సాలెహా బేగం - నా బాల్య స్నేహితురాలు

సాలెహా బావుంటుంది. ఉత్సాహంగా, చలాకీగా కూడా వుంటుంది. ఆమె నాకు ప్రాధమిక పాఠశాలలో కూడా క్లాస్‌మేటో కాదో గుర్తుకులేదు. అయివుండవచ్చు. అయితే ఆమెతో మిడిల్ స్కూల్ స్నేహం మాత్రం గుర్తుకువుంది. 7 వ తరగతి వరకు మా ఊర్లో చదివాను. అప్పుడు పాఠశాలలో బాగా కోకో ఆట ఆడుతుండేవారం. ఆ ఆటలో ఎప్పుడూ ఆమె వెనకాలే పడేదాన్ని.  "ఎప్పుడూ నా వెనకాలే పడతావేంటి శరత్?!" అని నవ్వుతూ అరుస్తుండేది. ప్రతిగా నేను నవ్వేస్తుండేవాడిని. మాది సాధారణ స్నేహం మాత్రమే. ప్రత్యేకత ఏమీ లేదు. ఇద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు వుండేవి.

8 వ తరగతికి భువనగిరి వెళ్ళాక సెలవుల్లో తరచుగా మా ఊరికి వచ్చి నా బాల్య స్నేహితులని కలుస్తుండేవాడిని. ఆమె గురించి కూడా కనుక్కుంటూవుండేవాడిని. నా క్లోజ్ ఫ్రెండ్ నజీర్ ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు కూడానూ. వాళ్ళూ వాళ్ళూ బంధువులనుకుంటా. నజీర్ ఇంటికి వెళుతూ వాళ్ళింటి వైపు తొంగి చూసేవాడిని - ఆమె తళుక్కుమంటుందేమోనని. ఎప్పుడన్నా కనిపించిందా లేదా గుర్తుకులేదు. నన్ను చూసి వుంటే దూరం నుండి ఓ చిర్నవ్వు నవ్వేదేమో మరి.

ఓ సారి సెలవులకి వచినప్పుడు సాలెహా గురించి నజీర్ని కనుక్కుంటే ఆమె పెళ్లయిపోయిందని చెప్పేసాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. తురకల అమ్మాయి కాబట్టి తొందరగా పెళ్ళి చేసినట్టున్నారు. వాళ్ళ నాన్న అధ్యాపకుడే. అయినా సరే అమ్మాయి పెళ్ళి తొందరంగానే చేసేసాడు. అప్పటికి ఆమెకి పదవ తరగతి అయినా పూర్తయ్యిందో లేదో. ఆమెకి అలా తొందరగా పెళ్ళవడం నాకయితే నచ్చలేదు. 

అలా అలా ఆమె నా జ్ఞాపకాల మరుగున పడిపోయింది. ఎప్పుడన్నా ఊరికి వెళితే నజీర్ ఇంటికి వెళుతూ సాలెహా బేగం తల్లితండ్రుల ఇంటివైపు ఓ సారి చూస్తానంతే. ఆమె గురించి మా స్నేహితుడిని కనుక్కొని చాలా ఏళ్ళయ్యింది. ఆమె వివరాలు గుర్తుకులేవు. ఈసారి మా ఊరికి వెళ్ళినప్పుడు ఆమె గురించి వివరంగా కనుక్కోవాలి. ఎక్కడ ఏ ఊర్లో వుందో ఏమో. వీలయితే నజీరుని వెంటబెట్టుకొని ఆమెని కలవాలి - ఆమెకి సౌకర్యంగా వుంటుందనుకుంటేనే లెండి. ఆమె  నన్ను గుర్తుపట్టదేమో. నేనని తెలిసాక "శరత్తూ ఇంకా నా వెంటపడుతూనే వున్నావా!?" అని నవ్వుతూ అప్పటిలాగా అరుస్తుందేమో చూడాలి.

ఇక్కడ వుండి ఇవన్నీ బాగానే అనుకుంటాం కానీ ఇండియా ట్రిప్పుకి వెళ్ళినప్పుడు ఇంత తీరికా, ఓపికా వుంటాయా చెప్పండి. క్షణం తీరదు అప్పుడు. ఏమో, ఏమో రిటైర్మెంట్ అయ్యాక అయినా అందరు బాల్య స్నేహితులనీ, స్నేహితురాళ్లనీ తీరిగ్గా కలుస్తానేమో. అందాక ఇలా ఓ బ్లాగు పోస్ట్ వేసుకుని అయినా తృప్తి పడనీయండి నన్ను. ఓ చక్కటి బాల్య స్నేహితురాలి జ్ఞాపకాలను మీతో పంచుకున్న సంతృప్తిని అయినా పొందనీయండి నన్ను. 

6 comments:

 1. "శరత్తూ ఇంకా నా వెంటపడుతూనే వున్నావా!?" అని నవ్వుతూ అప్పటిలాగా అరుస్తుందేమో చూడాలి.
  :)))అనకపోయినా స్నేహంగా కలసి రండి. బాగుందండి. ఈ మధ్య భలేగా చిన్నప్పటి మిత్రులని గుర్తుచేసుకుంటున్నారు. బాల్యం ఎప్పుడూ మధురమే!

  ReplyDelete
 2. తురకల అమ్మాయి - i object your honor!!!

  ReplyDelete
 3. @ వనజ
  అప్పుడప్పుడు బాల్యానికి వెళ్ళిపోవడం బావుంటుంది కదండీ. ఇప్పటి పిల్లల బాల్యం మనప్పటి బాల్యం అంత మధురంగా వుంటోందా అని సందేహం వేస్తోంది.

  @ అజ్ఞాత
  పల్లెల్లో అలాగే అంటారు.

  ReplyDelete
 4. Baalyam lo selifish ness takkuva kada anduke aa gnyapakalu maduranga anipistayemo eppudu gurthu chesukunna.....
  eppudaite yekkuvaga alochistamu ... edi cheyyalanna laa bam lende cheyyam kada... :)

  ReplyDelete
 5. @ మధు
  అవును. చిన్నప్పుడు ఎక్కువగా ఇష్టాల ప్రకారం నడుచుకుంటాం. ఇప్పుడేమో ఎక్కువగా లాభాల లెక్కన నడుచుకుంటాం.

  ReplyDelete
 6. @ఏమో, ఏమో రిటైర్మెంట్ అయ్యాక అయినా అందరు బాల్య స్నేహితులనీ, స్నేహితురాళ్లనీ తీరిగ్గా కలుస్తానేమో

  ఎంతో కష్టపడి వెతికి పట్టుకుని పలకరిస్తే ..పదిహేనేళ్ళ తరువాత మా మితృలు వెర్రి మొహాలు పెట్టుకు చూస్తున్నారు....వృధా ప్రయాస అనిపించి ఊసురో మనిపిస్తుంటుంది..

  ReplyDelete