మా ఆవిడకు కొన్ని విషయాల్లో దొరికిన ఉపశమనం

రిలీఫ్ కి తెలుగు పదం ఏంటి?

మొదటిది - కారు: ఆమె కారు లైసెన్స్ తెచ్చుకున్నదంతా ఓ పెద్ద కథ. ఎందుకు అంత ఆలస్యమయ్యిందని నేను ఓ పోస్ట్ వేస్తే అంతా తనని బ్లేం చేస్తూ వ్రాస్తాను. తను పోస్ట్ వ్రాస్తే నన్ను మొత్తం బ్లేం చేస్తూ వ్రాసేస్తుంది కనుక వివరాలు వద్దు లెండి కానీ మొత్తమ్మీద కొన్ని నెలల క్రితం ఎలాగోలా లైసెన్స్ తెచ్చేసుకుంది. అప్పటినుండీ తనదంతా ఇహ వీరవిహారమే. నేను ఏ పనికయినా అవసరం పడ్డప్పుడు మాత్రం నన్ను కారులో కుదేసుకొని తీసుకెళుతుంటుంది. మా పెద్దమ్మాయీ కారెక్కితే నన్ను వెనక సీట్లోకి విసిరేస్తారు. ఇంకా నయ్యం, తన స్నేహితురాళ్ళు ఎక్కిన సందర్భం ఇంకా రాలేదు, అప్పుడు అందరూ కలిసి నన్ను తప్పకుండా డిక్కీలోకి తోసేస్తారు.
 
మా చరిత్రలోకి వెళితే తనకు డ్రైవింగ్ లైసెన్స్ రాకముందు దృశ్యం ఇలా వుండేది. నేను ఆఫీసులో బాహ్గా పనిచేసి అలసిసొలసి ఇంటికి వస్తానా... బయటకి షాపింగుకో లేక విండో షాపింగులో వెళ్ళడానికి మా ఆవిడ తయ్యారుగా వుండేది. నాకేమో కాస్త భోంచేసి, కాస్త నెట్టు చూసి, కాస్త కునుకేసి విశ్రాంతి తీసుకోవాలని వుండేది. మా ఆవిడ రోజంతా ఇంట్లో వుంటుంది కదా అలా టవున్ అంతా తిరగేసి రావాలని వుండేంది. అలా ఘర్షణ ఉద్భవించేది. అప్పుడప్పుడు ఆమెను షాపింగ్ మాళ్ళల్లో దించేసి కారులో నెట్టు చూస్తూనో, కునుకేస్తూనో విశ్రాంతి తీసుకునేవాడిని. ఆమెకు డ్రవింగ్ లైసెన్స్ రావడమూ, తనకో కారు కొనియ్యడం జరిగిపోవడంతో తన పనులు తాను చూసుకుంటోంది, నా పనులు నేను చూసుకుంటున్నాను. అలా ఇద్దరి ప్రాణాలకీ ఇప్పుడు ఆ రకంగా హాయిగా వుంది.
 
రెండవది - నొప్పులు:  అనితకి చాలా ఏళ్ళుగా ఎవేవో తీవ్రమయిన నొప్పులు వుంటూ వచ్చాయి. ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రయోజనం శూన్యం అయిపోయింది. కొన్ని నెలల నుండి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ నొప్పులన్నీ నిమ్మళిస్తూవుండటంతో తనకి చాలా రిలీఫ్ వచ్చింది. బోలెడంత ఉత్సాహంతో వుంటూ వస్తోంది. ఇదివరలో ఇన్నేళ్ళుగా తన నొప్పుల బాధలన్నీ బకరా గాడిని ఇంట్లో నేను తప్ప ఆమెకు మరొకరు దొరకరు కనుక ఎంచక్కా నామీద తీర్చేసుకునేది. అంటే అమెకు నొప్పి ఎక్కువయినప్పుడల్లా నన్ను ఎందుకో అందుకు దులిపేస్తూ అంతో ఇంతో ప్రశాంతత పొందేది. నేను ఏదన్నా అన్నా కూడా అసలే బాధల్లొ వుండేది కనుక తనూ కయ్య్ మనేది. అలా ఇంట్లో ప్రశాంతమయిన, ఉత్సాహవంతమయిన వాతావరణం అప్పుడప్పుడు లోపించేది. ఇప్పుడు ఏవయినా ఘర్షణలు వచ్చినా ఎక్కువభాగం నవ్వుకుంటూ వాదించుకుంటున్నాము కనుక త్వరగానే తేలిపోతున్నాయి. అలా ఆమెకూ, నాకూ ఇందులోనుండి విముక్తి దొరికింది. 
 
మూడవది - నానుండి: ఎందుకులెండి మీకు ఆ వివరాలన్నీనూ :)
 
ఇంకో విశ్రాంతి కూడా ఆమెకు దొరికిందండోయ్. అయితే అది ఈమధ్య కాదులెండి. ఓ మూడేళ్ళ నుండీ వుంది. ఇదివరలో తను ఏమీ సంపాదించేది కాదు కనుక ప్రతి పైసాకీ నన్ను అడగాల్సి వచ్చేది. ఇప్పుడు తాను కూడా అంతో ఇంతో శ్రమ పడుతూ తన పాకెట్ మనీ ఖర్చుల కోసమూ, ఇతర ఖర్చుల కోసమూ, తన యొక్క బంగారు నగల కోసమూ డబ్బులు సంపాదించుకుంటోంది. అలా తనకు కొంత ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చేసింది. అందువల్ల రేపు ఏ పరిస్థితి ఎలా వచ్చినా కూడా నాకూ కొంత భరోసాగా వుండబోతోంది.

8 comments:

  1. relief కు తెలుగు పదాలు చాలానే చెప్పుకోవచ్చు

    నిమ్మళించడం, నిదానించడం, సంభాళించుకోవడం, వీలు చిక్కడం...

    ReplyDelete
  2. @ మీ
    ధన్యవాదాలు. ఇంకా అసలయిన అర్ధం ఇచ్చే పదం అయితే బావుంటుంది.

    ReplyDelete
  3. రిలీఫ్ కి తెలుగు పదం "ఉపశమనం"

    ReplyDelete
  4. @ శ్యాం
    సరిగ్గా చెప్పారు. ఆ పదం కోసమే వెతుకుతున్నాను. ఇహ పోస్ట్ టైటిల్ ఎడిట్ చేస్తాను.

    ReplyDelete
  5. ఉపశమనం కి బహువచనం ఉండదు. అంచేత, "మా ఆవిడ కు కొన్ని విషయాల్లో దొరికిన ఉపశమనం" అన్న టైటిల్ కరెక్ట్ అని నా అభిప్రాయం.

    ReplyDelete
  6. @ శ్యాం
    ఎడిట్ చేసేటప్పుడు నాకు కూడా కొద్దిగా సందేహం వచ్చింది కానీ పట్టించుకోలేదు. ధన్యవాదాలు.

    ReplyDelete
  7. Why don't you use online dictionary
    English --> Telugu
    Telugu --> English

    http://www.andhrabharati.com/dictionary/

    ofcourse you can't find everything but something is better than nothing

    ReplyDelete
  8. @ కన్నగాడు
    ఇంగ్లీషు నుండి తెలుగు ఆన్లైన్ డిక్షనరీలకు నేను ఇంకా బాగా అలవాటుపడలేదు. పడాలి. ఎందుకోగాని మీరు చెప్పేదాకా అలా వెతుకొచ్చనే విషయమే ఈసారి గుర్తుకురాలేదు.

    ReplyDelete