గురువారం 6 అక్టోబర్ 2011

పుస్తకం ప్రింటయ్యింది

కిందా మీదా పడి మొత్తానికి విజయవాడ లోని ఒక ప్రింటర్స్ వద్ద మా అమ్మాయి అంతర్ముఖి పుస్తకం ప్రింట్ చేయించానండీ బాబూ. ఒక పుస్తకాల పంపిణీదారునితో మాట్లాడుతున్నాం. ఆ పని అయ్యాక పుస్తకం మార్కెట్లోకి వస్తుంది. ఇక్కడి వుండి అక్కడ ప్రింట్ చెయ్యించాలంటే సామాన్యమయిన విషయం కాదు. ఎంతో కాలయాపన,  కాల్స్, ఈమెయిల్స్ తప్పలేదు. అక్కడేవుంటే ఎప్పటికప్పుడు పుస్తకం ఎలా వస్తోందో చూసుకుంటూ సవరణలు, సూచనలు ఇవ్వవచ్చు.  ఇక్కడవుండి అలా చూసుకోవాలంటే కాస్త విసుగ్గానే వుంది. ప్రింటర్స్ కూడా చాలా ఓపికగా నాకు సహకరించారు.  మొత్తం మీద పుస్తకం ప్రింటయినందుకు సంతోషంగా వుంది. అది విజయవంతం అయినా కాకపోయినా ఓ ప్రయోగంలా నాకు మిగిలివుంటుంది. ఈ అనుభవంతో రాబోయే పుస్తకాల పట్ల మరింత బాగా కృషి చెయ్యగలను. 

నా తదుపరి పుస్తకం నేను స్వలింగసంపర్కుడిని మీద సిబి రావు ఇంకా పనిచేస్తున్నారు. ఆ పుస్తకాన్ని ఎడిట్ చెయ్యాల్సిందిగా వారికి ఇచ్చాను కానీ సమయం బాగానే తీసుకుంటున్నారు. ఈ పుస్తకం పూర్తయ్యింది కాబట్టి ఇక ఆ పుస్తకం పని వేగవంతం చేద్దామని రావుగారికి మొన్ననే సూచించాను. ఈ అంతర్ముఖి పుస్తక అవిష్కరణ ఇండియాలో జరిగినా నేను రాకపోవచ్చును కానీ హోమో పుస్తకం పూర్తయితే మాత్రం తప్పక ఇండియాకి వచ్చి అవిష్కరించాలి అనుకుంటున్నాను. సరే లెండి, ఆలూ లేదూ చూలూ లేదు సామెతలాగా అవుతోంది కదా. ఆ పుస్తకం ప్రింటయ్యాక ఆ సంగతులు ఆలోచిస్తే బావుంటుంది కానీ వచ్చే ఏడాది ఇండియా రావడం కోసం ఇప్పటినుండే ఓ చక్కని ఎలిబీ కోసం ఎదురుచూస్తున్నాను లెండి.  

అయితే ముఖ్యమయిన విషయం ఏంటంటే ఆ పుస్తకం ప్రింట్ చెయ్యగల గట్స్ వున్న ప్రింటర్ ఎవరు దొరుకుతారా అన్నది. రావు గారి దృష్టిలో ఒకరు వున్నట్టున్నారు. మీకు తెలిసిన ధైర్యవంతమయిన ముద్రాపకులు ఎవరయినా వుంటే తెలియజేయండి. ఆ పుస్తకంలో బూతులు ఏమీ వుండవు కానీ టాపిక్ తేడాగా వుంటుంది కాబట్టి సమస్యలు ఎదురవ్వచ్చు.  మీలో చాలామందికి గుర్తుకు వుండే వుంటుంది. ఇదివరలో కొంతకాలం క్రితం ఆ పుస్తకం ముద్రించడానికి ఓ ముద్రాపకుడు సంసిద్ధం అయినా కూడా డిటిపి చేస్తున్న అమ్మాయిలకు ఆ పుస్తకం నచ్చకపోవడంతో ఆ ప్రింటర్ చేతులు ఎత్తేసారు :((

6 comments:

కాయ చెప్పారు...

పాపం మీ ఆ పుస్తకం చదివినప్పుడు ఇండియా లోని మధ్య తరగతి నుండి వచ్చిన ఆ డీ టీ పీ అమ్మాయిలు ఎలా ఫీల్ అయి ఉంటారో కదా....

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ కాయ
:))
వాళ్ల సంగతి సరే కానీ ఆ పుస్తకం ప్రింట్ అయి బయటకి వస్తే మా బంధుమిత్రులు ఎలా ఫీల్ అవుతారో చూడాలి మరి.

శరత్ 'కాలమ్' చెప్పారు...

మీ "పుస్తకం ప్రింటయ్యింది" పోస్ట్‌పై bondalapati క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

శరత్ గారు,
ఆ పుస్తకం ప్రింట్ చేయించి పబ్లిష్ చేయటానికి మీకు చేతి చమురు ఏమన్నా వదులుతోందా? వదిలితే ఎంత? కొంచెం పబ్లిషరూ ప్రింటర్ల వివరాలను నాతో పంచుకోగలరా?
నా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ ను అచ్చు లో చూసుకోవాలని నా కోరిక.
నా మెయిల్ ఐడీ: [Edited]

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ బొందలపాటి
మీకు ఆ వివరాలతో ఈమెయిల్ ఇచ్చాను. అందిందా?

jp చెప్పారు...

ఈ రోజే మీ పుస్తకం ` మా అమ్మాయి అంతర్ముఖి ' కొన్నాను. కొత్తగా వుందని తీసుకున్నాను.చదవటం ప్రారంభించాను.-- పి.జయప్రకాశ రాజు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@జెపి
పుస్తకం అప్పుడే మార్కెట్లోకి వచ్చిందా? ఆశ్చర్యంగా వుందే!ఎక్కడ తీసుకున్నారు? నవోద్య బుక్ షాప్ లోనా? నవోదయ వారితో ఇంకా పూర్తిగా మాట్లాడకముందే పొరపాటున వారికి పుస్తకాలు అందాయి. నవోదయ వారి నుండి పూర్తి వివరాలతో ఈమెయిల్ కోసం ఎదురుచూస్తున్నాను. అయినా సరే పుస్తకం మార్కెట్లోకి వచ్చినందుకు సంతోషంగానే వుంది. అది బ్లాగు టపాల సంకలనం కాబట్టి అంత కొత్తగా మీకు అనిపించకపోవచ్చు.