ఇవాళే కేంపింగుకి


విస్కాన్సిన్లో వున్న ఒక రిక్రియేషన్ ఏరియాలో కేంపింగుకి ఇంకో కుటుంబంతో కలిసి ఇవాళ వెళుతున్నాం. చుక్కల క్రింద, మబ్బుల క్రింద, ప్రకృతి సౌందర్యం మధ్య గడపాలని వెళుతున్నాం. ఈ సీజనులో కేంపింగ్ ఇదే మొదటిసారి కాబట్టి ఒక్క రోజు కోసమే వెళుతున్నాం. వచ్చేనెల  వీలయితే రెండు రోజుల కేంపింగ్ వెయ్యాలి. ఏమయినా విశేషాలు వుంటే సోమవారం వ్రాస్తాను.

నాకు వర్షం అంటే ఇష్టం. కేంపింగుకి వెళ్ళాక అక్కడ వర్షం వస్తే బావుండును. అక్కడ ఇవాళ వాతావరణం ఎలా వుందో ఇంకా చూడలేదు. ఈ దేశాలకి వచ్చాక ఇంట్లో వుంటే బయట వర్షం పడుతున్నదీ లేనిదీ అర్ధం కాని పరిస్థితి - బయటకి చూస్తే తప్ప. అందుకే అక్కడ వర్షం వస్తే టెంటులో కూర్చొని టపటప శబ్దాలు వింటూ, ఎగిరిపడుతున్న ఝల్లులో చేతులు ఆడిస్తూ, తడిచిన మట్టి వాసనను ఆస్వాదిస్తూ, ఉరుములకు, మెరుపులకు తాదాత్మ్యత చెందుతూ, ముసురుకున్న మేఘాలని అవలోకిస్తూ గడపొచ్చు. 

మీరూ కేంపింగుకి వెళుతుంటారా? వాటి కబుర్లు మాకూ చెబుదురూ.

అవినీతిని చట్టబద్దం చెయ్యాలి!

కొంతకాలం ఈ డిమాండ్ ఎక్కడో విన్నాను. ఎవరన్నారో, ఎందుకాన్నారో, ఎక్కడన్నారో, సరదాకు అన్నారో లేక కొంపదీసి నిజంగానే డిమాండ్ చేసేరో గుర్తుకులేదు.  బావుంది కదూ ఆ డిమాండూ. అప్పుడిక హాయిగా ఏ బేరసారాలూ లేకుండా, కంఫ్యూజన్ లేకుండా ఎంచక్కా ఎవరి వాటా వారికి ఇస్తూ, పనులు త్వరగా తెముల్చుకుంటూ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించవచ్చు. ఏ శాఖలో, ఏ హోదా వారికి ఎంత శాతం ముట్టచెప్పాలో ఇప్పటికే వున్న అనధికార లెక్కలను ఎంచక్కా చట్టబద్దం చేస్తే హాయిగా ఓపని అయిపోతుంది. డబ్బులు ముట్టచెప్పలేని పేదనీతి పరులకూ ఆ చట్టంలో కొంత వెసులుబాటు అయినా వుండాలి. వారి పని కూడా జరుగుతుంది కానీ దానికి టైం లిమిట్ అంటూ వుండదు. పేదలూ, నీతివంతులూ ఆ మాత్రం త్యాగాలు చెయ్యకపోతే ఎలా? అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఎలా? పని జరుగుతుంది బాబు గారూ, పని జరుగుతుంది...కానీ ఎన్నటికి అన్నది ఇప్పుడప్పుడే చెప్పలేం.

కరప్షన్ ని చట్టబద్దం చెయ్యడం వల్ల చాలా లాభాలు వున్నాయి. ముందుగా ACB ని ఎత్తివేయొచ్చు - అలా ఎంతో డబ్బు ఆదా చెయ్యొచ్చు. అలాగే CBI వారికీ, కోర్టులకూ, జైళ్ళకూ ఎంతో పని తగ్గుతుంది - చాలా డబ్బు ఆదా అవుతుంది.  అలాగే అరెస్టులూ, అందువల్ల వచ్చే సానుభూతీ, పోయే వోట్లూ కూడా తగ్గుతాయి. అలా పాలక పక్షానికి ఇది ఎంతో లాభదాయకం. అవినీతి అంటే లంచాలు ఒకటే కాదు కదా. ఎన్నో రకాలుగా వుంటుంది కదా. అందుచేత అవినీతి పరులకి ఏమాత్రం అన్యాయం జరగకుండా రిటైర్డ్ న్యామూర్తులతో ఒక కమిటీ వేసి ఎవరికి ఎంత ఎలా డబ్బు ఎప్పుడెప్పుడు చేరాలో వారినుండి సూచనలు స్వీకరించాలి. ఆ కమిటీలో ఒక్కసారయినా అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన  జడ్జిలే మాత్రమే వుండాలి.  ఉదాహరణకు గనుల సంగతే తీసుకుందాం. ముఖ్యమంత్రి నుండీ గని వోనరు దాకా ఎవరెవరు ఎంత లాభ పడాలి, ఎలా లాభపడాలి అనేది ముందే నిర్ణయిస్తే ఏ గొడవా వుండదు కదా.  ప్రజలు కూడా నిక్షేపంగా అవినీతిని వోట్ల రూపంలో నైతికంగా సమర్ధిస్తున్నారు కాబట్టి ఆ చట్టం మీద వ్యతిరేకతా వుండదు. చట్టసభ సభ్యులూ సంతోషించి ఎంచక్కా బిల్లు పాస్ చేయిస్తారు, పండగ చేసుకుంటారు. కాకపోతే ఆ చట్టంలో వారి వాటాలు పెంచుకుంటారు. పర్లేదు లెద్దురూ. ఇలా అవినీతి చట్టబద్దం చెయ్యడం వల్ల ఇంకో లాభమూ వుంది. ఇప్పటిదాకా అవినీతిపరులు దుర్మార్గమయిన నీతి చట్టాల బారిన పడకుండా ఎంతో శ్రమ పడుతున్నారు. వారిని ఆ శ్రమ నుండి తప్పించినవారం అవుతాం. అప్పుడు వారి యొక్క శక్తి సామర్ధ్యాలను దేశ పురోగతి కోసం సరిగ్గా వినియోగించగలుగుతారు. అప్పుడు దేశం బాహ్గా బాగుపడగలదు. 

అయితే ఇలా అవినీతిని చట్టబద్దం చెయ్యడం వల్ల చిన్న ఇబ్బంది వుంది. ఇలా నెలానెలా జీతాల్లా క్రమం తప్పకుండా వచ్చే అవినీతి పేమెంట్లకు అందరూ అలవాటు పడిపోతారు. కుటుంబ సభ్యులు కూడా అలవాటుపడిపోయి అందుకు తగ్గట్టుగా తమ జీవన ప్రమాణాలని, అంతస్థులను పెంచుకుంటారు. అలాగే కోరికలు కూడా పెరుగుతాయి కదా. కొంతకాలానికి ఇలా వచ్చే ఆదాయం కూడా రొటీన్ అవుతుంది. ఇంకా డబ్బు ఎలాగయినా సంపాదించమని ఇంట్లో ఆడవాళ్ళు మొగుళ్ళని ఒత్తిడి చేస్తుంటారు. భర్తలకు కూడా నిజమే అనిపిస్తుంది. ప్చ్, ఇంతేనా నేను సంపాదించేదీ అనిపిస్తుంది. అప్పుడు ఠంచనుగా వచ్చే ఆదాయం పైన వచ్చే పై ఆదాయం కోసం డిమాండ్ చెయ్యడం మొదలెడతారు.  అప్పుడు తెలివిమాలిన నీతివంతుడు ఎవరయినా 'మీ డబ్బు మీకు ఇస్తూనే వున్నాం కదా' అని అడిగారనుకోండీ 'అది ఎలాగూ వచ్చేదేనయ్యా' అని వీళ్ళు బల్ల క్రింద చేతులు టపటపలాడించేస్తారు. అలా మరో అవినీతి మళ్ళీ మొదలవుతుంది. దానికీ వుంది ఓ సింపుల్ సొల్యూషన్ - దాన్నీ చట్టబద్దం చేస్తే ఓ పని అయిపోతుంది.

ఇలా వాటాలిచ్చుకుంటూ వెళితే ప్రభుత్వానికి ఎలా మిగిలేది,  అవసరాలు ఎలా తీరేదీ అనే ధర్మ సందేహం మీకు రావచ్చు. తప్పులేదు. అందుకు ప్రజలు వున్నారు కదా. ప్రజానీకం మీద కొత్త పన్ను వెస్తే పాయే. చచ్చినట్టు కట్టక ఛస్తారా. కరప్షన్ సర్ చార్జ్ వసూలు చేస్తే అయిపోతుంది కాదూ? మీకు ఆ మాత్రం తెలివి లేదేంటండీ బాబూ. ఇలాగయితే కష్టమే మరి. ఇలా అవినీతిని చట్టబద్దం చేసేకా పనిలో పనిగా దొంగతనాలనీ, దోపిడీలను, బలాత్కారాలనీ, హత్యలనూ చట్టబద్దం చేసేస్తే మరి కొన్ని పనులు కూడా అయిపోతాయని నేనంటాను. మరి మీరేమంటారో? ఇలా ఒక్కొక్కటినీ లీగలైజ్ చేసుకుంటూ మన ప్రజాప్రతినిధులు ప్రయాస పడే బదులుగా నేరాలనన్నింటినీ గుండుగుత్తగా చట్టబద్దం చేస్తే టోటల్గా ఓ పని పూర్తవుతుంది.

మంచి వ్యసనాలు ఏర్పరచుకోకుంటే...

...చెడు వ్యసనాలు దరిచెరవచ్చు. చెడు వ్యసనాలు అంటే తాగుడు, జూదం అనే కాదు నా వుద్దేశ్యంలో. అతిగా టివి, సినిమాలు, వీడియోలు, ఇంటర్నెట్ చూడటం లాంటివి కూడా  సరికొత్త వ్యసనాలుగా నాకు అనిపిస్తాయి. బాగా పుస్తకాలు చదవడం కొంతవరకు నయమే. అందుకే వారానికి ఎన్ని తెలుగు సినిమాలు చూసామా అని కాకుండా వారానికి ఎంత వ్యాయామం చేసేనూ అన్నదాని మీదనో లేదా మరో మంచి విషయం మీదో నేను బాగా ఫోకస్ చేస్తాను. నాలో వస్తున్న పరిణతిని బట్టి నా ఫోకస్ మారుతూవుంటుంది. 

నేను నా వ్యాయామం గురించి, ఆహార నియంత్రణ గురించి, కొవ్వు శాతం గురించి వాటిని సాధించడంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి పలు మార్లు వ్రాస్తుంటే కొందరికి చిత్రంగా అనిపించవచ్చు. అలాంటివారికి నేను వారానికి ఇన్ని సినిమాలు చూస్తున్నా అనో, ఇన్ని పుస్తకాలు చదివి పారేసాననో వ్రాసేస్తే అది సాధారణంగా అనిపించవచ్చు.  నేను పలు సమస్యల వల్ల అయా విషయాలలో గొప్ప విజయాలేమీ అందులో సాధించకపోవచ్చు. కానీ కిందామీదా పడుతూ బ్యాలన్సుడుగా అయినా వుంటున్నా. మనలో ప్రయత్నలోపం లేకుండా వుండాలి. అది ముఖ్యం. మనం ఎన్ని సినిమాలు చూసినా, ఎంత నెట్టు చూసినా, ఎన్ని పుస్తకాలు చదివినా అవి మన నిత్య జీవనానికి ఇసుమంతయినా ఉపయోగపడకపోతే, ఉపయోగించుకోలేకపోతే అదంతా వృధానే. అవి కాలక్షేపం కలిగిస్తుండవచ్చు కానీ దాంతో పాటు కాస్తయినా ప్రయోజనం కూడా వుండాలి.  మనకు ఇంఫోటెయిన్మెంట్ కావాలి.

నేను మంచి విషయాలను వ్యసనాలుగా చేసుకుంటాను. అప్పుడు అవి చెయ్యడానికి ఇక శ్రమ పడక్కరలేదు. వాటంతట అవే మనల్ని నడిపిస్తాయి. వ్యసనాలు అంటే అంతే కదా. అవి మన నియంత్రణలో వుండవు - వాటి అదుపులో మనం వుంటాము. అందుకే చక్కటి విషయాలకు ఓ సారి ఎడిక్ట్ అయిపోతే ఇహ ఎంచక్కా నడిచిపోతాయి. 

కొంతమందికి డబ్బు సంపాదన కూడా ఓ వ్యసనంగా వుంటుంది. పొదుపు చెయ్యడం కూడా వ్యసనంగా వుంటుంది. పొదుపు అనేది అతి అయినప్పుడు అది పిసినారితనం అవుతుంది. కొందరి డబ్బు జాగ్రత్త చూస్తున్నప్పుడు అది పోదుపా లేక పిసినారితనమా అనేది అర్ధం కాదు.  అంత కాకపోయినా కొంతయినా డబ్బు మీద వ్యామోహం, ఫోకస్ లేకపోవడం నాలో లోపంగా భావిస్తుంటాను. ఎంటో మరి నాకు ఏదో నడుస్తుంది కదా చాల్లే అన్నట్టు వుంటుంది కానీ మరీ పొదుపు చెయ్యాలనో, యమగా సంపాదించెయ్యాలనో  ఇంకా మనస్సుకి రావడం లేదు.  అదీ ఓ వ్యసనంగా చేసుకుంటే ఓ అని అయిపోతుంది కానీ ఎలాగండీ బాబూ? జీవితంలోని సమస్యలనన్నింటినీ పరిష్కరించుకుంటూ వస్తున్నాను - అనుకున్నవన్నీ దాదాపుగా సాధించుకుంటూ వస్తున్నాను  - ఒక్క గొప్ప సంపాదన తప్ప. ఇహ దాని సంగతీ చూడాలి మరి.

సమర్ధతకు పట్టం - నీతికి నష్టం - ఎవరికి కష్టం?

అందరూ అవినీతిపరులే అయినప్పుడు మీరు ఎవరిని ఎన్నుకుంటారు? తక్కువ అవినీతి పరుడిని కాదూ? మీరు కూడ అవినీతిపరులే అనుకోండి - అప్పుడు? అవినీతిపరుల్లోనే సమర్ధుడిని ఎన్నుకుంటారు. తక్కువ అవినీతి పరుడినీ, ఎక్కువ ప్రయోజకుడినీ పక్కనే నిలబెడితే ఎవరికి వోట్ వేస్తారు? నేనయితే తక్కువ అవినీతి పరుడితో ఎక్కువగా స్నేహం చేసినా కూడా పాలనా వ్యవహారాలో మాత్రం సమర్ధుడినే ఎన్నుకుంటాను. ప్రజలూ, నాయకులూ అందరూ దాదాపుగా అవినీతిపరులే అయిన వేళ ఎవరు ఎంత గొంతు చించుకున్నా అది ఓ విషయం కాదు. ప్రతి పార్టీ నుంచీ కుటుంబానికి పదివేలకు పైగా డబ్బు పుచ్చుకున్న ఓటరు మహాశయుడికి ఇహ తమ నాయకుల అవినీతి గురించి ఆలోచించే అర్హత వుంటుందా? అందుకే అందరూ అవినీతికి పట్టించుకోకుండా పక్కన పడేసారు. ఇహ మన రాష్ట్రంలో మిగిలివున్న నాయకుల్లో సమర్ధత, ఆత్మవిశ్వాసం, దూకుడు, ధైర్యం మరియు తెలుగు వాడి ఆత్మ గౌరవం కాపాడే నాయకుని కోసం చూస్తారు. నంగినంగి నాయకులను ఏమారుస్తారు.

మిగతా అవినీతిపరులకూ YSR కూ వున్న తేడా ఏంటంటే మిగతావారందరూ ఎవరికి వారు సంపాదించుకున్నారు - వైస్ మాత్రం తాను తిన్నాడు - ప్రజలకూ తినిపించాడు. అదీ ఆయన విజయ రహస్యం. వైకాపా అధికారంలోకి వచ్చినా మళ్ళీ అదే జరుగుతుండవచ్చు. 'యథా రాజా - తధా ప్రజా' లేదా 'యథా ప్రజా - తథా రాజా'. ఎటునుండి ఎటు తిప్పినా ఇటు రాజు హాప్పీ - అటు ప్రజలూ హాప్పీ.  సణిగే మేధావులకే అది తలనొప్పి.   ఏమయినప్పటికీ మన రాష్ట్రం డబ్బు డిల్లీ వోడు తినడం కన్నా మన వాడు తింటేనే సమ్మగా వుంటుందంటాను. మనవాడే కదా పోనీలే అనుకుంటాము. మన రాష్ట్ర ప్రజలే కదా అభివృద్ధి చెందుతోందీ అనుకుంటాము. ఏమయినప్పటికీ రాహుల్ యువరాజ గర్వభంగం జరిగితే చాలు.   లేకపోతే తాము పాలించడానికే పుట్టాము అనుకుంటారు. తెలుగువాడిని తైతక్క లాడిస్తారు. అప్పుడు తెలుగువాడి దమ్ము ఎంటీవోడు చూపించాడు ఇప్పుడు జగన్ చూపిస్తాడేమో తెలియదు. ఏదేమయినా దేశాన్ని అందరూ కలిసి గుల్ల చేసేట్టుగా వున్నారు. అందరూ అంటే కేవలం నాయకమన్యులనే కాదు నా అభిప్రాయం. తలా పాపం తిలా పిడికెడు లాగా అందులో ప్రజలందరి భాగస్వామ్యం వుంటుంది లెండి. అలా మనదేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మంచయినా, చెడయినా ప్రజలకు నచ్చిందే ప్రజాస్వామ్యంలో చెయ్యాలి కాబట్టి ప్రజలు అవినీతికే పట్టం కట్టినప్పుడు కాదనడానికి మనం ఎవరం? 

భారత్ మనందరి దేశం - అందువల్ల అందరం కలిసి దోచుకుందాం. అందులో ప్రజలనూ భాగస్వామ్యం చేద్దాం. అందరం ఆనందిద్దాం. ఇదీ వైకాపా విజయసూత్రం. మరి ఎవరికి నష్టం? అందరమూ ఆతానులోని ముక్కలమే అయినప్పుడు ఇహ గొడవేముందీ? వాటాలు పంచేసుకుందాం రండ్రండి. 

మేరా భారత్ మహాన్. 

రెండేళ్ళల్లో వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఇలాగే జగన్ జైల్లో వుంటూ షర్మిళ ముఖ్యమంత్రి అయితే బావుండును అనిపిస్తోంది. వైఎస్ గారి అమ్మాయి చూడటానికి కూడా బావుంది - తనలో సమర్ధత కూడా వున్నట్టుంది. మనకు ఇంతవరకూ మహిళా ముఖ్యమంత్రి లేదు కాబట్టి ఆ పనీ జరిగినట్టుగా వుంటుంది. జయహో షర్మిళ! ఇక విజయమ్మ సంగతి అంటారా? పరిస్థితులు మహాబాగా కలిసివస్తే ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదిద్దాం.  ఏముందండీ ఇదే రేంజిలో ఎంపి సీట్లు కొల్లగొడితే జగన్ జైల్లో కూర్చునే కింగుమేకర్ కాగలడు కాదూ?  అప్పుడు అటు రాహులూ, ఇటు ములాయమ్ము వగైరాలు అతని కాళ్ళ బేరాలకి రారూ? మీరూ మీరూ ఎందుకుకొట్టుకు ఛస్తారూ - ముచ్చటగా మా మదర్ వుండగా అని మనాడు దీర్ఘాలు తీయడూ? సర్లెండి, ఈలోగా కాంగ్రెస్ ఇంకా ఎన్ని కుట్రలు పన్నుతుందో, ఏమేం చేస్తుందో, ఏం బేరాలు పెడుతుందో, ఎవరి కాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారో! జగన్ సార్ జైల్లోంచి ఎప్పుడు వస్తారోస్తారొస్తారో! 

నాలో చిత్రమయిన సంఘర్షణ

నేను నాస్తికుడిని ఏంటో నాకు కీర్తనలూ, భజనలల్లో మునిగిపోవాలనే ఆరాటం ఏంటో నాకేం అర్ధం కావడం లేదు. మా అమ్మగారు నా చిన్నప్పుడు మల్లన్న దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళేది. అక్కడ భజనలు చేస్తూ పద్యాలు పాడుతూ భక్త సందోహం ఎంత సంతోషంగా ఊగిపోయేవారో నాకు గుర్తుకువస్తుంటుంది. ఏ దేవాలయాలకయినా మా ఆవిడకి తోడుగా వెళ్ళినప్పుడు అక్కడి కీర్తనలు పాడుతున్నప్పుడు వారితో కలిసి పాడుతూ పరవశం చెందాలని అనిపిస్తుంది కానీ నేను నాస్తికుడిని అని గుర్తుకుతెచ్చుకొని మనస్సు భోజనశాల వైపు మళ్ళిస్తూవుంటాను. పోనీ దేవుడి మీద విశ్వాసం గట్రా వస్తోందా అంటే అదేమీ లేదు. ఎథీస్టులకు కూడా కీర్తనలు, భజనలు వుంటే ఎంత బావుండును. మా చుట్టు పక్కల ఎథీస్టులు వారానికి ఓ రోజు ఓ రెండు గంటలు రెస్టారెంటులో కూర్చొని మాట్లాడుకొనివెళ్ళడమే ఎక్కువ. ఆ సమావేశాలకి కూడా నేను వెళ్ళలేదనుకోండి.

అలాంటి భజనలు, కీర్తనల కోసం వెతగ్గా మాకు దగ్గర్లోని హరే రామ, హరే క్రిష్ణ సంఘం వారు దొరికారు కానీ వారి భక్తివ్రిక్ష సమావేశాలకి వెళ్ళడానికి నేను తటపటాయిస్తూవస్తున్నాను. కీర్తనల్లో, ఆధ్యాత్మిక చర్చల్లో మునిగితేలాలని వున్నా కూడా వారు దైవ భోధనలు కూడా చేస్తారనేది నా తటపటాయింపు. ఈ మధ్య హోలీనేం (క్రిష్ణ ?) ఫెస్టివల్ నాలుగు రోజులు వుంది రమ్మనమని ఈమెయిల్ వచ్చింది. అలాగే వచ్చే నెల కీర్తనల కళ గురించి ఓ వారం శిక్షణ వుంది. దానికి వెళితే కీర్తనల్లొ ఊగిపోవడం ఏంటీ, వాటిల్లో నిపుణిడినే కావచ్చు, మీకూ బోధించవచ్చు  అనుకుంటా :) . ప్రభువు మీద భక్తి లేకుండా అలా వెళ్ళొచ్చా అనే గిల్టీనెస్ కూడా వుంది. అందుకే ఏం తోచక ఇలా మీతో పంచుకుంటున్నా. 

ఇక్కడ తెలుగు, దేశీ నాస్తికులూ, హేతువాదులూ (నాకు తెలిసినవారు) లేకా, ఇలా ఆధ్యాత్మిక సంఘాలతో కలవలేకా రెంటికీ చెడ్డ రేవడి అవుతున్నాను.  మామూలు స్నేహితులతో బాటుగా మన విశ్వాసానికి చెందిన మిత్రులతొ కూడా గడిపితే మనకూ, మన పిల్లలకూ ఇంకాస్త పరిపూర్ణత చేకూరుతుంది. అలాంటి లోటు మిగతావారు ఏం గుర్తిస్తారో తెలియదు కానీ నాకు అయితే ఆ మాత్రం శూన్యత అర్ధం అవుతూనే వుంది.

మటనూ - మెంతి కూరానూ

నిన్న సాయంత్రం అఫీసు నుండి వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతూనే ఘుమఘుమ వాసనలతో ముక్కు అదిరింది. సాధారణంగా అలాంటి మసాలా వాసనలు వారాంతం వస్తుంటాయి మా ఇంట్లో. మా ఆవిడ వంట ఏం వండుతోందా అని చూసా - మటన్. అందుకు సంతోషించాలో, విచారించాలో అర్ధం కాక కాస్సేపు మనస్సు మొద్దుబారింది.   ఉదయమే కొన్నాళ్ల వరకు నాన్ వెజ్ బాగా తగ్గించాలని తీర్మానించుకున్నా కానీ సాయంత్రమే నాకు ఇష్టం అయిన కూర మా ఆవిడ వండేసింది. పైగా మన పొలంలొ పండిన మెంతి కూర కలిపి వండా అంది.  ఇక ఆగుతానా?

గత కొన్ని వారాలుగా నేను ఏం తింటే నా శరీరంలో కొవ్వు శాతం పెరుగుతోందో జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తున్నాను. చేపలూ, మటనూ మితంగా తిన్నా కూడా  2-3 % పెరుగుతోంది. చికెన్ మితంగా తినడం వల్ల ఎక్కువగా పెరగడం లేదు. నా పద్ధతిలో మితంగా అంటే మూడు ముక్కలే లెండి.  అది కూడా తగ్గించి కేవలం ఓ ముక్కతో సరిపెట్టుకోవాలని నిన్న ఉదయం నిశ్చయించుకున్నా గానీ జిహ్వ చాపల్యం వల్ల మళ్ళీ మూడు ముక్కలు లాగించేసా. ఈ ఉదయం చూసుకుంటే ఫ్యాట్ 2% పెరిగి కూర్చుంది. నిన్న ఉదయానికి కష్టపడి 19% తెచ్చిందల్లా ఇవాళ ఉదయం 21% అయిపోయింది. ఇలా ఈ హెచ్చుతగ్గులతో నా ఉపలక్ష్యం అయిన 17% ఇంకా ఆమెడ దూరంలోనే వుండిపోతోంది. 

ఈ వారాంతం మళ్లీ ఓ పుట్టినరోజు వేడుక వుంది. అప్పుడూనూ, వారాంతమూనూ, మిగిలిన ఈ రోజులూనూ సవ్యంగా అహార నియంత్రణ పాటిస్తే వచ్చే వారానికల్లా 17% కి దిగిపోవచ్చు. ప్రయత్నిద్దాం. సమస్యేంటో తెలుసు - అందుకోసం ఏం చేయాలో తెలుసు కాబట్టి ఇంది కాబట్టి కాస్త కష్టపడితే అనగా కాస్తంత నా నోరు కట్టేసుకుంటే నా సబ్ గోల్ చేరుకోవచ్చు. నిజానికి మాంఛి వెయిట్ ట్రెయినింగ్ వ్యాయామాలు చేస్తుంటే గనుకా మెటబాలిజం ఎక్కువయ్యి ఎక్కువ తిన్నా హరాయించుకుపోతుంది కానీ అవి ఇప్పుడు ఎక్కువగా చెయ్యలేను కాబట్టి నోరు కట్టేసుకోవడమే నా ముందున్న ముఖ్యమయిన మార్గం.   దానికి తోడుగా స్వల్పంగా బరువు వ్యాయామాలు మొదలెడుతున్నాను. అవి చెయ్యకుండా ఆహారం తగ్గిస్తే కొవ్వుతో పాటుగా కండ కూడా కరిగిపోతుందిట.

సూర్యరశ్మితో సిక్కొచ్చిందే

ఎండలో నిలబడితే విటమిన్ డి దొరుకుతుంది కానీ ఉదయం పది గంటలలోపు, సాయంత్రం నాలుగు గంటల తరువాత మాత్రమే అందుకోసం ఎండలో గడపడం శ్రేయస్కరం అని చెబుతుంటారు కదా. లేకపోతే డి సంగతేమో కానీ వడదెబ్బ బాగా తగలవచ్చు. అయితే అది ఇండియాలో సంగతి. ఇక్కడ ముఖ్యంగా చలి రాష్ట్రాల్లో ఎండ తక్కువ కాబట్టి ఇక్కడ మధ్యాహ్నమే ఎండలో పచార్లు చెయ్యాలి. పైన ఒజోన్ పొర సరిగ్గా లేకపోవడం వలన అనుకుంటా ఇక్కడి ఎండకు డి విటమిన్ సంగతేమో గానీ తొందరగా నల్లబడిపోతుంటాం. విటమిన్ డి కోసం అని మధ్యాహ్నం భోజన వేళలో షికాగో డవున్ టవున్ రవుండ్లు చుట్టేస్తుంటాను. అసలే మన అందం అంతంత మాత్రం - దానికి తోడుగా ఈ నల్లబడుతూ వుండటంతో నల్లోళ్ళాగా అయిపోతున్నానా అని బెంగెట్టుకుంది. ఆ మాత్రలు మింగుతూనే వున్నా అనుకోండి కానీ సహజ సిద్ధంగా సూర్యరశ్మితో వచ్చే ఆరోగ్యం ఇంకా మంచిది కదా.  

విటమిన్ డి లోపం ఎన్నో అనర్ధాలకి కారణం అవుతోందని అర్ధం అవుతోంది. ఈ చలిదేశాలలో వున్నవారికి ఎంతోమందికి ఈ సమస్య వుంది కానీ అది వున్నట్లుగా చాలామందికి తెలియదు. 60% జనాభాకి పైగా ఈ సమస్య వున్నట్లు ఓ అంచనా. మా ఇంట్లోనే నలుగురిలో ముగ్గురికి లోపం వుంది. పెద్దమ్మాయికి ఇంకా ఆ పరీక్ష చేయించలేదు కాబట్టి ఖచ్చితంగా తెలియదు కానీ తనకూ ఆ లోపం ఖచ్చితంగా వుండొచ్చని భావిస్తూ మాత్రలు వేయిస్తున్నాం. ఈ నెల జరిగే రక్త పరీక్షల్లో నిర్ధారణగా తెలుస్తుంది. కొత్త ప్రమాణాల ప్రకారం విటమిన్ డి పరీక్షల్లో 50 నుండి 70 ng/ml of 25(OH)D వరకు వుండాలిట. హృద్రోగులకూ, క్యాన్సర్ రోగులకూ 70 - 100 వుండాలిట. గత రక్త పరీక్షల్లో నాకు 48, మా ఆవిడకి 22, మా చిన్నమ్మాయికి 18 కవుంట్ వుంది. అందుకే మేము ముగ్గురమూ ఆ మందులు వాడేస్తున్నాం. కొన్ని నెలలుగా ఆ మాత్రలు వాడుతున్నా కాబట్టి నా పరిస్థితి అప్పుడు, ఇప్పుడు ఫర్వాలేదు.

ఈ దేశాల్లో ఎండని పూర్తిగా నమ్ముకుంటే విటమిన్ D జరిగేపనికాదనీ, అందుకుతోడుగా విటమిన్ డి మాత్రలు లేదా డ్రాప్స్ వాడుతూవుండాలని మా వైద్యుడు సెలవిచ్చాడు.

Studies indicate that for proper health, serum vitamin D levels should be a minimum of 50 ng/mL (125 nmol/L), with optimal levels falling between 50-80 ng/mL (125-200 nmol/L). These values apply to both children and adults.

Source: http://www.vitamindcouncil.org/about-vitamin-d/vitamin-d-deficiency/am-i-vitamin-d-deficient/

CBI వారూ లంచాలు తీసుకుంటే ఓ పనైపోతుంది బాబూ

అవినీతి అనేది అంతటా వుండేదే కదా. అందులో ఆశ్చర్యం ఏముందీ? మనకు అవకాశం లేక లంచాలు అంటుకోవట్లేదు కానీ అదీ వుంటే ఎంచక్కా డబ్బులు మింగేసేవారమే కదా. చాలా ఏళ్ళ క్రితం నేను ఒక స్వచ్చంద సేవ సంస్థలో పనిచేసేవాడిని - ఏదో కాస్త దేశ సేవ చెయ్యాలని. స్వఛ్ఛంద సంస్థల్లో కూడా బోలెడంత అవినీతి వుందనీ, ఛారిటీ కోసమని వచ్చే ధనంలో చాలావరకు అవి స్వాహా చేస్తాయనీ, ఏదో పైపైన ప్రజలకి సేవ చేస్తాయని అర్ధమయ్యి ఆశ్చర్యమూ, విరక్తీ కలిగాయి. అయితే అప్పుడు నేను పనిచేసిన సంస్థ కొంతలో కొంత నయం లెండి. అందాజాగా కేవలం 20% మాత్రమే తినేసేవారని అర్ధం అవుతుండేది. మరి కేవలం 20% మాత్రమే ప్రజలకి వినియోగించకుండా కేవలం  20% మాత్రమే స్వాహా చేసేవారంటే మెచ్చదగిన విషయమే కాబట్టీ ఓ ఏడాది నేను అలా అక్కడ పనిచేస్తూ వెళ్ళాను.

జడ్జిలూ లంచాలు తీసుకుంటున్నారనీ, అక్రమంగా సంపాదిస్తున్నారని ఈమధ్య అర్ధం అవుతోంది కదా. అందులో ఆశ్చర్యం ఏముందీ? వాళ్ళూ మనుషులే కదా, వాళ్ళూ బ్రతకలి కదా. మనం వారి ప్రవర్తనను అర్ధం చేసుకోవాలి. వాళ్ళ సీట్లో మనం వుంటే తీసుకోమా ఏంటీ? మీరు మరీనూ. ఒహవేళ పొరపాట్న మనం బుద్ధిమంతులమే అయినా సరే ఇంట్లో వారు మనల్ని ఊరికే వుండనిస్తారా? లంచాలు పట్టమని పోరెట్టరూ? అవకాశం వుండీ లంచం ముట్టకపోతే మనల్ని జనాలు అసమర్ధులం అనుకోరూ?  ఈ జడ్జిల్లో చాలామంది లాయర్లుగా రకరకాల అబద్ధాలతో ప్రాక్టీసు చేసి పైకి వచ్చినవారే కదా. ఇలా జడ్జి కాగానే అలా నైతిక ప్రాతివ్రత్యం వచ్చిపడుతుందా ఏంటీ?

అందరూ లంచాలు తింటున్నారు. సరే. మరి CBI వారి సంగతేంటీ. వాళ్ళు మాత్రమే పతివ్రతలా? ఛత్, లాభం లేదు. వాళ్ళూ గడ్డి కరవాల్సిందే. అవినీతి విశ్వవ్యాప్తం అని నిరూపించాల్సిందే. అదీ ఏనాడో ఒకనాడు బయటపడుతుంది లెండీ. గొంగట్లో కూర్చొని అన్నం ఏరుకునే మనం వచ్చే వెంట్రుకల గురించి వర్రీ అవద్దు. మరింత అలవాటు పడిపోవాలంతే. అవినీతిపరుల్లోనే కాస్తంత సమర్ధత వెతుక్కోవాలంతే.