సరి అయిన కైరోప్రాక్టరుని ఎన్నిక చేసుకోవడం ఎలా?

(కైరోప్రాక్టిక్ పుస్తకం కోసం వ్రాసిన వ్యాసం)

ప్రతి వృత్తిలోనూ. వైద్యుల్లోనూ పలు మోసగాళ్ళు వున్నట్టే ఈ వృత్తిలోనూ మోసగాళ్ళు వుండవచ్చు. వారికి సరి అయిన విద్యార్హతలు కానీ, అనుభవం కానీ వుండకపోవచ్చు. ఎక్కడో ఆషామాషీగా నేర్చుకొని మీ వెన్నెముక మీదనే ప్రయోగాలు చేసి పరిపూర్ణులవ్వాలని అనుకుంటుండవచ్చు. ఇండియాలో అయితే బార్బర్ షాపుకి వెళ్ళి మంగలివారితో ఎంచక్కా మెడలు విరగ్గొట్టించుకోగలము కానీ అలా అందరి చేతికీ ఆషామాషీగా మన వెన్నుముకను ఇవ్వలేము కదా. బాగుచేసేదేమో కానీ భ్రష్టు పట్టిస్తే  వున్నవాటికి తోడుగా మరికొన్ని సమస్యలు చేరి అవస్థల పాలవుతాం. అందుచేత వెన్నెముక అనేది మన శరీరంలోని అతి ముఖ్యమయిన భాగాల్లో ఒకటి కాబట్టి  చాలా జాగ్రత్త అవసరం. వైద్యం వికటిస్తే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

పాశ్చాత్య దేశాలలో ప్రమాణాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి ప్రాక్టీసు చేసేవారందరూ ఏదో ఒక మంచి ప్రొఫెషనల్ కాలేజీలోనే చదివివచ్చి వుంటారు. ఇండియాలో వున్న కైరోప్రాక్టర్లు  ఎలా విద్యార్హతలు సాధిస్తారో నాకు తెలియదు.  ఈ ప్రాక్టీసు నేర్పే మెడికల్ కాలేజీలు అక్కడ వున్నాయా లేక విదేశాల్లో నేర్చుకొని వచ్చి అక్కడ ప్రాక్టీసు చేస్తారా అన్నది కనుక్కోవాల్సిన విషయమే.

కైరోప్రాక్టిక్ సంస్థలో వైద్యం కోసం చేరేముందు కానీ లేదా కైరోప్రాక్టర్ దగ్గర చేరే ముందు గానీ ఆ సంస్థ గురించి, ఆ డాక్టర్ గురించి కొద్దిగా నెట్టులో రెసెర్చ్ చేసి వెళ్ళడం వల్ల కాస్త అవగాహన పెరగొచ్చు. సంస్థల మీద సాధారనంగా నెట్టులో మెచ్చుకోళ్ళు తక్కువా, ఫిర్యాదులు ఎక్కువా వుండటం సహజమే కాబట్టి ఫిర్యాదులు ఎక్కువ కనిపించినా కంగారు పడనవసరం లేదు కానీ మీకు కూడా సంశయాత్మకంగా అనిపిస్తే వెరిఫై చేసుకొని వెళ్ళడం మంచిది.  మీకు ఆరోగ్య భీమా వుంటే అది ఎంతవరకు కవర్ చేస్తుంది మీరు ఎంతవరకు చేతినుండి పెట్టుకోవాలి అనే విషయాల పట్ల అవగాహన అవసరం. కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే మీ భీమా ఆ వైద్యుడిని కవర్ చేస్తుందా, చేస్తే ఎంతవరకు కవర్ అవుతాయి అనే విషయాలు మీ ఇన్సూరెన్స్ సంస్థతో మాట్లాడి కనుక్కొని వెళ్ళడం మంచిది.

కైరోప్రాక్టర్ నమ్మదగ్గ విషయాలే చెబుతున్నాడా లేక అతిశయోక్తులు చెబుతున్నాడా అనేది గమనించండి. వారి ఒత్తిడి మేరకు కాకుండా మీకు నమ్మకం వుంటేనే చికిత్సలో చేరండి. ఏ ఆరోగ్య సమస్యనయినా చిటికెలో నయం చేయగలమని ప్రగల్భాలు పలుకుతున్నారేమో చూడండి. కైరో సెంటర్ కానీ, కైరో డాక్టర్ కానీ మీకు విశ్వాసం కలిగించలేకపోతే వెనక్కి రండి. ఈ డాక్టర్ కాకపోతే ఇంకొకరు. సందేహంగా అనిపించినప్పుడు, సమర్ధత లేదనిపించినప్పుడు మొహమాటానికి వెళ్ళి నడుములు విరగ్గొట్టించుకోవాల్సిన అగత్యం లేదు కదా.

మీరు ఈ విధానంలో చికిత్స తీసుకోవాలనుకున్నప్పుడు మీ బంధుమిత్రులు కానీ, కోలీగ్స్ కానీ ఈ చికిత్సకు వెళ్ళారేమో కనుక్కొని వారు సూచించిన వైద్యుని దగ్గరికి వెళితే మీకు ఇంకా నమ్మకంగా వుంటుంది. ఫలితాలు వుంటేనే ఎవరయినా రికమెండ్ చేస్తారు కాబట్టి మీకూ మంచి ఫలితాలు ఒనగూడే అవకాశాలు వుంటాయి.

కొన్ని సార్లు కొద్దిపాటి రుసుముతో వెన్నెముక ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని స్టాల్స్ పెట్టి మరీ చెబుతుండవచ్చు. మేము వెళుతున్న కైరో సెంటర్ మాకు అలాగే తెలిసింది. కేవలం 20 డాలర్లకి ప్రాధమిక పరీక్షలు చేసి ఇస్తాం అన్నారు. సరే అని మా ఆవిడని చూపించాను. వెన్నెముకలో సమస్యలున్నాయన్నారు. ప్రయత్నించి చూద్దాం అనుకున్నాం. చికిత్స తీసుకున్నాం. అలా వారూ విన్ అయ్యారు మేమూ విన్ అయ్యాము.  విన్ విన్ స్థితి. ఇలాంటి స్థితి అన్ని పార్టీలకీ మేలు చేస్తుంది. అయితే అలాంటి ఉచిత పరీక్షలకి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరి వెన్నెముకలూ పర్ఫెక్టుగా వుండవు కనుక చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ అయినా బయటపడుతుంటాయి. అవి పెద్దపెద్ద సమస్యలు కానప్పటికీ మీలో మీరు గుర్తించలేని సమస్యలు ఇప్పటికే కలగజేస్తుండవచ్చు. అవి తక్షణ సమస్యలు కానప్పటికీ అవీ అలాగే వదిలేస్తే మున్ముందు ముదిరిపోవచ్చు. అలాంటప్పుడు చికిత్స తీసుకోవాలా లేక తిరస్కరించాలా అన్నది వివిధ ఆంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయించుకోవాల్సి వుంటుంది.

2 comments:

  1. గురువుగారు...మీ సెలెక్ష్షన్ క్రయిటీరీయా మరచితిరా ??!!

    ReplyDelete
  2. @ మిస్టర్ Gali
    వార్నీ. మీకు అది గుర్తుందీ! అయినా అది నా సెలెక్షన్ క్రైటేరియా కానీ మీకందరికీ కాదు కదా. అది మీ అందరికీ నేర్పితే పోటీ ఎక్కువవుతుంది కాదూ?

    ReplyDelete