సందు దొరికింది కదా అని ఓ కునుకు తీసాను. అప్పుడు...

ఇది గత వారం సంగతి. ఓ రోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. బహుశా ఆ రాత్రి రెండు మూడు గంటలే పడుకొని వుంటాను. అయినా సరే  మరునాడు మన వెనుక మనమే తన్నుకొని లేచి ఆఫీసుకి వెళ్ళాల్సిందే కదా.  వెళ్ళాను, అలాగే మధ్యాహ్నం జిం కి వెళ్ళాను. ఆ రోజు జిమ్ములో ఫిజికల్ టెస్టుల కోసం అప్పాయింట్మెంట్ వుంది. మా జిమ్ము మేనేజర్ బాగానే వుంటుంది. అవీ ఇవీ పరీక్షలు చేసి ఓ పరీక్ష కోసమని చిన్న బెల్టు లాంటిది నడుము చుట్టూ గుండెకి దగ్గర్లో పెట్టి మ్యాట్ మీద పడుకొమ్మంది. రెండు నిమిషాల తరువాత వచ్చి రీడింగ్ చూసి బుర్ర గోక్కుని మళ్ళీ ఇంకోసారి ఆ పరీక్ష అని చెప్పింది.  రెండు నిమిషాలు అయ్యాక మళ్ళీ వచ్చి చూసి మళ్ళీ బుర్ర గోక్కొని "మీకు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వుంది. అప్పుడప్పుడు ఈ సిస్టం తప్పు కూడా చూపిస్తుంది. వచ్చే వారం మళ్ళీ పరీక్షలు చేద్దాం. క్రితం సారి పరీక్షల్లో బాగానే వుంది కాబట్టి సమస్యేమీ లేకపోవచ్చు" అని చెప్పింది. తనని చూసాక హార్ట్ బీట్ పెరగాలి కానీ తగ్గడం ఏంట్రా అని అనుకొని వుంటుంది.

గత రాత్రి నిద్ర లేకపోవడంతో దొరికిన ఆ నిమిషాలలోనే కాస్తంత కునుకు తీసాను. అందువల్ల గుండె లయలో తేడా వచ్చి వుండవచ్చు. లేకపోతే గుండెలో ఎదయినా సమస్య తయారయి వుండవచ్చు. ఎందుకయినా మంచిదని ఈరోజు మళ్ళీ పరీక్ష చెయ్యమన్నాను. చేసింది. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి. ఈ రోజు కునుకు తియ్యకుండా జాగ్రత్తపడ్డాను మరీ. ఆమె చేసిన పరీక్షను VO2 Max అంటారు. మన శరీరానికి ఎంత ఆక్సిజను అందుతోంది అనేదాన్ని అది తెలియజేస్తుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందట్లేదూ అంటే గుండెలోనో లేదా మరెక్కడో ఏదో లోపం వున్నట్లే మరి.  అదేంటో కనుక్కొని సవరించుకోకపోతే నెమ్మదినెమ్మదిగా అవయవాలు, మెదడూ క్షీణిస్తాయి.

No comments:

Post a Comment