అమ్మలు స్నేహితురాలికి డిస్లెక్సియా

తన స్నేహితురాలికి డిస్లెక్సియా వుందని నిన్న మా అమ్మాలు (మా చిన్నమ్మాయి) చెప్పింది. తారే జమీన్ పర్ హిందీ సినిమా పుణ్యాన నాకు డిస్లెక్సియా అంటే ఏమిటో తెలిసినా కూడా తెలియనట్టే అదంటే ఏమిటని అడిగాను. w లు m గానూ, b లు d లు గానూ కనపడతాయని చెప్పింది. అది చెప్పడమే కాకుండా తను చదువుతున్న పుస్తకంలోనుండి ఆ అక్షరాలని మార్చి పదాలను చదువుతూ వెళ్ళింది. మీ క్లాస్‌మేట్ స్నేహితురాలికి డిస్లెక్సియా వుందని ఎలా తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగాను. వారికి చదివేటప్పుడు అలా అక్షరాలు కనిపించడమే కాకుండా వారు రాసేటప్పుడు కూడా ఆయా పదాలలోని ఆ అక్షరాలను తిరగరాస్తారని చెప్పింది.

పాఠశాలల్లోని అధ్యాపకులకు డిస్లెక్సియా లక్షణాలను గురించి అవగాహన వుంటుందనీ అందుకనే ఆ స్టుడెంట్ వ్రాతలను మా టీచర్ గమనించి ఆమెకు డిస్లెక్సియా వుందని గుర్తించిందని నాలుగవ తరగతి చదువుతున్న మా అమ్మాయి వివరించింది. ఆమెకు ఆ సమస్య వున్నందుకు గాను ఇంట్లో ఆమె తల్లితండ్రులు  చదవడంలోనూ, వ్రాయడంలోనూ సహకరిస్తున్నారని తెలిపింది.  అంతేకాకుండా టివిలో డిస్నీ ఛానల్లో వచ్చే ఒక సీరియల్లోని నాకు (శరత్ కి) అస్సలే నచ్చని ఓ అమ్మాయికి కూడా ఈ సమస్య వుందనీ, ఆమె కిండర్‌గార్టెన్ లోనే లేదా మొదటి తరగతిలోనో ఆ విషయం తెలుసుకున్నారని చెప్పింది. ఆ సీరియల్ పేరూ, ఆ అమ్మాయి పేరూ నాకు గుర్తుకులేవులెండి. ఎందుకో ఆ అమ్మాయి నాకు అస్సలే నచ్చదు. 

అప్పుడూ అమ్మలుకి తారే జమీన్ సినిమా గురించి చెప్పి ఆ సినిమా నువ్వు కూడా చూసివుంటావని అన్నాను. అవును, ఆ సినిమా చూసాను, ఓసారి ఇండియా నుండి వస్తుంటే కూడా ఫ్లయిటులో ఆ సినిమా పెట్టారు అని ఆ సినిమాలోని కొన్ని దృశ్యాలను గుర్తుకు తెచ్చుకుంది. అది చాలా చక్కని చిత్రమనీ, ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు పొదిందనీ, ఎన్నో అవార్డులు వచ్చాయనీ చెప్పాను.

ఇప్పటికీ మీకు డిస్లెక్సియా అంటే తెలియకపోతే, ఆ సినిమా చూడకపోతే ఇప్పటికయినా చూసెయ్యండి. ఓ చక్కని చిత్రం మిస్సవకండి. మనచుట్టూ వున్న వారిలో ఆ లక్షణాలు వున్నాయేమో గమనిస్తూవుందాం. ఆ సినిమా గురించి వివరాలు: 

డిస్లెక్సియా గురించి:

2 comments:

 1. ఇక్కడి టీచర్స్ కి అ వ్యాధి గురించి తెలియడం వల్ల అ స్టూడెంట్ సేవ్ అయ్యాడు......జస్ట్ థింక్ అబౌట్ ఇండియా టీచర్స్ ......సచ్చేవాడు పోరడు... :)

  ReplyDelete
 2. @ అజ్ఞాత
  నిజమే. ఇక్కడి ఉపాధ్యాయులకి ఇలాంటి విషయాలపై మంచి శిక్షణ వుంటుందనుకుంటాను. ఇండియాలో అయితే అలాంటి లక్షణాలను గుర్తించడానికి మరొ అమీర్ ఖాన్ దిగిరావాల్సి వుంటుందేమో. ఇండియా చాలా రంగాల్లో మెరుగుపడుతోంది. అయితే ఇలాంటి అవగాహన టీచర్లకి కలిగిస్తున్నారా అనేది ఎవరికయినా తెలిస్తే చెప్పండి.

  అయితే ఇక్కడ అవగాహనతో పాటు అనవసరమయిన అతి కూడా వుంటుంది. ఉదాహరణకు మా అమ్మాయి స్కూల్ డిస్ట్రిక్టులో ఒక స్టుడెంటుకి వేరుశనక్కాయల ఎలెర్జీ వచ్చి సమస్య వచ్చిందని తరగతిలో కూరగాయలు, పండ్లు తప్ప అన్నీ నిషేధించారు. ఎవరివయిన పుట్టిన రోజు వేడుకలు గానీ, ఇతర వేడుకలు గానీ జరిగినప్పుడు తరగతి గదుల్లో ఇతర ఆహార పదార్ధాలు వాడకూడదంట.

  ఇలా ఏ ఒక్కరికో ఏదో ఎలెర్జీ వచ్చిందని ఇలా అహారాలు తొలగిస్తూపోతే ఇహ తినడానికేమీ వుండకపోవచ్చు. వారి తరగతిలో విద్యార్ధులకు ఎలెర్జీ వుంటే సరే కానీ ఇది మాత్రం అతి అనిపిస్తోంది.

  ReplyDelete