మీ పర్స్ ఎక్కడ పెట్టుకున్నారు?

వార్షిక ఆరోగ్య పరీక్షల కోసమని నిన్న మా కుటుంబ వైద్యుని దగ్గరికి వెళ్ళాను. పలు రకాల ప్రశ్నలు వేస్తూ మీ వాలెట్ ఎక్కడ వుంది? అని అడిగాడు. నా వాలెట్ గురించి అతనికి ఆసక్తి ఏంటా అని ఆశ్చర్యపోయి ప్యాంట్ వెనుక జేబులో వుంది అని చెప్పాను. అలా పర్స్ వెనక జేబులో పెట్టుకుంటే తుంటి ఎముక అమరికల్లో మార్పులు వచ్చే అవకాశం వుంది అని చెబుతూ ప్యాంట్ ముందు జేబులో పెట్టుకోవాల్సిందిగా సూచించాడు. అలా వెనక జేబులో పెట్టుకుంటే కలిగే ఒత్తిడి ద్వారా వచ్చే అనర్ధాలు వివరించాడు.

నేను ఇండియాలో వున్నప్పుడు హాయిగా ఎంచక్కా అన్నీ చొక్కా జేబులో దూర్చేసేవాడిని. ఏదికావాలంటే అది ఠకీ మని షర్ట్ జేబులోంచి తీసే అవకాశం వుండేది. ఇప్పుడేమో ఏది కావాలన్నా వాలెట్ తెరచి మరీ తీసుకోవల్సివస్తోంది. ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకున్న పర్స్ వల్ల ఇబ్బందితో కొద్దిరోజులు పర్స్ చొక్కా జేబులో పెట్టుకుని తిరిగాను కానీ అదీ సౌకర్యంగా అనిపించక మళ్ళీ ప్యాంట్ వెనక్కు వెళ్ళాను. ఎందుకో గానీ మా డాక్టర్ చెప్పేంతవరకూ ప్యాంట్ ముందు జేబులో కూడా పర్స్ పెట్టుకోవచ్చు అన్న ఆలోచన రాలేదు.

ఒకసారి నా వాలెట్ చూసి జార్జ్ కొస్టాంజా వాలెట్ లాగా వుందే అన్నాడు మా పాత కొలీగ్ సరదాగా. సేన్‌ఫీల్డ్ సీరియల్ చూసేవారికి జార్జ్ కొస్టాంజా తెలిసేవుంటుంది. అతగాడి పర్సులో ఎన్నో కూర్చేస్తుంటాడు. అందులో ఏదయినా అవసరం పడ్డప్పుడు అందులో వెతుక్కోలేక అవస్థపడుతుంటాడు. చిత్రంలో వున్నది అతడూ, అతగాడి పర్సూనూ. చాలా సరదా మనిషి లెండి. ఒకసారి ఓ యువతి పిజ్జా పూర్తిగా తినలేక డస్టుబిన్నులో పడేస్తే ఎవరూ చూడట్లేదు కదా అని అది లాగిస్తుంటాడు. అంతలోకే ఆయువతి ఎందుకో అటువైపు వచ్చి ఆ దృశ్యం చూడనే చూస్తుంది.  సేన్‌ఫీల్డ్ చూడకపోతే తప్పకచూడండి. చాలా ప్రజాదరణ పొందిన సరదా సీరియల్ అది. ఆ షో ఎందుగురించీ అంటే ఏం చెప్పలేం. ఎ షో ఎబవుట్ నథింగ్

మరి మీ పర్స్ ఎక్కడ పెట్టుకుంటారేంటీ? 

4 comments:

 1. .. కారులో కూచోటానికి ఇబ్బందిగా ఉంటదని.. నేను ఎప్పుడో పాంట్ ముందు పక్క జేబులోకి పర్సూ, సెల్ ఫోను రేడియేషన్ వలన తోకచుక్కలు నశిస్తాయని షర్ట్ జేబులో పెట్టుకుని తిరుగుతాను.. నేను.. ఈ మాత్రం దానికి డాక్టర్ చెప్పాలా?

  ReplyDelete
 2. 1) మీది సిజ్లీకాలంలా ఉండేది కాస్తా ఆత్మలు, సాక్షాత్కారాలు అంటూ సీరియస్సైపోయిందీమధ్య :)
  2) నాకైతే పర్సుబుధ్ధిగా బ్యాకుప్యాకులో ఉండటం ఇస్టం. ఎంచక్కా అందులోనే సెల్లుఫోనులూ, ఇంకా చెత్తచెదారమూ పడేస్తుంటాను.
  3) "తోకచుక్కలు" సూపరు.

  ReplyDelete
 3. నా పర్సు మా యావిడ హాండ్ బాగ్ లో నుండును. నాకే ప్రాబ్లం లేదే..... దహా

  ReplyDelete
 4. @ సింహం
  మర్రదే. మీ బుర్రకీ నా బుర్రకీ తేడా వుందని మీకు తెలీదూ. మీ బుర్రలో పాదరసం కదలాడుతూ వుంటుంది - నా బుర్రలోనేమో తోకచుక్కలు కదలాడుతుంటాయి!
  @ మినెర్వా
  దాందేముందీ. 1. మళ్ళీ స్లీజీ కాలంగా నా బ్లాగుని అభివృద్ది చేద్దాం. 2. మీ బ్యాక్ ప్యాక్ ఎప్పుడూ మీ బ్యాకే వుంటుందా ఏమిటీ?
  @ బులుసు
  బావుందండీ. రెండు రకాలుగా 'బరువూ' మరియు బాధ్యతలూ తీర్చుకుంటున్నారన్నమాట.

  ReplyDelete