మా కుటుంబ వైద్యుడు ఆలం ప్రత్యేకత

మా డాక్టర్ మనవాడే. అంటే మొత్తమ్మీద పాకీస్తానో, బంగ్లాదేశో, ఇండియానొ తెలియదు కానీ భారత ఉపఖండం వాడే. ఎక్కడివాడో సరిగ్గా నేను తెలుసుకోలేదు. అతను డాక్టర్ ఆఫ్ ఆస్టియోపాత్ (DO). వారు సాధారణ వైద్యులకంటే కాస్త భిన్నమయిన వారు. వారూ మిగతా సాధారణ వైద్యులలాగానే చికిత్స చెయ్యవచ్చు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే రోగ లక్షణాలకు మూల కారణం ఏంటా అని పరిశీలిస్తారు. మిగతా వైద్యుల్లాగా చెయ్యి నొప్పి పెడుతోందంటే ఝండూబాం రాసుకొమ్మని చెప్పే తరహా కాదన్నమాట. ఎందుకు నొప్పి పెడుతుందని వివరాల లోతుకు వెళ్ళి చూస్తారు. సమస్యకి మూల కారణం శోధిస్తారు. ఏ పార్ట్ లక్షణాన్ని ఆ పార్ట్ అని కాకుండా హోలిస్టిక్ అప్రోచ్ వీరిది. శారీరకంగా, మానసికంగా సమగ్రంగా పరిశీలిస్తారు.

నాకు వీరి గురించి కొంతకాలం క్రితమే తెలిసింది. అయితే మా ప్రాంతానికి దగ్గర్లో వీరు లేరు. కొన్ని నెలల క్రితం ఒక సారి మా (ఇదివరకటి) డాక్టర్ లేకపోవడంతో  కొత్త డాక్టర్ ఉన్నాడు వెళతారా అని ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. వెళ్ళి కలిసాను. అతని అప్రొచ్ నాకు నచ్చింది. తరువాత అతను DO అని తెలిసి సంతోషపడ్డాను. వెతుకుతున్న తీగ కాలికి దొరికింది.  ఇంకేం, ఆ డాక్టర్ నుండి ఈ డాక్టరుకి మారాను. సాధారణ వైద్యపరీక్షలప్పుడు మామూలు రక్త పరీక్షలే కాకుండా అదనంగా విటమిన్లు తదితరాలు ఎలా వున్నాయో కూడా తెలుసుకోవడానికి వ్రాస్తాడు. అలా మా ఆవిడలోనూ, నాలోనూ కొన్ని విటమిన్ లోపాలు బయటపడ్డాయి. ఏవయినా రిజల్టులు రేంజిలోనే వున్నా కూడా మా వయస్సుకు అవి తక్కువ రేంజ్ అనిపిస్తే ఆయా తగ్గుదలలు పెంచడానికి ప్రయత్నిస్తాడు. మా పాత డాక్టర్లు అయితే రేంజిలోనే వున్నాయి కదా అని లైట్ తీసుకునేవారు. 

అయితే ఇతగాడితో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు లేకపోలేదు. శరీరం మరీ పరిశుద్ధంగా వుండాలన్న భావనతో మంచి మంచి డైటరీ సప్లిమెంట్స్ రికమెండ్ చేస్తాడు. కానీ వాటికి డబ్బు ఎక్కువవుద్దే. డబ్బా, ఆరోగ్యమా అని అడుగుతాడు. ఆరోగ్యమే కానీ... మన దగ్గర అలా ప్రతీ దానికి అన్నన్ని డబ్బులు పెట్టాలంటే వుండాలి కదా. కొన్ని సార్లు వింటాను - కొన్ని సార్లు వినను.  మందులూ, మాకులకు బదులుగా వీలయినంత వరకు  ప్రకృతి సిద్ధమయిన ఆహారం పరిష్కారాలుగా సూచిస్తాడు కానీ అవన్నీ మాకు కుదరొద్దూ.

మీరు కూడా మీ దగ్గర్లో వున్న ని ఓ సారి కలిసి వారి విధానం మీకు నచ్చుతుందేమో చూడండి. వారి గురించి వివరాలకు ఇక్కడ చూడండి.  
You are more than just the sum of your body parts. That’s why doctors of osteopathic medicine (DOs) practice a “whole person” approach to health care. Instead of just treating specific symptoms, osteopathic physicians concentrate on treating you as a whole.

సాలెహా బేగం - నా బాల్య స్నేహితురాలు

సాలెహా బావుంటుంది. ఉత్సాహంగా, చలాకీగా కూడా వుంటుంది. ఆమె నాకు ప్రాధమిక పాఠశాలలో కూడా క్లాస్‌మేటో కాదో గుర్తుకులేదు. అయివుండవచ్చు. అయితే ఆమెతో మిడిల్ స్కూల్ స్నేహం మాత్రం గుర్తుకువుంది. 7 వ తరగతి వరకు మా ఊర్లో చదివాను. అప్పుడు పాఠశాలలో బాగా కోకో ఆట ఆడుతుండేవారం. ఆ ఆటలో ఎప్పుడూ ఆమె వెనకాలే పడేదాన్ని.  "ఎప్పుడూ నా వెనకాలే పడతావేంటి శరత్?!" అని నవ్వుతూ అరుస్తుండేది. ప్రతిగా నేను నవ్వేస్తుండేవాడిని. మాది సాధారణ స్నేహం మాత్రమే. ప్రత్యేకత ఏమీ లేదు. ఇద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు వుండేవి.

8 వ తరగతికి భువనగిరి వెళ్ళాక సెలవుల్లో తరచుగా మా ఊరికి వచ్చి నా బాల్య స్నేహితులని కలుస్తుండేవాడిని. ఆమె గురించి కూడా కనుక్కుంటూవుండేవాడిని. నా క్లోజ్ ఫ్రెండ్ నజీర్ ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు కూడానూ. వాళ్ళూ వాళ్ళూ బంధువులనుకుంటా. నజీర్ ఇంటికి వెళుతూ వాళ్ళింటి వైపు తొంగి చూసేవాడిని - ఆమె తళుక్కుమంటుందేమోనని. ఎప్పుడన్నా కనిపించిందా లేదా గుర్తుకులేదు. నన్ను చూసి వుంటే దూరం నుండి ఓ చిర్నవ్వు నవ్వేదేమో మరి.

ఓ సారి సెలవులకి వచినప్పుడు సాలెహా గురించి నజీర్ని కనుక్కుంటే ఆమె పెళ్లయిపోయిందని చెప్పేసాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. తురకల అమ్మాయి కాబట్టి తొందరగా పెళ్ళి చేసినట్టున్నారు. వాళ్ళ నాన్న అధ్యాపకుడే. అయినా సరే అమ్మాయి పెళ్ళి తొందరంగానే చేసేసాడు. అప్పటికి ఆమెకి పదవ తరగతి అయినా పూర్తయ్యిందో లేదో. ఆమెకి అలా తొందరగా పెళ్ళవడం నాకయితే నచ్చలేదు. 

అలా అలా ఆమె నా జ్ఞాపకాల మరుగున పడిపోయింది. ఎప్పుడన్నా ఊరికి వెళితే నజీర్ ఇంటికి వెళుతూ సాలెహా బేగం తల్లితండ్రుల ఇంటివైపు ఓ సారి చూస్తానంతే. ఆమె గురించి మా స్నేహితుడిని కనుక్కొని చాలా ఏళ్ళయ్యింది. ఆమె వివరాలు గుర్తుకులేవు. ఈసారి మా ఊరికి వెళ్ళినప్పుడు ఆమె గురించి వివరంగా కనుక్కోవాలి. ఎక్కడ ఏ ఊర్లో వుందో ఏమో. వీలయితే నజీరుని వెంటబెట్టుకొని ఆమెని కలవాలి - ఆమెకి సౌకర్యంగా వుంటుందనుకుంటేనే లెండి. ఆమె  నన్ను గుర్తుపట్టదేమో. నేనని తెలిసాక "శరత్తూ ఇంకా నా వెంటపడుతూనే వున్నావా!?" అని నవ్వుతూ అప్పటిలాగా అరుస్తుందేమో చూడాలి.

ఇక్కడ వుండి ఇవన్నీ బాగానే అనుకుంటాం కానీ ఇండియా ట్రిప్పుకి వెళ్ళినప్పుడు ఇంత తీరికా, ఓపికా వుంటాయా చెప్పండి. క్షణం తీరదు అప్పుడు. ఏమో, ఏమో రిటైర్మెంట్ అయ్యాక అయినా అందరు బాల్య స్నేహితులనీ, స్నేహితురాళ్లనీ తీరిగ్గా కలుస్తానేమో. అందాక ఇలా ఓ బ్లాగు పోస్ట్ వేసుకుని అయినా తృప్తి పడనీయండి నన్ను. ఓ చక్కటి బాల్య స్నేహితురాలి జ్ఞాపకాలను మీతో పంచుకున్న సంతృప్తిని అయినా పొందనీయండి నన్ను. 

కిరణ్ స్వరూప - నా చిన్ననాటి స్నేహితురాలు

ఎంత అందంగా వుండేదనీ. క్రిస్టియన్ గర్ల్ ఆమె. తన తల్లితండ్రులిద్దరూ అధ్యాపకులు. అప్పటిదాకా మా పల్లెలో చదుకుంటున్న నేను మా నాన్న గారు పనిచేసున్న భువనగిరి గంజ్ పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో చేరాను. అప్పుడే ఆమెను చూసి ఫ్లాట్ అయ్యాను. ఎంత చక్కగా నవ్వేదనీ. వాళ్ల పేరెంట్లూ, మా నాన్నా అధ్యాపకులే అవడంతో వారికీ నాన్నగారికీ స్నేహం వుండేది. వాళ్ళిల్లు స్కూలుకి దగ్గర్లోనే వుండేది. ఆమె కానీ, మిగతావారు కానీ ఎంత నచ్చినా ఎవరితోనూ వెధవ్వేషలు వెయ్యలేదు. అందరితో సాధారణ స్నేహం నడిపిస్తుండేవాడిని - మౌనంగా, మూగగా అభిమానిస్తుండేవాడిని. అలాగే కిరణ్ తోనూనూ.  మామధ్య పరస్పర గౌరవం, సాధారణ స్నేహం వుండేవి. ఆమెతో ఎక్కువ స్నేహం చేస్తే ఏ వెధవ పని చేయాలనిపిస్తుందో అని తగిన జాగ్రత్తలో వుండేవాడిని. 

మా క్లాసులొ ప్రతి నెలకి క్లాస్ మానిటర్ మారతారు. ఆమె ఓకసారి అలా మా క్లాసుకి మానిటర్ అయి మా అబ్బాయిలను అందరినీ బాగా కట్టడి చేసింది. దాంతో మాకు అందరికీ బాగా వళ్ళు మండింది. మాలో మేము మాట్లాడుకొని కూడబలుక్కొని పాఠశాలకి దగ్గర్లో వున్న వారి ఇంటికి పోలోమ్మంటూ వెళ్ళాం. ఆమె నాన్నగారిని పిలిచి ఆమె మా క్లాసు మానిటరుగా మాకు పెడుతున్న ఇబ్బందులు వివరించాం.   మేము వచ్చి మాట్లాడుతుంటే కిరణ్ లోపటినుండి చూస్తొవుంది అప్పుడు. ఆమె మనస్సు ఎక్కడ బాధపడుతుందో అని నాకిక్కడ బాధేస్తోంది. అలా అని నేను ఏమయినా మాట్లాడవద్దంటే మా వాళ్ళు నా కీళ్ళు విరగ్గొట్టేట్టున్నారు. అందుకే ఆ గుంపులో గోవిందగా కలిసిపోయాను.  వాళ్లకూ మాకూ బాగానే పరిచయాలు వున్నాయి కాబట్టి ఆయన కూడా మా సమస్యలు సాదరంగా విని అర్ధం చేసుకున్నాడు. కిరణ్‌కి చెబుతా అన్నాడు. 

మరునాడు కిరణ్ తన పదవికి రాజీనామా చేసింది. కుర్రాళ్లం అంతా ఆమె చర్యకి హర్షించాం. ఆమె మా పట్ల కోపంతోనో, ద్వేషంతోనో వుంటుందనుకున్నాం కానీ ఆ విషయం మనస్సులో పెట్టుకోకుండా ఇదివరకు లాగానే  అందరితో స్నేహంగా వుంటుండటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను.  పై సంఘటణకి మించి ఆమె గురించి ఇంకా ప్రత్యేకంగా ఏమీ గుర్తుకులేదు. అక్కడ తొమ్మిదివరకు చదివాక మా నాన్నకి సూర్యాపేట్ బదిలీ అవడంతో పదికి అక్కడికి వచ్చాను. తీరా చూస్తే క్లాసులో అందరూ మగపిల్లలే :( అంతమంది అమ్మాయిల మధ్య తిరిగిన నాకు మా సూర్యాపేట క్లాసు ఓ ఎడారిలా అనిపించింది. అది కో ఎజుకేషన్ స్కూలే కానీ మా తరగతిలోనే అమ్మాయిలు లేరు, ఏం చేస్తాం...ప్చ్ అనుకుని మూసుకున్నాను. 

అలా కిరణ్‌కి దూరమయ్యాక ఎప్పుడు కిరణ్ అని పేరు విన్నా కూడా ఆమె గుర్తుకు వచ్చి నా మది పులకరిస్తూవుంటుంది. ఆమె తియ్యగా జ్ఞాపకం వస్తుంటుంది. ఇన్నేళ్ళ తరువాత ఆమె గురించి నా అప్పటి బాల్య స్నేహితుడు యూసుఫ్ చెప్పగా విని నా మది పులకించిపోయింది.  ఆమె టచ్చులోనే వుందని చెప్పాడు. అయితే ఎన్నో ఏళ్ళ తరువాత అతనితో మాట్లాడిన కారణంగా సమయం లేక కిరణ్ గురించి మిగతా వివరాలు కనుక్కోలేకపోయాను. ఇవాళ కూడా మాట్లాడాను కానీ ఆ టాపిక్ ఇంకా రాలేదు. ఈసారి మా యూసుఫుద్దీన్ తో మాట్లాడినప్పుడు ఆమె గురించి వివరంగ కనుక్కుంటాను. ఆమె కాంటాక్ట్స్ తీసుకుంటాను. అప్పటంత సౌందర్యం, గ్రేస్ ఆమె మెయిటెయిన్ చేస్తోందో లేదో. ఎప్పుడో మా తొమ్మిదవ తరగతిలో చూసిన ఆమె రూపమే ఇంకా గుర్తుకువుంది. ఈ సారి ఇండియా వెల్ళినప్పుడు వీలయితే ఆమెను కలిసిరావచ్చు కానీ ఆమె పాత స్మృతి చెరిగిపోతుంది. కొత్త కిరణ్ బావుంటుందో లేదో. బావున్నా లేకపోయినా ఆమెలోని అదే సరళత్వం, ఆహ్లాదత, మంచితనం కనుమరుగు అవకుంటే చాలు.  అయినా సరే నాలోని ఆమె స్మృతి చెరిగిపోకూడదనుకుంటే ఆమెను కలవకపోవడమే బెటర్. మీరేమంటారు? 

ఆమె కంఠ స్వరం కూడా ఎంత తియ్యగా వుండేదనీ. త్వరలోనే ఆమెతో ఫోన్లో మాట్లాడే అవకాశం వుంటుందని ఆశిస్తున్నా. అప్పుడు చూడాలి - ఇంకా ఆమె గొంతులోని మాధుర్యం అలాగే వుందో లేదో. వీలయితే ఆమెకు నా బ్లాగ్ అడ్రసూ ఇస్తాను. తన గురించి ఈ పోస్టేసాననీ చెబుతాను.  అప్పటిలాగా చక్కగా ఇప్పుడూ నాతో మాట్లాడుతుందంటారా? ఏమో. చూడాలి మరి. అప్పుడు ఆమెనే అడుగుతాను - ఆమెని కలిస్తే బావుంటుందో - కలవకపోతే బావుంటుందో.


నాకోసం నా చిన్ననాటి స్నేహితుడు యూసుఫ్ అన్వేషణ ఇన్నాళ్లకి ఫలించింది

చాలా నెలల తరువాత మా స్వంత అన్నయ్యకి ఈరోజు ఫోన్ చేసాను. చాలా రోజుల క్రిందట తాను భవనగిరి నుండి వస్తుంటే ఒకతను కలిసి మీరు శరత్ (కి) అన్నయ్యనా? అని అడిగి తన ఫోన్ నంబర్ ఇచ్చి నిన్ను ఫోన్ చెయ్యమని చెప్పాడన్నారు.  తన పేరు చెబితే శరత్ గుర్తుపడతాడని అన్నాడంట, ఏదో ముస్లిం పేరు గుర్తుకులేదని చెప్పాడు అన్నయ్య. నాకూ అతనెవరో అర్ధం కాలేదు. కాల్ అయిపోయాక అన్నయ్య అతని పేరు గుర్తుకుతెచ్చుకొని నంబర్ తన నోటుబుక్కులో చూసి నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ మిత్రుని పేరు యూసుఫుద్దీన్.

ఎన్నేళ్ల క్రిందటి స్నేహం మాది! 8, 9 తరగతులలో భోనగిరిలో మేమిద్దరం క్లాస్మేట్లం. మా నాన్నగారు మా అందరికీ హిందీ (ప్రభుత్వ) ఉపాధ్యాయులుగా  అక్కడ పనిచేస్తుండేవారు. ఆ తరువాత నాన్నకి సూర్యాపేట బదిలీ అవడంతో పదవతరగతికి ఆ మిత్రులనందరినీ వదిలేసి సూర్యాపేట్ వచ్చేసాను. ఆ తరువాత కూడా రెండు మూడేళ్ళు అప్పుడప్పుడూ కలుసుకున్నాం కానీ తరువాత అలా వీలయ్యింది కాదు. అలా క్రమంగా కాంటాక్ట్స్ తెగిపోయాయి. అటు పిమ్మట భోనగిరిలో మా బంధువుల ఇంటికి వెళ్ళి గడుపుతూ పాత మిత్రుల జాడ తెలియక తల్లడిల్లిపోయేవాడిని. 

యూసుఫుద్దీన్ ఎంత చక్కని స్నేహితుడనీ. కల్మషం లేని మనిషి. మా నాన్న అంటే, నేను అంటే అతనికి ఎంతో అభిమానం వుండేది. ముస్లిం పండగలు వస్తే చాలు వారింటికి పిలిచి బిర్యానీలు తినిపించేవాడు. అలా అలా ఎన్నో ఎన్నెన్నో బాల్య స్మృతులు అతనితో గుర్తుకువున్నాయి. అతని ఫోన్ నంబర్ తెలియగానే  ఫోన్ చెసి గుర్తుపట్టమని అడిగాను. నన్ను ఇంత చనువుగా యూసుఫొద్దీన్ అని పిలిచేవారు ఇద్దరే వుంటారు ఒకరు రాజు, మరొకరు శరత్ అని అన్నాడు. ఆ శరత్తునే అన్నాను నేను నవ్వుతూ. ఎంత సంతోషించేడనీ, ఎన్నెన్ని కబుర్లు చెప్పాడనీ, నా కోసం ఎంత వెదికిందీ ఎలా వర్ణించుకొచ్చేడనీ. మనకోసం ఇంతగా తాపత్రయపడే మిత్రులు వుంటే ధన్యులమే కదా అనిపించింది. నేనూ అతనికోసం వెదికాను కానీ... అతని అన్వేషణతో పోలిస్తే నా వెదుకులాట... అబ్బే.. ఓ లెక్కలోనిది కాదు.  నాకు సిగ్గు వేసింది. నేను కొంతమందిని కాస్త కనుక్కున్నా అంతే కానీ తీవ్రమయిన ప్రయత్నాలు ఏమీ చెయ్యలేదు. మరి అతనో...    

నాలుగయిదేళ్ళ  క్రితమే భువనగిరి నుండి తను ఎన్నడూ వెళ్ళని మా స్వంత ఊరు వెళ్ళి మా బంధువులను కనుక్కొని మా అమ్మ అడ్రసు తీసుకొని అమ్మని కలిసి మాట్లాడి ముచ్చట్లు చెప్పి తన నంబర్ ఇచ్చి నాకు చెప్పమన్నాడంట. అమ్మ ఆ విషయం నాకు చెప్పడం మరిచేపోయింది. ఆ తరువాత బస్సులో మా అన్నయ్య కనిపిస్తే   దాదాపుగా ముప్పయిఏళ్ళ క్రితం చూసిన మా అన్నయ్యని గుర్తుపట్టి ఎక్కువ సమయం లేకపోవడంతో తన నంబర్ అయితే అందివ్వగలిగాడట. నా నంబర్ తీసుకొనే సమయం చిక్కలేదంట. మా అన్నయ్యకి నేను ఎప్పుడో కానీ ఫోన్ చెయ్యను కాబట్టి ఈరోజు చేస్తే అతని గురించి తెలిసింది. ఎప్పుడో ఒకప్పుడు నేను టచ్చులోకి వస్తానని నాకోసం ఎదురుచూస్తూనే వున్నాడుట.

8,9 తరగతి మిత్రులు చాలామందితో తనకి కాంటాక్ట్స్ వున్నాయిట. చాలా సంతోషం వేసింది. అప్పటి స్నేహితుల ఫోన్ నంబర్లు అన్నీ ఇస్తాను అన్నాడు. మా స్కూల్ బ్యూటీ కిరణ్ స్వరూప కూడా టచ్చులోనే వుందిట.  అయితే ఇంకో బ్యూటీ పద్మజ ఆత్మహత్య చేసుకుందన్న విషయం నాకు తెలుసు. అది ప్రస్థావించుకొని బాధపడ్డాం. ఇంకో బ్యూటీ పద్మజ గురించి మాట్లాడుకున్నాం. ఇంకో చక్కటి అమ్మాయి క్రిష్ణవేణి జాడ తెలియనందుకు విచారపడ్డాం. మా ఫ్రెండు సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించాడని తెల్సి బాధేసింది. మిగతా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కులాసాగా వున్నారని తెలిసి సంతోషంగా అనిపించింది. 

అప్పటి మిత్రుల రియూనియన్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. వివరాలు తీరిగ్గా మాట్లాడదామని అనుకున్నాం. అయితే ఆ స్నేహితుల్లో నాలా విదేశాలకి ఇంకెవరూ రానట్లుంది. రియూనియన్ జరిగితే నేను ఇంతదూరం నుండి వెళ్ళాల్సిరావచ్చు. అటు పిమ్మట క్లుప్తంగా మా కష్టసుఖాలు చెప్పుకున్నాం. మా కుటుంబాల గురించి మాట్లాడుకున్నాం. మళ్లీ తీరిగ్గా రెండు మూడు రోజుల్లో మాట్లాడుకుందామని చెప్పుకొని విడిపోయాం. 

అందరికీ వుంటారు మిత్రులు - అందులో కొందరే మంచి మిత్రులుంటారు. అందులో మరి కొందరే ఇలా గుర్తుంచుకొని మన గురించి తాపత్రయపడుతుంటారు. దాదాపుగా ముప్పయ్యేళ్ళ తరువాత మా పాత మిత్రునితో మాట్లాడుకున్న ముచ్చట్లు ఇలా వివరంగా పంచుకోవడానికి మీరే నాకు సరి అయిన వారు అనిపించింది. మీరూ మీ బాల్య స్నేహితులని గుర్తుకు తెచ్చుకోండి. మా యూసుఫుద్దీన్ లాంటి స్నేహితుడు మిమ్మల్ని మిస్సవుతూ వుండొచ్చేమో కదా.

హరే క్రిష్ణ! హరే రామ!!

నాకు ఇద్దరూ ఇష్టమయినప్పటికీ క్రిష్ణుడంటే ఎక్కువ ఇష్టం. ఎందుకో మీకు చెప్పక్కరలేదు. కెనడాకి వెళుతూ డెట్రాయిటులో మిత్రుడి దగ్గర ఆగినప్పుడు ఆ ఆదివారం మా తెలుగు బడి చూపిస్తానంటూ ఆహ్వానించేడు. మా చిన్నమ్మాయీ, నేనూ వెళ్ళాం. తీరా చూస్తే అది ఇస్కాన్ వారి చిన్న ప్రార్ధనా మందిరం. పెద్ద గుడి డవున్ టవునులో వుంటుందిట.  ఒక పాత ఇల్లు కొని ప్రార్ధనా మందిరంగా మార్చేసారు. అందులో పూజలూ, ప్రార్ధనలూ, సాంస్కృతిక కార్యక్రమాలూ, తెలుగు పాఠాలూ జరుగుతుంటాయిట. నా స్నేహితుడు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడంతో బాటుగా అందులో బోధిస్తుంటాడు. 

హరే క్రిష్ణ, హరే రామ భావజాలం గురించి మా మిత్రుడు నాకు వివరించాడు. నేనూ కొన్ని సందేహాలు తీర్చుకున్నాను. నాకు దేవుడి మీద విశ్వాసం లేకపోయినా కూడా తెలుగు వారు అప్పుడప్పుడు అలా కలుసుకోవడం, పరస్పర గౌరవంతో, అంకిత భావంతో సామూహికంగా అలా గడపడం నాకు నచ్చింది. మా అమ్మాయి కూడా తోటి పిల్లలతో తెగ ఆడుకుంది. నాస్తికులు, హేతువాదులూ ఎవరయినా అలా సమిష్ఠిగా గడపగలిగే అవకాశం వుంటే ఇంకా నచ్చేదేమో. నా చిన్నప్పుడు మా నాన్నగారు నాస్తిక సభలకు, శిక్షణా తరగతులకూ తీసుకువెళ్ళేవారు. అలా చక్కగా గడిపేసేవాడిని. గోరా, లవణం, సమరం లాంటి వారి సాంగత్యంలో ఎన్నో విషయాలు ఆకళింపు చేసుకునేవాడిని.  ఈ దేశాలకు వచ్చాక నాస్తికులు దొరక్కా, ఆస్తికులతో తిరక్కా మా కుటుంబమూ, నేనూ రెంటికి చెడ్డ రేవడి అయ్యాం.  

ఇక్కడ తెలుగు లేదా దేశీ నాస్తిక కూటములు జరిగే అవకాశం ఇప్పట్లో కానరావడం లేదు కాబట్టి పైగా స్పిరుచువాలిటీ మీద కాస్తంత ఆసక్తి కలుగుతోంది కాబట్టి సత్సంగాల కోసం మనస్సు బార్లా తెరిచి ఎదురుచూస్తూవున్నాను. సహజ మార్గం లాంటివి కొన్ని పరిశీలించాను కానీ వాటి మీద ఆసక్తి కలగలేదు. ఒషో మార్గం మీద బాగా ఆసక్తి కలిగింది కానీ ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఆ సమావేశాలు జరగడం లేదు. దాంతో ఆధ్యాత్మిక ఆర్తి తీరడం లేదు. చిన్మయ మిషన్ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కానీ అదంటే అంత ఆసక్తి లేదు, అయినా సరే ప్రయత్నించాను కానీ మా ప్రాతంలో ఎవరయినా సత్సంగాలు నిర్వహిస్తున్నారేమో తెలియడం లేదు. చికాగోలోని చిన్మయ కేంద్రం మాకు గంట దూరంలో వుంటుంది. ఓసారి వెళ్ళి మా వైపు వాళ్ళు ఎక్కడ సమావేశం అవుతున్నారో కనుక్కోవాలి. 

మా స్నేహితుని దగ్గరి నుండి కొన్ని చికాగో ఇస్కాన్ కాంటక్ట్స్ తెచ్చాను. వారిని కనుక్కొని మా వైపు హరే క్రిష్ణ సంత్సంగాలు కనుక జరుగుతున్నట్లయితే వెళతాం. అయా సమావేశాలల్లో నాకు కావాల్సినంత మేరకే సంగ్రహించి మిగతా విషయాల్లో మౌనంగా వుంటాను. ఈ భావజాలాన్ని పరిశీలించినప్పుడు వారు రాముడిని తొక్కివేసి క్రిష్ణుడినే బాగా పైకి తెస్తున్నారని అనిపించి ఆశ్చర్యపడ్డాను. మా మిత్రుడిని వివరణ అడిగాను కానీ అతను చెప్పింది అర్ధం కాలేదు. ఇదివరలో హరే రామ, హరే క్రిష్ణ అనేవారుట కానీ కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఈ ఉద్యమ నామాన్ని హరే క్రిష్ణ, హరే రామగా మార్చేసారుట. రాముడికి ఎంత అవమానం అని అనిపించింది. ఆ రాముడి మనస్సు గాయపడిందో లేదో కానీ నా మనస్సుకయితే చివుక్కుమంది. పోనీలెండి, దేవుళ్ళందరూ ఒక్కటేనని ఆస్తికులు అంటుంటారు కదా.

అక్కడ ఒక మాతాజీతో మాట్లాడుతూ ఓ పదేళ్ళ క్రితం కెనడాలోని టొరొంటోలో వున్నప్పుడు అక్కడి ఇస్కాన్ టెంపుల్ దర్శించేవాడినని చెప్పాను. అప్పుడు మా ఆవిడకి తోడుగా వెళ్ళేవాడిని లెండి. ఒక్కసారి క్రిష్ణ మందిరానికి వెళితే చాలు - ఆ కొంటె క్రిష్ణుడు ఎప్పటికయినా తనవయిపు లాక్కుంటాడని ఆమె చెప్పింది. నిజమా!? అందుకేనా ఇటువైపు నాకు మనస్సు మళ్ళింది? నాలో నేను నవ్వుకున్నాను. ఏమో. పోనిద్దురూ.

క్రిష్ణుడి చిలిపితనం, కొంటెతనం, గోపికలతో సరసల్లాపాలు అంటే నాకు భలే ఇష్టం కానీ ఈ ఇస్కాన్ వారు క్రిష్ణుడి ప్రణయాన్ని కూడా కోడికి ఈకలు పీకినట్లు పీకి అవి కూడా ఆధ్యాత్మిక చేష్టలే అని వీలయినంతగా మార్చేసే వుంటారు.  ఇంకా స్పష్టంగా తెలియదు. తెలుసుకోవాలి. పోనీలెండి. నాకు అవసరమయిన ఆధ్యాత్మికత నాకు దక్కితే చాలు. మా ఇస్కాన్ మిత్రుడూ అదే అన్నాడు. అంగడిలో అన్నీ వుంటాయి. అందులో మనకు కావాల్సినవి మనం ఏరుకొని తెచ్చుకోవాలి.   భావజాలాల్లో అయినా అంతే. అన్నీ సమిష్టిగా ఒకే దగ్గర దొరకాలంటే కష్టమే మరి.

అన్నట్లు పిట్స్‌బర్గ్ కి గంటన్నర దూరంలోని ఇస్కాన్ వారి న్యూ బృందావనం చాలా బాగుంటుందిట కదా. చాలా మంది చెప్పారు.  ఫోటోలూ చూసాను. నాకూ వెళ్ళి చూసి రావాలని వుంది కానీ మాదగ్గరి నుండి 9 గంటల ప్రయాణం. మీలో ఎవరయినా ఆ క్రిష్ణ మందిరానికి వెళ్ళివచ్చేరా? 
http://newvrindaban.com/

మా మిత్రుడు ఆ భావజాలంలో పడిపోయి అందుకు తగ్గట్టుగా పూర్తిగా మాంసాహారం మానివేసాడు. అలా బాగా శుష్కించిపోయాడు.  మిగతా విధాలుగా అయినా ప్రొటీన్ తీసుకొమ్మని సూచించి వచ్చాను.