బ్లాగుడు వల్ల లాభాలేంటి?

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం వ్యాసం)

కాళిదాసు కవిత్వం కొంత, నా చాదస్తం కొంత అన్నట్లుగా నెట్టులో సేకరించీ కొంతా, నా అభిప్రాయాలు కొంతా కలిపి కొన్ని వ్రాస్తుంటాను. ఆ కోవలోనిదే ఇదీనూ.

సంతృప్తి
ఇదో ఆనందం. మన అభిప్రాయాలు, భావాలు వినడానికి మరి కొందరు వున్నారన్న సంతృప్తి. ఇంట్లో వారికి మొగలి రేకులు లాంటి సీరియళ్ళు చూడటానికే సమయం సరిపోవడం లేదు ఇక మన సోది వినడానికి ఎవరికి సమయం వుంటుంది? అలాంటిది బ్లాగుల్లో పడేస్తే ఎవరన్నా చదవకమానరు. చదివినవారు ఒకరిద్దరన్నా స్పందించకమానరు. నత్తి భాషలో చెప్పుకోవాలంటే బ్లాగులు వ్రాయడం ఓ తుత్తి.
 
ప్రభావం
మీకు గొప్ప ఆలోచనలు, భావాలు వుంటే సమాజం మీద మీ రచనల ద్వారా మీయొక్క ప్రభావం చూపవచ్చు. పలు రకాల సమస్యలకి మీరు పరిష్కారం సూచించవచ్చును. పలు విధాలయిన కొత్త భావాలను అందరితో పంచుకోవచ్చు. లోకంలో వెలుగుచూడని సమస్యలను, కష్టాలను మీరు వెలుగులోకి తీసుకురావచ్చు. అందరితో కలిసి వాటికి పరిష్కారం ఆలోచించవచ్చు. అలా సంఘానికి, సమాజానికి ఇతోధికంగా మీవంతు సేవ చేసిన వారు అవుతారు.
 
ఆదాయం
ఇంగ్లీషు తదితర భాషల్లోని బ్లాగుల్లో ప్రకటనల ద్వారా, పెయిడ్ బ్లాగింగ్ ద్వారా, బ్లాగు పోస్టులు పుస్తకంగా వెలువరించడం ద్వారా కొందరు సంపాదించగలుగుతున్నారు కానీ తెలుగు బ్లాగులకు ఇంకా అంత దృశ్యం లేదు.

మిత్రులు
కొంతమంది కొత్త మిత్రులని అయినా సంపాదించుకోవచ్చు. అందులో కొంతమంది బ్లాగుల్లోనే స్నేహితులుగా వుండిపోతారు లేదా ఆన్లయిన్ స్నేహితులుగా వుండిపోతారు. మరికొంత మంది ఆఫ్ లైన్ స్నేహితులుగా అవచ్చు. మీ అభిప్రాయాలకు, భావాలకు దగ్గరగా వున్నవారు లేదా పరస్పరం వ్యక్తిత్వం నచ్చిన వారు మిత్రులుగా మిగిలిపోవచ్చు.

వ్రాత
మీ వ్రాతను, శైలిని, శిల్పాన్ని మెరుగుపరచుకోవచ్చు. మీరు పుస్తకాలు వ్రాసే ముందు మీ రచనలు బ్లాగుల్లో ప్రయోగించి పరీక్షించుకోవచ్చు. బలయిపోతే చదివిన వారు బలయిపోతారు. మీకు ఫర్వా నహీ. సహృదయులు మీ రచనా శైలిని గురించి కూడా సూచనలు, సలహాలు ఇస్తుంటారు కాబట్టి మీ శైలిని మెరుగుపరుచుకోవచ్చు. మీరు వ్రాసే ధోరణి నచ్చని వారు నిక్కచ్చిగా చెప్పే అవకాశాలు కూడా వుంటాయి కాబట్టి పునరాలోచించుకోవచ్చు.

పఠనం
మీరు మీ సొల్లు కబుర్లు కాకుండా ఏదయినా మంచి విషయం వ్రాయాలంటే దాని గురించి కొద్దోగొప్పో పరిశోధన చెయ్యాలి కదా, అదీ ఇదీ చదవాలి కదా. అలా మీలో పఠనం పెరుగుతుంది. తద్వారా మీకు కొత్త విషయాలు తెలిసి మీ జ్ఞానం పెరుగుతుంది.

వ్యాపకం
ఏడుపుగొట్టు సీరియళ్ళూ, కోడలి కష్టాల్లాంటి చాంతాళ్ళూ అస్తమానం చూస్తూ తరించిపోకుండా, వృధా కాలక్షేపాలు చేసెయ్యకుండా  బ్లాగింగ్ చెయ్యడాన్ని చక్కటి వ్యాపకంగా మలచుకోవచ్చు. ఇతరులు వ్రాసిన దానిని, చేసిన దానిని మీరు ఎక్కువమందిలా చదవకుండా, చూడకుండా మీరే ఏదయినా మీ తీరిక సమయంలో వ్రాస్తే ఇతరులు చదువుతారు. పాసివ్ గా చూసేవారు, చదివేవారు నూటికి ఎనభై శాతం మంది వుంటారు. అలా కాకుండా మిగతా 20% ఏక్టివ్ మందితో కలుస్తూ మీరే ఏదయినా వ్రాస్తూ సంఘం నుండి పొందడమే కాకుండా సమాజానికి అందించవచ్చును.
 
హాబీ
మీరు బ్లాగింగును చక్కని హాబీగా మలచుకోవచ్చు. హాబీల వల్ల ఒనగూడే ప్రయోజనాలు మీకు తెలిసినవే కదా.
 
వెలుగు
మీ అంతట మీరు వుండిపోకుండా మీరు ఇలా కొంతమందికయినా తెలిసే అవకాశం ఏర్పడుతుంది.  మీలో మంచి రచనా చాతుర్యం వుంటే మీరు త్వరలోనే బ్లాగులోకంలో ప్రసిద్ధులయిపోవచ్చు. బ్లాగులనే బావిలో కప్పలాంటి ప్రపంచంలో సెలబ్రిటీలు అయ్యామనుకోవచ్చు.  మీలో మంచి రచనా శైలి వుందో లేదో బ్లాగుల్లో పరీక్షించి చూసుకోవచ్చు. అలా ఎందరో మట్టిలో మాణిక్యాలు బ్లాగుల్లో వెలుగులోకి వచ్చారు. వీరితో పోలిస్తే చాలమంది ప్రసిద్ధ రచయితలు దిగదుడుపే అనిపిస్తుంది. అలా మీమీద మీకు నమ్మకం ఏర్పడ్డాక పుస్తకాలు పబ్లిష్ చేసి చూసుకోవచ్చు. అక్కడా విజయం లభిస్తే ఇంకా మీకు గుర్తింపు లభిస్తుంది.
 
సహాయం
బ్లాగుల ద్వారా మీరు ఎదుర్కొన్న కష్టనష్టాలు ప్రస్థావిస్తూ, అవి మీరు పరిష్కరించుకొన్న వైనాల్ని తెలియపరుస్తూ ఇతరులకు మీ అనుభవం ఉపయోగపడేలా చెయ్యవచ్చు. మీ బ్లాగుల ద్వారా ఇతరులకు మీకు నిపుణత వున్న రంగంలో లేదా మీకు తెలిసిన విషయాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ వారికి ఉపయోగపడవచ్చు. అలాగే మీ సమస్యలకు, సందేహాలకు సూచనలు, సందేహాలు పొందవచ్చును. బ్లాగోస్ఫియరులో ఎంతో మంది శ్రేయోభిలాషులూ వుంటారు. వారు తమ పేరుతోనో లేక అజ్ఞాతంగానో మీకు ఎంతో విలువైన మార్గ దర్శకత్వం చెయ్యగలరు. అలా ఎన్నో సందర్బాల్లో నేను వారి సలహాల వల్ల లాభపడ్డాను. అలాగే నా అనుభవసారాన్నీ వీలయినతవరకు నా బ్లాగుల్లో పంచుతూవుంటాను.
 
అవకాశాలు
మీ ప్రతిభ నలుగురికీ తెలియడం వల్ల, కొత్త మిత్రుల వల్ల మీరు ఆశించిన రంగంలో కొత్త అవకాశాలు రావచ్చు. లేదా మీలో సరికొత్త ఆలొచనలు పురివిప్పవచ్చు. మిగతా బ్లాగ్మిత్రుల సహాయ సహకారాలతో కొత్త పనులు చేపడుతుండవచ్చు. నలుగురితో కలిసి నాలుగు మంచిపనులు నెత్తిన వేసుకోవడానికి మీకు ఉత్సాహం రావచ్చు.
 
వృత్తి
మీరు మీ వృత్తి పరమయిన ఆంశాలతో బ్లాగింగ్ చేస్తున్నట్లయితే మీ ప్రతిభా పాటవాలు అవసరమయిన వారికి తెలిసి మీకు కొత్త అవకాశాలు ఇవ్వడానికి వారు ముందుకు రావచ్చు.
 
ఇలా బ్లాగుడు వల్ల ఎన్నో లాభాలున్నాయి. అలా అలా బ్లాగుడు దంచుతూ దంచుతూ మీరు బ్లాగుడుకాయా అయిపోవచ్చు. అయితే బ్లాగింగు వల్ల కొన్ని కష్టనష్టాలూ లేకపోలేదు. అవి మరోసారి చెప్పుకుందాం. బ్లాగింగ్ వల్ల ఇంకా ఏం ముఖ్యమయిన లాభాలుండవచ్చో మీకు తెలిసినవి ఏమయినా వుంటే ఇక్కడ సెలవివ్వండి.

13 comments:

  1. Nice.. మీరన్నట్టు .. (డైరెక్ట్ గా కాకపోయినా) బ్లాగ్ మొదలు పెట్టినప్పటినించీ నా చుట్టూ మనుషులు నా ఫ్యూచర్ టపాల్లో పాత్రల్లా కనిపిస్తున్నారు :)

    సూచన : మీ పుస్తకం లో కొంతమంది బ్లాగర్లని ఎందుకు రాస్తున్నారో కనుక్కుని ఒక అపెండిక్స్ జత పరిస్తే..

    ReplyDelete
  2. బాగా చెప్పారు. మనిషికి ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోని ఈరోజుల్లో, మన భావాలని చదివి ఒక్కరు స్పందించినా అది చాలా తృప్తిని ఇస్తుంది. మనకంటూ కొంత స్పేస్ తప్పక కేటాయించుకోవాలి.

    ReplyDelete
  3. @ క్రిష్ణప్రియ
    మీ చుట్టూ బ్లాగర్లు మీ భవిష్యత్ టపాల్లో పాత్రలుగా ఎప్పుడు కనిపిస్తారేంటీ? గేటెడ్ కమ్యూనిటీ కథల్లాగా బ్లాగ్ కమ్యూనిటీ కథలు ఎప్పుడు వ్రాస్తారేంటీ?

    మంచి సూచనే. ఆలోచిస్తాను. ప్రత్యేకంగా ఆ ఆంశం అని కాదు కానీ కొంతమంది బ్లాగర్ల నుండి కొన్ని వ్యాసాలు తీసుకోవాలని అనుకుంటూనే వున్నాను. అందులోనే ఈ ఆంశం కూడా వీలయితే కవర్ చెయ్యమని చెబుతాను. ఎలాగూ మీరు మంచి సూచన అందించారు కాబట్టి మీరు బ్లాగు ఎందుకు మొదలెట్టారో ఒక టపా వెయ్యకూడదూ. మీరు అనుమతిస్తే అది నా పుస్తకంలో వేసుకుంటాను. టపా వెయ్యడం మీకు ఇష్టం లేకపోతే నీకు ఈమెయిల్ చెయ్యగలరు.

    మిగతా వారు కూడా ఎవరయినా ముందుకు వస్తే అందులో ముఖ్యమయినవి, చక్కగా వచ్చినవి పొందుపరిచేద్దాం.

    ReplyDelete
  4. anta manchi point doraka badite post cheyaraa.. meerasalu sarath e naa ?

    or asalu chadava leda comment ?

    ReplyDelete
  5. @ కాయ
    వద్దండీ బాబూ. విషయం పక్కదారి పడుతోంది. అందుకే ఆ వ్యాఖ్యలన్నీ తీసివేసాను. ఒక చక్కటి విషయం చర్చిస్తున్నప్పుడు అలా చిన్నచిన్న విషయాల్లో వివాదాలు కొనసాగడం ఏం బావుంటుంది చెప్పండి.

    ReplyDelete
  6. సరే ఆ కామెంటు మళ్ళీ వ్రాస్తున్నా ఈ సారి గట్టిగా చదివి వేయాలో వద్దో నిర్ణయించుకోండి.
    అరె నాకు ఇంత పెద్ద పాయింట్ స్పురిస్తే...... మీ లాంటి పెద్దొళ్ళున్నారే మా క్రియేటివిటీ ని గుర్తించనే గుర్తించరు ... హు..

    శిల్పం: చెక్కగా చెక్కగా వచ్చేది. వ్రాయగా వ్రాయగా కూడా వస్తుంది. అంటే ఏదైనా కళని ఉపయోగించగా ఉపయోగించగా సాధకుడి కళ ఖండాలలో ఏర్పడే యూనీక్ లక్షణమే శిల్పం అని నాకు స్పురించిన పాయింట్.
    ఆ శిల్పాన్ని గుర్తిస్తే ఆతడి ఇతర(అనామక) కళాఖండాలను అవలీలగా గుర్తిచవచ్చు.

    కామెంట్ చదవకుండా ఎంత గొప్ప పాయింట్ మిస్ అయ్యారు.. ఇప్పుడిదంతా మళ్ళీ వ్రాయాల్సి వచ్చింది..
    ..నాకైతే పేద్ద పండితుడి ఫీలింగ్ వస్తోంది..

    .....కొంపదీసి చదివే లైట్ తీస్కున్నారా ?

    ReplyDelete
  7. నాకైతే ఇదో ప్రెషర్ వెంట్ ! నా భావాల్ని వినడానికి, నా సుత్తి భరించడానికీ ఎవరూ దొరకక పోతే, ఇంటర్నెట్ లో రాసి వొదిలేస్తా. సోషల్ నెట్ వర్కింగ్ పడదు. నాకు వీలైనపుడు వీలున్నంత బ్లాగింగ్ చెస్తుంటా. నా తప్పొప్పులు ఇలానే తెలుసుకుంటాను. భావ వ్యక్తీకరణ (రాతలో) లో అభివృద్ధి వచ్చింది. ఎప్పటికైనా కధా రచన చెయ్యాలని కోరిక. కానీ, నాలుగు వాక్యాలు రాయగానే స్టుపిడ్ అనిపించి మానేస్తున్నా. దీని పై మీ సలహా కావాలి. :D

    ReplyDelete
  8. @ కాయ
    మీరు అన్నది నిజమే. వ్రాయగా వ్రాయగా రచయితకి తనదైన టెక్నిక్ అలవడుతుంది.

    @ Sujata
    సలహా కావాలి అని మీరు పెద్దగా నవ్వుతూ అడిగేసరికి ఇవ్వాలో వద్దో అనే సంశయంలో వున్నాను. ఈ కాలంలో కథలు ఎవరు అయినా చదువుతున్నారంటారా? ఎక్కువమంది చదవకపోయినా ఫరవాలేదూ - ఆత్మ సంతృప్తికై వ్రాసుకుంటాను అంటే ఫర్వాలేదు. ఇప్పుడు క్రేజ్ నాన్-ఫిక్షన్ కే వుంది. మీరు వ్రాసింది మామీద ప్రయోగించి చూడండి. మీకు మీరు స్టుపిడ్ అనుకోకుండా మేమందరం ఏమంటామో చూడండి. ఇప్పుడు నేను చేస్తున్నది మీ అందరిమీదా ప్రయోగమే కదా. ఈ సిరీసులోని కొన్ని టపాలు మాత్రం బొత్తిగా ఎవరికీ నచ్చడం లేదు - అలాంటివి సవరిస్తాను. మంచిగా వచ్చినవి మాత్రం పెద్దగా మార్చను.

    మీరు చక్కని బ్లాగర్ కాబట్టి మీ రచనలూ బావుంటాయి - సాగిపొండి.

    ReplyDelete
  9. శరత్, మీరెలాగూ ఈ పుస్తకం కోసం వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టారు కనుక, అసలు బ్లాగును ఎలా create చేసుకోవాలి అన్న దానిపై విపులంగా ఒక పోస్టు వ్రాస్తే స్వకార్యం, పీఠాల కార్యం నెరవేరినట్టు అవుతుంది. నాకు కనీసం వారానికొక request అన్నా ఇలాంటిది వస్తుంది. మీరు ఒక టపా వ్రాస్తే , ఆ టపా లింక్ ఠపీ మని ఇచ్చేద్దామన్న ఆశ. ఏదో నాపని కూసింత సులువవుతుంది.

    ReplyDelete
  10. @ భా రా రే
    దాని గురించి ఎలాగూ వ్రాయక తప్పదు కానీ అది బోరింగ్ వర్క్ కాబట్టి ఆలస్యం చేస్తూ వస్తున్నా. అది వ్రాసాక చదివి ఏవయినా సూచనలు వుంటే చెప్పడం మరవకండి.

    ReplyDelete
  11. @ భారారే
    సిబి రావు గారు బ్లాగులని ఎలా రూపొందించాలి అనే విషయం పై ప్రదర్శనలు ఇచ్చేవారు. అది గుర్తుకు వచ్చి మీరు అడిగిన విషయంపై వారి టపా కానీ వేరే టపా కానీ ఏదయినా వుందా అంటే ఈ క్రింది టపా తెలియజేసారు.

    http://telugublogtutorial.blogspot.com/2009/09/blog-post_1450.html

    బ్లాగు గురువు బ్లాగునుండి అన్నీ ఎత్తివేసి నా పుస్తకంలో వేసుకుంటే బావుంటుందేమో కానీ జ్యోతి గారు ఊరుకోరనుకుంటా. మళ్ళీ చక్రం నేను కనిపెట్టకుండా అనగా మళ్ళీ ఆ విషయాలు నేను వ్రాయకుండా వారి బ్లాగుని ఒక వ్యాసంలో పరిచయం చేసి అలాంటి విషయాలన్నీ అక్కడ చదువుకొమ్మంటాను. ఏవయినా మరీ అవసరం అనిపిస్తే మళ్ళీ వ్రాస్తాను.

    ReplyDelete
  12. Thanks for the information Sarath.

    రాబోయే requests ను ఇక్కడకి redirect చేస్తాను.

    వర్డ్ ప్రెస్ బ్లాగును ఎలా మొదలెట్టాలో కూడా చేరిస్తే బాగుంటుందేమో.

    ReplyDelete
  13. @ భారారే
    వామ్మో...వర్డ్‌ప్రెస్సు గురించి వివరించడం నా వల్ల జరిగేపని కాదండీ. ఎవరయినా పెద్దలు పూనుకుంటే బావుంటుంది.

    ReplyDelete