పాపం ఆ కుక్క...

సూర్యాపేటలో నాకు ఓ అన్నతమ్ముళ్ళు చాలా సన్నిహిత స్నేహితులుగా వుంటుండేవారు. ఒక రోజు వాళ్ల కుటుంబం అంతా కలిసి కొంత దూరంలో వున్న ప్రాంతానికి చుట్టాలింటికో మరి ప్రదేశాలు చూడ్డానికో గుర్తుకులేదు కానీ వెళ్లనయితేవెళ్ళారు. కొద్దిరోజుల తరువాత తిరిగివచ్చారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ పెంపుడు కుక్క...పాపం...ఎముకలు మాత్రం వున్నాయి. వుండవూ మరి? దాన్ని కట్టేసి మరచిపోయి ఊరికివెళ్ళి కొన్ని రోజులయ్యాక వస్తే అలాగే అవుతుంది. పాపం ఆ జీవి ఎంత అవస్థ పడిందో కదా. ఆలనా పాలనా అటుంచి కనీసం దాని యొక్క కట్టు విప్పే నాధుడు లేకపోయే.

వారికి ఊరికి వెళ్ళాక తీరిగ్గా కుక్కని కట్టేసి మరచివచ్చిన విషయం గుర్తుకు వచ్చిందట కానీ లైట్ తీసుకున్నారు. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు. కొద్దిమందికి లాండ్ లైన్లు వుండివుండవచ్చు. అప్పట్లో మాకు అదీ లేదు. పోనీ ఎవరికయినా వున్నవారికి ఫోన్ చేసి చెప్పినా వారు ఆ ప్రాణిని రక్షించేవారు. ఏ బ్యుజీలో వున్నారో ఏమో కానీ ఆ విషయం తేలిగ్గా తీసుకున్నారు. ఆ విషయం తెలిసి మా అమ్మ బాగా క్షోభ పడింది. తగిన శాస్తి ఆ కుటుంబానికి జరుగుతుందని శపించింది. 

అది జరిగిన కొన్ని నెలలకు ఆ కుటుంబ పెద్దకి కారు గుద్దడం వల్ల మరణించాడు. ఆ తరువాత ఒకటి రెండేళ్ళకి ఆ సోదరుల్లో పెద్దవాడు మోటార్ సైకిల్ ప్రమాదంలో మరణించాడు. ఇహ తమ్ముడుకి  కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన ప్రమాదంలో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా బయటపడి ప్రస్థుతం బాగానే వున్నాడు. మా అమ్మ శాపం వర్తించింది అని అనుకునే మూఢనమ్మకాలు నాకు లేవు కానీ మా అమ్మ అలా అనడమూ, అలా ఆ ఇంట్లో ఆ చావులు వరుసగా జరగడమూ మాత్రం సంభవించాయి. 

ఈ విషయం ఈ క్రింది టపా చదివితే గుర్తుకువచ్చింది.  అది శోభ గారు వ్రాసారు.

2 comments:

  1. కుక్కలేమైనా పశువులా కట్టేయడానికి ? పాపం.. వాటి స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారు ..

    కానీ.. ఇక్కడ కుక్కలు మీదకి ఎక్కుతుంటే భయాన్ని ఆపుకొని వాటిని ముద్దు చేస్తున్నట్టు నటిస్తున్నా..

    ReplyDelete