బ్లాగాక్షరాభ్యాసం

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం)

మీరు చిన్నప్పుడే ఓనమాలు దిద్దేసేమనుకొని బ్లాగుల్లో సరాసరి తెలుగును ఇంగ్లీషులో వ్రాసేస్తే అది తెంగ్లిష్ అయిపోయి చదువరులకు చికాకు తెప్పిస్తుంది. అందుచేత అలా ఆవేశంగా ఆంగ్లంలో వ్రాయకుండా కాస్త నిదానించండి. తెలుగు లిపిలో వ్రాయడానికి కొన్ని తేలికయిన మార్గాలు వున్నాయి. మీరు ఎకాఎకి బ్లాగులు వ్రాయకుండా ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు చేస్తూ మీ తెలుగు ప్రాక్టీసు చేసుకోవడం మంచి పద్ధతి. అలా వివిధ బ్లాగుల పరిచయమూ కలుగుతుంది - మీ వ్రాతా మెరుగుపడుతుంది.
 
మీరు ఈ పుస్తకం చదవకుండానే నాలుగు టపాలు వ్రాసిన సీనీయర్ బ్లాగర్లెవరన్నా పరిచయం వుంటే వారు మీకు బ్లాగుల గురించి చెప్పి వాటికోసం తెలుగు ఎలా వ్రాయాలో నేర్పించి బ్లాగాభ్యాసంతో పాటు ఈ అక్షరాభ్యాసమూ చేసివుండేవారు. ఇప్పుడేమో ఆ బాధ్యత నాకే పడింది. సరే. అటులనే కానిండు. పలక తీసుకొనిరండు. నిజంగానే పలకా బలపం పట్టుకువచ్చేరు! అలా పని కాదుగానీ మీ కంప్యూటర్ పట్రండి. మీకు ఇంటర్నెట్టు బ్రవుజ్ చెయ్యడం తెలుసు కదా. కొంపదీసి అది కూడ నన్నే నేర్పించమనరు కదా. నా వల్ల ఇప్పుడు కాదండీ బాబూ. అందుగ్గానూ ఇంకో గురువు గారిని చూసుకోండి.

ఇంటర్నెట్టు కనెక్షన్ వుంది కదా.  ఇంటర్నెట్టు బ్రవుజరులో http://lekhini.org/ సైటు పేరు టైపు చెయ్యండి. ఇదిగో మీ పలక వచ్చేసిందండోయ్. మరి బలపం అని మరీ అంత అమాయకంగా అడక్కండి. మీ జోకులూ మీరూనూ. ఇందులో కుడివైపున అక్షరమాల వుంది చూసారూ. మీరు ఏ ఇంగ్లీషు అక్షరం నొక్కితే ఏ తెలుగు పదం వస్తుందో అది తెలియజేస్తుంది. మీరు పై పెట్టె (బాక్సు) లో ఆ ఇంగ్లీషు అక్షరాలు వ్రాస్తుంటే క్రింద పెట్టెలో తెలుగు లిపిలో మీరు వ్రాసింది వస్తుంది. ఉదాహరణకు nenu అని వ్రాసి చూడండి. నెను అని వస్తుంది. అది తప్పు పదం కదా. నేను అని రావాలంటే చిన్న e కాకుండా పెద్ద E వుండాలి. nEnu. అలా అలా ప్రాక్టీసు చెయ్యండి. ఇలా వ్రాస్తున్నప్పుడు తెలుగులో ఘోరమయిన తప్పులు కనపడుతుండవచ్చు. ఖంగారుపడకండి. అది సహజం. మీరు తప్పు వ్రాసినప్పుడల్లా మీ నెత్తిమీద మొట్టికాయలు వెయ్యడానికి నేను దగ్గర్లో ఏమీ లేను కాబట్టి ఫర్వాలేదు. కానిచ్చెయ్యండి.  మీరు కనుక మీ సిస్టం Caps Lock బటన్ కనుక ఆన్ చేసి వున్నట్లయితే మీరు వ్రాసేది తెలుగా లేక తమిళమా అన్న అనుమానం మీకే వస్తుంది. అలాంటి సందేహం వచ్చినప్పుడు తెలుగు వ్రాస్తుంటే ఏ అరవమో వస్తోందని లేఖిని నిర్వాహకుల మీద హడావిడిగా చిరాకు పడకుండా తమాయించుకొని అది ఆన్ అయి వుందేమో ఒకసారి చూసుకోండి.

అసలు మీరు ఎంత ప్రయత్నించినా కింది బాక్సులో తెలుగే రాకపోతే ఆ సైటులో పై భాగాన వున్నUnable to see Telugu properly? లింక్ నొక్కండి. మీ కంప్యూటరులో ఆ సమస్యలు ఏమయినా వున్నాయేమో చూడండి.

మీరు ఇప్పుడు కొన్ని వాక్యాలు సరిగా వ్రాసారు. బావుంది. మీరు తొలిసారిగా ఇంటర్నెట్టులో తెలుగు వ్రాయడం నేర్చుకున్నారు. అభినందనలు. ఇక విజృంభించండి. పేరాలు వ్రాయండి. ఆ తరువాత మీ ప్రేయసికో, మీ భార్యకో ఓ చిన్న ప్రేమలేఖ వ్రాద్దురూ. సరదాగా వుంటుంది. అంత దృశ్యం లేదా? అయితే వద్దులెండి. మీ నాన్నారికో లేకపోతే మీ చిన్నారికో ఓ లేఖ వ్రాయండి. అది ఎలా వచ్చిందో చూసుకొని మురిసిపొండి. ఇంకేం ఇహ ఎంచక్కా బ్లాగుల్లో మీరు తెలుగు దడదడలాడించెయ్యొచ్చు. అంటే మీరు ఇక్కడ వ్రాయగానే ఠకీమని బ్లాగుల్లో పడిపోద్దని నా ఉద్దేశ్యం కాదు. మీరు ఇలా తెలుగు టైపు చేసాక అలా ఆ తెలుగు టెక్ష్టుని కాపీ చేసి మీకు కావాల్సిన దగ్గర పేస్టు చెయ్యండి. అలా అని చెప్పి మీరు మీ ప్రియురాలికి వ్రాయమన్న ప్రేమలేఖ తీసి వ్యాఖ్యల్లోనో బ్లాగుల్లోనో పెట్టుకునేరు. అవి మీ వ్యక్తిగతం కదా. కాపీ & పేస్టు ఎలా చెయ్యాలని కూడా నన్ను అడక్కండి మహాప్రభో. అంత ఓపికగా చెప్పే తీరిక నాకు లేదు.
             .
అయితే ఇప్పుడు మీకు ఓ సందేహం రావచ్చు. ఎప్పుడూ ఇలా కాపీ, పేస్టు చేసుకునే శ్రమ తప్పదా అని. మీరు ఇలా టైప్ చేస్తుంటే అలా తెలుగులో మీకు కావాల్సిన దగ్గర పడే సాఫ్టువేరులూ వున్నాయి. అవి మీ కంప్యూటరులోకి ముందు ఎక్కించాలి. వాటితో చిన్నచిన్న సమస్యలూ వుంటాయి. అవన్నీ ఇప్పుడెందుకు గానీ ముందు ఇది వాడి చూడండి. అలాంటి అడ్వాసుడు పలకలు ఎలా వాడాలో ముందు ముందు తెలుసుకోవచ్చులెండి. అక్షరాభ్యాసం నాడే అంత ఆరాటం ఎందుకూ.  వివిధ రకాలుగా తెలుగు ఎలా వ్రాయవచ్చో ఈ పుస్తకం చివరన ఒక అనుబంధంగా ఇస్తాను. అప్పుడు అవన్నీ తెలుసుకుందురుగానీ. అందాక ఇక్కడే ప్రాక్టీసు చెయ్యండి. 

ఈ లేఖిని ఉపకరణాన్ని ఎవరు కనిపెట్టారు అని మీకు సందేహం రావచ్చు. దీని సృష్టికర్త వీవెన్ (వీర వెంకట చౌదరి) గారు. వీరే ప్రసిద్ధ తెలుగు బ్లాగుల సంకలిని (అగ్రిగేటర్) కూడలి సృష్టికర్త కూడా. మిగతా ఉపకరణాలు ఎన్ని వున్నా కూడా నాకు లేఖినినే తేలిగ్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఇదే వాడుతుంటాను. మా నాన్న గారు కూడా ఇదే వాడుతుండేవారు. వుడ్‌వర్డ్స్ గ్రైప్ వాటర్ ప్రకటనలాగా అలా అన్నాను కానీ మా నాన్నగారు ఇది వాడలేదు లెండి. ఈ సందర్భంలో వీవెన్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. చెప్పండి మరీ.

బ్లాగాక్షరాలతో మీకు అక్షరాభ్యాసం అయిపోయింది కదా. ఇహ అసలు విషయనికి వచ్చేద్దాం. దక్షిణ ఏదీ? నా దక్షిణ ఏదీ? మరిచేపోయారు చూసారూ. మరిచిపోతారు - నాకు తెలుసు. ఎంతమందిని చూడలేదూ. నా గురుదక్షిణ నాకు ఇవ్వండి. భయపడకండి. నేను అమూల్యమయినవే అడిగేస్తాను. మీరు తెలుగు బ్లాగోస్ఫియరుకి వచ్చాక నా బ్లాగూ మీకు కనపడుతుంటుంది కదా. రోజూ రెండు కామెంట్లు అయినా నా బ్లాగులో వేస్తానని నాకు హామీ ఇవ్వండి మరి. అప్పుడు మీ తెలుగులో అక్షరదోషాలు వుంటే మళ్ళీ ప్రతి వ్యాఖ్యలు చేస్తూ మీకు మొట్టికాయలు వేస్తాను.  అలా అని చెప్పేసి నా బ్లాగులో అక్షరదోషాలు లెక్కెట్టకండి. ఆశువుగా వ్రాస్తుంటా కదా - దొర్లుతూనేవుంటాయి మరి. అక్షరదోషాలు లేకుండా వ్రాయడానికి నేనేమీ ఆబ్రకదబ్రను కాదులెండి. ఆయన ఓ ప్రసిద్ధ బ్లాగరు. మీరు బ్లాగుల్లోకి వచ్చాక అందరూ తెలుస్తుంటారు లెండి. ముఖ్యంగా ఒకరు :))

6 comments:

  1. >>మీరు చిన్నప్పుడే ఓనమాలు దిద్దేసేమనుకొని బ్లాగుల్లో సరాసరి తెలుగును ఇంగ్లీషులో వ్రాసేస్తే అది తెంగ్లిష్ అయిపోయి చదువరులకు చికాకు తెప్పిస్తుంది.<<

    thats not true sir

    అగ్రిగేటర్స్ లేకుండా మీ బ్లాగు కంటే వీటికి ఫాలోయర్స్ ఎక్కువ

    http://tollywoodinfo.com/discus/
    http://chalanachithram.com/discus/
    http://ashok-raju.blogspot.com
    http://harithehero.blogspot.com/
    http://nagrocks.blogspot.com/

    ReplyDelete
  2. నా పేరులో నారాయణ లేదండీ బాబు!

    ఈ శృంఖల బాగుంది. మీ బ్లాగు పుస్తకంలో ఇన్&zwnjj;స్క్రిప్టుకి కూడా ఒక అధ్యాయాన్ని కేటాయించండి.

    ReplyDelete
  3. శరత్ గారు, మన తెలుగు బ్లాగర్స్ demographic profile ఏమన్నా పబ్లిష్ చెయ్యగలరా? వీలు కాకపోవచ్చేమో. నేననుకోవటం తెలుగు బ్లాగర్స్ లో మెజారిటీ కంప్యూటర్ కుర్రాళ్ళది. కొద్దిమంది ప్రవాసాంధ్ర గ్రుహిణులు. దాదాపుగా అందరూ మధ్యతరగతివారు. అందువల్ల ఎక్కువ బ్లాగుల రంగు, రుచి, వాసన ఒక్కటే ( ఈ వాక్యం నే చదువుకున్న రసాయనశాస్త్రం లోనిది లేండి ).
    కొడవటిగంటి కుటుంబరావుగారు తన ఐశ్వర్యం ( 1965 ) నవలలో డాక్టర్ కనక సుందరంతో " తెలుగు సాహిత్యాన్ని సమాజంలో దిగువ తరగతివారు చదవరు. ఎందుచేత? వారికి సంబందిచినిది ఏదీ అందులో ఉండదు కనుక." అని చెప్పిస్తాడు.
    ఈ సూత్రం మన తెలుగు బ్లాగర్స్ కి కూడా వర్తిస్తుందేమో. ఇది విమర్శ కాదు. మన పరిమితుల గూర్చి అబ్జర్వేషన్ మాత్రమే. దయచేసి అజ్ణాతలెవరూ ( నాకు మీరంటే మాచెడ్డ భయం ) నా అజ్ణానాన్ని అపార్ధం చేసుకోవద్దని అభ్యర్ధిస్తున్నాను.

    ReplyDelete
  4. హబ్బా..., బోర్ కొడుతోంది, అప్పుడప్పుడూ మీ అసలు రూట్లోకి వచ్చి పోస్టులు రాయండి.

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    సర్లెండి. సినిమా బ్లాగులూ, బూతు బ్లాగులూ లాంటివి ఎక్కడున్నా హిట్స్ బాగానే వుంటాయి.

    @ వీవెన్
    మీ పేరు సవరించాను :)

    ఇన్ స్క్రిప్ట్ గురించి ఎంత చదివినా నాకు కొరుకుడు పడటం లేదు. ఇంకా దాని గురించి ఏం వ్రాస్తాను. ఈ పుస్తకం వ్రాసే లోపుగా మరోసారి చదివేసి ప్రయత్నిస్తాను. అప్పటికీ అర్ధం కాకపోతే మిమ్మల్ని సంప్రదిస్తాను.

    @ యరమన
    సంకలినుల నిర్వాహకులు మీరు సూచించినటువంటి స్టాటిస్టిక్స్ ప్రచురిస్తే బావుంటుంది. నా ఒక్క బ్లాగువి ప్రచురిస్తే పూర్తి చిత్రం రాదు కదా.

    మీరు మానసిక వైద్యులని తెలిసి సంతోషంగా వుంది. సాధారణ సాహిత్య విషయాలు అందరూ వ్రాస్తుంటారు కాబట్టి మీలాంటి నిష్ణాతులు మీమీ రంగాల్లో మీ వృత్తికి సంబంధించినవి ఆసక్తికరమయినవి వ్రాస్తే వైవిధ్యంగా వుంటుందని నా యొక్క చిన్న సూచన. అయితే అందులో బోర్ కొట్టి ఇందులోకి వచ్చామన్నారు కాబట్టి మళ్ళీ అవే ఇక్కడ వ్రాయడం మీకు నచ్చకపోవచ్చు.

    @ మిర్చి
    :) ప్రస్థుతం పుస్తకాలపై పడ్డాను కాబట్టి వాటికి ఉపయోగపడేవే వ్రాస్తున్నాను. కొంతకాలం తరువాత ఆధునిక శృంగార పద్ధతుల గురించి పుస్తకం వ్రాయాలనుకుంటున్నాను. అప్పుడు మరీ అంతగా కాకపోయినా కొంతయినా మీకు నచ్చేవి వ్రాయొచ్చు.

    ReplyDelete
  6. భ్లాగ్గింగ్ అనుభవం ఉంది కానీ తెలుగులో తెలీదండి.ఎదో తోక పట్టుకుని అలా అలా చూస్తూ ఇలా మీ ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. ఆప్పుడు అనిపించింది నేను కుడ ఎందుకు రాయకూడదు అని.కాని ప్రతిసారి ఆ గూగుల్ ట్రాన్స్ లేటర్ వాడలేను కాని నాకు ఎందుకొచ్చిన తిప్పలు అని ఉరుకొన్నాను.కాని ఈ పొస్ట్ చూసాక ఒకసరి ప్రయత్నిస్తే పొలా అనిపించింది.పర్లెదండి,బాగానే కుదిరింది.తొలి ప్రయోగం మీ మీదె. అలవాటు పడ్డాక బ్లాగ్గింగ్ మొదలుపెదతానండి.
    మీ లేఖ కి ధన్యవాదాలు.

    ఇప్పటికి సెలవిక
    భాను.

    ReplyDelete