"అవును నాకూ వినపడుతోంది" చేతిలో వున్న గ్లాసును బల్లమీద పెట్టి ఠక్కున నిలబడ్డాడు శంకరం.
కంగారుగా కుమార్ కూడా లేచి "ఎక్కడినుండి వస్తున్నాయి ఆ అరుపులు?" అని ఆదుర్దాగా అడిగాడు.
చంద్రారెడ్డి ఒక్కడే నిర్లక్ష్యంగా కొద్దిగా తూలుతూ అలాగే కూర్చున్నాడు. "మీరంతా భ్రమపడుతున్నారు భాయ్ సాబ్. మీకు మందు ఎక్కువయినట్లుంది" అని గిరిని లాగి కూర్చోబెట్టబోయాడు.
మిగతావారెవ్వరూ అతడిని పట్టించుకోలేదు. అతడి చేతిని గిరి నెమ్మదిగా విడిపించుకున్నాడు.
శంకరం చెవులు మరింత రిక్కిస్తూ మేడ మీదినుండి వినపడుతున్నాయనుకుంటా అన్నాడు
"మేడ మీది నుండా? ఇంట్లో ఎవరూ లేరు కదా. కుసుమ కూడా ఊరెళ్ళింది" అని అన్నాడు గిరి.
"ఎందుకయినా మంచిది ఒకసారి చూసొద్దాం పదండి. లీలగా ఆ అరుపులు ఇంకా వినపడుతున్నాయి. లేకపోతే పక్కింటిలోంచి అరుపులు ఈ ఇంట్లోంచి వస్తున్నట్లుగా అనిపిస్తున్నాయేమో" అన్నాడి గిరి తన చేతులను హడావిడిగా నాప్‌కిన్‌తో తుడుచుకుంటూ. మిగతా ఇద్దరూ చేతులు కూడా చేతులు శుభ్రపరచుకున్నారు. చంద్రా రెడ్డి మాత్రం విలాసంగా ప్లేటులోంచి మరో చికెన్ ముక్కను అందుకున్నాడు.
"ఎందుకయినా మంచిది. ముందయితే వెళ్ళి పైన చూసొద్దాం" అన్నాడు శంకరం కంగారుగా. కుమార్ మేడ మీదికి దారితీసాడు ఆదుర్దాగా. గిరి తటపటాయిస్తూనే అతడిని అనుసరించాడు. వెళితే ఏం చూడాల్సొస్తుందో అని బిక్కుబిక్కుమంటూ శంకరం గిరిని అనుసరించాడు. అయిదు గదుల ఇల్లు అది. అన్ని గదులూ, క్లోజెట్లూ వెతికారు. ఏమీ అనుమానాస్పదంగా అనిపించలేదు.
"మా ఇంట్లో మనం తప్ప ఎవరూ లేరు కదా. పక్కింట్లో నుండి అయివుండవచ్చు" అని కిటికీ లోనుండి బయటకి చూసాడు గిరి. మంచు విపరీతంగా పడుతోంది. బయట అంతా మసకగా వుంది. "బయట ఏ ఇల్లు అని వెతుకుదాం? పోనీ 911 కి ఫోన్ చేద్దామా?"
"ఎక్కడ నుండి వినపడుతున్నాయి శబ్దాలు అని వాళ్ళు అడిగితే ఏం చెబుతాం? తాగి ఫోన్ చేస్తున్నామని అనుకుంటారేమో వాళ్ళు!" అన్నాడు కుమార్.
"రెడ్డి గారు అన్నట్లు ఒకవేళ మనకు మందు ఎక్కువయ్యి అలా అరుపులు వినపడుతున్నాయంటారా?" అనుమానంగా అడిగాడు శంకరం
"నాకు అంతగా ఎక్కలేదు" అన్నాడు గిరి తల విదుల్చుతూ.
కుమార్ కూడా తల అడ్డంగా ఊపుతూ "నాకూ ఎక్కలేదు. నేను ఎక్కువగా మందు కొట్టేవాడిని కాదు కదా. ఇప్పటిదాకా రెండు పెగ్గులే వేసుకున్నాను" అన్నాడు.
"నా అనుమానం ఏంటంటే ఈ ఇంట్లొంచే ఎక్కడినుండో ఆ గొంతు వినపడుతోంది" అన్నాడు శంకరం మరింతంగా చెవులు రిక్కిస్తూ
గిరి అతని వైపు నిరసనగా చూసాడు.
"శంకరం అన్నది నిజమే అనిపిస్తోంది. మీ బేస్‌మెంటులోంచి వస్తున్నట్లున్నయి ఈ శబ్దాలు" గిరిని చూస్తూ కంగారుగా అన్నాడు కుమార్.
"మా ఇంటి బేసుమెంటులోంచా! ఛ. ఆ ఆవకాశమేలేదు" అని వారి మాటలని కొట్టేసాడు గిరి.
"లేదు. అక్కడినుండేవస్తున్నాయి" నమ్మకంగా అన్నాడు శంకరం
"మా బేస్మెంటు అసలు మేము వాడమే వాడము. అక్కడినుండి ఎందుకు వస్తాయీ. చూడబోతే మీకు మందు ఎక్కువయినట్లుంది కానీ కిందికి వెళదాం పదండి. చంద్రారెడ్డి ఒక్కడే క్రింద వున్నాడు" అని కిందకి తొంగిచూస్తూ కిందికి దారితీసాడు రెడ్డి.
ఒక చేతిలో మందు గ్లాసు, మరో చేతిలో చికెన్ ముక్కా పట్టుకొని "ఒరే అందరూ ఎక్కడికి వెళ్ళార్రా" అని గొనుగుతున్నాడు రెడ్డి.
కుమార్, శంకరం కూడా త్వరత్వరగా గిరిని అనుసరిస్తూ క్రిందికి దిగారు. క్రిందికి వచ్చాక "ఎందుకయినా మంచిది, ఒకసారి మీ బేస్మెంటు తలుపులు తెరవండి. ఒకసరి చూసొద్దాం. అనుమానం తీరుతుంది" అని అభ్యర్ధించాడు కుమార్.
"పక్కింటోడు ఏదయినా హర్రర్ సినిమా పెద్ద సవుండుతో పెట్టివుంటాడు కానీ మీరు మందు కొట్టండిరా బాబూ" అని గొణిగాడు రెడ్డి.
"అవునండీ. ఓ సారి మీ బేసుమెంటులోకి వెళ్ళొద్దాం" అని శంకరం కూడా కుమారుని బలపరుస్తూ గిరిని అడిగాడు.
"నా బేస్మెంటు ఎవరికీ చూపించడం నాకు ఇష్టం వుండదండీ" అని నిష్కర్షంగా చెప్పాడు గిరి.
కుమార్, శంకరం ముఖాలు చూసుకున్నారు. కుమారే ముందు తేరుకున్నాడు. "ఆల్రైట్, 911 కి ఫోన్ చెసి విషయం చెబుతాను. మిగతాది వాళ్ళే చూసుకుంటారు. మన మధ్యలో ఎందుకు గొడవ" సెల్ ఫోన్ జేబులోంచి బయటకి తీస్తూ చెప్పాడు.
"సరే లెండి. ఇప్పుడే పోలీసులు ఎందుకు. మా బేస్మెంటులోకి వెళదాం కానీ అక్కడ మీకు కనిపించేవి వేరే ఎవ్వరికీ చెప్పమని హామీ ఇవ్వాలి మీరు"
"బేసుమెంటులో ఏమయినా ఇల్లీగల్ పనులు ఏమయినా చేస్తున్నారా కొంపదీసి?" అనుమానంగా అడిగాడు శంకరం
"అహ అలాంటివేమీ కాదు గానీ..." అని నసిగాడు గిరి. "మీరే చూస్తారుగా...పదండి"
ఆగి ఆగి లీలగా ఇంకా హెల్ప్ హెల్ప్ అని వినపడుతూనేవుంది. త్వరత్వరగా గిరిని అనుసరించారు ఇద్దరూనూ. లోపటికి వెళుతుంటే రకరకాల బంధనాలు, హింసించే పరికరాలు గోడకు వేలాడదీసి కనపడటంతో కుమార్, శంకరం విస్మయంగా ముఖాలు చూసుకున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మనిషిని నిలువుగా బంధించే ఏర్పాటు కూడా చూసారు వాళ్ళు. ఇవన్నీ ఎందుకు? నాలుక తడారి లోపలికి పీక్కుపోతుండంగా అడిగాడు శంకరం.
ఈ సెట్టింగ్ అంతా చూస్తుంటే గిరి ఇక్కడ ఏ అమ్మాయినో బంధించినట్లే వుంది అని అనుమానంగా, జాగ్రాత్తగా బేస్మెంటు పరిశీలిస్తూ వెళ్ళాడు కుమార్. ఎందుకయినా మంచిది అని గిరిని ఓరకంట కనిపెట్టసాగాడు.
శంకరం ప్రశ్నకి గిరి బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వు శంకరానికి వికటాట్టహాసంలాగా అనిపించడంతో అక్కడే భయంతో ఆగిపోయాడు. "మనుషులని హింసించి ఆనందించే పరికరాలు ఇవి" అని గిరి అనడంతో ఆందోళనతో అక్కడే వున్న కుర్చీలో కూలబడ్డాడు శంకరం.
ఈలోగా బేస్మెంటు అంతా నఖశిఖ పర్యంతం చూసివచ్చాడు కుమార్. "ఎవరూ కనిపించలేదు. ఆ ఆర్తనాదాలు కూడా ఆగిపోయాయి కానీ ఇదంతా ఏమిటి?" అనుమానంగా నిశితంగా ప్రశ్నించాడు కుమార్
కుమార్ అలా తీవ్రంగా అడిగేసరికి గిరి కాస్త సిగ్గుపడ్డాడు. నసుగుతూ చెప్పాడు "మీకు బిడిఎసెం అంటే తెలిసేవుండవచ్చు. అదంటే నాకు చాలా ఆసక్తి. కుసుమకి కూడా అది అంటించాను. ఆమెకూ అది నచ్చింది. అప్పుడప్పుడూ మేము అలా ఇందులో ఆనందిస్తుంటాము. కుసుమకి కూడా టార్చర్ అంటే బాగా ఇష్టం. అందుకే ఈ ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ విషయం వేరే ఎవరికీ చెప్పకండి. ప్లీజ్"
"ఓ. అదా సంగతీ. మరింకెందుకో అని ఖంగారు పడ్డాను" అని రెలీఫుగా చిరునవ్వు నవ్వాడు కుమార్
"బి డి ఎస్ ఎం అంటే ఏమిటి?" అని అనుమానగా అడిగాడు శంకరం.
కుమార్ సన్నగా నవ్వుతూ "ఇంటికి వెళ్ళాక గూగుల్ చేసి చూడు అర్ధం అవుతుంది" అన్నాడు
శంకరం తన ఆసక్తిని అదుముకుంటూ "అది సరే కానీ ఇంతకీ ఆ అరుపుల సంగతేంటీ? మనం బేసుమెంటులోకి రాగానే ఆ శబ్దాలు ఆగిపోయాయి!" అన్నాడు ఆదోళనగా
"ఇక్కడికి ఆ శబ్దాలు రాలేకపోతున్నాయేమో. పదండి, పైకి వెళ్ళి చూద్దాం" అన్నాడు కుమార్. అందరూ పరుగున పైకి వెళ్ళారు. రెడ్డి సొఫాలో కునికిపాట్లు పడుతూవున్నాడు. "ఇక్కడ కూడా ఆ అరుపులు ఏమీ వినపడటం లేదే" అన్నాడు గిరి.
ఆ మాట విని కునికిపాటులోంచి లేచి " పక్కింట్లో ఆ హర్రర్ సినిమా అయిపోయిందేమోలే" అని అరిచాడు రెడ్డి.
అతని అరుపుకి మిగతావారందరికీ నవ్వు వచ్చింది.
"అంతేనంటారా?" సంశయంతో అడిగాడు శంకరం.
కుమార్ సాలోచనగా "ఏమో మరి. ఆ ఆర్తనాదాలు ఇప్పుడు వినిపించడం లేదు. అలాంటప్పుడు ఇంకా ఏమని, ఎలా శోధించగలం? రెడ్డి చెప్పిందే నిజమని సరిపెట్టుకోవాల్సివుంటుంది మనం" అన్నాడు
"ఏం సినిమానో ఏమో కానీ మీరిద్దరూ కలిసి నన్ను కంగారు పెట్టి బేసుమెంటు చూపించేదాకా వదల్లేదు కదా నన్నూ" అని నవ్వాడు గిరి.
"ఇంతకీ బేసుమెంటులో ఏం వుందేంటి? ఎవో మీ ముచ్చట్లు లైటుగా వినపడ్డాయి" సోఫాలో చేరగిలబడే అరమోడ్పు కళ్ళతో అడిగాడు రెడ్డి
శంకరం ఏదో చెప్పబోతుండగా అతడిని కళ్ళతో వారించాడు కుమార్. "బేసుమెంటులో రెండు గదులు వేస్తున్నాడు గిరి. వాటి డిజైన్ గురించి మాట్లాడుకున్నాం"
"ఓ అదా సంగతి. తొందరగా ఆ రూములు ఫినిష్ చేసి అందులో బార్ పెట్టు గిరీ. వచ్చెసారి అందులోనే సిట్టింగు ఏద్దాం. కుసుమ ఇంట్లో వున్నా మనం ఫ్రీగా ముచ్చట్లు చెప్పుకోవచ్చు అప్పుడు" అని సలహా ఇచ్చాడు రెడ్డి
గిరి ఇబ్బందిగా నవ్వి" అవునవును. అందుకే వేస్తున్నా ఆ రూములు" అని చెప్పాడు.
"అది సరే గానీ ఇంతకూ మన కథ ఏమయ్యింది సారూ?" అని కథని గుర్తుకు తెచ్చాడు రెడ్డి.
"అవును కదా ఈ కంగారులో పడి కథ సంగతే మరచిపోయాం. చెప్పండి, చెప్పండి" ఉత్సాహంగా అన్నాడు శంకరం
"అవును కదా. మాంఛి సస్పెన్స్, థ్రిల్లు వున్న కథ చెబుతానన్నావు కదా. చెప్పు మరీ"
కుమార్ సన్నగా నవ్వాడు. "నేను కథ చెప్పను" అన్నాడు
అందరూ అతడికెసి విస్మయంగా చూసారు.
అప్పుడు అతగాడు మళ్ళీ నవ్వుతూ "కథ చెప్పడం ఏమి ఖర్మ. ఇప్పుడే మీకు సినిమా కూడా చూపించేసాను కదా" అన్నాడు
"అంటే?" అనుమానంగా అడిగాడు రెడ్డి
"అర్ధం కాలేదు" అన్నాడు శంకరం
ప్రశ్నార్ధకం ఫేసు పెట్టాడు గిరి.
కుమార్ హాయిగా ఓ నవ్వు నవ్వి "ఇంతకుముందు వినిపించిన ఆ ఆర్తనాదాలు నేను చేసినవే" అని చెప్పాడు.
"మీరు చేసారా? ఎలా?" అడిగాడు శంకరం ఆసక్తిగా ముందుకు వంగుతూ
మిగతా వారూ కుమార్ ఏం చెబుతాడా అని వినడానికి ముందుకు జరిగారు .
"నేను ఇదివరలో మిమిక్రీ చేసేవాడినని మీలో కొందమందికి తెలుసు కదా"
అవును అని తల ఊపాడు గిరి
"కానీ అలా దూరం నుండి ఎవరో అరుస్తున్నట్లుగా ఎలా అనగలిగారు?" అడిగాడు శంకరం
"నాకు వెంట్రిలాక్విజం కూడా వచ్చు"
అతని భుజం మీద ఒక చరుపు గట్టిగా చరచి అభినందిస్తూ "మొత్తానికి భలే మజాక్ చేసారు సార్. గొప్పోళ్ళే. మీరు రచనలేమిటి సార్. మీరు డైరెక్టర్ కావాలీ" అన్నాడు గిరి.
"ఇదంతా మీ నాటకమా. మొత్తానికి నాకు రిలీఫుగా వుందండీ. ఇంతకుముందుదాకా ఎవరయినా ఆపదలో వున్నరేమో రక్షించలేకపొతున్నమేమో అని గిల్టీగా ఫీల్ వుతూ వస్తున్నాను" గలగలా నవ్వుతూ శంకరం అన్నాడు.
గిరి మళ్ళీ మందు అందరి గ్లాసుల్లోకి వంపుతూ "అందరికంటే ఎక్కువ ఫూల్ అయ్యింది నేనే. నువ్వు అసాధ్యుడివిరా. అలా చెయ్యొచ్చని తెలిసి కూడా నేను అలా ఊహించలేకపోయాను" అన్నాడు.
అందరూ గ్లాసులెత్తి నెమ్మదిగా డ్రింక్ సిప్ చెయ్యసాగారు. శంకరం ఈసారి చికెన్ ముట్టుకోకుండా సాల్సా సాసులో చిప్స్ ముంచుకొని నోట్లోకి తీసుకున్నాడు.
అప్పుడు వినపడింది గట్టిగా ఒక శబ్దం. "కెవ్వు" మని ఎవరిదో ఒక స్త్రీ అరుపు అలలు అలలుగా వినిపించి నెమ్మదిగా అంతర్ధానం అయ్యింది. అందరూ అదిరిపడి నలుదిక్కులా చూసారు. ఎక్కడినుండి వినపడిందో అర్ధం కాలేదు. శంకరం అదిరిపడి గ్లాసు కార్పెటు మీద జారవిడిచాడు. భయంగా, అనుమానంగా ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నాక అందరి కళ్ళూ కుమార్ మీదనే నిలిచాయి. కుమార్ కంగారుగా నేను కాదు అన్నట్లుగా తల ఊపాడు. దాంతో ఆ ఆర్తనాదం ఎక్కడినుండి వినపడిందా అని అందరి రోమాలూ నిక్కబొడుచుకున్నాయి. శంకరం అయితే బిక్కచచ్చిపోయాడు. గిరికి తను నోట్లో పెట్టుకున్న చికెన్ ముక్క గొంతులో అడ్డం పడినట్లనిపించింది.
రెడ్డి గ్లాసు పట్టుకొని శిలాప్రతిమలా ఆగిపొయి "ఇది మాత్రం సినిమా సవుండ్ కాదు" అన్నాడు.
అంతలోకే కుమారుకి రెండు అనుమానాలు వచ్చి సందేహంగా, సాలోచనగా గిరి వైపు చూసాడు. అప్పట్లో గిరీ తాను ఇద్దరూ కలిసే మిమిక్రీ, వెంట్రిలాక్విజం షోలు ఇస్తుండేవారు. ఇది గిరి చేసిన సరదా పనా లేక బేసుమెంటులో ఏమయినా మరో బేసుమెంటు వుందా?!
(ఇంకా వుంది)