కష్టాల్...నష్టాల్...

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం)

బ్లాగుల వల్ల కొన్ని కష్టాలు, నష్టాలూ, ఇబ్బందులూ వున్నాయండోయ్. ఇవి తెలుసుకొని మీరు ఆగిపోవాలని కాదు కానీ కాస్త ఆ ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని అవి తక్కువ వుండేలా చూసుకుంటే బెటరూ.

సమయం
చాలా సమయం తినేస్తుంది. ముఖ్యంగా కొత్తవారికి తెలుగులో టైపాట్ల వల్ల సమయం తినేస్తుంది. అందువల్ల చాలామంది ఉత్సాహంగా మొదలెడతారు కానీ అదే ఉత్సాహంతో బ్లాగులను కొనసాగించలేరు. అందువల్లే చాలామంది అడపాదడపా ఓపిక, తీరిక తెచ్చుకొని అప్పూడప్పుడూ ఒకటీ అరా టపాలు అలా జనాల మీదికి వదిలేస్తుంటారు.
 
అసంతృప్తి
ఉత్సాహంగా బ్లాగావరణంలోకి విచ్చేసిన వారు ఇక్కడంత మరీ మంచి వాతావరణం లేదని ముక్కు మూసుకోవాలనుకోవచ్చు. వాస్తవ పరిస్థితులు అర్ధమయ్యి వెగటుపుట్టవచ్చు. సంస్థనాధీశుల్లాంటి బ్లాగాధీశుల  చిత్తానికి తగ్గట్టుగా మీ వ్రాతలు లేకపోతే వేధింపులు ఎదురవ్వచ్చు. బ్లాగుల్లో కుల కాట్లాటలూ, మత యుద్ధాలు, భావ పోరాటాలూ చూసి మీ మనస్సుకి కష్టం కలగవచ్చు. హాయిగా వుండక ఇందులోకి ఎందుకు వచ్చి పడ్డామని మీలో అశాంతి చెలరేగవచ్చు. బ్లాగుల్లో మీరు అనుకున్నంత భావ స్వేఛ్ఛ లేదని మీకు అనిపించవచ్చు.
 
దుష్ప్రభావం:
మీరు తిరోగమన వాదులయితే సమాజంపై మీరు దుష్ప్రభావం చూపించవచ్చు. లేదా చెడు బ్లాగర్ల, బ్లాగుల ప్రభావం మీమీద పడవచ్చు.

ముఠాలు:
ఇక్కడ మీకు మిత్రులేమో గానీ మీకు తగ్గ గ్రూపులు దొరకవచ్చు. వారితో కలిసి ఇతరులను ఎంచక్కా వేధించవచ్చు.

విరక్తి
మీరు వ్రాసిన దానిని ఎద్దేవా చేస్తూ లేదా పరిహసిస్తూ వ్యాఖ్యలు వస్తే మీ భావాల మీద లేదా వ్రాతల మీద నమ్మకం సడలవచ్చు.

వ్యర్ధం
మీ వ్రాతలు మీకు గానీ, సంఘానికి గానీ ఏమాత్రం వుపయోగపడని కాలక్షేపం బఠానీలు అవచ్చు. అలాంటి కాలక్షేపం కబుర్ల వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం వుంటుంది లెండి కానీ అస్తమానం అవే వ్రాస్తూపోతే మీ సమయం మరియు ఇతరుల సమయం వ్యర్ధం అవచ్చు.

వ్యసనం
బ్లాగుడు మీకు వ్యసనంలా తయారవచ్చు. కొద్దిమంది నిద్ర ఆహారాలు మాని మరీ బ్లాగులు వ్రాయడమో, వ్యాఖ్యలు వ్రాయడమో చేస్తుంటారు. వారిని చూస్తుంటే విస్మయం కలుగుతుంది. వీరికిక వేరే లోకం అంటూ వుండదా అనిపిస్తుంది. ఇంతగా ఇందులో తలమునకలవుతూ వీరు సాధిస్తున్నది ఏంటా అని అనుమానం వస్తుంది. అలాంటప్పుడు మీరు మీ కుంటుంబానికో లేదా కెరీరుకో ఇవ్వాల్సిన సమయాన్ని ఇక్కడ గడిపివేసే అవకాశం వుంది. కొంతమంది అస్తమానం బ్లాగులు చూస్తూ, కామెంట్లు వేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి కాలక్షేపం ఇంట్లో టివిల ముందు కూర్చొని సీరియళ్ళు చూస్తూ చేసినా, బజ్జుల్లో చేసినా, ఇక్కడ చేసినా పెద్దగా తేడా ఏమీ వుండదు. కేవలం టైంపాస్ చెయ్యాలనుకునేవారు ఎక్కడయినా చేస్తారు. మీరు బ్లాగుల్లోకి కేవలం కాలక్షేపానికి వచ్చారా లేదా ఏదయినా ప్రయోజనం కోసం వచ్చారా అన్నది నిర్ణయించుకోండి.

ప్రతి దాంట్లో ఎంతో కొంత రిస్కు వున్నట్లే బ్లాగింగులో కూడా పైన చెప్పిన చిన్న చిన్న రిస్కులు వున్నాయి. అవన్నీ గమనించుకుంటూ వాటిని మీరు దారిలో ముళ్ళకంపను ఏరిపారేసుకుంటూ ఎలా వెళతారో అదేవిధంగా అడ్డంకులు, అవాంతరాలు, నిరోధాలు తొలగించుకుంటూ వెళుతూనేవుండాలి. అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. అలాంటి దుష్ఫలితాలను తగ్గించుకోవడం ఎలాగో, చక్కటి బ్లాగింగ్ చెయ్యడం  ఎలాగో కూడా ముందు ముందు వివరిస్తాను.

6 comments:

  1. మీకు బ్లాగింగ్ లో డాక్టరేట్ ఇవ్వాలి..

    ఇవ్వక పొతే తెలంగాణ వాళ్ళను హత్యలు చెయ్యాలి. సీమాంధ్ర వాళ్ళను ఆత్మాహుతి దళాలతో ఏటా కింగ్ చేయించాలి

    ReplyDelete
  2. @ ఎటూజెడ్ డ్రీంస్
    నాకు డాక్టరేట్లు గట్రా వద్దులెండి కానీ ఈ టపాలు పుస్తకంగా వచ్చాక ఒకరిద్దరితోనయినా కొనిపించండి మహాప్రభో.

    ReplyDelete
  3. ఈ సిరీస్ ఇప్పుడే చదివాను. బాగా రాస్తున్నారు. కొన్ని అభిప్రాయాలతో ఏకీభవించలేను గాని, మొత్తమ్మీద infotainment బాగుంది.
    All the best with future posts and the book.

    ReplyDelete
  4. @ కొత్తపాళీ
    మీ ప్రొత్సాహానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  5. @బ్లాగుల్లో మీరు అనుకున్నంత భావ స్వేఛ్ఛ లేదని మీకు అనిపించవచ్చు.
    ఇవన్ని స౦కలిని ల లో బ్లాగ్ ని జత చేసాక వచ్చే సమస్యలు కదా? ఇప్పటివరకు మీరు వ్రాసిన వ్యాసాలన్నీ స౦కలిని లలో చేరి బ్లాగు వ్రాయడ౦ ను సూచిస్తున్నాయి. అలాగయినా భావ స్వేచ్చ అ౦దరికీ ఒకేలా ఉ౦టు౦ది చివరికి. భూమి గు౦డ్ర౦గా వు౦దన్న౦త నిజం :)

    వాళ్ళలో వాళ్ళే 'సూపర్ టపా' అనుకొనే గు౦పులను చూసి, ఇలా వ్రాస్తే నచ్చదేమో అని భ్రమలు వస్తు౦టాయి.అవి చూడకపోవడ౦ ఉత్తమ౦ ,హాయిగా వ్రాసుకోవాల౦టే. వ్రాస్తే కదా భావాలు తెలిసేది.

    ReplyDelete
  6. @ మౌళి
    మీరు అన్నది నిజమే. బ్లాగు సంకలినులల్లో లేనప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్రాసుకోవచ్చు. అప్పుడు నర దిష్టి పెద్దగా తగలదు :)) కరెక్టే కానీ అలాంటప్పుడు మనలో ఎంతో సత్తా వుంటే తప్ప మన బ్లాగు గుర్తు పెట్టుకొని లేదా వెతికి మరీ వచ్చి చూసేవారు ఎంతమంది వుంటారు చెప్పండి?

    "బ్లాగు పీఠాలు" అనే పేరిట అగ్రిగేటర్ల గురించి ఒక వ్యాసం త్వరలో వుంటుంది. అందులో అగ్రిగేటర్ల వల్ల లాభనష్టాలను వివరిస్తాను.

    ReplyDelete