గబ్బర్సింగు

నిన్న రాత్రి గబ్బర్సింగు సినిమాకి వెళ్ళాలా వద్దా అనుకుంటూనే వెళ్ళాం. నిన్న తల్లుల రోజు కాబట్టి మా ఆవిడా ఓ తల్లే కాబట్టి ఆమె కోరిక కాదనలేక కూడా సై అన్నాను.  అక్కడికి వెళ్ళాక క్యూ చూస్తే టికెట్లు దొరుకుతాయా లేదా అని అనిపించింది. దొరికాక సీట్లు సరిగ్గా దొరుకుతాయా అని కంగారు. మొత్తమ్మీద మాకూ, మాతో పాటుగా వచ్చిన మరో ఫామిలీకి సీట్లు చక్కగానే దొరికాయి. ఆదివారం రాత్రి అయినప్పటికీ హాలు దాదాపుగా నిండిపోయింది. పవన్ ఇంట్రడక్షన్ సీన్.   హాలంతా కేకలూ, విజిళ్ళూనూ. నేను పవన్ వీరాభిమానిని కాకపోయినప్పటికీ నా నోటి వెంట కూడా విజిల్. పక్కనుండి కూడా విజిల్ వినపడేసరికి  ఉలిక్కిపడి చూసాను. మా ఆవిడ. ఉత్సాహంగా ఊగిపోతూ విజిల్ వేస్తోంది! నా కళ్ళను నేను నమ్మలేదు. ఏం చేస్తాం. పవనోత్సాహం అలా వుంది మరీ. అలా అని ఆమె పవనుకి వీరాభిమాని అని అనుకోకండి. 

సినిమా బావుంది. శ్రుతి హసన్ బావుంది. సినిమా ఓ సారి చూడొచ్చు. పవనాభిమానులకూ, మాస్ జనాలకూ సూపర్గా నచ్చేస్తుందేమో కానీ నాకు మాత్రం ఓ సమీక్షలూ, బ్లాగర్ల అభిప్రాయాలూ సెలవిచ్చినంత గొప్పగా ఏమీ అనిపించలేదు. ఓ కడుపు నొప్పి పుట్టేంత నవ్విస్తుందని కొందరు వ్రాసారు కానీ కాస్త నవ్వించింది. ఈమాత్రం సినిమా కోసం హాలుకి ఎందుకు వచ్చానా, శుబ్బరంగా కొన్ని నెలలు ఆగితే DVD వచ్చేది కదా అనుకున్నా. ఇప్పటికి ఈ సినిమా గురించి ఎందరో చెప్పేసారు కాబట్టి అవన్నీ వ్రాయడం లేదు కానీ కొన్ని వ్రాస్తాను. కేవ్వు కేక. హు. మలైకా అరోరా. హు హు.  అసలా కళాఖండం ఎవరికి నచ్చిందో కానీ వారికి ఆస్కార్ ఇవ్వచ్చు. బక్కగా, ఒక్కిగా, ముసలి ముఖంతో కెవ్వు కేక పుట్టించింది. పుట్టించదూ మరి.  మా ముగ్గురికి కలిపి 42 డాలర్లు అయ్యిందని గుర్తుకువచ్చింది మరీ. పవన్ కల్యాణ్ ఓ పిట్టల దొరలా మాటిమాటికీ పిస్టలిని కాల్చి కాల్చి పిస్టలు యొక్క పరువు తీసాడు. 

ఇలా ఈ మాస్సినిమా మరీ గొప్పగా అనిపించకపోతూవుండటంతో నేను కూడా ఓ మేధావినైపోతున్ననేమోనని నాపై నాకు దిగులేసింది. సినిమా చూసే కళ నాలో క్షీణిస్తోందేమోనని అనుమానం వేసింది. సినిమా హాలు నుండి బయటకి వచ్చాక మా ఆవిడనీ, మాతో పాటు వచ్చిన వారినీ అడిగాను. వారు కూడా నీరసంగా సో సో అన్నాకా నా బుర్ర మీద నాకు మళ్లీ నమ్మకం కలిగింది. మా ఫ్రెండ్ అయితే 'ఈ సినిమాలో విలన్ ఎందుకూ' అన్నాడు. ఇంకా నయ్యం హీరో ఎందుకూ అనలేదు. ఏ అంచనాలు లేకుండా వెళితే చాలా బాగనిపిస్తుందేమో తెలియదు కానీ, మించిన అంచనాల్తో వెళ్ళాం కాబట్టి మరీ అంతగా మెచ్చలేకపోయామేమో మరి.  

వైబ్ సట్ల సమీక్షలని ఎలాగూ నమ్మలేము కనుక నేను బ్లాగర్ల అభిప్రాయాల మీద ఆధారపడుతుంటాను. ఫలానా సినిమా ఎలా వుందని ఎవరయినా అడిగితే మా బ్లాగర్లు ఇలా వుందన్నారు అని నమ్మకంగా మిగతావారికి చెబుతుండేవాడిని. ఎవరయినా ఫలానా సినిమా బాగాలేదట కదా అన్నా కూడా మా బ్లాగర్లు బావుందన్నారు అని విశ్వాసంతో చెప్పేవాడిని. అయితే ఈ మధ్య రచ్చ సినిమా గురించీ, సింగు సినిమా గురించీ అలా నమ్మేసి దెబ్బ తినేసాను. ఈసారి నుండి కొంత అలెర్టుగా వుంటాను.  అభిమాన హీరోల సినిమాలు వస్తే సినిమా మామూలుగానే వున్నా రచ్చ చేసిపడేస్తున్నారని, కేకలు పుట్టిస్తున్నారనీ అర్ధమయ్యింది. నాలా ఇలాగే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, బావ కళ్ళలో ఆనందం చూడాలని కొందరూ  వ్రాస్తుంటారనుకోండీ. వాళ్లని తప్పుపట్టలేం కానీ ఇహపై నా జాగ్రత్తలో నేను వుంటాను.

17 comments:

  1. బుద్ధిలేక ఒకానొక సారి పెళ్ళైన కొత్తలో మేరీలాండ్ లో ఒక తెలుగు సినిమాకి (హాల్లో చూట్టానికే) వెళ్ళాము. అక్కడున్న యావత్తెలుగు ప్రపంచం ఆరోజు విచ్చేసారు ఆ సినిమా చూడ్డానికి. టిక్కెట్లు మాట అటుంచి, కారు పెట్టడానిక్కూడా ఎక్కడా ఖాళీ లేదు. అందరి ముందూ చెంపలు వాయించుకుని మళ్ళీ జన్మలో ఎప్పుడూ వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకుని యాభై మైళ్ళు వెనక్కి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. ఇది 1999 మాట. ఇప్పటిదాకా మళ్ళీ ఎప్పుడూ వెళ్ళే ప్రయత్నం చేయలేదు. చేయను కూడా. మదర్స్ డే కి మీ ఆవిడకి ఇంకో రకంగా ఘిఫ్ట్ ఇవ్వొచ్చని మీకు తట్టలేదా?

    మన తెలుగు వాళ్ళం ఇంతే. ఎంత చదువులు చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా మనం మారం. అంచేత ఈ టాలీవుడ్డు సుబ్బరంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది.

    చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అనుభవించండి.:-)

    ReplyDelete
  2. మీ ఆవిడ గారి విజిల్ విషయం చదవగానే అదేదో జంధ్యాల గారి సినిమా లో శ్రీలక్ష్మి గుర్తొచ్చిందండి.
    మలైక అరోరా విషయం లో నా అభిప్రాయం డిటో. ఆవిడకిచ్చిన కోటి లో పదోవంతు ఎవరికిచ్చినా, అంతకంటే పదిరెట్లు బాగా చేసేవారు.

    Siddharth

    ReplyDelete
  3. @ఓ కడుపు నొప్పి పుట్టేంత నవ్విస్తుందని కొందరు వ్రాసారు కానీ అంత దృశ్యం లేదు.

    ha ha కడుపు నొప్పి తో ఒక చోటకి వెళ్ళ వలసినది ఇంకోచోటికి వెళ్ళారేమో :)

    ఖుషి లానే బావుందంటున్నారు ఈ మూవీ కూడా, పవను కి రీ మేకు లే సూటు అవుతాయేమో, బాల నటుడు కాదు కదా

    ReplyDelete
  4. @ అజ్ఞాత
    మంచి సినిమాలు అయితే సినిమా హాల్లో చూస్తేనే బావుంటుంది, అలాంటి సినిమాలను ప్రోత్సహించినట్లూ వుంటుంది. అలా అప్పుడప్పుడూ చూస్తాం. వచ్చిన ప్రతి సినిమానూ వదలకుండా సినిమా హాళ్ళొ చూడటం పొరపాటుగానీ మరీ అసలే చూడకుండావుండాలనుకోము. ఒక్కసారి చూడదగ్గ సినిమాలను డివిడిలో చూస్తుంటాం - పదేపదే చూడదగ్గ సినిమాలను హాల్లో చూస్తుంటాం. అయితే రచ్చ, సింగు కూడా వాటికి వచ్చిన హైప్ చూసి పలు మార్లు చూడదగ్గ సినిమాలుగా భ్రమపడ్డాం.

    @ సిద్ధార్ధ్
    :)

    ప్రజలందరికీ అర్ధం అయిన విషయం దర్శక నిర్మాతలకి ఎందుకు అర్ధం అవదో నాకర్ధం కాదు. బూతు పదాలు వచ్చినప్పుడు బీప్ చేసినట్లుగా మలైకా వచ్చినప్పుడల్లా బ్లర్ చేసినా బావుండేది.

    ReplyDelete
  5. @ మౌళి
    ఖుషీ నేనింతవరకూ పూర్తిగా చూడలేకపోయాను. అక్కడక్కడా, అప్పుడప్పుడూ చూసాను కానీ చూసినంతవరకూ నచ్చేసింది,

    ReplyDelete
  6. నేనేమి సినిమా హాలుకు వెళ్లి సినిమా చూసే వాణ్ణి కాదు కానీ సినిమా రివ్యూలు అన్నీ చదువుతాను ఈ మధ్య రాజకీయం అయినా , సినిమా అయినా ఏదయినా సామజిక వర్గాల కోణం లో స్పందిస్తున్నారని అనిపిస్తోంది. (బ్లాగ్స్ లో సైతంఅని చిన్న అనుమానం.. ఈ సినిమా అని కాదు ఏ సినిమా అయినా )

    ReplyDelete
  7. బుల్లబ్బాయ్May 15, 2012 at 4:03 AM

    నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసామన్నారు...మరి మలైకా ప్లేసులో నమిత లాంటి భారీ భామనెట్టలేదా?

    ReplyDelete
  8. @ బుద్ధా మురళి
    అలా కూడా వుండొచ్చంటారా! హ్మ్. ఎవరు చెబితే నమ్మాలో తెలియకుండా వుంది.

    @ బుల్లబ్బాయ్
    నా అనుమానం ప్రకారం మలైకాను ఓ దిష్టి బొమ్మగా సినిమాలో పెట్టుకొనివుంటాడు.

    ReplyDelete
  9. ----- బావ కళ్ళలో ఆనందం చూడాలని కొందరూ వ్రాస్తుంటారనుకోండీ.
    You rock sarath garu. :))))

    ReplyDelete
  10. నాదీ సేమ్ ఫీలింగ్. మరీ ఎక్కువ అంచనా వేసుకుని వెళ్లినట్టున్నా. నిజమే.. పొట్టపగిలాలా కాదు.. కాస్త నవ్వు తెప్పించింది.

    ReplyDelete
  11. ippude download chesi chusa..meeru cheppinatte undi.
    antha bagaledu. print mathram keka.

    ReplyDelete
  12. సినిమా చూసాక , అసలు ఖుషి కి గబ్బర్సింగ్ కి పోలికే లేదు. టైటిల్ బాగుంది, ఇంకా హీరొయిన్ కోసం, అంత్యాక్షరి దృశ్యం కోసం వెళ్తున్నట్టున్నారు :)

    రాజశేఖర్ పై సెటైర్ బావుంది.

    ReplyDelete
  13. @ బాలు, అజ్ఞాత, మౌళి
    బ్లాగు స్పందనలను బట్టి చూస్తే అయిదుమందికి ఈ టపా నచ్చింది. ఆరు మందికి ఈ టపా నచ్చలేదు. మనలాగా ఈ సినిమా సో సో అనుకుంటున్న వారు దాదాపు సగం మంది వున్నట్లున్నారు.

    ReplyDelete
  14. waste money. pavan ithe naaku pittala dora laa anipinchaadu.

    ReplyDelete
  15. You made me laugh when I read that your wife is blowing whistles :)
    She must have had wholesome entertainment.Enjoy guys !

    ReplyDelete
  16. @ అజ్ఞాత
    ఈమధ్య మా బంధువుల కుటుంబం నెట్టులో ఆ సినిమా చూసి బాలేదని తేల్చేసారు. అందుకు మేమూ మా ఫ్రెండ్స్ ప్రొటెస్ట్ చేసాం. సినిమా హాలుకి వెళ్ళి ఈ సినిమా చూసి మరీ బావుందో బాలేదో చెప్పాలి కానీ ఇలా చూసి అలా చెప్పెయ్యకూడదని తేల్చేసాం :))

    @ ప్రశాంత్
    మొదట్లో వున్న ఉత్సాహం సినిమా చివరికి వచ్చేసరికి నీరుకారిపోయింది లెండి :)) సో సో అనుకుంటూ సినిమా హాలు నుండి బయటపడ్డాం.

    ReplyDelete