నేనీమాట అంటే మేమూ చాలా సార్లు లేచామనో, చాలా సార్లు అలా లేచి పడుకున్నామనో మీరు అంటారు లెండి. రోజూ పెదరాళే లేవాలని అంటే మరీ రోజూ కాదు లెండి కానీ పని రోజుల్లో అయినా అలా లేవాలని ఎన్నేళ్ళుగానో కంకణం కట్టుకోవడమూ, రెండు రోజులు లేచేసి మూడోరోజు ముచ్చటగా ఆ కంకణం గోడ మీది సీలకి వేలాడదీసి బజ్జోవడమూ జరుగుతూ వుండేది. గతవారం అయిదు, అయుదున్నరకి లేవడం సాధన చేసాను. అందుకే ఈ వారం నాలుగు, నాలుగున్నరకే లేవడం సాధన చేస్తున్నా. ఈమధ్య కాస్త అనుకున్నవి అనుకున్నట్టుగా చేస్తున్నందువల్ల దీనిని కూడా సాధించగలననుకుంటున్నాను.
లేచి ఎవరిని ఉద్ధరించాలిట? ఎవరినో అని కాదు లెండి. నన్ను నేను ఉద్ధరించుకోవడానికేలెండి. అలా ఉదయమే లేవడం వల్ల ఉదయం వ్యాయామానికి వీలవుతోంది. రేపటి నుండి నాలుగు గంటలకే లేచి ఒక అరగంట కెరీర్ కోసం ఉపయోగించాలని చూస్తున్నా. ఊదయమే లేవాలంటే రాత్రి పెందరాళే పడుకోవాలి. అక్కడే వస్తుంది చిక్కు. గతరాత్రి తొమ్మిదింబావుకే పడకేసినందువల్ల సరి అయిన సమయానికే మెలకువ వచ్చింది. ఇవాల్టి నుండి 9 గంటల వరకల్లా నిద్రా దేవి ఒడిలోకి జారుకోవాలని తీర్మానించుకున్నా. చూడాలి ఈ ఆనందం ఎన్ని రోజులో. ఈ విషయంలో గనుక సక్రమంగా వుండగలిగితే కెరీర్ మీద మంచిగా ఫోకస్ చెయ్యడానికి వీలవుతుంది. అలా మరికొన్ని ఏరియాలలో అభివృద్ధి చెందవచ్చు. ఇలాంటి ముఖ్యమయిన పనులు సాయంత్రమో, రాత్రో పెట్టుకోకూడదు. చాలా అంతరాయాలు కలిగి అసలు పనులకు అస్సలు సమయమే చిక్కదూ. అందుకే ముఖ్యమయిన పనులు రోజులో ముందే పట్టుకోవడం మంచిది.

3 comments:
నాలుగున్నరకు లేచి ఏం పీకావ్
@శరత్, నాకో విషయం అర్థంకాట్లేదు.మీకు ఆఫీసు లో ఎక్కువ పని ఉండదు కదా, ఆ సమయమే కెరీర్ కోసం వినియోగించోచుగా. నాలుగున్నర కి కష్టపడి లేచే బదులు ? :-)
ఏదేమైనా మీ జీవితం లో మార్పులు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.life begins at 40 అని ఇందుకే అంటారేమో ?
@ అజ్ఞాత
నిన్నే
@ అజ్ఞాత
అవి ఆఫీసు సమయంలో చేసే పనులు కావులెండి :)
జీవితాన్ని అప్పుడప్పుడూ రిస్టార్ట్ చేసుకోకపోతే స్థబ్దంగా తయారవుతుంది. కొంతమంది నా స్నేహితులు నలభై ఏళ్ళకే మానసికంగా రిటైరయిపొయి జీవఛ్ఛవాలుగా బ్రతికేస్తున్నారు. కొంతమంది మిత్రులు దుర్య్వసనాల బారిన పడి నలభై ఏళ్ళకు లోపే మరణించారు. ఇంకొంత మంది మిత్రులు అదే దారిలో వున్నారు (వాళ్ళు చెబితే వినిపించుకోవడం లేదులెండి). అలా కొందరిలా నేను కాకూడదనే మంచి విషయాలు వ్యసనాలుగా చేసుకుంటున్నాను.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి