రెండోసారి - తప్పు చేద్దాం రండి

...అనగా తప్పు చేద్దాం రండి అనే పుస్తకం రెండో సారి చదువుతున్నానన్నమాట. అదేదో బూతు పుస్తకం కాదండోయ్ - యండమూరి వ్యక్తిత్వ వికాస పుస్తకం. తెలుగు పుస్తకం కాబట్టి అదీ రెండో సారి కాబట్టి ఎక్కడెక్కడ  నస వుందో తెలుసు కాబట్టి తొందరగానే సాగిపోతూవుంది. వారి వ్యక్తిత్వ పుస్తకాలు వేరే ఏమీ చదవలేదు. విజయానికి అయిదు మెట్లు ఎవరింట్లోనో కనపడితే కాస్సేపు తిరగేసాను. నాకు గుర్తున్నంత వరకు దీనితో పోలిస్తే అదే బావుంది. ఇందులో కొంత అతి, సుత్తి, నస వున్నాయనిపిస్తోంది. ఆయన గారి పుస్తకాల్లో ఎలాగూ ఆణిముత్యాలు వుంటాయనుకోండీ కానీ ఈ పుస్తకం సగం మాత్రమే నచ్చింది. మిగతా అంతా సోదే నా దృష్టిలో.

ఇది ఛేంజ్ మేనేజ్మెంట్ గురించి వ్రాసిన పుస్తకం. మార్పు అనేది మన వాళ్లలో చాలా తక్కువ. ఎల్లప్పుడూ బూజు పట్టిన భావాలను, పద్ధతులను పట్టుకొని వ్రేలాడుతూ వుంటారు. అలాంటి వారు ఇలాంటివి చదివి మార్పు చెందితే బాగానే వుంటుంది... కానీ మనం ఇలాంటి పుస్తకాలను కూడా నవలల్లాగా సంతోషంగా చదివి పడేస్తామే.  నా మనస్సుకి కూడా ఈ మధ్య కాస్తంత బూజు పట్టింది. అందుకే కాస్త ఇలాంటి పుస్తకాలను తిరగేస్తున్నాను. కొత్త ఉత్సాహం నింపుతున్నాను. కొత్త యుద్ధాలకు సన్నద్ధం అవుతున్నాను. 

విజయాలు సాధించేవారందరూ ఇలాంటి పుస్తకలు చదివే అవి సాధిస్తారని కాదు గానీ వారిలో స్వతస్సిద్ధంగా ఆ లక్షణాలు అలవడతాయి. అంతటి దృశ్యం లేని నాలాంటి వారు ఇలాంటివి చదివి, అమల్లో పెట్టి అయినా మార్పు చెందాలి మరి.  ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల నాలో గొప్ప మార్పులు రాకపోయినా, నేను గొప్ప విజయాలు సాధించకపోయినా కూడా చాలా చిన్న చిన్న మార్పులకి, చిన్న చిన్న విజయాలకి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఎంతో దోహదం చేసాయి. 

ఒక్క ఉదాహరణ చెబుతాను. డేల్ కార్నెగీ పుస్తకం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లుయెన్స్ పీపుల్ చదవక ముందు నేనో పెద్ద సోది గాడిని. ఎలా అంటే ఎలానయితే నా బ్లాగులో అస్తమానమూ నా గురించి వ్రాస్తుంటానో అలానే వాగేవాడిని. అది చదివాక అలా మన గురించి మనం అస్తమానం సుత్తి వెయ్యడం ఎంత పొరపాటో తెలిసివచ్చింది. నా నోరు చాలా వరకు పడిపోయింది. కర్ణ రంధ్రాలు విశాలం అయ్యాయి. అనగా ఎక్కువగా వినడం మొదలెట్టాను. అందుకే ఎవరయినా కలిసినప్పుడు ఎక్కువగా వింటూ వుంటాను. అవతలి వారిని తమ గురించి చెప్పడానికి ప్రోత్సహిస్తుంటాను. వారి వివరాలు, ఆసక్తులూ కనుక్కుంటాను. నా గురించి అడిగితే కానీ పెద్దగా చెప్పను.  

తప్పు చేద్దాం రండి మీరూ చదివినట్లయితే దాని మీద మీ అభిప్రాయాలని ఇక్కడ పంచుకోండి.

మార్స్ మెన్లూ - వీనస్ వుమెన్లూ

టైటిల్ చూస్తేనే కొంత మందికి అయినా అర్ధం అయ్యుండొచ్చు నేను దేని గురించి వ్రాస్తున్నానో. అంత ప్రఖ్యాత పుస్తకం ఇది మరి:

Men Are from Mars, Women Are from Venus

ఆ పుస్తకం నేను బయటకి తీసికెళ్ళినప్పుడల్లా ఒక్క తెల్లోడయినా తొంగి చూసి మంచి పుస్తకం, చాలా బాగా ఉపయోగపడుతుంది అని చిరునవ్వుతో చెబుతూవుంటారు. ఈ పుస్తకం గురించి తెలిసి చాలాకాలమయినా తెప్పించడానికి ఆలస్యమయ్యింది. మొదటిసారి చదివడానికి ప్రయత్నించా - ఎక్కలేదు - పక్కన పడేసా. మళ్ళీ ప్రయత్నించా - మళ్ళీ కొద్దిగా ఎక్కింది కానీ మళ్ళీ అది పడకేసింది.

అలా లాభం లేదని ఈమధ్య దాన్ని వెనక నుండి వాడటం మొదలెట్టా - అనగా వెనక ఛాప్టర్ నుండి ముందుకు వస్తున్నా - బాగానే నడుస్తోంది. అలా అని అసాంతం ఒకేసారి చదివెయ్యడం లేదు లెండి. నెమ్మదిగా కాస్త కాస్త జీర్ణం చేసుకుంటూ నడిపిస్తున్నా. ఈ సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలతో ఓ ఇబ్బంది. చదవడానికి బాగానే వుంటాయి కానీ అమలు పరచడానికే బద్దకంగా అనిపిస్తుంది. కొన్ని సార్లు పొరపాట్లు చేసేస్తున్నామని తెలిసేస్తున్నా అవలీలగా అవి చేసేస్తుంటాం. ఆ తరువాత బుర్ర గోక్కుంటాం.

ఈ పుస్తకం చదువుతూ నెమ్మదిగా కొన్ని అమల్లో పెడుతున్నా. ముఖ్యంగా మగవారి, ఆడవారి ఆలోచనా రీతుల్లోని వైరుధ్యాలను గమనిస్తున్నాను.  ఈ పుస్తకం చదివిన వారు మీ అభిప్రాయాలని నాకు చెప్పండి.

నేరం నాది కాదు - వారాంతాలది

ఇది మరో కొవ్వు టపా లెండి. నా బాడీ ఫ్యాట్ 17 కి లోగా దించాలని ప్రయత్నిస్తూవున్నా కదా. ఇంతవరకూ అందులో విజయం సాధించలేదు. వారానికీ, వారానికీ మధ్యలో వారాంతం అవుతూవుంటే అదెలా సాధ్యం అవుద్దీ? కష్టపడి 17.2% కి ఓ సారి లాక్కొచ్చా కానీ 17 కి లోగా దిగ్గొట్టలేకపోయాను.  హ్మ్. కానీ కారణం మాత్రం అర్ధం అయ్యింది లెండి.

ఏం చెయ్యమంటారు మహా ప్రభో. వీక్ డేస్ లో ఎంచక్కా వ్యాయామం చేస్తూ చక్కని ఆహారం భుజిస్తూ కొవ్వు తగ్గిస్తున్నవాడినల్లా వారాంతం వచ్చేసరికి రివర్స్ గేరులో పడిపోతున్నా. వీకెండ్ అన్నాక చుట్టాల ఇంటికో పక్కాల ఇంటికో వెళతాం కదా. అక్కడ మొహమాటానికయినా మరీ ఎక్కువ కాకపోయినా ఓ బుల్లి బీర్ సీసా ఒక్కటి అయినా పుచ్చుకొని సేద తీరాలి కదా. అలాగే వేరే వారింటికి వెళ్ళినప్పుడు పెట్టింది తినాలి కానీ అక్కడ జంక్ ఫుడ్డు నాకు పెట్టొదు అని మారాం చెయ్యలేము కదా. మటన్ అంటూ వడ్డిస్తున్నప్పుడు ముచ్చటగా మూడు ముక్కలయినా వేసుకోవాలి కదా. తీపి పదార్ధాలూ, ద్రవాలూ పనిలో పనిగా కడుపులో పడతాయి కదా, అలా అలా వంట్లో నిక్షేపంగా చేరిపోతున్న కొవ్వుని కాదనలేము కదా. అలా అలా వారాంతం మొదట్లో దాదాపుగా 17 శాతానికి కొవ్వు దించినా కూడా ఇలాంటి వారాంతం  మినహాయింపులతో దాదాపుగా 20 శాతానికి వారం మొదట్లో పెరుగుతోంది.  అలా కొన్ని వారాలుగా 17 నుండి 20 శాతం మధ్య నా బాడీ ఫ్యాట్ వుంటూ వస్తోంది. 

అంచేతా ఇలా వీకెండ్సును నమ్ముకుంటే నా కొవ్వు లక్ష్యాలని ఛేదించలేనని అర్ధం అయిపోయింది. ఇంకా నయ్యం ఇదివరలో ఇంకా ఎక్కువ బరువూ, కొవ్వూ పెరిగేవాడిని.  ఏం తిన్నా, తాగినా కాస్త మితంగానే వుంటున్నా కాబట్టి కాస్తంత బరువు, కాస్తంత కొవ్వు మాత్రమే పెంచుతున్నా - మళ్ళీ తగ్గిస్తున్నా. అయితే ఇంకా జాగ్రత్త పడాలని, వారం రోజుల్లో తింటున్న తిండినే వారాంతాలూ వీలయినంతగా తీసుకోవాలని తీర్మానించేసా. పండగలకు, పబ్బాలకు, విజిటింగ్ ప్లేసెస్ కు వెళ్ళినా కూడా నా ఆహారం నేను తీసుకెళ్ళాలని, అదే తినాలని నిశ్చయించేసా. మొదట్లో జనాలు నన్ను వింతగా చూసినా, నిరుత్సాహ పరచినా, వేళాకోలం చేసినా సరే నా పట్టుదలను, అభివృద్దిని గమనించాక వారే ప్రశంసిస్తారు లెండి.  ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా నా ఫ్యామిలీ ప్యాక్ తగ్గితే సిక్స్ ప్యాక్ సాధించినంత సంబరం నాకు. ప్రయత్నిద్దాం మరి. రోజూ నా బాడీ ఫ్యాట్ పరిశీలన ద్వారా  లోపం ఎక్కడుందో తెలిసిపోయింది. అంచేతా సగం విజయం సాధించినట్లే. ఇహ ఆ లోపాన్ని సవరించుకొని మిగతా విజయాన్ని సాధించడమే తరువాయి.