నాకోసం నా చిన్ననాటి స్నేహితుడు యూసుఫ్ అన్వేషణ ఇన్నాళ్లకి ఫలించింది

చాలా నెలల తరువాత మా స్వంత అన్నయ్యకి ఈరోజు ఫోన్ చేసాను. చాలా రోజుల క్రిందట తాను భవనగిరి నుండి వస్తుంటే ఒకతను కలిసి మీరు శరత్ (కి) అన్నయ్యనా? అని అడిగి తన ఫోన్ నంబర్ ఇచ్చి నిన్ను ఫోన్ చెయ్యమని చెప్పాడన్నారు.  తన పేరు చెబితే శరత్ గుర్తుపడతాడని అన్నాడంట, ఏదో ముస్లిం పేరు గుర్తుకులేదని చెప్పాడు అన్నయ్య. నాకూ అతనెవరో అర్ధం కాలేదు. కాల్ అయిపోయాక అన్నయ్య అతని పేరు గుర్తుకుతెచ్చుకొని నంబర్ తన నోటుబుక్కులో చూసి నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ మిత్రుని పేరు యూసుఫుద్దీన్.

ఎన్నేళ్ల క్రిందటి స్నేహం మాది! 8, 9 తరగతులలో భోనగిరిలో మేమిద్దరం క్లాస్మేట్లం. మా నాన్నగారు మా అందరికీ హిందీ (ప్రభుత్వ) ఉపాధ్యాయులుగా  అక్కడ పనిచేస్తుండేవారు. ఆ తరువాత నాన్నకి సూర్యాపేట బదిలీ అవడంతో పదవతరగతికి ఆ మిత్రులనందరినీ వదిలేసి సూర్యాపేట్ వచ్చేసాను. ఆ తరువాత కూడా రెండు మూడేళ్ళు అప్పుడప్పుడూ కలుసుకున్నాం కానీ తరువాత అలా వీలయ్యింది కాదు. అలా క్రమంగా కాంటాక్ట్స్ తెగిపోయాయి. అటు పిమ్మట భోనగిరిలో మా బంధువుల ఇంటికి వెళ్ళి గడుపుతూ పాత మిత్రుల జాడ తెలియక తల్లడిల్లిపోయేవాడిని. 

యూసుఫుద్దీన్ ఎంత చక్కని స్నేహితుడనీ. కల్మషం లేని మనిషి. మా నాన్న అంటే, నేను అంటే అతనికి ఎంతో అభిమానం వుండేది. ముస్లిం పండగలు వస్తే చాలు వారింటికి పిలిచి బిర్యానీలు తినిపించేవాడు. అలా అలా ఎన్నో ఎన్నెన్నో బాల్య స్మృతులు అతనితో గుర్తుకువున్నాయి. అతని ఫోన్ నంబర్ తెలియగానే  ఫోన్ చెసి గుర్తుపట్టమని అడిగాను. నన్ను ఇంత చనువుగా యూసుఫొద్దీన్ అని పిలిచేవారు ఇద్దరే వుంటారు ఒకరు రాజు, మరొకరు శరత్ అని అన్నాడు. ఆ శరత్తునే అన్నాను నేను నవ్వుతూ. ఎంత సంతోషించేడనీ, ఎన్నెన్ని కబుర్లు చెప్పాడనీ, నా కోసం ఎంత వెదికిందీ ఎలా వర్ణించుకొచ్చేడనీ. మనకోసం ఇంతగా తాపత్రయపడే మిత్రులు వుంటే ధన్యులమే కదా అనిపించింది. నేనూ అతనికోసం వెదికాను కానీ... అతని అన్వేషణతో పోలిస్తే నా వెదుకులాట... అబ్బే.. ఓ లెక్కలోనిది కాదు.  నాకు సిగ్గు వేసింది. నేను కొంతమందిని కాస్త కనుక్కున్నా అంతే కానీ తీవ్రమయిన ప్రయత్నాలు ఏమీ చెయ్యలేదు. మరి అతనో...    

నాలుగయిదేళ్ళ  క్రితమే భువనగిరి నుండి తను ఎన్నడూ వెళ్ళని మా స్వంత ఊరు వెళ్ళి మా బంధువులను కనుక్కొని మా అమ్మ అడ్రసు తీసుకొని అమ్మని కలిసి మాట్లాడి ముచ్చట్లు చెప్పి తన నంబర్ ఇచ్చి నాకు చెప్పమన్నాడంట. అమ్మ ఆ విషయం నాకు చెప్పడం మరిచేపోయింది. ఆ తరువాత బస్సులో మా అన్నయ్య కనిపిస్తే   దాదాపుగా ముప్పయిఏళ్ళ క్రితం చూసిన మా అన్నయ్యని గుర్తుపట్టి ఎక్కువ సమయం లేకపోవడంతో తన నంబర్ అయితే అందివ్వగలిగాడట. నా నంబర్ తీసుకొనే సమయం చిక్కలేదంట. మా అన్నయ్యకి నేను ఎప్పుడో కానీ ఫోన్ చెయ్యను కాబట్టి ఈరోజు చేస్తే అతని గురించి తెలిసింది. ఎప్పుడో ఒకప్పుడు నేను టచ్చులోకి వస్తానని నాకోసం ఎదురుచూస్తూనే వున్నాడుట.

8,9 తరగతి మిత్రులు చాలామందితో తనకి కాంటాక్ట్స్ వున్నాయిట. చాలా సంతోషం వేసింది. అప్పటి స్నేహితుల ఫోన్ నంబర్లు అన్నీ ఇస్తాను అన్నాడు. మా స్కూల్ బ్యూటీ కిరణ్ స్వరూప కూడా టచ్చులోనే వుందిట.  అయితే ఇంకో బ్యూటీ పద్మజ ఆత్మహత్య చేసుకుందన్న విషయం నాకు తెలుసు. అది ప్రస్థావించుకొని బాధపడ్డాం. ఇంకో బ్యూటీ పద్మజ గురించి మాట్లాడుకున్నాం. ఇంకో చక్కటి అమ్మాయి క్రిష్ణవేణి జాడ తెలియనందుకు విచారపడ్డాం. మా ఫ్రెండు సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెల్సి బాధేసింది. మిగతా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కులాసాగా వున్నారని తెలిసి సంతోషంగా అనిపించింది. 

అప్పటి మిత్రుల రియూనియన్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. వివరాలు తీరిగ్గా మాట్లాడదామని అనుకున్నాం. అయితే ఆ స్నేహితుల్లో నాలా విదేశాలకి ఇంకెవరూ రానట్లుంది. రియూనియన్ జరిగితే నేను ఇంతదూరం నుండి వెళ్ళాల్సిరావచ్చు. అటు పిమ్మట క్లుప్తంగా మా కష్టసుఖాలు చెప్పుకున్నాం. మా కుటుంబాల గురించి మాట్లాడుకున్నాం. మళ్లీ తీరిగ్గా రెండు మూడు రోజుల్లో మాట్లాడుకుందామని చెప్పుకొని విడిపోయాం. 

అందరికీ వుంటారు మిత్రులు - అందులో కొందరే మంచి మిత్రులుంటారు. అందులో మరి కొందరే ఇలా గుర్తుంచుకొని మన గురించి తాపత్రయపడుతుంటారు. దాదాపుగా ముప్పయ్యేళ్ళ తరువాత మా పాత మిత్రునితో మాట్లాడుకున్న ముచ్చట్లు ఇలా వివరంగా పంచుకోవడానికి మీరే నాకు సరి అయిన వారు అనిపించింది. మీరూ మీ బాల్య స్నేహితులని గుర్తుకు తెచ్చుకోండి. మా యూసుఫుద్దీన్ లాంటి స్నేహితుడు మిమ్మల్ని మిస్సవుతూ వుండొచ్చేమో కదా.

11 comments:

  1. Bagundi. Chaduvutunte maa balya mithruluni kalisinattanipinchindi.
    :venkat

    ReplyDelete
  2. స్నేహబంధం ఎంత మధురం అని అన్నారు కదండి!

    ReplyDelete
  3. mee trip elaa ayindi?

    ReplyDelete
  4. యూసుఫ్ లాంటి స్నేహితులు ఉన్నందుకు మీరు అదృష్టవంతులు. మీ మిత్రుడి తో మాట్లాడినప్పుడు మీకు కలిగిన ఆనందం వెలకట్టలేనిది ....

    ReplyDelete
  5. బాల్య స్నేహితులు కలిస్తే అప్పటి ముచ్చట్లన్ని మాటలాడుకొంటుంటే ఆ హాయి వేరు. మీకు మంచి మిత్రుడున్నందుకు మీరు అద్రుష్టవంతులు.

    ReplyDelete
  6. @ వెంకట్
    :)
    @ జలతారువెన్నెల
    కదా.

    @ అజ్ఞాత
    చక్కగా జరిగిందండీ. అనుకున్న పనులు పూర్తి అయ్యాయి. కొంతమంది మిత్రులను కలవగలిగాము. ఓ బ్లాగ్మిత్రుడిని కలవాలనుకునా కానీ వీలు కాలేదు.

    ReplyDelete
  7. @ బుద్ధా మురళి
    సంతోషం
    @ రాజు
    అవునండీ
    @ వనజ
    మీకూ ఈ టపా నచ్చినందుకు సంతోషం.
    @ రవిశంకర్
    అవునండీ. అప్పుడప్పుడూ మేము చిన్ననాటి సంగతులు మాట్లాడుకుంటున్నాం.

    ReplyDelete
  8. @ అజ్ఞాత
    మీ కామెంట్ కొన్ని కారణాల వల్ల ప్రచురించలేదు. మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  9. @అందరికీ వుంటారు మిత్రులు - అందులో కొందరే మంచి మిత్రులుంటారు. అందులో మరి కొందరే ఇలా గుర్తుంచుకొని మన గురించి తాపత్రయపడుతుంటారు....

    నిజమే వాళ్ళు దూరమవడం..వెతుక్కోవడం ..దొరికితే కలిగే సంతోషం వేరు..

    ReplyDelete