డాక్టర్ గూగుల్ దగ్గరికి వెళ్ళండి

ఇదివరలో వైద్యుడు చెప్పిందే వేదం. ఇప్పుడు అంత సీను లేదు. గూగులమ్మ చెప్పిందే వేదం అని చాలామంది జనాలు భావిస్తున్నారు. ఏ వైద్యుడికయినా సాధారణంగా తన సంపాదన ముఖ్యం - పేషెంట్ల బాగోగులు తరువాత. అందువల్ల మనం ఏదయినా సమస్య వచ్చి డాక్టరు దగ్గరికి లగెత్తుకి వెళ్లగానే ఆయన గారు తన విజ్ఞానాన్ని, కాలాన్నీ పూర్తిగా వెచ్చించి మనలని బాగుచెస్తాడనుకోవడం మన భ్రమ. మన అదృష్టం కొద్దీ అనుభవజ్ఞుడూ, మంచివాడూ అయిన వైద్యుడు దొరికితే కొంత నయమే. ఎంత మంచివాడే అయినా, ఎంత నాలెజ్ వున్నవాడే అయినా మన మీద అతను కెటాయించగలిగే సమయం కొద్దిగా మాత్రమే వుంటుంది. మనమే అతనికి సర్వస్వం కాదు కదా. తన దగ్గరికి వచ్చే శతికోటి లింగాల్లో బోడిలింగాలం మనం. మనలాంటి పేషెంట్లని ఎంతోమందిని చూడాలి కదా.

అతను మనకోసం వెచ్చించే సమయంలో మన రోగ లక్షణాలు మనం సరిగ్గా చెప్పగలగాలీ, అయనకి సరిగ్గా అర్ధం చేసుకునేంత ఓపిక, సహనం, అనుభవం, విజ్ఞానం వగైరాలు వుండాలి.  అలాకాకుండా US లాంటి దేశాల్లో పదేపదే వైద్యుడి దగ్గరికి వెళ్ళేంత దృశ్యం వుండదు. అలా వెళ్ళాలంటే డబ్బుల కొసం జేబులు తడుముకోవాల్సివుంటుంది. వేలకొద్దీ భీమాలు చెల్లించడమే కాకుండా వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కో-పేమెంట్ అనే నైవేద్యం సమర్పించుకోవాల్సివుంటుంది. మాకయితే అది $25. మా ఇంట్లో నాతో పాటు నలుగురికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వెళ్ళినప్పుడల్లా ఆ దండగ తప్పదు. దానికి భయపడి నెట్టులోనో, పెద్దవారినో అడిగి ఏ వంటింటి చిట్కాలో ముందుగా వాడిచూస్తున్నాం. 

ఇహ మన సమస్యలు వైద్యుడి దగ్గరికి ఒక్కసారి వెళ్లగానే తగ్గిపోవుకదా. కొన్నింటికి పలుమార్లు వెళ్ళాల్సివుంటుంది. వెళ్ళినప్పుడల్లా ఆ దక్షిణ తప్పదు కదా. అలా ఎన్ని డబ్బులని గుల్ల చేసుకుంటాం? అందువల్ల అమెరికాలాంటి దేశాల్లో చాలామంది వైద్య పరిజ్ఞానం కోసం నెట్టు మీద ఆధారపడుతున్నారు. ఇదివరలో వైద్యులకి ఇక్కడి రోగులు ఆరోగ్య సమస్యలు చెప్పుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు మందుల చిట్టీ కోసం వైద్యుడి దగ్గరికి వెళుతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి తమకు ఏం మందులు కావాలో వెల్లడించి అందుగ్గానూ ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నారంట. నేను కూడా అంతే. ఏదయిన ఆరోగ్య సమస్య వస్తే ముందు గూగుల్లో దాని గురించి వీలయినంత పరిశోధన చేస్తున్నా. ఉదాహరణకి మా ఆవిడ ఒకటి రెండు రోజులుగా సైనసైటిసుతో బాధపడుతోంది. ఆమె సమస్య గురించి గూగుల్ చెయ్యమని చెప్పాను కానీ వినిపించుకోలేదు. తనకు తీరిక వుండాలి కదా. అవీ ఇవీ సీరియళ్ళు అలా అవస్థపడుతూనే చూస్తోంది. ఇహ లాభం లేదని ఇవాళ నేను నెట్టులో దాని గురించి వెతికి అందుగ్గానూ ఇంటి చిట్కాలు చూసి ఈమెయిల్ చేసాను. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలాంటి సమాచారాల్లో ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవసరమో, ఎప్పుడు హోం కేర్ పద్ధతులు పాటించవచ్చో వివరంగా వుంటుంది.

ఇంటర్నెట్టులో అయితే మనకు ఓపికా, తీరికా వున్నత మేరకు సమాచార సేకరణ చెయ్యొచ్చు. అందువల్ల పలు విధాలయిన సమస్యా పరిష్కారాలు, పలు పద్ధతులు, పలు చికిత్సా ధోరణులు, ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలూ మనకు అవగతం అవుతాయి. ఇవన్నీ మనతో ఇంత వివరంగా చర్చించేంత తీరిక, అవసరం వైద్యుడికి ఎందుకు వుంటుంది?  అక్కడికి వెళ్ళి మన తలకాయ ఆయన చేతిలో పెట్టాక ఆయన గారు చెప్పినట్లే విని  బుర్ర ఆడించి రావడం తప్ప వేరే మార్గం అంతగా వుండదు. మన అదృష్టం బావుండి మన సమస్య త్వరగా నయమయితే సంతోషమే. లేకపోతే అన్ని రకాలుగా నష్టపోయేది మనం గానీ ఆ డాక్టర్ కాదు కదా. అందువల్ల ఏ సమస్య గురించి అయినా సరిగ్గా రిసెర్చ్ చెసుకోవాల్సిన బాధ్యత మన మీద వుంది. ఇదివరకులా వైద్యులని పూర్తిగ నమ్మి మన ప్రాణాలను వారిచేతిలో గుడ్డిగా పెట్టేటటువంటి రోజులు కావివి. అందుకే మన బాధ్యత మేరకు తగినంత జాగ్రత్త మనమూ పడాలి మరి. ఇదివరకంటే ఈ సమాచారం అందరికీ అందుబాటులో వుండేది కాదు కాబట్టి మన డాక్టర్ చెప్పిందే మనకు దిక్కయ్యేది. అప్పుడు అలా కాదు. ఇప్పుడు రోగులు తగినంత సమాచారం సేకరించుకొని మరీ వస్తున్నారు కాబట్టి వైద్యులు కూడా వళ్ళు దగ్గరబెట్టుకొని వుంటున్నారు. 

అలా అని అన్నీ ఇంట్లో పరిష్కరించుకోలేము కానీ మన సమస్యల పట్ల మనకు అవగాహన వుంటే వైద్యుడు సరి అయిన దారిలోనే చికిత్స చేస్తున్నాడా లేకపోతే ఇంకో వైద్యుడి సలహా తీసుకోవాలా అనేది ఆలోచించవచ్చును.  ఇహ చిన్నా, పెద్దా సర్జెరీలు గట్రా ఇంట్లో చెసుకోలేము కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేలెండి. అయితే ఇలాంటి వైద్య విజ్ఞానం ఎక్కువయితే ఇంకో సమస్య వుంది. ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి వణికిపోవడం జరుగవచ్చు. అలా మనం హైపోకాండ్రియాక్స్ కాకుండా జాగ్రత్త వహించాలి. ఇంకో విషయం ఏంటంటే నెట్టులో వున్నదంతా, వ్రాసినదంతా మనం గుడ్డిగా నమ్మెయ్యకూడదు. ప్రిస్టీజియస్ సంస్థలూ, సైట్లూ వుంచిన విజ్ఞానాన్నే నమ్ముకోవాలి.

మరుసటి టపాలో ఇలా డాక్టర్ గూగుల్ సహాయంతో నేను ఎలాంటి సమస్యలని పరిష్కరించుకున్నానో చెబుతాను.

5 comments:

  1. "అయితే ఇలాంటి వైద్య విజ్ఞానం ఎక్కువయితే ఇంకో సమస్య వుంది. ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి వణికిపోవడం జరుగవచ్చు. అలా మనం హైపోకాండ్రియాక్స్ కాకుండా జాగ్రత్త వహించాలి. ఇంకో విషయం ఏంటంటే నెట్టులో వున్నదంతా, వ్రాసినదంతా మనం గుడ్డిగా నమ్మెయ్యకూడదు"

    ఇది కరెక్ట్. వైద్యం లాంటి విషయాల్లో పరిమితమయిన అవగాహన మాత్రమే మంచిది. చిన్న సమస్యకి కూడా మరీ ఎక్కువ రీసర్చ్ చేస్తే మెంటల్ టెన్షన్స్ తప్పవు. ముఖ్యంగా ఫోరంస్ లో జనాల మిడిమిడి నాలెడ్జి తో మనం టెన్షన్ పడే అవకాశం ఎక్కువ. ఇది నాకు చాలాసార్లు జరిగింది.

    ReplyDelete
  2. Annay....Nenu Kuda Google doctor meeda ekkuva adarapaduthunta..... Na kuthuru pempakam kosam chala ekkuva use chestha...like when she get cold,fever like....yeasterday i looked for the tratement for my brother.He got stones in kidney ..for this olive oil and lemeon ni mix chesi thagithe Stones will break ata...

    ReplyDelete
  3. మనం ఓ ఫ్రిడ్జ్ కోనేదానికి లక్షా తొంభై మార్లు ఆలోచిస్తాం గాని, మన శరీరం గురించి ఓ డాక్టరు ఏదో అంటే అందులో విచక్షణ ఎంత వుందో అని ఎ మాత్రం ఆలో చించం ! అంతా విష్ణుమాయ అన్న మాట

    మనతోటే వుండే శరీరం గురించి మనకు తెలియదు గాని, ఓ డాక్టరు గాడు ఓ పదినిమిషాలు అలా ఇలా తాకి ఏదో బొంకాడో, నిజం చెప్పాడో తెలీదు గాని అంతా పూర్తి గా నమ్మేస్తామ్!


    జిలేబి.

    ReplyDelete
  4. @ సిద్ధార్ధ్
    ప్రతీ దానికీ రిస్కులు వున్నట్లే దీనికి కూడా కొన్ని వుంటాయి. అవి మనం మినిమైజ్ చేసుకోవాలంతే.
    @ అజ్ఞాత
    సంతోషం :)
    @ జిలేబీ
    సినిమా హాల్లో ఓ సినిమా చూడటానికే ఎంతో ఆలోచిస్తుంటాం కానీ మన శరీరం గురించి మాత్రం పెద్దగా ఆలోచించకుండా గుడ్డిగా డాక్టర్ చేతిలో పెడతాం. ఇదివరలో అది తప్పదు కాబట్టి నడిచింది కానీ ఇప్పుడు వైద్య వేదాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి కనుక ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాల్సిందే.
    @ ?!
    :)

    ReplyDelete