ఇక్కడి పోలీసులతో పూసుకు తిరగడం వల్ల...

... నష్టాలు ఏమయినా వుంటాయేమో ఇంకా అనుభవానికి రాలేదు కానీ ప్రస్థుతానికయితే  కాస్తో కూస్తో ఆ పరిచయాలు ఉపయోగపడుతున్నాయి. ఎన్నడూ లేనిది ఈమధ్యే నాకు వారి అవసరం కలిగింది. కలిగిందీ అంటే కలగదూ మరి. దానికో ఫ్లాష్ బ్యాక్ వుంది మరీ.  సోమవారం రాత్రి 8 గంటల వేళ హాయిగా సోఫాలొ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ టివి చూస్తున్నా. జనాలు నన్ను అంత విశ్రాంతిగా వుండనిస్తారా? తలుపులూ, కిటికీలూ బిగించుకున్నా కూడా వీధి బయటి నుండి ముందు స్క్రీచ్ మనీ ఆ తరువాత దఢేళ్ మనీ శబ్దాలు వినిపించాయి.  రెండు కార్లు గుద్దుకున్నాయి అని అర్ధమయ్యింది. అంతలా ఆ శబ్దాలు వినిపించాక కూడా తొంగిచూడకపోతే ఆత్మ ఘోషిస్తుందని వెళ్ళి బ్లయిండ్స్ తొలగించి ఎదురుగా చూసా ఏమీ కనిపించలేదు. కళ్ళు చిట్లించి కాస్త దూరంలో వున్న ఇంటర్‌సెక్షన్ వైపు చూసి ఉలిక్కి పడ్డా. అక్కడో కారు రోడ్డుకి అడ్డంగా వుంది. ఆ శాల్తీ దిగి కారు చూసుకుంటోంది.  ఆ శాల్తీ ఎవరో కాదు - మా ఆవిడే! ఆ కారు నాదే!!

మా ఆవిడ మా ఇంటికి రావడానికని లెఫ్ట్ టర్న్ తీసుకుంటుండగా మరో కారు వచ్చి గుద్దింది. మాది SUV - అతగాడిది కారు అవడం వల్ల మా కారు గిల్లకి కాస్త దెబ్బ తగిలింది కానీ అతగాడి కారు మాత్రం ముందు వైపు ఎడమపక్క బాగా సొట్ట పోయింది. మా ఆవిడ సహజంగానే ఎదుటివాడిని గద్దించింది. వాడు బుద్దిగా పోలీసులకు ఫోను చేసాడు. నేను నెమ్మదిగా నెగోషియేట్ చెద్దామనుకున్నా కానీ మా ఆవిడ నన్ను గదమాయించడంతో నోరు మూసుకుక్కూర్చున్నా.  ఇంతలోకే పోలీసు ఆఫీసర్ వచ్చాడు. ఇంకా మన చేతిలో ఏముంటుంది.  తగుదునమ్మా అంటూ ఆ చీకట్లో  జరిగిన ఈ ప్రమాదానికి ఓ పాదాచారి సాక్షిగా కూడా వుంది. జరిగిందేంటో ఆఫీసరుకి చెప్పింది. రిపోర్ట్ తీసుకొని మా ఆవిడకి ట్రాఫిక్ టికెట్ ఇచ్చి ఐ-బాండ్ మీద అనితను రిలీజ్ చేసాడు. వచ్చే నెల కోర్టుకి వచ్చి చెప్పుకోమన్నాడు. 

ఏంటీ కోర్టులో వాదించేదీ? గ్రీన్ లైటు మీద  లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ప్రమాదం జరిగితే బాధ్యత అలా టర్న్ తీసుకున్నవారిదే అవుతుంది.  అందువల్ల అక్కడ నెగ్గలేం కానీ కోర్టుకి ఎక్కడం ఇదే మొదటిసారి అవడం వల్ల కొన్ని వివరాలు కావాల్సివచ్చాయి. ఉదాహరణకు ఎదుటి వ్యక్తి కోర్టుకి రాకున్నా అనిత తన తప్పుని ఒప్పుకోవాలా లాంటి సందేహాలు ఎవరిని అడిగినా, నెట్టులో చూసినా దొరకలేదు. నిన్న పౌర పోలీసు శిక్షణకి వెళ్ళినప్పుడు అక్కడ తోటి వారిని అడిగాను. వారికీ స్పష్టంగా తెలియదు. మా శిక్షణను పర్యవేక్షించే అధికారినే ఎంచక్కా అడగవచ్చని చెప్పారు. ఆ అధికారి చాలా మంచి వ్యక్తి, స్నేహ శీలి. విషయం చెప్పి సలహా అడిగాను. చాలావరకు ఎదుటివారు కోర్టుకి రారనీ, అలాంటప్పుడు ఎవరిది తప్పు అనే ప్రశ్నే రాదనీ, కేస్ డిస్మిస్ చేస్తారనీ చెప్పాడు. ఇక అతను కోర్టుకి రాగూడదంటూ  మా ఆవిడ తన దేవుడిని ప్రార్ధించాలి. వస్తే ఫైన్లూ, లైసెన్స్ పాయింట్లు పోవడమూ  వుంటాయి.  అందువల్ల ముందు ముందు వాహన భీమా పెరుగుతుంది. 

కొత్త కారు రిపేరుకి ఇచ్చాం. ఎదుటి కారు రిపేర్ ఖర్చులు కూడా మా వాహన భీమా మీదనే పడుతుందనుకుంటాను. వెరసి మొత్తమ్మీద వచ్చే రెన్యూవలులో వాహన భీమా పెరగడం ఖాయం. మా కారు రిపేరుకి ఎంతవుతుందో ఇంకా తెలియదు కానీ ముందు వెయ్యి డాలర్లు మేము కట్టుకోవాలి - మిగతాది భీమా భరిస్తుంది కానీ ఆతరువాత ఎంచక్కా భీమా పెంచేసి ఇచ్చిన డబ్బులు నెమ్మది నెమ్మదిగా గుంజేస్తుంది.  ఇంకో సమస్యేంటంటే ఇంకో ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా మేమందరం కార్లు నడపాలి.  రెండో ప్రమాదం ఎప్పుడు జరిగినా (బహుశా మూడేళ్ళలో అనుకుంటా) భీమా తారాజువ్వలా పెరిగిపోతుంది. అందుకని చచ్చినట్లు ఒళ్ళు  దగ్గరపెట్టుకొని కారు నడుపుతున్నా.  ఇహ మా ఇంట్లోని మిగతావారు ఎలా నడుపుతారో ఏమో చూడాలి.

ఇన్ని నెలలుగా మ ఆవిడ కారు నడుపుతుంటే ఇంకా ప్రమాదాలు జరగట్లేదే అని ఈమధ్యనే బాగా ముక్కు మీద వేలేసుకున్నా. నా అంచనా ప్రకారం ఇప్పటికి మూడు ఘోరమయిన ప్రమాదాలయినా జరిగివుండాలి కానీ ఓ ఏడాది తరువాత చిన్న ప్రమాదంతో సరిపుచ్చినందుకు సంతోషంగానే వుంది. ఎవరికీ ఏమీ కాలేదు. కారులో అమ్మలు కూడా వుంది అప్పుడు.  కారు నడపడం అంటే ఆట కాదని, అది ఒక బాధ్యత అని ఇప్పటికయినా తనకి భయం ఏర్పడితే అదే పదివేల డాలర్లు. ఆ భయం ఏర్పడటం కోసమే ఇన్నాళ్ళుగా వేచివున్నా.  

ఇక్కడ తాగి కారెక్కితే...(పౌర పోలీసు శిక్షణ నుండి వివరాలు)

షికాగోకి వచ్చిన తొలిరోజుల్లో ఒక రాత్రి పూట రెండు గంటల ప్రాంతంలొ మా ఇంటి ముందు వీధిలో ఫ్లాషింగ్ పోలీసు లైట్లు వెలుగుతుతూవుంటే ఏం జరుగుతోందా అని నేను చీకట్లోనే వుండి నిశ్శబ్దంగా కిటికీలకు వున్న బ్లైండ్స్ కొద్దిగా తొలగించి చూసాను. ఒక కారు వెనకాల పోలీసు కారు వుంది. అందులోని ఓ అమ్మాయిని కిందికి దిగమని ఆదేశించాడు ఆ పోలీసు అధికారి. ఆ తరువాత ఆమెను రకరకాల విన్యాసాలు చెయ్యమని అదేశించాడు. పోలీసులు అలా కూడా చేస్తారని అప్పటిదాకా నాకు తెలియదు కాబట్టి ఆశ్చర్యపడుతూ అలాగే గమనిస్తూ వెళ్ళాను. నెమ్మదిగా అర్ధమయ్యింది ఆ పరీక్షలన్నీ ఆమె బాగా తాగి వుందో లేదో తెలుసుకోవడం కోసమని.

డ్రైవింగ్ అండర్ ఇంఫ్లుయెన్స్ (DUI) గురించి చెబుతూ బాగా తాగిన వారిని ఎలా గుర్తిస్తారో, ఎలాంటి పరీక్షలు చేస్తారో, వాటి పర్యవసనాలు ఏంటో చెబుతూవుంటే నాకు వణుకు పుట్టింది. ఎందుకంటే ఒకసారి అందుకు అరెస్టు అయితే బయటకి రావడానికి కనీసం 6,500 డాలర్లు అవుతాయిట. వాళ్లు చెప్పినదంతా విని ఎంత తాగిన తరువాత కారు ఎక్కకూడదు, ఎక్కువయ్యిందని ఎలా తెలియాలి అని అడిగాను. తాగిన తరువాత కారు తోలకపొవడమే మంచిదని చెప్పారు. తాగని వారినెవరినన్నా డ్రైవ్ చెయ్యమని చెప్పాలని సలహా ఇచ్చారు. లేదా అక్కడే పడుకోవాలి లేదా టాక్సీ తెప్పించుకోవాలి.   ఎందుకంటే మన శరీరం మీద మందు ప్రభావం లెక్క కట్టడం క్లిష్టమయిన లెక్క. ఎంత తాగాం, ఎప్పుడు తాగాం, ఎప్పుడు తిన్నాం, మన మెటబాలిజం, మన వంట్లోని కొవ్వు, బరువు , మన వంట్లోని మిగిలిన చెత్తా చెదారం అన్నీ ప్రభావం చూపిస్తాయి. ఏదో అనుకొని లెక్క తప్పితే పోలీసు కారు వెనకాలే లైట్లు వేసుకుంటూ వస్తే అప్పుడు చచ్చింది గొర్రె అనుకోవాలి. పర్యవసనాలు  కఠినంగా వుంటాయి.

ఉదాహరణకి వంట్లో ఎంత కొవ్వు ఎక్కువుంటే అంతగా మన శరీరం మందుని హరాయించుకోదు. గంటకి ఒక ఆల్కాహాల్ సెర్వింగ్ చొప్పున మన శరీరం జీర్ణం చేసుకుంటుందిట. ఎన్ని సెర్వింగులు తీసుకున్నాం, ఎప్పుడు తీసుకున్నాం దాన్ని బట్టి కూడా వుంటుంది. తాగినవాడు స్టెడీగానే వున్నాననుకోవచ్చు కానీ బయటివాడికి తెలుస్తుంది ఆ తూలుడు. ఇంట్లో తూలితే ఫర్వాలేదు - రోడ్డు మీద మన కారు తూలితేనే వుంటుంది తమాషా.

ఓ మూడేళ్ళ క్రితం మాత్రం బాగా తాగి కారు నడిపాను. మా ఇంటి దగ్గరి మిత్రుడి ఇంట్లో పార్టీకి వెళ్ళి బాగా మందు పుచ్చుకున్నాను. దగ్గరేగా, ఫర్వాలేదులే అని కారు తోలుకుంటూ వచ్చాను. అలాంటప్పుడు పొరపాటున పోలీసులు పసిగట్టి ఆపితే జరిగే పర్యవసానాలు తెలిస్తే అంత పని చెయ్యకపోదును. ఈమధ్య కూడా ఒ రెండు సార్లు తాగి నడిపాను కానీ అంత ఎక్కువ తాగలేదు లెండి. అయితే నేను తక్కువ తాగాననుకున్నది పోలీసులకు ఎక్కువగా అనిపించవచ్చు. అప్పుడు వస్తుంది చిక్కు.

మరీ పెద్ద టపా వ్రాసే ఉద్దేశ్యం లేదు కాబట్టి తాగి పట్టుబడితే జరిగే పర్యవసనాలు వివరంగా వ్రాయలేదు. ఆసక్తి వున్న వారు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. అందుచేత మందు బాబులూ - బహుపరాక్!

మా ఊర్లో గ్యాంగ్ వార్లు

మొన్నటి వారం పౌర పోలీసు శిక్షణలో గ్యాంగుల గురించి చెప్పారు. వాళ్ళు ఎలా వుంటారు వారి మనస్థత్వం ఏంటి, ఎలాంటి ఆయుధాలు వాడుతారు, ఎలాంటి దుస్తులు వేసుకుంటారు, ఎలాంటి ఆభరణాలు ధరిస్తారు, ఎలాంటి చట్ట వ్యతిరేకమయిన కార్యక్రమాలు చేపడుతారు అనేవి అన్నీ ప్రదర్శన వస్తువుల ద్వారా, పోస్టర్ల ద్వారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఇదివరలో నగర వీధుల్లోని గోడల మీద అడ్దదిడ్డమయిన వ్రాతలు చూసి కుర్రాళ్ళు పెంకిగా వ్రాసే గ్రాఫిటీ అనుకునేవాడిని. గ్యాంగులు కూడా తమ తమ టెరిటరీలను ప్రకటిస్తూ తమ గ్యాంగు యొక్క చిహ్నాలను, ఉద్దేశ్యాలను అలా గోడల మీద ప్రకటిస్తారుట. మోడర్న్ ఆర్టులా ఆ వ్రాతలు, చిత్రాలు మనకు గ్యాంగుల గురించి తెలిస్తే తప్ప బోధపడవు. అయినా అవి వాళ్ళు వ్రాసేవి సామాన్య జనాన్ని ఉద్దేశ్యించి కాదు లెండి - ఇతర గ్యాంగులకు అర్ధమవాలని అలా వ్రాస్తారు. 

పోలీసులు ఆయా గ్యాంగులను ఏరిపారేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతారు అయినా ఆ సమస్య ఇంకా మా పట్టణంలో కూడా ఇంకా ఎందుకు వుంది అనేటటువంటి వివరాలు చెప్పారు.  మా టవునులో వున్న గ్యాంగుల పేర్లు, వాటి పనులు చెప్పారు. గ్యాంగ్‌స్టర్స్  ముఖ్యంగా మత్తుమందుల అమ్మకం చేస్తారు.    వారు మత్తుమందులకు అలవాటు పడి వుంటారు కనుక వాటికి కావాలసిన డబ్బు కోసం కూడా దొంగతనాలూ, దోపిడీలూ చేస్తారు. హైస్కూలులో చదువుతున్నప్పటి నుండే గ్యాంగుల్లో రిక్రూట్మెంట్లు జరుగుతాయని, పాఠశాలల్లొ కూడా కుర్ర గ్యాంగు మెంబర్లు వుంటారని తెలిసి ఆశ్చర్యం అనిపించింది. గ్యాంగు సభ్యుల సంజ్ఞలు, సంకేతాలు ఎలా వుంటాయో తెలిసింది. వాళ్ళు పరస్పరం ఎలా సమాచారం అందించుకుంటారో చెప్పారు.  

గ్యాంగుల మధ్య ఎలా యుద్ధాలు జరుగుతాయి, ఎలా వాళ్లు చంపుకుంటారు, ఎలా ఒకరి ప్రాంతపై ఇంకొక ప్రాంతం వారు ఆధిపత్యం ఎలా చెయాయించాలని చూస్తారు అనే వివరాలు కొన్ని సినిమా బిట్స్, మరికొన్ని వీడియో బిట్స్ చూపిస్తూ వివరించారు. మా ఊర్లో జరిగే గ్యాంగ్ యుద్ధాల గురించి కూడా చెప్పారు. మా పక్క కమ్యూనిటిలో గత ఏడాది అనుకుంటా జరిగిన కాల్పుల్లో ఒక అమాయక ప్రాణి బలయ్యాడు అని చెప్పారు. గ్యాంగ్ వార్ జరుగుతుంటే మధ్యలో అతగాడు బలయ్యాడంట. మా పక్క కమ్యూనిటీలో ఆరుగురు మెక్సికన్ గ్యాంగ్‌స్టర్స్(SGD gang) వున్నారని చెప్పడంతో కాస్త అనీజీగా అనిపించింది. అదే కమ్యూనిటీలో నా క్లోజ్ ఫ్రెండ్ వుంటుంటాడు, వారి ఇంటికి తరచుగా వెళుతుంటాం మరి.  సామాన్య జనం జోలికి వారు అంతగా రారు అని తెలియడంతో కాస్త ఊరట అనిపించింది కానీ దొంగతనాలు, దోపిడీలు మాత్రం అన్ని ఇళ్ళల్లో, కార్లల్లో చేస్తూనేవుంటారు కదా. 32 వేల మంది వుండే మా పట్టణంలో సరాసరిన రోజుకో దొంగతనం జరుగుతూవుంటుందిట. 

తెలుగు బ్లాగుల్లో గ్యాంగుల గురించి నేను వారికి ఎదురు బోధిద్దామనుకొని మిన్నకున్నాను.

ఈరోజు సాయంత్రం కూడా మళ్ళీ శిక్షణ వుంది. ఈ రోజు ట్రాఫిక్ పోలీసింగ్ గురించి చెబుతారట. ఈరోజు మమ్మల్ని పోలీసు కార్లల్లో తిప్పుతారని అనుకుంటున్నాం. స్క్వాడ్ కార్లలో వెళుతూ ఆఫీసర్ల విధులు మేము గమనిస్తుండాలనుకుంటా.

అక్షర కూడా సినిమాల్లోకి వస్తే బావుండును

కమల్ హసన్ పెద్ద కూతురు శృతి హసన్ ఫోటోలు చూసినా ఆమె సినిమా కొంతకాలం వరకు చూడకపోవడంతో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ నాకు నచ్చుతుందో లేదో అనుకున్నాను. ఆ మధ్య అనగనగా ఒక ధీరుడు సినిమా కొంత సేపు చూసాను. అందులో ఆమె నచ్చింది. నటన కూడ బాగనిపించింది. బాగానే వుందే అనుకున్నా.   ఈమె 1986 లో పుట్టింది. 

ఆ మధ్య ఓ సందర్భంలో కమల్ హసన్ చిన్న కూతురు అక్షర హసన్ ఫోటోలు చూసి ఎంత బావుందో ఈ అమ్మాయి అనుకున్నా. సినిమాల్లోకి వస్తే బావుండును. ఇంకా చదువుకుంటోందిట. మరి సినిమాల్లోకి ముందుముందు అయినా వస్తుందో రాదో తెలియడం లేదు. ఈమె 1991 లో పుట్టింది.

ఈ అమ్మాయి మీకు కూడ నచ్చిందా లేదా? 

మేమూ దూకేసాంగా

నిన్న దూకుడు సినిమాకి వెళ్ళాం. మహేశూ, సమంతా ఇద్దరూ ఇష్టమయిన వాళ్ళు కావడంతో సినిమాకు వెళ్ళక తప్పలేదు. సమంతా ఇంకాస్త లావుంటే బావుండేది. ఈ సినిమా గురించి ఇప్పటికి చాలామంది చాలా చెప్పేసారు కాబట్టి పెద్దగా నేను చెప్పడానికి ఇంకేమీ లేదు. కానీ ఒకట్రెండు విషయాలు. సినిమా అంటే చెవుల్లో  పూలే అని తెలిసే  వెళతాము కానీ అలా అని మరీ క్యాబేజీ పూలు పెడితేనే చిరాకు వస్తుంది. ఈ సినిమాలో పెద్దాయనకు బయటి ప్రపంచం తెలియకుండా అన్నేళ్ళు అందరూ అలా నాటకాలాడుతూనే వుండటం అనే విషయం నాకంతంగా జీర్ణమయ్యింది కాదు.  ఆ కథా లోపం వున్నా కూడా సినిమాలో మిగతావన్నీ మంచిగా కుదిరాయి కాబట్టి ఆ దూకుడులో ఆ లోటు కొట్టుకుపోతుంది కాబట్టి సినిమా అబవ్ ఏవరేజిగా మిగిలిపోయింది. అలాంటి కొన్ని పొరపాట్లూ సవరించుకొని వుంటే పోకిరీకి దీటుగా దూకేదేమో.

ఈ సారి బాగానే నేను చదివినంత వరకు వెబ్ సైట్లు కానీ, బ్లాగర్లు కానీ కథలోని ముఖ్యమయిన మలుపులు బయటపెట్టలేదు. ఒక వెబ్సైటులో ఒక ట్విస్ట్ గురించి చిన్న హింట్ ఇచ్చి వదిలారు. అదేంటా అనుకుంటూ ఉత్సుకత పడుతూ వుంటే a2z డ్రీంస్ గారు తమ డోంట్ క్లిక్ బ్లాగులో ఎంచక్కా  అది చెప్పెయ్యడంతో నా ఉత్సుకత నీరు కారిపోయింది. సినిమా చూసిన అత్యుత్సాహంలొ అలా చెప్పేసి వుంటారు కానీ చెప్పకపోయివుంటే బావుండేది. ఆ విషయం సినిమా చూస్తూ తెలుసుకుంటే కాస్త సంభ్రమంగా వుండేది. ప్చ్.  

అందుకే అందరికీ ఓ విన్నపం. సినిమాలు చూడండి - ఎలా వుందో చెప్పండి కానీ ముఖ్యమయిన ట్విస్టులన్నీ విప్పదీసి మాకు చూపకండి. నగ్నమయిన సినిమాను చూసేందుకు ఇంకేం మిగిలివుంటుంది?  విశ్లేషకులకు, రంధ్రాన్వేషకులకు  ఇంకా ఎనలైజ్ చెయ్యాలని వుంటుండొచ్చు కానీ మాలాంటి మామూలు జనాలకు కాస్త కాస్త తెలుస్తుంటేనే చూడబుద్ధి అవుతూ వుంటుంది. కదూ. ప్లీజ్.

మాంసాహారంతో మనస్థత్వంలో మహా తేడా :)

అసలే మనకు ఆత్మాభిమానం ఎక్కువ. అన్నిచోట్లా కాదులెండి - అనువైన చోట. హి హీ. ఆ మధ్య వళ్ళు దగ్గరుంచుకొని బ్రతకడం బెటరు కదా బ్రదర్ అనుకొని ఆరోగ్యం చక్కా వుండాలని చాలావరకు ఆకులూ, అలములూ, దుంపలూ, పళ్ళూ, కూరగాయలు తింటూ బ్రతికాను. ఆకులెలా తింటావన్నా అని అప్పుడప్పుడు ఆప్పారావు లాంటివారు ఆశ్చర్యపోతూనే వుండేవారు.

ఈమధ్య జిమ్ములో బరువు లెత్తుతున్నా కదా - కేలరీలు సరిపోవడం లేదని  సాత్వికాహారానికి నమస్తే చెప్పి జనజీవన స్రవంతిలో కలిసేసా. అన్నీ ఫుల్లుగా లాగించేస్తున్నా. బరువు పెరగాలని తిండి ఇంకా దట్టంగా దూర్చేస్తున్నా కానీ అంతగా బరువు పెరగట్లేదనుకోండి. అయితే జిమ్ము చేస్తున్నందువల్లనో లేక సాత్వికాహారం మానివేసినందువల్లనో  కానీ నాలో సాత్విక లక్షణాలు తగ్గి పౌరుషం పొంగుకువస్తోంది. ఇందుకు కైరోప్రాక్టిక్ కూడా కొంత కారణమేమో. చూసి చూసి ఇహ లాభం లేదని  కొంత కాలం FLR ప్రయత్నించిన వాడినల్లా దాన్ని గిరవాటు వేసాను. అలా అలా నా ఆలోచనా రీతుల్లో కొన్ని మార్పులు గమనిస్తున్నాను. ఈ ఉత్సాహం ఎక్కడికి దారితీస్తుందో ఏమో చూడాలి :)

ఇద్దరి మనసులు కలిస్తే...కూడా ఇబ్బందే

చాలామంది పెళ్ళి అయిన జంటలని పరిశీలిస్తే అనిపిస్తూవుంటుంది... దంపతుల్లో ఇద్దరి మనస్థత్వాలు కొన్ని విషయాలలో అయినా మరీ ఒక్కటే అయినా ఇబ్బందే అని. ఆయా విషయాలపై ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే అయినప్పుడు భిన్న కోణాలు స్పృశించే అవకాశం అంతగా వుండదు. ప్రతి దానికీ ప్రతిపక్షం లేకపోతే దూకుడు ఎక్కువవుతుంది. అది మరీ ఎక్కువయినప్పుడు బోల్తా పడొచ్చు. కొన్ని సార్లు బోల్తా పడుతున్నా అర్ధం కాకపోవచ్చు.  ఎందుకంటే బయటి వారు ఎంతమంది వున్నా అలారం బెల్స్ మ్రోగించే పార్ట్నర్ లేకపోతే గుడ్డెద్దు చేలో పడినట్లే వుంటుంది వ్యవహారం.  జత ఎద్దులలో ఒక ఎద్దు గుడ్డిదయినా మరొక ఎద్దుకయినా చూపు సరిగ్గా వుంటే వ్యవహారం బ్యాలన్స్ అవుతుంది. 

మా ఇంట్లో మా నాన్నగారు నాస్తికులుగా వుండేవారు, అమ్మ ఆస్తికురాలు. ఇద్దరూ నన్ను చెరో వైపుకి లాగుతూ 'బ్యాలన్స్' చేస్తుండేవారు! రెండూ తగినంతగా చూసాక మా నాన్న వైపే మొగ్గాననుకోండి. మా నాన్నకి మానవత్వం ఎక్కువ వుండేది. అందువల్ల ఉదారంగా కాస్త దానధర్మాలు చేస్తుండేవారు. అలాంటి వాటిని మా అమ్మ నిగ్రహిస్తుండేది. అలా అమ్మ ఆజమాయిషీ లేకపోతే మా కొద్ది ఆస్థీ హారతి కర్పూరం అయివుండేదేమో.

ఇప్పుడు మా ఇంట్లో మా ఇద్దరికీ అంతగా ఫినాన్షియల్ ఇంటలిజెన్స్ లేకపోయినదువల్ల ఆస్థి అంతగా కూడబెట్టలేకపోయాము. ఆ తెలివి కాస్తో కూస్తో తెచ్చుకుంటున్నా కూడా చిన్నచిన్న పొరపాట్లు జరుగుతూనేవున్నాయ్.  ఇద్దరమూ అలాంటి విషయాల్లో దద్దమ్మలము అవడం మూలాన ఇలాంటి ఇబ్బందులు వుంటాయి. నాకు లోకజ్ఞానం అంతో ఇంతో వున్నా అసలు విషయంలో అంతగా లేకపోయేసరికి ఆస్థులు అంతగా పెరగట్లేదు.   నాకు లేకపోయినా మా ఆవిడకు అయినా ఆ తెలివి వుంటే ఆ లోటుపాట్లు సవరించుకునేది. అంటే ఏదో అప్పుల్లో వున్నామనో, ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నామనో కాదు గానీ ఇతరులతో పొల్చుకుంటే మాత్రం ఎక్కడో వున్నట్లుగా వుంటుంది. ఎవరితో పోల్చుకోకుండా వుంటే బాగానే వుంటుంది :)  మాకు క్రెడిట్ కార్డ్ బ్యాలన్సులు కూడా లేవండీ.     మరీ ఎక్కువ కాకపోయినా నా నెట్ సంపాదనలో  నెలకి  ఇరవై శాతానికి అటో ఇటో అయినా వెనకేస్తున్నా అనుకోండి.  (దాదాపుగా) ఒక్కడి సంపాదనతో ఒక్కత్తే పెళ్ళాం, ఇద్దరు పిల్లలు, రెండు కార్లూ, రెండు చేపలు గట్రా నిభాయించుకువస్తూ ఎక్కువగా పొదుపు చెయ్యాలంటే అవస్థగానే వుంది సుమండీ. ఇంకా నయ్యం ఇంకా నాకు చిన్నిల్లు లేదు :)) ఆ ఒక్కటి కూడా వుంటే మూలిగే నక్క మీద తాటి పండులా వుండేది. సర్లెండి, జస్ట్ కిడ్డింగ్.

కొన్ని కుటుంబాలలో ఇద్దరి మెంటాలిటీలు ఒక్కటే అవటం మూలాన ఇతర సమస్యలు కనిపిస్తుంటాయి. చదువు, విజ్ఞానంతో అతి జాగ్రతా అబ్బి అవి తమ పిల్లల మీద చూపిస్తుంటారు. అలా దంపతులిద్దరూ తమ పిల్లలని మరీ సుకుమారంగా ప్రతి దానికీ హెచ్చరిస్తూ, ప్రతి దానికీ ఖంగారు పడుతూ పెంచేస్తుంటారు. ప్రతీ సారి ఆర్ యు ఆల్రైట్ అని కనుక్కుంటుంటారు. పిల్లలు తప్పటడులు వెయ్యడం సాధారణం, నడక నేర్చుకోవాలంటే ముందు పడిపోక తప్పదు కదా. వీళ్ళ అతి ఎలా వుంటుందంటే ఎక్కడ పడిపోతాడో అని అవి కూడా వెయ్యనివ్వరు. పిల్లలు పెరుగెత్తొద్దు, ఎగరవద్దు, దుమకవద్దు, ఆడుకోవద్దు. ఏం చెయ్యాలి? పెద్దల్లా బుద్ధిగా ఏ టివినో, వీడియో గేమ్సో ఆడుతూ   గడిపెయ్యాలి. అప్పుడు పిల్లలు ఎంచక్కా స్క్రాచ్ ఫ్రీ గా పెరుగుతారు. 

మా ఆవిడ కూడా మా పిల్లలని అతి సుకుమారంగా పెంచాలని మొదట్లో చూసేది కానీ నేను కుదరనిచ్చేవాడిని కాదు. అలా ఆ విషయం బ్యాలన్స్ అయిపోయేది. మన దేశీ తల్లుల్లాగానే  మా పిల్లలు క్లాసుల్లో ఫస్ట్ రావాలని కాస్త తాపత్రయ పడుతుంటుంది కానీ నేను అది బ్యాలన్స్ చేసేస్తుంటాను. మొదటి శ్రేణి కోసం ప్రోత్సహిస్తుంటాను కానీ మొదటగా వుండాలని పట్టుబట్టను. ఎందులోనయినా, తమకు ఇష్టం వచ్చిన ఒక విషయంలో మాత్రం ప్రతిభలో మొదటగా వుండాలని సూచిస్తుంటాను.  పెద్దమ్మాయికి అనైం ఆర్టులో మంచి ప్రతిభ చూపిస్తుంటుంది. తీరిక వున్నప్పుడల్లా  ఆర్ట్ గీస్తుంటుంది. చిన్నమ్మాయి విశేషమయిన ప్రతిభ ఇంకా ఎందులోనూ చూపించడం లేదు కానీ అందుకు తొందరేమీ లేదు.

ఇక కొన్ని విషయాల్లో నావి విప్లవాత్మక భావాలు, ఆమెవి సాంప్రదాయ భావాలు కాబట్టి ఇంట్లో అవి ఆమె బ్యాలన్స్ చేసేస్తుంది. నావి నాస్తిక భావాలు, ఆమెవి ఆస్తిక భావాలు కాబట్టి మా పెద్ద అమ్మాయి ప్రస్తుతానికి అగ్నోస్టిక్కుగా మిగిలిపోయింది. కొన్ని కుంటుబాలలో దంపతులిద్దరికీ మూఢభక్తి వుండటం గమనిస్తుంటాను. అలాంటప్పుడు వారి పిల్లలకి మరో విధంగా ఆలోచించే అవకాశం అంతగా వుండదు. వారితో పాటు వీరూ అస్థమానం పూజలు, పునస్కారాల్లో మునిగితేలుతుంటారు.  మా ఇంట్లో పరస్పర భావాలు వుంటాయి. అంతే కాకుండా మా పిల్లలకి తమకు నచ్చిన జీవన విధానాన్ని ఎంచుకునే స్వేఛ్ఛ కూడా వయస్సుకి, చట్టానికి తగ్గట్టుగా వుంటుంది.

స్వేఛ్ఛ అంటే ఒకటి గుర్తుకు వచ్చింది. ఈమధ్య మా పెద్దమ్మాయి ఇంట్లో  ఆల్కహాల్ వుందా అని అడిగింది. బీర్ వుంది అని చెప్పాను. నేను వాడవచ్చా అని అడిగింది. నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఇదేంటి ఇలా హఠాత్తుగా మందు తాగుతా అంటోంది అని హాశ్చర్యపడిపోయాను.  చట్ట ప్రకారం పిల్లలు అల్కహాల్ సేవించడం ఇక్కడ నేరం అని చెప్పాను. అప్పుడు చెప్పింది - తాగడం కోసం కాదని. అదేదో ముందే చెప్పొచ్చుగా. ఆల్కహాల్, నెయిల్ పెయింట్ కలిపి గోర్ల మీద ఏదో చిన్న ప్రయోగం చెయ్యడానికిట. రక్షించింది.

భార్యాభర్తల మనస్థత్వాల మధ్య మరీ ఎక్కువగా తేడాలున్నా ఇబ్బందే, మరీ ఎక్కువగా కలిసినా కూడా ఇబ్బందే. 60 నుండి 80 శాతం మనస్సులు కలిస్తే మంచిది అనుకుంటా. అంతకంటే ఎక్కువ కలిసినా ఇంట్లోనూ, ఆలోచనల్లోనూ వైవిధ్యానికి ఆస్కారం వుండదు. మరీ ఎక్కువగా తేడాలుంటే వచ్చే ఇబ్బందులు ఏమిటో అందరికీ తెలిసిందే. కొంతమంది తెలివయిన వారు ఇంట్లో బ్యాలన్స్ లేకపోతే మరో చోట అనగా చిన్నిల్లు మరీ పెట్టి బ్యాలన్స్ చేసేస్తుంటారు :) అంటే ఇంట్లో వైవిధ్యం తక్కువయితే అక్కడ వెతుక్కుంటారు. ఇంట్లో ఆ వైవిధ్యమే ఎక్కువయితే అక్కడ తగ్గించి కానీ, తక్కువ వున్న వారిని చూసుకొని గానీ తృప్తిపడుతారు. అంచేత నేను చెప్పేడి ఏంటంటే ఇంట్లో బ్యాలన్స్ మెయింటెయిన్ చెయ్యడం అవసరం అని ;)

ఇంటి నుండి పని!

కొంతమంది ప్రతి రోజూ వర్క్ ఫ్రం హోం చేస్తుంటారు. వారిని చూస్తే నాకు బోలెడు జాలేస్తుంది. హాయిగా ఆఫీసుకి వెళ్ళి కాలక్షేపం చెయ్యకుండా అస్తమానం ఇంట్లో ఎలా వుండబుద్ధవుతుందా అని అనుమానం వేస్తుంటుంది. కొత్తగా పెళ్ళయిన వారయితే భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరు  కొంతకాలం వుండలేరు కాబట్టి అర్ధం చేసుకోవచ్చు. కానీ పెళ్ళయిన సీనీయర్లూ అలా చెయ్యడం అంటే నాకు నమ్మ బుద్ధెయ్యదు. ఇంటికీ, ఆఫీసుకీ తేడా లేకుండా అలా ఇంట్లో పడి ఎలా వుంటారబ్బా! ఆఫీసు పని కోసం ఇంట్లో బేసుమెంటులోనో, పై అంతస్థులోనో ప్రత్యేకమయిన గది ఏర్పాటు చేసుకున్నా కూడా  అహబ్బే నా వల్ల కాదు బాస్.

ఆఫీసుకి వెళితే అదో ఆనందం. కోలీగ్స్ కలుస్తారు, అవో ఇవో విశేషాలు మాట్లాడుకుంటాం. అలా లోకజ్ఞానం అబ్బుతుంది. అస్తమానం పెళ్ళాంతో హస్కు వేసుకుంటే ఏమొస్తుంది? మహా అయితే అత్తోరింటి వైపు రాజకీయాలు మహా బాగా అర్ధమవుతాయేమో. ఇంట్లోంచి పని చేస్తున్నా కూడా కోలీగ్స్ తో ఫోనులోనో, చాటింగులోనో మాట్లాడుతూనే వుంటంగా అని మీరనవచ్చు. అబ్బే, ఆఫీసు కిచెను దగ్గరో, కాఫీ మెషిన్ దగ్గరో బాసులతోనో, తోటి వర్కర్ బీలతోనో జరిగే ముచ్చట్లకి అవి సాటి అవుతాయటండీ.  ఆఫీసుకి వెళితే ఎంత రిలీఫుగా వుంటుంది. ఇంటి యొక్క, ఇంతి యొక్క ఈతి బాధలు హాయిగా మరచిపోవచ్చు. ఇల్లు కన్నా ఆఫీసు పదిలం అనుకోవచ్చు. కాదూ? 

మీ సంగతేమో గానీ, నా సంగతి ఓ సారి సీన్ వేసుకుని చూసుకుందాం. నేనే గనుక అస్తమానం ఇంటి నుండి పని చేసినట్లయితే ఇలా వుంటుంది.

ఏం చేస్తున్నారు?
పని చేస్తున్నా.
చాల్లెండి. సంబడం. ఇంట్లో పాలు అయిపోయాయి. డొమినిక్సుకు వెళ్ళి కాస్త తెచ్చి పెడుదురూ.
పనే.
అబ్బ జోకులు.
?!
(ఇంట్లో అంతటి గౌరవ వాచకాలు ఏమీ వుండవు లెండి కానీ తేడా తెలియడం కోసం అలా పెట్టా ) 

అదే ఆఫీసులో అయితే నన్ను అడిగే వాడు వుండడు. పని చేస్తున్నా అంటే గౌరవిస్తారు, డిస్ట్రబ్ చెయ్యకుండా దూరం జరుగుతారు కానీ ఇలా నవ్వి పడెయ్యరు.

పిల్లలు పెందరాళే ఇంటికి వస్తారు కదా.

డాడీ, డాడీ.
ఏమ్మా.
అక్క గిచ్చింది.
అమ్మతో చెప్పు.
అమ్మ టివి సీరియల్లుతో బాగా బ్యుజీట. నీకే చెప్పమంది.
పనిలో వున్నా కదా.
అక్క గిచ్చింది.
పనిలో...
అక్క....
ప...
అ...

మీ సలహా నాకు తెలుసు. పని చేసేటప్పుడు గది తలుపులు వేసుకొమ్మంటారు కదూ. అలా అయితే తలుపులు బాదుతారే. అయినా తియ్యకపోతే సెల్లుకి ఫోను చేస్తారే.    ఆఫీసులో అయితే నా గది తలుపులేసుకొని పని చేసుకుంటున్నా ఎవరూ అంతరాయం కలిగించరు. ఎప్పుడో ఒకరోజు అంటే ఏమో గానీ అస్తమానం ఇంటి నుండి పని అంటే నా వల్ల కాదండి బాబూ. కాదు.

వర్కింగ్ ఫ్రం హోం గురించి టొరొంటో స్టార్ ఆర్టికల్:
http://www.thestar.com/business/article/1057487--are-you-reading-this-in-your-pyjamas?bn=1

సమ్మెల వల్ల సకల లాభాలు

నాయకత్వ లక్షణాలు: ఊరకే ఎవడి పని వాడు చేసుకుంటూపోతే వారిలో వున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా బయటపడుతాయి? సమ్మెల్లో విధ్వంసం చెయ్యడానికి చాలా మందికి నేతృత్వం వహించాల్సి వుంటుంది. ఎన్ని షట్టర్లు ధ్వంసం చేస్తే, ఎన్ని బస్సులు కాల్చివేస్తే అంత గొప్ప నాయకుడు అన్నమాట. ఇలా సమ్మెలలో నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాక బాగా ఎదిగిపోయి రాజకీయనాయకుడు అయిపోయి దేశానికి ఎంచక్కా సేవ చెయ్యొచ్చు.

విశ్రాంతి: కొందరు పొట్ట గడవడం కోసమో, అధిక ఆదాయం కోసం కుటుంబ సమయాన్ని వీలయినంతగా త్యాగం చేసేసి మరీ పనిలోనికి వెళుతుంటారు. ఇలాంటివారికీ, అందరికీ పెళ్ళాం, పిల్లలతో మరియు బంధు మిత్రులతో బాగా  సమయం గడపడానికి అవకాశం చిక్కుతుంది.

ఒత్తిడి నుండి విముక్తి: చాలామందికి తమ ఆగ్రహావేశాలను బయటికి ప్రకటించి తమలోని ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం వస్తుంది. పాశ్చాత్య దేశాల్లోని ప్రజలు చాలా పిరికి వారు. వారికి ప్రభుత్వం మీద కోపం వస్తే సాధారణంగా రోడ్డు  మీదకి ఎక్కి ఆందోళనలు చెయ్యరు. ఎవరికివారు ఆనందంగా ఆత్మహత్యలు చేసుకొని చచ్చూరుకుంటారు.  మనవారికి అంత అగత్యం లేదు. ప్రభుత్వం మీద కోపం వస్తే పక్కనే వున్న బస్సు అద్దాలు పగలగొట్టి మన ఆగ్రహాన్ని తీర్చుకుంటాం.

వైవిధ్యం: అన్ని రోజులూ ఒకేలా వుంటే ఏం బావుంటుంది. మాలాగా ప్రతి పని రోజూ కాళ్ళీడ్చుకుంటూ పనికి వెళితే ఏం ఆనందం వుంటుంది? అప్పుడో ఇప్పుడో బందులో, సమ్మెలో జరిగితే ఆ మోనాటనీ పోతుంది. అందువల్ల మనలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. సమయం లేక ఎన్నాళ్ళ నుండో వాయిదా వేసుకున్న పనులు చక్కపెట్టుకోవడానికి వీలు కుదురుతుంది.

ఇలా సమ్మెల వల్ల ఇంకెన్నో ప్రయోజనాలు వుంటుండవచ్చు. మిగతావి మీరు అందించండి. అయితే నాదో సందేహం. ఎన్నడన్నా ఒకరోజు సమ్మె అంటే బాగానే వుంటుంది కానీ ప్రతి రోజూ సమ్మె రోజు అయితే కూడా బాగానే వుంటుందంటారా?

ఏం సాంఘిక భద్రతో ఏంటో!

సోషల్ సెక్యూరిటీ పన్ను క్రింద ప్రతి పే చెక్కు వచ్చినప్పుడల్లా వేతనంలో నుండి కొంత శాతం ఇక్కడి ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తుంది. పోనీలే పని నుండి విరమించాక ప్రభుత్వం ఆ డబ్బులతో పోషిస్తుంది కదా అని సముదాయించుకుంటాము. కానీ పరిస్థితులు ఇలాగే వుంటే కనుక భవిష్యత్తులో అంత దృశ్యం లేదని అర్ధం అవుతోంది. ఎందుకంటే అమెరికాకి అప్పులు ఎక్కువయ్యి యుద్ధాలు గట్రా చెయ్యడానికి చైనా ఇచ్చిన అప్పులు కూడా సరిపోక సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ మళ్ళీ ఇచ్చెస్తాములే అని చెప్పి తోడేసింది. అలా 2 ట్రిలియన్ డాలర్లు అమెరికా సంగ్రహించింది. మళ్ళీ తిరిగి ఇచ్చెంత సీను లేదు. రోజులు గడవడానికే డబ్బులు సరిపొవడం లేదు. ఇంకా చేసిన అప్పులు తిరిగి ఇచ్చే దృశ్యం ఎక్కడిది ఈ ప్రభుత్వానికి?

పరిస్థితులు ఎలాగే ఏడిస్తే 2040 తరువాత సోషల్ సెక్యూరిటీ సిస్టం దివాలా తీస్తుందిట. అనగా నేను రిటైర్ అయ్యే సమయానికి సాంఘిక భద్రత కూడా టైర్ అవుతుందన్నమాట. ఇప్పటిదాకా నేను కడుతున్న ఆ పన్ను అంతా నా వరకు వచ్చేసరికి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది ఎంచక్కా. ఖర్చులో కోతలు ససేమిరా వీల్లేదని డెమోక్రాట్లూ, పన్నులు పెంచేదేలేదని రిపబ్లికన్లూ భీష్మించుకు కూర్చున్నారు కనుక సిచువేషన్ ఇప్పట్లో మారేంత సీన్ సుదూరంగా ఇప్పటికయితే కనిపించడం లేదు. అటు వైపున వరుసపెట్టి యూరోపియన్ దేశాలు దివాళా అంచున నడుస్తున్నాయి కాబట్టి అవన్నీ కలిసి ఐఎమెఫ్ వైపుకో, చైనా వైపుకో సహాయం కోసం చూస్తున్నాయి కాబట్టి  ముందు ముందు ప్రపంచ ఆర్ధిక దృశ్యం ఎలా వుంటుందో అవగతమే కాకుండా వుంది. 

ఏదిఏమయినా సాంఘిక భద్రత పన్ను ఎగ్గొట్టేంత సీను లేదు కాబట్టి ఏడ్చుకుంటూ అయినా అది కట్టుకోక తప్పదు. ఇన్నేళ్ళుగా మారని దృశ్యం వచ్చే ఈ ఇరవై అయుదు ఏళ్ళలో నయినా మారకపోతుందా, అద్భుతాలు జరక్కపోతాయా అని మాత్రం ఆశాభావంతో అయితే వుండగలను కదా.

సోషల్ సెక్యూరిటీ పరిస్థితి గురించి మరింత తెలుసుకోవాలంటే క్రింది లింక్ క్లిక్ చెయ్యండి. 

మాకు కూడా బందులుంటే ఎంత బాగుండును

తెలంగాణాలో అందరూ బంద్ పండగ చేసుకుంటున్నారు. ఉద్యమం పుణ్యమా అని ప్రతి కొన్ని వారాలకూ బందులూ, హర్తాళ్ళూ వచ్చి చాలా బాగా కాలక్షేపం చేస్తున్నారు. మా అమ్రికా వాళ్లకి కూడా మనవాళ్ళు బందుల్లో పాఠాలు నేర్పిస్తే బావుండును. ప్రతీ పని రోజూ అఫీసుకి వెళ్ళక్కర్లేకుండా ఎంచక్కా ఇంట్లోనే మునగదీసుకొని కొన్ని రోజులయినా పడకేసేవాడిని.  

సమ్మె వల్ల కరెంటు కొన్ని గంటలయినా కట్టంటున్నారు కదా. ఇంకేం, టివిలు గట్రా చూడకుండా ఎంచక్కా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యొచ్చు.

ఏంటో ఇక్కడంతా బోరుగా వుంది - బందులు లేక ఒక్క రోజన్నా పనికి బంద్ అయ్యే అవకాశమూ లేదు, అనారోగ్యం అంతగా రాదు కాబట్టి ఎక్కువగా సిక్కవనూలేము. అనగా సిక్ లీవ్ పెట్టుకోలేము. నిజ్జంగా అనారోగ్యం పాలిట బడ్డా  అనుమానంగానే చూస్తారు. ఇండియాలోనయితే ఎంచక్కా రోజుల తరబడి జ్వరాలు వస్తాయి. హాయిగా అందరి సేవలు పొందుతూ, పని ఎగ్గొట్టి విశ్రాంతి పొందవచ్చు. అందుకే ఇండియాను చూస్తే ఈర్ష్య నాకు. 

నిఖితకి నీరాజనం

ఈ టపా కొద్దిరోజుల నుండి వ్రాద్దామనుకుంటూనే ఆలస్యం యిపోయింది. ఈలోగా ఆ నటిపై వున్న నిషేధం తొలగించారు. ఏ నిర్మాతతోనో సంబంధాలున్నాయని  ఈ నటిని నిర్మాతల సంఘం నిషేధించడాన్ని ఏవగించుకున్నాను. ఆ నటికి మద్దతు పలికిన ఖుష్బూ, రాజమౌళి తదితరులను అభినందిస్తున్నాను. అది ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయం మరియు ఏదయినా తప్పు వుంటే నిర్ధారించాల్సింది కోర్టు కానీ నిర్మాతల సంఘం కాదనే ఖుష్బూ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. 

కన్నడ నిర్మాతల సంఘం పొరపాటు సవరించుకున్నందుకు సంతోషం. 

పెద్దల, పిల్లల నేర చట్టాల గురించి తెలుసుకున్నాం

నిన్నటి పౌర పోలీసు శిక్షణలో పెద్దల చట్టం గురించీ, పిల్లల చట్టం గురించీ వివరిస్తూ వాటిల్లోని కొన్ని తేడాలను  వివరించింది లేడీ ఆఫీసర్. ఆమె సివిల్ దుస్తుల్లో వున్నా కూడా నడుముకి పిస్టల్ పెట్టుకొని డైనమిక్ గా అనిపించింది. ఆమె కాస్త అందంగానే వుండటంతో ఆమె లెక్చర్ వింటున్న నాకు ఉత్సాహంగా అనిపించింది. ఆమె పోలీసు అనుభవాలు రంగరించి ఉపన్యాసం ఇచ్చింది. మధ్యలో మమ్మలందరినీ నాలుగు గ్రూపులుగా వివరించి ఒక్కో గ్రూపుకీ ఒక్కో కేస్ స్టడీ ఇచ్చి అవి పరిష్కరించమని కోరింది. తరువాత అందరికీ ఇచ్చిన కేస్ స్టడీలకు వివరణలు ఇచ్చింది. 

మా పక్క గ్రూపుకి ఆసక్తికరమయిన కేస్ స్టడీ వచ్చింది. అది ఆ ఆఫీసర్ నిజ జీవిత అనుభవం అట. ఒక కారు వెళుతుండగా ఆమె పట్టుకుంటే అందులో మత్తు మందులు దొరికాయి. ఎవరూ కూడా అవి మావి కాదు అంటే మావి కాదు అంటున్నారంట. మరి ఎవర్ని అరెస్టు చెయ్యాలి? అందర్నీనా? కుదర్దు. ఎందుకంటే అందులో ఒకరు పది నెలల పసి బాలుడు! సరే ఆ అబ్బాయిని వదిలేద్దాం కానీ మరి ఎవర్ని అరెస్ట్ చెయ్యాలి. ఆ మత్తు మందులు ఎవరి దగ్గర వున్నాయో వారిని. కదా. అవి ఆ అబ్బాయి సీటు కింద వున్నాయిట మరి. ఇప్పుడు? అందరం తలా ఒక సమాధానం చెప్పాం. ఆమె మాత్రం మిగతా ముగ్గురినీ అరెస్ట్ చేసేసిందిట.  అందులో ఖచ్చితంగా ఎవరి తప్పువుందో తేల్చే బాధ్యత తనది కాదనీ అది లాయర్ల, న్యాయాధీశుల మరియు జ్యూరీల యొక్క బాధ్యత అని తేల్చివేసింది.

జూవనైల్ లా గురించి చెబుతూ ఒక దృష్టాంతరం చెప్పింది. ఒక రోజు 911 కాల్ వస్తే ఒక ఇంటికి వెళ్ళిందిట. అక్కడ పదహారేళ్ళ అమ్మాయి తన తండ్రిని అప్పటికప్పుడు అరెస్ట్ చెయ్యమని డిమాండ్ చేస్తోందిట. ఎందుకంటే ఆ తండ్రి ఆ అమ్మాయి చెంప మీద చాచి ఒక్కటి కొట్టాడంట.  ఎక్కడ కొట్టినా దాదాపుగా ఓకే కానీ తల భాగం మీద కొడితే మాత్రం సీరియస్ కేస్ అవచ్చు. క్రమశిక్షణ కోసం అయినా కూడా ఇక్కడి పిల్లలని తల మీద మాత్రం కొట్టవద్దు. ఇక్కడి తల్లితండ్రులూ గుర్తుంచుకోండి!  ఇక్కడి చట్టం ప్రకారం ఆ తండ్రి చేసింది నేరమే...కానీ... అంతకు ముందే ఆమె చెప్పింది... చట్టం శిలా శాసనం కాదని! దాని ఎవరు నిర్వచిస్తున్నారు అనే దాన్ని బట్టి అర్ధం మారిపోతుంది. పోలీసు అధికారులు, లాయర్లు, జడ్జిలు, జ్యూరీలు అలా తలా ఒకరకంగా చట్టాన్ని నిర్వచించవచ్చు. అలా అని మరీ అడ్డంగా నిర్వచిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి కానీ ఎవరికి వారు తమ విచక్షణా శక్తిని సరిగా వినియోగించాలి. పిల్లల విషయం కాబట్టి పిల్లల సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

ఇక్కడ ఆమె తన విచక్షణాధికారం వినియోగించి ఆ తండ్రికి మీ అమ్మాయిని మీరు ఇంకా గట్టిగా చెంప దెబ్బ కొట్టాల్సి వుండింది అని సలహా ఇచ్చిందిట. ఎందుకంటే ఆ 911 కాల్ వచ్చింది రాత్రి మూడు గంటల తరువాత. అప్పుడు వెళ్ళి ఆ అమ్మాయిని మీ నాన్న ఎందుకు కొట్టాడూ అని అడిగితే మా నాన్న రోజూ 9 గంటల వరకల్లా ఇంటికి రమ్మంటాడు కానీ ఈ రోజు వచ్చేసరికి   రాత్రి మూడు అయ్యింది. అందుకే కొట్టాడూ అని చెప్పిందిట. ఆ అమ్మాయి రాత్రి మూడింటి వరకూ బాయ్ ఫ్రెండుతో తిరిగి వస్తోంది మరి. అందుకే ఆ తండ్రికి ఆ సలహా ఇచ్చి చక్కా వచ్చింది మా ఆఫీసర్. లెక్క ప్రకారం అయితే, చట్ట ప్రకారం అయితే ఆ తండ్రిదే తప్పు కానీ పరిస్థితులు కూడా గమనించుకోవాలని పిల్లల చట్టంలో వుంటుందిట.  

తప్పనిసరి అయిన స్వఛ్ఛందం

మంచి మంచి కాలీజీలలో మంచి మంచి కోర్సులకు సీట్లు రావాలంటే ఇతర అర్హతలతో పాటుగా ఎంత మాత్రం స్వచ్చంద సేవ చేసేరేంటీ అని కూడా ఇక్కడ కాలీజీల వాళ్ళు చూస్తారు. అందువల్ల కొంతమంది హైస్కూలు పిల్లలు తప్పనిసరిగా స్వచ్చంద సేవకి వెళుతున్నారు. మా పెద్దమ్మాయి కూడా వాలంటరీ వర్క్ మొదలెట్టింది. ఒక మంచి హాస్పిటలును సంప్రదిస్తే ఒక నర్సింగ్ హోములో ఆ అవకాశం ఇచ్చారు. నిన్న ఉత్సాహంగా తొలిసారిగా వెళ్ళిన తను నీరసంగా ఇంటికి వచ్చింది. అది ఓల్డేజ్ హోముట. వృద్ధులకు కబుర్లు చెబుతూ కాలక్షేపం కలిగించాలిట.

అస్తమానం కంప్యూటర్లో జీవించే బదులు ఇలా వృద్ధులతో వారానికి కొన్ని గంటలయినా గడిపితే వాస్తవ జీవితం అవగతమవుతుంది అని మేము ప్రొత్సహిస్తూవస్తున్నాం కానీ వచ్చే వారానికల్లా తను ఏమంటుందో తెలియదు. ఇప్పటికయితే ముసలాళ్లందరూ బుర్ర తింటున్నారని బుర్ర పట్టుకుంది.  మా చిన్నమ్మాయి (అమ్మలు) కి అదే అవకాశం వచ్చివుంటే నర్సింగ్ హోములోని వారందరి బుర్రలూ ఫ్రై చేసి తనే తినేసేది.

కొన్ని వారాలు చూసి ఈ స్వఛ్చంద సేవ ఇష్టం లేకపోతే తనకు ఇష్టమయిన మరో ప్రాంతంలో ఏమయినా స్వఛ్చందానికి అవకాశం కలిగిస్తారేమో తెలుసుకుంటాం.

స్వఛ్ఛందాలు స్వఛ్ఛందంగా వుండాలి కానీ ఇలా వీటికీ, విద్యకీ ముడిపెడితే ఇలాంటివన్నీ తప్పనిసరి తద్దినాలయి కూర్చుంటాయి. అలా వీటికి ప్రాధాన్యత నిచ్చే ఉద్దేశ్యం మంచిదే కావచ్చు కానీ ఆచరణలో బెడిసికొడతాయి. నా యుక్తవయస్సులో చాలా సార్లు స్వఛ్చంద సేవ చేసాను కానీ అన్నీ ఇష్టమయ్యే చేసాను - తప్పనిసరి అయ్యి కాదు.

ఈ నాస్తికుడి నారాయణ వ్రతం!

మా ఆవిడ సత్య నారాయణ వ్రతం చెయ్యాలనుకుంటోందని కొన్ని నెలల క్రితం ఓ టపాలో సెలవిచ్చాను.  మొత్తమ్మీద కొన్ని వారాల క్రితం అరోరాలోని దేవాలయంలో ఆ వ్రతం జరిగింది. అందులో నేను పాల్గొనిన విధం బెట్టిదన...

వ్రతం అంటే మామూలుగానే నేను రానని మొరాయించాను. నా వీక్ పాయింట్లు మా ఆవిడకి బాహ్గా తెలుసు కదా. అక్కడ ఫుడ్డు పెట్టిస్తానని చెప్పింది. గంగిరెద్దులా తలాడించి పోలోమంటూ బయల్దేరాను. నా దారిన నేను తింటూ వుంటే తన దారిన తాను వ్రతం చేసుకుంటుంది కదా అనేది నా ప్రగాఢ నమ్మకం. ఆలయాల్లో పెట్టే అహారం కమ్మగా వుంటుంది. అందుకే అక్కడ తినడం అంటే నాకు ఇష్టమే. అదే కాకుండా ఈ వ్రతం జరిగాక ఇచ్చే ప్రసాదం బావుంటుంది. ఏదో పిండిలో పాలు, అరటి పళ్ళూ కలిపి ఇస్తారు.  ఆ ప్రసాదం తినడం చిన్నప్పటి నుండీ నాకు ఇష్టం.

మా పొరుగింటి వారు కూడా అదే వ్రతం కోసమై అక్కడికి వెళుతున్నారు. గుడికి వెళ్ళాక ఇంకా చాలా జంటలు అక్కడ వరుసగా కూర్చున్నాయి. మా ఆవిడ కాస్సేపు కూర్చొమ్మంది. సరే ఓ పది నిమిషాలు కూర్చొని వెళ్దాములే అని అక్కడ ఆసీనుడిని అయ్యాను. పూజ మొదలయ్యింది. కాస్సేపయ్యాక లేవబోతుండగా పూజ మధ్యలో అలా లేవకూడదని మా పక్కింటి మిత్రుడు హెచ్చరించాడు. నేను బుక్కయ్యాననుకొని బిక్కచచ్చిపోయి పూజ ఎంతసేపు వుంటుందేంటి అని అడిగాను. మహా అయితే ఓ గంట వుండొచ్చు అని చెప్పాడు. మధ్యలో లేచి వెళితే పూజారి శపిస్తాడేమో అని ఓపిగ్గా కూర్చున్నాను.

మిగతా సమయమంతా సౌందర్యారాధన చేస్తూ గడిపాను. అపార్ధం చేసుకోకండి. తళతళలాడుతున్న డిజైన్ స్టీలు ప్లేటులో వివిధ రకాల పూలు, పళ్ళు, పొడులూ చూస్తుంటే చూడముచ్చటగా అనిపించాయి. అలా అందరి పళ్ళాలూ గమనిస్తూ గడిపాను. గంట అయినా ఆ వ్రతం అవలేదు. ఇంకొద్దిసేపట్లో అయిపోతుందేమోనని చూసా కానీ అది అయ్యే సూచనలు అనిపించలా. నాకేమో బాగా ఆకలవుతోంది. మిగతా జంటల్లోని ఒకరిద్దరు స్త్రీలు కాస్సేపు బయటకి వెళ్ళి మళ్ళీ వచ్చారు. దాంతో నాకు ధైర్యం వచింది. మా ఆవిడకి ఓ నమస్కారం పెట్టేసి కాఫిటీరియాకి వచ్చాను. ఇక్కడ నేను ఆహార వ్రతం చేస్తుండగా అక్కడ మా ఆవిడ ఆ వ్రతం చేసేసింది. 

ఆ వ్రతం మూడు గంటలు పట్టిందండీ బాబూ. అక్కడే కూర్చొని వుంటే అలాగే అవస్థ పడేవాడిని. మామూలుగా అయితే మళ్ళీ రానని ప్రసాదం పెడుతున్నారని ఫోను చేసి పిలిచింది. పరుగుపరుగున వెళ్ళాను. అక్కడికి వచ్చిన జంటలు అందరూ తాము తెచ్చిన ప్రసాదం అందరికీ పంచారు. నాకు అలా బాగానే గిట్టుబాటు అయ్యింది లెండి.  నేను ఓ గంట సేపయినా వ్రతంలో పక్కన కూర్చున్నందుకు మా ఆవిడా సంతోషించింది - తిండి గిట్టుబాటు అయినందుకు నేనూ సంతోషించాను.

ఆ తరువాత కొన్ని రోజులకి మా చుట్టాలతో మా అనిత మాట్లాడుతూ ఈ సారి వ్రతంలో శరత్ కూడా కూర్చున్నాడు అని చెప్పింది. అది విని నేను నన్ను చీట్ చేసి తీసుకెళ్ళింది అని వారికి చెప్పాను. కదా! అలా వ్రతాలకు కూడా లంచం ఇవ్వడం అవినీతి కాదూ?       

ఇంకా నయ్యం - ఆ సంఘటణ మేము వున్న ఇంట్లో జరుగలేదు!

సిటెజెన్ పోలీస్ శిక్షణకి వెళుతున్నా కదా. నిన్న పోలీస్ డాగ్ ట్రైనర్ కుక్కలకి పోలీసు శిక్షణ ఎలా ఇస్తారో వివరించాడు. పోలీసు కుక్కని తెచ్చి మా ముందు రకరకాల ప్రదర్శనలు ఇప్పించారు. అవి ఎలా దొంగలని పట్టుకుంటాయి, ఎలా మత్తు మందులని పట్టుకుంటాయి లాంటి విషయాలు తెలిసాయి. ఫేక్ హీరాయిన్ వాసన కూడా చూపించారు - చింతపండు వాసనలా వుంది. ఒక రెండు రోజుల క్రితమే ఒక వెయ్యి కిలోల మత్తుమందులు ఈ కుక్కల సహాయంతో ఎలా పట్టుకున్నది ఫోటోలతో సహా వివరించారు.

ఆ తరువాత మా టవునులో నేరాలు నిరోధించే చర్యల గురించి వివరించారు. అలా అలా చర్చ హత్యల మీదికి మళ్ళింది. సగటున ఏడాదికి ఒక హత్య చొప్పున మా పట్టణంలో జరుగుతూ వుంటాయిట. చాలామంది హంతకులను పట్టుకున్నా కూడా కొన్ని కొన్ని హత్యలు ఇంకా మిస్టరీలు గానే వున్నాయి అని చెబుతూ కొన్నేళ్ళ క్రితం జరిగిన ఒక హత్య గురించి వివరించారు. ఒక నల్ల యువతినీ ఇరవై ఏళ్ళ క్రితం (1991 లో) ఎవరో హత్య చేసారు. హంతకుడో లేక ఈ విషయం తెలిసిన మరెవ్వరో 911 కి ఫోను చేసి ఒక యువతి ప్రాణాపాయ స్థితిలో వుంది అని చెప్పారంట. అతగాడి 911 ఫోన్ రికార్డింగుని మాకు వినిపించారు. అందులో అడ్రసు విని ఆశ్చర్యం చెందాను. మూడు నెలల క్రితం వరకు మేము వున్న కమ్యూనిటీలోనే  - మా ఇంటి పక్కనే ( Court లోనే) అది.   ఇంకా నయ్యం ఆ హత్య మేము కిరాయికి వున్న ఇంట్లో జరుగలేదు అని ఊపిరి పీల్చుకున్నాను. ఎప్పటి సంఘటణో అనుకోండి కానీ ఎంతయినా ఓ హత్య జరిగిన ఇంట్లో వుండి వచ్చాం అంటే ఏదోలా వుంటుంది కదా.

క్రితం సారి తరగతిలో మాకు మా పోలీసు స్టేషనులోని 911 (ఎమెర్జెన్సీ కాల్) సెంటర్ కూడా చూపించారు. నేను రోజూ రైలు ఎక్కే స్టేషనును కూడా వాళ్ళు ఇక్కడి నుండి క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలతో గమనిస్తున్నారు! అప్పుడప్పుడు రాత్రుళ్ళు ఆలస్యంగా అక్కడ వేచి వుండాల్సి వచ్చినప్పుడు కాస్త బెదురుగా వుంటుంది. ఇప్పుడు వీళ్ళు గమనిస్తారు అని తెలిసాక కాస్త ధైర్యంగా అనిపించింది. అప్పుడే ఒకతను అక్కడ రెస్ట్ రూముకి వెళుతూ తలుపు వేసుకోవడం గమనించి నవ్వుకున్నాం.
అయితే అప్పుడు అక్కడ ఒకే ఒక్క 911 అధికారి వున్నాడు. అతను ప్రకృతి పిలుపులకి వెళ్ళాల్సి వస్తే అత్యవసర పిలుపులు ఎవరు అందుకుంటారు అనే ప్రశ్న ఉదయించింది. అది అడగబోయేంతలో మాకు వివరణ లభించింది. ఎప్పుడయినా అక్కడ కనీసం ఇద్దరు వుంటారని చెప్పారు. మరి ఇంకో అధికారి ఎక్కడ? ప్రకృతి పిలుపుకి స్పందిస్తున్నాడంట.

ఆ కాస్త పని అయ్యాకా నేనూ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో దూకుతా

ఎందరెందరో మహానుభావులు ఉద్యమాలు చేసారు, కొందరు ఆస్థిపాస్థులు ప్రకటించారు. ఆ మధ్య అందరూ అవినీతి మీద ఆవేశంతో టపాలు, వ్యాఖ్యలూ వ్రాస్తూవుంటే నేను కక్కలేక, మింగలేక, కీబోర్డ్ నలుపుకుంటూ, బ్లాగు నొక్కుకుంటూ అలా ఊరకే చూస్తూ వుండాల్సొచ్చింది.  అంటే నేనప్పుడు ఆవేశంగా టపా వ్రాయకపోతే ఏదో జరిగిపోద్ది అని కాదు కానీ నేను కూడా అవినీతి కోసం అందరిలాగా ఓ సమిధని కాలేకపోతున్నానే అని మనస్సులో బావురుమన్నాను. ఆ తరువాత ఊరడించుకున్నాను. మొత్తమ్మీద మౌనం వహించాను. అది మామూలు మౌనమా? కానే కాదు - అది వ్యూహాత్మక మౌనం. వ్యూ.మౌ. కి డిఫినిషన్లు గట్రా కావాలంటే కెసీఆరును అడుక్కోండి. మొత్తమ్మీద అందరూ చప్పజల్లారు అని నిర్ధారించుకొని నేను కలుగులోంచి ఎలుకలాగా ఈ విషయంపై తొంగిచూస్తున్నా.

ఎందుకు అలా మౌనం వహించాలని నన్ను నిగ్గదీసి అడగండి. మీరెవరూ నన్ను అలా అడిగేంత దృశ్యం నాకు లేదు కాబట్టి నేనే చెప్పుకుంటా.  నేను అవినీతి పరుడిని కాబట్టి అలా కాం గా వున్నానా? ఎంతమాటన్నారు! నేను చచ్చినా అవినీతి పరుడిని కాను, కాలేను. అలాంటి అవకాశమే లేదు (కనుక). ఈ విషయంపై నాకు కొన్ని ధర్మ సందేహాలు వున్నాయి. అవినీతి స్వంతంగా చేస్తేనే అవినీతి పరుడు అంటారా లేక అవినీతికి సహకరించేవారిని కూడా అంటారా? ఉదాహరణకు లంచం తీసుకునేవాడిని అలా అంటారు కానీ ఇచ్చినవాడిని అనరు కదా. కానీ అవినీతికి సహకరించడం అంటారా? ఇష్టమయి చేస్తే సహకారం అవుతుంది కానీ తప్పనిసరి అయి చేస్తే అది సహకారం ఎలా అవుతుందీ? మనం లంచం ఏమయినా ఇష్టమయి ఇస్తామా ఏంటీ, తప్పదు కాబట్టి ముక్కు మూసుకొని అయినా కక్కేస్తాం.

ఈమధ్య ఇండియాలో ఒక పని మొదలెట్టాను. అందుకు గాను నేను లంచాలు ఇచ్చే పరిస్థితి లేకపోయినా  అంతో ఇంతో అవినీతికి ఎంతో కొంత సహకరించకతప్పదు. అక్కడున్న వారికి అవన్నీ సాధారణమే కాబట్టి అసలు వారికి ఇది ఓ అవినీతిలాగా కనిపించనే కనిపించదు. అయినా సరే ఆ మాత్రం కూడా సహకరించనని మాట వరుసకి మడిగట్టుకొని కూర్చున్నా అనుకోండీ నాకు బ్యాండ్ పడిపోతుంది. అలా నా నీతి వ్రతానికి గాను ఇంట్లోనూ బ్యాండ్ పడుతుంది. అలా రెండు విధాలా ఇప్పుడు నాకు బ్యాండ్ మేళాలు అవసరం అంటారా చెప్పండి?

అంచేతా, ఆ కాస్తా పని శుబ్బరంగా పూర్తయ్యాకా తాజాగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలోకి దూకేస్తానేం.  

అవినీతి వల్ల లాభాలు

- పనులు తొందరగా జరుగుతాయి. అవినీతి అంతగా లేని దేశాల్లో అధికారులు లంచమూ తీసుకోరు, పనులూ చేయరు. భారత్ లో అయితే లంచం తీసుకొని అయినా పనులు త్వరగా చేస్తారు. యు ఎస్ లాంటి దేశాల్లో లంచాలు తీసుకోరు కనుక ప్రభుత్వ పనులు తొందరగా జరగవు. చిన్న పనికోసం నెలలకు నెలలు తీసుకుంటారు. 

- అవినీతితో సంపాదిస్తే ఇంట్లో పెళ్ళాం, పిల్లలూ మెచ్చుకుంటారు. సాధారణంగా వాళ్లకి కావాలిసింది వాళ్ల కోరికలూ, సరదాలూ తీరడం కానీ డబ్బు ఎక్కడనుండి వచ్చింది అనేది పట్టించుకోరు.  పైగా ప్రోత్సహిస్తారు కూడానూ. లంచం తీసుకొనే అవకాశం వున్నా కూడా తీసుకోకుండా మడి కట్టుకొని వుంటే ఇంట్లో వాళ్ళు అలాంటి వారిని సన్నాసుల్లా చూస్తారనేది నా ప్రగాఢాభిప్రాయం.  నా అదృష్టం కొద్దీ నేను అందరికీ లంచం ఇవ్వడమే కానీ నాకు ఎవరూ లంచం ఇచ్చే స్థితి లేదు. అలాంటి స్థాయే వుంటే లంచం తీసుకోకా, ఇంట్లో ఆ ప్రోత్సాహం భరించలేకా నలిగిపోయివుండేవాడిని. 

- అమెరికా ఆర్ధిక స్థితి పట్టాలు తప్పుతుండటానికీ, భారత్ ఆర్ధిక స్థితి బాగా మెరుగుపడుతూ వుండటానికి కారణం అవినీతే అని నా నిశ్చితాభిప్రాయం. అమ్రికా భారత్ నుండి నేర్చుకోవాల్సింది ఎంతయినా వుంది. మన దేశీలు శాయశక్తులా కృషిచేస్తూనే వున్నారు లెండి కానీ అమ్రికా అంత త్వరగా అందిపుచ్చుకోవడం లేదు :(    ఓ పదేళ్ళ క్రితం కెనడాలోని మా మిత్రుడొకడు శుబ్బరంగా లంచం ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. ఇంకో మిత్రుడు తన గ్రోసరీ షాపు వెనకాల వున్న చిన్న వీధిని నెమ్మదినెమ్మదిగా కలిపేసుకున్నాడు.

ఇంకా చాలా లాభాలు వుండేవుంటాయి కానీ అవన్నీ మీరే చెప్పండి. అన్నా హజారే లాగే అమెరికాలో అవినీతి (పెంచడం) కోసం ఓ సున్నా హజారే ఎవరయినా ఉద్యమం లేవదీస్తే కానీ ఈ దేశం బాగయిపోదేమో!

సందు దొరికింది కదా అని ఓ కునుకు తీసాను. అప్పుడు...

ఇది గత వారం సంగతి. ఓ రోజు రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. బహుశా ఆ రాత్రి రెండు మూడు గంటలే పడుకొని వుంటాను. అయినా సరే  మరునాడు మన వెనుక మనమే తన్నుకొని లేచి ఆఫీసుకి వెళ్ళాల్సిందే కదా.  వెళ్ళాను, అలాగే మధ్యాహ్నం జిం కి వెళ్ళాను. ఆ రోజు జిమ్ములో ఫిజికల్ టెస్టుల కోసం అప్పాయింట్మెంట్ వుంది. మా జిమ్ము మేనేజర్ బాగానే వుంటుంది. అవీ ఇవీ పరీక్షలు చేసి ఓ పరీక్ష కోసమని చిన్న బెల్టు లాంటిది నడుము చుట్టూ గుండెకి దగ్గర్లో పెట్టి మ్యాట్ మీద పడుకొమ్మంది. రెండు నిమిషాల తరువాత వచ్చి రీడింగ్ చూసి బుర్ర గోక్కుని మళ్ళీ ఇంకోసారి ఆ పరీక్ష అని చెప్పింది.  రెండు నిమిషాలు అయ్యాక మళ్ళీ వచ్చి చూసి మళ్ళీ బుర్ర గోక్కొని "మీకు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వుంది. అప్పుడప్పుడు ఈ సిస్టం తప్పు కూడా చూపిస్తుంది. వచ్చే వారం మళ్ళీ పరీక్షలు చేద్దాం. క్రితం సారి పరీక్షల్లో బాగానే వుంది కాబట్టి సమస్యేమీ లేకపోవచ్చు" అని చెప్పింది. తనని చూసాక హార్ట్ బీట్ పెరగాలి కానీ తగ్గడం ఏంట్రా అని అనుకొని వుంటుంది.

గత రాత్రి నిద్ర లేకపోవడంతో దొరికిన ఆ నిమిషాలలోనే కాస్తంత కునుకు తీసాను. అందువల్ల గుండె లయలో తేడా వచ్చి వుండవచ్చు. లేకపోతే గుండెలో ఎదయినా సమస్య తయారయి వుండవచ్చు. ఎందుకయినా మంచిదని ఈరోజు మళ్ళీ పరీక్ష చెయ్యమన్నాను. చేసింది. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి. ఈ రోజు కునుకు తియ్యకుండా జాగ్రత్తపడ్డాను మరీ. ఆమె చేసిన పరీక్షను VO2 Max అంటారు. మన శరీరానికి ఎంత ఆక్సిజను అందుతోంది అనేదాన్ని అది తెలియజేస్తుంది. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందట్లేదూ అంటే గుండెలోనో లేదా మరెక్కడో ఏదో లోపం వున్నట్లే మరి.  అదేంటో కనుక్కొని సవరించుకోకపోతే నెమ్మదినెమ్మదిగా అవయవాలు, మెదడూ క్షీణిస్తాయి.

ఆ సెప్టెంబర్ 11 వ రోజు

ఆ రోజు సెప్టెంబర్ 11, 2001. టొరొంటో (కెనడా) లో వుంటున్నాను అప్పుడు. ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టాను. ఆ రోజుకి మా నాన్నగారు మరణించి ఏడాది అవుతోంది. వారి స్మృత్యర్ధం ఇంట్లోనే గడపాలని నిర్ణయించుకున్నాను. భార్యా పిల్లలూ ఇండియా ట్రిప్పుకి వెళ్ళారు. నాన్నగారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి సంతాప సభ వీడియో చూస్తున్నాను. అప్పుడు మా మేనల్లుడు ఫోన్ చేసాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. తాతయ్య వర్ధంతి రోజు కదా, ఇంట్లోనే వుండి సంతాప సభ వీడియో చూస్తున్నా అని చెప్పాను. అది పక్కన పెట్టు అని చెప్పాడు. ఎందుకు అని అడిగాను విస్మయంతో. వార్తలు పెట్టు అన్నాడు ఏం చెప్పకుండా. ఎందుకు అని అడుగుతూనే టివిలో వార్తల్ ఛానల్ పెట్టాను.

ఏవో దృశ్యాలు హడావిడిగా కదలాడుతున్నాయి. ఎత్తయిన భవంతులు చూపిస్తున్నారు. పొగలు, మంటలూ చెలరేగుతున్నాయి. నేను భృకుటి ముడివేసి "ఏం జరుగుతోంది?" అని అడిగాను మా వాడిని. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద విమానం కూలిపోయింది అని చెప్పాడు. ఆహా అన్నాను కాస్త తేలిగ్గా. రెండు బ్యుల్డింగుల మీద రెండు విమానాలు ఢీ కొట్టాయి అని అప్పుడు చెప్పాడు. "ఆ!?!" అన్నాను అప్పుడు దిగ్భ్రాంతిగా.  అప్పుడు సవివరంగా జరుగుతున్నది చెప్పాడు. అప్పటికి ఒక భవంతి కూలిపోయింది అనుకుంటా. అలా ఆ వార్తలు టివిలో చూస్తుండగానే రెండో భవంతీ కూలిపోయింది. చాలా విమానాలు టొరోంటోకి మళ్ళించారు అని వార్తల్లొ విన్నాను. మా ఇల్లు విమానాశ్రయానికి కాస్త దగ్గరే. విమానాల అలికిడి ఎక్కువగా వుందా అని చూసాను కానీ అంతగా ఏమీ అనిపించలేదు.

ఇండియాకి ఫోన్ చేసి మా కుటుంబానికి ఈ విషయం చెప్పి వార్తలు చూడమన్నాను. అప్పుడు వాళ్ళు మా చిన్నక్కయ్య ఇంట్లో వున్నారు. విద్యుత్ లేక వెంటనే వార్తలు చూడలేకపోయారు. కొన్ని గంటలు అయ్యాక వార్తలు చూసి తీవ్రత తెలుసుకున్నారు. సెప్టెంబర్ 14 న వారు ఇండియా నుండి తిరిగిరావాలి. అప్పటికి పరిస్థితులు ఎలా వుంటాయో ఏమో అనుకున్నాం. మిగతా రోజుల్లో పరిస్థితి మందింపు వేసి ఏం ఫర్వాలేదు బయల్దేరండి అని చెప్పాను. వారితో పాటు తొలిసారిగా మా అమ్మ కూడా కెనడా వస్తోంది.
  
మా ఆవిడ బొంబాయి నుండి ఫోన్ చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయలో వుందిట. ఏడుస్తోంది. ఏమయ్యింది అని అడిగాను ఖంగారుగా. ఎవరి రిస్క్ మీద వాళ్ళు ప్రయాణించాల్సిందే, ఏం జరిగినా మా బాధ్యత లేదు అని ఎయిర్ లైన్స్ వాళ్ళు చెప్పారుట. వాళ్ళు వస్తున్నది ఎయిర్ ఇండియా అనుకుంటా.  ఇలా దుఃఖిస్తూ మాట్లాడితే తొలిసారిగా విదేశాలకు వస్తున్న మా అమ్మ ఎక్కడ ఖంగారు పడుతుందో అని ఆమెకు కనిపించకుండా పక్కకు వచ్చి మా అనిత మాట్లాడుతోందిట.  ఏమీ జరగదనీ, ఇంకా అందరూ చాలా జాగ్రత్తగా వుంటారు కాబట్టి ఎలాంటి దుస్సంఘటణలూ జరగవని ధైర్యం చెప్పి ఎంచక్కా వచ్చెయ్యమని చెప్పాను. మొత్తం మీద ధైర్యం కూడతీసుకొని క్షేమంగా కెనడా వచ్చేసారు.

ఈ సెప్టెంబర్ 11 కి యు ఎస్ లో ఆ సంఘటణ జరిగి  పదేళ్ళు అవుతుంది. మా నాన్నగారు మరణించి పదకొండేళ్ళు అవుతుంది. ఇలా ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 11 అంటే ముప్పిరిగొన్న భావాలతో, ఆలోచనలతో, జ్ఞాపకాలతో ఆ రోజంతా గడిచిపోతుంది.

పోలీస్ ట్రైనింగుకి వెళుతూ వస్తున్నానోచ్

శరత్తు పోలీసు ఏంటా అని ఖంగారు పడకండి. సిటిజెన్ పోలీసింగ్ అని మా పట్టణంలో ఓ ప్రోగ్రాం వుంది. వారానికి మూడు గంటల చొప్పున తొమ్మిది వారాలు మా పోలీసు స్టేషను వారు ఆసక్తి చూపించిన వారిలో ఎన్నిక చేసిన పౌరులకు శిక్షణ ఇస్తారు. అందులో భాగంగా నిన్న మొదటి తరగతి జరిగింది. చాలా బాగా జరిగింది. మాది 32 వేలమంది వుండే చిన్న పట్టణమే అయినా కూడా దాదాపుగా 120 మంది పోలీసులు మా స్టేషనుకి వున్నారు. అందులోని అన్ని శాఖల అధిపతులు వచ్చి మాకు ఆహ్వానం చెప్పి, మాట్లాడి వెళ్ళారు.

మా స్టేషను గురించి పూర్తిగా వివరించారు. విభాగాలు, అధిపతులు, తేడాలు, సౌకర్యాలు, విధానాలు అన్నీ విడమరచి చెప్పారు. ఆ తరువాత ఓ ముప్పావు గంట సేపు స్టేషను అంతా తిప్పి చూపించారు. లోపల స్టేషన్ అంత పెద్దగా వుంటుందని అనుకోలేదు. చిన్న పట్టణానికే అంత పెద్ద పోలీసు స్టేషన్ వుండటం ఆశ్చర్యం అనిపించింది. ఇంకా పెద్ద పట్టణాలకు ఇంకెంత పెద్ద స్టేషనులు వుంటాయో కదా. ఎన్నో గదులు, ఎన్నో సౌకర్యాలు. లాకప్ సెల్స్ కూడా లొనికి వెళ్ళి చూసాము. ఫైరింగ్ రేంజ్ కూడా వుంది. మాకు ఫైరింగులో కూడా కాస్త శిక్షణ ఇస్తారుట కానీ కాల్చే అధికారాలు వుండవు లెండి. మాకు తిప్పి చూపించిన అధికారి SWAT టీం మెంబర్. ఆ టీం ఎలా పనిచేస్తుందో కూడా వివరించాడు.

శిక్షణలో భాగంగా ఒక రోజు నాలుగు గంటలు స్క్వాడ్ (పోలీస్) కారులో ఆఫీసు పక్కన కూర్చొని తిరిగి చూస్తూ అతని విధుల్లో సహకరించాల్సి వుంటుంది. వచ్చే వారం పోలీస్ కుక్కతో ప్రదర్శన వుంటుంది. నేరస్తులని పట్టుకోవడానికి పోలీసు కుక్కలు ఎలా ఉపయోగపడుతాయో వివరిస్తారు. అలా అలా ఒక్కో వారం ఒక్కో విశేషం వుంటుంది. తరగతులు అన్నీ పూర్తి చేసాక ఇష్టమయితే పౌర పోలీసుగా బాధ్యత స్వీకరించవచ్చును. అప్పుడు వారానికి కనీసం నాలుగు గంటలు అయినా మన స్వంత కారులో పెట్రోలింగ్ చెయ్యాల్సి వుంటుంది. ఒక వైర్లెస్ సెట్ ఇస్తారు. ఏదయినా అనుమానాస్పదంగా  అనిపిస్తే స్టేషనుకి మెసేజ్ ఇస్తే ఆఫీసర్లు వస్తారు.

వారం వారం నా శిక్షణా విశేషాలను మీతో పంచుకుంటాను. కొత్త కొత్త కార్యక్రమాల్లో పాల్గొంటూ కొంగ్రొత్త విషయాలను తెలుసుకుంటూ జీవిత పయనం సాగిస్తుంటేనే  ఉత్సాహంగా వుంటుంది కాదూ?