నిన్న చేసిన నటరాజ ధ్యానం

ఈమధ్య ధ్యానం మీదికి బాగా ధ్యాస మళ్ళుతోంది అని చెబుతూ వస్తున్నాను కదా. అలా అని నా ఆసక్తి దైవ సంబంధమయినది అనుకోకండి. సెక్యులర్ మెడిటేషన్ నాది. ఇదివరలో ధ్యానం అంటే ఆస్తికులకు సంబంధించినది అనుకొని సెల్ఫ్ హిప్నటిజం లాగా చేస్తుండేవాడిని. అందులో మన మనస్సుకి మనమే సూచనలు ఇస్తూ, బంగారు భవిశ్యత్తు గురించి స్వైర కల్పనలు చేస్తూ వుండాలి. అందువల్ల కొంత విశ్రాంతి లభించినా మనస్సుకి అలసటగా కూడా అనిపించసాగి పెద్దగా సాగలేదు. పోనీ ధ్యానం చేద్దామన్నా కూడా ఏదో ఒక విషయం మీద మనస్సు లగ్నం చెయ్యాలనుకొని విసుగ్గా అనిపించేది. భావాతీత ధ్యానం గురించి కాస్త తెలిసాక అది బావుందనిపించింది. మనస్సుని అలా గాలికి వదిలెయ్యడమే. దేనీ మీదా ఏకాగ్రత నిలపాల్సిన అవసరం లేదు ఆ పద్ధతిలో. ఇంకేం, హాయిగా కూర్చొని అలా మనస్సుని వదిలెయ్యడమే కాబట్టి హాయిగా అనిపించేది కాబట్టి అప్పుడప్పుడూ చేస్తూ వచ్చాను. క్రమం తప్పకుండా చెయ్యాలనుకుంటూనే సరి అయిన సాంగత్యం, మార్గ దర్శకత్వం లేక సరిగ్గా సాగలేదు. 

చాలా ఏళ్ళ క్రితం ఒక సెమినారుకి వెళ్ళినప్పుడు కూడా ధ్యానం గురించిన ఆవశ్యకత గురించి తెలిపారు. మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే మీకు ఇష్టమయిన వ్యక్తినో లేదా మీ ప్రియురాలినో అయినా ధ్యానించుకోండి అని చెప్పారు. అలా నా ప్రియురాళ్లని ధ్యానించుకుంటూ వుండేవాడిని. మనకు ఒక్కళ్ళు కాదు కదా. నన్ను ధ్యానించుకో, నన్ను ధ్యానించుకో అని నా మనస్సులో పోటీ పడేవారు. టాస్ లు వేసో, అప్పుడు వున్న మూడ్ ను బట్టో ఎవరితోనో ఒకరితో మొదలేట్టేవాడిని కానీ ఆ ఆలోచనలు ఎక్కడికో దారితీసి మనస్సులో ప్రశాంతత బదులు తాపం పుట్టించేవి. అలాకాదనుకొని నాకు నచ్చిన నాయకులను ఎవరినయినా ధ్యానించుకుందామంటే బోరుగా అనిపించేది. ఇలా ధ్యానించుకోవడానికి దేవుడు మీద గురి లేక, నా దేవతలు పనికిరాక అలా మెడిటేషను పక్కన పడేస్తుండేవాడిని. ట్రన్స్డెంటల్ మెడిటేషన్ గురించి తెలిసాక నాకు హాయిగా అనిపించింది. దేవుళ్ళనూ, ప్రియురాళ్ళనూ, నాయకులనూ పక్కన పడేసి నా మనస్సుని నేను నడిపిస్తూ, గమనిస్తూ వచ్చాను. అదీ అప్పుడప్పుడే లెండి. అలా ధ్యానించిన రోజు చాలా హాయిగా వుండేది. అది నిత్యజీవన అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతో వుందని తెలిసీ కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. సమయం ఎక్కడిదండీ? పోచుకోలు కబుర్లకూ, టివి షోలకూ, నెట్టుకూ, పనికి మాలిన సినిమాలకే సమయం సరిపోవడం లేదు మరి. 

ఓషో గురించి తెలుసుకుంటూవుంటే వారి చురుకయిన ధ్యానాలు తెలిసి నాకు చురుకు ముట్టింది. పతంజలి  యోగా పద్ధతులు గట్రా ఎప్పుడో ప్రాచీన కాలంలో ఇంతగా బ్రతుకుల్లో వేగం, ఒత్తిడీ లేనికాలంలో వచ్చాయి - అవి ఈ కాలానికి సరిపోవు అని కొన్ని ఏక్టివ్ మెడిటేషన్స్ సూచించారు. ధ్యానించడానికి ముందుగా శరీరాన్ని కొన్ని పద్ధతులలో అలసటకి గురిచేస్తే మనస్సు మరింతగా సంసిద్ధం అవుతుంది అన్నది వారి వివరణ. వారు సూచించిన ఏక్టివ్ ధ్యానాల్లో నాకు బాగా నచ్చింది నటరాజ్ ధ్యానం. అందులో మంచి సంగీతం వింటూ మొదట 40 నిమిషాలు కళ్ళు మూసుకొని తన్మయత్వం చెందుతూ మనకు నచ్చిన విధంగా, తోచిన విధంగా నర్తించడమే. ఆ తరువాత ఎంచక్కా 20 నిమిషాలు శవాసనం వెయ్యడం. శవాసనం వెయ్యడం ఏముందండీ, చాలా తేలిక కదా - అలా చచ్చినట్లు పడుండడమే కదా. ఈ ధ్యానానికి తగ్గ సంగీతం వింటూ కళ్ళు మూసుకొని నచ్చిన విధంగా నాట్యం చేస్తూ అలౌకిక ఆనందం పొందాను.

నాతో పాటు మా అమ్మలు కూడా సంతోషంగా అలా ఆ నాట్యం చేసేసింది. ఇందుగ్గానూ మేము ఆనంద్ రిచా అనే అమ్మాయి సంగీతం పెట్టుకున్నాం. ఆ అమ్మాయి, ఆమె పాటలూ, నటరాజ ధ్యానమూ అమ్మలుకి బాగా నచ్చేయి.  అయితే నిన్న సమయం లేక శవాసనం కుదరలేదు. ధ్యాన నాట్యం అని చెబితే మీలాగే మా ఆవిడ నన్ను విచిత్రంగా చూసేస్తుంది కనుక ఆమెను నాట్యానికి ఆహ్వానించలేదు. మా పెద్దమ్మాయి వేరే గ్రహం అనగా ఇంటర్నెట్టులో జీవిస్తుంది కాబట్టి ఇప్పుడే  అలా అంతరాయం కలిగించదలుకోక పిలవలేదు. ముందు అమ్మలూ, నేనూ ఈ నాట్య ప్రయోగాలు చేసి అప్పుడు ఇతరులని ఆహ్వానిస్తాం. వస్తే వచ్చారు - లేకపోతే లేదు.  చిన్నమ్మాయి అమ్మలుకయితే ఇలాంటి కొత్త విషయాల పట్ల ఆసక్తి మెండు కనుక నాతో పాటు ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. చాలా ఫన్నీగా డ్యాన్స్ చేస్తున్నావ్ డాడీ అని అంది. ఇక్కడ విషయం డ్యాన్స్ చక్కగా చెయ్యడం కాదనీ, ఫ్రీ డ్యాన్సింగ్ అనీ వివరించాక బుద్ధిగా అర్ధం చేసుకుంది. మీకూ అర్ధం అయ్యింది కదా? అలా సేక్రెడ్ డ్యాన్స్ నడిపించేసాం.  

'రిచా'కరమయిన పాటలు ఇక్కడ వినండి మరి.
http://anandricha.com/music.html

మీకూ చురుకయిన ధ్యానాల మీదకు ధ్యాస మళ్ళితే ఇక్కడ చూడండి మరి.

ఓషో ...వైపుగా నా అడుగులు

ఈమధ్య నాలో కొంత ఏకాంతం వచ్చేసి నన్ను నేను పరిశీలించుకోవడానికి అవకాశం కలిగింది. నాలో స్పిరిచువలిటీ (దైవ సంబంధమయినది కాదు) లోపించిందనీ, ఆ శూన్యతను పూరించుకోవాల్సి వుందనీ అర్ధమయ్యింది. అందువల్ల అలా అన్వేషణ మొదలెట్టి నాకు దగ్గరగా వుండే, ఇష్టమయ్యే బుద్ధ, జెన్, జిడ్డు, ఓషో బోధనలతో పాటుగా సద్గురు జగ్గి వాసుదేవ్ బోధనలు కూడా కొన్ని పరిశీలించాను. జెన్ యొక్క జాజెన్ లాంటి ధ్యానాలకు కూడా వెళ్ళాను. మొత్తమ్మీద ప్రస్థుతానికయితే ఓషో దగ్గర ఆగి వారి రచనలు చదువుతూవస్తున్నాను. అందుకే...ఆసక్తి అంతా అటువైపు వుంది కనుకనే ఈమధ్య బ్లాగులు వ్రాయడం లేదు. నా తీరిక సమయమంతా నాలో ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి ఉపయోగిస్తున్నాను.

నేను పిజి చేస్తున్నప్పుడే ఓషో పూణెలోని ఓషో ఆశ్రమాన్ని సందర్శించాను కానీ అందులో భోగం కంటే ధ్యానమే ఎక్కువుందని చిరాకు అనిపించి అప్పట్లో ఓషోని తిరస్కరించాను కాని ఇప్పుడు ఆ తంత్రాల పట్ల ఆసక్తి మళ్ళింది. అలా అని నేను ఎందులోనూ చేరకపోవచ్చు, దేనినీ విడవకపోవచ్చు కానీ ఏ మార్గాన్నయినా సందర్శిస్తుండవచ్చు. ఇప్పటికిది నచ్చుతుంది. నడిపించేద్దాం. రేపు ఎటు దారితీస్తానో ఎవరికి తెలుసు. నచ్చినంత సేపే ఆగిపోవడం, నచ్చనప్పుడు మరో దారి చూసుకోవడం. మనకు ముఖ్యమయ్యింది (స్పిరిచువల్) మకరందం కానీ దాని వైపు వెళ్ళే దారి కాదు కదా.

నా ప్రస్థుత  ఆసక్తికి తగ్గట్టుగానే మా ఊరిలోనే ఒక ఓషో ప్రాంతీయ కార్యక్రమాల నిర్వాహకులు వున్నారు. వారు తెలుగు వారే అవడంతో ఇంకా సౌకర్యంగా వుంది. మొన్ననే వారిని కలుసుకొని  కొన్ని సందేహాలు తీర్చుకున్నాను. మా ఇళ్ళు కాస్త దగ్గరే కాబట్టి నేను వారితో కలిసి ఓషో కార్యక్రమాల్లొ పాల్గొనే అవకాశాలు బాగానే వున్నాయి. ఓ రెండు వారాల తరువాత ఓషో ధ్యానం వగైరాలతో ఓ అర రోజు కార్యక్రమాలున్నాయి.