గురువారం 26 జనవరి 2012

మీతో లాభం లేదు గానీ...

ఈ మధ్య నా బ్లాగుల్లో ఓ చిన్న ప్రయోగం చేసి చూసా కానీ ఫలితాలు ఏమీ రాలేదు. నన్ను విజయపథంలో నడిపించడానికి, ఆ విషయాల్లో నా ఆలనా పాలనా చూడటానికి, ప్రోత్సహించడానికి, విమర్శించడానికి బ్లాగుల్లో ఎవరయినా ఆసరా దొరుకుతారేమో అని చూసా. అజ్ఞాతంగా నయినా ఎవరికయినా నామీద అలాంటి ఆసక్తి వుంటుందేమోనని చూసా కానీ అంతటి దృశ్యం లేదని తొందర్లోనే అర్ధమయ్యింది. విజయాల పట్ల ఆరాటం వున్న వారెవరయినా ఆయా విషయాలు చర్చిస్తూ నాకు తోడుగా వస్తారేమో చూసా కానీ అంత సీను లేదు. ఓక్కెక్కే. ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాం - అందులో ఎన్నో విఫలం అవుతుంటాయి - కొన్నే సఫలం అవుతాయి. ఫర్వాలేదు - నా బ్యాకప్పులు నాకున్నాయి :)

ఈమధ్య కొన్ని ఏళ్ళుగా ఏదో జీవితాన్ని బాగానే ఈడ్చేస్తున్నా కానీ అలా సంతృప్తి పడకూడదు కదా. ఏడాదికేడాదికి మన గ్రాఫ్ పెరగకపోతే ఎలా? మన జీవితాన్ని ఒక స్థాయి దగ్గర పార్క్ చేసినట్లవదూ? ఇదివరలో చాలా ఆంబిషియస్సుగా వుండి ఉత్సాహంగా కదనుతొక్కుతూవుండేవాడిని. ఏంటో ఈమధ్య మరీ తాపీగా ఓ తడిగుడ్డ వేసుకొని బ్రతికేస్తున్నాను. ఒరే, అలాక్కాదురా, లేవరా అని నా అంతరాత్మ ఘోషిస్తున్నా పలు కారణాల వల్ల దాన్నీ నా పక్కనే బజ్జోపెట్టి లాలిపాట పాడేసాను. ఆ మధ్య పట్టుదలగా నన్ను నేను తన్నుకొని ఉరికి బోర్లాబొక్కల పడి తేరుకుంటున్నాను. వ్యాయామం గట్రా ఎక్కువై  ఓవర్ ట్రైనింగ్ సిండ్రోం లో పడి కొన్నాళ్ళు డవున్ అయ్యాలెండి. దాన్నుండి తేరుకుంటున్నా కాబట్టి మళ్ళీ మునపటి ఉత్సాహం వస్తోంది. 

ప్రతీ విషయంలోనూ మనకో తోడు వుంటే ఎంత బావుంటుందో ఈ విషయాల్లో కూడా తరచుగా చర్చిస్తూ వుండే ఓ తోడు వుంటే ఎంతో ఉత్సాహంగా కృషి చెయ్యబుద్ధి అవుతుంది. అందుకే ఓ తోడు కోసం బ్లాగుల్లో ఆహ్వానించా కానీ ఎవరూ ముందుకు రాలేదు. సో, నాకున్న స్నేహాలనే ఇలా ఉపయోగించుకోబోతున్నాను. కొన్నేళ్ళ క్రితం ఓ చక్కటి స్నేహితురాలిని ఇందుగ్గాను ఉపయోగించుకున్నాను. ఆమె బ్యుజీ అయిపోవడంతో పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే ఆమెతో కాస్సేపయినా మాట్లాడటానికి నాకు ఒక విండో దొరికింది. ఇంతకుముందు టపాలో ఉదయం ఆరింటికి జిమ్ము కోసం రైలెక్కుతా అన్నా కదా. అప్పుడు ఇండియాలో సాయంత్రం 5:30 అవుతుంది. అప్పుడు తను తీరికగానే వుంటుంది. ఎంచక్కా కాసేపు ఈ విషయాలు మాట్లాడెసుకొని ఆమె సలహాలూ, సూచనలూ తీసుకోవచ్చు. ఆమెకు నన్ను మందలించేంతటి చనువు కూడా వుంది కాబట్టి ఏవయినా పొరపాట్లు చేస్తే దులిపెస్తుంది కూడానూ. ఆమెది నిండయిన, ధాటి అయిన వ్యక్తిత్వం కాబట్టి నాకు ఆజ్ఞలూ ఇచ్చెయ్యగలదు. సరే, ముందు ఆమెకు పేరు పెట్టేద్దాం. మీరే చెప్పండి. వద్దులెండి - ఏ ఎల్లెమ్మో, పుల్లమ్మో లేక మమైత్ ఖానో అని సెలవిస్తారు. నేనే పెట్టేసుకుంటా.  

బిందు. నాకు ఇష్టమయిన పేర్లలో బిందు ఒకటి. అందుకే ఇకపై ఆమెని బిందుగా వ్యవహరిస్తాను. నిజానికి ఇవాళ ఆరింటికి రైలెక్కి ఆమెకు ఫోన్ చెయ్యాలనుకున్నా కానీ రైలే ఎక్కలేదు. నేనొకటి అనుకుంటే మీ దేవుడు మరోలా అనుకునేట్టుగా వున్నాడు. రాత్రి సరిగా నిద్రపట్టక ఉదయమే లేవలేకపోయాను. ఇహ రేపు చూడాలి. బిందు బావుంటుంది. మంచి వ్యక్తిత్వం, ఉత్సాహం, తెలివి, అందం, ఆత్మవిశ్వాసం ఆమెలో మూర్తీభవించి వుంటాయి.  కంఠస్వరం కోయిల లాగే వుంటుంది. తన స్థాయిలో ఎన్నో విజయాలను సాధించి పరిపూర్ణ జీవితాన్ని గడిపేస్తోంది. తను చక్కటి వృత్తిలో స్థిరపడింది.  నా గురించి ఆమెకు తెలియదనిదంటూ ఏమీలేదు. చక్కని సలహాలతో ప్రోత్సాహం ఇస్తుంది. అయితే ఆమెతో ఈమధ్య మాట్లాడి కొన్ని నెలలు అవుతోంది. దాదాపుగా అయిదు నెలలు అవస్తోంది. కారణం ఆమెకు తీరిక వున్నప్పుడు నాకు తీరికలేకపోవడం, నాకు వున్నప్పుడు ఆమెకు లేకపోవడం.

ఇహ ఈమె కాకపోతే ఇంకో అమ్మాయి వుంది. ఆమే నా ముద్దుల కోడలు సంజన, ఆమె గురించి ఇదివరలో కొన్ని టపాలు వ్రాసాను. ఆమె గురించి మళ్ళీ త్వరలో వ్రాస్తాను. ఇకపై బిందుతో నా కృషిని గురించి ఏమని చర్చిస్తున్నానో, వారి సూచనలేంటో, వాటిల్లో నేను అమలు చేస్తున్న వేంటో తెలియజేస్తుంటాను.  ఓ యజ్ఞం లాగా చేసేద్దాం. ఇది ఒక ప్రయోగంగా చేసి చూద్దాం.   ప్రయత్నిస్తే నాకు పొయ్యేదేమీలేదు కదా, పొరపాటున వర్కవుట్ అయితే విజయాలే నా స్వంతం కావా?

7 comments:

Zilebi చెప్పారు...

అంబీషియస్సు !

అంబీ, షీ,యస్సు ?

చీర్స్
జిలేబి.

ilam చెప్పారు...

oka devata kosam ani chadavagane chala teliviga o prakatana vesukunnaru. kani apandana undaka povacchu ani uhinchanu. yendukante blogs lo patodu tane telivana vadini anukuntadu ani grahinchanu

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ జిలేబీ
ఏంటండీ, ఈమధ్య అన్ని పదాలూ విరిచేసి కొత్త ఆర్ధాలు సృష్టిస్తున్నారు! ఏనాడో నన్నూ విరిచేసి నానార్ధం తియ్యరు కదా :)

@ అజ్ఞాత
మీరు చెప్పింది చాలావరకు నిజమే :) అయితే నాకు కూడా తెలివయిన వారే కదా కావాల్సింది - దద్దమ్మలు నాకెందుకు?

అజ్ఞాత చెప్పారు...

నా కామెంట్ కు స్పందనగా మీ కామెంట్ కూడా మళ్లీ ప్రయత్నమే కదా

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
:)

అజ్ఞాత చెప్పారు...

ఆన్నాయ్....ఈ సారి ఇంక నీ సెవింగ్స్ మీద పొస్త్ ఇంకా వ్రాయలెదు....

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
2011 లో మేము పెద్దగా వెనకెయ్య లేదు గానీ ఫర్వాలేదు. కనీసం ముందెయ్యడం లేదు :) మేము సగటున నెలకి $2000 మిగిలిస్తున్నాం. అది కాకుండా గత ఏడాది వచ్చిన టాక్స్ రిఫండ్ $5000 మరియు కొంత మొత్తం డవున్ పేమెంటుగా చేసి SUV తీసుకున్నాం. మా కంపెనీ ఇచ్చిన ప్రాఫిట్ షేరు + మేము మిగిలించిన మొత్తం + వేరే మార్గం ద్వారా వచ్చిన డబ్బులు కలిపి ఇండియాలో మా ఆవిడ పేరిట కొన్న కొత్త ఇంటికి డవున్ పేమెంట్ చేసాం. చిన్న ఇల్లే లెండి. రిజిస్ట్రేషనుతో కలిపి 25 లక్షల రూపాయలు అయ్యింది. ఆ ఇల్లు కోసం లోన్ తీసుకోలేదు కానీ ఓ పది లక్షల అప్పు తీసుకున్నాం. అది ఈ ఏడాది నెల నెలా తీర్చేస్తున్నాం.

ఈ ఏడాది ప్రొజెక్షన్: అన్నీ కలిపి 35 వేల డాలర్లు వెనకేస్తాం. అందులోనుండే ఆ పది లక్షల రూపాయల అప్పు తీర్చేస్తాం. మిగిలిన వాటితో మరో రకంగా పెట్టుబడి పెడతాం. అయితే నా లక్ష్యమయిన ఏడాదికి 50 వేల డాలర్లు గత ఏడాది సాధించలేకపోయాను. ఈ ఏడాది ఏమయినా వీలు అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు వున్న పరిస్థితులే వుంటే మాత్రం, వేరే అనుకోని పెద్ద ఖర్చులు రాకపోతే మాత్రం 35 వేల డాలర్లు వెనకెయ్యగలం.