ఇంకా నయ్యం - ఆ సంఘటణ మేము వున్న ఇంట్లో జరుగలేదు!

సిటెజెన్ పోలీస్ శిక్షణకి వెళుతున్నా కదా. నిన్న పోలీస్ డాగ్ ట్రైనర్ కుక్కలకి పోలీసు శిక్షణ ఎలా ఇస్తారో వివరించాడు. పోలీసు కుక్కని తెచ్చి మా ముందు రకరకాల ప్రదర్శనలు ఇప్పించారు. అవి ఎలా దొంగలని పట్టుకుంటాయి, ఎలా మత్తు మందులని పట్టుకుంటాయి లాంటి విషయాలు తెలిసాయి. ఫేక్ హీరాయిన్ వాసన కూడా చూపించారు - చింతపండు వాసనలా వుంది. ఒక రెండు రోజుల క్రితమే ఒక వెయ్యి కిలోల మత్తుమందులు ఈ కుక్కల సహాయంతో ఎలా పట్టుకున్నది ఫోటోలతో సహా వివరించారు.

ఆ తరువాత మా టవునులో నేరాలు నిరోధించే చర్యల గురించి వివరించారు. అలా అలా చర్చ హత్యల మీదికి మళ్ళింది. సగటున ఏడాదికి ఒక హత్య చొప్పున మా పట్టణంలో జరుగుతూ వుంటాయిట. చాలామంది హంతకులను పట్టుకున్నా కూడా కొన్ని కొన్ని హత్యలు ఇంకా మిస్టరీలు గానే వున్నాయి అని చెబుతూ కొన్నేళ్ళ క్రితం జరిగిన ఒక హత్య గురించి వివరించారు. ఒక నల్ల యువతినీ ఇరవై ఏళ్ళ క్రితం (1991 లో) ఎవరో హత్య చేసారు. హంతకుడో లేక ఈ విషయం తెలిసిన మరెవ్వరో 911 కి ఫోను చేసి ఒక యువతి ప్రాణాపాయ స్థితిలో వుంది అని చెప్పారంట. అతగాడి 911 ఫోన్ రికార్డింగుని మాకు వినిపించారు. అందులో అడ్రసు విని ఆశ్చర్యం చెందాను. మూడు నెలల క్రితం వరకు మేము వున్న కమ్యూనిటీలోనే  - మా ఇంటి పక్కనే ( Court లోనే) అది.   ఇంకా నయ్యం ఆ హత్య మేము కిరాయికి వున్న ఇంట్లో జరుగలేదు అని ఊపిరి పీల్చుకున్నాను. ఎప్పటి సంఘటణో అనుకోండి కానీ ఎంతయినా ఓ హత్య జరిగిన ఇంట్లో వుండి వచ్చాం అంటే ఏదోలా వుంటుంది కదా.

క్రితం సారి తరగతిలో మాకు మా పోలీసు స్టేషనులోని 911 (ఎమెర్జెన్సీ కాల్) సెంటర్ కూడా చూపించారు. నేను రోజూ రైలు ఎక్కే స్టేషనును కూడా వాళ్ళు ఇక్కడి నుండి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలతో గమనిస్తున్నారు! అప్పుడప్పుడు రాత్రుళ్ళు ఆలస్యంగా అక్కడ వేచి వుండాల్సి వచ్చినప్పుడు కాస్త బెదురుగా వుంటుంది. ఇప్పుడు వీళ్ళు గమనిస్తారు అని తెలిసాక కాస్త ధైర్యంగా అనిపించింది. అప్పుడే ఒకతను అక్కడ రెస్ట్ రూముకి వెళుతూ తలుపు వేసుకోవడం గమనించి నవ్వుకున్నాం.
అయితే అప్పుడు అక్కడ ఒకే ఒక్క 911 అధికారి వున్నాడు. అతను ప్రకృతి పిలుపులకి వెళ్ళాల్సి వస్తే అత్యవసర పిలుపులు ఎవరు అందుకుంటారు అనే ప్రశ్న ఉదయించింది. అది అడగబోయేంతలో మాకు వివరణ లభించింది. ఎప్పుడయినా అక్కడ కనీసం ఇద్దరు వుంటారని చెప్పారు. మరి ఇంకో అధికారి ఎక్కడ? ప్రకృతి పిలుపుకి స్పందిస్తున్నాడంట.

1 comment:

  1. మన ఆంధ్రలొ కూడ వున్నట్లు ఉంది. అది పోలిస్ మిత్ర అనుకుంట. కాని పటిష్టంగా లేదు.

    ReplyDelete