సెక్సీ శారదా శ్రీనివాసన్!


శారదా శ్రీనివాసన్ గారిని సెక్సీ అని పిలవడం కొంతమందికి నచ్చకపోవచ్చు... కానీ చలం 'ఊర్వశి'ని సెక్సీ అనకుండా వుండగలనా? చిన్నప్పుడు ఆమె మధురమయిన కంఠం వింటూ పెరిగాను. కుర్రాడినయ్యాక నేనో పురూరవుడిని అయిపోయి ఆమెలో ఓ ఊర్వశిని విన్నాను.  నా గాత్ర సుందరి ఎలా వుంటుందా గాత్రం వున్నంత మధురంగా మనిషి వుంటుందా లేదా అనే అనుమానంతో ఇన్ని ఏళ్ళూ గడిపాను. ఇన్నాళ్లకి, ఇన్నేళ్ళకి ఆమె ఫోటో చూసే అవకాశం  కలిగింది. ఇప్పటి ఫోటోలే కాదు ఊర్వశి కాలం నాటి ఫోటోలు చూసే అవకాశం కలిగింది. శారద గారు ఎంత అందంగా వున్నారు! నా స్వప్నం చిరిగిపోలేదు. గాత్రం ఎంతో బావున్నా మనిషి బాగోకపోతే నాకు జీర్ణించుకోవడం కష్టమయ్యేదే. 

నా చిన్నప్పుడు ఇప్పటిలా టివిలు, FM లు లేనందున ఆకాశవాణి మీదే ఆధారపడేవారం. అందులోని ఆర్టిస్టులే మాకు సెలబ్రెటీలు. ఒక్కొక్కరి వాచకం, స్వరం ఎంత బావుండేదని. వార్తలు, వ్యాఖ్యానాలూ ఆడా, మగా ఎవరు చదివినా వారి గాత్ర సౌందర్యాన్ని లేదా గాత్ర గాంభీర్యాన్ని రసాస్వాదన చేస్తూ మైమరచిపోయేవాడిని. ఇన్నాళ్ళకు శారదా శ్రీనివాసన్ గారి నా రేడియొ అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకం ద్వారా అప్పటి ఆకాశవాణి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి. వారి ముచ్చట్లు చదువుతుంటే సమయమే తెలియలేదు. అందులో వారి ఫోటోలు కూడా వున్నాయి. అలా చూసానన్నమాట నా కలల స్వర సుందరిని. ఎన్నాళ్ళుగా వేచివిన్నా నా ఊర్వశి ఫోటో కోసం! వారు పుస్తకం వ్రాసేరని తెలిసి ఇండియా వెళ్ళినప్పుడు తప్పక కొనుక్కోవాలనుకున్నా. ఈలోగా కినిగే సైటులో లభ్యం అవడంతో అక్కడ తీసుకొని చదివేసాను.  

ఆమె స్వరం ఎంత బావుంటుందని, ఎంత తియ్యగా వుంటుందనీ. రేడియో నాటకంలోనీ ఏ పాత్ర అయినా ఎంత బాగా వేస్తుందనీ. ఆ రోజుల్లో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చే ఓ గంట నాటకం కోసం అన్ని పనులూ మానుకొని ఎదురుచూసేవారం. అలా ఆమె హీరోయినుగా వేసిన ఎన్ని నాటకాలు విన్నానో. అవన్నీ గుర్తుకులేవు కానీ రచయిత చలం నవల ఉరూరవలో ఆమె వేసిన ఊర్వశి పాత్ర బాగా గుర్తుండిపోయింది. ఆ నాటకంలో రెండే రెండు పాత్రలు. పురూరవ రాజు మరియు దేవకన్య ఊర్వశి. (నాకు ఆ కథ అంతగా గుర్తుకులేదు). మన ఫేవరెట్ హీరోయిన్ను సినిమాలో సగం వేషం వేస్తే ఎంత ఆనందం పొందుతామో ఆ నాటకం విని అంత సంతోషం అనుభవించాను.  అవును మరీ, ఆమెది మామూలు గొంతా? ఎంత సెక్సీగా వుంటుంది ఆ గొంతూ! పదహారేళ్ళ అందమయిన అమ్మాయి యవ్వనం ఆ గొంతులో తోణికిసలాడుతూవుంటే నాకు పిచ్చెక్కిపోయేది. అదే సమయాన ఆమె ఆకారం కూడా అంత అందంగా వుంటుందో లేక చుప్పనాతిలా వుంటుందో అనే అనుమానాలు పట్టిపీడించేవి. మొత్తానికి ఆ అనుమానం ఇన్నాళ్లకి తీరింది. ఆ గొప్ప స్వరానికి తగ్గట్టే ఆమె కూడా ఓ గొప్ప సుందరే. ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా తిరస్కరించిందట.

9 comments:

 1. ఉరూరవుడు కాదు పురూరవుడు

  ReplyDelete
 2. http://www.eemaata.com/em/issues/200811/1350.html

  ReplyDelete
 3. 2.10 నుంచి 3 వరకు బాలానందం , ఆ తరువాత మూడు గంటలకు వచ్చే నాటక ప్రతివారం వినే వాడిని అయితే పేర్లు గుర్తు లేవు. పోవు పుట్టగానే పరిమళించింది అన్నట్టు మీకు ఆ రోజుల నుండే ..........................

  ReplyDelete
 4. @ ఫణి
  ధన్యవాదాలు. సరిచేస్తాను.

  @ ఒరెమూనా
  విషయం ఏంటో చెప్పకుండా లింక్ మాత్రమే ఇస్తే ఎలా అండీ. ఆయ్. నేనేదో వ్యాసం లింక్ అయ్యుంటుందనుకున్నా. పురూరవ నాటకాన్నే ఇచ్చేసారు! మళ్ళీ నా ఊర్వశిని చూడగలిగే (వినగలిగే) అదృష్టాన్ని నాకిచ్చారు. మీకు బోల్డన్ని థేంక్సులు. ఇంటికెళ్లగానే వినేస్తా, నా ఊర్వశితో డ్యూయెట్లు పాడేస్తా.

  @ బుద్ధా మురళి
  అవునండీ. నేనూ బాలానందం వినేవాడిని. ఇప్పుడు తెలుగు టివిలలో వస్తున్న వెర్రిమొర్రి కార్యక్రమాలకూ ఆ ఆకాశవాణి కార్యక్రమాలకూ ఎంత తేడా వుండేదనీ. ఇప్పుడు ఎలా వుందండీ మన ఆకాశవాణీ? ఎవరయినా చెబుదురూ.

  ReplyDelete
 5. ఆకాశవాణిలో తెలుగు మూవీస్ ఎడ్వర్టైస్ చేసే తొలిరోజుల్లో ఒకావిడ ఎప్పుడూ ఆ ప్రోగ్రాం నిర్వహించేవారు. ఆవిడ గొంతు ఎంతో బాగుండేది. ఆవిడ ఎడ్వర్టైస్ చేసిన ప్రతి ఒక్క మూవీ చూసేయ్యాలి అనిపించేది. ఆవిడ పేరు కూడా తెలీదు కాని మీ పోస్ట్ చూసాక నాకు ఆవిడ గుర్తుకువచ్చారు.ఆవిడ గొంతుకి కూడా ఇలాగే వీరాభిమానులు ఉండేవారు.

  ReplyDelete
 6. @ జలతారువెన్నెల
  ఆవిడ పేరు కూడా తెలిసివుంటే బావుండేది. ఎవరికయినా తెలిస్తే చెప్పండహో.

  అయితే గొంతు బావున్నంత మాత్రాన మనిషి కూడా అందంగా వుండాలని లేదు కానీ శారద గారు మాత్రం మనిషి కూడా బావుంటారు (బావుండేవారు).

  ReplyDelete
 7. ఎంత సంకుచితత్వము మీ అలోచనలొ ! అందం చాలా ముఖ్యమే కాని ఒక్క మనిషిని లేక వాళ్ళ గొంతుని అభిమానించడానికి అడ్దు వస్తుందా, ఇక్కడ మీరు ఆమెని మెచ్చుకున్నటు అయితే లేదు.

  ReplyDelete
 8. @ సమీరా
  అడ్డు వస్తుందని కాదు. అందమయిన స్వరానికి తోడుగా మనిషి కూడా అందంగా వుంటే ఇంకా అభిమానం ఎక్కువవుతుంది. అందుకే. ఉదాహరణకు అభిమాన హీరోయిన్లు చూడటానికి అందంగానే వుంటారు కదా. వారి యొక్క మనస్సూ, వ్యక్తిత్వం కూడా గొప్పవని తెలిసినదనుకోండి - వారి మీద ఇంకా అభిమానం పెరుగుతుంది.

  ReplyDelete
 9. చిన్నపుడు రేడియో నాటకాలు విని నేను మీలాగే ఫీల్ అయ్యాను,,,ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెప్పించారు

  ReplyDelete