స్మశాన వైరాగ్యం

ఉదయం ఆఫీసుకి సిద్ధం అవుతుంటే మా ఆవిడ వచ్చి చెప్పింది - నీకో వార్త చెప్పాలి అని. ఏంటి అని అడిగాను భృకుటి ముడివేస్తూ. మీనా నాన్న గారు మరణించారు అంది. ఊహించని వార్త అది. ఎలా? గుండెపోటు వచ్చి పోయారంట, ఇప్పుడే ఫోనులో పద్మ చెప్పింది అంది. ఇప్పటివరకు వారికి ఎలాంటి అనారోగ్యం వున్నట్టు అనిపించలేదు. గుండెనొప్పి రావడం ఇదే మొదటిసారి అంట, వయస్సు 57 ఏళ్ళు. మీనా మా పెద్దమ్మాయికి మంచి స్నేహితురాలు మరియు క్లాస్మేట్. ఆమె నాన్న గారు కుప్పుస్వామి గారు. తమిళులు కానీ తెలుగు మాట్లాడుతారు. మదురై వారిది. నాకు మరీ క్లోజ్ ఫ్రెండ్ కాకపోయినా మంచి స్నేహితుడు. ఓ మూడేళ్ళ స్నేహం మాది. మా బంధువుల ద్వారా వారు పరిచయం. నా బ్లాగుల గురించి కలిసినప్పుడల్లా కనుక్కుంటుండేవారు, ప్రోత్సహిస్తుండేవారు.

ఆఫీసుకి రావడానికి ఆలస్యం అవుతుందని సమాచారం అందించి హాస్పిటలుకి వెళ్ళాం. ఆ కుటుంబంతో అక్కడ వుంది మా బంధువుల కుటుంబం ఒక్కటే. ఇప్పుడు మేము. దేశం కాని దేశంలో బ్రతుకుతున్నప్పుడు మా పరిస్థితి ఇలాగే వుంటుంది మరి. వారి తమ్ముడు మేరీలాండులో వున్నాడంట. మధ్యాహ్నం కల్లా దిగుతాడు అని చెప్పారు. కొడుకు చైనాలో మెడిసిన్ చేస్తున్నాడు. తను ఎప్పుడు రాగలుగుతాడో ఏమో. భౌతిక కాయాన్ని భారత్ పంపించే విషయమై కొన్ని వివరాలు సేకరించాము. అది అంత సులభం కాదనీ, వ్యవహారాలు అన్నీ పూర్తయి బాడీ బయల్దేరడానికి వారమయినా పడుతుండవచ్చని తెలిసివచ్చింది.  ఒక అంచనా ప్రకారం అందుకు ఖర్చు కనీసం $15000 అవుతుండవచ్చు. అవి కాకుండా కుటుంబ సభ్యుల ప్రయాణం ఖర్చులు కూడా వుంటాయి. ఆ ఖర్చుల్లో ఎంతమేరకు వారి ఆరోగ్య భీమా భరిస్తుందో తెలియదు.

భౌతిక కాయం ఇండియా తరలించాల్సి వుంది కాబట్టి అంత వరకు మోర్గ్ (morgue) లో వుంచుతారంట. ఎక్కువకాలం అట్టే వుంచడం మంచిది కాదని మోర్గ్ కి ఎంత తొందరగా తరలిస్తే అంత మంచిదని నర్సులు సూచిస్తున్నారంట. వారి తమ్ముడు వచ్చేంతవరకు బాడీని అట్టేపెట్టలేమని చెప్పారు వారు. మేము వచ్చేవరకు ఆపుదామని ఆపారు. మేము వచ్చి చూసాము కనుక ఇక ఆ శరీరాన్ని తీసుకువెళ్ళవచ్చు అని హాస్పిటల్ వర్గాలకి సూచించారు. అయితే కుప్పుస్వామి గారియొక్క కుటుంబ సభ్యులతో సహా మేమంతా బయటకి నడిస్తేనే ఆ బాడీని మోర్గ్ కి తరలిస్తారంట. అందువల్ల ఆ భౌతిక కాయాన్ని మేము చివరిసారి దర్శించి బయటకి వచ్చాం. ఆ తరువాత ఎవరయినా ఆ బాడీని చూడాలంటే మోర్గ్ కి ఫోను చేసి అప్పాయింటుమెంట్ తీసుకొని మరీ చూడాల్సివుంటుంది.

కుప్పుస్వామి గారు డబ్బు చక్కగానే పొదుపు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ వారికి ఒక స్వంత ఇల్లు, ఒక స్వంత పార్టుమెంటూ వున్నాయి. లైఫ్ ఇన్సూరెన్సులు, తదితరాలు వున్నయో లేదో ఇంకా తెలియదు.   అబ్బాయంటే ఎలాగోలా స్థిరపడుతాడు, అమ్మాయే ఇంకా చదువుతోంది కదా అని నిన్న మధ్యాహ్నమే ఎందుకో గాని దిగులు పడ్డారంట. రాత్రే గుండెపోటు వచ్చింది. డాక్టర్లు చాలా గంటలు ప్రాణం దక్కించడానికి కృషి చేసారు కానీ ఈ ఉదయం 5 గంటల వేళ ప్రాణాలు విడిచారు. మా బంధువులు రాత్రంతా వారికి తోడుగా వున్నారు.

విదేశాల్లోకి వచ్చాక ఇలా పార్ధివ శరీరాన్ని చూడటం మాకు ఇదే మొదటిసారి. ఇలాంటి సందర్భాల్లొనే జీవితం బుద్బుధప్రాయం కదా అని అనిపిస్తుంది. అయితే స్మశానంలో చితి మంటల్లో కాలిపోతున్న భౌతిక కాయాన్ని చూస్తున్నప్పుడు కలిగే వైరాగ్యం ఇంకా గాఢంగా వుంటుంది. ఎంత వైరాగ్యం కలిగినా అది స్మశానంలో వున్నంతవరకే కదా.  బయటకి కాలు పెట్టాక ఎవరి సమస్యలు వారివి, ఎవరి ఆరాటాలు, పోరాటాలు వారివి. ఇలాంటప్పుడు జీవితపు పరుగుపందెంలో పరుగెత్తడం కాస్సేపు ఆపి మనమేంటో, మన జీవనం ఏంటో ఆత్మావలోకనం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. కాలు నేలమీద ఉంచడానికి కాస్సేపయినా అవకాశం కలుగుతుంది. 

7 comments:

 1. 'శ్మ'శానమండీ బాబూ

  ReplyDelete
 2. Please visit the website of TANA for information on funeral services and transportation of body to India
  https://www.tana.org/webfiles/docs/Death_and_Funeral_Services.pdf.

  ReplyDelete
 3. Have you ever considered adding more videos to your blog posts to keep the readers more entertained? I mean I just read through the entire article of yours and it was quite good but since Im more of a visual learner,I found that to be more helpful well let me know how it turns out! I love what you guys are always up too. Such clever work and reporting! Keep up the great works guys Ive added you guys to my blogroll. This is a great article thanks for sharing this informative information.. I will visit your blog regularly for some latest post.

  ReplyDelete
 4. Bad news.
  I am 51, have two kids 9 (G) and 2 (B) (married late) and have no apartment or house. Total savings in USA is less than 100K. What will happen if I die tonite?

  I will let you what will happen.. Kids go to foster homes, the insurance money will be wasted in 2 years and Sun and Moon continue to come out everyday. One drop in ocean. Befikar. Life goes on for others. At least some people miss you for your blog but for me I do not even have a blog.

  ReplyDelete
 5. @ అజ్ఞాత
  కొందరు శ్మశానం అనీ మరికొందరు స్మశానం అనీ వ్రాస్తున్నారు. మరి ఏది సరి అయిన పదమో నాకు తెలియదు. గూగుల్ చేస్తే శ్మశానానికి 3900 స్మశానానికి 3200 రిజల్ట్స్ వచ్చాయి.

  ReplyDelete
 6. @ అజ్ఞాత
  ధన్యవాదాలండి. మా స్నేహితుడు కూడా ఇదే డాక్యుమెంట్ పంపిస్తే ప్రింట్ చేసి ఆ కుటుంబానికి నిన్ననే అందించాం. అంతేకాకుండా తానా సహ అధ్యక్షులు మోహన్ నన్నపనేని మా బంధువులకు ఫోన్ చేసి ఇలాంటి విషయాలపై చక్కని గైడెన్స్ ఇచ్చి చవకయిన, నమ్మకమయిన ఫునెరల్ హవుజ్ ను రికమెండ్ చేసారు. అందువల్ల అన్ని ఖర్చులూ (బాడీని ఇండియా పంపించడంతో సహా) $4500 లోనే అవుతున్నాయి. లేకపోతే 10,000 నుండి 15,000 వరకు అయేవి. ఈ సందర్భంగా తనా వారికీ, మొహన్ గారికీ మేమందరమూ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము.

  ReplyDelete
 7. @ అజ్ఞాత
  ఇదివరలో యూట్యూబులో వీడియోలు బాగా వెలువరించేవాడిని. అందులో వీలయినన్ని వాటిని నా బ్లాగులో కూడా అందించేవాడిని కానీ వీడియోలు వెలువరించాలంటే చాలా ఓపికా, తీరికా కావాలి కాబట్టి వాటిని పక్కన పెట్టేసాను.

  @ అజ్ఞాత
  మనం పోయినా మిగిలి వున్న వారు మనం మిగిలించిన ఆస్థులు, ఇన్సూరెన్స్ డబ్బులూ చక్కగా నిర్వహించుకోగలిగితే వారికి అంత ఇబ్బంది వుండదు. మా మితుడి కుటుంబం గురించి మా సంశయం కూడా అదే. అతని భార్యకూ, బిడ్డకూ ఆర్ధిక విషయాలు అంతగా తెలియవు. కుమారుడు ఇంకా కుర్రాడే కానీ మంచివాడే. ముందు ముందు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి వాళ్ళు నిలుపుకుంటారా లేక పోగొట్టుకుంటారా అనేది వుంటుంది.

  మనం ఎవరమయినా మనవారికోసం చెయ్యగలిగిన కాడికి చేసి మన పాత్ర అయిపోయినప్పుడు ముగించుకొని వెళ్ళడమే. ఆ తరువాత పరిస్థితులకు మిగిలివిన్నవారే బాధ్యులు అవుతారు. ఎవరికయినా ముఖ్యంగా విదేశాల్లో వుంటున్నవారికి జీవిత భీమా లేకపోతే వెంటనే వీలయినంత ఎక్కువగా తీసుకోవడం అవసరం అని ఈ సందర్భంగా గుర్తుకు చేస్తున్నాను.

  ReplyDelete