... అక్కడ ఆడవాళ్ళలా ఆ ఎత్తేంటి అంది అమ్మలు నిన్న సాయంత్రం నా ఛాతి చూపిస్తూ. అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చాను. నిన్న కొత్తది కాలర్లెస్ టీషర్ట్ వేసుకున్నాను. కాలర్లెస్ టీషర్టుల్లో నేను కాస్త యంగుగా కనపడతాను. అందరికీ అలాగే వుంటుందా అన్నది నాకు తెలియదు. ఆ షర్ట్ నాకు బాగా నప్పింది అని అనుకుంటూనే వున్నాను. ఈమధ్య జిమ్ముకి వెళుతూ బరువులు ఎత్తుతున్నాను కదా ఛాతి పొంగుకు వస్తోంది. అటు పక్క ఆహార నియంత్రణ సమర్ధవంతంగా చేసుకువస్తున్నాను కదా - పొట్టలోపలికి వెళుతోంది. దానిమీద కైరోప్రాక్టిక్ చికిత్స తీసుకుంటూ ఆ వైద్యుడి సలహాలు పాటిస్తున్నాను కదా తల పైకిఎత్తి వుంచుతున్నాను. అందువల్ల ఠీవిగా, దర్జాగా, ఉత్సాహంగా ఇంట్లో నేను తిరిగాడుతుంటే అమ్మలు ఆశ్చర్యపోయి అలా అనేసింది.
నేను హాయిగా నవ్వేసి అలక్కాదు అని అలా మగవారికి ఛాతి పొంగుకు రావడం అన్నది మంచి విషయమనీ అలా ఎందువల్ల ఛాతి పెరిగిందో వివరించాను. అయ్బాబోయ్ ఓ రెండు వారాలు పని దినాల్లో మాత్రమే అత్తర బుత్తర వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తేనే ఇలా వుంటే ఇంకా కాస్త ఎక్కువ చేస్తే నా ఛాతికి పట్టపగ్గాలుంటాయంటారా :)) మధ్యాహ్న భోజన సమయంలో సరిగ్గ సమయం లేక అరగంట మాత్రమే బరువులు ఎత్తగలుతున్నాను. దానికి ముందు ఓ పది నిమిషాలు వార్మప్ కోసమని ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తాను. రోజూ ఆఫీసు విడిచాక కూడా వ్యాయామం చెయ్యాలనుకున్నాను కానీ కైరోప్రాక్టిక్ చికిత్స కూడా మొదలెట్టెయ్యడంతో సాయంత్రాలు అటు వెళ్ళాల్సి వస్తోంది. వీలయితే ఉదయమే ఆఫీసుకి వెళ్ళే ముందే ఓ రవుండ్ వ్యాయామం చేసి వెళితే బావుంటుంది కానీ అసలు ఆఫీసుకే ఉరుకులు పరుగుల మీద వెళుతుంటాను. ఇంకా ఉదయం వ్యాయామమా! ఇవాళయితే అసలే ఆలస్యం అయిపోయి ఉదయం స్నానం, గెడ్డం కూడా చెయ్యకుండా లగెత్తుకువచ్చాను. శుక్రవారమేగా తీరిగ్గా స్నానాలు సాయంత్రం చెయ్యొచ్చులెండీ.
ఉదయమే సరిగ్గా లేవాలంటే పెందలకడనే పడుకోవాలి. పెద్దలు చెప్పినట్టుగా రాత్రి ఏడుగంటల వరకల్లా రాత్రి భోజనం ముగిస్తున్నా కానీ పెందరకడనే పడుకోవడం ఇంకా ప్రయత్నించడం లేదు. పనిరోజుల్లో పడుకునేసరికి కనీసం పది పదిన్నర అయినా అవుతుంది. తొమ్మిది గంటల వరకల్లా పడుకుంటే ఉదయం అయిదుగంటల వరకల్లా లేవచ్చు. అప్పుడు ఉదయం వ్యాయామం కోసం ఓ నలభయి నిమిషాల సమయమన్నా సరిగ్గా దొరుకుతుంది. చూస్తున్నా, చూస్తున్నా. ఈ మధ్య నాలో ఇంకాస్త ఉత్సాహం, పట్టుదల పెరిగాయి కాబట్టి నేను అనుకుంటున్నది అసాధ్యం కాకపోవచ్చు. వచ్చేవారం నుండే ఇది అమల్లో పెట్టేదా?
ఇంకా కొన్ని వారాల్లో మా ఇంట్లో ఒక వేడుక వుంది. మా స్నికి స్వీట్ సిక్స్‌టీన్ చేస్తున్నాం. ఓ ముగ్గురు బ్లాగ్మిత్రులని (బ్లాగాభిమానులతో కలిపి) కూడా పిలిచేం. ఆలోగా కొద్దిగానయినా కాస్త మంచి షేపుకి రాగలిగితే చూచువారలకు చూడముచ్చటగా వుంటుంది కాదూ? అంత దృశ్యం లేకపోయినా అలా అనుకుంటేనన్నా వళ్ళు వంచడానికి కాస్త ఉత్సాహం వస్తుంది. మా ఆవిడెలాగూ కాస్త బానే వుంటుంది. ఆమె పక్కన నిలబడ్డప్పుడు నేను కాస్తయినా ఆనాలి కదా. (అలా అనుకుంటేనన్నా నాకు రోషం వస్తుందనీ... పెందరకడనే లేచి పెరుగెత్తుకొని జిమ్ముకి వెళ్ళి కిందా మీదా పడతాననీనూ...)























