ఆ కాస్త పని అయ్యాకా నేనూ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దూకుతా

ఎందరెందరో మహానుభావులు ఉద్యమాలు చేసారు, కొందరు ఆస్థిపాస్థులు ప్రకటించారు. ఆ మధ్య అందరూ అవినీతి మీద ఆవేశంతో టపాలు, వ్యాఖ్యలూ వ్రాస్తూవుంటే నేను కక్కలేక, మింగలేక, కీబోర్డ్ నలుపుకుంటూ, బ్లాగు నొక్కుకుంటూ అలా ఊరకే చూస్తూ వుండాల్సొచ్చింది.  అంటే నేనప్పుడు ఆవేశంగా టపా వ్రాయకపోతే ఏదో జరిగిపోద్ది అని కాదు కానీ నేను కూడా అవినీతి కోసం అందరిలాగా ఓ సమిధని కాలేకపోతున్నానే అని మనస్సులో బావురుమన్నాను. ఆ తరువాత ఊరడించుకున్నాను. మొత్తమ్మీద మౌనం వహించాను. అది మామూలు మౌనమా? కానే కాదు - అది వ్యూహాత్మక మౌనం. వ్యూ.మౌ. కి డిఫినిషన్లు గట్రా కావాలంటే కెసీఆరును అడుక్కోండి. మొత్తమ్మీద అందరూ చప్పజల్లారు అని నిర్ధారించుకొని నేను కలుగులోంచి ఎలుకలాగా ఈ విషయంపై తొంగిచూస్తున్నా.

ఎందుకు అలా మౌనం వహించాలని నన్ను నిగ్గదీసి అడగండి. మీరెవరూ నన్ను అలా అడిగేంత దృశ్యం నాకు లేదు కాబట్టి నేనే చెప్పుకుంటా.  నేను అవినీతి పరుడిని కాబట్టి అలా కాం గా వున్నానా? ఎంతమాటన్నారు! నేను చచ్చినా అవినీతి పరుడిని కాను, కాలేను. అలాంటి అవకాశమే లేదు (కనుక). ఈ విషయంపై నాకు కొన్ని ధర్మ సందేహాలు వున్నాయి. అవినీతి స్వంతంగా చేస్తేనే అవినీతి పరుడు అంటారా లేక అవినీతికి సహకరించేవారిని కూడా అంటారా? ఉదాహరణకు లంచం తీసుకునేవాడిని అలా అంటారు కానీ ఇచ్చినవాడిని అనరు కదా. కానీ అవినీతికి సహకరించడం అంటారా? ఇష్టమయి చేస్తే సహకారం అవుతుంది కానీ తప్పనిసరి అయి చేస్తే అది సహకారం ఎలా అవుతుందీ? మనం లంచం ఏమయినా ఇష్టమయి ఇస్తామా ఏంటీ, తప్పదు కాబట్టి ముక్కు మూసుకొని అయినా కక్కేస్తాం.

ఈమధ్య ఇండియాలో ఒక పని మొదలెట్టాను. అందుకు గాను నేను లంచాలు ఇచ్చే పరిస్థితి లేకపోయినా  అంతో ఇంతో అవినీతికి ఎంతో కొంత సహకరించకతప్పదు. అక్కడున్న వారికి అవన్నీ సాధారణమే కాబట్టి అసలు వారికి ఇది ఓ అవినీతిలాగా కనిపించనే కనిపించదు. అయినా సరే ఆ మాత్రం కూడా సహకరించనని మాట వరుసకి మడిగట్టుకొని కూర్చున్నా అనుకోండీ నాకు బ్యాండ్ పడిపోతుంది. అలా నా నీతి వ్రతానికి గాను ఇంట్లోనూ బ్యాండ్ పడుతుంది. అలా రెండు విధాలా ఇప్పుడు నాకు బ్యాండ్ మేళాలు అవసరం అంటారా చెప్పండి?

అంచేతా, ఆ కాస్తా పని శుబ్బరంగా పూర్తయ్యాకా తాజాగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలోకి దూకేస్తానేం.  

4 comments:

 1. ఇంకెక్కడి అవినీతి వ్యతిరేక ఉద్యమం ? అదెప్పుడో ముగిసింది. :D

  ReplyDelete
 2. It’s not about crying “I am Anna”
  It’s not about sporting “I am Anna” T-Shirts and Caps
  It’s not about rooting for Anna

  IT’S ALL ABOUT HOW MUCH WE TRY TO BE ANNA EVEN WHEN NOBODY IS TAKING NOTICE AND EVEN WHEN THE ISSUE IS NOT IN THE LIMELIGHT.

  ReplyDelete
 3. @ క్రిష్ణప్రియ
  :))

  @ సుజాత
  అందుకే నేను చేరతానన్నది :D

  @ వీకెండ్ పొలిటీషియన్
  అవునండీ. అందుకే 'అన్నా' గురించి కాకుండా 'నా' గురించే చెబుతున్నా.

  ReplyDelete