నాకు నచ్చిన ఓ టూకీగా టపా - 2

ముందు ఈ టపా చదవండి:
నాకు నచ్చిన ఓ టూకీగా టపా - 1

యుక్తవయస్సు నుండీ విల్ పవర్ మీదా, విజయం మీదా శ్రద్ధ పెడుతూ వస్తూనేవున్నాను. అయినా సాధించినవి అంతంత మాత్రం విజయాలే. ఎందుకంటే నా వ్యక్తిత్వంలో ఓ ప్రధాన అవరోధం అందుకు (పూర్తిస్థాయి విజయాలకి) ప్రతిబంధకంగా నిలుస్తోంది. దానిని అధిగమించేందుకై పలు ప్రయత్నాలు ఎన్నో ఏళ్ళుగా చేస్తూనేవున్నాను. అలా ప్రయత్నాలు చేస్తూవున్నాను కనుకనే ఎంతో కొంత విజయాన్ని సాధించుకుంటూ వస్తున్నాను. ఆ లోపం ఏంటంటే నా ప్రయత్నాలు అన్నీ స్పైరలుగా మిగిలిపోవడం. ఉదాహరణకు ఉదయం అయిదు గంటలకే లేచి కలాకృత్యాలు తీర్చుకొని ధ్యానం/సెల్ఫ్ హిప్నటిజం చేస్తే మనస్సుకీ, శరీరానికీ మంచిదని బాగా తెలుసు. ప్రయత్నిస్తాను, పాటిస్తాను... కానీ కొన్ని రోజులే. ఆ తరువాత అది అటకెక్కిస్తాను. మళ్ళీ కొద్దిరోజులకి మళ్ళీ జ్ఞానోదయం అవుతుంది. మళ్ళీ ధ్యానాన్ని అటక మీది నుండి దించి పాటిస్తాను. అలా మళ్ళీ.. మళ్ళీ. అలా స్పైరలుగా నా వ్యవహారాలు వుండటం వల్ల క్రమంగా ఎదగలేకపోతున్నాను. కాలం గడిచిపోతూనేవుంది కానీ నా పరిస్థితి కొంత తప్ప దాదాపుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగానే వుంటోంది.

ఎందుకనీ అని అడిగితే మీలో విల్ పవర్ లేక అని అందరూ కూడబలుక్కొని అంటారు నాకు తెలుసు. అది సాధించడానికేగా ధ్యానం చెయ్యాలనుకుంటున్నదీ :) చెట్టు ముందా - విత్తు ముందా? ఇలాక్కాదని నాలో ఆత్మ విశ్వాసం కానీ, ఆత్మ బలం కానీ లేకపోవడానికి కారణం ఏంటా అని ఎప్పుడో రంధ్రాన్వేషణ చేసిపడేసాను. నేను ఎంత ముందుకు వెళ్దామన్నా నా మనస్సు సహకరించకపోయేది, వెనక్కి లాగేస్తుండేది. మనస్సూ, శరీరం ధృఢపరచుకునేందుకై వ్యాయామం చేస్తున్నా కూడా దడగా అనిపించి చెయ్యాలనిపించేది కాదు. అప్పుడు లోపం నాలో ఆత్మ బలం లేకపోవడం కాదని ఆత్మబలం లేకపోవడానికి మూలం మరేదొ వుందని దాన్ని కనిపెట్టి కవరప్ చెయ్యడానికి ఎన్నో ఏళ్ళు ప్రయత్నించాను. నాలోని న్యూరోసిస్ అందుకు కారణం. అందులో కూడా ఎన్నో రకాలు వుంటాయి. అది గుర్తించాక అందులో అసలయిన రకం గుర్తించి నివారించుకోవడానికి మరి కొన్ని ఏళ్ళు శ్రమ పడ్డాను. ఇదివరలో రోజూ మందులు వాడుతుండేవాడిని కానీ ఇప్పుడు అవి మానేసి ఇప్పుడు చేప నూనె వాడుతుండటం వల్ల ఆ లక్షణాలు చాలా తగ్గాయి.

అయితే ఈ ప్రయత్నాలు సమస్యని మరుగుపరచగలుగుతున్నాయి కానీ నివారించలేకపోవడం వల్ల ఒత్తిడిలో వున్నప్పుడు ఆ లక్షణాలు ఎంతో కొంత ఉబికివస్తుంటాయి. నా జీవితం మధ్యలోనే పెనం మీదినుండి పొయ్యిలోకి పడిపోయింది కాబట్టి నా జీవితంలో ఒత్తిడీ ఎక్కువే. జీవితాన్ని జోడెడ్ల బండితో సవారీ చెయ్యడం వేరు, మరో కుంటి ఎద్దుని వేసుకొని లాగించడం వేరు.  నా న్యూరోసిస్ (GAD) కి మూల కారణాలు ఎంటా అని కూడా పరిశోధిస్తూ వస్తున్నాను. అలాంటి లక్షణాలు ఎందుకు వస్తాయో ఎంతో సమాచారం వుంది. అయితే నాకు ఆ కారణాల వెనుక మూల కారణాలు కావాలి. అందుకోసం అన్వేషణ సాగుతోంది.

ఈమధ్య కాలంలో మా ఆవిడకి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఇప్పించడం, అవి ఫలితాలు ఇస్తుండటంతో దానిమీద ఆసక్తి పెరిగింది. నా సమస్యకీ పరిష్కారం అందులో దొరుకుతుందా అని చూసాను. వెన్నుపూస సమస్యలు న్యూరోసిస్ కు కూడా కారణం కావచ్చునట. ఎందుకయినా మంచిది అని ఉచిత పరీక్షలే కదా అని చేయించుకున్నాను. వెన్నుపూస తలభాగంలో C1 వెర్టెబ్రే లో చాలా సమస్య వుంది అని గుర్తించాం. మామూలుగా అక్కడ కోణం 35 డిగ్రీలో ఏమో వుండాలి. సరిగ్గా గుర్తుకులేదు. నాకు 7 డిగ్రీలే వుంది. 10 కంటే తక్కువయితే సమస్య ఎక్కువని చెప్పారు. ఆ సమస్య వల్ల ఆ ప్రాంతం ద్వారా వ్యాపించే నరాలు ఒత్తిడికి గురి అయి స్పందనలు సరిగ్గా ప్రవహించవుట. తలకు వెళ్ళే నాడులకు రక్తం కూడా సరిగ్గా ప్రవహించదట.

సాధారణ వైద్యులు చాలామంది కైరోప్రాక్టిక్ చికిత్సని విశ్వసించరు. దానిని ఓ కల్ట్ ట్రీట్మెంటుగా భావిస్తారు. అయితే వారిలో, జనాల్లో ఈ విధానంపై నమ్మకం పెరుగుతూ వస్తోంది. మేము కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే ఇది కూడా ప్రయత్నించి చూద్దామని మా ఆవిడకి మొదలుపెట్టాము. చక్కటి ఫలితాలు రావడంతో నేను కూడా ఈ చికిత్స మొదలుపెట్టాను. ఒక నెల తరువాత సాధారణ సమీక్ష వుంటుంది. మూడు నెలల తరువాత మళ్ళీ ఎక్సురేలు తీసి పూర్తి స్థాయి సమీక్ష వుంటుంది. నా ఆరోగ్య భీమా ఈ ఖర్చుని పూర్తిగా భరిస్తుంది కాబట్టి ఆ సమస్య లేదు. అందువల్ల ఓ మూడు నెలలు ఈ విధానంలో వెళ్ళి చూడటం వల్ల నాకు నష్టం లేదు కదా. అయితే కైరోలో కూడా చాలా కొద్ది రిస్క్ వుంది కానీ ఆ మాత్రం రిస్క్ ఎక్కడయినా వుంటుంది.

ఆత్మకు, అంతరాత్మకు (మనం ఇష్టపడేవి, అనుకునేవి, మనస్సు సూచించేవి) సమన్వయం కుదరనప్పుడు ఆత్మ బలం అంతగా వుండదు అనుకుంటాను. ఆ సమన్వయానికి కృషి చెయ్యాలి. సమస్యలుంటే కారణాలు గుర్తించాలి. ఈలోగా విల్ పవర్ ని గ్రూమింగ్ చేస్తూనే వుండాలి. ఒక్కో చిన్ని చిన్ని విజయం విల్ పవర్ ని ఉత్సాహ పరుస్తూనే వుంటుంది. నేను విఫలమయిన వ్యక్తిని అని చెప్పడం లేదు కానీ గొప్ప విజయాలు ఏమీ సాధించలేదు. నాకు వున్న ఆరాటానికి, పరిజ్ఞానానికి  ఇంకా గొప్ప స్థానంలో వుండాలి. పట్టుదల వుందా అంటే వుంది కానీ ఎప్పుడూ జారడమూ, పైకి కొంత దూరం వెళ్ళడమే జరుగుతోంది కానీ పూర్తిగా పైకి వెళ్ళలేకపోతున్నాను. అది అందరూ సాధారణ విషయంగానే తీసుకుంటారు కావచ్చు. నేను అలా కాదు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేంతవరకూ కిందామీదా పడుతూనేవుంటాను. ఇందులో మెరుగుపడితే నాలో నాకు సమన్వయం ఎక్కువయ్యి విజయాల శాతం ఎక్కువవుతుంది. కాకపొతే ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి.

అవో ఇవో లోపాలు చాలామందిలో వుంటాయి. వారిలో చాలామంది గుర్తించరు. గుర్తించినా పరిష్కారానికి అంతగా ప్రయత్నించరు.  విజయాలు సాధించలేకపోవడానికి విల్పవర్ లేకపోవడమే కారణం అని చాలామంది అంటారు కానీ ఎంత ప్రయత్నించినా ఆ విల్ పవర్ మెరుగుపరచుకోలేకపోతే అది సాధించలేకపొవడానికి మూలకారణాలు అన్వేషించాలి. జలసూత్రం చంద్రశేఖర్ చెయ్యాల్సింది కూడా అదే. అసలు ఇలాంటి అసలయిన సందేహం అందరికీ రాదు. ఆత్మబలం కోసం కిందామీదా పడుతూనే వుంటారు కానీ దాని గురించి లోతుగా వెళ్ళరు. సమస్యంటూ గుర్తిస్తే సగం సమస్య తీరినట్టే. మిగతా సగం ఇక అది పరిష్కరించుకోవడమే. వారు సమస్యని గుర్తించారు పైగా సమస్యా పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు కాబట్టి అభినందనీయులు.

నాకు నచ్చిన ఓ టూకీగా టపా - 1

http://tukiga.blogspot.com/2011/07/blog-post_27.html

పై టపా చదివి నిన్న అక్కడ కామెంట్ వెద్దామని చాలా కష్టపడ్డా కానీ ఎందువల్లో నా సిస్టంలో కామెంట్లు వెయ్యాలంటే చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. నా బ్లాగులో అయితే ఓకే. ఇంకో బ్రవుజర్ డవున్లోడ్ చేసుకోవాలేమో కానీ అది తరువాత చూద్దాం. మొన్న భారారే బ్లాగులో కూడా కామెంటు వెయ్యాలని చాలా కష్టపడి లాభం లేక వదిలేసాను. అందువల్ల అయితేనేమీ, ఇంకాస్త విపులంగా చర్చిద్దామని అయితేనేమీ ఆ టపా గురించి ప్రత్యేకంగా ఓ టపా వేస్తున్నాను.

ఆ పోస్టులోని ఆలోచనలే నాలోనూ ఈమధ్య పరిభ్రమిస్తున్నాయి కాబట్టీ అందులోని విషయంతో ఐడెంటిఫై చేసుకోగలిగాను. అవును, మనం అనుకున్నవన్నీ సాధించలేము. అలా సాధించుకుంటూపోతే ఇంకేమన్నా వుందా సూపర్‌మ్యానులం అయిపోమూ. అందుకేనేమో ఏ అతి కొద్దిమందికో తప్ప అనుకున్నవన్నీ జరుగవు. అలా జరగకపొవడానికి ఎన్నో కారణాలు వుంటాయి కానీ మనం విల్ పవర్ గురించి మాత్రం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఏవయినా సాధించాలంటే ముఖ్యంగా మనలో ఆత్మబలం వుండాలి. అదొక్కటే కూడా సరిపోదనుకొండి దానితో పాటు అదనంగా ఇంకా చాలా వుండాలి కూడానూ కానీ మనం ఇప్పుడు ముఖ్యంగా దానిపైనే ఫోకస్ చేద్దాం. అప్పుడప్పుడు ఇలాంటివేమీ లేకుండానే ఎంచక్కా అవకాశాలు కలిసివచ్చి అనుకున్నవన్నీ జరిగిపోతుంటాయి. జీవితం అనే పేకాటలో కొందరికి కార్డులు అలా కలిసివస్తుంటాయి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లెక్కల సూత్రాల ప్రకారం అన్నీ కలిసివచ్చే కొందరి గురించి కాకుండా సాధారణమయిన వారి గురించి ఆలోచిద్దాం. 

ఆ టపాలో జలసూత్రం చంద్రశేఖర్ గారు చక్కని సందేహం వ్యక్తపరిచారు. వారి సందేహాన్ని ఎవరయినా పట్టించుకున్నవారు వున్నారా అని ఎవరయినా కామెంట్లు వెస్తారేమో అని చూసాను కానీ ఎవరూ అంత ఉత్సాహం చూపలేదు. ఎన్నోసార్లు ఇలాంటి మంచి టపాలు అలా మరుగునపడిపోతుంటాయి.

ఇంకా వుంది. అది మరో భాగంలో. ఈలోగా ఈ క్రింది వ్యాసం కూడా చదివెయ్యండి:

మంచి బ్లాగరంటే...?

- రాముడు బుద్ధిమంతుడయిన బ్లాగరు లాగా వుండాలి.
- గాంధీ గారి మూడు కోతుల్లాగా వుండాలి. చెడు బ్లాగులు వినవద్దు - చెడు బ్లాగులు చూడవద్దు - చెడు టపాలు వ్రాయవద్దు.
- బ్లాగు జనులందరూ సోదరసోదరీమణులు.

మరీ అలా కాదులెండి కానీ ఎలా వుంటే బావుంటుందో చూద్దాం. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కానీ ఎవరో ఎక్కడో వ్రాసిన శిలాశాసనాలు కానీ, మత ఫత్వాలు కానీ కావు కాబట్టి మీకు ఇష్టం వుంటే గైడ్‌లైన్స్ లాగా ఉపయోగించుకోండి. ఇక్కడ వ్రాస్తున్నది మంచి బ్లాగరంటే ఎలా వుండాలి అంతే కానీ మంచి బ్లాగు ఎలా వుండాలి అని కాదు. దాని గురించి మరో సారి చూద్దాం.

మనకు వయస్సులో ఎలాగయితే వివిధ దశలు ఎలా వుంటాయో బ్లాగు వయస్సులో కూడా అలాంటి దశలుంటాయనుకుంటాను. నేను బ్లాగులోకంలోకి ప్రవేశించినప్పుడు నాకు బ్లాగు గాడ్ ఫాదర్లు కానీ బ్లాగు అక్కలు కానీ ఎవరూ లేరు కాబట్టి తప్పటడుగులు వేస్తూ నా తిప్పలేవో నేను పడుతూ నిలదొక్కుకున్నాను. అలా బ్లాగు బాల్యం నుండి బ్లాగు కుర్రాడినయ్యాక ఆ పెంకితనం ఎక్కడికిపోతుందీ? సీనియర్ల పట్ల కాస్త దురుసుగా వుంటుండేవాడిని. వారూ అప్పట్లో తాము బ్లాగు పీఠాధ్యక్షులం అన్నట్లుగా కాస్త అతిశయంతో వుంటుండేవారనుకుంటా. కొంతమంది శ్రేయోభిలాషులు బ్లాగులమాటున నాకు మొట్టికాయలు వేసేవారు. అలా కొంత బుద్ధి తెచ్చుకున్నాను.

(బ్లాగు) కుర్రాళ్లం కదా ఆ సరదా తనం, చిలిపిదనం ఎక్కడికి పోతుందీ? ఇతరులతో కలిసి పలు బ్లాగుల్లో వ్యాఖ్యలు వేసీ, టపాలు వేసీ ఇతరులని ఆటపట్టించేవాడిని, సరదాగా ఏడిపించేవాడిని. అలా అప్పుడంతా కోలాహలంగా, హడావిడిగా వుండేది. అలా బ్లాగుల్లో కిష్కింధకాండ చేస్తూ సరదాగా రచ్చరచ్చ చేసేవారం. అలాంటి చిలిపిదనం ఒకోసారి వికటిస్తుండేది కూడనూ. ఉదాహరణకు ఒక లేడీ బ్లాగర్ వ్రాసిన టపా నచ్చక సరదాగా ఒక పోస్ట్ వేసాను. అది ఆమె సరదాగా తీసుకోకపోవడంతో ఆమె మనస్సు గాయపడింది. ఆమె మనస్సు మరీ అంత సున్నితం అని తెలియక టీజ్ చేసిన నేను ఆమెకి ఈమెయిల్లో సారీ చెప్పాను కానీ స్వీకరించలేదు. తాను థేంక్సులకు గానీ, సారీలకు కానీ అర్హురాలిని కాదని తెలియజేసింది! నాకేం అర్ధం కాక ఆ విషయం వదిలేసాను. ఏం వ్రాస్తే ఎవరు నొచ్చుకొని మళ్ళీ దానిమీద టపా వ్రాస్తారెమో అన్న భయంతో ఆమె ఇక బ్లాగు వ్రాయనని కూడా తెలియజేసింది.   ఆ మాత్రం సరదాతనం లేనివారు, మరీ అంత సున్నితమనస్కులు ఈలోకంలో మనజాలరని ఆ విషయాన్ని    తేలిగ్గా తీసుకున్నాను. అప్పుడప్పుడు ఒకటి రెండు భక్తి టపాలు మాత్రం ఆ బ్లాగు నుండి వెలువడుతూ వుంటాయి.

ఆ తరువాతా మేము టీజింగులు అనుకుంటున్నవల్లా క్రమంగా బుల్లీయింగులు అవుతుండటంతో అలా పద్ధతి కాదని అలాంటి ధోరణి నుండి నెమ్మదిగా వెనక్కి వచ్చేసాను. మరి బ్లాగుల్లో వయస్సు పెరుగుతున్నా కొద్దీ పరిపక్వత కూడా  పెరగాలి కదా. వయస్సు పెరిగినా పరిపక్వత పెరగని వారు అక్కడే వుండి ఇంకా ఆగడాలు చేస్తుంటారనుకోండి. అలా అలా బ్లాగుల్లో నేను నడివయస్సుకి వచ్చేసానేమో అనిపిస్తుంది.  అలా నేను చేసిన ఎన్నో చిన్నా, పెద్దా తప్పులూ, ఇతరులు చేస్తున్న పొరపాట్లూ మీరు చెయ్యకుండా ఈ జాగ్రత్తలు పనికివస్తాయి. అలా అని చెప్పి అస్తమానం నేను వ్రాసినవి నేను పాటిస్తుంటాను అనుకోకండి - అప్పుడప్పుడు మినయాయింపులు వుంటుంటాయి కదా.

ఇవి ఒక క్రమ పద్ధతిలో ఇవ్వడం లేదు. గుర్తుకువచ్చినవి, తోచినవి వ్రాస్తున్నాను. మీకు తోచినవి మీరూ చెప్పండి.

- మీకు నచ్చిన టపాల్ని ప్రశంసిస్తూ వుండండి. కనీసం మీ రియాక్షన్ అయినా తెలియజేయండి.
- మీకు నచ్చని టపాలని విమర్శించండి అంతే కానీ వెటకారం చెయ్యకండి. కనీసం రియాక్షన్సులో మీకు నచ్చలేదన్న విషయం తెలియజేయండి.
- సరదాగా టీజింగ్ తగిన పరిమితుల్లో చేస్తే సరదాగానే వుంటుంది కానీ అది వేధింపులు అవకుండా చూడండి
- సీనీయర్లము అన్న అహంభావంతో బ్లాగు పిల్లకాయలతో చెడుగుడు ఆడుకోకండి
- కుర్రాళ్లం అన్నటువంటి కొంటెదనంతో పెద్దల పట్ల దురుసుగా వ్యాఖ్యానించకండి
- మాటిమాటికీ ప్రతి ఒక్కరికీ శుభాకాక్షలు తెలియజేస్తూ కాపీ & పేస్టు టపాలు, వ్యాఖ్యలు వ్రాయకండి. పండగలు, పబ్బాలు  జరిగినప్పుడు అన్ని సంకలినులల్లో అంతా అవే చూసి చూసి చిరాకు వస్తుంటుంది. అవన్నీ వ్యక్తిగతంగా తెలియజేసుకుంటే బావుంటుంది. మీ బ్లాగు అగ్రిగేటర్లలో రాకపోతే మీరేం వ్రాసుకున్నా ఇతరులకు అంతగా ఇబ్బంది వుండదు.
- వ్యక్తిగతదాడులకు దిగకుండా బ్లాగర్ వ్రాసిన విషయం మీద విమర్శలుంటే హుందాగా తెలియజేయడం మంచింది.
- మీకు ఇతరులు వ్రాసిన టపాలు నిజ్జంగా నచ్చితేనే మెచ్చుకోండి. మొహమాటానికో, అలవాటుగానో, స్వామిభక్తి తోనో ఆహా ఓహో అనేసెయ్యకండి. 
- బ్లాగుల్లో ఎన్నో వివాదాలు కూడా జరుగుతూ వుంటాయి. అలాంటప్పుడు కనీసం మానవత్వం మంటగలుస్తున్నప్పుడన్నా ముందుకురండి. బ్లాగు పౌరులుగా మీ కనీస కర్తవ్యం నిర్వర్తించండి. అన్నీ నాకెందుకులే అనుకుంటే అదే సమస్య మీకు వచ్చినప్పుడూ తోడుగా ఎవరూ రాకపోవచ్చు. 
- బ్లాగుల్లో భావ స్వేఛ్ఛకి మద్దతు ఇవ్వండి. అలా అని చెప్పి బ్లాగుల్లో తీవ్రవాదమో లేక చేతబడుల్లాంటివో పెంచి పోషిస్తామంటే నిరసించండి.
- ఎవరికి వారు వారి అభిప్రాయాలను స్వేఛ్ఛగా తెలియజేసుకునే పరిస్థితికి దోహదపడండి.
- బ్లాగుల్లో వైవిధ్యం, కొత్తదనం వెల్లివిరియడాన్ని స్వాగతించండి, ప్రోత్సహించండి.
- బ్లాగులు ఎవరికి నచ్చినట్టుగా వారు వ్రాసుకోవడానికి కానీ మీకు నచ్చినట్లుగా ఇతరులు వ్రాయడానికి కాదని గుర్తించండి. మీకు నచ్చనివి ఇతరులు వ్రాస్తే మౌనంగా పక్కకి తొలగిపోవడమో లేదా హుందాగా మీ నిరసన తెలియజేయడమో చెయ్యవచ్చు. అంతేకానీ వేధింపులు, అవహేళనలు అవసరం లేదు అని గుర్తించండి.

ఇప్పటివరకూ గుర్తుకు వచ్చినవి ఇవీ. ఇంకా గుర్తుకువచ్చినవి దీని తరువాత జతచేస్తూనే వుంటాను. ఈలోగా మీరు అందిస్తూవుండండి.

ఫ్రికిన్‌బర్గ్ గారితో, ఇన్నయ్య గారితో నా ఫోటోలు

ఫోటోలు తీసినవారు జయదేవ్ గారు.నరిశెట్టి ఇన్నయ్య గారిని, యార్లగడ్డ (LP) గారిని కలిసాను

ఇన్నయ్య గారి గురించి ఎన్నాళ్ళ నుండో వింటూ వున్నా కలవడం మాత్రం ఇదే తొలిసారి. నా చిన్నప్పుడు మా నాన్నగారి నోటవెంట వీరి పేరు తరచుగా వింటూవుండేవాడిని. వీరి ఉపాన్యాసాలకు మా నాన్నగారు వెళుతూవుండేవారు. కొద్దిరోజుల క్రితం వీరి ఆ నాటి గుంటూరు జిల్లా అనే అనువాద పుస్తకం అవిష్కరణ చికాగోలో జరిగింది. అందుకోసం ఆ పుస్తకం యొక్క మూల రచయిత ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ ఫ్రికన్‌బర్గ్ కూడా వచ్చారు. మృదువుగా, ఆప్యాయంగా సంభాషించే ఇన్నయ్య గారితో మాట్లాడుతూ మా నాన్న గారి స్మృతులు వారితో కలిసి నెమరువేసుకున్నాను.

ఫ్రికన్‌బర్గ్ గారితో కూడా సంభాషించాను. మాది సూర్యాపేట అని తెలియజేయగానే తాను అక్కడికి వచ్చాననీ తెలుగులో చెప్పి, నల్లగొండ జిల్లాలో ఏఏ ప్రాంతాలు, పట్టణాలు తిరిగారో వివరించుకువచ్చారు. వారి నోటి నోటి వెంట తెలుగు వినడం అబ్బురంగా అనిపించింది. వారు ఊటీలో పుట్టి గుంటూరు జిల్లాలో పెరిగారు. వారి యొక్క తండ్రి క్రైస్తవ మత ప్రచారకులుగా వుండేవారు.

ద్రౌపది నవల రచయితగా సాహిత్య ఆకాడమీ అవార్డ్ గ్రహీత మరియు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారితో కూడా అదే సందర్బంలో క్లుప్తంగా సంభాషించాను. వారి ద్రౌపది పుస్తకం చదివాననీ, నచ్చిందనీ, నా బ్లాగులో కూడా వ్రాసాననీ చెప్పాను. వెంటనే నా బ్లాగు పేరు అడిగారు. విజిటింగ్ కార్డ్ ఇచ్చాను. వారి విజిటింగ్ కార్డ్ కూడా తీసి ఇచ్చారు. మీరూ ఓ బ్లాగ్ మొదలెట్టొచ్చుగా అని అడిగాను. ఎక్కడండీ, మా (రాజకీయ నాయకుల) సంగతి తెలిసిందేగా. అంత తీరికవుండదండీ అని చిరునవ్వుతో చెప్పారు. 

ఇక ఆ సందర్భానికి పంచ సహస్ర అవధాని మేడసాని మోహన్ గారు కూడా వచ్చారు కానీ వారు ఎందుకో నాకు అంతగా నచ్చలేదు. వారిలో అహమూ, అతిశయమూ కనిపించాయి కాబట్టి వారి జోలికి వెళ్ళలేదు.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ట్రై స్టేట్ తెలుగు సంఘం వారి పిక్నిక్కులో భాగంగా జరిగింది. మా కుటుంబంతో సహా వెళ్ళాను. ఇన్నయ్య గారు వాషింగ్టనులో వుంటారంటే అమ్మలు అచ్చెరువొందింది. అవును ఒబామా వీరి పొరుగువారే అని నవ్వుతూ నేను అంటే ఇన్నయ్య గారు నవ్వారు. వారు ప్రసిద్ధ రచయిత అంటే తనకీ రచయిత్రి కావాలని వుంది అని అంది. ఇన్నయ్య గారు తనని ప్రోత్సహించారు.

చక్కని ఆహ్లాదకరమయిన వాతావరణంలో, ప్రియా రెస్టారెంటు వారి చక్కని తెలుగు భోజనం ఆరగిస్తూ అందరితో కబుర్లు చెప్పుకుంటూ  ఆ కార్యక్రమాన్ని ముగించాము.

కామెంట్లెయ్యడం కష్టమే సుమీ

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం)

వ్యాఖ్యానించడం అన్నది అన్ని సందర్భాల్లోనూ అంత సులభమేమీ కాదని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. బ్లాగులని మనం తీసుకున్నంత సీరీయస్సుగా అందరూ తీసుకుంటారని అనుకోవద్దు. ఆషామాషీగా అలా వచ్చేసి ఇలా ఓ చూపు చూసేసి వెళ్ళిపోయేవారుంటారు. వారిని ఆగండి కామెంటెయ్యండి అంటే దులిపించుకొని వెళ్ళిపోతారు. మీరు మరీ మొహమాటపెట్టేస్తే మన వైపు రాను కూడా రారు. ఇంతోటి టపాని చదవడమే ఎక్కువ ఇంకా కామెంటా, చాల్చేల్లేవయ్యా అని అనుకుంటారు కూడానూ. అంచేతా అలాంటి తీరికలేని మహా బ్యుజీ వ్యక్తులను దృష్టిలో వుంచుకొని మనమే కొన్ని ఏర్పాట్లు చేసి వుంచాలి మరి. ఓపిక వున్నా, తీరిక వున్నా కామెంటేసే మూడూ వుండాలి కదా. మరి ఆ మూడింటిలో ఏ ఒక్కటి ఎదుటివారికి లేకున్నా మనకు ఓ కామెంట్ పడదు కదా. మరి ఎలా? ఎదుటి వారి భావం తెలిసేది ఎలా?

అందుకే వున్నాయి రియాక్షన్స్. ప్రతి టపా క్రింద వచ్చేలా కొన్ని స్పందనలను మనం నిర్వచించవచ్చును. ఉదాహరణకు నా బ్లాగులో ప్రతి టపా క్రింద చాలా బావుంది, బావుంది, బాగోలేదు అనే గడిలు (చెక్ బాక్సులు) వుంటాయి. సులభంగా టపా మీద  అభిప్రాయం చెప్పాలనుకునేవారు ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. బ్లాగు సెట్టింగ్సులోకి వెళ్ళి టపా సెట్టంగ్సులో అలాంటి రియాక్షన్స్ నిర్వచించాల్సివుంటుంది. వీటివల్ల చదువరుల అభిప్రాయం మీకు సులభంగా చేరుతుంది. అటు వారికీ సులభంగా వుంటుంది. కష్టపడి కామెంటు వెయ్యనవసరం లేకుండా ఈజీగా ఇలా స్పందించేస్తారు. 

అయితే ఇందువల్ల స్థూలంగా చదువరి యొక్క అభిప్రాయం తెలుస్తుంది కానీ వివరంగా తెలియదు. అందువల్ల ఇలా రియాక్షన్స్ పెట్టామని అలా కామెంట్లు మూసుకోకూడదు. రెండూ ఉపయోగకరమే. వివిధ కారణాల వల్ల కామెంట్ల మీద చిరాకు ఎత్తేసి కొందరు బ్లాగర్లు కామెంట్లు మూసివేస్తారు. అలాంటప్పుడు కనీసం ఇలాంటి రియాక్షన్స్ అయినా వుంటే చదివిన వారి అభిప్రాయం అర్ధం అవుతుంది. 

అలా అని చెప్పి అందరూ సరిగ్గా తమ అభిప్రాయం వ్యక్తపరుస్తారనీ అనుకోలేము. ఎవరికయినా మీమీద కోపం వుందనుకోండి - మీ టపా బావున్నా బాగోలేకపోయినా బావోలేదనే స్పందిస్తారు. అలాగే మీ బ్లాగుకో లేక మీకో వీరాభిమానులు వుంటేనో లేక మీకు చాలా దగ్గరివారో అయితే టపా బాగాలేకున్నా సూపర్ అని స్పందించొచ్చు. ఈ స్పందనలు పరిశీలిస్తూ వుంటే అప్పుడప్పుడు మీకు జుట్టు పీక్కోవాలని కూడా అనిపిస్తుండొచ్చు. మనం వీర లెవల్లో వ్రాసామని, అందరికీ నచ్చుతాయని అనుకున్న టపాలకి చాలామంది చెత్తగా వుంది అనవచ్చు. లేదా మనం చెత్తగా వచ్చింది అనుకున్న టపా చాలామందికి నచ్చవచ్చు. అయితే కొన్ని సార్లు ఎన్నో కారణాల వల్ల ఎక్కువమందికి నచ్చని ఆంశం వ్రాస్తున్నప్పుడు వారి స్పందన ఎలా వుంటుందో ముందే ఐడియా వుంటుంది కాబట్టి అలాంటప్పుడు ఎక్కువమంది నచ్చలేదు అని అన్నా పట్టించుకోనక్కరలేదు. అయితే చక్కని ఆంశం తీసుకొని వ్రాస్తున్నప్పుడు, అందరికీ నచ్చే ఆంశమే అనుకున్నప్పుడు కూడా మీ టపా ఎక్కువమందికి నచ్చకపోతే ఆ టపాలో లోపం ఎక్కడ వుందో వెతుక్కోవడం మంచింది.

అయితే మనం వ్రాసిన టపా గురించి సులభంగా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం కలిగించినా కూడా చాలామంది అది పట్టించుకోరు. టపా చదివాక కనీస బాధ్యతగా కష్టపడి కామెంటు వెయ్యకపోయినా కూడా మీ కనీస స్పందన తెలియజేస్తే బావుంటుంది. పాఠకుల అభిప్రాయం ఎలా వుందో తెలిస్తే రచయిత అందుకు తగ్గ విధంగా తన రచనలు సాగించడానికి, తమను తాము సవరించుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి వీలవుతుంది. తాము వ్రాసింది ఇతరులకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చట్లేదో అర్ధం అవుతుంది. అందువల్ల ఇహనుండి మనం ఇతరుల స్పందనలను ఆశించడంతో పాటుగా ఇతరుల బ్లాగులు చూసినప్పుడు తప్పకుండా స్పందిద్దాం. అలా ఎంత ఎక్కువమంది అభిప్రాయం వ్యక్తపరిస్తే బ్లాగరుకి అంత ఉత్సాహంగా వుంటుంది. నెగటివ్ కామెంట్ల కంటే కూడానూ పాఠకుల నిశ్శబ్దమే రచయితను ఎక్కువగా నిరాశకి గురిచేస్తుంది అనేది గుర్తుకువుంచుకొని ఇహ మీదటయినా వీలయినంతవరకూ స్పందిద్దాం. బ్లాగావరణంలో అది మన కనీస బాధ్యత అని గుర్తిద్దాం.

వ్యాఖ్యానందం

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం)

మొత్తమ్మీద మీరు ఓ బ్లాగు ప్రారంభించారు. ఓ టపా వ్రాసేసారు. ఇప్పుడు మీ ఆదుర్దా మీ బ్లాగుకి వచ్చే హిట్స్ మీదానూ, వ్యాఖ్యల మీదనూ వుంటుండొచ్చు. హిట్స్ గురించి ఇదివరకే ప్రస్థావన వచ్చింది కాబట్టి ఇప్పుడు వ్యాఖ్యల గురించి చూద్దాం. మీరేదో శానా గొప్పగా వ్రాసేసినంత మాత్రాన మీకు ఇబ్బడిముబ్బడిగా వ్యాఖ్యలు వస్తాయనుకుంటే అది భ్రమ. ఎలాగయితే చాలా చక్కని చిత్రం తీసిన దర్శకుడు తన చిత్రం ఎందుకు హిట్టవలేదా    అని తల పట్టుకు కూర్చున్నట్టువంటి పరిస్థితి రావచ్చు. అంచేతా మంచి టపాకీ, బోలెడన్ని వ్యాఖ్యలకీ ఎప్పుడూ సంబంధం వుంటుందని అనుకోవద్దు.

మీరు కొన్ని బ్లాగుల్లోనయినా కామెంట్లు వేసివుంటే కామెంట్లు వెయ్యడం మరీ అంత సులభం కాదని మీకు అర్ధమయ్యివుండాలి. వ్యాఖ్య వెయ్యడానికి మీకు ముందుగా ఓపికా, తీరికా, మూడ్ వుండాలి. అవన్నీ కుదిరి మీరు కామెంటు చేద్దామంటే అపై ఎన్నో సాంకేతిక సమస్యలు రావచ్చు. ఒక్క కామెంటు వెయ్యడానికి ఎన్నో పేజీలు దాటుకుంటూ వెళ్ళాల్సి రావచ్చు. కొందరు కామెంట్లకి వర్డ్ వెరిఫికేషన్ పెడతారు. అంటే ఆ కామెంట్ పబ్లిష్ చెయ్యాలంటే అక్కడ వున్న కొన్ని పదాలను టైప్ చెయ్యాల్సి వుంటుంది. ఆ అక్షరాలు ఎవరికీ అర్ధం కాని రీతిలో కలగలిపి మన ఫ్యామిలీ డాక్టర్ గారి వ్రాతలా వుంటాయి. అవి అర్ధం చేసుకొని టైప్ చేసీ, సరిగ్గా వుంటే  అప్పుడు ఒక్కోసారి పబ్లిష్ చేసేముందు మన కామెంటు మనం చూసుకొనే అవకాశం వుంటుంది.   అన్నీ సవ్యంగా జరిగితేనే ఇన్ని కష్టాలు పడాలి. ఇబ్బంది వుంటే ఇంకొన్ని పేజీలు వస్తాయి. అలా కొన్ని కామెంట్లు వెయ్యలేక కొన్ని సార్లు నేను అలా మధ్యలో వదిలేస్తుంటాను.  అందుచేత మీ బ్లాగులో కామెంట్లు వేసేవారికి కొన్ని ఇబ్బందులు అయినా తగ్గించేందుకై మీ బ్లాగ్  సెట్టింగ్స్ లోకి వెళ్ళి కామెంటు సెక్షనులో వున్న వర్డ్ వెరిఫికేషన్ సెట్టింగ్ ఆఫ్ చెయ్యండి.

అలా ఇన్ని కష్టాలేం పడతాములే బాసూ అని కొందరు కామెంట్లు వెయ్యరనుకుంటా. కామెంట్లు వెయ్యాలంటే ముందు మీ బ్లాగు అందరూ చదవాలి కదా. అందుకై మీ బ్లాగు ముందు కళ్ళకు ఇంపుగా వుండాలి. బ్లాగు ఎలా వుంటే బావుంటుందో మరో భాగంలో వ్రాస్తాను. మీరు వ్రాసేది కొంతమందికయినా నచ్చాలి. అలా నచ్చిన వారు కామెంట్లు వేసే అవకాశం వుంటుంది. అందరికీ నచ్చే లేదా చాలామంది ఐడెంటిఫై చేసుకునే ఆంశలు వ్రాస్తే కామెంట్లు ఎక్కువ పడతాయి. వివాదాస్పద ఆంశాలు వ్రాసినా కామెంట్లు ఎక్కువగా రావచ్చు కానీ అందులో మిమ్మల్ని  తిట్టెవే ఎక్కువ రావచ్చు లేదా వ్యాఖ్యాతలు ఒకరునొకరు తిట్టుకుంటున్నవి అవచ్చు. మంచిగా వ్రాసినంత   మాత్రాన ఎక్కువగా కామెంట్లు వస్తాయని చెప్పలేము   కాబట్టి మీరు మీ బ్లాగు ఎక్కువ హిట్స్ కోసం వ్రాస్తున్నారా, ఎక్కువ కామెంట్ల కోసం వ్రాస్తున్నారా లేక మీ సంతృప్తి కోసం వ్రాస్తున్నారా అనే తేల్చుకుంటే అందుకు తగ్గట్టుగా మీరు వ్రాయవచ్చు.

మీ ఆత్మ సంతృప్తి కోసం బ్లాగు వ్రాసుకుంటున్నప్పుడు మీ బ్లాగుని ఎంతమంది చూసారు, ఎంతమంది కామెంట్లు వేసారు పట్టించుకోనక్కరలేదు. కామెంట్ల కోసం వ్రాస్తున్నట్టయితే దానికి కొన్ని కళలుండాలి. మీలో చక్కగా వ్రాసే కళతో పాటుగా ఇంకో ఉప కళలు వుండాలి. మీ అంతట మీరు మీ బ్లాగు వ్రాసుకుంటూ  పోతే ఇతరులు కూడా మిమ్మల్ని పట్టించుకోవడం తక్కువవుతుంది కాబట్టి మీరు కూడా ఇతరుల బ్లాగుకి వెళ్ళి హలో చెప్పిరావాలి. అప్పుడు వాళ్ళు కూడా మీ బ్లాగుకి వచ్చి హాయ్ చెబుతారు. చర్చలు, వివాదాల్లో మీరు చురుగ్గా పాల్గొంటుంటే  మీ పేరు, బ్లాగు అందరికీ సుపరిచితం అయిపొతుంది. అప్పుడప్పుడు మీకు నచ్చిన బ్లాగుకి వెళ్ళి గోకాలి. అప్పుడు వాళ్ళు వచ్చి మీ బ్లాగు  గోకుతారు. అలా రెండు బ్లాగులకూ ఆనందం లభిస్తుంది. అలా అలా కామెంట్లు రాలాలంటే ఎన్నో చిట్కాలు వున్నాయి. ఇతర బ్లాగులని పరిశీలిస్తుంటే అవన్నీ మీకు అర్ధమయిపోతుంటాయి.

కామెంట్లు ఎక్కువ రావాలంటే బ్లాగు గ్రూపుల్లో వుండాలి. మీరే ఓ గ్రూపు మెయింటెయిన్ చేస్తే మరీ మంచిది. చచ్చినట్టు మీ అనుచరగణం మీరు టపాలు వ్రాసినప్పుడల్లా మీ బ్లాగులో వ్యాఖ్యలు వ్రాసి భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఇక్కడ ఒక గ్రూపు వారు మరో గ్రూపులో కామెంట్లు వెయ్యరు. ఒహవేళ పొరపాటుగా వేసాడో చచ్చాడన్నమాటే. అందుచేత ఒకవేళ మరీ మరో గ్రూపు బ్లాగులో కామెంట్లు వెయ్యాలనుకున్నా అజ్ఞాతంగా వేస్తారు. పొరపాటున విశాల భావాలతో మతి  చలించి గ్రూపుదేముంది, వ్రాత ముఖ్యం కనీ అనేసుకొని టపా బావుంటే కామెంటు వ్రాసేద్దామని కొందరు అనుకున్నా పక్కనున్న వాళ్ళు వాడి బ్లాగులో నువ్వు కామెంటు చెయ్యడం ఏంటన్నా అని కంగాళీ చేస్తారు. దాంతో మీ విశాల భావాలు మీరు కొండెక్కిస్తారు.

మనం ఎంత ఎక్కువ హిట్స్ కోసం, కామెంట్ల కోసం ఆరాట పడితే అప్పుడు మన వ్రాతల్లో కూడా రాజీ పడాల్సిన అవసరం రావచ్చు. ఏం వ్రాస్తే ఎవరి మనస్సుకి నొప్పి కలుగుతుందో, ఇటు వైపు రాకుండా వుంటారేమో, వ్యాఖ్యలు వెయ్యరేమో అని కంగారు పడాల్సి వుంటుంది. అలా కాకుండా చూసేవారు చూస్తారు, నేను వ్రాసే విధంగా వ్రాస్తాను అనుకున్నప్పుడు మీలో సంతృప్తి పెరుగుతుంది. అలా అని మరీ కొద్దిమంది చదివినా, మరీ కొద్ది కామెంట్లే వచ్చినా మనకు రాయాలన్న ఆసక్తి రాకపోవచ్చు. మీరు సమర్ధవంతంగా వ్రాస్తూ వైవిధ్యమయిన ఆంశాలు ఎన్నుకుంటున్నప్పుడు మీ గుర్తింపు మీకే వస్తుంది.

అయితే మీరు ఎంత బాగా వ్రాసినా, మీ బ్లాగు ఎంత బాగున్నా కొన్ని టపాలు వ్రాయగానే వ్యాఖ్యలు వెల్లువలా రావు. మీరు తరచుగా వ్రాస్తుంటేనే మీ బ్లాగు అందరి దృష్టిలోకి వస్తుంది. చదువరులు నెమ్మదిగా మీ బ్లాగుకి అలవాటు పడి వ్యాఖ్యానించడం ప్రారంభిస్తుంటారు. అందుచేత బ్లాగుల్లో రాణించాలంటే మీకు కాస్తయినా ఓపిక వుండాలి. రెండు మూడు టపాలు వేసి ఎవరూ స్పందించడం లేదనుకొని నిరాశపడి బ్లాగుని మూసుకొని కూర్చోకూడదు.

ఇప్పుడు నీ చుట్టూ వున్న ప్రపంచం చూడు

మొన్న శనివారం మా పొరుగువారితో కలిసి (టెంట్) క్యాంపింగుకి వెళ్ళాం. మేము స్విమ్మింగ్ చేస్తుంటే ఓ పిల్లల తండ్రి కూడా తన పిల్లలతో సరదాగా నీళ్ళల్లో అల్లరి వేషాలు వేస్తుంటే నవ్వుకున్నాం. ఆ సాయంత్రం మేము పిల్లలని ఆడుకోవడానికి పంపించి మేము చతుర్ముఖ పారాయణం చేస్తూపోయాము. అప్పుడు పిల్లలు అకస్మాత్తుగా వెనుతిరిగి వచ్చేయడం కనిపించింది. ఆ వెనుకే ఆ తండ్రీ, ఆ పిల్లలూ మా పిల్లలని అనుసరించడం, వచ్చి ఏదో వారితో సీరియస్సుగా చర్చించి మళ్ళీ ఆటస్థలానికి తోడ్కొని పోవడం దూరం నుండి మేమందరం గమనిస్తూనే వున్నాం కానీ విషయం ఏంటో అర్ధం కాలేదు. మా పొరుగింటి రెండేళ్ళ అబ్బాయిని అతగాడు స్లైడ్స్ మీద ఆడించడం మాత్రం కనిపిస్తోంది.

కొద్దిసేపయ్యాక ఆట డ్రాప్ చేసి అటువైపు వెళ్ళాను. మా పిల్లలని ఆడిస్తున్న అతగాడికి ధన్యవాదాలు చెప్పాను. ఇంతకుముందు మా (నైబర్స్) రెండేళ్ళ అబ్బాయి రివర్సులో స్లైడు మీద నుండి జారి భయపడ్డాడని అందుకే వెనక్కి పిలిచి మళ్ళీ ధైర్యం నూరిపోస్తున్నా అని చెప్పాడు. అలాంటి భయం మదిలో నిలబడితే మళ్ళీ స్లైడ్స్ అంటే భయపడతాడని, తాను ఉపాధ్యాయుడిని కాబట్టి మళ్ళీ ధైర్యం నేర్పిస్తున్నాననీ చెప్పేడు. ఫిజికల్ ఎజుకేషన్ టీచర్ ఏమో అనుకొని మరో సారి కృతజ్ఞతలు చెప్పి సాగిపోయాను. 

ఆ తరువాత మళ్ళీ ఆట స్థలానికి వెళ్ళినప్పుడు ఓ ఎత్తయిన డోం మీద వారి పిల్లలు కూర్చొని ఆనందిస్తున్నారు   కానీ మా చిన్నమ్మాయి అమ్మలు మాత్రం అది ఎక్కడానికి సందేహిస్తోంది. ఎందుకు నీకు ఎత్తు అంటే భయమా అని అడిగాడతను. అవును అంది. ఏం ఫరవాలేదు, నేను వున్నాను   అని బాగా ప్రోత్సహించి ఆ డోం ఎలా ఎక్కాలో నేర్పించాడు. అమ్మలు పైకి వెళ్ళాక అక్కడ నిలబడమని చెప్పాడు. అప్పుడు "ఇప్పుడు నువ్వు క్రిందికి చూడకుండా నీ చుట్టూ వున్న ప్రపంచాన్ని చూడు" అని తనకి చెప్పాడు. అమ్మలు చూస్తూపోయింది. ఎలా వుంది అని అడిగాడు. చుట్టూ పరికిస్తూ బ్యూటిఫుల్ అని సంతోషంగా చెప్పింది. అతని పిల్లలు అమ్మలుని అలాగే వుంచి మాటల్లో పెట్టేసారు. అమ్మలు అలా ఎత్తున నిలబడి వున్న సంగతే మరచిపోయింది. అలా అప్పటివరకయినా హైట్ ఫోబియా అధిగమించింది. అప్పుడు అతనికి బహుళ ధన్యవాదాలు చెబుతూ తన పేరు, తన పనీ కనుక్కున్నాను. ఆండ్రూ అట తన పేరు. స్పెషల్ నీడ్స్ వారియొక్క టీచర్ అట. పిల్లలకి ఎలా ధైర్యం నూరిపోయాలో నాకు వివరించాడు.

అమ్మలుకి ఎస్కలేటర్స్ అన్నా భయమే. పైకి వెళ్ళేప్పుడు వెళుతుంది కానీ క్రిందికి దిగేటప్పుడు భయపడుతూవుంటుంది. ఎంత ప్రోత్సహించినా, ధైర్యం చెప్పినా ససేమిరా వద్దంటూ లిఫ్టులు వెతుక్కుంటుంది. అందు గురించి ఏమి చెయ్యాలా అని అనుకుంటూవుంటాను. మరి ఇహనైనా ధైర్యం పెరిగిందా అనేది చూడాలి. అప్పటికీ లాభం లేకపోతే సైకాలజిస్ట్ సహకారం అయినా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇదివరలో ఎస్కలేటర్లు బాగానే ఉపయోగించేది కానీ ఒక ఏడాది నుండే భయపడుతోంది. తను అలా భయపడటానికి ఎలాంటి సంఘటణ కారణం కాదు కానీ అలా ఎత్తునుండి దిగిరావడం తనకు వణుకు పుట్టిస్తుంది. క్రిందికి చూడకుండా పైకి మాత్రమే చూస్తూ రావాల్సిందిగా మళ్ళీ చెప్పి చూస్తాను.

మీ పిల్లలకీ ఇలాంటి భయం వుండేదా? అప్పుడు మీరు ఏం చేసారు? ఆ భయం ఎలా తొలగింది?

బ్లాగాక్షరాభ్యాసం

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం)

మీరు చిన్నప్పుడే ఓనమాలు దిద్దేసేమనుకొని బ్లాగుల్లో సరాసరి తెలుగును ఇంగ్లీషులో వ్రాసేస్తే అది తెంగ్లిష్ అయిపోయి చదువరులకు చికాకు తెప్పిస్తుంది. అందుచేత అలా ఆవేశంగా ఆంగ్లంలో వ్రాయకుండా కాస్త నిదానించండి. తెలుగు లిపిలో వ్రాయడానికి కొన్ని తేలికయిన మార్గాలు వున్నాయి. మీరు ఎకాఎకి బ్లాగులు వ్రాయకుండా ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యలు చేస్తూ మీ తెలుగు ప్రాక్టీసు చేసుకోవడం మంచి పద్ధతి. అలా వివిధ బ్లాగుల పరిచయమూ కలుగుతుంది - మీ వ్రాతా మెరుగుపడుతుంది.
 
మీరు ఈ పుస్తకం చదవకుండానే నాలుగు టపాలు వ్రాసిన సీనీయర్ బ్లాగర్లెవరన్నా పరిచయం వుంటే వారు మీకు బ్లాగుల గురించి చెప్పి వాటికోసం తెలుగు ఎలా వ్రాయాలో నేర్పించి బ్లాగాభ్యాసంతో పాటు ఈ అక్షరాభ్యాసమూ చేసివుండేవారు. ఇప్పుడేమో ఆ బాధ్యత నాకే పడింది. సరే. అటులనే కానిండు. పలక తీసుకొనిరండు. నిజంగానే పలకా బలపం పట్టుకువచ్చేరు! అలా పని కాదుగానీ మీ కంప్యూటర్ పట్రండి. మీకు ఇంటర్నెట్టు బ్రవుజ్ చెయ్యడం తెలుసు కదా. కొంపదీసి అది కూడ నన్నే నేర్పించమనరు కదా. నా వల్ల ఇప్పుడు కాదండీ బాబూ. అందుగ్గానూ ఇంకో గురువు గారిని చూసుకోండి.

ఇంటర్నెట్టు కనెక్షన్ వుంది కదా.  ఇంటర్నెట్టు బ్రవుజరులో http://lekhini.org/ సైటు పేరు టైపు చెయ్యండి. ఇదిగో మీ పలక వచ్చేసిందండోయ్. మరి బలపం అని మరీ అంత అమాయకంగా అడక్కండి. మీ జోకులూ మీరూనూ. ఇందులో కుడివైపున అక్షరమాల వుంది చూసారూ. మీరు ఏ ఇంగ్లీషు అక్షరం నొక్కితే ఏ తెలుగు పదం వస్తుందో అది తెలియజేస్తుంది. మీరు పై పెట్టె (బాక్సు) లో ఆ ఇంగ్లీషు అక్షరాలు వ్రాస్తుంటే క్రింద పెట్టెలో తెలుగు లిపిలో మీరు వ్రాసింది వస్తుంది. ఉదాహరణకు nenu అని వ్రాసి చూడండి. నెను అని వస్తుంది. అది తప్పు పదం కదా. నేను అని రావాలంటే చిన్న e కాకుండా పెద్ద E వుండాలి. nEnu. అలా అలా ప్రాక్టీసు చెయ్యండి. ఇలా వ్రాస్తున్నప్పుడు తెలుగులో ఘోరమయిన తప్పులు కనపడుతుండవచ్చు. ఖంగారుపడకండి. అది సహజం. మీరు తప్పు వ్రాసినప్పుడల్లా మీ నెత్తిమీద మొట్టికాయలు వెయ్యడానికి నేను దగ్గర్లో ఏమీ లేను కాబట్టి ఫర్వాలేదు. కానిచ్చెయ్యండి.  మీరు కనుక మీ సిస్టం Caps Lock బటన్ కనుక ఆన్ చేసి వున్నట్లయితే మీరు వ్రాసేది తెలుగా లేక తమిళమా అన్న అనుమానం మీకే వస్తుంది. అలాంటి సందేహం వచ్చినప్పుడు తెలుగు వ్రాస్తుంటే ఏ అరవమో వస్తోందని లేఖిని నిర్వాహకుల మీద హడావిడిగా చిరాకు పడకుండా తమాయించుకొని అది ఆన్ అయి వుందేమో ఒకసారి చూసుకోండి.

అసలు మీరు ఎంత ప్రయత్నించినా కింది బాక్సులో తెలుగే రాకపోతే ఆ సైటులో పై భాగాన వున్నUnable to see Telugu properly? లింక్ నొక్కండి. మీ కంప్యూటరులో ఆ సమస్యలు ఏమయినా వున్నాయేమో చూడండి.

మీరు ఇప్పుడు కొన్ని వాక్యాలు సరిగా వ్రాసారు. బావుంది. మీరు తొలిసారిగా ఇంటర్నెట్టులో తెలుగు వ్రాయడం నేర్చుకున్నారు. అభినందనలు. ఇక విజృంభించండి. పేరాలు వ్రాయండి. ఆ తరువాత మీ ప్రేయసికో, మీ భార్యకో ఓ చిన్న ప్రేమలేఖ వ్రాద్దురూ. సరదాగా వుంటుంది. అంత దృశ్యం లేదా? అయితే వద్దులెండి. మీ నాన్నారికో లేకపోతే మీ చిన్నారికో ఓ లేఖ వ్రాయండి. అది ఎలా వచ్చిందో చూసుకొని మురిసిపొండి. ఇంకేం ఇహ ఎంచక్కా బ్లాగుల్లో మీరు తెలుగు దడదడలాడించెయ్యొచ్చు. అంటే మీరు ఇక్కడ వ్రాయగానే ఠకీమని బ్లాగుల్లో పడిపోద్దని నా ఉద్దేశ్యం కాదు. మీరు ఇలా తెలుగు టైపు చేసాక అలా ఆ తెలుగు టెక్ష్టుని కాపీ చేసి మీకు కావాల్సిన దగ్గర పేస్టు చెయ్యండి. అలా అని చెప్పి మీరు మీ ప్రియురాలికి వ్రాయమన్న ప్రేమలేఖ తీసి వ్యాఖ్యల్లోనో బ్లాగుల్లోనో పెట్టుకునేరు. అవి మీ వ్యక్తిగతం కదా. కాపీ & పేస్టు ఎలా చెయ్యాలని కూడా నన్ను అడక్కండి మహాప్రభో. అంత ఓపికగా చెప్పే తీరిక నాకు లేదు.
             .
అయితే ఇప్పుడు మీకు ఓ సందేహం రావచ్చు. ఎప్పుడూ ఇలా కాపీ, పేస్టు చేసుకునే శ్రమ తప్పదా అని. మీరు ఇలా టైప్ చేస్తుంటే అలా తెలుగులో మీకు కావాల్సిన దగ్గర పడే సాఫ్టువేరులూ వున్నాయి. అవి మీ కంప్యూటరులోకి ముందు ఎక్కించాలి. వాటితో చిన్నచిన్న సమస్యలూ వుంటాయి. అవన్నీ ఇప్పుడెందుకు గానీ ముందు ఇది వాడి చూడండి. అలాంటి అడ్వాసుడు పలకలు ఎలా వాడాలో ముందు ముందు తెలుసుకోవచ్చులెండి. అక్షరాభ్యాసం నాడే అంత ఆరాటం ఎందుకూ.  వివిధ రకాలుగా తెలుగు ఎలా వ్రాయవచ్చో ఈ పుస్తకం చివరన ఒక అనుబంధంగా ఇస్తాను. అప్పుడు అవన్నీ తెలుసుకుందురుగానీ. అందాక ఇక్కడే ప్రాక్టీసు చెయ్యండి. 

ఈ లేఖిని ఉపకరణాన్ని ఎవరు కనిపెట్టారు అని మీకు సందేహం రావచ్చు. దీని సృష్టికర్త వీవెన్ (వీర వెంకట చౌదరి) గారు. వీరే ప్రసిద్ధ తెలుగు బ్లాగుల సంకలిని (అగ్రిగేటర్) కూడలి సృష్టికర్త కూడా. మిగతా ఉపకరణాలు ఎన్ని వున్నా కూడా నాకు లేఖినినే తేలిగ్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఇదే వాడుతుంటాను. మా నాన్న గారు కూడా ఇదే వాడుతుండేవారు. వుడ్‌వర్డ్స్ గ్రైప్ వాటర్ ప్రకటనలాగా అలా అన్నాను కానీ మా నాన్నగారు ఇది వాడలేదు లెండి. ఈ సందర్భంలో వీవెన్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. చెప్పండి మరీ.

బ్లాగాక్షరాలతో మీకు అక్షరాభ్యాసం అయిపోయింది కదా. ఇహ అసలు విషయనికి వచ్చేద్దాం. దక్షిణ ఏదీ? నా దక్షిణ ఏదీ? మరిచేపోయారు చూసారూ. మరిచిపోతారు - నాకు తెలుసు. ఎంతమందిని చూడలేదూ. నా గురుదక్షిణ నాకు ఇవ్వండి. భయపడకండి. నేను అమూల్యమయినవే అడిగేస్తాను. మీరు తెలుగు బ్లాగోస్ఫియరుకి వచ్చాక నా బ్లాగూ మీకు కనపడుతుంటుంది కదా. రోజూ రెండు కామెంట్లు అయినా నా బ్లాగులో వేస్తానని నాకు హామీ ఇవ్వండి మరి. అప్పుడు మీ తెలుగులో అక్షరదోషాలు వుంటే మళ్ళీ ప్రతి వ్యాఖ్యలు చేస్తూ మీకు మొట్టికాయలు వేస్తాను.  అలా అని చెప్పేసి నా బ్లాగులో అక్షరదోషాలు లెక్కెట్టకండి. ఆశువుగా వ్రాస్తుంటా కదా - దొర్లుతూనేవుంటాయి మరి. అక్షరదోషాలు లేకుండా వ్రాయడానికి నేనేమీ ఆబ్రకదబ్రను కాదులెండి. ఆయన ఓ ప్రసిద్ధ బ్లాగరు. మీరు బ్లాగుల్లోకి వచ్చాక అందరూ తెలుస్తుంటారు లెండి. ముఖ్యంగా ఒకరు :))

కష్టాల్...నష్టాల్...

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం)

బ్లాగుల వల్ల కొన్ని కష్టాలు, నష్టాలూ, ఇబ్బందులూ వున్నాయండోయ్. ఇవి తెలుసుకొని మీరు ఆగిపోవాలని కాదు కానీ కాస్త ఆ ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని అవి తక్కువ వుండేలా చూసుకుంటే బెటరూ.

సమయం
చాలా సమయం తినేస్తుంది. ముఖ్యంగా కొత్తవారికి తెలుగులో టైపాట్ల వల్ల సమయం తినేస్తుంది. అందువల్ల చాలామంది ఉత్సాహంగా మొదలెడతారు కానీ అదే ఉత్సాహంతో బ్లాగులను కొనసాగించలేరు. అందువల్లే చాలామంది అడపాదడపా ఓపిక, తీరిక తెచ్చుకొని అప్పూడప్పుడూ ఒకటీ అరా టపాలు అలా జనాల మీదికి వదిలేస్తుంటారు.
 
అసంతృప్తి
ఉత్సాహంగా బ్లాగావరణంలోకి విచ్చేసిన వారు ఇక్కడంత మరీ మంచి వాతావరణం లేదని ముక్కు మూసుకోవాలనుకోవచ్చు. వాస్తవ పరిస్థితులు అర్ధమయ్యి వెగటుపుట్టవచ్చు. సంస్థనాధీశుల్లాంటి బ్లాగాధీశుల  చిత్తానికి తగ్గట్టుగా మీ వ్రాతలు లేకపోతే వేధింపులు ఎదురవ్వచ్చు. బ్లాగుల్లో కుల కాట్లాటలూ, మత యుద్ధాలు, భావ పోరాటాలూ చూసి మీ మనస్సుకి కష్టం కలగవచ్చు. హాయిగా వుండక ఇందులోకి ఎందుకు వచ్చి పడ్డామని మీలో అశాంతి చెలరేగవచ్చు. బ్లాగుల్లో మీరు అనుకున్నంత భావ స్వేఛ్ఛ లేదని మీకు అనిపించవచ్చు.
 
దుష్ప్రభావం:
మీరు తిరోగమన వాదులయితే సమాజంపై మీరు దుష్ప్రభావం చూపించవచ్చు. లేదా చెడు బ్లాగర్ల, బ్లాగుల ప్రభావం మీమీద పడవచ్చు.

ముఠాలు:
ఇక్కడ మీకు మిత్రులేమో గానీ మీకు తగ్గ గ్రూపులు దొరకవచ్చు. వారితో కలిసి ఇతరులను ఎంచక్కా వేధించవచ్చు.

విరక్తి
మీరు వ్రాసిన దానిని ఎద్దేవా చేస్తూ లేదా పరిహసిస్తూ వ్యాఖ్యలు వస్తే మీ భావాల మీద లేదా వ్రాతల మీద నమ్మకం సడలవచ్చు.

వ్యర్ధం
మీ వ్రాతలు మీకు గానీ, సంఘానికి గానీ ఏమాత్రం వుపయోగపడని కాలక్షేపం బఠానీలు అవచ్చు. అలాంటి కాలక్షేపం కబుర్ల వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం వుంటుంది లెండి కానీ అస్తమానం అవే వ్రాస్తూపోతే మీ సమయం మరియు ఇతరుల సమయం వ్యర్ధం అవచ్చు.

వ్యసనం
బ్లాగుడు మీకు వ్యసనంలా తయారవచ్చు. కొద్దిమంది నిద్ర ఆహారాలు మాని మరీ బ్లాగులు వ్రాయడమో, వ్యాఖ్యలు వ్రాయడమో చేస్తుంటారు. వారిని చూస్తుంటే విస్మయం కలుగుతుంది. వీరికిక వేరే లోకం అంటూ వుండదా అనిపిస్తుంది. ఇంతగా ఇందులో తలమునకలవుతూ వీరు సాధిస్తున్నది ఏంటా అని అనుమానం వస్తుంది. అలాంటప్పుడు మీరు మీ కుంటుంబానికో లేదా కెరీరుకో ఇవ్వాల్సిన సమయాన్ని ఇక్కడ గడిపివేసే అవకాశం వుంది. కొంతమంది అస్తమానం బ్లాగులు చూస్తూ, కామెంట్లు వేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి కాలక్షేపం ఇంట్లో టివిల ముందు కూర్చొని సీరియళ్ళు చూస్తూ చేసినా, బజ్జుల్లో చేసినా, ఇక్కడ చేసినా పెద్దగా తేడా ఏమీ వుండదు. కేవలం టైంపాస్ చెయ్యాలనుకునేవారు ఎక్కడయినా చేస్తారు. మీరు బ్లాగుల్లోకి కేవలం కాలక్షేపానికి వచ్చారా లేదా ఏదయినా ప్రయోజనం కోసం వచ్చారా అన్నది నిర్ణయించుకోండి.

ప్రతి దాంట్లో ఎంతో కొంత రిస్కు వున్నట్లే బ్లాగింగులో కూడా పైన చెప్పిన చిన్న చిన్న రిస్కులు వున్నాయి. అవన్నీ గమనించుకుంటూ వాటిని మీరు దారిలో ముళ్ళకంపను ఏరిపారేసుకుంటూ ఎలా వెళతారో అదేవిధంగా అడ్డంకులు, అవాంతరాలు, నిరోధాలు తొలగించుకుంటూ వెళుతూనేవుండాలి. అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. అలాంటి దుష్ఫలితాలను తగ్గించుకోవడం ఎలాగో, చక్కటి బ్లాగింగ్ చెయ్యడం  ఎలాగో కూడా ముందు ముందు వివరిస్తాను.

బ్లాగుడు వల్ల లాభాలేంటి?

(తెలుగులో బ్లాగింగ్ పుస్తకం కోసం వ్యాసం)

కాళిదాసు కవిత్వం కొంత, నా చాదస్తం కొంత అన్నట్లుగా నెట్టులో సేకరించీ కొంతా, నా అభిప్రాయాలు కొంతా కలిపి కొన్ని వ్రాస్తుంటాను. ఆ కోవలోనిదే ఇదీనూ.

సంతృప్తి
ఇదో ఆనందం. మన అభిప్రాయాలు, భావాలు వినడానికి మరి కొందరు వున్నారన్న సంతృప్తి. ఇంట్లో వారికి మొగలి రేకులు లాంటి సీరియళ్ళు చూడటానికే సమయం సరిపోవడం లేదు ఇక మన సోది వినడానికి ఎవరికి సమయం వుంటుంది? అలాంటిది బ్లాగుల్లో పడేస్తే ఎవరన్నా చదవకమానరు. చదివినవారు ఒకరిద్దరన్నా స్పందించకమానరు. నత్తి భాషలో చెప్పుకోవాలంటే బ్లాగులు వ్రాయడం ఓ తుత్తి.
 
ప్రభావం
మీకు గొప్ప ఆలోచనలు, భావాలు వుంటే సమాజం మీద మీ రచనల ద్వారా మీయొక్క ప్రభావం చూపవచ్చు. పలు రకాల సమస్యలకి మీరు పరిష్కారం సూచించవచ్చును. పలు విధాలయిన కొత్త భావాలను అందరితో పంచుకోవచ్చు. లోకంలో వెలుగుచూడని సమస్యలను, కష్టాలను మీరు వెలుగులోకి తీసుకురావచ్చు. అందరితో కలిసి వాటికి పరిష్కారం ఆలోచించవచ్చు. అలా సంఘానికి, సమాజానికి ఇతోధికంగా మీవంతు సేవ చేసిన వారు అవుతారు.
 
ఆదాయం
ఇంగ్లీషు తదితర భాషల్లోని బ్లాగుల్లో ప్రకటనల ద్వారా, పెయిడ్ బ్లాగింగ్ ద్వారా, బ్లాగు పోస్టులు పుస్తకంగా వెలువరించడం ద్వారా కొందరు సంపాదించగలుగుతున్నారు కానీ తెలుగు బ్లాగులకు ఇంకా అంత దృశ్యం లేదు.

మిత్రులు
కొంతమంది కొత్త మిత్రులని అయినా సంపాదించుకోవచ్చు. అందులో కొంతమంది బ్లాగుల్లోనే స్నేహితులుగా వుండిపోతారు లేదా ఆన్లయిన్ స్నేహితులుగా వుండిపోతారు. మరికొంత మంది ఆఫ్ లైన్ స్నేహితులుగా అవచ్చు. మీ అభిప్రాయాలకు, భావాలకు దగ్గరగా వున్నవారు లేదా పరస్పరం వ్యక్తిత్వం నచ్చిన వారు మిత్రులుగా మిగిలిపోవచ్చు.

వ్రాత
మీ వ్రాతను, శైలిని, శిల్పాన్ని మెరుగుపరచుకోవచ్చు. మీరు పుస్తకాలు వ్రాసే ముందు మీ రచనలు బ్లాగుల్లో ప్రయోగించి పరీక్షించుకోవచ్చు. బలయిపోతే చదివిన వారు బలయిపోతారు. మీకు ఫర్వా నహీ. సహృదయులు మీ రచనా శైలిని గురించి కూడా సూచనలు, సలహాలు ఇస్తుంటారు కాబట్టి మీ శైలిని మెరుగుపరుచుకోవచ్చు. మీరు వ్రాసే ధోరణి నచ్చని వారు నిక్కచ్చిగా చెప్పే అవకాశాలు కూడా వుంటాయి కాబట్టి పునరాలోచించుకోవచ్చు.

పఠనం
మీరు మీ సొల్లు కబుర్లు కాకుండా ఏదయినా మంచి విషయం వ్రాయాలంటే దాని గురించి కొద్దోగొప్పో పరిశోధన చెయ్యాలి కదా, అదీ ఇదీ చదవాలి కదా. అలా మీలో పఠనం పెరుగుతుంది. తద్వారా మీకు కొత్త విషయాలు తెలిసి మీ జ్ఞానం పెరుగుతుంది.

వ్యాపకం
ఏడుపుగొట్టు సీరియళ్ళూ, కోడలి కష్టాల్లాంటి చాంతాళ్ళూ అస్తమానం చూస్తూ తరించిపోకుండా, వృధా కాలక్షేపాలు చేసెయ్యకుండా  బ్లాగింగ్ చెయ్యడాన్ని చక్కటి వ్యాపకంగా మలచుకోవచ్చు. ఇతరులు వ్రాసిన దానిని, చేసిన దానిని మీరు ఎక్కువమందిలా చదవకుండా, చూడకుండా మీరే ఏదయినా మీ తీరిక సమయంలో వ్రాస్తే ఇతరులు చదువుతారు. పాసివ్ గా చూసేవారు, చదివేవారు నూటికి ఎనభై శాతం మంది వుంటారు. అలా కాకుండా మిగతా 20% ఏక్టివ్ మందితో కలుస్తూ మీరే ఏదయినా వ్రాస్తూ సంఘం నుండి పొందడమే కాకుండా సమాజానికి అందించవచ్చును.
 
హాబీ
మీరు బ్లాగింగును చక్కని హాబీగా మలచుకోవచ్చు. హాబీల వల్ల ఒనగూడే ప్రయోజనాలు మీకు తెలిసినవే కదా.
 
వెలుగు
మీ అంతట మీరు వుండిపోకుండా మీరు ఇలా కొంతమందికయినా తెలిసే అవకాశం ఏర్పడుతుంది.  మీలో మంచి రచనా చాతుర్యం వుంటే మీరు త్వరలోనే బ్లాగులోకంలో ప్రసిద్ధులయిపోవచ్చు. బ్లాగులనే బావిలో కప్పలాంటి ప్రపంచంలో సెలబ్రిటీలు అయ్యామనుకోవచ్చు.  మీలో మంచి రచనా శైలి వుందో లేదో బ్లాగుల్లో పరీక్షించి చూసుకోవచ్చు. అలా ఎందరో మట్టిలో మాణిక్యాలు బ్లాగుల్లో వెలుగులోకి వచ్చారు. వీరితో పోలిస్తే చాలమంది ప్రసిద్ధ రచయితలు దిగదుడుపే అనిపిస్తుంది. అలా మీమీద మీకు నమ్మకం ఏర్పడ్డాక పుస్తకాలు పబ్లిష్ చేసి చూసుకోవచ్చు. అక్కడా విజయం లభిస్తే ఇంకా మీకు గుర్తింపు లభిస్తుంది.
 
సహాయం
బ్లాగుల ద్వారా మీరు ఎదుర్కొన్న కష్టనష్టాలు ప్రస్థావిస్తూ, అవి మీరు పరిష్కరించుకొన్న వైనాల్ని తెలియపరుస్తూ ఇతరులకు మీ అనుభవం ఉపయోగపడేలా చెయ్యవచ్చు. మీ బ్లాగుల ద్వారా ఇతరులకు మీకు నిపుణత వున్న రంగంలో లేదా మీకు తెలిసిన విషయాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ వారికి ఉపయోగపడవచ్చు. అలాగే మీ సమస్యలకు, సందేహాలకు సూచనలు, సందేహాలు పొందవచ్చును. బ్లాగోస్ఫియరులో ఎంతో మంది శ్రేయోభిలాషులూ వుంటారు. వారు తమ పేరుతోనో లేక అజ్ఞాతంగానో మీకు ఎంతో విలువైన మార్గ దర్శకత్వం చెయ్యగలరు. అలా ఎన్నో సందర్బాల్లో నేను వారి సలహాల వల్ల లాభపడ్డాను. అలాగే నా అనుభవసారాన్నీ వీలయినతవరకు నా బ్లాగుల్లో పంచుతూవుంటాను.
 
అవకాశాలు
మీ ప్రతిభ నలుగురికీ తెలియడం వల్ల, కొత్త మిత్రుల వల్ల మీరు ఆశించిన రంగంలో కొత్త అవకాశాలు రావచ్చు. లేదా మీలో సరికొత్త ఆలొచనలు పురివిప్పవచ్చు. మిగతా బ్లాగ్మిత్రుల సహాయ సహకారాలతో కొత్త పనులు చేపడుతుండవచ్చు. నలుగురితో కలిసి నాలుగు మంచిపనులు నెత్తిన వేసుకోవడానికి మీకు ఉత్సాహం రావచ్చు.
 
వృత్తి
మీరు మీ వృత్తి పరమయిన ఆంశాలతో బ్లాగింగ్ చేస్తున్నట్లయితే మీ ప్రతిభా పాటవాలు అవసరమయిన వారికి తెలిసి మీకు కొత్త అవకాశాలు ఇవ్వడానికి వారు ముందుకు రావచ్చు.
 
ఇలా బ్లాగుడు వల్ల ఎన్నో లాభాలున్నాయి. అలా అలా బ్లాగుడు దంచుతూ దంచుతూ మీరు బ్లాగుడుకాయా అయిపోవచ్చు. అయితే బ్లాగింగు వల్ల కొన్ని కష్టనష్టాలూ లేకపోలేదు. అవి మరోసారి చెప్పుకుందాం. బ్లాగింగ్ వల్ల ఇంకా ఏం ముఖ్యమయిన లాభాలుండవచ్చో మీకు తెలిసినవి ఏమయినా వుంటే ఇక్కడ సెలవివ్వండి.

పలు రకాల బ్లాగర్ల పాత్రలు - చిన్న పాత్రధారులు, జూనియర్ ఆర్టిస్టులూ, అభిమానులు

(తెలుగులో బ్లాగింగు పుస్తకం కోసం)


చిన్న పాత్ర ధారులు: వీరి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ వుండదు కాబట్టి చిన్నగానే చెప్పుకుందాం. వీరు అప్పుడప్పుడు తళుక్కున మెరిసిపోతుంటారు. వీరు కష్టపడి కొన్ని పోస్టులు వ్రాసి మళ్ళీ పత్తా లేకుండా పొతుంటారు. మళ్ళీ మూడ్ వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ ఒకటో రెండో టపాలు జనాల మీదికి విదిలించి వెళుతుంటారు. ఇంకొందరయితే అత్యాశకు పోతారేమో కానీ డజన్ల కొద్దీ బ్లాగులు అయితే తెరుస్తారు కానీ వ్రాసేది మాత్రం వాటిల్లో ఒకటో, రెండో పోస్టులు వుంటాయి. వీరు తరచుగా వ్రాస్తూపోరు కాబట్టి వీరు తెలుగు బ్లాగావరణంపై చూపే ప్రభావం పెద్దగా వుండదు.

జూనియర్ మరియు ఎక్ష్ట్రా ఆర్టిస్టులు: వీళ్ళు హీరో వెనకాలో లేక విలన్ల వెనకాలో కష్టకష్టంగా కనపడుతుంటారు. లేకపొటే అక్కడక్కడా పాసింగులోనో, గుంపులో గోవిందయ్యలుగానో కనపడుతుంటారు. వీళ్లకి ఒక ఐడెంటిటీ వుండదు.  వారికి ఆవేశం వచ్చినప్పుడు బ్లాగు మొదలుపెట్టి ఒకటి రెండు పోస్టులు వ్రాసి మూసుకుంటారు. కొంతమంది అలా ఓ టపా వ్రాసి ఇలా మాయమయిపోతుంటారు. వీళ్ళు వ్రాసేది కూడా ఒకటీ లేదా రెండూ పేరాలుంటాయంతే.  వాళ్ళకి ఆ మాత్రం వ్రాయడమే ఎక్కువెక్కువ అనుకుంటారల్లేవుంది. వీళ్లంతా కూడా ఇంకా తరచుగా వ్రాస్తుంటే బావుంటుంది. వీళ్ళకి రెండు మూడు టపాలు వ్రాయగానే బ్లాగు వైరాగ్యం టపటపా మీదపడిపోతుందేమో తెలియదు కానీ ఇలా వచ్చి అలా అదృశ్యం అయిపొతుంటారు. మీరు మరీ  అలా అంతర్ధానం అయిపోకుండా చూసుకోండి. వీలయినంతవరకు వ్రాస్తూనే వుండండి. 

అభిమానులు: సినిమాలన్నాక ఫ్యాన్స్ గురించి చెప్పుకోకుండా వదిలేస్తే బావుండదు కదా. మిగతా బ్లాగర్లు కానీ లేదా బ్లాగులు వ్రాయకుండా కేవలం బ్లాగులు చదివేవారు కానీ బ్లాగాభిమానులుగా వుండొచ్చు. మీరు ఎకాఎకి బ్లాగు మొదలెట్టెయ్యకుండా బ్లాగు అగ్రిగేటర్లలో పలు బ్లాగులు చూస్తూ మీకు నచ్చిన కొన్నింటిని అభిమానిస్తూ వాటి పోస్టులకు కామెంట్ల ద్వారా స్పందిస్తూ కొంతకాలం గడపండి. అందువల్ల బ్లాగావరణంపై మీకు ఓ ఐడియా వస్తుంది.

మీరు బ్లాగు మొదలెట్టాక మీకూ బ్లాగాభిమానులు తయారవచ్చు. అబిమానించేవారుండటం ఎవరికయినా సరే ఆనందాన్ని ఇస్తుంది కదా. సంతోషం. అయితే ఇక్కడో ఇబ్బంది వుంది. ఈ అబిమానజనం వల్ల మీకో ఇమేజ్ వుందని అర్ధమవుతుంది. ఆ ఇమేజ్ ఏంటనేది కూడా అర్ధమవుతుంది. ఆ తరువాత ఆ ఇమేజ్ నుండి దూరం అవడం మీకు కష్టం అవుతుంది. అలా అలా మీ ఇమేజ్ చట్రంలో మీరే కూరుకుపోయే అగత్యం ఏర్పడుతుంది. మీ ఇమేజికి భిన్నంగా వ్రాస్తే మా అభిమానులు ఒప్పుకోకపోవచ్చు. అంచేత ఇమేజ్ చట్రంలో కొరుకుపోకుండా జాగ్రత్ర వహించండి. అయితే కామెంట్లు వ్రాసే వారందరూ మీ అభిమానులని అనుకోకండి. ఎగస్పార్టీ అభిమనులూ మీ బ్లాగులో వ్యాఖ్యలు వ్రాస్తారు. ఎలా వ్రాస్తారనేది మీరు ఊహించుకోవచ్చు. అప్పుడు మీకు బ్లాగు వైరాగ్యం కలిగితే తప్పు మీది కాదు.

అభిమానులకోసం వ్రాస్తూ వెళుతున్నారనుకోండి - మీరు వ్రాయదలుచుకున్నది మీరు వ్రాయలేరు. మీ అభిమానుల మనోభావాలు ఇబ్బంది పడిపోతాయని వర్రీ అవుతారు. ఎప్పుడయితే మన భావాల గురించి కాకుండా ఇతరుల భావాలను దృష్టిలో పెట్టుకొని వ్రాయడం మొదలవుతుందో అప్పటి నుండి మీ బ్లాగు కల్తీ అవడం మొదలయినట్లేనని గ్రహించండి. అందుచేత అభిమానుల హద్దుల్లో మీరు వుండకుండా మీ హద్దుల్లో మీరు వుండండి. అలాగే మీకు నచ్చే బ్లాగులకి మీరూ చక్కని అభిమానులయిపొండి.

ప్రతి ఒక్క బ్లాగరు పైన నేను చెప్పిన వర్గీకరణల్లోకి వస్తారని అనుకోలేము. కొందరు రెండు మూడు రకాల పాత్రలు పోషించగలరు. కొందరు అపరిచిత బ్లాగర్లు వుంటారు. ఒక పాత్రకి తెలియకకుండా మరి కొన్ని పాత్రలని అవలీలగా పొషించగలరు. మరికొందరు కాలక్రమేణా పాత్రలు మారుస్తుంటారు. మరికొందరు బహిరంగంగా మర్యాదా పురుషోత్తం రాం లాగా వుండవచ్చు కానీ అజ్ఞాతంగా మీమీద ఎన్నయినా ఛండాలమయిన వ్యాఖ్యలు చేయవచ్చు.

సరే, బ్లాగు సినిమాలోని పాత్రలు కొన్ని చూసారు కదా. మరి మీ పాత్ర ఏంటో, దాని స్వభావం ఏంటో నిర్ణయించుకోండిక. మీరు విలన్ పాత్రలు పోషించదలుకుంటే అక్కడే ఆగిపొండి. ఇక్కడ చాలామందిమి వున్నాం. మళ్ళీ మీరు అవసరం లేదు.

బ్లాగులోకంలోకి ప్రసవ వేదన

(తెలుగులో బ్లాగింగు పుస్తకం కోసం)

ఓక్కే. మీరు బ్లాగు ప్రారంభించదలుచున్నారు. ఆ తరువాత? టెక్నికల్ ప్రాబ్లెంస్ పక్కన పెట్టేసి ఎమోషనల్ ప్రాబ్లెంస్ చూద్దాం. మీకు పెర్ఫార్మెన్స్ ఏంగ్జయిటీ మొదలవ్వచ్చు. ఎలా వ్రాస్తాను? ఎవడన్నా చదువుతాడా చదవడా? రోజుకి ఎన్ని కిలోల హిట్స్ వస్తాయి? సరే, మన బ్లాగు కాబట్టి మన వ్రాతల మీద మనకు నమ్మకం ఎలాగూ వుంటుంది కానీ మన బ్లాగులోకి వచ్చేదెవరు, చదివేదెవరు అనే సందేహం మిమ్మల్ని పీక్కు తింటుండవచ్చు.

ఆ ఆందోళన మీకు తీరాలంటే ముందు మీరొక విషయం తేల్చుకోవాలి. మీరు వ్రాసేది ప్రధానంగా మీకోసమా లేక ఇతరుల కోసమా? అంటే మీ ఆత్మసంతృప్తి కోసమా లేక ఇతరుల మెప్పుకోసమా? మీ కోసం అయితే భేషుగ్గా మొదలెట్టండి. ఇతరుల మెప్పు కోసం అనుకుంటే వేరే మాధ్యమం చూసుకోవడం మంచిది. ఈ బ్లాగులోకం చిత్రమయినది. ఆడదాని మనస్సెంత గాఢమయినదో బ్లాగర్ల మనస్సూ అంతే. ఏ టపా హిట్టవుతుందో, ఏ టపా ఫట్టవుతుందో అన్ని సార్లూ ఊహించలేం. ఎంతో గొప్పగా వచ్చిన టపా తుస్సుమంటుంది. ఆషామషీగా వ్రాసిన టపాలు కొన్ని మాత్రం అందలం ఎక్కుతాయి. ఎవరు పాపులర్ అవుతారో, ఎవరు కారో, ఎప్పుడు జనాదరణ పొందుతారో ఊహించడం కష్టం. మీకు వచ్చే హిట్లూ, కామెంట్లూ లెక్కట్టుకుంటూ గొంతుక్కూర్చోవాలనుకుంటే మాత్రం మీకు తొందర్లోనే నిరాశ ఎదురవ్వచ్చు.

అందుచేత ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ముందు మీ సంతృప్తి కోసం బ్లాగు మొదలుపెట్టండి. ప్రజాదరణ పొందిందా మంచిదే - అది బోనస్సు లాంటిది. బోనస్సు రాలేదా ఫర్వాలేదు - అసలు ఆదాయం - మీ సంతృప్తి - ఎక్కడికీ పోదు. కొన్నికొన్ని బ్లాగు జీవితాలు అంతే - ఎంత గొప్పగా వ్రాసినా గుర్తింపు లభించదు. బ్లాగుల్లో గుర్తింపు రావడానికి అర్హత చక్కగా వ్రాయడం ఒక్కటే కాదనీ, ఇంకొన్ని కళలుండాలనీ మీకు కొద్ది వారాల్లోనే అర్ధమవుతుంది లెండి. అవేంటో మరో భాగంలో చెప్పుకుందామేం. అసలు మంచి బ్లాగులు అంటూ వుండవనీ వుండేవి మంచి టపాలేనని కొంతమంది బ్లాగు పెద్దలు ప్రస్థావిస్తుంటారు - నేను ఏకీభవిస్తుంటాను.

అందుచేత మరీ ఎక్కువగా ఆలోచించెయ్యకుండా మీ బ్లాగులో చించెయ్యండంతే. మీలో విషయం వుంటే ఇవాళే కాకపోయినా రేపయినా జనాలు చదువుతారు. మీరు ఓ టపా వెయ్యగానే, ఎంట్రీ ఇచ్చెయ్యగానే  జోష్ సినిమాలోలాగా అన్నయ్యొచ్చిండూ, మా అన్నయ్యొచ్చిండో అని పాటపాడుతూ అందరూ ఆహ్వానాలు పలుకుతారని అనుకోకండి. బ్లాగర్లు తక్కువగా వున్న కాలంలో అలాంటి స్వాగత సత్కారాలు విధిగా కొత్త బ్లాగర్లకి అందుతుండేవి కానీ ఇప్పుడు బ్లాగర్లు ఎక్కువయ్యారు కాబట్టి అంత దృశ్యం కనపడటం లేదు. అలా అని నిరాశ పడకండి. మీ బ్లాగు బ్లాగుంటే మీ దృశ్యం మీకు వస్తుంది. అప్పుడు చూపిద్దురు కానీ మీ బొమ్మ. మీ బ్లాగు ఏమాత్రం గొప్పగా వున్నా గుర్తించి, మెచ్చుకొని, చేయూత నిస్తూ సహాయ సహకారాలు అందించే సహృదయులు ఎంతో మంది వున్నారు. మీ వ్రాతలు కానీ, మీ బ్లాగు కానీ ఆసక్తి కరంగా లేకపోవడానికి ఎన్నో కారణాలు వుండవచ్చు. మీ బ్లాగుని కానీ, టపాలను కానీ ఆసక్తికరంగా ఎలా మలచవచ్చో మరో సారి చర్చిద్దాం.

మీకు ఇంకో సందేహం వస్తుండొచ్చు. ఏం వ్రాయాలా అని. ఏం వ్రాస్తే ఎవరి మనస్సుని నొప్పిస్తామో అని మీలో ఖంగారు మొదలవ్వచ్చు. ఇతరులు ఏమనుకుంటారో అన్నది ఎక్కువగా ఆలోచించకుండా ముందు మీరేమనుకుంటున్నారో అన్న దానికి ప్రాముఖ్యం ఇవ్వండి. జీవితాల్లో కానీ, బ్లాగుల్లో కానీ ఎవరికి నచ్చినట్టుగా వారుండకపోవడానికి, ఎవరికి నచ్చినట్లుగా వారు వ్రాయకపొవడానికి మన గురించి మనం ప్రాధాన్యం ఇచ్చుకోకుండా, ఇతరుల మనోభావాలకి ప్రాధాన్యం ఇస్తుండటం ప్రధాన కారణం.

బ్లాగుల్లో బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం అన్నీ ఆలోచించి వ్రాయడం అవసరం. ఎవడేమనుకుంటే నాకేంటి, డోంట్ కేర్ అనుకుంటే మీకు నచ్చినవన్నీ వ్రాసుకోవచ్చు. అందువల్ల కొన్ని రిస్కులు వుంటాయి. అవి ఎదుర్కొనే ధైర్యం వుండాలి. ట్రయల్ అండ్ ఎర్రర్ విధానం పాటిస్తూ నెమ్మదినెమ్మదిగా బ్లాగు వ్రాస్తూ వస్తున్న స్పందనను బట్టి మీకు నచ్చిన విధంగా మీరు ముందడుగు వేస్తుండవచ్చు. ముందు మామూలుగా మొదలుపెట్టి ఆ తరువాత మీ విశ్వరూపం చూపించవచ్చు.

బయటి వృత్తుల్లో ఉదాహరణకి రచయితలు గానో, కవులుగానో లేక జర్నలిస్టులు గానో బాగా రాణించినంత మాత్రాన, అక్కడ తీస్‌మార్ ఖానులయినంత మాత్రాన ఇక్కడ కూడా అదే రేంజిలో విజయం సాధించగలమని భ్రమపడవద్దు. అక్కడ మనం వ్రాసేది ఎడిటరుకి నచ్చడం ముఖ్యం - ఇక్కడ అలా కాదు - చాలామందికి నచ్చాల్సి వుంటుంది.  అందుకే ఒక్కొక్కప్పుడు తేడాలు వస్తాయి.

అన్ని విధాలుగా ఆలోచిస్తూపోతే ఎటూ ముందడుగు వెయ్యలేం. కూడలిలో అలా నిలబడిపోతాం. అందుకే కొద్దిగా ఆలోచించి ముందడుగు వెయ్యండి. ఈ రోజే ఓ టపా వ్రాసి పడెయ్యండి. ఎవరు చదవరో చూద్దాం. ఎందుకు చదవరో చూద్దాం. అలా అలా వ్రాస్తూ పోతూ మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి. అన్నీ పక్కాగా ఆలోంచించి పూర్తి ప్రణాళికా బద్ధంగా వెళ్ళాలనుకుంటే మీరు పరెఫెక్షనిస్టులవుతారు కానీ ఏమీ ప్రారంభించలేరు. ఒక్క బ్లాగు కూడా మొదలెట్టలేరు. అలాక్కాదు కానీ మీరు మీ బ్లాగు మొదలెట్టేసెయ్యండంతే - ఓ టపా అయినా విదిలించెయ్యండంతే.

పలురకాల బ్లాగర్ల పాత్రలు - క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు

(తెలుగులో బ్లాగింగ్ అనే పుస్తకం కోసం వ్రాస్తున్న వ్యాసం)

క్యారెక్టర్ ఆర్టిస్టులు: కథకి క్యారెక్టర్ వున్నవారు కూడా ముఖ్యం కదా. వీరు రాముడు మంచి బాలుడు లాంటివారు. బుద్ధిగా తమ పనేంటో చూసుకుంటూ, తమకు నచ్చినవి వ్రాసుకుంటారు. ఎక్కడా విమర్శలూ, ఎకసెక్కాలూ ఎదురవకుండా జాగ్రత్తగా అందరికీ నచ్చే ఆంశాలే వ్రాతల్లోకి ఎన్నుకుంటారు. ఉదాహరణకి షోలే సినిమా గురించి లేదా అమితాబ్ గురించి వ్రాస్తారు. ఆ సినిమా అన్నా, ఆ హీరో అన్నా అందరికీ ఇష్టమే వుంటుంది కనుక అందరూ వారితో ఏకీభవిస్తూ స్పందిస్తారు. అమ్మలక్కలయితే ఆ రోజు ఇంట్లో చేసిన ఇడ్లీ గురించో, దోశ గురించో నోరు ఊరిస్తూ టపా వేస్తారు. మనకందరికీ నోరూరిపొతుంది కదా. సహజంగానే స్పందిస్తాం. వీరికి సాధారణంగా మాంఛి విశ్లేషణా శక్తి వుంటుంది. అందరికీ నచ్చిన లేదా నచ్చే విషయాలపై సరళంగా అనలైజ్ చేసి ప్రజల ముందు వుంచుతారు. వీరి రచనలు ఆబాలగోపాలానికి నచ్చుతాయి కాబట్టి వీరి టపాలకి చాలా స్పందనలు వుంటాయి. అందరితో మంచి బ్లాగర్ అనిపించుకోవాలని వీరిలో వుంటుంది. 

వీరిలో కొంతమంది గుమ్మడి టైప్ వారు అయివుంటారు. ఖళ్, ఖళ్ అని ఆయాసంతో రొప్పుతూ జూనియర్ బ్లాగర్లకి హితబోధలు చేస్తుంటారు. సాధారణంగా సీనియర్లు అయివుంటారు కనుక కాస్త చాదస్తం వుంటూ వుంటుంది. పాత తరమే గొప్పదనీ, పాత బ్లాగులే గొప్పవనీ భావిస్తుంటారు. కొన్నేళ్ళ క్రితం బ్లాగావరణం ఎంత బావుండేదో అని తరచుగా వాపోతుంటారు. మార్పుని స్వీకరించలేక, కొత్తని ప్రోత్సహించలేక వున్న వాతావరణాన్ని విశ్లేషిస్తూ కాలం వెళ్ళబుచ్చుతారు. అయితే వీరిలో ఎనలిటికల్ స్కిల్స్ బావుంటాయి కాబట్టి మనకు తెలిసిన విషయాలలోనే కొత్త కోణాలు చూపిస్తారు. వారి అనుభవం, పరిశీలన నుండి ఇతరులు ఎంతో నేర్చుకోవడానికి అవకాశం వుంటుంది.

వీరికి రిస్క్ తీసుకోవడం ఇష్టం వుండదు మరియు సాహస గుణం తక్కువ కాబట్టి వీరి రచనల్లో కొత్తవాటిని కానీ, కొత్తదనాన్ని గానీ ఆశించలేం. బ్లాగుల్లో అగ్నిగుండం రగిలిపోతున్నా సరే మనకెందుకులే ఆ ముళ్ళ కంప అని పక్కకి తొలగిపోతారు అంతే కానీ మానవత్వంతో స్పదించాల్సిన సందర్భాల్లో కూడా వీరి అలికిడి వినపడదు. వీళ్ళు ఏ గొడవల్లోనూ, వివాదాల్లోనూ తలదూర్చక బ్లాగుల్లో బుద్ధిగా గడిపేస్తుంటారు. సాధారణంగా గృహిణులూ, సీనియర్ సిటిజెన్స్ ఇలాంటి బ్లాగులు వ్రాస్తుంటారనేది నా అభిప్రాయం కానీ అది నా అపోహ కావచ్చును.

ఖాల్ నాయకులు(విలన్లు): మనకు ఈ విషయం నచ్చినా నచ్చకపోయినా బ్లాగుల్లో కూడా విలన్లు వుంటారనేది వాస్తవం. మీరు బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళలో అంతా సుందరంగా అనిపిస్తుందేమో కానీ తొందర్లొనే వాస్తవాలు మీకు అవగతమవుతాయి. బయటి సమాజాన్నే బ్లాగులోకం కూడా ప్రతిబింబిస్తుంది కనుక ఇక్కడ మంచి బ్లాగర్లతో పాటుగా చెడ్డ బ్లాగర్లూ వుంటారు. ప్రశంసలతో పాటుగా, వేధింపులూ వుంటాయి. మీరు మరీ సున్నితమనస్కులయితే బెదిరిపోయి బ్లాగుల నుండి పారిపోయి ఏ బజ్జులో వ్రాసుకుందామా అనుకునే అవకాశమూ వుంది.

ఇక్కడ కుల కొట్లాటలు, మత వైషమ్యాలు, ఇజాల నిజాల పట్ల నిరసనలూ వుంటుంటాయి. కక్షలూ, కార్పణ్యాలూ, కుట్రలూ, కుతంత్రాలూ వుంటుంటాయి. కామెంట్లతో కొట్టి ఈ లోకం నుండి వెలివేస్తుంటారు. కొన్ని బ్లాగులని హత్యలూ చేస్తుంటారు. అల ఆని మీరు మరీ భయపడిపోనక్కరలేదు. కొద్దిగా మీకు ధృఢమయిన చర్మమూ, కాస్త వ్యక్తిత్వమూ వుంటే ఈ విలన్లు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. మీ మనస్సు మరీ సున్నితమయితే అందరికి నచ్చే లేదా మెజారిటీ మెచ్చే టపాలు వ్రాసుకుంటూ తల ఒంచుకొని బుద్ధిగా మెసలవచ్చును.

ఈ వర్గానికి చెందిన వారు అనామక బ్లాగులు తెరిచి తమకు నచ్చని బ్లాగర్లని వేధిస్తుంటారు. లేదా వ్యాఖ్యలు  అజ్ఞాతంగా వేస్తూ విసిగిస్తుంటారు. తమకు నచ్చినట్లుగానే ఇతరులు బ్లాగులు వ్రాయాలనుకునే కొందరు ఇలాంటి దుందుడుకు చర్యలకు తోడ్పడుతుంటారు. వీరికి భావ స్వేఛ్ఛ పట్ల ఏమాత్రం గౌరవం వుండదు. తమకు నచ్చినట్లుగానే బ్లాగుల్లో ఇతరులు ప్రవర్తించాలని వీరికి వుంటుంది. ఎవరికి నచ్చింది వారు వ్రాసుకుంటారన్న కనీస స్పృహ వీరికి వుండదు. వీరి విశ్వాసాలని ఒప్పుకోని బ్లాగుల్లోకి వెళ్ళి రచ్చ రచ్చ చేసి వస్తుంటారు. వారికి బెదరకపోతే సైకోఫాన్సీ సృష్టిస్తుంటారు. వారి ఆగడాలకి బెదిరి ఎందరో బ్లాగర్లు తమ టపాలు తగ్గించుకోవడమో, అసలుకే బ్లాగులు మూసుకోవడమో చేసారు. కొందరు ఈ చికాకులన్నీ భరించలేక బజ్జుల్లో కాలక్షేపం చేస్తున్నారు.

ఆకు రౌడీలు: వీరికి స్వంతంగా బుర్ర అంటూ వుండదు. డాన్ ఎలా చెబితే, ఏం వ్రాయమని చెబితే అది వ్రాసేస్తుంటారు. తమ తమ డాన్ లని వేయి నోళ్ళా కీర్తిస్తూ అప్పుడప్పుడు టపాలూ వ్రాస్తుంటారు. కొందరు బ్లాగుల్లో సర్వైవ్ కావడానికి, భరోసా కోసం విలన్ బ్లాగర్ల చెంత చేరి వారికి డప్పు కొడుతూ పిల్ల బ్లాగర్లకు (అంటే అసలు వయస్సులో అని కాదు - బ్లాగు వయస్సులో) బుల్లీలుగా తయారవుతారు. కొన్ని సార్లు మేడంతోనో బాస్ తోనో గొడవలు వచ్చేస్తాయి. అప్పుడు ముఠా మారుస్తారు. కొత్త బాస్ దగ్గర చేరాక పాత బాస్ ని చెడుగుడు ఆడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరు ఎక్కువగా ప్రమాదకరమయిన వ్యక్తులు కాదు గానీ బాగా చికాకు పెట్టేస్తుంటారు. ఇలాంటి విషయాల పట్ల, పలు రకాల బ్లాగర్ల పట్ల ముందే మీకు ఇలా అవగాహన వుంటే మీరు అన్నిటికీ సంసిద్ధంగా వుండేందుకు వీలవుతుంది. అంతేకానీ బ్లాగోస్ఫియర్ మరీ అంత అందమయిన లోకమని అమాయకంగా అనుకుంటూ అడుగుపెట్టేయకండి. అలా అని భయపడనక్కరలేదు కానీ కాస్తంత జాగ్రత్త అవసరం.

కొన్ని సార్లు వివిధ పేటల వీధి రౌడీలు నడి బ్లాగుల్లో పడి కొట్టుకుంటూవుంటారు. అలాంటప్పుడు నాలాంటి మెజారిటీ ప్రజలు ఉత్సుకతతోనో, నిర్లిప్తంగానో, నిస్పృహతోనో లేక కాలక్షేపం కోసమో ఆ బ్లాగు యుద్ధాలని తిలకిస్తూవుంటారు. ఎవరో కొద్ది మంది తప్ప మిగతావారంగా మౌనంగా ఈ కొట్లాటలు గమనిస్తూవుంటారు. కొద్దిమంది పెద్ద మనస్సున్న వారు మాత్రం వీటిల్లో జోక్యం చేసుకొని వివాదాలని పరిష్కరింపజేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

(ఇంకా వుంది)

పలురకాల బ్లాగర్ల పాత్రలు - హీరోలు, కమెడియన్లు

(తెలుగులో బ్లాగింగ్ అనే పుస్తకం కోసం వ్రాస్తున్న వ్యాసపరంపర ఇది)

ఏ సమాజాన్నయినా ఎన్నో విధాలుగా విభజించవచ్చు. అలాగే బ్లాగు సమాజాన్ని కూడా పలు విధాలుగా వర్గీకరించవచ్చు. సరదాగా ఈ సినిమా పాత్రల వర్గీకరణ ఎన్నుకున్నాను. తెలుగు బ్లాగావరణం ఒక తెలుగు సినిమా వంటిదనుకుంటే అందులో హీరోలు, హీరోయిన్లు, సహ హీరోలు, సహ హీరోయిన్లు, కమెడియన్లు, సహ కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులూ, విలన్లూ, ఆకు రౌడీలూ, వ్యాంప్ క్యారెక్టర్లూ వుంటారు. మరి మీరు తెలుగు బ్లాగుల్లో ఏ రకమయిన పాత్ర పోషించదలుచుకున్నారో నిర్ణయించుకోండి.

కథానాయకులు, నాయికలు (హీరోలు, హీరోయిన్లు): కథని ముఖ్యంగా నడిపించేవాడే కథానాయకుడు. అలాగే బ్లాగావరణాన్ని ఏదో ఒక విధంగా ముందుకు నడిపించేవారే హీరోల జాతికి చెందుతారు. అలాంటి వారు ఓ 20% వుంటారు. వీరు చురుకుగా వుంటారు, ఏదో ఒకటి సాధించాలని చూస్తుంటారు, తరచుగా వ్రాస్తుంటారు, తటపటాయింపులేకుండా తమ అభిప్రాయాలు చెబుతుంటారు, బ్లాగు లోకం ఉన్నతి కోసం ఏదయినా చెయ్యాలని తపన పడుతుంటారు, తోటి బ్లాగర్లను ప్రోత్సహిస్తుంటారు, వ్రాయడంలో సరికొత్త పోకడలు పోవాలని, తమ రచనల్లో వైవిధ్యం రంగరించాలనీ చూస్తుంటారు.

ఇందులో కొంతమంది తెలుగు బ్లాగుల సంకలినులు నడుపుతుంటారు. మరి కొంతమంది నెట్టులో తెలుగు అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటారు. కొంతమంది ఇతరులకు బ్లాగింగ్ ఎలా చెయ్యాలో నేర్పుతుంటారు, బ్లాగింగ్ చెయ్యడంలో మెళుకువలను చెబుతుంటారు, కొత్త బ్లాగర్లని ప్రోత్సహిస్తుంటారు. కొంతమంది బ్లాగుల్లో కొత్త పుంతలు తొక్కి వైవిధ్యమయిన రచనలు చేస్తూ పాఠకులకు నూతనత్వాన్ని ఇస్తూ, ఆసక్తి కలిగిస్తుంటారు. ఇలా ఏ రకంగా నయినా తెలుగు బ్లాగుల అభ్యున్నతికి, తెలుగు బ్లాగుల మీద ఆసక్తికి దోహద పడే బ్లాగర్లను హీరో బ్లాగర్లు అనుకోవచ్చు. వీరు అపజయాలకు వెరవకుండా, పట్టుదల కోల్పొకుండా, విమర్శలకు వెరవకుండా బ్లాగుల్లో దీటుగా, ధాటిగా తమ ప్రభావం చూపుతారు. వీరి రచనలు సాధారణంగా ఉత్తమ స్థాయిలో వుంటాయి. అయితే వీరి అందరి బ్లాగులూ బాగా ప్రజాదరణ పొందకపొవచ్చు కానీ వీరు ఆదరణ వుందా లేదా అనే నిమిత్తం లేకుండా తాము చెప్పాలనుకున్నదానిని చెప్పేస్తూవుంటారు.

మరికొందరు సమాజ సమస్యలను, వైరుధ్యాలను బ్లాగుల్లో ప్రస్థావిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చెయ్యడానికి, సామాజిక స్పృహ పెంపొందించడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు భారత దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతినీ పరిరక్షించడానికి బ్లాగుల ద్వారా కృషి చేస్తుంటారు.  మొత్తమ్మీద తమతమ ఆలోచనారీతులకు అనుగణంగా సమాజాన్నో, బ్లాగు సమాజాన్నొ ముందు పెరుగెత్తించడానికి ప్రయాసపడుతుంటారు. ఆ క్రమంలో కొంతమంది సమాజాన్ని వెనక్కికూడా లాగేస్తుంటారు.

సహ హీరోలూ, హీరోయిన్లు: వీరికి అంతగా స్వంత వ్యక్తిత్వం వుండదు. తమకు నచ్చిన హీరో బ్లాగర్ల చెంత చేరి ఒక గ్రూపుగా తయారయ్యి బ్లాగు హీరోల మంచి పనులకు ఇతోధికంగా సహాయపడుతుంటారు. అంటే హీరో తానా అంటే తందానా అనే టైప్ అన్నమాట. అందరూ అన్ని రంగాలలో, అన్ని విధాలుగా హీరోలు కాలేరు కాబట్టి ఇలా సహ హీరోలుగా మిగిలిపోవడంలో అంతగా పొరపాటేమీ లేదు.

హాస్యనటులు: తెలుగు మాస్ సినిమా అన్న తరువాత కామెడీ లేకపోతే ఎలా? అప్పుడప్పుడు హీరోల కంటే కమెడియన్లకే ప్రాధాన్యత ఎక్కువుంటుంది. వీరు హాస్య రచనలు, కామెడీ కామెంట్లూ వ్రాసేవారు అయ్యుంటారు. చక్కటి కాలక్షేపం కబుర్లు వ్రాసి జనాలను ఎంతో చక్కగా అలరిస్తారు. ఇంటా బయటా ఎన్నో సమస్యలతో సతమతమయ్యే పాఠక జనాలు వీరి రచనలను చదివి హాయిగా నవ్వుకొని తమ బాధలని మరచిపొతారు. తమకు ఎదురయిన అనుభవాలను కానీ, అనుభూతులని కానీ సరదాగా వ్యక్తపరుస్తూ ఇతరులను అలరిస్తారు.

వీరు సమాజాన్ని కానీ, బ్లాగావరణాన్ని కానీ ముందుకో, వెనక్కో తీసుకువెళ్ళే ప్రయత్నాలు ఏమీ అంతగా చెయ్యరు. ఎక్కడివారు అక్కడ వుండి కాలక్షేపం మాత్రం కలిగిస్తారు. బ్లాగులు కాలక్షేపం కోసం మాత్రమే చదవాలనుకునేవారికి వారి వ్రాతలు బాగా నచ్చుతాయి. ఇలా తెలుగు బ్లాగావరణంలో హాస్యంలో ఉద్దండులయిన బ్లాగర్లు కొంతమంది వున్నారు. వారికి చాలా బ్లాగు ప్రజాదరణ వుంది. మీరు హాస్యం, వ్యంగ్యం వ్రాయగలిగిన వారయితే, ఎలాంటి ఇబ్బందులు లేని రచనలు చెయ్యాలనుకుంటే ఇలాంటివి వ్రాసి చూడవచ్చు.
(ఇంకా వుంది)

బ్లాగు హిట్స్ పెంచుకోవడం గురించిన టపాల లింకులు ఇవ్వండి

కొంతమంది బ్లాగర్లు బ్లాగు హిట్స్ ఎలా పెంచుకోవచ్చో సరదాగానూ, వ్యంగ్యంగానూ అప్పుడప్పుడు వ్రాసారు. వాటికి స్పందన కూడా బాగానే వస్తుండేది. అయితే ఆ టపాలు వెతికితే దొరకడం లేదు. అవి ఎవరు వ్రాసారో, ఎప్పుడు వ్రాసారో గుర్తుకులేదు. ఆయా టపాలు మీకేమయినా గుర్తుకువుంటే లింక్స్ ఇవ్వగలరు.

అలాగే బ్లాగులు వ్రాయడం ఎలా అన్నదానిపై తెలుగులో ఏవయినా లింక్స్ తెలిస్తే ఇవ్వండి. నెట్టులో తెలుగులో వ్రాయడం పై ఈతెలుగు వారి సైటులో మంచి వ్యాసం వుంది. ఇంకా ఏమయినా వ్యాసాలు మీకు తెలిస్తే సూచించండి.  

ఆయా రచయితల అనుమతి తీసుకొని అవన్నీ పుస్తకంలో క్రోడీకరిస్తాను.

తెలుగులో బ్లాగులు వ్రాయండిక - అది చాలా తేలిక...

... అన్న పేరుతో ఒక పుస్తకం వ్రాస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నా. అమ్ముడు పోతుందంటారా? తెలుగు బ్లాగులు పుట్టినప్పటినుండీ ఎందరో బ్లాగర్ మహానుభావులు తెలుగులో బ్లాగింగ్ ఎలా చెయ్యాలి అనీ, హిట్స్ ఎలా పెంచాలి అనే విషయమై అక్కడక్కడా, అప్పుడప్పుడూ వ్రాస్తూనేవున్నారు. ఈ విషయమై నా వ్రాతలతో పాటుగా ఆయా వ్రాతలనూ సేకరించి వారి అనుమతితో ఆ పుస్తకంలో పొందుపరచవచ్చును. తెలుగులో ఎలా వ్రాయడం లాంటి విషయాలూ ఈతెలుగు సైటు నుండి సేకరించి విపులంగా పొందుపరచవచ్చును. సరే, ఇవన్నీ చెయ్యవచ్చును కానీ అసలు ఆ పుస్తకం కొనేవాళ్ళుంటారా అనేది నా అనుమానం. మీరు ఏమంటారు?

ఆ పుస్తకంలో బ్లాగులు తెలుగులో ఎలా వ్రాయాలి అన్నది నేర్పడంతో బాటుగా బ్లాగులపై, బ్లాగావరణంపై తగు సూచనలు, సలహాలు ఏవో నాకు తోచినవి ఇవ్వదలుచుకున్నాను. అవి వ్రాసినప్పుడల్లా ముందు నా బ్లాగులో టపా వేస్తాను కాబట్టి మీరూ మీకు తోచినవి అందించవచ్చును. మీ సూచనలు బావుంటే పుస్తకంలో అవి కూడా వస్తాయి. బ్లాగు యుద్ధాలు, గొడవల గురించి కూడా నిష్పక్షపాతంగా ప్రస్థావించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో చెబుతాను. వీలయితే కొద్దిగా బ్లాగు చరిత్ర కూడా ఇచ్చేద్దాం. తెలుగు బ్లాగుల కురువృద్ధుల నుండి కొన్ని వ్యాసాలు అడిగి అందులో వేద్దాం. ఇంకెవరన్నా ఉత్సాహవంతులు ఆ పుస్తకం కోసం వ్రాయదలుచుకున్నా బావుంటే అందులో వేద్దాం. ఇంకా ఆ పుస్తకంలో ఏఏ ఆంశాలు వుంటే సంపూర్ణంగా వుంటుందో మీరూ చెప్పండేం.

ఆ పుస్తకం ఓ సిద్ధాంత వ్యాసంగా వుండి నిరాసక్తత కలిగించకుండా కాస్త సరదాగానే వుండేట్లుగా చూసుకుందాం. అందులో మన బ్లాగావరణ మేరు నగర ధీరుల ఫోటోలూ కొన్ని వేద్దాం. పుస్తకం అంతా అయ్యాక ఈ పుస్తకంగా ముందు పెట్టీ అందరి సూచనలూ, సలహాలూ తీసుకొని సవరిద్దాం. పుస్తకం బ్యాలన్సుడుగా వుండేట్లుగా చూసుకుందాం. ఏమంటారు? ఈ ఆలోచన ఎలా వుందంటారు? అది వ్రాసుకొని మీరూ, నేనూ చదవడం మాత్రమే అవుతుందంటారా?

అంతర్ముఖి పుస్తకం డిటిపి దాదాపుగా అవొచ్చింది. మధ్యలో నేను మరికొన్ని పేజీలు అందించడంతో కాస్త ఆలస్యం అయ్యింది. అది పూర్తి అయ్యాక ఎలా వచ్చిందో ఒకసారి చూసుకొని ఇక ముద్రణకు అంగీకారం తెలుపడమే తరువాయి.

మిత్రుని మరణం వెనుక...అనారోగ్యకరమయిన జీవన విధానం

నిన్న మరణించిన మా మిత్రుడు కుప్పుస్వామి పొదుపుగా జీవితం వెళ్ళదీసి కాస్త డబ్బు కూడబెట్టే వెళ్ళాడు. దాదాపుగా ఒక లక్ష డాలర్ల బ్యాంకు బ్యాలన్సూ, ఒక లక్ష డాలర్ల ఇతర పెట్టుబడులూ, రెండు చిన్న ఇళ్ళు (వాటి మీద లోన్ లేదు) వున్నాయి అతనికి. అదే కాకుండా తను పనిచేస్తూ వచ్చింది ఒక ప్రముఖ భీమా సంస్థలోనే కాబట్టి చక్కటి భీమా పాలెసీలు కూడా చేసే వుంటాడు. అందువల్ల భార్యకి గానీ, ఇంకా చదువుకుంటున్న పిల్లలకి గానీ ఆర్ధికంగా అంతగా ఇబ్బంది వుండదు. అయితే ఆ ఆస్థులు వారు సమర్ధవంతంగా నిర్వహించుకోవడం పై అది ఆధారపడివుంటుంది.

అతని పొదుపయిన జీవన సరళి గురించి, తన సంతానానికి మిగిలించిన ఆస్థుల గురించి అందరూ ప్రశంసిస్తున్నారు. అతను ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ వున్నవాడు. అతనికి షేర్స్ మొదలయిన వ్యవహారాలు, పెట్టుబడులు పెట్టి సంపదను ఎలా వృద్ధి చెయ్యాలో బాగానే తెలిసినవాడు. అందులో అతను మెచ్చుకోదగ్గవాడు.

అయితే అదే శ్రద్ధ తన ఆరోగ్యం గురించి చూపలేకపోయాడు. ఇక్కడి ఆరోగ్య భీమాల్లో సాధారణంగా ప్రతి ఏడాదీ పూర్తి శారీరక పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చు. అలాంటి విషయాల్లో అతగాడు ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదని తెలిసింది. రెస్టారెంటులల్లో జంక్ ఫుడ్డు ఎక్కువగా తింటుండేవాడుట. ఇంట్లో కూడా ఎప్పుడూ మాంసహారమేనట. అలాంటప్పుడు తప్పకుండా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్స్ లాంటివి ఎంతగానో పెరిగిపోయేవుంటాయి. అందువల్ల ఆ మనిషి ఒకేసారి కుప్ప కూలిపోయాడు. నాకు అతను సాధారణ మిత్రుడు మాత్రమే అవడంతో ఈ వివరాలు నాకు నిన్ననే తెలిసాయి. శారీరకంగా కూడా ఎలాంటి ఏక్టివిటీ అతనికి వుండేది కాదుట. కనీసం సాయంత్రం నడక కూడా నడిచేవాడు కాదుట.

సంపాదనలో పెట్టిన శ్రద్ధలో ఏకొంత కూడా ఆరోగ్యం మీద పెట్టకపొవడంతో 57 ఏళ్ళకే పరమపదించాడు. మన కోసం కాకపోయినా మన కుటుంబాన్ని, సంతానాన్ని దృష్టిలో వుంచుకొని అయినా మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ తీసుకుంటూవుండాలి. మనం పోయాక మన అంత దిక్కుగా మిగతావారు మన పిల్లల పట్ల వుండలేరు కదా. వాళ్ళమ్మాయి 16 ఏళ్ళకే తండ్రిని కోల్పోయింది. అబ్బాయి తన చదువు పూర్తి కాకముందే, తను ఇంకా స్థిరపడక ముందే తండ్రిని కోల్పోయాడు. భార్యేమో అమాయకురాలు.

ఈ సందర్భంలో మా ఫార్మసిస్ట్ ఫ్రెండుని ఒకతడిని ఉదహరించాలి. అతను ఎప్పుడూ శారీరక/వైద్య పరీక్షలకు వెళ్ళడు. ఎందుకులే బాబూ, వెళ్ళిన కొద్దీ, నీలో ఆ సమస్య వుంది, ఈ సమస్య వుంది, అది చెయ్యి, ఇది చెయ్యీ అంటారు, ఇలా వైద్యుడి దగ్గరికి పరీక్షల కోసం వెళ్ళకపోవడమే హాయిగా వుంది అని అంటాడు. అలా కాలం గడిపేవారూ వుంటారు. అలాంటివారికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. సమస్య తెలిసేటప్పటికి రోగం ముదిరిపోతుంది. అలా పరిస్థితి చెయ్యి దాటిపొతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమస్య రావచ్చు కానీ అలాంటి అవకాశాలని తగ్గించుకున్నవారం అవుతాము, తీవ్రతను తగ్గించిన వారం అవుతాము.

ఏమో బాబూ, నేనయితే మితాహారం, మంచి ఆహారం పాటిస్తూ రోజూ గంట గంటన్నర నడుస్తున్నాను. రోజూ రైలు స్టేషనికి నడిచి రావడం, అటునుండి నడిచి ఇంటికి వెళ్ళడమే కాకుండా షికాగో నగర అందాలను చూస్తూ మధ్యాహ్న భోజనాంతర వ్యాహ్యాళి చేస్తుంటాను. అలా ఆరోగ్యమూ, అందమూ రెండూ లభిస్తున్నాయి. చాలామంది సోఫాలో చేరగిలబడి టివిలూ, టివిల్లో సినిమాలూ చూస్తుంటారేమో కానీ నేనయితే చాలావరకు ట్రెడ్మిల్ చేసుకుంటూ చూస్తాను. అయినా సరే.... నాకున్న బుల్లి బొజ్జను పూర్తిగా కరిగించలేకపోతున్నానండీ బాబూ. సూస్తున్నా...సూస్తున్నా.. .

స్మశాన వైరాగ్యం

ఉదయం ఆఫీసుకి సిద్ధం అవుతుంటే మా ఆవిడ వచ్చి చెప్పింది - నీకో వార్త చెప్పాలి అని. ఏంటి అని అడిగాను భృకుటి ముడివేస్తూ. మీనా నాన్న గారు మరణించారు అంది. ఊహించని వార్త అది. ఎలా? గుండెపోటు వచ్చి పోయారంట, ఇప్పుడే ఫోనులో పద్మ చెప్పింది అంది. ఇప్పటివరకు వారికి ఎలాంటి అనారోగ్యం వున్నట్టు అనిపించలేదు. గుండెనొప్పి రావడం ఇదే మొదటిసారి అంట, వయస్సు 57 ఏళ్ళు. మీనా మా పెద్దమ్మాయికి మంచి స్నేహితురాలు మరియు క్లాస్మేట్. ఆమె నాన్న గారు కుప్పుస్వామి గారు. తమిళులు కానీ తెలుగు మాట్లాడుతారు. మదురై వారిది. నాకు మరీ క్లోజ్ ఫ్రెండ్ కాకపోయినా మంచి స్నేహితుడు. ఓ మూడేళ్ళ స్నేహం మాది. మా బంధువుల ద్వారా వారు పరిచయం. నా బ్లాగుల గురించి కలిసినప్పుడల్లా కనుక్కుంటుండేవారు, ప్రోత్సహిస్తుండేవారు.

ఆఫీసుకి రావడానికి ఆలస్యం అవుతుందని సమాచారం అందించి హాస్పిటలుకి వెళ్ళాం. ఆ కుటుంబంతో అక్కడ వుంది మా బంధువుల కుటుంబం ఒక్కటే. ఇప్పుడు మేము. దేశం కాని దేశంలో బ్రతుకుతున్నప్పుడు మా పరిస్థితి ఇలాగే వుంటుంది మరి. వారి తమ్ముడు మేరీలాండులో వున్నాడంట. మధ్యాహ్నం కల్లా దిగుతాడు అని చెప్పారు. కొడుకు చైనాలో మెడిసిన్ చేస్తున్నాడు. తను ఎప్పుడు రాగలుగుతాడో ఏమో. భౌతిక కాయాన్ని భారత్ పంపించే విషయమై కొన్ని వివరాలు సేకరించాము. అది అంత సులభం కాదనీ, వ్యవహారాలు అన్నీ పూర్తయి బాడీ బయల్దేరడానికి వారమయినా పడుతుండవచ్చని తెలిసివచ్చింది.  ఒక అంచనా ప్రకారం అందుకు ఖర్చు కనీసం $15000 అవుతుండవచ్చు. అవి కాకుండా కుటుంబ సభ్యుల ప్రయాణం ఖర్చులు కూడా వుంటాయి. ఆ ఖర్చుల్లో ఎంతమేరకు వారి ఆరోగ్య భీమా భరిస్తుందో తెలియదు.

భౌతిక కాయం ఇండియా తరలించాల్సి వుంది కాబట్టి అంత వరకు మోర్గ్ (morgue) లో వుంచుతారంట. ఎక్కువకాలం అట్టే వుంచడం మంచిది కాదని మోర్గ్ కి ఎంత తొందరగా తరలిస్తే అంత మంచిదని నర్సులు సూచిస్తున్నారంట. వారి తమ్ముడు వచ్చేంతవరకు బాడీని అట్టేపెట్టలేమని చెప్పారు వారు. మేము వచ్చేవరకు ఆపుదామని ఆపారు. మేము వచ్చి చూసాము కనుక ఇక ఆ శరీరాన్ని తీసుకువెళ్ళవచ్చు అని హాస్పిటల్ వర్గాలకి సూచించారు. అయితే కుప్పుస్వామి గారియొక్క కుటుంబ సభ్యులతో సహా మేమంతా బయటకి నడిస్తేనే ఆ బాడీని మోర్గ్ కి తరలిస్తారంట. అందువల్ల ఆ భౌతిక కాయాన్ని మేము చివరిసారి దర్శించి బయటకి వచ్చాం. ఆ తరువాత ఎవరయినా ఆ బాడీని చూడాలంటే మోర్గ్ కి ఫోను చేసి అప్పాయింటుమెంట్ తీసుకొని మరీ చూడాల్సివుంటుంది.

కుప్పుస్వామి గారు డబ్బు చక్కగానే పొదుపు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ వారికి ఒక స్వంత ఇల్లు, ఒక స్వంత పార్టుమెంటూ వున్నాయి. లైఫ్ ఇన్సూరెన్సులు, తదితరాలు వున్నయో లేదో ఇంకా తెలియదు.   అబ్బాయంటే ఎలాగోలా స్థిరపడుతాడు, అమ్మాయే ఇంకా చదువుతోంది కదా అని నిన్న మధ్యాహ్నమే ఎందుకో గాని దిగులు పడ్డారంట. రాత్రే గుండెపోటు వచ్చింది. డాక్టర్లు చాలా గంటలు ప్రాణం దక్కించడానికి కృషి చేసారు కానీ ఈ ఉదయం 5 గంటల వేళ ప్రాణాలు విడిచారు. మా బంధువులు రాత్రంతా వారికి తోడుగా వున్నారు.

విదేశాల్లోకి వచ్చాక ఇలా పార్ధివ శరీరాన్ని చూడటం మాకు ఇదే మొదటిసారి. ఇలాంటి సందర్భాల్లొనే జీవితం బుద్బుధప్రాయం కదా అని అనిపిస్తుంది. అయితే స్మశానంలో చితి మంటల్లో కాలిపోతున్న భౌతిక కాయాన్ని చూస్తున్నప్పుడు కలిగే వైరాగ్యం ఇంకా గాఢంగా వుంటుంది. ఎంత వైరాగ్యం కలిగినా అది స్మశానంలో వున్నంతవరకే కదా.  బయటకి కాలు పెట్టాక ఎవరి సమస్యలు వారివి, ఎవరి ఆరాటాలు, పోరాటాలు వారివి. ఇలాంటప్పుడు జీవితపు పరుగుపందెంలో పరుగెత్తడం కాస్సేపు ఆపి మనమేంటో, మన జీవనం ఏంటో ఆత్మావలోకనం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. కాలు నేలమీద ఉంచడానికి కాస్సేపయినా అవకాశం కలుగుతుంది.