస్టర్ అయితే ప్రభుత్వానికి ఓ కొత్తదనం, ఉత్సాహం కలుగుతాయి. చూడటానికి కూడా చక్కగా వుంటుంది. నాకయితే జగన్ సిఎం అవుతాడనే దానికంటే శర్మిళ ముఖ్యమంత్రి అవుతారనుకుంటేనే ఉత్సాహంగా వుంది. ప్లీజ్ జగన్ - మీరు జైల్లోనే వుండండి. అలా జైల్లో వుంటే వైకాపా మీద సానుభూతి పెరిగి, పాపం ఆడకూతుర్లు అంతగా కష్టపడుతున్నారని వోటర్లకి జాలి కలిగి వైకాపాని ఘనంగా గెలిపించొచ్చు.

అలా ఆమె ముఖ్యమంత్రి అయ్యేకా  తన సోదరుడు జగన్ని జైళ్ళ శాఖా మంత్రిగా చేసేయ్యొచ్చు. అలాంటి శాఖ వుందో లేదో నాకు తెలియదు. అది లేకపోతే లేదా అది వున్నా కూడా దానికి తోడుగా జగనుకి హోం మినిస్ట్రీ ఇస్తే  భలే బావుంటుంది.  జైల్లోంచే ఎంచక్కా లా అండ్ ఆర్డర్ కాపాడొచ్చు. మరి విజయమ్మ పరిస్థితి ఏంటని మీరు అడగవచ్చు. ఆమె భవిశ్యత్తు ఎన్నడో ఊహించి అప్పట్లోనే ఓ టపా వ్రాసిపడేసా కదా. వైకాపాకి బోల్డన్ని  ఎంపీ సీట్లొచ్చాయనుకోండీ కింగ్ మేకర్ ఎవరు అవుతారు? జైల్లో వున్న జగన్ కాడూ. అప్పుడు మరో వైపు అఖిలేశ్ యాదవ్ కూడా కింగు మేకరవుతాడు లెండి. ఈ ఇద్దరు మేకర్ల మధ్య పోటీ వుంటుందన్నమాట. ఎవరి కింగు కోసం వారు పోరాడుతారు.  విషయం అర్ధమయ్యింది కదా. కొండకి తాడు కట్టి లాగితే కొండ ఒహవేళ రాకపోయినా కనీసం గవర్నర్ గిరీ అయినా రావచ్చు కదా. అలా ఆంధ్రాకి గవర్నరుగా విజయమ్మ వచ్చే అవకాశాలు లేవా ఏంటీ? బ్రదర్ అనిల్ గురించి మాత్రం నన్ను అడక్కండి. మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు.  దేవాదాయ శాఖ ఇస్తే సరిపోతుంది. ఏమంటారు? మీరు ఏ గనుల శాఖో సూచిస్తుండొచ్చు. అవునా?

ఇక శర్మిళకి దీటుగా ఇతర పార్టీల్లో మంచి మహిళా నాయకత్వం ముందుకు రావాలంటే తెలుగుదేశంలో చంద్రబాబు కోడలూ, బాలక్రిష్ణ కూతురూ, లోకేశ్ భార్యా అయిన బ్రాహ్మిణికి మాత్రమే ఆ స్పార్క్ వుంది. అలాగే కాంగ్రెసులో పురంధేశ్వరి. పురంధేశ్వరి, బ్రాహ్మిణి మరియు శర్మిళలో ఎవరు ఏపికి ప్రధమ మహిళా ముఖ్యమంత్రి అయినా సంతోషమే నాకు. అయితే మొదటి ఇద్దరూ (రాష్ట్ర) రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. తెరాస కవిత అంటే నాకు కంపరంగా వుంటుంది. ఎందుకూ అంటే ప్రతి దానికీ లాజిక్కులు ఏం చెబుతాం. ఆమె నాకు నచ్చలేదంతే.  మీకు నచ్చితే తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిణిగా ఆమెను ప్రతిపాదించండి మరి.

రేపటి రోజు నాకు కాస్తంత ఆసక్తికరం

ఎందుకంటే రేపు ఉదయం 8 గంటలకు మా ఫామిలీ డాక్టరుని కలిసి నా పరిస్థితి చర్చించబోతున్నాను.  నా ప్రస్థుత పరిస్థితి బాగానే వుంది - చాలా వరకు కుదుట పడ్డాను కానీ నా సమస్యకి మూల కారణం పరిశోధిస్తున్నాం కదా. క్రితం సారి కలిసినప్పుడు నాకు హైపోథైరాయిడిజం లేదన్నాడు కానీ దాని గురించి మరింత నేను తెలుసుకున్నాక, నా ల్యాబ్ రిపోర్టులు వివరంగా పరిశీలించాక నాకు సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం  వుందనే నేను అనుకుంటున్నాను. డిప్రెషన్  స్ఫుటమయిన (ఓవెర్ట్) హైపోథైరాయిడిజం వున్నవారికంటే సబ్ క్లినికల్ గా వున్నవారికే ఎక్కువగా వచ్చే అవకాశం వుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే మా వైద్యుడు నేను చెప్పిన దానికి కన్విన్స్ అవుతాడా లేదా అన్నది ఆసక్తికరం. చూడాలి మరి. ఆసక్తి వున్నవారు వివరాల కోసం క్రింది లింక్ చూడండి:

ఇహపోతే నా పిట్యూటరీ గ్రంధికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టూ వస్తుంది. ఆ లెవల్స్ ఎలా వుంటాయో చూడాలి. ట్యూమర్ వుండవచ్చునని ఏమయినా తెలుస్తుందా అనేది కూడా ఆసక్తికరం. అది వుండొచ్చు అని అనుమానంగా వుంటే MRI చేయించుకోవాలి. ప్రతి అయిదుగురిలో ఒక్కరికి ఆ ట్యూమర్లు వుండొచ్చునట కానీ అందులో దుష్పలితాలు చాలా తక్కువ మందికి దారితీస్తాయిట. అయితే ఎక్కువమంది తమ ఆరోగ్య సమస్యలకి కారణంగా పిట్యూటరీని పరిగణించకపోవడం వల్ల కూడా ఆ గణాంకాలు తక్కువగా వెల్లడిస్తున్నాయని నా అభిప్రాయం. మందులు వాడితే చాలామందికి ట్యూమర్లు తక్కువ అవుతాయి. కొద్దిమందికి సర్జెరీ, రేడియేషన్లు అవసరం అవుతాయి. నాకు వున్న లక్షణాలను బట్టి ఈ సమస్య నాకు వుంటే వుండవచ్చు అని నా అనుమానం. హైపో పిట్యూటరిజం వల్ల కూడా హైపోథైరాయిడిజం వస్తుండవచ్చు. అందుకే ఆ పరీక్ష కూడా చేయించమని డాక్టరుని అడిగాను. చూడాలి.

పై రెండింటిలో ఏదో ఒకటి తెలిస్తే లక్షణాలను కాకుండా మూల కారణాన్ని నివారించడానికి ప్రయత్నించొచ్చు. ఆ రెండూ కూడా కాకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. వేరే కారణాలు ఏమయి వుండవచ్చు అనేది మళ్ళీ పరిశోధించాలి.