వంట్లోని కొవ్వు కొలిచే సాధనం తెప్పిస్తున్నా

హమ్మయ్య, జిమ్ములో నా వ్యాయామం మళ్ళీ ఓ దారికి వచ్చేసింది. క్రమ తప్పకుండా తగినంత విశ్రాంతి ఇస్తూనే బరువులు ఎత్తుతున్నాను. ఇదివరకు దెబ్బతిన్నా కాబట్టి జాగ్రత్తగా, నెమ్మదిగా దూకుడు లేకుండా, అన్ని విషయాలను గమనించుకుంటూ వెళుతున్నా కాబట్టి వారం మొత్తమ్మీద ఓ రెండు గంటలు బరువులు, ఓ గంట ఎరోబిక్సూ చేస్తున్నా. ఈ వారం నుండీ సెకండ్ గేర్ వేసేసా. అంటే బరువు, సమయం, ప్రొటీన్ పెంచేస్తున్నా. ఇప్పటిదాకా 30-50 పౌండ్ల బరువు ఎత్తుతున్నవాడినల్లా ఈ వారం నుండీ క్రమంగా 50 - 80 కి పెంచేస్తున్నా. ఇవే కాకుండా సాల్సా మొదలయిన లాటిన్ నృత్యాలు కూడా వీలయితే ఈ వారం నుండే మొదలెట్టాలి. 

జిమ్ములో వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మన శ్రద్ధ ముఖ్యంగా ఫ్యాట్ పరెసెంటేజ్ తగ్గించడం మీద పెడితే మిగతా ప్రయోజనాలు అన్నీ వాటంతట అవే సమకూరుతాయని  తెలిసింది. అందుకే నా వంట్లో కొవ్వు శాతం తగ్గించడం మీద దృష్టి సారిస్తున్నా. కొన్ని నెలల క్రితం అది పరీక్షించినప్పుడు నాకు తగిన రేంజిలోనే 20 శాతం చుటుపక్కల వుంది అని గుర్తుకువుంది. నా వయస్సుకి అది 12 నుండి 21 శాతాలకు మధ్యలో వుండాలి.  దానిని క్రమంగా 12% తీసుకువస్తే ఎంతో బావుంటుంది.  నా వయస్సుకు ఆ మాత్రం కొవ్వు కనీసం నా వంట్లో వుండాల్లెండి. కావాలంటే 10 వరకూ వెళ్ళొచ్చేమో కానీ అది చాలా కష్టం అనుకుంటాను. 12 కి తీసుకురావడనికే చాలా శ్రమ పడాల్సి వుంటుంది. 

వంట్లో కొవ్వు శాతం ఎంత వుందో తెలుసుకోవడం కోసం నిన్ననే అమెజాన్ సైటులో ఫ్యాట్ అనలైజర్ ఆర్దర్ చేసాను. పైన ఫోటోలో కనిపిస్తున్న పరికరం అదే. చాలా సింపుల్గా పనిచేస్తుందది. రెండు చేతులా దాన్ని పట్టుకొని పది క్షణాలు వుంటే చాలు - మనకు కొవ్వు ఎంత వుందో తెలియజేస్తుంది. అవసరమయిన దానికంటే వంట్లో ఎక్కువ ఫ్యాట్ వుంటే గుండె జబ్బులు, చెక్కెరలాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకి అది దారితీస్తుంది.   అందుచేత అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఆ పరికరం వచ్చాక తరచుగా మాఇంట్లో వారి కొవ్వు కొలవడమే కాకుండా మా బంధుమిత్రులవి కూడా లెక్కేస్తాను. 

కొవ్వు శాతమే కాకుండా అది BMI కూడా కొలుస్తుంది. ఇంకా మెటబాలిజం, విసెరల్ ఫ్యాట్ కొలిచే పరికరాలు కూడా వున్నాయి కానీ వాటికి ఇంకాస్త ఖర్చు అవుతుందని ఇప్పటికిది చాల్లే అని పై పరికరంతో తృప్తి పడుతున్నాను. ఇలాగే ఆరోగ్యం విషయంలో ముందడుగులు వేస్తుంటే మిగతావి మున్ముందు కొనుక్కోవచ్చులెండి.  పై పరికరానికి అంతా కలిపి $29 అయ్యింది.

No comments:

Post a Comment