అన్నా - పదేపదే దీక్షలు చెయ్యకన్నా

అసలే మన రాజకీయ నాయకులు ప్రతి దానికీ దొంగ దీక్షలు చేసి అవంటేనే అభాసు పాలు చేసారు. అలాంటి స్థితిలో మీరు నిజాయితీగా చేసే దీక్షల వల్ల మీ దీక్షలంటే భారత దేశ ప్రజల్లో మంచి గౌరవం, ఆదరణ లభించాయి. అలా అని పిల్లికీ, పిడుగుకీ ఒకే మంత్రంలా మీరు కూడా పదేపదే దీక్షాస్త్రం సంధిస్తుంటే దాని శక్తి పలుచయిపోతూవుంది.  అలాంటి బ్రహ్మాస్త్రాలు అరుదుగా ఉపయోగిస్తేనే  యుక్తి, శక్తి ఇతరులకి ఆసక్తి వుంటుంది. లేకపోతే జనాలూ పలుచనయిపోతారూ, మీరూ పలుచనయిపోతారు మరి.

లోకపాల్ సభ్యులూ అవినీతిపరులు అయిపోతే...ఇదీ పరిష్కారం!


ప్రధానినీ, రాష్ట్రపతినీ, న్యాయాధికారులనూ, CBI నీ, అవినీతి నిరోధకక శాఖ వారినీ, ఇక వాళ్ళూ వీళ్ళూ అనే తేడాలెందుకులెండి, మిగతా వాళ్ళెమో పత్తిత్తులా కాబట్టి అలా అందరినీ లోక్‌పాల్ బిల్లులో చేర్చాలి. అప్పుడు లోక్పాల్కి తిరుగులేని అధికారం, దర్పమూ ఏర్పడి, భయం ఆమెడ దూరానికి పోయి వాళ్ళు ఎంచక్కా సూపర్ అవినీతిపరులు అవడానికి రాజమార్గం ఏర్పడుతుంది. మరి వాళ్ళ మీద కూడా నిఘా కావాలి కదా. వాళ్ళూ మానవోత్తములే కదా, వారిలో కూడా మానవత్వం అనగా మానవతత్వం మిగిలేవుంటుంది కదా, అందువల్ల వారూ అవినీతిపరులు ఖచ్చితంగా అవుతారు కదా. మరి ఎలా? వుంది, దానికో బమ్మాండమయిన పరిష్కారం వుంది. అదేమనగా...


బ్రిటిష్ వారికి భారత్ ను పరిపాలించిన విశేషమయిన అనుభవం వుంది కాబట్టి వారిని సూపర్ లోక్‌పాల్ గా నియమించాలి. మరి వారూ అవినీతి పరులు అయినట్లయితే...? అది భారద్దేశ సమస్య కాదు కదా, అది బ్రిటిష్ దేశ సమస్య. వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు, ఆ దేశ పౌరుల అవినీతి గొడవ మనకెందుకులెండి. మన లోక్పాలూ, సూపర్ లోక్పాలూ సల్లగుంటే సాలు. 

ఇంకానయ్యం మనవాళ్ళు అమెరికా, రష్యా, చైనా అధ్యక్షులను కూడా లోక్‌పాల్ బిల్లులో చేర్చాలని డిమాండ్ చెయ్యలేదు. థేంక్స్. 

అన్నా హజారేని కూడా లోక్‌పాల్ బిల్లులో చేర్చాలి! (End Of Message)


రాజన్న Vs మల్లన్న

రాజన్న సినిమా బావుందని సమీక్షలు వస్తున్నాయి కానీ సినిమా హాళ్ళలో జనాలు అంతగా లేరని తెలుస్తోంది. తెలంగాణా రజాకార్ ఉద్యమం గురించి విన్నప్పుడు నాలో ఉద్వేగం ఎలుగెత్తుతుంది. ఎందుకంటే మా నాన్నగారు తెలంగాణా పోరాట యోధులు. యోధులే కాకుండా నాయకులు కూడానూ. సోదర యోధులు అందరూ మల్లన్నా అని పిలిచేవారు. నా చిన్నప్పుడు నాన్నగారు నన్ను వడిలో కూర్చోబెట్టుకొని వారి యొక్క ఉద్యమ సాహసగాధలు వినిపించేవారు. మా అమ్మగారు కూడా అప్పటి విశేషాలు మా అందరికీ చెబుతూ నాన్నగారికీ, ఆ పోరాటానికి తను ఎలా సహకరించిందో, ఎన్ని కష్టాలు పడిందో చెప్పుకువచ్చేవారు.

అయితే రాజన్న లాగా మల్లన్న పాటలు పాడలేదు కానీ వివిధ క్యాంపుల నిర్వహణలో పాలుపంచుకున్నారు. అందులో ముఖ్యమయినది పాలేరు క్యాంపు. ఎన్నో సాహస గాధలు చెప్పారు కానీ చాలావరకు మరిచేపోయాను. కొన్ని మాత్రం గుర్తుకువున్నాయి. రజాకార్ల కంటపడకుండా వారు రాత్రి పూట ఎలా జాగ్రత్తగా సంచరించేవారో, అప్పుడు ఒకసారి రోడ్డుపక్కన వున్న నీటిలో కనిపించిన చంద్రుడిని చూసి అది రజాకార్ల టార్చ్ లైట్ అని భయపడి పరుగులు తీసిన వైనం లాంటివి కొన్ని గుర్తుకువున్నాయి. 

నాన్నగారు జరిగిపోయి కొన్నేళ్ళవుతుంది కాబట్టి ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ మా అమ్మగారితో ఆ గాధలు చెప్పించుకోవాలి. అవన్నీ విని బ్లాగస్థం (గ్రంధస్థం లాగా  చదువుకోవాలి) చెయ్యాలని వుంటుంది కానీ అది జరిగేదేప్పుడో. అంతకంటే మా అమ్మ చెబుతూ వుంటే వీడియో తీసి యూట్యూబులోకి ఎక్కించడం సులభం అనుకుంటాను. చూద్దాం.

US లో 20% మంది స్త్రీలు బలత్కార(యత్నా)నికి బలయ్యారుట

ఏం లెక్కలో, ఏమేం సమీకరణాలో కానీ 9 వేలకు మందికి పైగా స్త్రీలని సర్వే చేసి మరీ తేల్చారు ఆ విషయాన్ని. లైంగిక నేరాల గురించి కఠిన మయిన చట్టాలూ, అమలూ వున్న ఈ దేశంలోనే ఇంతటి పరిస్థితి వుందంటే ఇండియా లాంటి దేశాల్లో ఇంకెంత వుంటుందో.  వీరి సమీకరణాలతోనే అక్కడా సర్వే చేస్తే వచ్చే శాతం ఎక్కువగా వుంటుందని నా అభిప్రాయం.  గత ఏడాదిలో పది లక్షలకు మంది పైగా US స్త్రీలు బలాత్కారానికి గురి అయ్యారుట.

స్త్రీల సంగతి అటుంచి మగ మహారాజుల అవస్థేంటో చూద్దాం.  ప్రతి 71 మంది పురుషులలో ఒకరు తమ జీవిత కాలంలో బలాత్కారానికి బలయ్యారుట. అలాంటి వారిలో 25% మంది పురుషులు తమకు పదేళ్ళు కానీ అంతకులోగా వుండగా కానీ రేప్ కు గురయ్యారుట. 7,420 మంది మగాళ్లను సర్వే చేసి ఈ సంగతులు కనుగొన్నారు. మరి అలా ఆ మగాళ్ళని రేప్ చేసింది మగాళ్ళా లేక ఆడవారా అన్న వివరాలు నేను చదివిన వ్యాసంలో లేవు. అయినా పురుషులను స్త్రీలు బలవంతంగా చేస్తే అది బలాత్కారం అవుతుందంటారా?!

శృంగారం అనేది పరస్పర ఆమోదంతో, సహకారంతో వుండాలి కానీ  ఇలా బలవంతంగా, బలత్కారయుతంగా వుండకూడదు. కొన్నిసార్లు ఆ హడావిడిలో బలాత్కారానికీ, సహకారానికీ వున్న సన్నని గీత చెరిగిపోతూవుంటుంది. కొంతమంది ఆడవారు టిఫిన్ల వరకూ ఓకే అనవచ్చు కానీ భోజనం చేస్తామంటే నో అనవచ్చు. అర్ధాకలితో ఆగమంటే మనం ఆగలేకపోవచ్చు. అప్పుడు వస్తుంది తంటా.

మిగతా వివరాల కొసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి. 

పోలీసు కారులో నా విహారం

అరెస్టయి పోలీసు కారులో వెనక కూర్చున్నాను అనుకోకండి. అదేమీ కాదు. పౌర పోలీసు శిక్షణలో భాగంగా మేము ఓ నాలుగు గంటలు ఒక పోలీసు అధికారికి తోడుగా వెళ్లవచ్చు. నేను సాయంత్రం 7 నుండి 11 గంటల వరకు సమయం ఎన్నుకున్నాను. కావాలంటే రాత్రి అంతా కూడా అలా తోడుగా తిరగవచ్చని పోలీసు అధికారులు అన్నారు కానీ మరుసటి రోజు పనికి వెళ్ళాలి కాబట్టి వారి సూచన తిరస్కరించాను. 

నాకు తోడుగా వున్న అధికారి మంచి స్నేహశీలి. ఇద్దరం తొందరగానే మంచి మిత్రులం అయ్యాము. స్క్వాడ్ కారులో తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము. యుఎస్ లో పోలీస్ కల్చర్ గురించీ, ఇండియాలో పోలీస్ కల్చర్ గురించీ అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నాం. పోలీస్ పెట్రోలింగ్ అంటే ఎలా వుంటుందో, ట్రాఫిక్ వయలేషన్స్ ఎలా పట్టుకుంటారో నాకు తెలియజెప్పాడు. ఆ నాలుగు గంటలలో ముగ్గురు కారు డ్రయివర్లని ఆపి టికెట్లు ఇచ్చాడు. ఏమాత్రం అనుమానం వున్నా అనుమానాస్పదమయిన కారు యొక్క నంబర్ ప్లేట్ నంబరుతో ఆ కారు యొక్క, ఆ కారు యొక్క యజమాని యొక్క సమాచారం అంతా ఎలా లాగవచ్చో వారియొక్క డేటాబేసులు వెతుకుతూ నాకు చూపించాడు. షికాగో పరిసర ప్రాంతాల్లో ఆ రాత్రి ఏమేం నేరాలు జరిగాయో, ఎవరెవరు అరెస్ట్ అయ్యారో వారి డేటా బేసులల్లో చూపించాడు. 

పోలీసు స్క్వాడ్ కార్ల గురించి నాకు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చేసింది కాబట్టి నా వెనక పోలీసు కారు కనపడితే నాకు టెన్స్ గా వుంటోంది. ఎందుకంటే నా వెనకే వస్తూ వాళ్ళు ఏం గమనిస్తారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. నన్ను ఎప్పుడు ఆపడానికి అవకాశం వుందో అర్ధమవుతోంది. పార్కింగ్ ప్లేస్ వున్న ప్రాంతానికి దగ్గర్లో వాళ్ళు మనల్ని ఆగమన్నట్లుగా పోలీసు లైట్లు వేస్తారు. అప్పుడు ఆ పక్కనే వున్న పార్కింగ్ ప్లేసులో మన కారు ఆపాలి. ఇదివరలో అయితే ఏదో మామూలుగా వచ్చేస్తున్నార్లే అనుకునేవాడిని. ఇప్పుడు ఏదయినా పోలీసు కారు నా వెనకాలే వస్తుంటే జాగ్రత్త పడుతున్నాను. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే సామెత వుంది కానీ నాకయితే నాలెడ్జ్ ఈజ్ ఏంగ్జయిటీ అనిపిస్తుంటుంది.   అయితే నా 12 ఏళ్ళ డ్రైవింగ్ అనుభవంలో  ఇంతవరకూ నన్నెప్పుడూ ఏ పోలీసూ ఆపలేదనుకోండి.

అలా పోలీసు కారులో తిరుగుతూ వుంటే ఈ రోజు మాంఛి మసాలా పిలుపు వస్తే నాకు డెమో ఇవ్వడానికి బావుంటుంది అన్నాడు కానీ మరీ అంత మసాలా పరిస్థితి ఏమీ రాలేదు. కాకపోతే ఒక చోట ఒక వ్యక్తిని ఇద్దరు పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తే  ఆ వ్యక్తిని మా కారు వెనకాల కూర్చోపెట్టి తీసుకొని వచ్చి పోలీసు స్టేషనులో హండోవర్ చేసాం. తాము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఏఏ ఆంశాలు పరిశీలిస్తామో, అత్యవసర 911 కాల్స్ ఎలా వస్తాయో, ఎలా స్పందిస్తారో ఆ అధికారి నాకు వివరిస్తూ వెళ్ళాడు.  మధ్యలో మా పెట్రోలింగ్ రోటీన్ అయిపోయి కాస్త బోరు కొట్టినా కూడా మొత్తమ్మీద మా రైడ్ ఎలాంగ్ సరదాగా, ఉత్సాహంగా, సమాచారయుతంగా, ఎగ్జయిటింగుగా జరిగింది. నేను ఎన్నో ప్రశ్నలు వేసి ఎన్నో సందేహాలు, ఫందేహాలు తీర్చుకున్నాను. నా ప్రశ్నలన్నింటికీ ఓపికగా వివరణ ఇచ్చాడు. 

మా రైడులో ఒక సరదా విషయం జరిగింది. అప్పటికి చీకటి పడింది. ఒక కారుకి లైట్లు వేస్తే ఆ డ్రయివర్ పక్కనే వున్న పార్కింగ్ ప్లేసులో ఆపాడు. అది మేము తరచుగా వెళ్ళే తెలుగు గ్రోసరీ షాప్ ముందే. ఆ గ్రోసరీ షాప్ యజమని నాకు మిత్రుడే.  చాలా హడావిడి మనిషి. అధికారి వెళ్ళి కారులో వున్న ఆతనికి టికెట్ ఇస్తుంటే మా మిత్రుడు షాప్ బయటకి వచ్చి చూసి హర్రే, మన షాప్ ముందుకి పోలీసు కార్ వచ్చిందే అని తన పక్కనున్న వారితో పెద్దగా అన్నాడు. పోలీసు కారులో వున్న నేను అతనికి చెయ్యి ఊపాను. నా ఫ్రెండ్ విస్మయం చెందాడు. ఈ లోగా తిరిగివచ్చిన అధికారి నేను అతనికి విష్ చెయ్యడం చూసి "అతను నీకు తెలుసా" అన్నాడు. "అవును, ఆ షాప్ యజమని అతనే" అన్నాను. "కలుస్తావా" అన్నాడు. "సరే" అన్నాను. పోలీసు కారుని రయ్యిమని మా ఫ్రెండ్ ముందు ఆపడంతో నా మిత్రుడు కంగారు పడ్డాడు. నేను పక్కనుండి హలో అంటూ తెలుగులో పలకరించేసరికి ఉలిక్కిపడి "శరతూ, నువ్వు పోలీసు కార్లో..." అని కంగారు పడుతూ నా పక్కకి వచ్చాడు. పౌర పోలీసు శిక్షణ గురించి నేను క్లుప్తంగా వివరించడంతో అతని కంగారు తగ్గింది. నా పక్కనే వున్న అధికారిని పరిచయం చేసాను. వారిద్దరూ క్లుప్తంగా మాట్లాడుకున్నారు. అలా పోలీసు రైడులో వుండగా నా మిత్రుడిని కలవడం నాకు సరదాగా అనిపించింది. 
  
ఈ పూట అయినా  జాగ్రత్తగా కారు నడపమనీ -  లేకపోతే నేనే నీకు టికెట్ ఇవ్వాల్సి వస్తుందని మా ఆవిడతో జోక్ చేసానని ఆ అధికారికి చెబితే అతనూ సరదాగా నవ్వాడు. ఆ అధికారికి పెట్రోలింగ్ డ్యూటీ మా ఇంటి వైపే పడింది కాబట్టి మా ఇంటి చుట్టూ ఎన్నో రవుండ్లు వేసాము. ఆ నాలుగు గంటలు పూర్తి అయ్యాక అతను నాకు చక్కగా వీడ్కోలు ఇచ్చాడు. మంచి సమాచారం  నాకు అందించినందుకు ఆ అధికారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పౌర పోలీసు శిక్షణలో చేరి కమ్యూనిటీకి, పోలీసు వారికి సహకరిస్తున్నందుకు తాను నాకు థేంక్స్ చెప్పాడు. ఏ అవసరం వున్నా తమని కాంటాక్ట్ చేస్తుండమని చెప్పాడు. మా పౌర పోలీసు శిక్షణ పూర్తయినందువల్ల  ఆ పోలీసు స్టేషను వారు మమ్మల్ని తమలో భాగంగా గౌరవిస్తున్నారు. పోలీసు ఆలెమ్నీ అసోషియేషనులో కూడా మేము సభ్యులుగా చేరవచ్చు కానీ అంతెందుకులే అని నేను చేరలేదు. పౌరపోలీసు ఆకాడెమీలో కూడా చేరి పోలీసు వారికి అనుబంధంగా కొన్ని విధులు నిర్వహించవచ్చు కానీ అది కూడా నేను తీసుకోలేదు. మిగతావారు దాదాపుగా అందరూ అలా చేరినట్లున్నారు. నేను ఇప్పటివరకూ చేసింది చాల్లే అని లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఎప్పుడన్నా ఆసక్తి కలిగితే ఆ ఆకాడెమీలో చేరి పాల్గొంటాను.

మీ పర్స్ ఎక్కడ పెట్టుకున్నారు?

వార్షిక ఆరోగ్య పరీక్షల కోసమని నిన్న మా కుటుంబ వైద్యుని దగ్గరికి వెళ్ళాను. పలు రకాల ప్రశ్నలు వేస్తూ మీ వాలెట్ ఎక్కడ వుంది? అని అడిగాడు. నా వాలెట్ గురించి అతనికి ఆసక్తి ఏంటా అని ఆశ్చర్యపోయి ప్యాంట్ వెనుక జేబులో వుంది అని చెప్పాను. అలా పర్స్ వెనక జేబులో పెట్టుకుంటే తుంటి ఎముక అమరికల్లో మార్పులు వచ్చే అవకాశం వుంది అని చెబుతూ ప్యాంట్ ముందు జేబులో పెట్టుకోవాల్సిందిగా సూచించాడు. అలా వెనక జేబులో పెట్టుకుంటే కలిగే ఒత్తిడి ద్వారా వచ్చే అనర్ధాలు వివరించాడు.

నేను ఇండియాలో వున్నప్పుడు హాయిగా ఎంచక్కా అన్నీ చొక్కా జేబులో దూర్చేసేవాడిని. ఏదికావాలంటే అది ఠకీ మని షర్ట్ జేబులోంచి తీసే అవకాశం వుండేది. ఇప్పుడేమో ఏది కావాలన్నా వాలెట్ తెరచి మరీ తీసుకోవల్సివస్తోంది. ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకున్న పర్స్ వల్ల ఇబ్బందితో కొద్దిరోజులు పర్స్ చొక్కా జేబులో పెట్టుకుని తిరిగాను కానీ అదీ సౌకర్యంగా అనిపించక మళ్ళీ ప్యాంట్ వెనక్కు వెళ్ళాను. ఎందుకో గానీ మా డాక్టర్ చెప్పేంతవరకూ ప్యాంట్ ముందు జేబులో కూడా పర్స్ పెట్టుకోవచ్చు అన్న ఆలోచన రాలేదు.

ఒకసారి నా వాలెట్ చూసి జార్జ్ కొస్టాంజా వాలెట్ లాగా వుందే అన్నాడు మా పాత కొలీగ్ సరదాగా. సేన్‌ఫీల్డ్ సీరియల్ చూసేవారికి జార్జ్ కొస్టాంజా తెలిసేవుంటుంది. అతగాడి పర్సులో ఎన్నో కూర్చేస్తుంటాడు. అందులో ఏదయినా అవసరం పడ్డప్పుడు అందులో వెతుక్కోలేక అవస్థపడుతుంటాడు. చిత్రంలో వున్నది అతడూ, అతగాడి పర్సూనూ. చాలా సరదా మనిషి లెండి. ఒకసారి ఓ యువతి పిజ్జా పూర్తిగా తినలేక డస్టుబిన్నులో పడేస్తే ఎవరూ చూడట్లేదు కదా అని అది లాగిస్తుంటాడు. అంతలోకే ఆయువతి ఎందుకో అటువైపు వచ్చి ఆ దృశ్యం చూడనే చూస్తుంది.  సేన్‌ఫీల్డ్ చూడకపోతే తప్పకచూడండి. చాలా ప్రజాదరణ పొందిన సరదా సీరియల్ అది. ఆ షో ఎందుగురించీ అంటే ఏం చెప్పలేం. ఎ షో ఎబవుట్ నథింగ్

మరి మీ పర్స్ ఎక్కడ పెట్టుకుంటారేంటీ? 

కార్నింగ్ యూట్యూబ్ వీడియో: అద్దంలాంటి భవిశ్యత్తు

ఈ వీడియో మా పెద్దమ్మాయి నాకు చూపించింది. నాకు నచ్చిన ఆ వీడియో మీ కోసం. మన ఫ్యూచర్ ఎలా వుండబోతోందో ఆ వీడియో రుచి చూపిస్తోంది. ఇప్పటికి ఈ వీడియోను 16,498,785 సార్లు చూసారు.

http://www.youtube.com/watch?v=6Cf7IL_eZ38

ఇబ్బందికరమయిన ఆ నిశ్శబ్దం

మా పట్టణంలో ఒకరు మెడిటేషన్ మీటప్పులు నిర్వహిస్తుంటారు. ప్రతి వారం ఆదివారం సాయంత్రం ఆ కలయికలు వుంటాయి. 7 గంటల నుండి ఒక గంట ధ్యానం వుంటుంది. ఆ తరువాత స్పిరిచువల్ విషయాల్లొ చర్చలు వుంటాయి. 20 మంది వరకు రావచ్చు. ఒక్కోసారి అంతకు మించి సభ్యులు ఆసక్తి చూపించినా ఆ రోజుకి అవకాశం వుండదు. నేను ఎప్పుడో ఒకసారి వెళుతుంటాను కానీ వెళ్ళినప్పుడల్లా దేశీని నేను ఒక్కడినే వుంటుండేవాడిని.

నిర్వహణ కానీ, ధ్యానం కానీ, చర్చలు కానీ, ఇతర సభ్యుల సహకారం కానీ బాగానే వుంటుంది కానీ నాకో చిన్న ఇబ్బంది ఏర్పడింది. ధ్యాన సమయంలో అందరూ పూర్తి నిశ్శబ్దంగా వుంటారు. అప్పుడప్పుడు మాత్రం ఇతరుల కదలికలు కొన్ని వినపడుతుంటాయి.  అలా పూర్తిగా ఏమాత్రం శబ్దం రాకుండా వుండగలనా అని నాకు సందేహంగా వుంటుంది. ఏమాత్రం కదిలినా, దగ్గినా, తుమ్మినా ఇతరుల ధ్యానానికి ఇబ్బంది కలుగుతుంది కదా అనే అనుమానం పీడిస్తూ నా ఏకాగ్రతని చెడగొడుతూవుంటుంది. అలా పూర్తి నిశ్శబ్దం కాకుండా ధ్యానానికి తగ్గట్టుగా వుండే లైట్ మ్యూజిక్ ఏదయినా వినిపిస్తుంటే బావుండు అనిపిస్తుంది. అలాగే అగరువత్తుల పరిమళమూ సోకుతూ వుంటే ఇంకా చక్కగా అలౌకిక ఆనందంలోకి వెళ్ళవచ్చు అనిపిస్తుంది. ఆ రెండు విషయాలూ ఈ సారి వెళ్ళినప్పుడు సూచించి చూస్తాను.

ఈ మధ్య ఒకసారి చికాగోలొ వున్న షిర్డీ సాయిబాబా గుడికి మా కుటుంబంతో వెళ్ళాను. ఆ సాయిబాబా మా ఆవిడ ఇష్ట దైవం. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో, షీర్డీ సాయి స్త్రోత్రాలు వినపడుతూ వుండగా, అగరొత్తుల సుగంధ పరిమళాలు పీల్చుకుంటూ ఎంచక్కా ధ్యానంలోకి వెళ్లిపోయాను. 

నా చిన్నప్పుడు మా గ్రామానికి దగ్గర్లో వున్న మరో గ్రామంలో వుండే మల్లన్న దేవుని గుడికి మా అమ్మతో కలిసి వెళ్ళేవాడిని. అక్కడ సాయం సమయంలో భక్తులందరూ భజనలు చేసేవారు, కోలాటాలూ వేసేవారు. అలా శరీరం అలసిపోయిన తరువాత ధ్యానిస్తే ఎంతో బావుంటుంది కదా అనిపిస్తుంది. అందుకే అలా అలిసిపోవడానికనే ఓషో ఏక్టివ్ మెడిటేషన్లు సూచించాడు. అయితే దానికి కొద్దిగా గుంపు వుంటేనే ఉత్సాహంగా వుంటుంది. అందరితో కలిసి ఆడుతూ పాడుతూ అలౌకిక ఆనందంలోకి వెళ్ళవచ్చు.వీణా మాలిక్ కు అభినందనలు

మగవారి మ్యాగజైన్ FHM పత్రిక కవర్ పేజీకి నగ్నంగా ఫోజ్ ఇచ్చిన వీణా మాలిక్ కి అభినందనలు. కేవలం టాప్ లెస్ గానే ఫోజ్ ఇచ్చానని ఆమె అంటోంది కానీ అలా అయినా సరే ఒక మత చాందస దేశం నుండి వచ్చి మరీ ఇలా స్వేఛ్ఛగా ప్రవర్తించడం చక్కని  సాహసవంతమయిన విషయం. అందమయిన ఆడది తన చూడచక్కని శరీరాన్ని  ప్రదర్శించడంలో ఎలాంటి పొరపాటూ లేదు - అలాగే అలాంటి అందాల్ని తనివి తీరా మన నయనాలతో జుర్రుకోవడంలో అంతకంటే పొరపాటు లేదు.

పనిలో పనిగా అదే పత్రికకి టాప్‌లెస్ ఫోజు ఇచ్చిన ఇతర నటీమణులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కాజల్ కి. ఆ టాప్‌లెస్ ఫోటోలొ అమాయకమయిన ముఖంతో ఎంత ముద్దొచ్చిందో ఆ అమ్మడు. ఆ ఫోజ్ తనదని ఒప్పుకోవడం లేదన్నది వేరే విషయం. ఆమె మాటని నేనయితే నమ్మట్లేదు. అదంతా ఒల్లెక్కం మాట కాదూ?