నాకు నచ్చిన ఓ టూకీగా టపా - 2

ముందు ఈ టపా చదవండి:
నాకు నచ్చిన ఓ టూకీగా టపా - 1

యుక్తవయస్సు నుండీ విల్ పవర్ మీదా, విజయం మీదా శ్రద్ధ పెడుతూ వస్తూనేవున్నాను. అయినా సాధించినవి అంతంత మాత్రం విజయాలే. ఎందుకంటే నా వ్యక్తిత్వంలో ఓ ప్రధాన అవరోధం అందుకు (పూర్తిస్థాయి విజయాలకి) ప్రతిబంధకంగా నిలుస్తోంది. దానిని అధిగమించేందుకై పలు ప్రయత్నాలు ఎన్నో ఏళ్ళుగా చేస్తూనేవున్నాను. అలా ప్రయత్నాలు చేస్తూవున్నాను కనుకనే ఎంతో కొంత విజయాన్ని సాధించుకుంటూ వస్తున్నాను. ఆ లోపం ఏంటంటే నా ప్రయత్నాలు అన్నీ స్పైరలుగా మిగిలిపోవడం. ఉదాహరణకు ఉదయం అయిదు గంటలకే లేచి కలాకృత్యాలు తీర్చుకొని ధ్యానం/సెల్ఫ్ హిప్నటిజం చేస్తే మనస్సుకీ, శరీరానికీ మంచిదని బాగా తెలుసు. ప్రయత్నిస్తాను, పాటిస్తాను... కానీ కొన్ని రోజులే. ఆ తరువాత అది అటకెక్కిస్తాను. మళ్ళీ కొద్దిరోజులకి మళ్ళీ జ్ఞానోదయం అవుతుంది. మళ్ళీ ధ్యానాన్ని అటక మీది నుండి దించి పాటిస్తాను. అలా మళ్ళీ.. మళ్ళీ. అలా స్పైరలుగా నా వ్యవహారాలు వుండటం వల్ల క్రమంగా ఎదగలేకపోతున్నాను. కాలం గడిచిపోతూనేవుంది కానీ నా పరిస్థితి కొంత తప్ప దాదాపుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగానే వుంటోంది.

ఎందుకనీ అని అడిగితే మీలో విల్ పవర్ లేక అని అందరూ కూడబలుక్కొని అంటారు నాకు తెలుసు. అది సాధించడానికేగా ధ్యానం చెయ్యాలనుకుంటున్నదీ :) చెట్టు ముందా - విత్తు ముందా? ఇలాక్కాదని నాలో ఆత్మ విశ్వాసం కానీ, ఆత్మ బలం కానీ లేకపోవడానికి కారణం ఏంటా అని ఎప్పుడో రంధ్రాన్వేషణ చేసిపడేసాను. నేను ఎంత ముందుకు వెళ్దామన్నా నా మనస్సు సహకరించకపోయేది, వెనక్కి లాగేస్తుండేది. మనస్సూ, శరీరం ధృఢపరచుకునేందుకై వ్యాయామం చేస్తున్నా కూడా దడగా అనిపించి చెయ్యాలనిపించేది కాదు. అప్పుడు లోపం నాలో ఆత్మ బలం లేకపోవడం కాదని ఆత్మబలం లేకపోవడానికి మూలం మరేదొ వుందని దాన్ని కనిపెట్టి కవరప్ చెయ్యడానికి ఎన్నో ఏళ్ళు ప్రయత్నించాను. నాలోని న్యూరోసిస్ అందుకు కారణం. అందులో కూడా ఎన్నో రకాలు వుంటాయి. అది గుర్తించాక అందులో అసలయిన రకం గుర్తించి నివారించుకోవడానికి మరి కొన్ని ఏళ్ళు శ్రమ పడ్డాను. ఇదివరలో రోజూ మందులు వాడుతుండేవాడిని కానీ ఇప్పుడు అవి మానేసి ఇప్పుడు చేప నూనె వాడుతుండటం వల్ల ఆ లక్షణాలు చాలా తగ్గాయి.

అయితే ఈ ప్రయత్నాలు సమస్యని మరుగుపరచగలుగుతున్నాయి కానీ నివారించలేకపోవడం వల్ల ఒత్తిడిలో వున్నప్పుడు ఆ లక్షణాలు ఎంతో కొంత ఉబికివస్తుంటాయి. నా జీవితం మధ్యలోనే పెనం మీదినుండి పొయ్యిలోకి పడిపోయింది కాబట్టి నా జీవితంలో ఒత్తిడీ ఎక్కువే. జీవితాన్ని జోడెడ్ల బండితో సవారీ చెయ్యడం వేరు, మరో కుంటి ఎద్దుని వేసుకొని లాగించడం వేరు.  నా న్యూరోసిస్ (GAD) కి మూల కారణాలు ఎంటా అని కూడా పరిశోధిస్తూ వస్తున్నాను. అలాంటి లక్షణాలు ఎందుకు వస్తాయో ఎంతో సమాచారం వుంది. అయితే నాకు ఆ కారణాల వెనుక మూల కారణాలు కావాలి. అందుకోసం అన్వేషణ సాగుతోంది.

ఈమధ్య కాలంలో మా ఆవిడకి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఇప్పించడం, అవి ఫలితాలు ఇస్తుండటంతో దానిమీద ఆసక్తి పెరిగింది. నా సమస్యకీ పరిష్కారం అందులో దొరుకుతుందా అని చూసాను. వెన్నుపూస సమస్యలు న్యూరోసిస్ కు కూడా కారణం కావచ్చునట. ఎందుకయినా మంచిది అని ఉచిత పరీక్షలే కదా అని చేయించుకున్నాను. వెన్నుపూస తలభాగంలో C1 వెర్టెబ్రే లో చాలా సమస్య వుంది అని గుర్తించాం. మామూలుగా అక్కడ కోణం 35 డిగ్రీలో ఏమో వుండాలి. సరిగ్గా గుర్తుకులేదు. నాకు 7 డిగ్రీలే వుంది. 10 కంటే తక్కువయితే సమస్య ఎక్కువని చెప్పారు. ఆ సమస్య వల్ల ఆ ప్రాంతం ద్వారా వ్యాపించే నరాలు ఒత్తిడికి గురి అయి స్పందనలు సరిగ్గా ప్రవహించవుట. తలకు వెళ్ళే నాడులకు రక్తం కూడా సరిగ్గా ప్రవహించదట.

సాధారణ వైద్యులు చాలామంది కైరోప్రాక్టిక్ చికిత్సని విశ్వసించరు. దానిని ఓ కల్ట్ ట్రీట్మెంటుగా భావిస్తారు. అయితే వారిలో, జనాల్లో ఈ విధానంపై నమ్మకం పెరుగుతూ వస్తోంది. మేము కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే ఇది కూడా ప్రయత్నించి చూద్దామని మా ఆవిడకి మొదలుపెట్టాము. చక్కటి ఫలితాలు రావడంతో నేను కూడా ఈ చికిత్స మొదలుపెట్టాను. ఒక నెల తరువాత సాధారణ సమీక్ష వుంటుంది. మూడు నెలల తరువాత మళ్ళీ ఎక్సురేలు తీసి పూర్తి స్థాయి సమీక్ష వుంటుంది. నా ఆరోగ్య భీమా ఈ ఖర్చుని పూర్తిగా భరిస్తుంది కాబట్టి ఆ సమస్య లేదు. అందువల్ల ఓ మూడు నెలలు ఈ విధానంలో వెళ్ళి చూడటం వల్ల నాకు నష్టం లేదు కదా. అయితే కైరోలో కూడా చాలా కొద్ది రిస్క్ వుంది కానీ ఆ మాత్రం రిస్క్ ఎక్కడయినా వుంటుంది.

ఆత్మకు, అంతరాత్మకు (మనం ఇష్టపడేవి, అనుకునేవి, మనస్సు సూచించేవి) సమన్వయం కుదరనప్పుడు ఆత్మ బలం అంతగా వుండదు అనుకుంటాను. ఆ సమన్వయానికి కృషి చెయ్యాలి. సమస్యలుంటే కారణాలు గుర్తించాలి. ఈలోగా విల్ పవర్ ని గ్రూమింగ్ చేస్తూనే వుండాలి. ఒక్కో చిన్ని చిన్ని విజయం విల్ పవర్ ని ఉత్సాహ పరుస్తూనే వుంటుంది. నేను విఫలమయిన వ్యక్తిని అని చెప్పడం లేదు కానీ గొప్ప విజయాలు ఏమీ సాధించలేదు. నాకు వున్న ఆరాటానికి, పరిజ్ఞానానికి  ఇంకా గొప్ప స్థానంలో వుండాలి. పట్టుదల వుందా అంటే వుంది కానీ ఎప్పుడూ జారడమూ, పైకి కొంత దూరం వెళ్ళడమే జరుగుతోంది కానీ పూర్తిగా పైకి వెళ్ళలేకపోతున్నాను. అది అందరూ సాధారణ విషయంగానే తీసుకుంటారు కావచ్చు. నేను అలా కాదు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేంతవరకూ కిందామీదా పడుతూనేవుంటాను. ఇందులో మెరుగుపడితే నాలో నాకు సమన్వయం ఎక్కువయ్యి విజయాల శాతం ఎక్కువవుతుంది. కాకపొతే ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి.

అవో ఇవో లోపాలు చాలామందిలో వుంటాయి. వారిలో చాలామంది గుర్తించరు. గుర్తించినా పరిష్కారానికి అంతగా ప్రయత్నించరు.  విజయాలు సాధించలేకపోవడానికి విల్పవర్ లేకపోవడమే కారణం అని చాలామంది అంటారు కానీ ఎంత ప్రయత్నించినా ఆ విల్ పవర్ మెరుగుపరచుకోలేకపోతే అది సాధించలేకపొవడానికి మూలకారణాలు అన్వేషించాలి. జలసూత్రం చంద్రశేఖర్ చెయ్యాల్సింది కూడా అదే. అసలు ఇలాంటి అసలయిన సందేహం అందరికీ రాదు. ఆత్మబలం కోసం కిందామీదా పడుతూనే వుంటారు కానీ దాని గురించి లోతుగా వెళ్ళరు. సమస్యంటూ గుర్తిస్తే సగం సమస్య తీరినట్టే. మిగతా సగం ఇక అది పరిష్కరించుకోవడమే. వారు సమస్యని గుర్తించారు పైగా సమస్యా పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు కాబట్టి అభినందనీయులు.

10 comments:

 1. http://www.upright-health.com/upper-cervical-angle.html

  ReplyDelete
 2. There is only medicine that works and medicine that doesn't work."[35] He says that if a technique is demonstrated effective in properly performed trials, it ceases to be alternative and simply becomes medicine.
  -Richard Dawkins

  ఈ కైరోప్రాక్టీషనర్లు వారిదగ్గరికి ఏ పేషంటు వచ్చినా ముందు ఉచితంగా ఒక ఎక్స్-రే తీస్తారు. అది చూపించి మీ స్పైన్ ఇలా కర్వ్‌లాగా ఉండాలి, కానీ మీది ఇలా ఇక్కడ స్ట్రెయిట్‌గా అయ్యింది అని చెప్పి భయపెడతారు. ఆతరువాత ఒక ఆర్నెల్లపాటు మీవంటిపై ఒక పట్టు పట్టి అటూ,ఇటూ విరుస్తారు. అది చేయించుకునేప్పుడు హాయిగానే ఉంటుంది, కానీ దీనివల్ల సమస్య తగ్గుతుందని నేననుకోలేదు. నేనూ నెక్‌పైన్‌కి కొన్నిరోజులు ట్రీట్మెంటు తీసుకున్నాను, తగ్గలేదు.

  రెగ్యులర్ ఎక్సర్‌సైజులు, బాడీ సిట్టింగ్ పొజిషన్లో మార్పు లాంటివి చెయ్యడం బెటర్.

  ReplyDelete
 3. @ సత్యాన్వేషి
  పాశ్చాత్య దేశాల్లో కారుని ఇంజిన్ ఆయిల్ మార్పిడి కోసం తీసుకెళ్ళినప్పుడు ఆయిల్ మార్చడమే కాకుండా కారులో వున్న ఇతర సమస్యలను కూడా గుర్తించి తెలియజేస్తారు. కొత్త కారు అనుకోండి అంతగా సమస్యలు వుండవు. కారు పాతదయిన కొద్దీ పలు సమస్యలు తేలుతుంటాయి. అవి మనం రెపెయిర్ చేయించుకోవాలో, వేచి చూడాలో నిర్ణయించుకోవాలి. మొన్న నా పాతకారు అలాగే తీసుకెళ్ళినప్పుడు పలు సమస్యలు చెప్పారు. ఎప్పుడు మొరాయిస్తుందో తెలియదన్నారు. ప్రాబ్లెం ఏరియాస్ చూపించారు. అవి నిజమే కానీ రెపెయిర్లు వద్దన్నాను. అసలా కార్ పెద్దగా వాడనే వాడటం లేదు. ఎప్పుడన్నా మరీ మొరాయిస్తే అప్పుడు బాగు చేయించుకుంటాను అని లైట్ తీసుకున్నాను. మాకు ఇంకో కొత్త కార్ వుంది కాబట్టి పెద్దగా సమస్య లేదు.

  అలాగే కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పలు సమస్యలు బయటపడుతుండవచ్చు. వయస్సు పెరిగినా కొద్దీ ఎక్కువ సమస్యలు వస్తాయి. అవి రెపెయిర్ చేయించుకోవాలా వద్దా అనేది మన నిర్ణయమే. మీకు పనిచెయ్యలేదు కాబట్టి నమ్మకం కోల్పోయారు. మా ఆవిడకి పనిచేస్తోంది కాబట్టి నమ్మకం పెరిగింది. వెళ్ళి చూపించుకున్నాను. కొన్నిలోపాలు తెలిసాయి. ప్రాధమిక పరీక్షలోనే శరీరంలో కొన్ని హెచ్చుతగ్గులున్నాయన్నారు. నిజమా అనుకున్నా. ఎక్సురేలు తీసి హిప్స్ బ్యాలన్స్ లేవు అని చూపించారు. నిజమా అనుకున్నా. (అందువల్లనే అనుకుంటా) భుజాలు కూడా బ్యాలన్స్ లేవు అన్నారు. నిజమా అని మళ్ళీ అనుకున్నా. ఇంటికివచ్చి అద్దంలో పరీక్షగా భుజాలు చూసుకున్నా. నిజమే. మరి ఆ విషయం ఇంతవరకు ఏ డాక్టరయినా చేప్పాడూ?

  నేనేమీ నా జీవితం అంతా దానికి అంకితం చెయ్యడం లేదు. ఓ మూడు నెలలు చూస్తాను. మెరుగుదల లేకపోతే నమస్తే చెబుతాను.

  ReplyDelete
 4. నేను నమ్మకం కోల్పోయింది నాకు పనిచెయ్యక కాదు, ఆతరువాత ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి చదివినతరువాత. నేను వెల్లినప్పుడు అసలు నాకు కైరోప్రాక్టీస్ అంటేనే తెలియదు.

  /**వెళ్ళి చూపించుకున్నాను. కొన్నిలోపాలు తెలిసాయి. ప్రాధమిక పరీక్షలోనే శరీరంలో కొన్ని హెచ్చుతగ్గులున్నాయన్నారు. నిజమా అనుకున్నా. ఎక్సురేలు తీసి హిప్స్ బ్యాలన్స్ లేవు అని చూపించారు. నిజమా అనుకున్నా. (అందువల్లనే అనుకుంటా) భుజాలు కూడా బ్యాలన్స్ లేవు అన్నారు. నిజమా అని మళ్ళీ అనుకున్నా. ఇంటికివచ్చి అద్దంలో పరీక్షగా భుజాలు చూసుకున్నా. నిజమే. మరి ఆ విషయం ఇంతవరకు ఏ డాక్టరయినా చేప్పాడూ? **/

  ఆవిషయం ఇంతవరకూ ఏడాక్టరూ చెప్పలేదంటే బహుషా అవి నిజం సమస్యలు కాదేమో. అసలంతా బాగుండి ఏనొప్పి లేనివారు వెల్లినా ఇదే చెబుతారని నాకనుమానం. నేనీవిషయం మీరు మొట్టమొదటిసారి కైరోప్రాక్టీస్ గురించి చెప్పినప్పుడే రాద్దామనుకున్నాను, కానీ మిమ్మల్నెందుకు నిరుత్సాహపరుచాలని రాయలేదు. నాకు నచ్చనిది వీరు వెల్లిన పేషంట్లందరికీ అనవసర భయాలు కల్పించడం.

  మాదగ్గర కారును ప్రతిసంవత్సరం ఇన్స్పెక్షన్ చేయించి కారు నడిచే కండీషన్లో ఉందని సర్టిఫికేట్ తీసుకోవాలి. అది గవర్నమెంటుది కనుక నిజంగా ఏదయినా మార్చాల్సొస్తేనే మార్చమంటారు. ఇక్కడ హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ సర్వీసెస్..నిజంగా అవసరమయితే తప్ప ట్రీట్మెంటు చెయ్యరు, అది సరిగాలేదు, ఇది సరిగాలేదని భయపెట్టరు. :).

  any ways మీకు నచ్చితే కంటిన్యూ చెయ్యండి, నేను నా అభిప్రాయం చెప్పానంతే.

  ReplyDelete
 5. Sarath gaaru,
  good efforts in trying to analyse the reason for lacking self discipline.

  I think of few reasons
  1. Lack of need, feeling content inside, self satisfaction, not having a burning desire.
  2. Phisological changes triggering neurological changes ( ex: harmonal changes)
  3. both 1 and 2 acting together and interrelated as they say physiology is psychology and vice versa.
  4. Could be what is called as 'Destiny'

  meena

  ReplyDelete
 6. మీరు నాస్తికులు గనక రిచర్డ్ దాకిన్స్ గురించి వినే ఉంటారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్‌పై ఇది దాకిన్స్ కామెంట్.

  http://www.youtube.com/watch?v=IZLKKW2SQoc

  ReplyDelete
 7. @ సత్యాన్వేషి
  క్కాస్సేపు కైరో గురించి వదిలేసి నా కళ్ళద్దాల గురించి మాట్లాడుకుందాం :) డిగ్రీ చదువుతున్న రోజుల్లోనుండే నాకు కళ్ళద్దాలు వచ్చాయి. అయితే వాటి చివర్లు ఎప్పుడూ ఒకటి కాస్త ఎత్తుగావుంటుండేది. ఏంటబ్బా ఇది బ్యాలన్సు లేదు అనుకొని దాన్ని ఎప్పుడూ వంచుతుండేవాడిని కానీ మళ్ళీ మూన్నాళ్ళకే అది మొదటికి వచ్చేది! కట్ చేస్తే కెనడాకి వచ్చాక కొత్తగా కళ్ళద్దాలు తీసుకున్నాను. ఇండియాలో అయితే మన కళ్ళద్దాలు మనకు ఇచ్చేసి ఇక మీ ఖర్మ అంటారు. ఇక్కడ అలా కాదు. కళ్ళద్దాలు ఇచ్చేప్పుడు కూడా ఎంతో శ్రద్ధగా అన్ని చూసి, పరిశీలించి ఇస్తారు (కళ్ళ పరీక్ష సంగతి కాదు నేను చెబుతున్నది. అవి ఎలాగూ అందరూ శ్రద్ధగానే చెస్తారు లెండి. కళ్ళద్దాలు ఇవ్వడం గురించి చెబుతున్నా). కళ్ళద్దాలు ఇస్తున్నామె నా చెవులను పరీక్షించి కళ్ళద్దాలు కాస్త వంచి ఇచ్చింది. నేను ఆశ్చర్యపడిపోయి ఎందుకు వంచారు అని అడిగాను. మీ చెవుల ఎత్తులో హెచ్చుతగ్గులు వున్నాయి అంది! ఇన్నాళ్ళ తరువాత తెలిసింది ఏంటంటే నా చెవులు ఎత్తు వున్నవైపే నా శరీరం అంతా కొద్దిగా ఎత్తుగా వుందని!! కాళ్ల నుండీ తలదాకా. నా కళ్ళజోడు సంగతి నాకు గుర్తుకులేకపోతే ఇది నిజమని నమ్మేవాడిని కాదనుకుంటా.

  ఇహపోతే నేను మరీ అరివీర నాస్తికుడిని కాదు కాబట్టి నాస్తికత్వాన్నీ మూఢంగా నమ్మనండీ :) అందువల్ల ఆల్టెర్నేటివ్ మెడిసిన్నీ కాస్తో కూస్తో నమ్ముతాను.

  ReplyDelete
 8. @ మీనా
  నా విషయంలో మొదటిదాని సమస్య లేదు అందువల్ల రెండవదే అయివుంటుంది. అందువల్ల మూడవదీ అయివుంటుంది. ఇక నాలుగోదాని గురించి నో కామెంట్స్ :)

  ReplyDelete
 9. కైరో ప్రాక్టర్ని నమ్మొచ్చో లేదో కానీ, ఈ కళ్లజోడు బాలన్సు విషయం మాత్రం నిజమే శరత్ గారూ! నేనూ చాలా రోజులు "ఏమిటీ గోల? ఎన్ని కళ్లజోళ్ళు మార్చినా నాకు సరిగ్గా ఉండవేం?" అని విసుక్కునేదాన్ని. నా చెవులే హెచ్చుతగ్గూ అని నాకే అనిపించి చెప్పి సరిచేయించుకున్నాను. సేం పించ్. :)

  ReplyDelete
 10. @ కొత్తావకాయ
  మీకన్నా కనీసం మీ చెవులే హెచ్చుతగ్గులున్నాయేమో అని డవుట్ అయినా కొంతకాలానికయినా వచ్చింది. నాకసలు అది ఊహకే అందలేదూ. కళ్ళజోళ్ళ స్పెషలిస్ట్ చెబితే కానీ తెలిసిరాలేదు.

  ReplyDelete