బాడీ బ్యుల్డింగ్ చెయ్యాలనే...

చాలా ఏళ్ళ క్రితం గుంటూరులోని రవి కళాశాలలో చేరాను. అంటే పాఠశాల విద్యార్ధిగా అనుకోకండి. వారు తొలిసారిగా పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం పెట్టారు. సెంట్రల్ సివిల్స్ కీ కోచింగ్ పెడితే చేరిపోయా. కలెక్టర్ అయిపోతానని కాదులెండి కానీ దానికి బాణం ఎక్కుపెడితే బిల్లు కలెక్టర్ అయినా కాకపొతానా అనేది నా భావన. నా ఇనుప కాలు మహిమ వల్ల మూడు నెలలకే వారు ఆ కేంద్రాన్ని మూసివేసారు లెండి. అప్పుడు రవి కళాశాల నిర్వాహకులు ధన్ గారి పరిచయ భాగ్యం కలిగింది. మనిషి సింహం లాగా వుండేవారు - అలాగే గర్జించేవారు.

మనం ఎప్పుడయినా బాణం లక్ష్యం మీదికి గురిపెట్టినప్పుడు లక్ష్యం ఎత్తుకంటే కోణం కాస్త ఎత్తుగా పెట్టాలి. లక్ష్యం ఎత్తులోనే బాణం పెట్టి వదిలేస్తే భూమ్యాకర్షణ శక్తి, గాలి తదితర కారణాల వల్ల క్రిందకు తగిలి ఆ బాణం లక్ష్యాన్ని అందుకోదు. అలాగే మనం ఏ లక్ష్యం పెట్టుకున్నా ఇతరత్రా ఆకర్షణలూ, ఆటంకాలూ, అవరోధాలు ఎన్నో వుంటాయి కాబట్టి చేరినా చేరకపోయినా మన లక్ష్యం మనకు అవసరమయినదానికంటే కాస్తయినా పెద్దగా వుండాలి. తెలుగులో ఏదో సామెత వుంది సరిగ్గా గుర్తుకురావడం లేదు... చావుకి వేస్తే లంఖణానికి వస్తుంది అనో ఏదో వుంటుంది. అలా మనం పెద్ద లక్ష్యం కోసం కృషి చేసినప్పుడు పరిమిత లక్ష్యం అయినా చేరుతుంది. పెద్ద లక్ష్యమూ మన దరిచేరిందా - ఇంకేం మనకి మంచి బోనస్ కూడా లభించినట్లే కదా.

నేను తొలిసారిగా కంప్యూటర్ కోర్సు మెగాబైట్ సంస్థలో నేర్చుకున్నాను. అది జాతీయ సంస్థ అవడంతో దేశ వ్యాప్తంగా దానికి శాఖలుండేవి. ఆ కోర్సు చేసున్న కాలంలో ఆ సంస్థ పరీక్షల్లో దేశవ్యాప్తంగా ప్రధముడిగా రావాలని విశేషంగా కృషిచేసాను. చివరకు అలా రాలేకపోయాను కానీ మా శాఖలో మాత్రం ప్రధముడిగా నిలిచాను. అలా కాకుండా మా శాఖలో ప్రధముడిగా రావాలని మాత్రమే ప్రయత్నించి వుంటే మా శాఖలో చివరినుండి మొదటి వాడిగా వచ్చేవాడినేమో. అలా అప్పుడప్పుడు మంచి మంచి విధానాలు పాటిస్తుంటాను - విజయం సాధిస్తుంటాను కానీ చాలాసార్లు అలా కుదరక చతికిలపడిపోతుంటాను.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే ఆథ్లెటిక్ బాడీ కోసం ప్రయత్నిస్తున్నా అన్నా కదా. అది లక్ష్యంగా పెట్టుకుంటే ఇలాగే మిగిలిపోయేలా వున్నా. అందుకే అంతకు మించిన లక్ష్యం పెట్టుకొని శ్రమించాలనుకుంటున్నా. అలా కృషి చేస్తేనే ఆథ్లెటిక్ బాడీ అయినా సాధించగలను. బాడీ బ్యుల్డర్ బాడీ కూడా వచ్చేస్తే ఇంకేం మహదానందం కాదూ. అంత దృశ్యం వుండకపోవచ్చును లెండి కానీ నన్నయితే ప్రయత్నించనివ్వండీ. చూద్దాం, ప్రస్థుతం వున్న ఫ్యామిలీ ప్యాక్ నుండి ఏ ప్యాక్ వరకు వెళతానో. మరీ సిక్స్ ప్యాక్ కాకపోయినా సెక్సీ ప్యాక్ అయినా ఫరవాలేదు కదా.

మూడువారాల నుండి విజయవంతంగా, క్రమం తప్పకుండా జిమ్ముకి వెళ్ళి బరువులు ఎత్తుతున్నాను. ఇదివరలో ఎన్ని సార్లు జిమ్ముకి వెళ్ళినా కూడా ఈమాత్రం సక్సెస్ సాధించిందిలేదు. అందుకే నా మీద నాకు నమ్మకాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే కొంగ్రొత్త లక్ష్యాలు మదిలో మెదులుతున్నాయి. మనస్సు ఉరకలు వేస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా నా శరీరాన్ని కూడా పరుగెత్తించడమే ఇహ నేను చెయ్యాల్సింది.

అన్నట్టు బాడీ బ్యుల్డింగు గురించి చదువుతున్నప్పుడు ఒక చిట్కా నాకు నచ్చింది. అప్పుడప్పుడు బాడీని ఫోటోలు తీసుకొని ఎదురుగ్గా పెట్టుకుంటే అభివృద్ధి తెలుస్తుందనీ, ఎంకరేజింగుగా వుంటుందనీ. ఎదురుగ్గా ఏం ఖర్మ, ఎంచక్కా నా బ్లాగులోనే ఆ ఫోటోలు పడేస్తా. సిద్ధంగా వుండండి మరి!

2 comments:

  1. కుర్చీని గట్టిగా పట్టుకొని సిద్దంగా ఉన్నాను ఎందుకంటే నేను కాస్త వీకు.

    ReplyDelete
  2. @agnatha:
    weakness potaniki miru body building ki krushi chesi,meeku blog unte mee photos pettandi.mullu ni mullu tone teeyali kada.

    ReplyDelete