కూరలొండుకుంటున్నా...

మరీ ప్రతిరోజు ఏమీ కాదు లెండి. అప్పూడప్పుడూనూ. ముఖ్యంగా వారాంతాల్లో. మరి ఏం చెయ్యను చెప్పండి. మా ఆవిడ వండే కూరలు నచ్చట్లేదు. ఎన్నాళ్ళని రుచీ, పచీ లేని కూరలు తినేసి బ్రతికెయ్యమంటారు? పోనీ వారాంతాలు ఏవయినా గెట్టుగెదర్లు జరిగినప్పుడు ఇతరులు వండిన కూరలయినా - పక్కింటి పుల్ల కూరల్లాగా బావుంటాయా అంటే అవీ అంతగా ఒకటీ అరా తప్ప నచ్చట్లేదు. ఈ ఆడాళ్లంతా కూడ బలుక్కున్నట్టు కూరలు వండటానికి ఒక్క ఫార్మూలానే ఉపయోగిస్తారా అని సందేహంగా వుంటుంది. కొంత కాలం క్రితం ఒకరు చేసిన సాంబారు తప్ప వేరే కూరలు ఏవీ నోరు ఊరించలేదు :(

ఇహ ఇలాక్కాదని స్వయంపాకం మొదలెట్టా. నాకు అసిస్టెంట్ షెఫ్ గా మా చిన్నమ్మాయి అమ్మలు. అయితే తానే మెయిన్ షెఫ్ అని అంటుంది (అనుకుంటుంది) - పోన్లెద్దురూ. ఎవరో ఒహరు. ముందు కూర తయారు కావడం ముఖ్యం కాదూ. మేము వండిన కూరలే బావుంటున్నాయి. అంటు కూడా ఊడ్చుకుని నాకేసి తింటున్నాం. మా ఆవిడ కూడా బాగానే వుంటున్నాయంటోంది. మెచ్చుకోకపోతే చచ్చావే అని వార్నింగులిచ్చాలెండి. 

ఈ సారి అందరం కలిసినప్పుడు మగాళ్ళే వంటలు చేసుకువస్తే ఎలా వుంటుందని అనుకుంటూనే వున్నా - ఈ లోగా ఓ సభ్యురాలు ఆ ప్రతిపాదన చెయ్యనే చేసింది. ఇంకేం. ఇలా అయినా వంటల పరంగా నా పంట పండినట్లే. ఆ రోజన్నా కాస్త తృప్తిగా భోంచేసి బ్రేవ్ మంటానేమో. అయినా ఆయా ఇండ్లల్లోని ఆడాళ్ళు మగాళ్లని అంత తేలిగ్గా వదులుతారంటారా? తమ పైత్యమూ, పాండిత్యమూ ప్రదర్శించి కూరలు చెడగొట్టరు కదా. అలా అనుమతించమని మగరాయుళ్ళ నుండి ప్రమాణాలు తీసుకొవాల్సిన ఆవశ్యకత వుందంటారా? అయితే ఆ పర్వ దినానికి ఇంకా తేదీ ఖరారు కాలేదు లెండి. ఈలోగా నేను ప్రయోగాలు చేస్తూ ఉద్దండపిండాన్ని అయిపోతాను. వంటల బ్లాగులు కూడా తిరగెయ్యాలనుకుంటున్నాను. (ఈమధ్య ఓ రుచుల బ్లాగులో ఓ ధర్మ సందేహం అడిగితే వారెవరో కానీ వివరణ ఇచ్చేరు కాదు. ఆవకాయ బిర్యానీ చెయ్యడం ఎలా అనేది నా ప్రశ్న.)    అలా ఎక్కువయినా కష్టమే. మా ఆవిడ వంట పోస్టుకి రాజీనామా ఇచ్చేసి నన్ను నియమించే ప్రమాదం వుండనే వుంది. అందుకే నలభీములకి, అందరికీ ఓ ప్రశ్న. నా వంట నాకూ, ఇతరులకి నచ్చాలి కానీ మా ఆవిడకి ససేమిరా నచ్చకూడదు. ఆ చిట్కా ఏమయినా వుంటే ఇటు పడేద్దురూ.

13 comments:

  1. ఆవకాయ బిర్యానీ చెయ్యడం పెద్ద బ్రహ్మాండమా ,బిర్యానీ చేసేసి అందులో ఆవకాయ కలిపెయ్యడమే .....హీ హీహీ .,యింక మీ ఆవిడ కి నచ్చని కూరలేవో మీరే investigate చేసుకుని తెలుసుకోవాలి .కానీ ఎక్కడినించి సంపాదించారో గానీ ,ఫుటోలు వావ్ అనిపించేట్టు వున్నాయి శరత్ గారూ

    ReplyDelete
  2. > మెచ్చుకోకపోతే చచ్చావే అని వార్నింగులిచ్చాలెండి
    శరతన్న, మీకు అంత దృశం లేదు కాని ఇంకో మాట చెప్పండి

    ReplyDelete
  3. :) baagundi andi meeru vanta cheyyadam ilaa cheste ayinaa aadavaallaku rest dorukutundi

    ReplyDelete
  4. బాగుంది అండి మీరు వంట చెయ్యడం..ఎలాను ఇప్పుడు ఆడవాళ్ళూ అటు బయట పని ఇంట్లో పని చేసుకోలెక పోతున్నారు..వంట డ్యూటి మీరు తీసుకోండి .

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    ఆవ్కాయ్ బిర్యానీ చేసెయ్యడం అంటే అంతేనా? ఈ లెక్కన ఎన్నో రకాల బిర్యానీలు చేసెయ్యొచ్చు కదా. దాందేముంది. చేసేస్తే పోలా. ఇంకా బిర్యానీల్లోకి ఏమేం కలపొచ్చబ్బా! ఇడ్లీ బిర్యానీ, వడా బిర్యానీ ఇలా ఇలా ఎలా వుంటయాంటారూ?

    @ అజ్ఞాత
    అదేంటండీ అలా అంటారూ! మా ఇంట్లో నేనే మోనార్కునని మీకు తెలీదూ!

    ReplyDelete
  6. @ ఉమ
    ఎప్పుడూ కాదుగాని అప్పుడప్పుడయితేనే బావుంటుంది. ఎప్పుడూ అయితే అదో డ్యూటీలా అయిపోయి ఏదో ఒహటి ఏదో అదోలా చేసేస్తే పోలా అని కూర చేసిపారేస్తాం. అప్పుడప్పుడయితే నాకు సరదా - మా ఆవిడకి ఆటవిడుపూనూ. ముఖ్యంగా మా పాపకి ఆరోగ్యకరమయిన కాలక్షేపం కలిగించడానికి దాన్ని వంటలో చురుకయిన పాత్ర వహించేలా చేస్తుంటాను. అలా మేమిద్దరమూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేస్తుంటాం. అందువల్ల టివి, కంప్యూటర్, వీడియోలు తను చూసే సమయం తగ్గుతుంది.

    ReplyDelete
  7. "ఎప్పుడూ అయితే అదో డ్యూటీలా అయిపోయి ఏదో ఒహటి ఏదో అదోలా చేసేస్తే పోలా అని కూర చేసిపారేస్తాం" - మీ ఆవిడ వంట బాగోకపోవడానికి ఇదే కారణం!

    ReplyDelete
  8. @ మిస్టర్ గాలి
    నేనూ అదే అనుకుంటున్నా. క్రాప్ హాలీడే ల్లాగా ఆడాళ్ళ కుకింగుకీ హాలిడేస్ ఇవ్వాల్సిన అవసరం వుందనుకుంటాను.

    ReplyDelete
  9. శరత్..గారు..
    వంట చేయడం లో బాగా ప్రావీణ్యం సంపాదించుకోండి. అల్ ది బెస్ట్.
    ఇక చిట్కాలు అంటారా? వంట అవుతుండటం తోనే..మీకు సరిపడా ప్లేట్ లోకి తీసుకుని ..మిగతా దానిలో కాస్త కారం ఎక్కువ పడేయండి. ఇంకా వంట డ్యూటి మీకు పడదు.
    మీరు మాత్రం హాయిగా తినడాన్ని ఎంజాయ్ చేస్తూ తినండి...అంతే! అలా అప్పుడప్పుడు చేయండి.లేకపోతె..మీకు వంటింట్లోకి ప్రవేశం ఉండదు. ఎప్పుడూ .. మీ భార్య గారి వంటే తినాలి తప్పదు:))))

    ReplyDelete
  10. ఇడ్లీ బిర్యానీ ,వడ బిర్యానీ లాంటి ప్రయోగాలు టీవీ చానల్స్ లో వంటల ప్రోగ్రామ్స్ లో చెయ్యదగ్గ చక్కటి వంటలు .:p

    ReplyDelete
  11. avakaya biryani vandaka naku cheppandi nenu nerchukunta n mee nundi mail ledu malli??

    ReplyDelete
  12. నాకు తెలిసిన ఒహ మహానుభావుడు , మీలాగే "వంట సెలవులు" ఇచ్చి ఇప్పటికీ చెయ్యి కాల్చుకొంటున్నాడు తన ఇద్దరు అసిస్టెంట్ కొడుకులతొ కలిసి...

    ఆ రాణి గారి.. ఫ్రీ పబ్లిసిటీ వల్ల..ఆ మహానుభావుడి పేరు రుచుల ఘుఘుమలతొ మారుమ్రోగిపొతొంది ....బందుమిత్రుల వద్ద...

    మీకూ అలా కాకుండా సూస్కొండీ....

    ఫొటొస్ ని ఎక్కడనించి దిగుమతి సేస్కున్నారో తెలియడం లేదు మరి.."అపార్టుమెంట్ లొని ఫ్లాటు" తీసి అది మీరు చేసిన వంటకాలు కాదు కదా..శరత్తు గారూ ??

    ReplyDelete
  13. మగాడ్ని(మొగుడ్ని) మూడు రోజుల్లో వంట ఇంటి కుందేలు చెయ్యడం ఎలా?

    1వరోజు: ఏమండీ! ఈరోజు వోంట్లో బాగోలేదు. మీరే వంట చెయ్యండి.
    2వరోజు: ఏమండీ! నిన్న మీ వంట అదుర్స్. ఈరోజుకూడా మీరే చెయ్యండి.
    3వరోజు:
    ..
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    ఏంటి? ఇంకా వంట కాలా?

    ReplyDelete