ఎక్సర్సైజు ఎక్కువయ్యిందా?

ఈమధ్య మాంఛి ఉత్సాహం మీద వున్న కదా. రోజూ రెండు సార్లు బరువులు ఎత్తుతున్నాను కానీ బాడీ బ్యుల్డింగ్ గురించి వ్యాసాలు చదివి నీరసించిపోయాను. అవి చదివాక నా శరీరాన్ని ఓవర్ ట్రైనింగ్ చేస్తున్నానేమోనని  అనుమానం వచ్చింది.   వారానికి మూడు రోజులు మాత్రమే వెయిట్ ట్రైనింగ్ చేస్తే బావుంటుందని ఆ వ్యాసాల్లో సెలవిస్తున్నారు. అందువల్ల నా ఉత్సాహానికి కాస్త అడ్డుకట్ట వెయ్యాల్సివస్తోంది. రోజు విడిచి రోజు చేస్తూ వారాంతాలు రెండు రోజులు విరామం ఇస్తే బావుంటుంది.

ఇదివరలో జిమ్ము చేసేప్పుడు కూడా బరువులు ఎత్తడం కంటే ప్రతి సెట్టుకీ, ప్రతి వ్యాయామానికీ మధ్య ఇవ్వాల్సిన విరామమే నీరసం తెప్పించేది. దూకుడుగా జిమ్ములో పంపు కొట్టడమే ఇష్టం కానీ వాళ్ళేమో నెమ్మదిగా, నిదానంగా లిఫ్ట్ చెయ్యమంటారు. ఒక సెట్టు అయ్యాక ఒక నిమిషం కానీ అర నిమిషం కానీ ఆగమంటారు. అలాగే వ్యాయామానికీ వ్యాయామానికీ మధ్య కొంత విరామం ఇమ్మంటారు. మొత్తానికి అలా విరామం ఇవ్వడానికి ఈసారి అలవాటు పడి తాపీగా బరువులు ఎత్తుతున్నా కానీ రోజుకి రెండు సార్లు బరువులు ఎత్తాలని దురదగా వుంటోంది. వీళ్ళేమో అంతొద్దు అంటున్నారు. వ్యాయామం అతిగా చేస్తే వచ్చే వచ్చే అవలక్షణాలు ఇవండీ. ఇందులో కొన్ని నాకూ అనిపిస్తున్నాయి. అలసిన కండరాలు రికవర్ కావడానికి 48-72 గంటలు పడుతుందిట. అందుకే రోజు విడిచి రోజు చేస్తూ మరియు వారానికి ఒక సారయినా రెండు రోజులు ఇలాంటి వ్యాయామానికి విశ్రాంతి ఇవ్వాలంటున్నారు. అందుకే ఎందుకయినా మంచిదని, పెద్దల మాట చద్దన్నం మూట కదా అని వాళ్ళ మాటలని వింటున్నా. అందుకే ఇవాళ జిమ్ముకి సెలవిచ్చి పడేసా. రేపటి నుండి కూడా రోజూ ఒక్కసారే జిమ్ముకి వెళ్ళాలి అనుకుంటున్నా. అందుకు మధ్యాహ్నం వేళ సరిపొతుంది కాబట్టి ఉదయం మరీ పెందరాళే లేవఖ్ఖర్లేదిక.

ఓవర్ ట్రైనింగ్ లక్షణాలు:


 • Chronic Fatigue • Injury • Sore Joints and Muscles • Lack of Ability to get a Pump • Lack of Desire to Train • Strength Loss • Lack of Appetite • Weight Loss • Insomnia • Depression • Sickness • Moody • Lack of Sex Drive
 • Stiffness • Irritability • Sleep disturbances • Depression • Decreased aerobic and strength training performances •  

  నాలోని స్పైరల్ సిస్టం ని బ్రేక్ చేసానా?

  కొన్నాళ్ల క్రితం మనలోని ఎదుగుదల క్రమంగా వుండాలి కానీ స్పైరల్ లాగా మళ్ళీ మొదటికి వస్తూండకూడదని వ్రాస్తూ అందువల్ల నేను అనుకున్నంతగా ఎందుకు ఎదగలేకపొతున్నానో వ్రాసాను. ఉదాహరణగా నా జిమ్ము ప్రహసనాలు తెలియజేసాను. ఎన్నేఏళ్ళ నుండో జిమ్ముకి వెళుతున్నా కూడా కొద్దిరోజులు చేసి మానివేయడం జరుగుతుండేది. జిమ్ముకని వెళ్ళి సానా గదిలో కూర్చొని కాలక్షేపం చేసి వస్తూండేవాడిని. అన్ని విషయాల కన్నా ఆరోగ్యమే మనకు అందరికీ ముఖ్యం కదా. మంచి ఆరోగ్యం సాధించాలంటే మంచి వ్యాయామం మనం చేస్తుండాలి. వ్యాయామం వల్ల బహుళ ప్రయోజనాలు వున్నాయి. శారీరక ఆరోగ్యమే కాకుండా, మానసిక ఆరోగ్యం కూడా బావుంటుంది. చురుకుదనం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. మనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఆ ఉత్సాహాన్ని నిర్మాణాత్మకంగా మలుచుకోగలిగితే ఎన్నో విజయాలు మనం సాధించవచ్చు.

  కొందరికి అన్ని అవకాశాలు చక్కగా కలిసివస్తుంటాయి. పెద్దగా శ్రమపడకుండానే పైకి వస్తుంటారు. అందరికీ అలా వుండదు కదా. అందుకే మనం ప్రయత్నిస్తూ పోవాలి. ప్రయత్నిస్తూపోతుంటే అవకాశాలు అందుబాటులోకి వస్తుంటాయి. అలా కృషి చెయ్యాలంటే ముందు మనలో ఉత్సాహమూ, విశ్వాసమూ, ఆరోగ్యమూ వుండాలి కదా. అందుకోసం వ్యాయామం చక్కగా దోహదం చేస్తుందని తెలుసు కాబట్టి దాని మీద బాగా శ్రద్ధ పెడుతుంటాను కానీ తొందర్లోనే చతికిల పడుతుంటాను. అలాంటి నాలోని విఫల వ్యవస్థను సరిచేసుకోవడానికి ఎన్నాళ్ళ నుండో ప్రయత్నిస్తూ వస్తున్నాను. ఏవీ పెద్దగా ప్రయోజనం కలిగించలేదు కానీ ఇన్నాళ్ళకి ఆ వ్యవస్థని అధిగమించానని అనుకుంటున్నాను.

  గత అయిదారు వారాలుగా క్రమం తప్పకుండా, చక్కగా జిమ్ములో వ్యాయామం చేస్తున్నాను. మామూలుగా అయితే ఒకటో, రెండో వారాల తరువాత ఆ ఉత్సాహంలో నీరసించిపోవాలి. ఈసారి అలా కాకుండా పద్ధతిగా వెళుతున్నాను. ఈ వారం నుండి రోజుకి రెండు సార్లు కూడా వెళుతున్నాను. ఉదయం అయిదుగంటలకే లేచి జిమ్ముకి వస్తున్నాను. మధ్యహ్న భోజన విరామ సమయంలో కూడా చేస్తున్నాను. అలా రోజుకి రెండు సార్లు నడిపిస్తున్నాను. అయితే తడవకి నలభై నిమిషాల కంటే ఎక్కువూగా వ్యాయామం చేసే సమయం లభించడం లేదు. ఆ సమయాన్ని పెంచాల్సివుంది. ఆ నలభై నిమిషాల సమయంలోనూ పది నిమిషాలు వార్మప్ ఏరోబిక్ ఏక్టివిటీసుకే పోతుంది కాబట్టి అసలు వెయిట్ ట్రైనింగ్ చేసేది ప్రతి తడవకీ అరగంటే అవుతోంది. సమయం పెంచాలి...పెంచాలి.

  ఈ పనుల వల్ల శరీరంలో కండ పెరుగుతోంది, బొజ్జ తగ్గుతోంది, నామీద నాకు విశ్వాసం బలపడుతోంది, ఉత్సాహం ఇనుమడిస్తోంది. అయితే వ్యాయామం వ్యాయామం కోసమే అనుకుంటే ఫలితాలు అక్కడే ఆగిపోతాయి. అందువల్ల వచ్చిన ఉత్సాహన్ని, విశ్వాసాన్ని మన జీవితంలో ఎదుగుదల కోసం వినియోగించుకున్నప్పుడే మన శ్రమకి మరింత సార్ధకత వుటుంది. అందుకే వచ్చేవారం నుండి ఇంకో అరగంట ముందు లేచి రోజూ ఒక అరగంట అయినా నా కెరీరులో ఎదుగుదల కోసం  వినియోగించాలనుకుంటున్నాను.

  అవును. మనకు ఎన్నో విషయాలకు తీరిక వుంటుంది కానీ మన కెరీర్ కోసం మాత్రం సమయం లభించదు. అన్ని పనులన్నీ అయ్యకనో లేకపోతే అర్జంటు అయితేనో మన కెరీర్ కోసం సమయం వెచ్చిస్తాం. అది పొరపాటు అని నా అభిప్రాయం.  ఏరోజుకారోజు మన కెరీర్ విషయంలో ఒక అరగంట అయినా సాధన చేస్తుండాలి, మన కత్తులని సాన పడుతుండాలి. మొండికత్తితో బ్రతుకు యుద్ధంలో ఏం గెలవగలం? ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలని సానపెట్టుకుంటే ఏ అనుకోని పరిస్థితి వచ్చినా కూడా బెదరకుండా ఎదుర్కోగలం. వున్న కంఫర్ట్ జోనులోనే తృప్తి పడితే మన బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన వుండిపోవూ? అందుకే రోజుకి ఓ అరగంట అయినా  మన దృష్టి మన కెరీర్ మీద వుండాలనుకుంటాను. ఆ అరగంట ఎక్కడ దొరుకుతుందేమిటి? రోజుకి ఎన్ని గంటలు వృధా చెయ్యడం లేదేమిటి?  బజ్జులో, బ్లాగులో లేదా జీడిపాకం లాగే సీరియళ్ళో, వార్తలో ఎన్ని చూడటం లేదూ మనం?  రోజూ గంటల కొద్దీ వార్తలు చూడకపోతే ఏదో దేశద్రోహం చేస్తున్నట్లుగా ఫీలయ్యే వారూ నాకు తెలుసు. అందులో ఈమధ్య అన్నా నిరసన ఆయె చూడొద్దూ? దేశాన్ని ఉద్ధరించొద్దూ? ఉద్ధరించీ, ఉద్ధరించీ ఏ రాత్రో ఆలస్యంగా పడుకోవద్దూ? మరి మనల్ని ఎవరు ఉద్ధరిస్తారూ? అందుకే మన కోసం కూడా ఓ అర్ధగంట అయినా అవసరం అంటాను. ఇవన్నీ నాకు నేను చెప్పుకుంటున్న నీతి బోధలు లెండి. మీకూ నచ్చితే వినెయ్యండి - నచ్చకపోతే వదిలెయ్యండి. సింపుల్.

  కొన్నిసార్లు ఫోకస్ మార్చడం కూడా అవసరమే

  భారతంలోని ఓ పిట్టకథ మీరు వినేవుంటారు. అర్జునుడు - బాణం - పిట్ట కన్ను అనే పిట్ట కథ అది. ఫోకస్ యొక్క ప్రాధాన్యతను చెప్పే కథ అది. అది సరే కానీ కొన్ని సార్లు ఎక్కువ ఫోకస్ ఎక్కువ సమస్యలని కలగజేస్తుంది. అది ఎలా అంటే ఉధాహరణకు మనం ఓ కొత్త కారు కొన్నామనుకోండి. మన దృష్టి, ఆలోచన అంతా దానిమీదే వుంటుంది. ఎక్కడ ఏ గీత దానిమీద పడుతుందో అని ఆందోళన పడుతూవుంటాం. కొత్త కారే కాదు, కొత్త పెళ్ళాం వచ్చినప్పుడు కూడా అలాగే వుంటుంది. ఎవడు, ఎక్కడ కన్నేస్తాడో, ఎక్కడ గీరేస్తాడో అని బేంబేలు పడిపోతుంటాం.

  ఈమధ్య ఓ స్నేహితుడిని అతని ప్రేయసి తిరస్కరించింది. కారణం అతగాడు ఆమె మీద అతిగా ఫోకస్ పెట్టడం. అలా అతని దృష్టీ, ఆలోచనలు అస్తమానం ఆమె ప్రసరిస్తూ వుండటంతో అభద్రతా భావనకు లోనయ్యి పలు అనుమానాలతో వేధించేవాడు. ఏడాది క్రితం నేను ఇండియాకు వచ్చినప్పుడు వారికి రాజీ కుదిర్చి మావాడి లోపాలు అతనికి తెలియజెప్పి ఫోకస్ ఎక్కువగా కెరీర్ మీద పెట్టి తక్కువ ఫోకస్ ప్రియురాలిమీద పెట్టెయ్యమని సూచించాను. నా మాటలు విని అతని ప్రియురాలు అతనికి ఒక అవకాశం ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే మావాడు మాట నిలబెట్టుకోలేదు. రింగన్న పురుగులాగా ఆమె చుట్టూ తిరుగుతూ, ఆలోచనలు ఆమె చుట్టూరా పరిభ్రమింపజేస్తూ ఆమెను వేధించేవాడు. కొన్ని నెలలు చూసి విసిగి, వేసారి అతనికి చివరికి వీడ్కోలు చెప్పింది. పెళ్ళికి ముందే ఇంతగా మానసికంగా చిత్రవధ చేస్తున్నాడు పెళ్ళయితే పీకలదాకా కూరుకుపోతానని ఆమె అతని నుండి మనసు మళ్ళించింది.

  ఇంకో ఉదాహరణ కూడా చెబుతాను. మా ఇంకో స్నేహితుడు తన మాజీ  లవరుతో తాజాగా ప్రేమాయణం మొదలెట్టి కొన్నేళ్ళుగా నడిపిస్తున్నాడు. ఇతనికీ పెళ్ళయ్యింది, పెద్ద పెద్ద పిల్లలున్నారు - అటు ఆవిడదీ అదే స్థితి. సరెలే వాళ్ళిద్దరూ ఎంచక్కా ప్రేమించుకుంటున్నారు అనుకున్నాను. కాదట, విపరీతమయిన అనుమానాలతో పలు రకాలుగా మావాడు వేధిస్తున్నాడట.  ఆమె ఇండియా నుండి నాకు ఫోన్ చేసి మొరబెట్టుకొని మీ స్నేహితుడిని మీరే మార్చాలి - లేకపోతే ఇక నాకు చావే గతి అని విపులంగా చెప్పింది. ఆమె చాలా మానసిక మాంద్యంలో పడిపోయింది. ఆత్మహత్య చేసుకునే అవకాశాలు నిజంగానే కనిపించడంతో ఆందోళన చెంది ఆమెని భూమిక హెల్ప్ లైనుకి ఫోన్ చెయ్యాల్సిందిగా బలవంతంగా నచ్చచెప్పాను. మరి ఫోన్ చేసిందో లేదో నాకు తెలియదు. ఆమెతో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా నాకు లేవు. అంతా విని ఓరి దరిద్రుడా అని మా ఫ్రెండు గురించి ఆశ్చర్యపోయాను. అక్కడా సమస్య అదే. ఆమెను మామూలుగా ప్రేమిస్తే బాగానే వుండేది. అతిగా ప్రేమిస్తుండటం వల్ల ఆమె మీద ఆలోచనలు ఎక్కువెక్కువయ్యి అవి అనుమనాలుగా రూపాంతరం చెంది వేధింపులుగా పరిణామం చెందాయి. మా స్నేహితునితో ఆ విషయం విపులంగా చర్చించి తనలోని లోపం ఏంటో చెప్పి కన్విన్స్ చేసాను కానీ మావాడిది కుక్క తోక వంకర టైపు కాబట్టి నా మాటలు పెద్దగా పనిచెయ్యకపోవచ్చు.

  అంతెందుకు నా తొలి ప్రేమలో కూడా నేను అలాగే తలమునకలవుతూ ఆమెను పలు రకాలుగా విసిగించేవాడిని. అందుకేనేమో పెళ్ళి చేస్కుందామని నేనంటే ఆమె నన్ను లైట్ తీసుకుంది. కొన్నేళ్ళయ్యాక చూద్దాంలే అంది. దాంతో నాకు వళ్ళు మండి ఆమెని వదిలేసాను. మా ఫ్రెండ్సు కి కూడా నా ఉదాహరణ చెప్పి అలా విసిగించకండయ్యా బాబూ అని చెప్పాకానీ ఎక్కడా వాళ్ళు వింటే కదా.

  కైరోప్రాక్టికుతో తీరే కష్టాలేంటి?

  (కైరోప్రాక్టిక్ పుస్తకం కోసం)
   
  మన వెన్నెముకలోని ఏఏ ప్రాంతాలు సరిగా లేకపోతే వాటి ప్రభావం మన శరీరంలోని ఏఏ అంగాల మీద పడుతుంది మరియు వాటియొక్క లక్షణాలు ఏంటి అనేది పైన వున్న చిత్రంలో వివరంగా ఇచ్చారు.  అది క్లిక్ చేసి అవసరం అయితే పెద్దదిగా చేసి వివరాలు చూడండి. మీకు ఆయా లక్షణాలు వుంటే కైరో ట్రీట్మెంట్ ప్రయత్నించి చూడవచ్చు. ఆయా లక్షణాల ద్వారా వచ్చే ఉపలక్షణాలు వున్నా కూడా మూల కారణాన్ని సవరించేందుకై ఈ చికిత్స తీసుకొని చూడవచ్చు. ఏదయినా ఒక అవలక్షణం వుంటే దానికి ఎన్నో కారణాలు వుండవచ్చు. అయితే దాని వెనుక కారణం వెన్నెముక సరిగా లేకపోవడం అయినట్లయితే మాత్రం ఈ విధానం వల్ల ఫలితం వుండవచ్చు.  ముఖ్యంగా మీరు ఎన్నో ఇతర ప్రయత్నాలు చేసినా కూడా మీ పరిస్థితిలో మెరుగుదల లేకపోయినట్లయితే  మాత్రం ఇది తప్పకుండా ప్రయత్నించి చూడాల్సిందిగా  సలహా ఇస్తున్నాను.

  ఈ క్రింది 3 డి మరియు ఇంటరేక్టివ్ చిత్రం ద్వారా వెన్నెముక యొక్క ఒక్కొక్క ప్రాతం ఏ విధంగా ఒక్కో అవయవం మీద ప్రభావం చూపుతుందో తెలుసుకోవచ్చు.

  సరి అయిన కైరోప్రాక్టరుని ఎన్నిక చేసుకోవడం ఎలా?

  (కైరోప్రాక్టిక్ పుస్తకం కోసం వ్రాసిన వ్యాసం)

  ప్రతి వృత్తిలోనూ. వైద్యుల్లోనూ పలు మోసగాళ్ళు వున్నట్టే ఈ వృత్తిలోనూ మోసగాళ్ళు వుండవచ్చు. వారికి సరి అయిన విద్యార్హతలు కానీ, అనుభవం కానీ వుండకపోవచ్చు. ఎక్కడో ఆషామాషీగా నేర్చుకొని మీ వెన్నెముక మీదనే ప్రయోగాలు చేసి పరిపూర్ణులవ్వాలని అనుకుంటుండవచ్చు. ఇండియాలో అయితే బార్బర్ షాపుకి వెళ్ళి మంగలివారితో ఎంచక్కా మెడలు విరగ్గొట్టించుకోగలము కానీ అలా అందరి చేతికీ ఆషామాషీగా మన వెన్నుముకను ఇవ్వలేము కదా. బాగుచేసేదేమో కానీ భ్రష్టు పట్టిస్తే  వున్నవాటికి తోడుగా మరికొన్ని సమస్యలు చేరి అవస్థల పాలవుతాం. అందుచేత వెన్నెముక అనేది మన శరీరంలోని అతి ముఖ్యమయిన భాగాల్లో ఒకటి కాబట్టి  చాలా జాగ్రత్త అవసరం. వైద్యం వికటిస్తే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

  పాశ్చాత్య దేశాలలో ప్రమాణాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి ప్రాక్టీసు చేసేవారందరూ ఏదో ఒక మంచి ప్రొఫెషనల్ కాలేజీలోనే చదివివచ్చి వుంటారు. ఇండియాలో వున్న కైరోప్రాక్టర్లు  ఎలా విద్యార్హతలు సాధిస్తారో నాకు తెలియదు.  ఈ ప్రాక్టీసు నేర్పే మెడికల్ కాలేజీలు అక్కడ వున్నాయా లేక విదేశాల్లో నేర్చుకొని వచ్చి అక్కడ ప్రాక్టీసు చేస్తారా అన్నది కనుక్కోవాల్సిన విషయమే.

  కైరోప్రాక్టిక్ సంస్థలో వైద్యం కోసం చేరేముందు కానీ లేదా కైరోప్రాక్టర్ దగ్గర చేరే ముందు గానీ ఆ సంస్థ గురించి, ఆ డాక్టర్ గురించి కొద్దిగా నెట్టులో రెసెర్చ్ చేసి వెళ్ళడం వల్ల కాస్త అవగాహన పెరగొచ్చు. సంస్థల మీద సాధారనంగా నెట్టులో మెచ్చుకోళ్ళు తక్కువా, ఫిర్యాదులు ఎక్కువా వుండటం సహజమే కాబట్టి ఫిర్యాదులు ఎక్కువ కనిపించినా కంగారు పడనవసరం లేదు కానీ మీకు కూడా సంశయాత్మకంగా అనిపిస్తే వెరిఫై చేసుకొని వెళ్ళడం మంచిది.  మీకు ఆరోగ్య భీమా వుంటే అది ఎంతవరకు కవర్ చేస్తుంది మీరు ఎంతవరకు చేతినుండి పెట్టుకోవాలి అనే విషయాల పట్ల అవగాహన అవసరం. కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే మీ భీమా ఆ వైద్యుడిని కవర్ చేస్తుందా, చేస్తే ఎంతవరకు కవర్ అవుతాయి అనే విషయాలు మీ ఇన్సూరెన్స్ సంస్థతో మాట్లాడి కనుక్కొని వెళ్ళడం మంచిది.

  కైరోప్రాక్టర్ నమ్మదగ్గ విషయాలే చెబుతున్నాడా లేక అతిశయోక్తులు చెబుతున్నాడా అనేది గమనించండి. వారి ఒత్తిడి మేరకు కాకుండా మీకు నమ్మకం వుంటేనే చికిత్సలో చేరండి. ఏ ఆరోగ్య సమస్యనయినా చిటికెలో నయం చేయగలమని ప్రగల్భాలు పలుకుతున్నారేమో చూడండి. కైరో సెంటర్ కానీ, కైరో డాక్టర్ కానీ మీకు విశ్వాసం కలిగించలేకపోతే వెనక్కి రండి. ఈ డాక్టర్ కాకపోతే ఇంకొకరు. సందేహంగా అనిపించినప్పుడు, సమర్ధత లేదనిపించినప్పుడు మొహమాటానికి వెళ్ళి నడుములు విరగ్గొట్టించుకోవాల్సిన అగత్యం లేదు కదా.

  మీరు ఈ విధానంలో చికిత్స తీసుకోవాలనుకున్నప్పుడు మీ బంధుమిత్రులు కానీ, కోలీగ్స్ కానీ ఈ చికిత్సకు వెళ్ళారేమో కనుక్కొని వారు సూచించిన వైద్యుని దగ్గరికి వెళితే మీకు ఇంకా నమ్మకంగా వుంటుంది. ఫలితాలు వుంటేనే ఎవరయినా రికమెండ్ చేస్తారు కాబట్టి మీకూ మంచి ఫలితాలు ఒనగూడే అవకాశాలు వుంటాయి.

  కొన్ని సార్లు కొద్దిపాటి రుసుముతో వెన్నెముక ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని స్టాల్స్ పెట్టి మరీ చెబుతుండవచ్చు. మేము వెళుతున్న కైరో సెంటర్ మాకు అలాగే తెలిసింది. కేవలం 20 డాలర్లకి ప్రాధమిక పరీక్షలు చేసి ఇస్తాం అన్నారు. సరే అని మా ఆవిడని చూపించాను. వెన్నెముకలో సమస్యలున్నాయన్నారు. ప్రయత్నించి చూద్దాం అనుకున్నాం. చికిత్స తీసుకున్నాం. అలా వారూ విన్ అయ్యారు మేమూ విన్ అయ్యాము.  విన్ విన్ స్థితి. ఇలాంటి స్థితి అన్ని పార్టీలకీ మేలు చేస్తుంది. అయితే అలాంటి ఉచిత పరీక్షలకి వెళ్ళినప్పుడు సాధారణంగా అందరి వెన్నెముకలూ పర్ఫెక్టుగా వుండవు కనుక చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ అయినా బయటపడుతుంటాయి. అవి పెద్దపెద్ద సమస్యలు కానప్పటికీ మీలో మీరు గుర్తించలేని సమస్యలు ఇప్పటికే కలగజేస్తుండవచ్చు. అవి తక్షణ సమస్యలు కానప్పటికీ అవీ అలాగే వదిలేస్తే మున్ముందు ముదిరిపోవచ్చు. అలాంటప్పుడు చికిత్స తీసుకోవాలా లేక తిరస్కరించాలా అన్నది వివిధ ఆంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయించుకోవాల్సి వుంటుంది.

  కైరోప్రాక్టిక్ ట్రీట్‌మెంట్ పనిచేస్తుందా?


  (కైరోప్రాక్టిక్ పుస్తకం కోసం వ్రాస్తున్న వ్యాసం)

  అలోపతినే కాకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఎన్నో వున్నాయి. మన ఆయుర్వేద కూడా అదే కదా. అయితే సాధారణ వైద్యులకి అలాంటి ప్రత్యామ్నాయ వైద్యం అంటే అంతగా గురి వుండదు.  తమ విధానాలని తప్ప మిగతావాటిని తరచుగా నిరసిస్తుంటారు. రోగులుగా  మనకు కావాల్సింది మన సమస్య నుండి ఉపశమనం. అది ఏ విధానం అయినా ఫరవాలేదు - ప్రమాదకరమయినది కాకుంటే చాలు. అన్ని విధానాలు అన్ని జబ్బులని నయం చేయకపొవచ్చు కానీ ఒక్కో విధానమూ దాని ప్రత్యేకతను బట్టి కొన్ని సమస్యలను దూరం చేస్తుండవచ్చు. 

  మనం ఏదయినా సమస్య వస్తే సాధారణంగా సాధారణ వైద్యుని దగ్గరికి వెళతాం. అక్కడ తగ్గకపోతే ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అలానూ తగ్గకపోతే ఇతర విధానాల వైపు చూస్తాం. అలా ఒక్కో నమ్మకమయిన విధానమూ ప్రయత్నిస్తూ పొవాల్సిందే.  ఏదో ఒక విధానం మన సమస్యకు సరిగ్గా సూట్ అవచ్చు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. మన సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది. మరి మీరు అలా మీ ఆరోగ్య సమస్యా పరిష్కారం కోసం ఒక్కోటీ ప్రయత్నిస్తూ వుంటారా లేక అది ఇక మొండి జబ్బు అని అవస్థపడుతుంటారా?

  ఒక్క శారీరక సమస్యలే కాదు ఏ సమస్య అయినా పరిష్కారం అయ్యేదాకా పలు మార్లు, పలు విధాలుగా ప్రయత్నిస్తూ పోవాల్సిందే.  ఎప్పుడో ఒకప్పుడు, ఎలాగోలా పరిష్కారం దొరుకుతుంది. అప్పటిదాకా ఆ జవాబు కోసం అన్వేషణ సాగిస్తూ వుండాల్సిందే. అలా నేను ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాను. ఇంకా కొన్ని సమస్యలకు పరిష్కారం వెతుకుతూనే వున్నాను. ఎవరో ఒకరు చెప్పినదానిని విని సమాధానపడి అక్కడే ఆగిపోవద్దు. అక్కడే ఆగిపోతే ఆ సమస్యల్లోనే, ఆ అవస్థల్లోనే అలాగే వుండిపోతాం. అలా కాకుండా ప్రయత్నిస్తూ పోతుంటే కొత్త విషయాలు తెలుస్తుంటాయి, మన సమస్య మీద మనకు అవగాహన విస్తృతం అవుతుంది.

  అలాగే మీరు చేసే ఆ ప్రయత్నాల్లొ కైరోప్రాక్టిక్ కూడా ఒకటి అవచ్చు. మీకు నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు వుంటే ఈ చికిత్స మీకు భేషుగ్గా పనిచేస్తుండవచ్చు. ఇంకా చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది అంటారు కానీ వాటి గురించి పూర్తి స్థాయిలో రెసెర్చ్ జరగలేదు కాబట్టి ప్రయత్నించి చూడవచ్చు. మీకు ఏ శారీరక సమస్య కానీ, మానసిక సమస్య కానీ వున్నట్లయితే ఈ విధానం వల్ల ఉపయోగం వుండవచ్చేమో తెలుసుకోండి.

  కైరోప్రాక్టర్లు అంటే వెన్నెముక నిపుణులు. వెన్నెముక ఇంజినీర్లు గా అనుకోవచ్చు.  మన ఆరోగ్య సమస్యలు చాలావరకు మన వెన్నెముక సరిగ్గా లేనందువల్లనే వస్తాయి అని వారు విశ్వసిస్తారు. ఎక్సురేలు, శారీరక పరీక్షలు, తదితర ఎక్కువ ఖర్చు కాని పరీక్షలు చేసి మన వెన్నెముకలో వున్న సమస్యలని గుర్తిస్తారు. వెన్నెముకలోని ఎముకల కూర్పు సరిగా లేకపోతే అందులోంచి వచ్చే నరాలు ఒత్తిడి చెంది స్పందనలు సరిగ్గా ప్రసరించక, రక్తం సరిగ్గా ప్రవహించకా పలు ఇబ్బందులు ఏర్పడుతాయి అనేది వారి సిద్ధాంతం. అందుకే వారు వెన్నెముక సరిచేయడం ద్వారా సమస్యలని పరిష్కరిస్తుంటారు. వెన్నెముక యొక్క ప్రాధాన్యత గురించి మీకు తెలుసు కదా. అయినా సరే దాని గురించి మరోసారి చెప్పుకుందాం.

  మిగతా అన్ని ప్రయత్నాలు చేసి, అవస్థ పడి వారి దగ్గరికి రాకుండా ముందే వారి విధానాన్ని ప్రయత్నించమంటారు. సులభంగా సాల్వ్ అయ్యేపనికి ఎన్నో డబ్బులూ, ఎంతో శ్రమా, ఎన్నో మందులూ, మాకులూ ఎందుకంటారు.  అందువలన సమస్యలు వున్న వారే కాకుండా ఆరోగ్యవంతులు కూడా వెన్నెముక పరీక్షించుకుంటే రాబోయే సమస్యలూ, నిద్రాణమయిన సమస్యలూ తెలుస్తాయి. మీరు కన్విన్స్ అయితే చికిత్స మొదలెట్టుకోవచ్చు లేకపోతే లేదు. అయితే మనం పరిపూర్ణంగా వుండటం అనేది అరుదు కాబట్టి చిన్నవో పెద్దవో వెన్నెముక సమస్యలు తేలుతూనే వుంటాయి. వాటిని ఇప్పుడే సరిదిద్దుకోవాలా లేక అలక్ష్యం చేసి ముదిరాక సర్దుబాట్లు చేసుకోవాలా అన్నది మీ ఇష్టం.

  అయితే దీని మీద గురి కుదిరేదెలా? మీరు పెద్దగా విని వుండని చికిత్సా విధానం గురించి మీకు నమ్మకం వుండాలి కదా. అందుకే ఇతర విధాల మెరుగుపడని జబ్బులు, సమస్యలు మీకు గానీ, మీకు తెలిసినవారికి గానీ వుంటే ఈ విధానం ప్రయత్నించండి. వారికి ఉపశమనం కలిగితే మీకు ఈ విధానం పట్ల ఆసక్తి పెరగవచ్చు. అప్పుడు మీరు కూడా ప్రస్థుతం ఆరోగ్యవంతులుగానే వున్నా కూడా ఓ సారి మీ వెన్నెముక ఏ స్థితిలో వుందో  పరీక్షించుకోవచ్చు.

  కైరోప్రాక్టిక్ మీద పుస్తకం

  అంతర్ముఖి పుస్తకం ప్రూఫ్ రీడింగ్ అయిపోయి చివరి దశ ఎడిటింగులో వుంది. బ్లాగుల మీది పుస్తకం కొన్ని కారణాలవల్ల ప్రస్థుతానికయితే పక్కన పడేసాను. 

  ఇక పై కైరో మీద పుస్తకం వ్రాయదలుచుకున్నాను. అందు గురించి ముందుగా ఈ బ్లాగులో వరుసగా టపాలు వెలువడుతాయి.  మీలో ఎక్కువమందికి ఆ టాపిక్ మీద ఆసక్తి లేదనుకుంటాను కానీ తెలుగు వారికి చాలా మందికి ఈ విషయం పట్ల అవగాహన లేదు కాబట్టి ఈ పుస్తకంతో అది పరిచయం చెయ్యబోతున్నాను.  కైరో వల్ల మాకు ప్రయోజనాలు కలుగుతున్నాయి కాబట్టి అది పదిమందికీ ఉపయొగపడవచ్చనే  ఉద్దేశ్యంతో ఈ పుస్తకం కోసం ఉపక్రమిస్తున్నాను. కైరో తో మాకు కలిగిన అనుభవాలు కూడా వరుసగా పొందుపరుస్తాను కాబట్టి ఒక రియాలిటీ పుస్తకంగా కూడా అవుతుంది. ఒకవేళ మేము ఆశించిన ప్రయోజనాలు సమకూరకపోయినా అందులో తెలియజేస్తాను.

  ఇందువల్ల కలిగే ప్రయోజనాలతో పాటుగా దీని మీద వున్న విమర్శలు, అపోహలు కూడా వివరిస్తాను. ఇందులో జరిగే మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నాకు తెలిసినంత వరకు పొందుపరుస్తాను. మీరు ఎవరయినా నిర్మాణాత్మక వ్యాఖ్యల ద్వారా ఈ విషయానికి సహకరించినా అవి పొందుపరుస్తాను.

  కార్పెట్ కష్టాలు

  మా చిన్నప్పుడు ఇళ్లళ్ళో ఎంత చక్కగా ఆడుకునేవారం! ఎగిరేవారం, దుమికేవారం, పారబోసేవారం, మట్టి కాళ్ళతో వచ్చేవారం, తడికాళ్లతో తన్నుకునేవారం. హ్మ్ - ఇప్పుడో ఏమీ పారబొయ్యడానికి వీల్లేదు, ఏమీ ఒలకబొయ్యడానికి వీల్లేదు, మట్టికాళ్ళతో నడవడానికి వీల్లేదు. ఇల్లంతా కార్పెటండీ బాబూ - కార్పెట్. ఇళ్ళాన్నీ అద్దాల మేడలు అయిపోయి బహు సున్నితం అయిపోతున్నాయి. ఇంట్లో పిల్లలకి గాని పెద్దలకి గానీ పెద్దగా స్వేఛ్ఛ లేకుండా అయిపోతోంది. ఏదయినా సరే జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా తాగాలి, జాగ్రత్తగా ఆడుకోవాలి. మరక పడిందంటే చాలు మన మూడ్ ఆఫ్. అది కనిపించకుండా పొయ్యేదాకా, కనుమరుగయ్యేదాకా అష్టకష్టాలు. అయినా సరే మొండికేసిందా మనల్ని వెక్కిరిస్తూ మన కళ్ళెదుట కనిపిస్తూనే వుంటుంది.
   
  మనది కిరాయి కొంపయితే ఆ ఇల్లు మారేటప్పుడు ఇల్లు ఓనర్ ఆ మరకకు గాను ముక్కుపట్టి డబ్బులు వసూలు చేస్తాడు. మనది స్వంత ఇల్లు అయితే ఇల్లు అమ్మేటప్పుడు కొత్త కార్పెట్ వేసివ్వాలి లేదా ధర తక్కువ కయినా అమ్ముకోవాల్సి వుంటుంది. అందుకే ఇలాంటి సమస్యల వల్లనే స్వంత ఇళ్ళున్న వారిలో చాలామంది ఆ ఇంట్లో వుండటం కన్నా రేపు అమ్ముడుపోయే ధర కోసమే ఆలోచిస్తుంటారు. అద్దాల మేడలా జాగ్రత్తగా కాపాడుకుంటూ తమ కోసం బ్రతకకుండా ఇల్లు కోసం బ్రతికేస్తుంటారు. ఎక్కడ ఆ ఇల్లుకి మచ్చ పడుతుందో, ఎక్కడ కార్పెట్ ఖరాబవుతూందో అని అనునిత్యం ఆందోళన పడుతుంటారు.
   
  మనకు చిన్నపిల్లలున్నారంటే చాలు మనకుండే కంగారుకి తోడుగా మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ కార్పెట్ ఎక్కడ ఖరాబు చేస్తారో అనే బెంగ ఒకటి. ఎంత మన ముచ్చట్లల్లో మనమున్నా మన పిల్లలు ఏం చేస్తున్నారా అనీ అందుకోసమయినా పిల్లలని ఓ కంట కనిపెడుతూ వుండాల్సిందే. మరీ చిన్న పిల్లలు అయితే తినేటప్పుడు ఎక్కడ వాంతి చేసుకుంటారో అని ఇంటి బయటకు వెళ్ళి తినిపించాల్సి వుంటుంది.
   
  ఇండియాలో ఇంకా ఈ కార్పెట్ సంస్కృతి పెద్దగా రావట్లేదనుకుంటాను. సంతోషం. మా దగ్గరి దుర్లభమయిన చలికాలంలో కాళ్ళకు చలిపెట్టకుండా కార్పెట్ కానీ, చెక్క ఫ్లోర్ కానీ వేస్తారు. (నాప) రాయి వేస్తే పాదాలకు బాగా చలి పెడుతుంది కాబట్టి సాధారణంగా వెయ్యరు. వేసినా వంటగది, బాత్ రూముల్లో మాత్రమే వేస్తారు. మేము కెనడాలో వున్నపుడు సాధారణంగా చెక్క ఫ్లోర్ వుంటుండేది. అది శుభ్రపరచుకొవడానికి సౌకర్యంగా వుండేది. దుమ్ము, ధూళి వున్నా కనపడేది. అందుకు గాను రోజుకోసారి అయినా ఊడ్చేవాళ్ళం. ఏదన్నా మట్టి, మురికి పడ్డా నీళ్ళతో సులభంగా కడిగేసేవారం. యు ఎస్ లో ఎక్కువగా కార్పెటెడ్ ఇళ్ళే దొరుకుతున్నాయి. కార్పెట్ మీద దుమ్మూ, ధూళి వున్నా కూడా కనపడదు కాబట్టి వెంఠనే వెళ్ళి శుభ్రం చెయ్యాలి అని అనిపించదు. పైగా ఇల్లంతా వాక్యూం చెయ్యాలంటే అదో ప్రత్యేకమయిన పని కాబట్టి వారానికో సారి జరుగుతుంటుంది ఆ పని. ఇహ చేతగాకపోతేనో, తీరికలేకపోతేనో వచ్చే వారాంతం, వచ్చే వారాంతం అనుకుంటూ లేదా నువ్వు వాక్యూం చెయ్యి అంటే నువ్వు వాక్యూం చెయ్యి అనేసుకుంటూ  అలా అలా వారాలు గడుస్తుంటాయి. ఈలోగా అప్పుడప్పుడు ఓ నెల అయినా గడిచిపోవడం కద్దు. ఇలా ఈ కార్పెట్లు ఏం పరిశుభ్రమో అర్ధం కాదు.
    
  ఇవన్నీ చూస్తుంటే మన పాదాలకి కార్పెట్లు కావాలన్నంత మెత్తదనం అవసరమా అనిపిస్తుంది. స్వేఛ్ఛగా, పిల్లల్లా ఆడుకోలేని పిల్లలని చూస్తుంటే వారిమీద జాలేస్తుంది. నాకయితే నా చిన్నప్పటి నాపరాతి ఇళ్ళే నయం అనిపిస్తుంది. అంతగ్గాకపోతే హార్డ్‌వుడ్ ఫ్లోర్లయినా ఫర్వాలేదు కానీ ఈ కార్పెట్ కష్టాలయితే నాకు ఒద్దు బాబూ అనిపిస్తుంది కానీ ప్రస్థుతం అయితే అవి తప్పేట్లుగా లేవు.

  బాడీ బ్యుల్డింగ్ చెయ్యాలనే...

  చాలా ఏళ్ళ క్రితం గుంటూరులోని రవి కళాశాలలో చేరాను. అంటే పాఠశాల విద్యార్ధిగా అనుకోకండి. వారు తొలిసారిగా పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం పెట్టారు. సెంట్రల్ సివిల్స్ కీ కోచింగ్ పెడితే చేరిపోయా. కలెక్టర్ అయిపోతానని కాదులెండి కానీ దానికి బాణం ఎక్కుపెడితే బిల్లు కలెక్టర్ అయినా కాకపొతానా అనేది నా భావన. నా ఇనుప కాలు మహిమ వల్ల మూడు నెలలకే వారు ఆ కేంద్రాన్ని మూసివేసారు లెండి. అప్పుడు రవి కళాశాల నిర్వాహకులు ధన్ గారి పరిచయ భాగ్యం కలిగింది. మనిషి సింహం లాగా వుండేవారు - అలాగే గర్జించేవారు.

  మనం ఎప్పుడయినా బాణం లక్ష్యం మీదికి గురిపెట్టినప్పుడు లక్ష్యం ఎత్తుకంటే కోణం కాస్త ఎత్తుగా పెట్టాలి. లక్ష్యం ఎత్తులోనే బాణం పెట్టి వదిలేస్తే భూమ్యాకర్షణ శక్తి, గాలి తదితర కారణాల వల్ల క్రిందకు తగిలి ఆ బాణం లక్ష్యాన్ని అందుకోదు. అలాగే మనం ఏ లక్ష్యం పెట్టుకున్నా ఇతరత్రా ఆకర్షణలూ, ఆటంకాలూ, అవరోధాలు ఎన్నో వుంటాయి కాబట్టి చేరినా చేరకపోయినా మన లక్ష్యం మనకు అవసరమయినదానికంటే కాస్తయినా పెద్దగా వుండాలి. తెలుగులో ఏదో సామెత వుంది సరిగ్గా గుర్తుకురావడం లేదు... చావుకి వేస్తే లంఖణానికి వస్తుంది అనో ఏదో వుంటుంది. అలా మనం పెద్ద లక్ష్యం కోసం కృషి చేసినప్పుడు పరిమిత లక్ష్యం అయినా చేరుతుంది. పెద్ద లక్ష్యమూ మన దరిచేరిందా - ఇంకేం మనకి మంచి బోనస్ కూడా లభించినట్లే కదా.

  నేను తొలిసారిగా కంప్యూటర్ కోర్సు మెగాబైట్ సంస్థలో నేర్చుకున్నాను. అది జాతీయ సంస్థ అవడంతో దేశ వ్యాప్తంగా దానికి శాఖలుండేవి. ఆ కోర్సు చేసున్న కాలంలో ఆ సంస్థ పరీక్షల్లో దేశవ్యాప్తంగా ప్రధముడిగా రావాలని విశేషంగా కృషిచేసాను. చివరకు అలా రాలేకపోయాను కానీ మా శాఖలో మాత్రం ప్రధముడిగా నిలిచాను. అలా కాకుండా మా శాఖలో ప్రధముడిగా రావాలని మాత్రమే ప్రయత్నించి వుంటే మా శాఖలో చివరినుండి మొదటి వాడిగా వచ్చేవాడినేమో. అలా అప్పుడప్పుడు మంచి మంచి విధానాలు పాటిస్తుంటాను - విజయం సాధిస్తుంటాను కానీ చాలాసార్లు అలా కుదరక చతికిలపడిపోతుంటాను.

  ఇంతకీ నేను చెప్పొచ్చేదేమంటే ఆథ్లెటిక్ బాడీ కోసం ప్రయత్నిస్తున్నా అన్నా కదా. అది లక్ష్యంగా పెట్టుకుంటే ఇలాగే మిగిలిపోయేలా వున్నా. అందుకే అంతకు మించిన లక్ష్యం పెట్టుకొని శ్రమించాలనుకుంటున్నా. అలా కృషి చేస్తేనే ఆథ్లెటిక్ బాడీ అయినా సాధించగలను. బాడీ బ్యుల్డర్ బాడీ కూడా వచ్చేస్తే ఇంకేం మహదానందం కాదూ. అంత దృశ్యం వుండకపోవచ్చును లెండి కానీ నన్నయితే ప్రయత్నించనివ్వండీ. చూద్దాం, ప్రస్థుతం వున్న ఫ్యామిలీ ప్యాక్ నుండి ఏ ప్యాక్ వరకు వెళతానో. మరీ సిక్స్ ప్యాక్ కాకపోయినా సెక్సీ ప్యాక్ అయినా ఫరవాలేదు కదా.

  మూడువారాల నుండి విజయవంతంగా, క్రమం తప్పకుండా జిమ్ముకి వెళ్ళి బరువులు ఎత్తుతున్నాను. ఇదివరలో ఎన్ని సార్లు జిమ్ముకి వెళ్ళినా కూడా ఈమాత్రం సక్సెస్ సాధించిందిలేదు. అందుకే నా మీద నాకు నమ్మకాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే కొంగ్రొత్త లక్ష్యాలు మదిలో మెదులుతున్నాయి. మనస్సు ఉరకలు వేస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా నా శరీరాన్ని కూడా పరుగెత్తించడమే ఇహ నేను చెయ్యాల్సింది.

  అన్నట్టు బాడీ బ్యుల్డింగు గురించి చదువుతున్నప్పుడు ఒక చిట్కా నాకు నచ్చింది. అప్పుడప్పుడు బాడీని ఫోటోలు తీసుకొని ఎదురుగ్గా పెట్టుకుంటే అభివృద్ధి తెలుస్తుందనీ, ఎంకరేజింగుగా వుంటుందనీ. ఎదురుగ్గా ఏం ఖర్మ, ఎంచక్కా నా బ్లాగులోనే ఆ ఫోటోలు పడేస్తా. సిద్ధంగా వుండండి మరి!

  కైరో కాలక్షేపం

  సాధారణంగా వైద్యుని దగ్గరికో, చికిత్సకో వెళితే మననొక గదిలోకి తీసుకువెళ్ళి చికిత్స చేసి పంపిస్తారు. మా కైరో సెంటర్ అలా కాదు. గ్రూపు చికిత్సలా అనిపించి ఉత్సాహంగా వుంటుంది. అందరం పక్కపక్కనే కూర్చొని నడుము వ్యాయామాలు చేస్తుంటాము. ఒక్కొక్కరినీ వరుసగా పిలిచి మా ఎదురుగానే ఒక్కొక్కరి నడుమునూ ఆ వైద్యులు విరగ్గొట్టి పంపిస్తుంటారు...ఖంగారు పడకండి...నేను అనేదేమంటే వెన్నుపూస సర్దుబాటు చేసి పంపిస్తుంటారు. మరో పక్కన తల్లితండ్రులతో పాటుగా వచ్చిన పిల్లకాయలు అక్కడి ఆటస్థలంలోనే కాకుండా మేమున్న ప్రదేశానికి వచ్చి అల్లరల్లరిగా ఆడుకుంటుంటారు. మరో పక్క టివిలో మంచి సినిమాలు వస్తుంటాయి.

  అక్కడ మాకే కాకుండా పిల్లలకీ మంచి కాలక్షేపం అవుతుంటుంది కాబట్టి అమ్మలు రోజూ మాతో ఉత్సాహంగా వస్తుంటుంది. అది వచ్చి ఆ సెంటరు అంతా హడావిడిగా చుట్టేస్తూ అక్కడికి వచ్చిన పిల్లలని ఎంచక్కా ఆడిస్తుంది. వీడియోలో ఏదయినా సినిమా అయిపోతే దానికి ఇష్టం వచ్చిన సినిమా అడిగి మరీ పెట్టించుకుంటుంది. స్టాఫ్ కి ముచ్చట్లు చెబుతుంది. డాక్టర్లతో పరిహాసాలు ఆడుతుంది. మాతో పాటు వ్యాయామాలూ చేస్తుంది.

  మా స్నేహితుని కుటుంబం కూడా అందులో చేరారు కాబట్టి మేము అందరం కబుర్లు చెప్పుకుంటూ అక్కడి వ్యాయామాలు చేస్తుంటే కాలమూ, శ్రమా తెలియకుండా అయిపోతోంది. ఆ సెంటర్ వారియొక్క వ్యాపారం నాలాంటి (బకరా?) వారివల్ల మూడు పూవులూ, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది కాబట్టి హడావిడిగా, రణగొణధ్వనులతో, పిల్లల కేరింతలతో, సినిమా శబ్దాలతో కలిసి అది ఒక తిరనాల లాగా అయిపోయి సరదాగా వుంటోంది. అలా అది మాకు రోజూ సాయంత్రం ఓ పాస్‌టైం లాగా అయిపోయింది.

  మీరు ఒహవేళ కైరోప్రాక్టరుని చూసుకోవాలనుకుంటే కూడా మా దానిలాంటి సెంటరునే చూసుకోండి. మీ చికిత్స సమయంలో మీరు ఒక్కరే గడపాలంటే బోరు కొట్టి రోజూ రావాలని అనిపించకపోవచ్చు. అయితే మీరు ప్రైవసీకి, ప్రశాంతతకు, గుంభనానికి ప్రాధాన్యం ఇచ్చేవారు అయితే మీకు ఇలాంటి కైరో కేంద్రాలు నచ్చకపోవచ్చు. ఏ సెంటరు ఎలా వున్నా కూడా ఫలితాలు ముఖ్యం అనే సంగతి మనకు తెలుసు కదండీ. అయితే మంచి ఫలితాలు రావాలంటే రోజూ వెళ్ళలనిపించేదిగా వుండాలి. ఆ, బోర్, ఇవాళ ఏం వెళ్తాములే బాబూ అనిపించేట్లయితే ఇంకా ఫలితాల దగ్గరికి ఏం వెళతాము చెప్పండి?

  మా ఆవిడకు కొన్ని విషయాల్లో దొరికిన ఉపశమనం

  రిలీఫ్ కి తెలుగు పదం ఏంటి?

  మొదటిది - కారు: ఆమె కారు లైసెన్స్ తెచ్చుకున్నదంతా ఓ పెద్ద కథ. ఎందుకు అంత ఆలస్యమయ్యిందని నేను ఓ పోస్ట్ వేస్తే అంతా తనని బ్లేం చేస్తూ వ్రాస్తాను. తను పోస్ట్ వ్రాస్తే నన్ను మొత్తం బ్లేం చేస్తూ వ్రాసేస్తుంది కనుక వివరాలు వద్దు లెండి కానీ మొత్తమ్మీద కొన్ని నెలల క్రితం ఎలాగోలా లైసెన్స్ తెచ్చేసుకుంది. అప్పటినుండీ తనదంతా ఇహ వీరవిహారమే. నేను ఏ పనికయినా అవసరం పడ్డప్పుడు మాత్రం నన్ను కారులో కుదేసుకొని తీసుకెళుతుంటుంది. మా పెద్దమ్మాయీ కారెక్కితే నన్ను వెనక సీట్లోకి విసిరేస్తారు. ఇంకా నయ్యం, తన స్నేహితురాళ్ళు ఎక్కిన సందర్భం ఇంకా రాలేదు, అప్పుడు అందరూ కలిసి నన్ను తప్పకుండా డిక్కీలోకి తోసేస్తారు.
   
  మా చరిత్రలోకి వెళితే తనకు డ్రైవింగ్ లైసెన్స్ రాకముందు దృశ్యం ఇలా వుండేది. నేను ఆఫీసులో బాహ్గా పనిచేసి అలసిసొలసి ఇంటికి వస్తానా... బయటకి షాపింగుకో లేక విండో షాపింగులో వెళ్ళడానికి మా ఆవిడ తయ్యారుగా వుండేది. నాకేమో కాస్త భోంచేసి, కాస్త నెట్టు చూసి, కాస్త కునుకేసి విశ్రాంతి తీసుకోవాలని వుండేది. మా ఆవిడ రోజంతా ఇంట్లో వుంటుంది కదా అలా టవున్ అంతా తిరగేసి రావాలని వుండేంది. అలా ఘర్షణ ఉద్భవించేది. అప్పుడప్పుడు ఆమెను షాపింగ్ మాళ్ళల్లో దించేసి కారులో నెట్టు చూస్తూనో, కునుకేస్తూనో విశ్రాంతి తీసుకునేవాడిని. ఆమెకు డ్రవింగ్ లైసెన్స్ రావడమూ, తనకో కారు కొనియ్యడం జరిగిపోవడంతో తన పనులు తాను చూసుకుంటోంది, నా పనులు నేను చూసుకుంటున్నాను. అలా ఇద్దరి ప్రాణాలకీ ఇప్పుడు ఆ రకంగా హాయిగా వుంది.
   
  రెండవది - నొప్పులు:  అనితకి చాలా ఏళ్ళుగా ఎవేవో తీవ్రమయిన నొప్పులు వుంటూ వచ్చాయి. ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రయోజనం శూన్యం అయిపోయింది. కొన్ని నెలల నుండి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ నొప్పులన్నీ నిమ్మళిస్తూవుండటంతో తనకి చాలా రిలీఫ్ వచ్చింది. బోలెడంత ఉత్సాహంతో వుంటూ వస్తోంది. ఇదివరలో ఇన్నేళ్ళుగా తన నొప్పుల బాధలన్నీ బకరా గాడిని ఇంట్లో నేను తప్ప ఆమెకు మరొకరు దొరకరు కనుక ఎంచక్కా నామీద తీర్చేసుకునేది. అంటే అమెకు నొప్పి ఎక్కువయినప్పుడల్లా నన్ను ఎందుకో అందుకు దులిపేస్తూ అంతో ఇంతో ప్రశాంతత పొందేది. నేను ఏదన్నా అన్నా కూడా అసలే బాధల్లొ వుండేది కనుక తనూ కయ్య్ మనేది. అలా ఇంట్లో ప్రశాంతమయిన, ఉత్సాహవంతమయిన వాతావరణం అప్పుడప్పుడు లోపించేది. ఇప్పుడు ఏవయినా ఘర్షణలు వచ్చినా ఎక్కువభాగం నవ్వుకుంటూ వాదించుకుంటున్నాము కనుక త్వరగానే తేలిపోతున్నాయి. అలా ఆమెకూ, నాకూ ఇందులోనుండి విముక్తి దొరికింది. 
   
  మూడవది - నానుండి: ఎందుకులెండి మీకు ఆ వివరాలన్నీనూ :)
   
  ఇంకో విశ్రాంతి కూడా ఆమెకు దొరికిందండోయ్. అయితే అది ఈమధ్య కాదులెండి. ఓ మూడేళ్ళ నుండీ వుంది. ఇదివరలో తను ఏమీ సంపాదించేది కాదు కనుక ప్రతి పైసాకీ నన్ను అడగాల్సి వచ్చేది. ఇప్పుడు తాను కూడా అంతో ఇంతో శ్రమ పడుతూ తన పాకెట్ మనీ ఖర్చుల కోసమూ, ఇతర ఖర్చుల కోసమూ, తన యొక్క బంగారు నగల కోసమూ డబ్బులు సంపాదించుకుంటోంది. అలా తనకు కొంత ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చేసింది. అందువల్ల రేపు ఏ పరిస్థితి ఎలా వచ్చినా కూడా నాకూ కొంత భరోసాగా వుండబోతోంది.

  బజ్జుల వాళ్ళ బ్లాగులకు లాభమా లేక నష్టమా?

  (లేఖిని ఎందుకో పనిచేయడం లేదు. గూగుల్ వారి ఉపకరనంతో కుస్తీ పడుతూ వ్రాస్తున్నా ఇది)

  కొంతమందయినా గూగుల్ బజ్ కి తరలి వెళ్ళారు. అలాంటివారు అప్పుడప్పుడూ బ్లాగుల్లో తచ్చాడ్తున్నారు కానీ ఎక్కువ సమయం బజ్జుల్లోనే గడిపెస్తున్నట్లుగా తోస్తోంది. అందులో కొంతమంది బజ్జులో సమయం బాగా తినేస్తోందని వాపోవడమూ వింటున్నా. ఎనీ వే, చెత్తంతా బజ్జుల్లో కొట్టుకుపోయిన్దనుకోవాలా లేక మేరునగ దీరులందరూ బ్లాగులని నిర్లక్ష్యమ్ చేస్తున్నారు అనుకోవాలా? బజ్జుల వల్లనే బ్లాగులు కాస్త ప్రశాంతంగా ఉంటున్నాయా లేక దానివల్లనే బ్లాగులు బోరింగుగా ఉంటున్నాయా? మీ అభిప్రాయం ఏంటో?

  కారు వీల్ బ్యాలన్సింగ్ లాంటి మన కాళ్ళ బ్యాలన్సింగ్

  మన కారుకి అప్పుడప్పుడు వీల్ బ్యాలన్సింగ్ చేయిస్తూ వుండాలి కదా. మరి మన కాళ్ళ బ్యాలన్సింగ్ గురించి ఎప్పుడయినా ఆలోచించారా? రెండు వారాల క్రితం కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళినపుడు వాళ్ళు నా కాళ్ళు బ్యాలన్సులో లేవు అని చెప్పినంతవరకూ, ఆ తరువాత ఎక్సురేలలో చూసేంతవరకూ నాకు ఆ స్పృహేలేదు. జనాల్లో కొంత శాతం మందికి కాళ్ళ ఎత్తు సరిసమానంగా లేకపోవడం సాధారణమే. అయితే వాటిని సరి చేసుకోకపోతే పలు ఇబ్బందులు తల ఎత్తవచ్చు. ప్రస్థుతానికి మీకు సమస్యలు లేకపోయినా ముందు ముందు సమస్యలు రావచ్చు. శరీరంలో, కీళ్ళలో పలు భాగాల్లో నొప్పి తదితర సమస్యలు రావచ్చు. మీకు ఇప్పటికే అటువంటి సమస్యలు వుంటే మీకు ఈ సమస్య వుందేమో సరిచూసుకోవడం మంచిది. మీకు ఏ సమస్య లేకున్నా కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే నిగూఢమయిన సమస్యలు తెలిసే అవకాశం వుంది.
   
  కొన్ని వివరాలకు ఈ క్రింది ఆర్టికల్ చూడండి:
   
  కాళ్ల ఎత్తు సమానంగా లేకపోతే శరీరం అందుకు బ్యాలన్సు చేయడానికి కష్టపడుతూ పెల్విక్ ఎముకనూ, వెన్నెముకనూ వంకర చేస్తుండవచ్చు. అలా అలా వెన్నుముకలొ ప్రధమ మరియు ప్రధానమయిన ఎముకలు అట్లాస్ ఎముకలని కూడా వంకర చేస్తుండవచ్చు. అట్లాస్ ఎముకలు మెదడు క్రింది భాగంలో వుంటాయి. మెదడు కాండం వీటిమీద కుదురుగా వుంటుంది.    వీటి వంకరతనం వల్ల మెదడు కాండం మరియు దానినుండి వచ్చే నరాలూ ఒత్తిడికి గురి అయ్యి  పలు శారీరక, మానసిక సమస్యలు ఏర్పడుతాయి. ఒకవేళ అట్లాస్ ఎముకలే బ్యాలన్సులో లేకపోయినా అది బ్యాలన్స్ చేయడానికి మన శరీరం ఒకవేపే ఎక్కువగా పెరిగి అందువల్ల కాళ్ళ ఎత్తు కూడా పెరగవచ్చునట.
   
  ఎత్తు కనుక్కున్నాక మీరు చెయ్యాల్సిందేమిటి? ఒక విధానం ఆ ఎత్తు తగ్గుదల సరిచేయడానికి మరోవైపు ఎత్తు పెంచడం. బూట్ల లోపట ప్యాడ్ లు పెట్టి ఎత్తు సరిచేయవచ్చు. అలా కాకుండా అసలు ఆ ఎత్తు హెచ్చుతగ్గులనే సరిచేయడం ఇంకో విధానం. నేను ప్రస్థుతం రెండవది ప్రయత్నిస్తున్నాను. అవసరమయితే కొద్ది వారాల ద్వారా ఆ ప్రయత్నాలకు తోడుగా మొదటి విధానం కూడా వాడుతాను. మన కారు చక్రాలలో హెచ్చు తగ్గులుంటే సరిచేయిస్తాము తప్ప ఒకవైపు ఎత్తు టైర్లు వెయ్యము కదా. ఇక్కడా అంతే కానీ కాళ్ళు సరికానప్పుడు ఎత్తు ప్యాడులు అయినా వాడాల్సి వుంటుంది.
   
  నా పరిస్థితి చూసి నవ్వేసుకోకండి. ముందు మీ పరిస్థితి ఏంటో చెక్ చేయించుకోండి. వైద్యుడు చెప్పేదాకా నాలోని అసమానత్వం నాకు కూడా తెలిసిరాలేదు. మీకే కాక మీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలకు ఈ పరీక్ష అవసరం. మున్ముందు సమస్యలు  ముందే బయటపడవచ్చు లేదా నిద్రాణంగా వున్న సమస్యలు తెలిసిరావచ్చు. ఆర్థోపెడిక్ వైద్యుడిని అడిగితే ఈ పరీక్ష చేస్తుండవచ్చు.

  Frieberg1 has determined that about 50% of the population have uneven leg length, but found that of the low back pain patients, 75% had leg length inequality of 5mm or more.

  1Friberg, Ora. "Clinical symptoms and biomechanics of lumbar spine and hip joint in leg length inequality" Spine 1983


  Credits: http://gwheellift.com/why-to-use-heel-lifts.html